Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
naa preyasini pattiste koti

ఈ సంచికలో >> సీరియల్స్

మేఘన

 జరిగిన కథ : డా. హరికి డా. హిమాన్షు ప్రపంచవ్యాప్తంగా వివిధ మతాల్లో, తెగల్లో, ఆచారాల్లో జరుపబడే ఉత్తరక్రియలను వివరిస్తూంటాడు.....
ఆ తర్వాత.....


‘‘టిబెటన్లలో కనిపించింది.’’

‘‘ప్రజలకు జబ్బులు ప్రబలే శవ సంస్కారాలు గమనించారా?’’

‘‘హైదా జాతి ఆచారాలు, బాలీ దీవి ఆచారాలు, క్రిచాను ఆరాచాల వల్ల ప్రజల్లో వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయి.’’

‘‘చనిపోయిన వారు పనిచేసే పోలంలో వారిని కప్పిపెట్టడం?’’

‘‘మనం హిందూ ఆచారంలో కూడా ఉంది. అలాగే పూర్వీకుల ఆత్మలకంటూ ఒక ప్రదేశాన్ని ఇంటి సమీపంలో హిందువులు కొందరు కేటాయిస్తారు.’’

‘‘విభన్న సంస్కృతులు, ఆచారాలను స్టడీ చేసి, మంచిని పెంచి, ప్రజలకు హానికరం చేసే చెడు ఆచార వ్యవహారాలను ప్రజలు, ప్రభుత్వం దృష్టికి తెచ్చి రూపుమాపటం కోసం ఈ పరిశోధనలు ఉపయోగపడగలవని అంటాను.’’

‘‘ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి ఈ స్టడీస్... కానీ చాలా వ్యయ ప్రయాసలకోర్చి చేయాల్సి ఉంటుంది.’’

‘‘కరెక్టుగా చెప్పారు హరి గారు.’’ అన్నాడు హిమాన్షు.

హరిలో ఉత్కంఠ, ఉద్విగ్నం, జిజ్ఞాస పెరిగాయి.

‘‘సైన్స్ ప్రకారం కాకుండా.. మరణించిన మనిషి ఏమౌతాడు? సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడు చెప్పినదేమిటి...?

మొదటగా జ్ఞానవంతులు, శీలవంతులు ఉత్తమ గతిని పొందుతారు. ఇక ఎవరు పాపకార్యాసక్తులో, ఎవరు దయా ధర్మాలను విడనాడి సంచరిస్తారో, ఎవరు శాస్త్రాలను, సన్మార్గులను నిరసిస్తుంటారో ఎవరు ఆత్మస్తుతి పరాయణులై ఉంటారో, ఎవరు ఐశ్వర్యం చేత మదం కలిగి వర్తిస్తారో, ఎవరికి మోహం, వికారం ఉంటాయో, కామం చేత ఎవరు పీడింప బడుతుంటారో వారు నరకానికి పోతారు.’’

‘‘నరకానికి వెళ్లే దారి ఎలా ఉంటుంది?’’

‘‘అది బహు దుర్గమము. చెట్ల నీడ ఉండదు, ఆహారం, జలం కొంచమైనా దొరకదు. అక్కడ ఏకకాలంలో 12 మంది సూర్యులు గొప్ప ప్రకాశంగా వెలుగుతూ ఉంటారు.’’

‘‘ప్రకాశంగా ఉండే సూర్యులు దారి చూపిస్తారుగా?’’

‘‘ఒక్క సూర్యుని తాపమే భరించలేని వారు 12 సూర్యుల తాపం ఎలా భరిస్తారు? అది ప్రసన్నమైన ప్రకాశం కాదు... ఆ తాపం భరించలేని బాధను కలిగిస్తుంది. 50 డిగ్రీల వేడిని తట్టుకోలేని మనిషి 12 సూర్యుల తాపాన్ని ఎలా భరించ గలుగుతాడు? ఇదిగాక విపరీతమైన చలిగాలి, కాళ్లలో దిగే ముళ్లు, విషపూరితాలైన పాములు, తేళ్లు, కుక్కలు, పెద్ద పులులు, సింహాల కాట్లు, అగ్ని. ఈ దారిలో 2వేల యోజనాల ‘అసిపత్రవనం’ ఉంటుంది. ఇది మహా ఘోరమైనది. గ్రద్దలు, కాకులు, గుడ్లగూబలు, తేనెటీగలు, దోమలు ఈ అసిపత్రవనంలో భీకరంగా సంచరిస్తూ ఉంటాయి. దీనిలో దావాలనం అనగా కార్చిచ్చు దహిస్తుంది. దేహం చెట్ల ఆకుల చేత ముక్కలు ముక్కలుగా తరిగేయబడుతూ ఉంటుంది. ముక్కలుగా తరిగే ఆకులంటే... బోటనీలో ఉన్న మాంసభక్షక చెట్లే..!’’

‘‘ఆశ్చర్యంగా ఉంది. అయినా కార్చిచ్చులో దహించబడితే ఇక దేహమేముంది? బూడిదే కదా?’’

‘‘చనిపోయిన తర్వాత పాపులదేహం అంగుష్టమాత్రమౌతుంది.

దీనికి అన్ని బాధలూ పడాలని రాసి ఉంది, అది బాధలు పడుతూనే ఉంటుంది కానీ నాశనమవ్వదు. అందుకనే బైబిల్ లో కూడా అగ్ని ఆరదు, పురుగు చావదు అని రాసి ఉన్నది.’’

‘‘ఇంకా...?’’

‘‘చీకటితో నిండిన గోతులు, పర్వత శిఖరాలు, చీకటి జలగలతో నిండిన బుదరగుంటలు, రాగి రంగులోని కాలిన ఇసుక, నిప్పులు, సలసలా కాగే నీళ్లు, కత్తులు, మేకులు జీవునికి నరకయాతన నరకం చేరేలోపే కలగజేస్తాయి.

ఇదిగాక చీము, నెత్తురు, మలము, మూత్రము వంటి అసహ్యకరమైన దారిలో కూలబడుతూ నడవవలసి ఉంటుంది.’’‘‘తరవాత నరకాన్ని చేరతారా?’’

‘‘లేదు, అన్నిటికంటే ముఖ్మమైన ‘వైతరణీ’ నది ఉన్నది.’’

‘‘పేరును బట్టి సేద దీరే నదిలా ఉంది.’’

‘‘పేరు బాగుండవచ్చుగాక... యమ మార్గమధ్యంలో ఈ వైతరణీ నది నూరు ఆమడలు ప్రవహిస్తుంటుంది. దీని ఒడ్డున ఎముకల గుట్టలు, లోపల చీము, నెత్తురు ప్రవాహాలు, మాంసమే బురద, వెంట్రుకలే నాచు. క్రూరమైన జల పక్షులు, మొసళ్లు, సూదుల్లాంటి ముక్కులుగల పురుగులు, వజ్రంలాంటి గట్టి ముక్కుగల గద్దలు, బొంత కాకులు, నీటి కోతులు, మాంసాన్ని కొరుక్కుతినే చేపలు (ఇప్పటి సైన్స్ ప్రకారం ఫిరాని చేపలంటాము) తాబేళ్లు ఈ నదిలో ఉండి అడుగడుగునా హింసిస్తాయి.ఆకలి బాధ తట్టుకోలేక పాపులు ఆ రక్తమే తాగాల్సి ఉంటుంది.’’‘‘ఇదంతా పురాణాల్లో రాసారా? ఆశ్చర్యంగా ఉంది.’’

‘‘పురాణాల్లో ఉన్నదే చెప్తున్నానండీ... కొత్తగా కల్పించినదేమీ లేదు.’’

‘‘ఆగండాగండి... ప్రేతాత్మలు ఉన్నాయా? ప్రేతజన్మ ఎందుకు కలుగుతుంది?

‘‘పురాణాల ప్రకారం ప్రేతాత్మలు ఉన్నాయి. ఇక ప్రేతాత్మలుగా మారే వాళ్లెవరంటే...మొదటగా... ప్రజా వినియోగార్థం దానధర్మాలు చేసి, కొంతకాలానికి ఆ వ్యక్తే వాటిని అమ్మజూపినా అతడికి ప్రేతజన్మ కలుగుతుంది. ఇంకా... ఇతరుల భూమిని కాజేయ జూసే వాడు, గ్రామం, పొలం, తోటలు ఇతరుల భూభాగాల హద్దులను వంచనతో తన స్వాధీనంలోకి తెచ్చుకునేవాడు, చెరువు లేదా బావి పూడ్చి తన భూమిలో కలుపుకునేవాడు, ఛండాలుని చేత చంపబడేవాడు, నీటియందు పడి మృతి చెందిన వాడు, పిడుగుపడి చచ్చినవాడు, అగ్ని ప్రమాదానికిలోనై మరణించినవాడు, గోవు లేక ఎద్దు పొడవడం వల్ల గతించినవాడు, ఉరివేసుకుని ప్రాణం తీసుకునేవాడు.’’     ‘‘ఉరివేసుకునా? లేదా ఉరితీయబడితేనా?’’

‘‘ఏదైనా కావచ్చు. బలవన్మరణం కారణ భూతం. బహుశా ఒక వ్యక్తిని ఎవరైనా బలవంతంగా చంపి, ఉరివేసుకున్నట్లు నమ్మించడానికి ప్రయత్నిస్తే చూసిన వాళ్లు దాన్ని ఆత్మహత్యగా భావించవచ్చు.’’

‘‘మరి.... మేఘన... మేఘన మెడ చుట్టూ ఆ వలయం? ఆమె మణికట్టు దగ్గర గడ్డ కట్టిన గాయాలు?’’

‘‘బహుశా మీరు మీ అనుభవంలో ఎవరో పోస్ట్ మార్టమ్ చేసిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నారను కుంటున్నాను. ఓకే... మీరు చెప్పిన మేఘన ఎవరో నాకు తెలియకపోవచ్చు కానీ ఆమె విషయంలో మెడ చుట్టూ కందిన వలయం ప్రకారం ఖచ్చితంగా ఆమె ఉరి తీయబడింది. కానీ, ఆమె మణికట్లు దగ్గర గాయాలు నిరూపించేదేమిటంటే ఆమెది ఆత్మహత్య కాదు. ఖచ్చితంగా హత్యనే.... ఆమె చేతులు ఫ్రీగా ఉంటే తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తుందేమోనని ముందుగా బలమైన వైరుగానీ, తీగతో గానీ ఆమె చేతులు కట్టేసి, తర్వాత ఉరి తీసే ముందు ఆమెని బలమైన ఆయుధంతో కొట్టి చంపాలని చూసి ఉండవచ్చునేమో? అయినా ఆయుధం దెబ్బకి మనిషి పూర్తిగా చనిపోయిందో లేదో అనే అనుమానంతో ఉరి తీసి ఉండవచ్చు.’’

‘‘ఒక అబల మీద అంత కక్షా..? దారుణం.... ఓహ్... షిట్, డామిట్...’ తల పట్టుకున్నాడు హరి.

‘‘మీకు బాధకలిగిస్తున్నట్లయితే ఈ సంభాషణ ఇంతటితో ఆపేద్దాం హరి గారూ.’’ అన్నాడు హిమాన్షు కొద్దిగా తేరుకున్నాడు హరి.... ‘‘ఫరవాలేదు చెప్పండి, ఇంకేమేం కారణాలున్నాయి ప్రేత జన్మకి?’’

‘‘విషం లేదా విష జీవుల, విష కీటకాల కాటుకు గురై కాలం తీరిపోయిన వాడు, అస్త్ర శస్త్రాది ఆయుధాల వల్ల చంపబడిన వాడు...’’      ‘‘అంటే ‘వాసం మేకు’ అస్త్ర శస్త్రాది ఆయుధాల కోవలోకి వస్తుందా?’’

‘‘ఎందుకు రాకూడదండీ... ప్రాణం తీయడానికి గుండు సూది చాలదా?’’

‘‘ఇంకా, తన కులంలో గానీ వంశంలో గానీ తానే ఆఖరి వాడిగా మృతి చెందేవాడు, దేశాంతరంలో ఎవరికీ తెలియక చచ్చేవాడు, దొంగల చేత కొట్టబడటం వల్ల ప్రాణాలు కోల్పోయిన వాడు, అంతు చిక్కని రోగాల చేత అవసాన కాలం సమీపించకుండానే పోయేవాడు, తలిదండ్రుల శ్రాద్దాలు చేయక చచ్చిన వాడు ప్రేత జన్మలౌతారు.’’

‘‘ఇంకా...?’’

‘‘పర్వతాలు లేక కొండవాలు నుండి పడి చచ్చినవాడు, గోడ కిందపడి ప్రాణాలు కోల్పోయిన వాడు, నిద్రించిన రీతిలోనే చచ్చినవాడు, మేడల పైన ప్రాణాలు విడచిన వాడు, భగవంతుని నామాన్ని ఉచ్చరించక మరణించిన వాడు, రజస్వల అయిన స్త్రీని తాకినా, ఛండాలుని తాకినా, స్నానం చేయక అశుచిగా ఉన్న వేళ అయిన వారి నందరినీ కేవలం ఇతరుల చెప్పుడు మాటలు విని దూరం చేసుకుని మరణించిన వాడు, మనుస్మృతికి విరుద్దంగా తీర్పులు ఇచ్చేవాడు, మిత్ర ద్రోహి, కల్లు తాగి దుర్భాషలాడే వాడు, తెల్లని పట్టును గాని, స్వర్ణాన్ని గాని దొంగలించేవాడు, గురువు భార్యతో సంపర్కం పెట్టుకునే వాడు ప్రేత జన్మం పొందుతారు. రజస్వలగా మృతి చెందే స్త్రీకి ప్రేత జన్మ వస్తుంది.’’‘‘ఇంక చాలు హిమాన్షు గారు... అసలు ఈ ప్రేతాత్మలు ఎక్కడుంటాయి? వాటి నివాసం ఎక్కడ?’’

‘‘జన సంచారం అంతగా లేనట్టి, వృక్షాలు లేనట్టి కణ కణ మండే నిప్పుల మాదిరి వేడెక్కి వేడిగాలులు వీచేటటువంటి ఇసుక ఎడారుల్లో వీరు సంచరిస్తుంటారు. గాలివాటుకు సుదూర తీరాలకు ఎగురుతుంటారు.’’

‘‘అయ్యో.... బతికి ఉన్నప్పుడూ సౌఖ్యం లేక, ప్రేతాత్మగా మారినా సౌఖ్యం లేక... ఎన్ని కష్టాలు...? ప్రేత శరీరం నుండి విముక్తి కలిగించాలంటే ఏమి చేయాలి?’’

‘‘చాలా పద్దతులున్నాయి... అవన్నీ చెబితే మీకు బోరు కొట్టవచ్చు... మీ మనసులో స్పెసిఫిక్ గా ఏముందో అడిగితే అది నాకు తెలిసినంత వరకు చెబుతాను.

‘‘ఎముకలు.... అస్తులు... అస్థికలు... అనాథ శవాల ఎముకలు...’’ అసంకల్పితంగా హరి నోటివెంట వెలువడ్డాయా మాటలు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
yatra