Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
jayajayadevam

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు

sahiteevnam

'ఆముక్తమాల్యద'
(గతసంచిక తరువాయి)
 
కేశిధ్వజ మహారాజు తన నిశ్చయాన్ని తన మంత్రులకు తెలిపి,

హరిణాజినోత్తరీయుఁడు
నిరాయుధుఁడు నగుచు నతని నెలవగు నడవిన్
జొరఁ గొట్టికాండ్రు టెక్కెము
బరికించి ఎరింగి కలయఁబడి కూఁతలిడన్
 
జింక చర్మాన్ని ఉత్తరీయముగా కప్పుకుని, ఏ ఆయుధములూ లేకుండా ఆ ఖాండిక్య మహారాజుకు
నివాసస్థలమైన అడవికి వెళ్ళాడు కేశిధ్వజుడు. ఆతని రాకను గమనించిన ఖాండిక్యమహారాజు యొక్క
వేగులవాళ్ళు, ఆతని జండా కొయ్యను, జండాపైనున్న చిహ్నములను గమనించి, వచ్చేది కేశిధ్వజుడు
అని తెలుసుకుని, కలయబడి అంటే అందరూ కలిసి బిగ్గరగా కూతలు పెట్టారు. అడవులలోనో, వేరే
యితర స్థలాలలోనో రహస్యముగా నివశించేవాళ్ళ అనుచరులు గూఢచారులు రకరకాల కూతలతో
అరిచి శత్రువుల రాకను గురించి హెచ్చరించడం నిరంతరమూ పోరాట రంగంలో ఉన్న వాళ్ళకు
అత్యవసరమైన ఏర్పాట్లలో ఒకటి. దాన్ని సూచిస్తున్నాడు రాయలు.     

ఆ కూతల మర్మమును తెలిసిన ఖాండిక్యుని అనుచరులైన ప్రజలు, ఆతనితో అడవులకు వచ్చినవాళ్ళు
భయపడుతుంటే, ఖాండిక్యుడు బెదరకుండా ఆ ప్రజలను ఓదార్చడానికి, వారికి ధైర్యము చెప్పడానికి
కొందరిని నియమించి, కొందరు విలుకాళ్ళను కొమ్మలమాటున, కొండచరియల మాటున నియమించి,
కోపముతో బయటికి వచ్చాడు. తన రాజ్యాన్ని స్వాధీనము చేసుకుని, తనను అడవులపాలు జేసి
అంతటితో ఆగక మరలా తన మీదికి వస్తున్నాడు అనే కోపముతో, రోషముతో, ధనుస్సును అందుకుని,
బాణమును తొడుగుతూ

ధన ధాన్య ద్విరదాశ్వ గోధన సమేతంబెల్ల సామ్రాజ్యమున్
గొనియుం జాలక తాటకేయ పలభు క్కూటాక్రుతిం జింకతో
లున నాఛ్ఛన్నుఁడవై ప్రశాంతుగతి మాలోఁ జొచ్చి ప్రాణంబులున్
గొన నేతెంచితె దుర్మతీ కెడపెదన్గ్రూరంపు భల్లంబునన్     

ధనము, ధాన్యము, ఏనుగులు, గుర్రములతో సమస్త సామ్రాజ్యాన్నీ తీసుకున్నది చాలక, తాటక
కుమారుడైన, మాంసాహారి ఐన మారీచుడిలా, దొంగ జపం చేసుకునే మునిలా, ఋషిలా  ఒక
జింకతోలు కప్పుకుని, పెద్ద శాంతుడిలా వచ్చి మాలో దూరి ప్రాణములుకూడా తీద్దామని వచ్చావా?
అంటే యింతకుముందే ధనమానాలు దోచుకున్నావు, చాలలేదా, ప్రాణములు కూడా తీస్తావా
అని ధ్వని. ఓరి దుష్ట బుద్ధీ, ఈ క్రూరమైన బాణంతో నిన్ను నేలగూలుస్తా! అన్నాడు.  ఆ మాటలను
విన్న కేశిధ్వజుడు పెద్దగా '' త్వరపడకు, వెనకాముందూ ఆలోచించకుండా చంపడానికి నేను
ఆకతాయిని కాను, నేను తలపెట్టిన యజ్ఞమునకు దురదృష్టవశాత్తూ విఘ్నము కలగడం వలన,
ప్రాయశ్చిత్తమును తెలుపుమని రుత్విక్కులను వేడితే, 'ఆ ఖాండిక్యమహారాజుకు తప్ప ఈ
విఘ్నమునకు తగిన ప్రాయశ్చిత్తము వేరెవరికీ తెలియదు' అనడంతో వచ్చాను నేను, కోపముతో
బాణం వేస్తానంటే వెయ్యి, నన్ను చంపినా, ఉపాయము చెప్పి పంపినా రెండు రకాలుగా నాకు మేలే
నీ యిష్టం' అన్నాడు.   

ఆ మాటలు విన్న ఖాండిక్యుడు ఆగిపోయాడు. చెట్ల చాటుకు వెళ్లి, తన మంత్రి, పురోహితుడు,
శ్రేయోభిలాషులు ఐన వారందరికీ ఈ సంగతి చెప్పాడు. వారందరూ కూడబలుక్కున్నట్లు యిలా
అన్నారు.

పాలుగలవాఁ డు మనకొక
జాలి యిడక తానె తారసానకు వచ్చెన్
వేళ యిదె లెమ్ము నృప కృప
చాలు న్గారాకు మేపి చంపకు ప్రజలన్

పాలివాడు మనను దయతలిచి, జాలి చూపించి, పెద్దగా కష్టపెట్టకుండా, తనంత తానే కయ్యానికి  
ఒక్కడూ మన ముందుకు వచ్చాడు. యిదే సమయము. లేవయ్యా! చూపించిన దయ చాలు.
ఆకులూ అలములూ మేపి జనులను చంపకు, వీడిని చంపి, హాయిగా మన రాజ్యానికి మరలా
తీసుకెళ్ళి, విందు భోజనాలు తినిపించు! దాయాది దొరికాడు వేశేయ్, దయా, గియా పక్కన వేశేయ్
అన్నారు.

అన్యాయంబున దుస్సహ
మన్యుండగు ప్రబలరిపుని మడియించిన ధ
ర్మన్యక్క్రుతి కగు నిష్కృతి
సన్యాయంబుగఁ బ్రజాళి సంరక్షింపన్

యిలా ఒక్కడై, మన ఉపకారమును, సలహాను కోరివచ్చిన బలవంతుడైన శత్రువును నేరుగా
ఎదిరించలేక, అన్యాయముగా కూటనీతిచేత చంపడం ధర్మమును తిరస్కరించడం అవుతుంది
అంటావేమో, అలా చంపినా తర్వాత రెండు రాజ్యాల ప్రజలను న్యాయ మార్గములో ప్రేమగా
పరిపాలించడం వలన ఆ అధర్మానికి నిష్కృతి, విరుగుడు చేసినట్లే అవుతుంది. కనుక, వీడిని
అన్యాయముగానైనా సరే చంపేయ్! అని సలహానిచ్చారు.    

తనరాష్ట్రము చెడ వచ్చిన
ననిమిషపతి విప్రుఁ డనక యాచార్యుఁ  ద్రిశీ
ర్షునిఁ దునుమఁడె విడువుము దయ
నిను నమ్మిన ప్రజలు నవయ నీ దయ యేలా?

తన రాజ్యము చెడిపోయినప్పుడు, అనిమిషపతి ఐన దేవేంద్రుడు బ్రాహ్మణుడు అని కూడా చూడకుండా,
తనకు సాక్షాత్తూ గురువైన త్రిశీర్షుని చంపలేదా? దేవేంద్రునికే ఒక బ్రాహ్మణునిమీద లేని దయ నీకు
నీ శత్రువైనవాడి మీద ఎందుకయ్యా, నిన్నే నమ్ముకొని నీతో వచ్చినవాళ్ళు నవిసిపోతుంటే నీ దయ
ఏంటయ్యా అనవసరంగా? అన్నారు వారందరూ.    

( విశ్వరూపుడు అనే మహర్షికి మూడు తలలు ఉండడం వలన త్రిశీర్షుడు అని కూడా పేరు. ఒకసారి
దేవేంద్రుడు తన గురువైన బృహస్పతిని సరిగా గౌరవించకపోవడం వలన బృహస్పతికి కోపం వచ్చి
కనిపించకుండాపోయాడు. గురువుగారి దయను కోల్పోవడం వలన దేవేంద్రునికి అసురులను అణచేశక్తి
లేక, రాజ్యాన్ని, వైభవాన్ని, తేజస్సునూ కోల్పోయాడు. వెళ్లి బ్రహ్మగారిముందు వాపోయాడు. ఆయన
త్వష్ట ప్రజాపతి కుమారుడైన విశ్వరూపుని ఆశ్రయించి ఆయనను ప్రస్తుతానికి గురువుగా స్వీకరించవయ్యా
అంటే అలాగే చేశాడు దేవేంద్రుడు. విశ్వరూపుడు గురువై నారాయణ కవచాన్ని ఉపదేశించాడు దేవేంద్రునికి.
దేవేంద్రుడు మరలా పూర్వపు వైభవాన్ని, రాక్షసులమీద విజయాన్ని సంపాదించాడు. విశ్వరూపుని తల్లి
రచన, తండ్రి త్వష్ట ప్రజాపతి. రచన దితి కుమార్తె. అంటే దైత్యుల సోదరి. కనుక తన మేనమామలైన
దైత్యులను చూసీ చూడనట్టు పోతున్నాడేమో అనే అనుమానంతో విశ్వరూపుని మూడు శిరస్సులనూ
దేవేంద్రుడు ఖండించి వధించాడు, బ్రహ్మహత్యా పాతకాన్ని పొందాడు. ఆ తర్వాత తపస్సు చేసి, ఆ
పాతకాన్ని, ఆ ఆశుచిని నాలుగు భాగాలుగా చేసి, భూమిలో చవిటి నేలగా, నీళ్ళలో నురుగుగా,
చెట్లకు జిగురుగా, స్త్రీలకు రజోదోషంగా పంచి, మరలా బృహస్పతిని శరణు వేడి, ఆయనను
తిరిగి గురువుగా పొందాడు అని పురాణగాథ. రాయలవారి పురాణ విజ్ఞానానికి దృష్టాంతముగా
క్లుప్తముగా త్రిశీర్షుని గాథను తెలియజేశాను)

శిష్టు నిను నింత చేసిన                         
దుష్టాత్ముని బిలుకుమార్చి దురితము పిదపన్
నష్టంబుగ భూవల్లభ
యిష్టాపూర్తములు సేసి ఎసఁగఁగ రాదే!

నీలాంటి సజ్జనుడికి యింతలు, వంతలు కలుగజేసిన ఆ దుర్మార్గుడిని అన్యాయముగానైనా సరే, వధించి,
అంతకు కాకుంటే ఆ పాపాన్ని యిష్టాపూర్తాలు చేసి, అంటే యజ్ఞ యాగాదులు, బావులు,చెరువులు
త్రవ్వించి దూరం చేసుకోరాదూ! అని సలహానిచ్చారు ఖాండిక్యుని మంత్రులు, పురోహితులు, హితైషులు.
రాక్షసనీతిని ఎలా రాజనీతిగా రాజుల చుట్టూ ఉన్న ఆశ్రితులు బోధిస్తారో, ఎలా తేలిగ్గా ఉపాయాలు,
నివారణలు సూచిస్తారో తెలియజేశాడు రాయలు యిక్కడ. అంతే కాదు, చెప్పేవాళ్ళు ఎన్ని చెప్పినా
ప్రభువు ఐన వాడు అందరినీ విని, తన మార్గాన్ని ధర్మ మార్గముగా, న్యాయ మార్గముగా ఎలా
ఎంచుకుని మనుగడ సాగించాలో పరిపాలన కొనసాగించాలో కూడా ముందు ముందు ఖాండిక్యుని
పలుకుల ద్వారా తెలియజేస్తాడు రాయలు.  

రచనా సంవిధానములో ఒక చమత్కృతిని పొదిగాడు యిక్కడ. ఈ సలహాలు యిస్తున్నవాళ్ళు
అందరూ గబగబా ఆత్రుతగా శత్రువును చంపెయ్యమని అడుగుతున్నారు, అలాంటప్పుడు తీరిగ్గా,
నింపాదిగా దీర్ఘ వృత్తాలలో కాకుండా కందము, ఆటవెలది, తేటగీతులను ఉపయోగించడం రసజ్ఞత.
అదే చేశాడు రాయలు, కంద పద్యాలలో గడ గడా సలహాలను గుప్పించాడు వారి నోళ్ళవెంట. 

మరిన్ని శీర్షికలు
sudhamadhuram