Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahiteevnam

ఈ సంచికలో >> శీర్షికలు >>

సుధా మధురం - సుధామ



' పాప ' పుణ్యం
అరవై ఏళ్ళ " పాప " గురించి అభినందన పూర్వకంగా మాట్లాడవలసిన సందర్భం ఇది. ! చెప్పకపోతే ఎలా ?
అవును...! తను అందరికీ రేడియో అన్నయ్య అక్కయ్యల పాపగానే ప్రసిద్ధురాలు. రేడియో అన్నయ్య అంటే కీ.శే. న్యాయపతి రాఘవరావు గారు, రేడియో అక్కయ్య అంటే కీ.శే న్యాయపతి కామేశ్వరి. ఈ " పాప"  పేరు కూడా కామేశ్వరియే. ఇప్పుడు జంధ్యాల కామేశ్వరి. అంతకు ముందు పి.కామేశ్వరి. అమ్మా నాన్నల దగ్గర కాకుండా చిన్నప్పటి నుండి రేడియో అన్నయ్య- అక్కయ్యల దగ్గర పెరగడం వలన తనను వాళ్ళ పాప అనే అనుకునేవారమంతా.! అక్కినేని నాగేశ్వర రావు గారూ అలాగే అనుకున్నారు.
ఎందరో అన్నయ్యలూ, అక్కయ్యలూ ఉన్నా రేడియో అన్నయ్య అంటే న్యాయపతి రాఘవరావు గారు, అక్కయ్య అంటే న్యాయపతి కామేశ్వరి అయినట్లే, ఎందరో పాపలున్నా, " బాలానందం పాప " అంటే కామేశ్వరియే. పాప అమ్మ పేరు కమల. నాన్న సూర్యనారాయణ. రేడియో అన్నయ్య గారికి పాప వాళ్ళమ్మ సొంత మేనకోడలు. రేడియో అక్కయ్య గారికి పాప వాళ్ళ నాన్న తమ్ముడు. పాప అక్కయ్య ని అమ్మ అనేది. అన్నయ్య గారిని మాత్రం మామా అనేది. నారాయణగూడా లోని ఆంధ్ర బాలానంద సంఘం తెలుగు నాట బాలల వికాసానికి మూలాధార నాడి. పిల్లల కోసం 1940లో నాటి మద్రాసులో మొదలైన బాలానంద సఘం 1956 లో హైదరబాద్ కు తరలి వచ్చింది. అన్నయ్య అక్కయ్య 1956 జూన్ లో హైదరాబాద్ కు వచ్చి, అదే ఏడు అక్టోబర్ 23న నారాయణగూడా లో బాలానంద సఘం నిర్వహణ మొదలెట్టారు.
శని, ఆది వారాలలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి బాలానందం, బాలవినోదం కార్యక్రమాలు ప్రసారమయ్యేవి. వాటి నిర్వాహకులు రేడియో అన్నయ్య, ఆక్కయ్య గారలే. అక్కయ్య గారు స్త్రీల కార్యక్రమాలను కూడా పర్యవేక్షించేవారు.
రారండోయ్ రారండోయ్
బాలబాలికలు రారండోయ్
అన్న పిలుపు పాట లక్షలాది పిల్లలను రేడియో సెట్లకు కట్టిపడేసేది
హైదరబాదు బాలలము
జైహిందంటూ పిలిచాము
రైరైమంటూ రారండోయ్
రేడియో ప్రోగ్రాం వినరండోయ్
అంటూ హైదరాబాద్ ఆకశవాణి పిల్లల కార్యక్రమాలు నాటి బాలలను వ్యక్తిత్వ వికాసం లోకి తీర్చిదిద్దాయి. మరో వంక బాలనంద సంఘం పాటలు, నాటికలు చిత్రలేఖనం, వకృత్వం వంటి కళలలో రంగస్థలం మీదా, నిజ జీవితం లోనూ కూడా ఎందరో పిల్లలను ప్రతిభా మూర్తులుగా తీర్చిదిద్దింది.
1952 లో పుట్టిన పాప హైద్రాబాద్ బాలానందం తో విడదీయరాని అనుబంధం కలిగినది. మద్రాసు రేడియోలో నేను చేతవెన్న ముద్ద పద్యం రేడియో అన్నయ్య  గారి సమక్షంలో చదివాను. మద్రాసు రేడియో పిల్లల కార్యక్రమంలో పాల్గొందో లేదో నాకు తెలియదు కానీ హైద్రాబాద్ బాలానందం "పాప " తో గాఢానుబంధం కలిగింది. ఆట పాటల్లో నృత్యం లో బాలానందం లో పాప చిన్నప్పట్నుంచీ ఒక స్పెషల్. పిల్లలకే స్వరాజ్యం వస్తే రాణిని చేసే చిట్టితల్లి ఎవరంటే ' పాప ' అన్నట్లుగా వుండేది. ఆ రోజుల్లోనే బాలానందం మితుడు జె. శ్రీకర్ అన్నట్లు ' పాప భీతి ' మాకు వుండేది. నిజం గా తానొక ' క్వీన్ ' లా ముట్టుకుంటే మాసిపోతుందన్నంత ప్రత్యేకతతో భాసిస్తూ వుండేది. నిద్రకు ముందు అక్కయ్య గారి కబుర్లతో, అన్నయ్య గారి వాత్సల్యంతో వికసించిన అపూర్వ బాల్యం పాప ది. బాలానందం ఏర్పాటుచేసే వేసవి శిక్షణా శిబిరాలు, దసరా బొమ్మల కొలువులు, ఆనంద బజార్లు, ' కప్పులో డిప్ప ' లాంటి తమాషా పోటీలు, ఆటలు... ఎంత కళకళలాడిపోతూ వుండేదో బాలానంద ప్రాంగణం.
శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం, ఆంధ్రసారస్వత పరిషత్తు ఎలానో బాలల కోసం ' ఆంధ్రబాలానంద సంఘం'  తెలుగుల రాజధానిలో అలా వైభవ ప్రాభవాలతో వెలుగొందుతూ వచ్చింది. ' చందమామ '  కన్న ముందుగా ' బాల ' మాస పత్రికే పిల్లల పత్రికగా అన్నయ్య గారి సంపాదకత్వంలో వచ్చింది. అనేక పిల్ల మహాసభలు జరగడం, బాలల అకాడమీ నెలకొల్పబడడం వెనుక బాలానంద సంఘ వ్యవస్థాపకులైన అన్నయ్య, అక్కయ్యల కృషి ఎంతయినా వుంది.
స్థాపకుల సమక్షంలోనే సమసిపోయే సంస్థలు కొన్నయితే వ్యవస్థాపకులు పోవడంతో మూతబడిపోయే సంస్థలు మరికొన్ని. కానీ బాలానంద సంఘం స్థాపకులైన రేడియో అన్నయ్య అక్కయ్య దివంగతులైనా పాప ' జె.కామేశ్వరి ' ఆంధ్ర బాలానంద సంఘం బాధ్యతలు తన భుజానికెత్తుకుని 2015 ఫిబ్రవరి 9 వ తేదీన రవీంధ్ర భారతిలో ఘనంగా వజ్రోత్సవ వేడుకలను నిర్వహించడం నిజంగా అపూర్వమైన సంగతి. తన కృషి, పట్టుదల, ధృడ దీక్ష, బాలబాలికల పట్ల అన్నయ్య , అక్కయ్యగార్ల నుండి అంది పుచ్చుకున్న ఆ వారసత్వ సేవా సంపద నిజంగా ఎంతైనా అభినందనీయమైన సంగతి. డా. ఎం. చిత్తరంజన్ అధ్యక్షులుగా జె.కామేశ్వరి (పాప), మలపాక పూర్ణ చంద్రరావు కార్య నిర్వాహకులుగా బాలానందసంఘం అన్నయ్య, అక్కయ్య గార్ల శత జయంతులను చేసింది. హైద్రాబాద్ నారాయణగూడాలో ఒక శాశ్వత భవనాన్ని నిర్మించింది. అన్నయ్య, అక్కయ్యల పేర వెండి నాణేలను వెలువరించింది. అన్నయ్య శత జయంతికి కేద్రప్రభుత్వం ' ఫస్ట్ డే కవర్ ' ను వెలువరించేలా చేసింది. బాలానందం పేరున అన్నయ్య , అక్కయ్యలు రాసిన పాటలు , కథలు, నాటకాలు గ్రంధాలుగా ముద్రించింది. సి.డి లు వెలువరించింది. అన్నయ్య అక్కయ్యలు స్థాపించిన ' బాల ' తొలి పిల్లల పత్రికల సంచికల పునర్ముద్రణా గ్రంధం వెలువరించడం ఒక అపురూప ఘటనం. వేసవి శిక్షణా శిభిరాలు, లలిత సంగీత పాఠాలు, చిత్రలేఖనం తరగతులు అన్నీ నిరంతరాయం గా సాగాయి. ఈ కృషి అంతా ' పాప ' పుణ్యాలే. పాప పూనుకుని వుండకపోతే ఆంధ్ర బాలానంద సంఘం అన్నయ్య, అక్కయ్యల తరువాత ఇలా వజ్రోత్సవాలు చేసుకునే దిశగా పురోగమించేది కాదనడం నిర్వివాదాంశం. ఎందరున్న అందరినీ సంఘటిత పరిచే బాలానందం శక్తి ' పాప ' గా నిలిచింది. అదీ విశేషం ! విదేశం లో ఉద్యోగించినా తన మనసు ఎప్పుడూ ఇటేగా వుండేది. తన జీవితంలో- వైయక్తిక జీవితంలోని విషాదాలను కూడా తట్టుకు నిలబడి, కొడుకు సిద్ధార్ధ మెల్ బోర్న్ లో దూరంగా వుంటున్న కొడుకు, కోడలు, మనుమడితో విదేశంలోనే శాశ్వతం గా స్థిరపడిపోక, ' ఆంధ్రబాలానంద సంఘం ' కోసమే అహర్నిశలూ ఆలోచిస్తూ, అభివృద్ధి పరుస్తూ, తెలుగునాట బాల బాలికల వికాసానికి అన్నయ్య, అక్కయ్యల ఆశయసాధనకి పునరంకితమైన ' పాప ' ను అబినందించడానికి మాటలు చాలవు. పాప ' పుణ్యమా ' అని ' బాలానందం ' వజ్రోత్సవం ఘనం గా జరిగింది!
ఆత్మీయంగా అందరినీ అక్కున చేర్చుకుంటూ, ' కొత్త పాతల మేలుకలయిక క్రొమ్మెౠన్గుల్ చిమ్మగా' అన్నట్లు ఎనభైల వయసు దాటిన అలనాటి బాలానందం పిల్లల నుండి ఇప్పుడిప్పుడే చేరి సృజనలో నడకలు నేరుస్తున్న నేటి పిల్లలవరకూ అందరినీ ఏకత్రితం చేసి ఆధ్ర బాలానంద సంఘం వజ్రోత్సవ వేడుకలకు ముందురోజు ఆదివారం ఎనిమిదో తేదీన బాలనందం హాలులో శ్రీ కే. ఐ. వరప్రసాదరెడ్డి గారి చేతుల మీదుగా అమ్మిన శ్రీనివాస రాజు అన్నయ్య కథలపై చేసిన సిద్ధాంత గ్రంధాన్ని ఆవిష్కరించడం, రుచికరమైన విందు చేయడం, అంతా కలసి ఆటపాటలతో సంబరం చేసుకోవడం జరిగింది.
సోమవారం 9వ తేదీన సాయంకాలం రవీంద్ర భారతిలో పిల్లల నృత్య గీతాలు కిక్కిరిసిన ప్రేక్షకుల నడుమ రసభరితంగా సాగాయి. వజ్రోత్సవ సంచికతో పాటు, అన్నయ్య, అక్కయ్యలు, రాసిన కథా సంపుటుల ఆవిష్కరణలు జరిగాయి. డెబ్బై అయిదేళ్ళ బాలానందం చరిత్రను తెలిపే దృశ్య చిత్రమాలిక అందరినీ అలరించింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం,  కె. రాఘవేంద్ర రావు, జమున, కె.ఐ. వరప్రసాదరెడ్డి, కె.వి. రమణా చారి, మామిడి హరికృష్ణ, ప్రభృతులు విశిష్ట అతిథులుగా విచ్చేసి తమ సందేశాలతో వజ్రోత్సవ బాలానందాన్ని అభినందించారు. అలుపెరుగని ఉత్సాహంతో ' పాప ' ఒక మహత్తరమైన కలని సాకారం చేసింది. ఆంధ్రజ్యోతి దినపత్రికలో తనే అన్నట్లు బాల్యం వున్నంత కాలం బాలానందం వుంటుంది. అంతే కాదు, బాలానందం వున్నంత వరకు బాల్యం తరతరాలకూ విస్తరించి వికాసవంతం అవుతూనే వుంటుంది. పాప ' పుణ్యాలు ' భావితరాల బాల్యాన్ని కూడా బాలానంద మధురిమలతో నింపగలవన్నది విశ్వాసం. నింపాలని ఆకాంక్ష.
పాపకి జయహో
బాలానందానికి జయజయహో !

మరిన్ని శీర్షికలు
kakoolu