Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview

స్ర్కిప్టు న‌చ్చాలి... హీరో కాదు - నిత్య‌మీన‌న్‌

క‌థానాయిక పాత్ర‌ల‌పై గౌర‌వం తీసుకొచ్చిన ఈత‌రం న‌టీమ‌ణి... నిత్య‌మీన‌న్‌.  క‌థానాయిక‌లంతా న‌టించ‌లేరు... న‌టించిన‌వాళ్లంతా క‌థానాయిక‌లు కాలేరు. కానీ నిత్య రెండూనూ. క‌థ‌ని న‌డిపించే నాయిక‌.... అద్భుత‌మైన న‌టి. సావిత్రి.. సౌంద‌ర్య త‌ర‌వాత ఆ స్థాయిలో కాక‌పోయినా.. ఈత‌రానికి ఆ స్థాయిని ప‌రిచ‌యం చేసిన క‌థానాయిక నిత్య‌మీన‌నే.  హీరోని కాకుండా క‌థ‌ని న‌మ్మి సినిమాలు చేస్తుంది. ఆమె చేసిన ప్ర‌తి పాత్ర‌లోనూ స‌హ‌జ‌త్వం ఉట్టిప‌డుతుంది. మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రానీ రోజు సినిమాతో మ‌రోసారి ఆమెలోని న‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. కొన్ని స‌న్నివేశాల్లో కేవ‌లం క‌ళ్ల‌తోనే న‌టించి మెప్పించింది. ఈ పాత్ర నిత్య‌కు త‌ప్ప మ‌రొకరికి సూట్ కాదు అనేంత‌గా ఒదిగిపోయింది. ఇది నిత్య విజ‌యం అనిపించుకొంది. ఈ సంద‌ర్భంగా నిత్య‌మీన‌న్‌తో గో తెలుగు ప్ర‌త్యేకంగా సంభాషించింది. ఆ క‌బుర్లు ఇవీ..

* మ‌ళ్లీ మ‌ళ్లీ... మ‌రో హిట్ కొట్టారు...
- (న‌వ్వుతూ) థ్యాంక్యూ.. ఇష్ట‌ప‌డి చేసిన సినిమాకు ఇలాంటి టాక్ వ‌స్తే చాలా చాలా సంతోషంగా ఉంటుంది... ఇప్పుడు ఆ ఆనందంలోనే ఉన్నా.

* హిట్లు కొట్టినా.. మ‌రీ ఆచి తూచి సినిమాలు చేస్తుంటారు. ఇప్ప‌టికైనా స్పీడు అందుకొంటారా??
- ఎదురు చూసి, ఎదురుచూసి సినిమాలు చేయ‌డం వ‌ల్లే ఇలాంటి క‌థ‌లు దొరుకుతున్నాయి. ఏదో ఒక‌టి చేసేద్దాం అనుకొంటే కుద‌ర్దు క‌దా..?? అయినా ఇప్పుడు నా సినిమాలు చాలా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. రుద్ర‌మ‌దేవి, ముని 3, త్రివిక్ర‌మ్ సినిమా, మ‌ణిర‌త్నం చిత్రం ఇవ‌న్నీ రెడీ అవుతున్నాయి.

* మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు క‌థ తొలిసారి విన్న‌ప్పుడు ఏం అనిపించింది..??
- ఓరోజు క్రాంతి మాధ‌వ్ నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. `క‌థ ఉంది.. వింటారా` అన్నారు. నిజానికి అప్ప‌టికి ఆయ‌న ద‌గ్గ‌ర నిర్మాత కూడా లేరు. కేవ‌లం క‌థ‌ మాత్ర‌మే ఉంది. ఆ విష‌యం కూడా నాతో చెప్పారు. ఆయ‌న‌లోని నిజాయ‌తీ బాగా న‌చ్చింది. దాంతో పాటు క‌థ విన‌గానే స్ట‌న్ అయ్యా. ఇలాంటి క‌థ‌ ఎప్పుడూ వ‌దులుకోకూడ‌దు అనిపించింది.

* క‌థ‌లో మిమ్మ‌ల్ని ఆక‌ట్టుకొన్న అంశాలేంటి?
- ఈమ‌ధ్య ప్రేమ‌క‌థ‌లు చాలా వ‌స్తున్నాయి. ఆ మాట‌కొస్తే ప్ర‌తి సినిమాలోనూ ప్రేమ ఉంది. కానీ... ఆ ప్రేమ‌క‌థ‌ల‌కూ, ఇందులోని ప్రేమ‌క‌థ‌కూ చాలా వ్య‌త్యాసం ఉంది. ఈ ప్రేమ‌లో ప‌విత్ర‌త క‌నిపించింది. అందుకే వెంట‌నే ఒప్పుకొన్నా.

* శ‌ర్వానంద్‌తో క‌ల‌సి ప‌నిచేశారు.. ఆ అనుభ‌వాలేంటి?
- మేమిద్దరం ఇది వ‌ర‌కు ఏమిటో ఈ మాయ అనే సినిమా చేశాం. అది ఇంకా విడుద‌ల కాలేదు. ఆ సినిమాతో శ‌ర్వా చాలా క్లోజ్ అయ్యాడు.  సినిమాల విష‌యంలో, క‌థ‌ల ఎంపిక‌ల విష‌యంలో మా ఇద్ద‌రి అభిప్రాయాలూ దాదాపుగా ఒకేలా ఉంటాయి. అందుకే మా జ‌ర్నీ ఈజీ అయ్యింది. తెర‌పై కూడా మా కెమిస్ట్రీ బాగా పండింది.

* మ‌రి క‌థ చెబుతున్న‌ప్పుడు ఇందులోని క‌మ‌ర్షియ‌ల్ పాయింట్స్ ఏమిటి అనేది ఆలోచించ‌రా??
- ప్రేమ‌కంటే గొప్ప క‌మ‌ర్షియ‌ల్ పాయింట్ ఏముంటుంది??

* క‌నీసం హీరో ఎవ‌రైతే బాగుంటారు అనే స‌ల‌హాలేమైనా ఇస్తారా?
- నాకు ఫ‌లానా హీరోతో చేయాలి అనే ఆశ‌లు, ఆలోచ‌న‌లూ లేవు. ఉండ‌వు కూడా... నాకు న‌చ్చాల్సింది క‌థ‌.. హీరో కాదు. ఈ సినిమాకిశ‌ర్వానంద్ యాప్ట్‌. మా ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ బాగుంటుంది. సినిమా చూసిన‌వాళ్లంతా ఇప్పుడు ఆ మాటే అంటున్నారు.

* ఓ సినిమా ఒప్పుకోవాలంటే మీకుండే ష‌ర‌తులేంటి?
- నాకు సాదాసీదా క‌థ‌లు న‌చ్చ‌వు. రెగ్యుల‌ర్ క‌థ‌లు చెబితే బోర్ కొట్టేస్తుంది. ఏదో స‌మ్‌థింగ్ న‌న్ను ఎట్రాక్ట్ చేయాలి. మ‌న‌సుకు న‌చ్చాలి. అంతే.. మ‌రేం ఆలోచించను.

* క‌థానాయిక‌గా న‌టిస్తూ.. రుద్ర‌మ‌దేవి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమాలు ఎందుకు ఒప్పుకొన్నారు?
- ద‌ర్శ‌కులు త‌యారు చేసిన పాత్ర‌లు అలాంటివి. `ఈ పాత్ర మీరే చేయాలి..` అని నన్ను అడిగారు. క‌థ‌లో విష‌యం ఉంద‌నిపించింది. ఆ పాత్ర‌లు నా కోస‌మే పుట్టాయి అనిపించాయి. నాకెప్పుడూ హీరోయిన్‌గానే చేయాలి అన్న రూలేం లేదు. నాకు న‌చ్చితే చేసేస్తానంతే. సినిమా అంతా క‌నిపించి, అందులో విష‌యం లేక‌పోతే.. ఫ‌లితం ఏముంటుంది?  అలాంటి సినిమాలు చేసినా ఒక‌టే చేయ‌క‌పోయినా ఒక‌టే.

* ఇప్ప‌టి వ‌ర‌కూ ఇన్ని సినిమాలు చేశారు క‌దా.. బాగా క‌ష్ట‌మ‌నిపించిన పాత్ర ఏది?
- అలా మొద‌లైంది నుంచి మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు దాకా.. నేను బ‌య‌ట ఎలా ఉంటానో, అలాంటి పాత్ర‌లే చేశా. కాబట్టి న‌టించ‌డం క‌ష్టం అనిపించ‌లేదు. కానీ ముని 3లో చేస్తున్న పాత్ర మాత్రం చాలా డిఫికల్ట్‌గా అనిపించింది. ఆ పాత్ర కోసం శారీర‌కంగా, మాన‌సికంగా చాలా క‌ష్ట‌ప‌డ్డా. ఒక విధంగా అల‌సిపోయా.

* ఖాళీ స‌మ‌యాల్లో ఎలాంటి సినిమాలు చూస్తుంటారు?
- నేను సినిమాలు చూడ‌డం చాలా త‌క్కువ‌. సినిమా రంగంలోనే ఉంటాను గానీ.. చూడ్డానికి బ‌ద్ద‌కం ఎక్కువ‌.

* మ‌రి ఖాళీ దొరికితే..
- శుభ్రంగా నిద్ర‌పోతా. క‌డుపు నిండా తింటా.

* సినిమాలు చూడ‌క‌పోతే ఎలా..??  మీ న‌ట‌న‌కు స్ఫూర్తి ఎక్క‌డి నుంచి వ‌స్తుంది?
- సినిమాలు చూస్తే న‌టన అబ్బుతుందా??  ఎలా న‌టించాలో తెలుస్తుందా??  న‌ట‌న అనేది స్వ‌త‌హాగా రావాలి. చూసి నేర్చుకొనేది కాదు.

* డ్రీం ప్రాజెక్టు ఏమైనా ఉందా?
- లేదు. ఫ‌లానా పాత్ర చేయాలి అని ఎప్పుడూ అనుకోను. వ‌చ్చిన పాత్ర‌ని ఇష్ట‌ప‌డి చేస్తా అంతే.

* రాబోయే సినిమాలేంటి?
- మ‌ణిర‌త్నం సార్‌తో ఓ సినిమా చేశా.మార్చిలో విడుద‌ల అవుతుంది.

* ఆల్ ది బెస్ట్
- థ్యాంక్యూ...

కాత్యాయిని

మరిన్ని సినిమా కబుర్లు
Movie Review : Temper