Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

మేఘన

జరిగిన కథ : ప్రేతాత్మల గురించీ, నరకలోకంలో పాపులకు పడే శిక్షల గురించీ డా. హరికి వివరిస్తుంటాడు డా. హిమాన్షు. చీకట్లో తనకు తారసపడినవన్నీ ప్రేతాత్మలనే విషయం వినగానే సంభ్రమాశ్చర్యాలకు లోనవుతాడు హరి....ఆ తర్వాత ...

‘‘కొంచం వివరంగా చెబుతారా హరి గారూ?’’

ఇంక ఉండబట్టలేకపోయాడు హరి....

‘‘కొంతకాలం క్రితం కరీంనగర్‌ శివార్లలో ఒక ఇంట్లో ఉన్న కొంతమంది దారుణంగా హత్య చేయబడ్డారు. మత కలహాలో, ఆస్తి కలహాలో, భూమి కలహాలో, సొంతవారే చేసారో, బయటవారు చేసారో కారణం, కారకులు ఏదైనా కానీ, ఎవరైనా కానీ ఆ ఇంట్లోని వారు మూకుమ్మడిగా చంపబడ్డారు. చంపిన ఆ అనాధ శవాలను గోతిలో గుట్టగా పడేసి కప్పిపెట్టారు. ఆ శవాలు అవశేషాలుగా మారి అస్థికల రూపం సంతరించుకునే సమయానికి తన పరిశోధనల నిమిత్తం, తన టీమ్‌తో కలిసి, నా తల్లి అదే ప్రాంతంలో తవ్వకాలు చేపట్టింది. ఆ తవ్వకాలలో దొరికిన ఎముకలను తన పరిశోధనల నిమిత్తం తెచ్చుకుంది అమ్మ... ఆ అనాధ ప్రేతాత్మలు తమ అస్థికల కోసం, వాటికి సరియైన కర్మకాండల కోసం నన్ను ఆశ్రయించాయి.’’

నా మొదటి ప్రశ్న.... ఆ ప్రేతాత్మలు నన్నే ఎందుకు ఎన్నుకున్నాయి?

రెండవది... ఆ ఎముకలకు ఎవరికి అప్పగించాలి? ఏమి చేయాలి? ఏమి చేస్తే ఆ ప్రేతాత్మలకు విముక్తి కలుగుతుంది? దయచేసి చెప్పండి హిమాన్షు గారూ...’’ అన్నాడు.

‘‘మీ మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే త్రేతాయుగం నాటి గాధ ఒకటి మీకు చెప్పాలి.’’

‘‘త్రేతాయుగమంటే...?’’

‘‘కాలాన్ని రకరకాలుగా విభజించారు మన పూర్వీకులు... అదొక పూరాతన కాలమనుకోండి...’’

‘‘ఓకే...’’

‘‘ఆ కాలంలో భభ్రువాహనుడనే ఒక గొప్పరాజు ఉండేవాడు. అతడు ధర్మపరాయణుడు. ప్రముఖుల చేత సైతం ప్రశంసించబడినవాడు. మహోదయమనే నగరాన్ని రాజధానిగా చేసుకుని ప్రజారంజకంగా పరిపాలిస్తున్నవాడు.

ఒకరోజు వేటకు వెళ్లి, దారి తప్పి ఒక చెట్టుకింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇంతలో... ఒళ్ళు గగుర్పొడిచేలా ఎముకల గూడు నడుస్తున్న రీతిలో ఓ ప్రేతం రాజు కంటబడిరది. దానికి ఇతరులెవరైనా భయపడాల్సిందే..! పరమ వికారంగా ఆ ప్రేతానికి చేరువగా అటువంటివే మరికొన్ని ప్రేతాలు సంచరిస్తున్నాయి.

బభ్రువాహనుడిని చూసిన ఆ ప్రేతం, రాజును సమీపించి సంతోషంతో ఇలా అంది...

ఓ మహారాజా నిన్ను దర్శించినంత మాత్రము చేతనే ఈ ప్రేతదేహాన్ని వదిలి ఉత్తమగతి చెందిన ధన్యుడినయ్యాను అని వినయంగా పలికేసరికి, ఆ రాజు మరింత ఆశ్చర్యకరంగా చూస్తూ ప్రేతమా నీవెవరు? నీకా దుష్టరూపం ఎలా ప్రాప్తించింది? ఆ వైనం వివరించు అని ఆసక్తిగా అడిగాడు.

దానికా ప్రేతం... ఓ మహారాజా... నా పేరు దేవగుప్తుడు. వైదశమనే చక్కని పట్టణంలో వైశ్యునిగా జన్మించి, దేవతా పూజలు, సద్బ్రాహ్మణ సన్మానాలూ, పూజలూ, దానధర్మాలూ ఎన్నో మంచి పనులు చేసాను. ఏ జీవికీ హాని తలపెట్టలేదు... నాకు భార్యపుత్రులు లేరు. బంధువులు లేరు. మరణానంతరం నాకెవ్వరూ కర్మం చేయకపోవడం వలన నాకీ ప్రేతరూపం సంప్రాప్తించింది. పైగా నాకీ ప్రేతజన్మ సంభవించి చాలా కాలమైంది. ఓ రాజశ్రేష్టా నేను నిన్నొకటి అభ్యర్థించనున్నాను.

మరణించిన వారికి సంస్కారం`సంచయనం నిత్యవిధి, వృషోత్సర్జనం, షోడశం, మాసికం, శ్రాద్దం... ఈ మొదలైనవన్నీ పుత్రులు లేదా జ్ఞాతులు చేయవలసినదే కానీ... ప్రభువైన నీవు లోక బాంధవుడవు. ఎవ్వరూ లేని వారికి నీవే ఆప్తుడవు, రక్షకుడవు కూడ... నన్ను ఈ ఆపద నుండి గట్టెక్కించు అని కోరాడు.’’

‘‘అంటే... నేనేమన్నా బభ్రువాహనుడినా? ఈ జన్మలో హరిగా పుట్టానా, ఈ ప్రేతాత్మలను ఉద్దరించడానికి? నేను తప్ప ఇంకెవరూ దొరకలేదా ఈ ప్రేతాలకు?’’ అన్నాడు హరి అసహనంగా.

మృదువుగా మందహాసం చేసాడు హిమాన్షు...

‘‘త్రేతాయుగం కానీ, ద్వాపర యుగం కానీ, కలియుగం కానీ... ఏ కాలంలోనైనా సరే సామాన్య ఆత్మలకూ, అనగా శరీరంతోపాటు బతికున్న ఆత్మలకు, మహాత్ములకు అనగా బతికున్న మహాఆత్మలకు తేడా ఒక్కటే.... గుణ గణాలు, సత్ప్రవర్తన, నిష్కామకర్మ, సేవాతత్పరత లాంటి ఎన్నో మంచి గణాలు అవే... అవే వారిని మహాత్ములను చేస్తాయి.

గాంధీజీ కూడా మనలాంటి మనిషే, సామాన్యుడే కానీ ఆయన గుణగణాలు ఆయన్ను మహాత్ముడిని చేసాయి. అదే విధంగా మీ సచ్ఛరితం, సత్ప్రవర్తన, సేవాభావం మీరన్నట్లుగానే మిమ్మల్ని బభ్రువాహనుడితో సమానం చేసాయి. బతికి ఉండి భూలోకంలో నరకాన్ని అనుభవిస్తున్న జీవాలకు మీరు శస్త్ర చికిత్సలు చేసి వారి బాధల్ని పోగొట్టారు. ఆ పుణ్యమే మిమ్మల్ని మిగిలిన వారికంటే ప్రత్యేకంగా నిలబెట్టింది.

దేవగుప్తుడు బభ్రవాహనుణ్ణి ఎన్నుకున్నట్లుగా ఈ అనాధ ప్రేతాలు మిమ్మల్ని ఎన్నుకున్నాయి.

అంతా భగవదేచ్ఛ....

ఇక ఎముకల విషయానికొస్తే....

దానికొక ఇతిహాసం ఉంది...’’

‘‘ఇతిహాసమంటే?’’

‘‘కథ అనుకోండి... స్టోరీ అనుకోండి....’’

‘‘ఓకే... చెప్పండి...’’

‘‘ఒకప్పుడొక అరణ్యంలో ఒక కిరాతకుడుండేవాడు. అన్నివేళలా వేట అతని జీవనాధారం. జంతువుల్ని, పక్షుల్ని వేటాడి పాపం మూటకట్టుకున్న ఆ కిరాతకుడిని ఒక సింహం చంపివేయగా వాడు నరకానికిపోతూ ఉన్నాడు. ఇంతలో దశాహంలోగా ఎలాగోలాగున వాని ఎముకలు గంగలో పడడం జరిగింది. వాడికోసం దివ్య విమానం ఒకటి వచ్చి స్వర్గానికి తీసుకుపోయింది.’’

‘‘దశాహం అంటే?’’

‘‘పదిరోజులు గడిచేలోగా...’’

‘‘కానీ... ఈ ప్రేతాత్మల విషయంలో అస్థికలయితే ఉన్నాయి గానీ దశాహం ఎప్పుడో దాటిపోయింది. ఇప్పుడేం ప్రయోజనం?’’

‘‘ఎవరి అస్థులు దశాహ మధ్యమున గంగా జలంలో విడువబడతాయో అవి గంగలో ఎంతకాలం     ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు ఆ వ్యక్తి స్వర్గంలో సుఖిస్తాడు. గంగా తరంగాల మీద నుంచి వచ్చిన గాలి మరణించిన వారి మీదుగా వీచినా చాలు. అతడి పాపాలన్నీ తొలగిపోతాయి. ఒకప్పుడు భగీరధుడు తన పూర్వులను ఉద్దరించడానికి గొప్ప తపస్సు చేసి గంగను భూలోకానికి తెచ్చాడు.ఏదిఏమైనా గంగ గొప్పతనం ఎప్పటికైనా ఉంటుందనే ఆ ప్రేతాత్మల విశ్వాసం. కాదనడమెందుకు? ఏమంటారు హరీ..?’’

‘‘ఓకే... ఓకే... ఈ అస్థికలనో, చితాభస్మాన్నో గంగలో కలిపేస్తే ప్రేతాత్మలకు ముక్తి కలిగినట్లేనా?’’

‘‘పురాణం ప్రకారం ప్రేత జన్మ పొందిన వారిని ఉద్దరించాలంటే నారాయణ బలి నిర్వర్తించాలి.’’

‘‘అయ్యో... ఈ బలులు, నరకడాలు నావల్ల కాదండీ...’’

‘‘లేదండీ... బలులేమీ ఇవ్వాల్సిన పనిలేదు... శ్రీమన్నారాయణుని ప్రతిమను శుద్దమైన బంగారంతో తయాచేయించి లేదా శంఖుచక్ర పీతాంబర సహితంగా ఓ బంగారు రేకుపై చిత్రించి, అలాగే ఇంద్రుడు, బ్రహ్మరుద్రుడు మొదలగు వారిని ఆ ప్రతిమతో పాటు మంటపంపైకి మంత్రాలతో ఆహ్వానించి పూజించాలి.

‘‘గ్రాము బంగారం ధర ఈ రోజుల్లో దరిదాపు నాలుగువేలకు టచ్‌ అయిపోతూ ఉంది. కనీసం నలుగురు దేవుళ్ల బంగారు విగ్రహాలంటే లక్షల్లో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కార్యక్రమం అయిపోయాక ఆ విగ్రహాలను బ్రహ్మణులు పట్టుకెళ్లిపోతారా? లేక విగ్రహాలు తయారు చేయించిన వాళ్ళు తిరిగి వాటిని కరిగించి ఖర్చుపెట్టిన సొమ్ము తిరిగి సంపాదించుకోవచ్చా?’’

‘‘ఇంకొక ఆప్షన్‌ కూడా ఉంది... మీరు సరిగ్గా వినలేదు..’’

‘‘ఏమిటది?’’

‘‘బంగారు రేకుపై దేవుణ్ణి చిత్రించ వచ్చని...’’

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
naa preyasini pattiste koti