Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
meghana

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

జరిగిన కథ : విరాట్ తో ఫోన్ లో మాట్లాడిన తర్వాత అతడి బాక్ గ్రౌండ్ ఏదో బలమైనదని అనిపిస్తుంది ఏ ఎస్. పి. ప్రకాష్ కి...వన్ నాట్ ఫోర్ ని అడిగి గతంలో ఇక్కడ పని చేసిన అయ్యాసామి వివరాలడిగి తెలుసుకుంటూంటాడు.... ఆ తర్వాత ...

‘‘చెప్పు’’
‘‘అర్ధ రాత్రి కళ్ళు మూసుకు పోయి ఓ ఆడపిల్లను రేప్ చేయబోతే ఎవడో యువకుడు అడ్డం పడి చితగొట్టి ఆయన సర్వీసు రివాల్వర్ తో ఆయన్నే మోకాలి మీద మూడు సార్లు షూట్ చేసి ఆడ పిల్లను కాపాడి తీసుకు వెళ్ళి పోయాట్ట. వాడెవడో గాని రివాల్వర్ షూటింగ్ లో ఎక్స్ పర్ట్ అయి ఉండాలి. దెబ్బకు సగం కాలు ఎగిరి పోయింది’’.
‘‘ఆ పిల్ల ఎవరు? ఏ వూరు? కాపాడిన ఆ కుర్రాడు ఎవరు?’’
‘‘రెండూ చెప్పటం కష్టమే సార్. ముఖ్యంగా ఆ కుర్రాడి గురించయితే అస్సలు తెలీదు. కేసు బుక్ చేసి ఆ కుర్రాడి కోసం మన డిపార్ట్ మెంట్  వెతికి వెతికి చివరకు చేతులెత్తేసింది.’’
‘‘ ఆ పిల్ల సంగతేమిటి’’
‘‘ఆ పిల్ల స్టేట్ మెంట్ విరుద్దంగా ఉండి సార్. దాంతో ఏమీ చేయలేక పోయారు. అనుమానం మాత్రం ఉండి పోయింది. ఈ గొడవ జరిగింది ఇక్కడ కాదు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో. అందులోస్టాఫ్ అంతా ఎ యస్ పి అయ్య సామి కి తొత్తులుగా ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళ ఉద్యోగాలు పోతాయని సైలెంట్ గా ఉండి పోయారు. ఇక అప్పట్లో నేను విన్నదేమంటే ఆ రోజు చీకటి పడుతుండగా దీక్ష అనే అమ్మాయిని విచారణ నిమిత్తం తీసుకెళ్ళి స్టేషన్ లో ఉంచారు.’’
‘‘దేనికి విచారణ? ఆ అమ్మాయి బ్రోతలా? దొంగా?’’
‘‘అయ్యో అదేం కాదు సార్. బాగా చదువుకుంది. మంచిపిల్ల. అయిదుగురన్నలకు ఒక్కతే చెల్లెలు. బాగా ఆస్థి ఉంది. తల్లిదండ్రులు ఆక్సిడెంట్ లో పోయారు. ఆడపిల్లకు ఆస్థి పంచకుండా తూతూ మంత్రంగా పెళ్ళి జరిపించి వదిలించేద్దామని చూసారు అన్నలు. దాంతో తనకూ సమాన వాటా కావాలంటూ ఆ అమ్మాయి కోర్టుకెళ్ళింది.’’ అంటూ చెప్పటం ఆపాడు వన్ నాట్ ఫోర్.
‘‘వెరీ ఇంట్రస్టెంగ్ తర్వాత ఏమైంది?’’ కూతుహలంగా అడిగాడు ఎ యస్ పి ప్రకాష్.
‘‘ఆ అన్నలు పెద్ద వెధవలు. తమ చెల్లెల్నిఎలాగయినా కేసు విత్ డ్రాప్ చేసుకునేలా చూడమని అయ్య సామినాశ్రయించి లంచం కొట్టారు. కాబట్టి విచారణ పేరుతో దీక్షను స్టేషనుకు తెచ్చి కూచోబెట్టారు. ఎ యస్ పి రావాలంటూ అర్ధరాత్రి వరకు బలవంతంగా ఉంచేసారు. అయ్యాసామి తప్ప తాగి ఆ టైమ్ లో స్టేషన్ కెళ్ళి ఆ అమ్మాయిని రేప్ చేయాలని చూస్తే ఎలాగో తప్పించుకు పారిపోయింది. అయినా వదలకుండా బైక్ మీద తరుముకెళ్ళి ప్లే గ్రౌండ్ దగ్గర పట్టుకొని రేప్ చేయబోతే ఆ పిల్ల కేకలు విని అటుగా వచ్చిన ఆ కుర్రాడు కాపాడి తీసుకెళ్ళి  హాస్టల్ దగ్గర వదిలేసాడు. అయ్య సామి మోకాలు బుల్లెట్ల దెబ్బకి నుజ్జు నుజ్జయింది. కాలు తీసేసారు.
దీక్షను విచారిస్తే తను ఏడు గంటల వరకు స్టేషన్ లో ఎదురు చూసినా ఎ యస్ పి గారు రాలేదని దాంతో హాస్టల్ కు వెళ్లి పోయానని తర్వాత ఏం జరిగిందో తనకు తెలీదంది. స్టేషన్ స్టాఫ్ కూడ అదే చెప్పారు. ఎ యస్ పి తమ స్టేషన్ కే రాలేదని ఇదెలా జరిగిందో తెలీదన్నారు. తెలుసుంటే తమ ఉద్యోగాలు పోతాయని వాళ్ళకి తెలుసు. కాబట్టి జరిగింది అది సార్. నిజా నిజాలు దేవునికి తెలియాలి’’ అన్నాడు వన్ నాట్ ఫోర్.
‘‘దీక్ష ఇప్పుడెక్కడుంది?’’ టేబుల్ దిగుతూ అడిగాడు ఎ యస్ పి. వన్నాట్ ఫోర్  పిచ్చి నవ్వు నవ్వాడు.
‘‘ప్రస్తుతం ఆ పిల్ల మధురైలో లేదు సార్. కోర్టు ద్వారా ఆస్థిలో తన వాటా తీసుకోగానే స్థిరాస్థులు అమ్ముకొని డబ్బు తీసుకొని ఎటో వెళ్ళి పోయిందట. పెళ్ళి కాని పిల్ల ఎక్కడుందో ఏమిటో ఆమె అన్నలకే ఎలాంటి సమాచారం లేదు. ఇంతకీ దీక్షకి ఆ ప్రకటనిచ్చిన వాడికీ ఏమిటి సార్ సంబంధం ? ఎందుకిదంతా అడిగారు?’’ సందేహ నివృత్తి కోసం అడిగాడు వన్ నాట్ ఫోర్.
‘‘ఎందుకేమిటి ఫూల్  అయ్యా సామికి ఏ గతి పట్టిందో ఇక్కడ ఎవర్నడిగినా చెప్తారంటూ నన్నే బెదిరించాడు రాస్కెల్’’ అంటూ బయటికి నడిచాడు ఎ యస్ పి ప్రకాష్
ఆ మాటలు విని తెరిచిన నోరు మూయటం మర్చిపోయాడు వన్ నాట్ ఫోర్.
అతడి కళ్ళ ముందు ఎయస్ పి అయ్యా సామి స్థానంలో ఎ యస్ పి ప్రకాష్ ఓ కాలు పొగొట్టుకొని చంకలో కర్రతో కుంటుతూ నడుస్తున్న దృశ్యం కన్పించి గట్టిగా తల విదిలించాడు.
I              I                     I
ఉదయం పదకొండు గంటల సమయం...
కోయంబత్తూరు నుంచి చెన్నైకు బయలు దేరిన ముని సామి బృందం చెన్నై మార్గంలో అప్పటికే వంద కిలో మీటర్ల దూరం వచ్చేసారు.
వెంకట రత్నం గారి నూలు మిల్లులో ఒక సెక్షన్ కి మేస్త్రిగా పని చేస్తున్నాడు ముని సామి.
ఆరడుగుల పొడవున  కాస్త లావుగా బలంగా దృఢంగా నల్లగా చింత మొద్దులా ఉంటాడు మునిసామి. వెంకట రత్నం నాయుడు గారికి చాలా నమ్మకమైన వాడు. మనిషి కూడ మంచికి మంచి చెడుకు చెడుగావుంటాడు. కాబట్టి కార్మికుల్లో ఏ సమస్య వున్నా ముని సామిని ఆశ్రయించి పరిష్కరించుకొంటూ ఉంటారు.
ముని సామి కర్ర సాము కత్తి సాములో దిట్ట. ముని సామి గురించి తెలిసిన వాళ్ళెవరూ అతనితో గొడవ పెట్టుకోరు. ఆ పైన ముని సామి నిదానస్తుడు. న్యాయ ధర్మాన్ని అనుసరించే వాడని పేరుంది. కాబట్టి అందరూ అతనితో స్నేహంగానే ఉంటారు. అతని మాటకు కట్టుబడి ఉంటారు.
ముని సామి వెంట వస్తున్న పది మంది కూడ నూలు మిల్లులో వర్కర్లే. వాళ్ళంతా కాస్త రఫ్ గాను మొరటు గాను వుంటారు. అవసరమైతే కర్రో కత్తో పుచ్చుకొని గొడవకి దిగి పోయే మనుషులు. మును సామి మాటకి కట్టుబడి ఉండేవాళ్ళు. వ్యాన్ డ్రైవర్ కూడ అలాంటి వాడే కాబట్టి మునిసామితో కలిపి మొత్తం పన్నెండు మందున్న ఆ వ్యాన్  శర వేగంగా చెన్నై రూట్ లో పరుగు తీస్తోంది.
I              I                     I
దీర్ఘాలోచనలో మునిగి పోయాడు విరాట్
ఇదంతా మంచికి జరిగిందో చెడుకు జరిగిందో అర్దం గావటం లేదు. కోయం బత్తూరు నుంచి తన తండ్రి తన కోసం పంపిస్తున్న మునుషుల గురించి చింత లేదు. మునుసామి తన కన్నా పదేళ్ళు పెద్దాడయినా గురువు లాంటోడు. తను సాంప్రదాయ కర్ర సాము విద్య అతని దగ్గరే నేర్చుకున్నాడు. తనేమిటో అతనికి బాగా తెలుసు గాబట్టి తన ముందు ముర్ఖంగా ప్రవర్తించడు. కాని మధురై నుంచి వస్తున్న మహ దేవనాయకర్ మనుషుల గురించి ఆలోచించాలి. ఆ ఎ యస్ పి ప్రకాష్ సహస్ర తనదంటూ అంత పట్టుదలగా ఎందుకున్నాడో తెలీదు. వీళ్ళేనా ఇంకెవరన్నా రంగంలోకి దిగుతున్నారేమో తెలీదు. ముఖ్యంగా ఈ సహస్ర జర్నలిస్ట్ లహరి అనేది కొత్తగా తెలిసిన విషయం కాబట్టి. మధురై త్యాగరాజన్  అక్రమాస్తుల కుంభకోణాన్ని బయటకు లాగిన సహస్ర కోసం అతని మనుషులు గాలిస్తూ ఉంటారు. ఇప్పుడు తనిచ్చిన ప్రకటన చూసి అతడు సహస్ర కోసం తన మనుషుల్ని చెన్నై పంపించవచ్చు. తన వరకు సహస్ర కన్పించటంలో మంచే జరిగినా సహస్రకి ఈ  ప్రకటన చెడు చేసిందనే చెప్పాలి. అనాలోచితంగా అజ్ఞాత వాసం చేస్తున్న సహస్రని తను బయట పెట్టేసాడు. బయట పెట్టినంత ఈజీ కాదు సహస్రను కాపాడటం. చాల జాగ్రత్తగా ఉండాలి.
‘‘ఏమిటాలోచిస్తున్నావ్?’’ చల్లారిపోయిన కాఫీని తిరిగి వేడి చేసి కప్పులో తెచ్చి ఎదురుగా ఉంచుతూ అడిగింది సహస్ర.
‘‘ఏం లేదు ఉన్నట్టుండి పరిస్థితులింతగా గందరగోళమై పోయాయేమిటాని ఆలోచిస్తున్నాను.’’ అంటూ కాఫీ కప్పు అందుకున్నాడు విరాట్.
‘‘మీ మమ్మీ ఫోన్  చేసే వరకు ఆ విషయం అర్దం కాలేదా? కోయంబత్తూర్ నుంచి వస్తున్న మీ మనుషులు నిన్ను లాక్కు పోతారని భయంగా వుందా?’’ జుత్తు లాగి వెనక ముడివేసుకొంటూ నవ్వింది సహస్ర.
‘‘భయం నా గురించి కాదు. నీ గురించి’’ అన్నాడు.
‘‘భయం దేనికి? నిండా మునిగిన వాడికి చలేమిటన్నట్టు ఆ త్యాగరాజన్  అంతు చూడకుండా వదలను. ఒకవేళ ఈ లోపలే నేను పోతే ఒ కె. ప్రజా ప్రయోజనాల కోసం ప్రాణాలు బలి పెట్టిన తృప్తి ఉంటుంది’’ అంది పొడిగా.
ఆమె అందాల శరీరం నుంచి వీస్తున్నజాస్మిన్ సువాసన విరాట్ ను గిలిగింతలు పెడుతోంది.
తల తిప్పి ఆమెను చూసాడు.
‘‘అలాంటి తృప్తిని నేనంగీకరించను అన్నాడు’’ స్థిరంగా
‘‘పోటీ అంటూ వచ్చాక గెలవటం ముఖ్యం. ఓటమి కాదు. గెలవటంలో ప్రాణం పోయినా మనతో పది మందిని తీసుకు పోతూ వీరమరణం చెందాలి గాని చావుకు భయపడుతూ చావకూడదు’’. అంటూ కాళీ కాఫీకప్ టీపాయి మీద ఉంచాడు.
విరాట్  భుజం మీద తలానుకుంది సహస్ర
అతడి చేతిని తన చేతిలోకి తీసుకుంది
పొడవాటి అందమైన సహస్ర చేతి వేళ్ళు తన చేతి వేళ్ళ సందుల్లోకి జొరబడి బిగించి పట్టు కొంటుంటే ఇక ఈ చేతిని ఎన్నటికీ వదలవుగా? అని అడుగుతున్నట్టుంది. విరాట్ మాటలు చేతలు సహస్రలో కొత్త ఆశలు నింపుతున్నాయి. నూతన ధైర్యోత్సాహాలు ఏర్పడుతున్నాయి. నేను ఒంటరి దాన్ని కాను అనే ఒక భరోసా మనసులో ఏర్పడుతోంది. ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది.
మిగతా విషయాలు ఎలా వున్నా జీవితంలో తిరిగి చూడగలనో లేనో అనుకున్న సహస్ర ఒక్క పేపరు ప్రకటనతో తన పక్కన వాలిపోయింది. అరవిచ్చిన మందారంలా వున్న సహస్ర ముఖంలోకి ముగ్దుడై అలా చూస్తూండి పోయాడు.
‘‘విరాట్’’ కళ్ళు తెరవకుండానే పిలిచింది.
‘‘చెప్పు’’ అన్నాడు.
‘‘నిజంగానే నన్ను  ప్రేమిస్తున్నావా?’’
‘‘ఇంకా డౌటేనా?  ప్రేమిస్తున్నాను గాబట్టే నీ పక్కనున్నాను. నాకు తెలియాల్సింది నీ మనసు’’
కళ్ళు తెరిచింది సహస్ర.
‘‘నా మనసు తెలియాలంటే నీ మనసులో నా మీద ఎంత ప్రేమ ఉందో తెలియాలి’’ అంది
‘‘ఎంతంటే?’’
‘‘ఎంతో చెప్పు’’
‘‘చెప్పాలంటే నీ అంత.........నీ తర్వాతే అంతా అన్నంత’’
‘‘కాని నేనెంత ప్రేమిస్తున్నానో తెలుసా?’’
‘‘ఎంత?’’
‘‘నేనంటూ ఏమీ లేదు. సర్వం నీవే అన్నంత’’
‘‘నేన్నమ్మను’’
‘‘కాని ఇది నిజం’’
‘‘ఎలా?’’
‘‘ఆ రోజు రైల్లో తొలి చూపులోనే నిన్ను వలచిన మాట నిజం. కాని అది సమయం సందర్భం కాదు గాబట్టి పట్టించుకోకుండా వెళ్ళి పోయాను. తర్వాత నా కోసం నువ్వు చేస్తున్న ప్రయత్నాలు తెలిసి సంతోషించాను. కాని నేనున్న పరిస్థితులకి భయపడ్డాను నా సమస్యల్లోకి నిన్ను లాగటం ఇష్టం లేక మౌనంగా ఉండి పోయాను.’’
‘‘మౌనంగా ఉండాల్సిన అవసరం లేదులే. ఇక నుంచి నీ సమస్యలు నావి.’’
‘‘ఒక వేళ నేను చచ్చిపోతే ఏం జేస్తావ్?’’
‘‘మృత్యువైనా నన్ను దాటే నీ వద్దకు రావాలి’’
‘‘అయితే నాతో రా’’. అంటూ లేచింది సహస్ర.
‘‘ఎక్కడికి? అడిగాడు.
‘‘హేపీగా ఉండటానికి’’
‘‘స్వర్గానికి తీసుకెళ్తావా’’
‘‘ఆశ చూడు. అక్కడికింకా పర్మిషన్ లేదులే’’
‘‘అయితే నేను రాను. ఇక్కడే బాగుంది’’
‘‘నాతో వస్తావా లేదా?’’
చేయి పట్టి లాగింది. ముసిముసిగా నవ్వుతూ లేచి సహస్రననుసరించాడు విరాట్. ఇద్దరూ సహస్ర బెడ్రూమ్ లో ప్రవేశించారు. అక్కడ చందూ పక్క గదిలో తనుంటున్నట్టు ఇక్కడ దీక్ష పక్క గదిలో సహస్ర ఉంటోంది. సేమ్ టు సేమ్ విశాలమైనగది. ఆటాచ్డ్ బాత్రూం. ఎటు చూసినా ఖరీదైన ఫర్నీచర్. ఎదురుగా సహస్ర తల్లి దండ్రులతో దిగిన క్యాబినెట్ సైటు ఫోటో ఫ్రేం గోడకు వేలాడుతోంది. గుబురు మీసాలతో చాలా గంభీరంగా ఉన్నాడు తండ్రి మహాదేవ నాయకర్. తల్లి ముగాంబిగై సాంప్రదాయంగా హుందాగా ఉంది. సహస్రలో తల్లి కన్నా తండ్రి పోలికలే ఎక్కువ కన్పిస్తున్నాయి.
‘‘ఇదే నా బెడ్రూం. నీకు చూపించటానికి పిలిచాను’’ అంది
‘‘చూసానుగా. బాగుంది. ఇక వెళ్తాను’’ వెను తిరిగాడు
‘‘ఆగు నువ్వు చూడాల్సింది ఇంకోటుంది’’
‘‘ఏంటది’’
‘‘ఆ టేబుల్  సొరుగు లాగి చూడు’’
చూసాడు
లోన విరాట్ ఫోటో వుంది
తన ఫోటో చూసి ఒకింత ఆశ్చర్య పోయాడు విరాట్. తనంటే ముందుగా ప్రేమించాడు గాబట్టి తన వద్ద సహస్ర ఫోటోలున్నాయి. సహస్ర బెడ్రూంలోకి తన ఫోటో ఎలా వచ్చింది?
‘‘ఎలా వచ్చిందని ఆశ్చర్య పోతున్నావా?’’ ముసి ముసిగా నవ్వుతూ అడిగింది
‘‘అదేగా...ఎలా వచ్చింది?’’ అడిగాడు
‘‘నీ ఫ్రెండు చందు ఆ రోజు ఫోటో తీసినట్టే మా దీక్ష నీ ఫోటో తీసింది. అదే యిది. ఈ ఫోటో పగలు మాత్రమే సొరుగులో ఉంటుంది. రాత్రిళ్ళు నా గుండెల మీద ఉంటుంది. నా ప్రేమను నమ్మనన్నావ్ గా. అందుకే చూపించాను’’ అంటూ పక్కనకొచ్చింది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
yatra