Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahiteevanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

 ఈరోజుల్లో, నగరాల్లో ఉండేవారికి, ఉండే occupational hazard  ఏమిటయ్యా అంటే, వచ్చే పోయే చుట్టాలు, స్నేహితులూనూ. ఏదో ఓ పూట కనిపించి వెళ్ళేవారితో ఫరవాలేదు కానీ, ఓ నాలుగైదు రోజులు ఉందామని వచ్చేవారితో కొంచం కష్టమే. అదీ, ఈరోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగానికి వెళ్ళేవారైతే, ఇంకా గొడవ. ఆ వచ్చినవారి “ ప్రాముఖ్యత” ని బట్టి, ఎవరో ఒకరు శలవుకూడా పెట్టాల్సొస్తూంటుంది.. ఎప్పుడుపడితే అప్పుడు శలవెక్కడ దొరుకుతుందీ? ఆ వచ్చేవారు వయసులో పెద్దవారైతే, వారికి లోటులేకుండా మర్యాదలు చేయాలి.

ఇదివరకటి రోజుల్లో అయితే, ఇంటికెవరైనా వస్తే చాలు, ఎంతో సంతోషపడిపోయేవారు. కానీ, ఈ రోజుల్లో అలాక్కాదే. కారణాలు అనేకం. ఇంటికి ఎవరైనా వస్తే, కనీసం వారు విశ్రమించడానికి ఓ గది కావొద్దూ. ఈరోజుల్లో ముందుగా వచ్చే సమస్య ఇదే కదా. ఆరోజుల్లో  ఎంత చెప్పినా  కనీసం , వంటగది కాకుండా. ఓ మూడు గదులైనా ఉండేవి. అదీ కాపోతే, ఏ అరుగుమీదో, లేదా ఆరుబైటో, ఓ మడతమంచం వేసికునైనా సద్దుకునేవారు. ఈరోజుల్లో, ఎక్కడో, ఆర్ధిక స్థోమత ఉన్నవారు తప్పించి, చాలామంది, ఓ హాలూ, రెండు బెడ్రూమ్ములతోనూ సరిపెట్టేసికుంటున్నారు. పిల్లలకి ఓ రూమ్మూ, పెద్దవారికి ఓ రూమ్మూ. మిగిలిందల్లా “హాలు”. ఆ వచ్చినవాళ్ళని, మరీ హాల్లో పడుక్కోమనలేరుగా ! పైగా కొంతమందికి పట్టింపోటీ. తిరిగి వెళ్ళిన తరువాత ఊరూ వాడా, యాగీ చేయడం. “ మొన్న మా వాళ్ళింటికి వెళ్తే హాల్లో పడుక్కోమన్నాడండీ.. ఎక్కడైనా ఉంటుందా అలాటి విడ్డూరం? ఏమిటోనండీ, డబ్బులు సంపాదించడమే కానీ, పడక సుఖం లేని ఆ జీతాలెందుకూ.. పడక వ్యవహారం పక్కనుంచండి, ఇంటికి వెళ్ళీవెళ్ళగానే, ఇంకో ముఖ్యమైన విషయం, ఆ వచ్చినవారి దృష్టికి తెస్తారు—“ మాకు రోజు విడిచిరోజే  నీళ్ళు వస్తాయీ, మీస్నానానికి కొద్దిగా ఇబ్బందవుతుందేమో—స్నానం మాట దేవుడెరుగు, మిగిలిన విషయాల మాటేమిటి? పైగా కొంతమంది “ పెద్ద” వారికి, తమ ఇంట్లో ఎలా ఉన్నా ఫరవాలేదు కానీ, బయటి ఊర్లకెళ్ళినప్పుడు మాత్రం, ఎక్కడలేని “ఆచారాలూ “ గుర్తుకొచ్చేస్తూంటాయి..దానికి సాయం, ఆ ఇంటివారు కూడా ఈయన ఆచారవ్యవహారాలు చూసి “ఆహా..ఓహో..” అని భావించాలని ఓ తపన! ఆచారాలు ఉండడం తప్పని ఎవరూ అనరు కానీ, ఎప్పుడైనా బయటి ఊర్లకెళ్ళినప్పుడు, కొద్దిగా వీటిని తగ్గించుకోవడమో, సద్దుకుపోవడమో చేస్తే, ఉభయపక్షాలకీ మంచిది కదా.

ఆరోజుల్లో, వంటా వార్పూ, సాధారణంగా, గృహిణే చేసేది. కానీ ఈరోజుల్లో , స్థోమతని బట్టి, వంటకి ఓ మనిషిని పెట్టుకునే రోజులాయె. ఈ వచ్చినవారి తిండి “ పదునులు” , వంట మనిషికి తెలియవుగా, అలవాటు ప్రకారం ఏదో చేసేస్తుంది, ఆ వంటేమో వచ్చిన వారికి నచ్చదు—కొంతమందికి ఇంగువ నచ్చదు, కొంతమందికి వెల్లుల్లి నచ్చదు, ఇంకోరికి ఇంకో సింగినాదం నచ్చదు—ఇలా చెప్పుకుంటూ పోతే, జరుగుబాటు ఉన్నంత కాలమూ, ఏదో “ఒకటి” నచ్చకుండా ఉంటూనే ఉంటుంది.

తాము తిప్పలు పడుతూ, ఆ వెళ్ళినవారిని అసౌకర్యానికి గురిచేస్తూ, “ఎందుకొచ్చారురా బాబూ.. “ అనిపించుకోవడం అంత అవసరం అంటారా? హాయిగా, ఏ ఊరైనా వెళ్ళినప్పుడు ఏ హొటల్ లోనో దిగి, ఆ తెలిసినవారింటికి వెళ్ళి, నాలుగు కబుర్లు చెప్పుకుని, వాళ్ళు పెడితే తిని, వాళ్ళుకూడా, నాలుక్కాలాలపాటు గుర్తుంచుకునేటట్టు  ఉండడం మంచిదంటారా? ఇదివరకటి రోజుల్లో. మనం వెళ్ళిన ఊర్లో ఎవరైనా  చుట్టాలుండి, వాళ్ళిళ్ళల్లో ఉండకపోతే, ఎంతో బాధపడెవారు. “అయ్యో అదేమిటీ.. మేమిక్కడుండగా, మీరు హొటల్లో దిగడం ఏమీ బాగోలేదూ..” అని బాధపడిపోయేవారు. దానికి సాయం ఆరోజుల్లో, ఈ హొటళ్ళూ, గెస్టుహౌసులూ అంతగా ఉండేవికూడా కావు. కాలమానపరిస్థుతలని బట్టి, ఆరోజుల్లో చుట్టాలింటికి వెళ్ళి ,కొన్ని రోజులు గడపడమూ బాగానే ఉండేది. ఎక్కడికైతే వెళ్ళారో, వాళ్ళు కూడా, వీళ్ళింటికి వెళ్ళేవారు. ఉభయతారకంగా ఉండేది. పైగా రాకపోకలు కూడా అలాగే ఉండేవి. కానీ, రోజులు మారిపోయాయి, ఈ రోజుల్లో ఎక్కడ చూసినా, ఎవరూ ఎవరిగురించీ పట్టించుకునే రోజులు కావు. ఈ పరిస్థితికి ఎవరినీ తప్పు పట్టీ లాభం లేదు. ఎవరి priorities  వారివి. ఆరోజుల్లో సంబంధబాంధవ్యాలూ, రాకపోకలూ ఉండేవి. ఒకరి కష్టంలో ఇంకోరు ఆదుకునేవారు.  ఒకరి క్షేమం ఒకరికి ఓ పోస్టుకార్డుద్వారానైనా తెలిసేది. కానీ సమాచార వ్యవస్థ అభివృధ్ధి చెందిన తరువాత, పలకరింపులు పెరగడం మాట దేవుడెరుగు, కనుమరుగైపోయే పరిస్థితి. ఏడాదికోమారు, పలకరించినా, మహాభాగ్యం అనుకునే రోజులు.. చివరకి ఎలా మారిందంటే, ఏ పలకరింపూ ( ఫోను ద్వారా) లేకపోతే అందరూ బాగానే ఉండుండుంటారులే అనుకోవడం. భార్యాభర్తలకే ఒకరినొకరు పలకరించడానికి టైముండడం లేదు, మళ్ళీ ఈ చుట్టాలూ, పక్కాలూ అంటూ కూర్చుంటే ఎలా? కానీ ఇంట్లో ఎవరైనా పెద్ద వాళ్ళు మాత్రం ఉన్నారూ అంటే, వాళ్ళకి అదో తాపత్రయం.. ఫలానా వాళ్ళు ఎలా ఉన్నారూ, ఈమధ్యన ఫోనేమైనా వచ్చిందేమిటీ, వాళ్ళ మనవరాలు పెళ్ళీడుకొచ్చింటుంది ఈ పాటికి.. అంటూ. ఇలాటివన్నీపట్టించుకోకపోతే  అసలు గొడవే లేదూ. అయినా ఏదో ఈ పెద్దాళ్ళు ఉన్నంతకాలమే కదా,  ఊళ్ళోవాళ్ళ యోగక్షేమాలు కనుక్కోడమూ.. అనుకుంటే ఇంకా శ్రేష్ఠం...

చివరగా చెప్పొచ్చేదేమిటంటే, ఎప్పుడైనా విహార యాత్రలకో, తీర్థయాత్రలకో ఇంకో ఊరువెళ్ళాల్సొచ్చినప్పుడు, హాయిగా టిక్కెట్లతో పాటు, ఉండడానికి ఏదో, హొటలో, గెస్టుహౌసో కూడా బుక్ చేసేసికుంటే, అందరూ హాయిగా ఉంటారు. ఊళ్ళోనే ఉండే  స్వంత అన్నదమ్ములకీ, అక్కచెల్లెళ్ళకీ , రాకపోకలు అంతంతమాత్రంగా ఉంటూన్న ఈరోజుల్లో, పొరుగూరినుండి వచ్చే చుట్టాలూ, పక్కాలూ, మనింటికి వచ్చి, “మనర్పిత” అతిథి సత్కారాలు పొందలేదని , ఆవేదన పడే రోజులు కావివి.. ఏదో ఆ ఊరు వెళ్ళినప్పుడు, చుట్టరికాన్ని బట్టి, ఓ ఫోను చేసినా సరిపోతుంది. మహ అయితే, మొహమ్మాటానికి, “అదేవిటీ, ఇంత దూరం, అదీ మేముండే ఊరికి వచ్చికూడా, కలవకుండా వెళ్ళిపోతున్నారా..” అని అనొచ్చు. కానీ, మనసా వాచా మాత్రం ఎంతో సంబరపడిపోయే రోజులు... ఈ సున్నితమైన “ మార్పు” ని గుర్తుంచుకుంటే ఉభయతారకం ....

మరిన్ని శీర్షికలు
jayajaya devam