Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Sorakaaya Pulusu!

ఈ సంచికలో >> శీర్షికలు >>

తెలుగుజాతి మనది నిండుగ వెలుగు జాతి మనది - పులివర్తి కృష్ణ మూర్తి

telugu jati manadi ninduga velugu jati manadi

 ఆంధ్రప దేశ్ రాష్ట్రం లో కృష్ణా జిల్లా వాసులకు ఒక ప్రత్యేక స్థానం వుంది. ఆ స్థానం ఇప్పుడిక రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత మరింతగా పెరిగింది. తెలుగు భాషా విషయం లో కూడా మేమున్నామంటూ 3వ సారి ప్రపంచ తెలుగు రచయితల మహా సభలను నిర్వహించిన ఘనతను ముందుగా దక్కించుకున్నారు. నిజానికి ఈ జిల్లా నుండే ప్రముఖులైన తెలుగువారెందరో , సినీ రంగాన్నీ, కళా రంగాన్నీ సుసంపన్నం గావించారు. జై ఆంధ్రా ఉద్యమానికి సారధ్యం వహించిన రైతు బిడ్డ కాకాని వెంకటరత్నం,జ్ఞానపీఠ్ అవార్డును అందుకున్న మొదటి తెలుగు వాడు విశ్వనాధ సత్యనారాయణ పుట్టిన గడ్డగా ఈ విజయవాడ మహా పట్టణం కనకదుర్గమ్మ అమ్మవారి కరుణా కటాక్షాలకు నోచుకున్న దుర్గాక్షేత్రమిది. ఈ జిల్లాకు చెందిన ప్రముఖులు మండలి బుద్దప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అసారధ్యం లో అంతా తాముగా నిర్వహించిన తెలుగు రచయితల మహా సభలు రెండు రోజుల పాటు ఘనం గా నిర్వహించబడ్డాయి. ప్రపంచ భాషగా తెలుగు" అన్న ధ్యేయం తో సాగిన ఈ సభల్లో ఆచార్య డేనియల్ నిగర్స్ పారిస్ నుండీ, యార్లగడ్డ శివరామ ప్రసాద్ తానా తరుపునా, కెనెడా నుండి ఆచార్య రావు  కొమరపోలు, కెనెడా  నుండే సరోజ, ఇంగ్లాండ్ నుండి జొన్నలగడ్డ మూర్తి, మాడిన రాకృష్ణ, మధుర కవి, శేషు అప్పారావులు, బోసు వేమూరి కెనెడా నుండి, తేజస్విని మారిష్స్ నుండీ, న్యూయార్క్ నుండి దువ్వూరి సందీప్ పాల్గొన్నారు. ప్రారంభోత్సవం లో పాల్గొన్న కేంద్రమంత్రివర్యులు, ప్రముఖ భారతీయ జనతా పార్టీ నాయకులు ముప్పవరపు వెంకయ్య నాయుడు పాల్గొని తెలుగువారంతా తెలుగులోనే మాట్లాడాలని, బోర్డులనూ పేర్లనూ ఇంగ్లీషులో గాక తెలుగులోనే రాయించాలనీ, పురపాలక సంఘాలకు తిరుమల తిరుపతి దేవస్థానం వారికీ సరదాగా వినిపించి అందరినీ నవ్వించారు. తెలుగు భాషను అగౌరపరిచే విద్యా సంస్థలపై వేటు వేయాలన్నారు. అంతేకాదు పాఠశాలల్లో తప్పనిసరిగా పెద్ద బాలశిక్షను పాఠ్యాంశం గా పెట్టాలన్నారు.

సుప్రీం కోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ న్యాయసంబంధమైన వ్యవహారాలు తెలుగులోనే జరగాలని అన్నారు. తెలుగు సాహిత్యం తో బాటు బయట ప్రపంచం లో జరిగే వాటిపై కూడా రచనలు సాగించాలన్నారు. రిచర్డ్ నిక్సన్ భగవద్గీత లోని పద్యాలకు తన రచనల్లో పొందుపర్చారన్నారు.పారిస్ నుండి విచ్చేసిన డేనియల్ నిగర్స్, ఒక్క అన్య భాషా పదాన్ని ఉపయోగించకుండా తెలుగులోనే మాట్లాడారు. అయితే నిర్వాహకులే అప్పుడప్పుడూ ఇంగ్లీషు పదాలను విరివిగా వాడటం శోచనీయం గానే అనిపించింది. ప్రారంభోత్సవానికి మత్రులు రాష్ట్రం నుండి ఎవ్వరూ రాకపోవడం వెలితిగానే వుంది. ఆ విధంగానే తెలంగాణ రాష్ట్రం నుండి  600 మంది, 1560 మంది ప్రతినిధుల్లో వున్నారని ప్రకటించినా, అందులో మూడొంతుల మంది ఆంధ్రా ప్రాంతం ప్రవాసులే వున్నారు. వారిలోను చాలా మంది హాజరు కాలేకపోయారు. ప్రారంభ సభా ప్రాగణానికి మండలి బుద్ద ప్రసాద్ తండ్రి గారు మండలి వెంకట కృష్ణారావు గారి పేరు పెట్టారు. విశిష్ట సత్కారాన్ని బాలాంతపు రజనీకాంతారావుకు అందించారు ముప్పవరపువారు. వెంకయ్య నాయుడి గారి ప్రసంగంప్రాసలతో ఆద్యంతం ఆకట్టుకుంది. మధ్య మధ్య లో ఆయన చలోక్తులు చురుకులూ సభికులకు గిలిగింతలు పెట్టాయి. శంకరంబాడి సుందరాచారి సభా వేదికపై విదేశాంధ్రుల సదస్సు జరిగింది. దాశరది సభా వేదికపై "తెలుగు భాషా వికాసం" పైనా బద్రిరాజు కృష్ణ మూర్తి సభా వేదికపై "తెలుగు భాషా- ప్రాచీనతా హోదా సదస్సు, పాలగుమ్మి పద్మరాజు సభా వేదికపై రాష్ట్రేతరాంధ్రుల సదస్సు, పుట్టపర్తి నారాయణా చార్యుల సభా వేదికపై కవి సమ్మేళనం రావూరి భరద్వాజ సభా వేదికపై తెలుగు భాషా వ్యాప్తిపై సదస్సు, ముక్కామల నాగభూషణం సభా వేదికపై పత్రికలు, దృశ్య స్రవణ మాధ్యమాలు పై సదస్సూ, బోయినపల్లి వెంకట రామారావు వేదికపై సాహిత్య సంస్థల ప్రతినిధుల సదస్సు జరిగాయి. కాలోజీ నారాయణరావు సభా వేదిక మీద మరోసారి కవిసమ్మేళనం జరిగింది. ముగింపు సభలో సుప్రీం కోర్టు న్యాయ మూర్తి  జస్టిస్ నూతల పాటి వెంకటరమణ పాల్గొని తెలుగుభాషా ప్రజల మధ్య వైషమ్యాల్ని తొలగించి సౌబ్రాతృత్వాన్ని, సద్భావాన్ని పెంచుతుందన్నారు. ఇక బ్రహ్మానందం ప్రసంగం ఆద్యంతం నవ్వులుపువ్వులు విరజిమ్మింది.

పలువురు సాహితీవేత్తలూ, కవులూ, రచయితలూ, భాషాభిమానులు పాల్గొన్న ఈ సభల్లో అందరిదీ ఒకే మాట. అదే పాత పాట. తెలుగు వారు తెలుగు లోనే మాట్లాడాలి. తెలుగు వారి రచనలు ఇతర భాషల్లోకి తర్జుమా కావాలి. పాఠశాలల్లో తెలుగును పాఠ్యాంశంగా తప్పనిసరిగా చేర్చాలి. రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా తెలుగు భాషాభివృద్ధికి కృషి చేయాలి.  ముగింపు రోజున వేదికపై తెలుగుదేశ ప్రభుత్వం మత్రులు పలువురూ కనిపించి ఆహుతులకు సంతృప్తినిచ్చారు. ఈ విధం గా కోట్లాది రూపాయలు ఆ సభలకు ఖర్చవుతుంది. కానీ, గత రెండు సభల్లో కూడా ఇలాంటి నిర్ణయాలనే తీసుకుని వుంటారు. కానీ వాటిని ఆచరణలో పెట్టించడంలో నిర్వాహకులు ఎంతవరకూ కృతకృత్యులయ్యారో చెబితే బాగుండేది. అలాగాక ప్రతీసారి తెలుగు వారి మీద సభలు పెట్టి చలోక్తులూ, హాస్య ప్రసంగాలు, ఉద్వేఅ భరితంగా ఓగిపోవడాలవలన ప్రయోజనం శూన్యం. కేవలం అది కొందరికి ఫారిన్ టూర్ల కోసం  అవార్డులూ, రివార్డుల కోసం, పదవుల కోసం పనికొస్తాయేమోననుకునే వారు కనిపించారు. సభా ప్రాగ్ణం లో తెలుగు పుస్తకాలు విరివిగా అమ్ముడు పోయాయి. తమ పుస్తకాలను ఈ సభల్లో ఆవిష్కరణకు తెచ్చుకున్న వారికి కొంత అసంతృప్తే మిగిలింది.

ఎంతోమంది సహితీమూర్తులను, భాషాభిమానులనూ చూసే అదృష్టం ఈ ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు కల్పించాయి. సాహితీ సువాసనలు పంచాయి ఆహుతులకు. అంతర్జాతీయమంటూ జరిపే ఈ సభలను ఈ సారైనా మరో ప్రాంతం లో జరిపితే బాగుంటుందని పలువురు అభిప్రాయపడ్డారు. తెలుగు వారికి ఒక గుర్తింపును సాధించి పెట్టిన మహనీయుడు నందమూరితారకరామారావు గారికి  తగిన గుర్తింపును ఈ సభాప్రాంగణం కల్పించకపోవడం విచారకరం. ఆయన రూపొందించిన తెలుగు తల్లి విగ్రహం కానీ, పటం కానీ కేసీఆర్ అందించిన తెలంగాణా తల్లి పటం గానీ వేదికపై కనిపించకపోవటం శోచణీయం. ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులూ ఈ సదస్సు లో పాల్గొనకపోవటం సాహితీవేత్తలకూ  ఏదో లోపం జరిగినట్ట్లుగా అనిపించింది. తెలుగు జాతికి నిండి గౌరవాన్ని ప్రసాదించిన వారిని గుర్తుచేసుకుంటూ సాగిన ఈ రచయితల మహా సభలు నిర్వహించిన కృష్ణా జిల్లా రచయితల సంఘం సభ్యులను అభినందిద్దాం.

మరిన్ని శీర్షికలు
jyotishyam vijnaanam