Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
meghana

ఈ సంచికలో >> సీరియల్స్

యాత్ర

జరిగిన కథ : అందరూ కలిసి వచ్చి మద్యం సేవించినా, ఎవరి బిల్లు వాళ్ళే కట్టేసి వెళ్ళిపోతున్న అమ్మాయిలను చూసి ఆశ్చర్య పోయిన జీవన్ కి ఇంకా వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి వివరంగా చెబుతుంటాడు వేణు. మర్నాడు మళ్ళీ విచిత్రమైన వేషధారణలో కనిపిస్తాడు గంగరాజు.....                            ఆ తర్వాత.....

నిన్నటితో ఒక సాంగ్ అయిపోయిందండి. దాంట్లో హీరో గారి కాస్ట్యూమ్ ఇది. ఈ అద్దాల డ్రస్సు బాంబేలో కుట్టించడానికి లక్ష అయ్యింది ప్రొడ్యూసర్ కి” అన్నాడు.

“అలాగా..!” అన్నాడు జీవన్.

“నే వేసుకుంటే ఎలాగుంది..?” అడిగేడు.

“పరమ వరస్ట్ గా ఉంది” అప్పుడే వచ్చిన యోగి అలా చిరాకు పడ్డాడు.

“మరేం చెయ్యమంటారు సార్. నా సూట్ కేసు ఆ ఎమిరైట్స్ ఎయిర్ లైన్స్ వాళ్ళ దగ్గర్నించి రాలేదింకా” అన్నాడు.

“సరే ఇంపార్టెంట్ ఫోన్ మాటాడాలి. ఎందుకొచ్చేరో చెప్పండి”

“ఒక ఏభై యూరోలు కావాలి సార్” అన్నాడు. ఇచ్చి అతన్ని పంపించాకా ఆ రోజు అవకాశం దొరికినప్పుడల్లా ఆమెతో మాటాడేడు జీవన్.“సార్, మీరేవన్నా చెప్పండి గానీ ఈ నాలుగు గోడల మధ్యా కూర్చుని పని చెయ్యడం నా వల్ల గావడం లేదు. మొనాటనీ దాన్ని బ్రేక్ చెయ్యాలి”. ఆ ప్రొద్దుట వాళ్ళు ఉంటున్న రూమ్ కొచ్చిన జార్జి ప్రసాద్ తో ఆ విధంగా మొత్తుకోవడం మొదలెట్టాడు యోగి.

“అయితే ఏం చేద్దామంటారు షూటింగ్ స్పాట్ కెళదామా..?” అడిగాడు జార్జి ప్రసాద్.

“వద్దు వాళ్ళ షూటింగ్ కెళ్ళి పని పాడు చెయ్యడం ఇష్టం లేదు. ఎక్కడికయినా తీసుకెళ్ళండి” అన్నాడు యోగి.

“ఎక్కడికెళదాం..?”

“సాల్స్ బర్గ్ ఎంత దూరం..?” అడిగేడు జీవన్.

“ఇన్స్ బ్రూక్ వెళ్ళి ట్రైనెక్కితే రెండు గంటలు జర్నీ” అన్నాడు తన రూమ్ లో కెళ్ళబోతూ ఆగిన జాస్తి చౌదరి.

“సాల్స్ బర్గ్ లో ఏముంటది..?” అడిగేడు కన్నారావు గారనే ఆయన.

“మొజార్ట్ ప్లేస్ అది” అన్నాడు జీవన్.

“అయితే అక్కడికెళదాం” అన్నాడు యోగి.

వీళ్ళిద్దరితో పాటు చందర్రావు, గోవిందూ కూడా వస్తామన్నారు. మొత్తం ఆరుగురూ బస్టాప్ కొచ్చారు. కాస్సేపటికి స్కూలు పిల్లలూ, వయసులో పిల్లలూ పెద్దోళ్ళూ ముసలోళ్ళు బాగా మూగారు.

వెయిటింగ్.... కాస్సేపటికికొచ్చింది బస్సు. క్యూలో లోపలికెళ్ళారంతా.

డ్రైవరూ కండక్టరూ ఒకడే. ఆరుగురికీ ముప్పై తొమ్మిది యూరోలు తీసుకుని టికెట్లిచ్చాడు. ఏగ్జమ్స్ నించి ఘాట్ రోడ్ మీదుగా ఏడు కిలోమీటర్లు ప్రయాణం. బస్సులో కూర్చున్న అందరి విసుగూ మాయమయిపోయింది. అంత బాగుంది బస్సు. వెచ్చగా హాయిగా ఉంది లోపల. చిన్న చిన్న గ్రామాల్లో కూడా టయోటా, బెంజ్, రోల్స్ రాయిస్ షోరూమ్స్ ఉన్నాయి.

ఘాట్ రోడ్ లోంచి కొండ మీదున్న అడివి వేపు చూస్తే నల్లటి బట్టల్లో కొండపై వెళ్తున్న అమ్మాయిని వెనక నించి చూస్తే షహనాజేనేమో అన్న భయం కలిగింది.

ఇన్స్ బ్రూక్ బస్ టెర్మినల్ ఆనుకునే ఉంది రైల్వే స్టేషన్.

ఇన్ఫో కౌంటర్ కెళ్ళి అడిగితే టైన్ ఒంటి గంటన్నరకి అని తెల్సింది. అప్పుడు టైం పదకొండున్నర ఇంకా రెండు గంటలుంది. ఏం చెద్దాం అనుకుంటుంటే చెయ్యడానికి బోలెడంత ఉంది అని సిటీ లోపలికి నడిచేడు జాస్తి చౌదరి. వెనక మేం.

ఒక విగ్స్ తయారు చేసే షాపు ముందాగేం.

జార్జి ప్రసాద్ బట్టతల చూపించి ఇతనికి సూటయ్యే మంచి విగ్ కావాలన్నాడు.

తనతో రమ్మంది.

లోపల హెయిర్ కటింగ్ సెలూన్ల టైపులో పెద్ద పెద్ద అద్దాలు వాటి చుట్టూ లైట్లు, అద్దాల ముందు కుర్చీలూ ఉన్నాయి. ఒక కుర్చీలో జార్జి ప్రసాదుని కూర్చోపెట్టిన ఆమె విగ్గొకటి తీసుకొచ్చి అతని తల మీద పెట్టింది.

చూస్తే...

విగ్గు పెట్టినట్టే లేదు. తన వీడియో కెమెరాతో షూట్ చేసేడు యోగి. మన కరెన్సీతో చూసుకుంటే ఏభై వేలట. ఇంకో లేడీ వచ్చి కొలతలు తీసుకుని పర్ ఫెక్ట్ సైజ్ లో చేస్తాం రేపు అని ఫలానా టైముకి అని అపాయింట్ మెంటిచ్చింది.

అక్కడ్నించి బయటికొస్తుంటే “విగ్గు లేకండా జుట్టు మొలిపించడానికి ఎంత తీసుకుంటారు..?” అనడిగాడు గోవిందు.

“రూపాయి పావళా.., మీరెవరు మాటాడకుండా మమ్మల్ని ఫాలో అవ్వండి” అన్నాడు జార్జి ప్రసాద్.

ఆరేడు ఫోర్లున్న ఆ పెద్ద భవనం పేరు హిల్టన్ బిల్డింగ్. అందులోనే సిక్త్ ఫ్లోర్ లో ఉన్న హోటల్ హిల్టన్ లో ఉంటున్నాడు మెయిన్ హీరో సందేశ్. బిల్డింగ్ కింద రకరకాల షోరూమ్స్. ఒక చోట కేవలం లెదర్ తో చేసిన జాకెట్లూ, షెర్లాక్ హోమ్స్ లాంగ్ కోట్లూ, హేట్లూ ఉన్నాయి. ఆ రేట్లు చూస్తుంటే మతి పోయింది. పక్కనే ఆప్టికల్ షోరూం దానికెదురుగా షాపు. మోడ్రన్ వాచీల దగ్గర్నుంచి ఏంటిక్స్ దాకా ఉన్నాయక్కడ. వీటిని ఆన్చి కేబరే. అక్కడ్నించి పక్కకెళితే అయిదు ఫోర్ల పెద్ద బిల్డింగ్. లోపల కెసినో ఉంది. దాన్ని ఆస్ట్రియా గవర్నమెంటు నడుపుతుందట.జాస్తి చౌదరి తో పాటు లోపలికెళ్ళారంతా.

అసలు కెసినో పైనుందట. సాయంత్రం మూడున్నర తర్వాత ఓపెనవుతుంది అది. లోపలికెళ్ళారంతా. రకరకాల మిషన్ల ముందు జూదం ఆడుతూ జనం. వాళ్ళలో ఎక్కువగా ముసలివాళ్ళే ఉన్నారు. ఈ గ్రౌండ్ ఫోర్లో ఉన్న మెషిన్లన్నీ వాళ్ళ కాలక్షేపం కోసమట. మెగా సెవెన్ అనే మిషిన్ ముందు కూర్చుని అయిదు యూరోల నోటుని మెషిన్లోకి తోసి ఆట మొదలెట్టిన యోగికి వెంటనే ఏభై, అక్కడ్నించి వంద వచ్చాయి. “బిగినర్స్ లక్ ఆహా” అన్నారంతా. హుషారు పెంచిన యోగి ఒక అరగంట సేపు ఆడి ఇరవై యూరోలు పోగొట్టుకున్నాడు.

గుడ్ లక్ అనే మిషిన్ ముందు కూర్చుని జూదం ఆడ్డంలో పడిపోయిన జాస్తి చౌదరి “ట్రైన్ టైమవుతుంది వెళ్ళండి” అన్నాడు.

“అదేంటి నువ్వు రావా..?” అంటే, “ఇంతకు ముందు రెండు సార్లు వెళ్ళాను. నేనిక్కడే ఉంటాను మీరెళ్ళి వచ్చేయ్యండి..” అన్నాడు.ఇక మిగిలింది అయిదుగురు.

మళ్ళీ ఇస్తానని జీవన్ దగ్గర్నుంచి ఒక యాభై యూరోలు తీసుకున్న జార్జి ప్రసాద్, టిక్కెట్లు కొని దార్లో తినడానికి చికెన్ రోల్స్ కొన్నాక ప్లాట్ ఫారం మీద కొచ్చారంతా.

ఆ రైల్వే స్టేషన్లు అలిగి ముగ్గెట్టిన కోనసీమ గ్రామంలో మూడు మండువాల లోగిలిలా ఉంది. జన సంచారం తక్కువ. ఎలాంటి సౌండ్ పొల్యూషనూ లేదు.

కరెక్ట్ గా ఒంటి గంటన్నర అంటే ఒంటి గంటన్నరకి వచ్చి ఆగింది సాల్స్ బర్గ్ ట్రైను.

కిటికీ దగ్గర సీటు దొరికింది జీవన్ కి. అతని పక్కనే యోగి. ఎదురుగా జార్జి ప్రసాద్, కాస్త దూరంగా చందర్రావు, గోవిందు కూర్చున్నారు.స్పీడందుకుంది రైలు. మైదానాల్లో దూరం దూరంగా ఇళ్ళు. ఏ ఇంటికీ కాంపౌండ్ వాల్ లేదు. చాలా ఇళ్ళ ముందు ఏపిల్ చెట్టున్నాయి. ప్రతీ చెట్టుకీ విరగ్గాసి ఉన్న ఏపిల్స్ ని చూస్తుంటే ఇంకా చూడ బుద్దేసింది. వాటిని చూసి చాలా ముచ్చటపడిపోయిన గోవిందు “మన ఇళ్ళ ముందు జామ చెట్లు లాగా ఏంటి ఏప్లీసు చెట్టు” అన్నాడు. కొన్ని చోట్ల రైలు ట్రాక్ పక్కన కేబేజీ పంట. కొన్ని లక్షల కేబేజీ పువ్వుల్ని ఒక చోట చూస్తున్న జీవన్ అలాంటి విజువల్ చూడ్డం ఫస్ట్ టైమ్ గాబట్టి అదోలాగయిపోయేడు. వెళ్తున్న రైల్లోంచి ప్రపంచ ఖ్యాతి పొందిన స్వరోస్కీ క్రిస్టల్ ఫ్యాక్టరీ కనిపించింది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
naa preyasini pattiste koti