కర్నాటక తీర్థయాత్రలు / విహారయాత్రలు - కర్రా నాగలక్ష్మి

karnataka teerdhayatralu

( శృంగేరి ) ఈ వారం మనం శృంగేరీ లో పర్యటిద్దాం , శృంగేరి అంటే తెలీని హిందువు వుండడనే నా అభిప్రాయం , వేదపాఠశాల అంటే ముందుగా శృంగేరీ వే జ్ఞాపకం వస్తుంది , మనదేశంలోనే కాదు విదేశాలలో కూడా మందిరాలలో పూజారులైనా , పౌరోహిత్యం చేసుకుంటున్నవారైనా శృంగేరీలోని వేదపాఠశాలలో చదువుకున్నవారే అయివుంటారు . ఆది శంకరాచార్యు స్థాపించిన శారదాపీఠం కూడా యిక్కడే వుందనీ మనకు తెలుసు . మిగతా వివరాలు యీ వారం తెలుసుకుందాం . శృంగేరీ కర్నాటకలోని ‘ చికమగళూరు ‘ జిల్లాలో పడమటి కనుమలలో ‘ తుంగ’ నదీ తీరాన వుంది . బెంళూరునుంచి 335 కిలోమీటర్ల దూరంలోనూ , ఉడిపికి సుమారు 85 కిలోమీటర్ల దూరంలోనూ వుంది . గవర్నమెంటు , ప్రైవేటు బస్సులు ప్రతీ అరగంటకీ వుంటాయి , అలాగే ధర్మస్థళ నుంచికూడా బస్సు సదుపాయం వుంది . అయితే మనకి తెలిసి ఆదిశంకరులు శారదాపీఠం స్థాపించడం వల్ల శృంగేరీ ప్రసిధ్ది పొందిందనుకుంటే తప్పే . శృంగేరీ పట్టణం వున్న పర్వతాన్ని ఋష్యశృంగగిరి మీద నిర్మింపబడింది . ఋష్యశృంగగిరి కాలాంతరాన శృంగేరిగా మారింది . ఋష్యశృంగ మహర్షిని గురించిన వివరణ మనకి వాల్మీకిరామాయణంలో వుంది , విభకంతన మహర్షి పుతృడు ఋష్యశృంగమహర్షి , అతను తపస్సుచేసుకున్న పర్వతమే ఋష్యశృంగగిరి గా పిలువబడసాగింది .

ఆది గురువు శంకరాచార్యులవారు పీఠాలను స్థాపించాలని సంకల్పించుకుని సరైన ప్రదేశం కొరకు దేశాటన చేసేరట , ఆసమయంలో భద్రానదీ తీరాన అతను ఓ వింతను చూసేరట , ఓ కప్ప వర్షంలో ప్రసవ వేదన పడుతూవుంటే నాగుపాము జాతివైరం మరచి కప్పకు తన పడగతో వర్షం నుంచి కాపాడుతూ వుందట , కప్పనిశ్చింతగా వుందట . అది చూసిన శంకరులు జాతివైరుల మధ్య యింత స్నేహభావం కలగడం అన్నది ఆ ప్రదేశం గొప్పతనమని గుర్తించి అక్కడ 12 సంవత్సరాలు గడిపి శారదా పీఠాన్ని స్థాపించి గురుకులం ప్రారంభించేరట . ఇక్కడే మొదటి సారి ఆదిశంకరులు తన శిష్యులకు అధ్వైతం గురించి బోధించేరట .

ఋష్యశృంగ మహర్షితపస్సువల్ల పుణ్య భూమిగా మారిన యీ ప్రదేశంలో శారదాపీఠంస్థాపించాలని ఆదిశంకరులు గంధంతో చెక్కబడిన శారదాంబ విగ్రహాన్ని ప్రతిష్టించేరట . శారదాపీఠం గురించిన మరో కథ కూడా చెప్తారు అదేమిటంటే శంకరులవారు దేశాటనచేస్తూ ఓ సారి తర్కశాస్త్ర చర్చలో పాల్గొన్నారట , శంకరుల ధాటికి యెవరూ ఆగలేకపోయేరట , ఆఖరుగా మండనమిశృనితో  ( ముండన మిశృడు ) చర్చ సాగుతుంది , యెవరు ఓడిపోతే వారు గెలిచినవారి కి దాసుడవాలనే షరతుకూడా వుంటుంది . మరునాడుతో చర్చముగింపుకి వస్తుంది అనగా శంకరులవారు ఆధిక్యంలో వుంటారు , మండనమిశృనకు ఓటమి తప్పదు అనే భావన కలుగుతుంది . కలత చెందిన మండనమిశృని పత్ని భారతి కారణం తెలుసుకొని మరునాడు రాజసభకు తానుకూడా వస్తానని చెప్తుంది . పత్నిమాట కాదనలేక మండనమిశృడు రాజసభకు తీసుకువెళతాడు . తర్కసమయంలో భారతి శంకరులను తనతో తర్కించవలసినదిగా కోరుతుంది . సరేనన్న శంకరులను అనేక రకాలైన ప్రశ్నలు వేయగా శంకరులుకూడా ధీటైన సమాధానాలు చెప్తారు . భారతివేసిన ఓ దాంపత్యపరమైన ప్రశ్నకు బ్రహ్మచారి అయిన శంకరుల వద్ద సమాధానం లేకపోవడంతో భారతివద్ద గడువు తీసుకొని పరకాయప్రవేశంచేసి ఓ రాజుగారి శరీరంలో ప్రవేశించి  రాణులతోకూడి భారతి ప్రశ్నకు సమాధానం తెలుసుకొని తిరిగి వచ్చి మండనమిశృని ఓడిస్తారు . షరతుప్రకారం మండనమిశృడు శంకరులను దాసునిగా అనుసరిస్తాడు . అప్పటికే శంకరులవారికి భారతి , మండనమిశృడు సరస్వతీ బ్రహ్మ అవతారాలనే జ్ఞానం కలుగుతుంది ? మండనమిశృని యెంతవారించినా అతను శంకరుల దాసునిగా తననుతాను అర్పించుకుంటాడు , మహాసాధ్వి యైన భారతి పతిని అడుగుజాడలలో వారిని అనుసరిస్తుంది . శంకరులవారు మొదటి పీఠాన్ని శారదాంబపీఠంగా భారతికి అంకితమిచ్చి తన ఉత్తరాధికారిగా మండనమిశృని నియమించి హిమాలయాలకి వెళ్లి కేదార్ నాధ్ లో కేదారునిలో యైక్యం అయిపోయేరు .

సుమారు 1338 లో విజయనగర రాజుల పరిపాలనలో అప్పటి పీఠాధిపతి పన్నెండవ శంకరాచార్యులైన విద్యాశంకరుల జ్ఞాపకార్ధం విద్యాశంకర శివలింగం స్థాపించి కోవెల కట్టించేరు . ఈ కోవెలలో విజయనగర , హోసల మొదలయిన శిల్పకళ కనిపిస్తుంది .    ఇక్కడ మరో చిన్నకధ చెప్పుకోవాలి విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహరరాయలు బుక్కరాయలు తురుష్క రాజులతో యుద్దాలు తరచర చెయ్యవలసివస్తూ వుండేది , హరిహరరాయలు బుక్కరాయలు విద్యాశంకరుల ఆశీస్సులు పొంది యుధ్దానికి వెళ్లి విజయంపొంది వస్తారు . విజయమైతే వరించిందిగాని సామ్రాజ్య స్థాపనకు కావలసిన ధనం లేకపోడంతో వారు తమ నిస్సహాయతను విద్యాశంకరుల వద్ద మొరపెట్టుకుంటారు , అప్పుడు విద్యాశంకరులు ఆది శంకర విరచితమైన ‘ కనకధారా స్తోస్త్రాన్ని  ‘ ఆలపించగా ఆదిశంకరులకు కురిసినట్లే బంగారు ఉసిరికాయలు ఆకాశం నుండి కురిసేయట , వాటిని హరిహరరాయలు , బుక్కరాయలకు యిచ్చి సామ్రాజ్య స్థాపన చెయ్యమని గురువులు ఆదేశించేరట . ఈ కోవెలలో శివలింగమే కాక బ్రహ్మ , విష్ణు , లక్ష్మి , సరస్వతి , పార్వతి , గణేశ , కార్తికేయ , దుర్గ , కాళి , బుద్దుడుని కలిపి దశావతారాల విగ్రహాలని చూడొచ్చు . ఇవి కాక యెన్నో పురాణ పాత్రల శిల్పాలు కూడావున్నాయి .

శారదాంబ మందిరం ——

ఆది శంకరులచే ప్రతిష్టించబడ్డ గంధం విగ్రహాన్ని తీసివేసి దాని స్థానంలో విద్యాశంకరులు బంగారు విగ్రహాన్ని ప్రతిష్టించేరు . విజయనగరరాజులు యీ పట్టణాన్ని విద్యానగరంగా కూడా పిలిచేవారు , మందిరానికి మరమ్మత్తులు , కొత్తకట్టడాలు కూడా చేసేరు .          2014 లో ఏడంతస్థుల గోపురనిర్మాణం చేసేరు . మందిరంలోకి నాలుగు వైపులనుంచి వెళ్లొచ్చు . గర్భగుడిలో బంగారు రధంమీద సరస్వతీదేవితో శారదాంబ ఆశీనురాలై వుంటుంది . ఈ మందిరం లో శైవ ( శివుడే మహదేవుడని నమ్మేవారు ) , వైష్ణవ ( విష్ణుమూర్తినే మహదేవుడని నమ్మేవారు ) , బ్రాహ్మ్య ( బ్రహ్మనే మహదేవుడని నమ్మేవారు ) , గణపత్య  ( వినాయకుడే మహదేవుడని నమ్మేవారు ), శక్త్య ( మహాదేవినే మహదేవుడని నమ్మేవారు ), సౌర ( సూర్యుని మహదేవుడని నమ్మేవారు ) లకు సంబంధించిన విగ్రహాలు చూడొచ్చు . శివలింగానికి దక్షిణం వైపున బ్రహ్మ సరస్వతి , పడమర వైపున శివపార్వతుల విగ్రహాలను చూడొచ్చు . గర్భగుడి చుట్టూరా ప్రదక్షిణ మంటపం , మహామంటపం వుంటాయు , చిన్న మందిరాలలో సప్తమాతృకలు , వినాయకుడు , భువనేశ్వరీదేవీలు కొలువై వుంటాయి . వేదపాఠశాల , గ్రంధాలయం , ఆదిశంకరుల మందిరం వుంటాయి . ప్రతీ రోజూ శారదాంబకి కుంకుమ పూజలు నిర్వహిస్తారు . శారద నవరాతృలు విశేష పూజలు చేస్తారు . అమ్మవారి విగ్రహం విగ్రహంలా వుండదు , అమ్మవారు స్వయంగా మనని అనుగ్రహించడానికి వచ్చినట్లుగా వుంటుంది . మందిరం చాలా పవిత్రంగా వుంటుంది . శృంగేరీలో వుండడానికి శారదాపీఠం వారి సత్రాలు వున్నాయి , అలాగే భోజన సౌకర్యం కూడా వుంది . సత్రం వీధిలో వున్న ఫలహారశాలలో కాఫీ టిఫిన్ లు యెంతో బావుంటాయి .

గ్రంధాలయం గురించి చెప్పుకోవాలంటే శారదాంబ మందిరం మొదటి అతంస్థులో వుంది , ఇక్కడ సుమారు 500 తాళపత్రగ్రంథాలు వున్నాయి , యెన్నో వ్రాతప్రతులు వున్నాయి , వేదాలకు సంబంధించిన యెన్నో గ్రంథాలు యిక్కడ వున్నాయి .ఇక్కడ శంకరాచార్య ఆశ్రమం , పార్కు , తుంగనది చూడదగ్గవే . ఇక ప్రకృతి సంగతా చెప్పక్కరలేదు . ఓ పక్క పచ్చని కొండలు , మరో పక్క తుంగనది , ప్రతి అణువణువునా వేదఘోష భూలోకంలో వున్నామా ? అనే అనుమానం వస్తుంది . ప్రతీ హింధువూ దర్శించవలసిన ప్రదేశం శృంగేరి అని మాత్రం చెప్పగలను . వచ్చేవారం మరో ప్రదేశం గురించి తెలియజేస్తానని మనవి తేసుకుంటూ శలవు .

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు