నలుగురు స్నేహితులు - పేట యుగంధర్

naluguru snehitulu
రాముడు, సోముడు, రంగడు, గంగడు నలుగురూ యువకులు, స్నేహితులు కూడానూ. అడవికి గొర్రెలను తోలుకెళ్ళి మేపేవారు. మధ్యాహ్నం వేళల్లో గొర్రెలు చెట్ల క్రింద సేదదీరేవి. ఆ సమయంలో స్నేహితులు నలుగురూ గోలీలాట, కర్రాబిళ్ల మొదలైన ఆటలు ఆడేవారు. ఊర్లో రచ్చబండ దగ్గర కొందరు సోమరులు పేకాట ఆడడం వారు తరచూ చూసేవారు. ఒక రోజు మధ్యాహ్నం విశ్రాంతి సమయంలో స్నేహితులు నలుగురూ కలుసుకొన్నారు. “ఈ రోజు మనం పేకాట ఆడుదాం.” అంటూ పేక ముక్కలు తీశాడు రంగడు.

“నీకు పేక ముక్కలు ఎక్కడివి?” అడిగాడు రాముడు. “మొన్న పచ్చికాపల్లం తిరణాలకు వెళ్లినప్పుడు అక్కడ కొన్నాను” చెప్పాడు రంగడు.
“పేకాట ఆడడం నాకు ఇష్టం లేదు. అది వ్యసనంతో సమానం. నేను గొర్రెలను అదుపు చేస్తూ ఉంటాను. మీరు ఆడుకోండి.” అంటూ వెళ్లిపోయాడు రాముడు. సోముడు, రంగడు, గంగడు ముగ్గురూ పేకాటలో కూర్చొన్నారు. కొద్దిసేపటి తర్వాత “ఉత్తినే ఆడితే మజా ఏముంటుంది!  ఎంతో కొంత  పందెం పెట్టి ఆడుదాం!” అని సూచించాడు రంగడు. “పేకాట ఆడడమే నేరం, డబ్బు పెట్టి ఆడడం మరింత పెద్ద  నేరం. కనుక డబ్బు పెట్టి ఆడడం నాకు ఇష్టం లేదు.” అంటూ కరాఖండీగా చెప్పాడు సోమడు.

“వాడికి ఓడిపోతాడనే భయం. అందుకే పందెం పెట్టి ఆడడానికి వాడు ఇష్టపడడం లేదు” అంటూ వెకిలిగా నవ్వాడు రంగడు. అతడికి వంత పాడాడు గంగడు. సోమడికి ఉక్రోషం వచ్చి, పందెం పెట్టి ఆడడానికి ఒప్పుకొన్నాడు. క్రమంగా ఆట సోమడి వైపు మళ్ళింది. అతడు ఆటపై ఆట గెలుస్తూ వచ్చాడు. రంగడి డబ్బులు, గంగడి డబ్బులు మొత్తం గెలుచుకొన్నాడు.

*****

సోముడు పందెంలో తమను ఓడించి, డబ్బులు గెలుచుకొనేసరికి రంగడికి, గంగడికి తలకొట్టేసినట్టు అనిపించింది. సోముడిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకొన్నారు. ఆ రోజు సాయంత్రం  వర్షం మొదలవడంతో రాముడు తన మందను ముందు వరుసలో తోలుకెళ్లిపోయాడు. వెనుక వస్తున్న సోముడిని అడ్డుకొని, “మా దగ్గర గెలుచుకొన్న డబ్బులు మాకు తిరిగి ఇచ్చేసెయ్!” అంటూ అడిగారు రంగడు, గంగడు. సోముడు బదులు చెప్పే లోపే అతని సంచీ లాక్కొని, అందులో ఉన్న కొద్దిపాటి డబ్బులు దాచేసి, అతడికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అతడ్ని కొట్టారు.

*****

మరుసటి రోజు మధ్యాహ్నం ఎప్పటిలాగే రాముడు, రంగడు, గంగడు కలుసుకొన్నారు గానీ, సోముడు రాలేదు.  “సోముడు ఎటు వెళ్ళాడు. రోజూలాగా మందతో మనదగ్గరకు రాలేదే?” అని అడిగాడు రాముడు.

“ఏమో మాకు తెలియదు.” చెప్పారు రంగడు, గంగడు.

“పేకాటలో నిన్న మీ దగ్గర అతడు గెలుచుకొన్న డబ్బుల్ని మీకు తిరిగి ఇవ్వమని నిన్న సాయంత్రం నాకు ఇచ్చాడు. ఉన్నట్టుండి వర్షం పడడంతో డబ్బు సంగతి మరచిపోయి మందతో వెళ్లిపోయాను. మీ డబ్బులు మీరు తీసుకోండి.” అంటూ డబ్బుల సంచిని రంగడు, గంగడు కి ఇచ్చాడు రాముడు.

*****

రంగడు, గంగడు ఆలోచనలో పడ్డారు. తాము తప్పు చేశామని అర్థం చేసుకొన్నారు. రాముడికి జరిగిందంతా చెప్పారు.  “మీరు చాలా పెద్ద తప్పు చేశారు. పందెం పెట్టి ఆడదానికి సోముడు మొదట్లో ఒప్పుకోలేదు. మీరే అతడ్ని పందెం పెట్టి ఆడడానికి ఒప్పించారు. అదృష్టం  కొద్దీ అతడు మీపై గెలిస్తే, దాన్ని అవమానంగా భావించి , వాడిపై కోపం పెంచుకొన్నారు. కానీ వాడు మీలా ఆలోచించలేదు. కష్టపడకుండా ఉత్తినే వచ్చిన డబ్బులు వద్దనుకొన్నాడు. స్నేహ ధర్మాన్ని పాటించి, మీరు బాధపడకూడదని, నష్టపోకూడదని చెప్పి, మీ డబ్బులు మీకు ఇవ్వమని నాదగ్గర ఇచ్చాడు. ఇవేవీ తెలుసుకోకుండా మీరు వాడ్ని గాయపరిచారు.” అని రంగడికి, గంగడికి హితబోధ చేశాడు రాముడు.

రాముడిని వెంటబెట్టుకొని సోముడి దగ్గరకు వెళ్లారు రంగడు, గంగడు. చేసిన తప్పుకు తమను క్షమించాల్సిందిగా సోముడిని కోరారు. స్నేహితుల్లో వచ్చిన మార్పుకు రాముడు, సోముడు ఇద్దరూ సంతోషపడ్డారు. ఇకపై పేకాట, జూదం లాంటి ఆటలకు దూరంగా ఉండాలని, పందెం పెట్టి అస్సలు ఏ ఆట ఆడకూడదని, అలాంటి వాటి వల్ల ఆర్ధిక నష్టంతో పాటు, మానసిక అశాంతి కలుగుతుందని, స్నేహితులు విరోధులుగా మారే అవకాశం ఉందని తెలుసుకొన్నారు. నలుగురూ కలిసి మెలిసి ఐకమత్యంగా ఉండాలని నిర్ణయించుకొన్నారు.

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు