పుస్తకసమీక్ష - సిరాశ్రీ

book review
గ్రంథ సమీక్ష: నాలో నీలో గజల్ శ్రీనివాస్
సమీక్షకులు: సిరాశ్రీ
రచన: డాక్టర్ ఎస్. ఆర్. ఎస్. కొల్లూరి 
వెల: రూ 60/-
ప్రతులకు: గజల్ చారిటబుల్ ట్రస్ట్, ఏ-2, కబీర్ నివాస్, ఆనంద్ నగర్, హైదరాబాద్-4
రచయిత దూరవాణి: 9247272066

ఒక మనిషిని మరో మనిషి ఇష్టపడడానికి అనేక కారణాలుంటాయి. కారణాలు పక్కన పెడితే ఆ ఇష్టం ఎంత వరకైనా ఉండే ఆస్కారం ఉంది.  రోజూ ఫోన్ చేసి మాట్లాడాలని అనిపించేటంత, రోజూ కలవాలి అనిపించేటంత, నలుగురికి ఆ వ్యక్తి గురించే చెప్పేటంత, ఆ వ్యక్తి గురించే ఆలోచించేటంత...అన్నీ దాటుకుని ఆ వ్యక్తి గురించి ఒక కవితాసంపుటి వెలువరించేటంత. డాక్టర్ ఎస్.ఆర్.ఎస్. కొల్లూరి గారు చేసిందదే. "నాలో నీలో గజల్ శ్రీనివాస్" అంటూ ఒక నానీల సంపుటి వ్రాసేసారు తను అభిమానించే వ్యక్తిమీద. 

"నాలో గజల్ శ్రీనివాస్" అనకుండా, "నాలో నీలో గజల్ శ్రీనివాస్" అని నామరకరణం చేసారు ఈ గ్రంథానికి. ఎందుకంటే ఇవి "నానీ"లు కనుక. నానీల సృష్టికర్త ఆచార్య ఎన్ గోపి నానీలను "నావీ, నీవీ, వెరసి మనవి" అని లక్షణం చెప్పారు కనుక. 

నిజానికి "సమాకాలికులెవ్వరు మెచ్చరు" అనే నానుడికి భిన్నంగా సాగుతూ, ఆ స్థాయిని దాటిపోయి వెళ్తోంది శ్రీనివాస్ గారి ప్రస్థానం. ఒక వ్యక్తిలోని గొప్పతనాన్ని ఒప్పుకోవడానికి, ఒప్పుకున్నా నలుగురిలోనూ చెప్పడానికి సన్నిహుతులైనా చిన్నతనంగా భావిస్తుంటారు చాలామంది. నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. భూమి పుట్టాక, ఇన్ని యుగాలు గడిచాక ప్రపంచంలో 125 భాషలు పలికిన ఏకైక నాలుక గజల్ శ్రీనివాస్ గారిది. ఆయన మన తెలుగు వాడు, మన భారతీయుడు, మన సమకాలికుడు అని చెప్పుకోవడంలో ఒక దర్పంతో కూడిన సంత్రుప్తి ఉంటుంది. ఇలా ఒక్క విషయం కాదు. అనేక విషయాలు ఉన్నాయి డాక్టర్ గజల్ శ్రీనివాస్ గురించి చెప్పాలంటే. వాటన్నిటినీ దర్శించి స్ఫూర్తి పొందారు కనుకనే డా| కొల్లూరి గారు ఈ గ్రంథాన్ని తీసుకురాగలిగారు. 

ఇక పుస్తకంలోకి వెడితే--నానీలుగా వ్రాయాలన్న ఆలోచనే సగం మార్కులు వేయించేసుకుంది. ఎందుకంటే హైకూలోకంటే హాయిగా ఉండే క్లుప్తత నానీల్లో కనిపిస్తుంది. 

ఎటువంటి గజిబిజి ఛందోనియమాలూ లేకుండా 20-25 అక్షరాల్లో హత్తుకునేలా ఒక భావాన్ని చెప్పడం నానీలోనీ లక్షణం. చాలా సులభంగా ఉంటుంది వ్రాయడానికి, భావం స్ఫురించాలె కాని. తెలుగు కవిత్వం మనుగడని మరో వెయ్యేళ్లు ముందుకు నడిపించే శక్తి ఈ నానీకి ఉంది. 

ఈ గ్రంథంలోని కొన్ని నానీలను ప్రస్తావిస్తాను. 
శ్రీనివాస్ గారంటే గజల్:

"ముఖం చూడాలోపాట వినాలో
తెలియని అయోమయం
అదో అదృష్ట యోగం"

శ్రీనివాస్ గారంటే గాంధీయిజం:
"ఆత్మాభిమానానికి 
కీర్తికిరీటం
బాపూజీ చేతికర్రలా"

శ్రీనివాస్ గారంటే అమ్మప్రేమ:
"అమ్మ పుట్టినరోజు
ఆయనకి తీర్ధం
వారి పుట్టినరోజు
మాకు పుషకరం"

శ్రీనివాస్ గారంటే సినారె మానసపుత్రుడు:
"సినారె కి 
పుత్రోత్సాహాన్ని
రుచి చూపిన
మానసపుత్రుడు"

 
శ్రీనివాస్ గారంటే సేవ్ టెంపుల్స్:
"గజల్, గంగ,
గోవు, గోపురం
రక్షణే ధ్యేయం
గ కారమే ప్రణవమా"

శ్రీనివాస్ గారంటే అమెరికా తెలుగు సంబరాలు:
"తానా ఆటా
ఎప్పుడూ తపిస్తూ ఉంటాయి
ఈయన 
పాటా మాటా కోసం"
 
శ్రీనివాస్ గారంటే సమాజ శ్రేయస్సు:
"లక్షలు వస్తుంటే
కోట్లు దానం చేసాతారేంటి?
ఆయన
విశ్వప్రేమికుడు"

శ్రీనివాస్ గారంటే సొంత ఊరు:
"పండుగరోజు
ఆయన చిరునామా
పాలకొల్లు
పునాదికి మ్రొక్కడానికి"

శ్రీనివాస్ గారంటే దేశభక్తి :
"గుండె నిండా ఎగిరే
జాతీయజెండా
వివేకానందం
ఎజండా"

శ్రీనివాస్ గారంటే వ్యక్తిత్వవికాసం:
"వ్యక్తిత్వ వికాసంలో
శిక్షణా?
మూడు గంటలు
గజల్ బడిలో చేర్చు"

శ్రీనివాస్ గారంటే సందేశం:
"సందేశానికి 
నాలుగో కోతి
అవసరమట
చెడు చెయ్యకు"

శ్రీనివాస్ గారంటే లోకబంధువు:
"తాలిబన్లు,
గాంధీ ఫ్యాన్స్
గజల్ మాస్ట్రో
సినిమాను చూసి ఉంటారు"

ఇలా చెప్పుకుంటూ పోతే ఈ నానీశతకం మొత్తం ఇక్కడే చదివేయల్సి వస్తుంది. సమీక్ష అంటే రుచి గురించి చెప్పి వదిలేయాలి కనుక ఇక్కడితో ఆపుతున్నాను. మళ్లీ చెప్పుకుంటే, ఈ పుస్తకంలోని నానీలన్నీ ఒక వ్యక్తి మరో వ్యవస్థలాంటి వ్యక్తి గురించి వ్రాసినవే. ఒక వ్యక్తి బహుముఖీన శక్తిగా ఎలా ఎదగొచ్చో తెలుస్తుంది ఇది చదివితే. ఒకరకంగా ఇది వ్యక్తిత్వ వికాసగ్రంథం కూడా. 

మెచ్చుకోవాల్సినవాళ్లని మెచ్చుకోవడం, పూజనీయుల్ని పూజించడం మన జాతి సంస్కృతి. మన సంప్రదాయం. అన్ని అర్హతలు ఉన్న గజల్ శ్రీనివాస్ గారిని ఉద్దేశించి ఇలా పుస్తకం రావడం ఇది మొదటి సారి కాదు. ఇక్కడితో ఆగేదీ కాదు..ఇంకా వస్తాయి. అనేక రూపాల్లో. అనేక భాషల్లో.

ఇంత చెప్పాక నాకూ ఒక 'నానీ' చెప్పాలని ఉంది. 

"అశాంతి నిప్పులు ఆరిపోనీ 
నానీల వర్షంలో 
నాని నాని" 
 
-సిరాశ్రీ 

మరిన్ని సమీక్షలు

వలపు తెచ్చిన తంటా..!!     కదా సమీక్ష
వలపు తెచ్చిన తంటా..!! కదా సమీక్ష
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్, సఫిల్ గూడ
దాపటెద్దు
దాపటెద్దు
- భైతి తార
Gunde Chappudu
గుండె చప్పుడు - మినీ కవితలు
- కొట్టె సుధాకర్ రెడ్డి
kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు
సిక్కోలు కధలు  రచయిత డా:గుజ్జు చెన్నారెడ్డి
సిక్కోలు కధలు రచయిత డా:గుజ్జు చెన్నారెడ్డి
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు
రామబాణం (పిల్లల కథలు
రామబాణం (పిల్లల కథలు
- చెన్నూరి సుదర్శన్
Gorantha Anubhavam - Kondantha Samacharam
గోరంత అనుభవం - కొండంత సమాచారం
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్