పిల్లికి చెలగాటం - పోడూరి వెంకట రమణ శర్మ

pilliki chelagaatam

ఆదివారం. ఇంగ్లీష్ పేపర్, తెలుగు పేపర్ అన్ని పేజీలు చదివేసి పక్కన పెట్టి లాప్ టాప్ తెరుద్దామని అనుకుంటుండగా కాలింగ్ బెల్ మోగింది.
ఎవరా అనుకుంటూ లేచి తలుపు తీశాను. ఎదురుగా లక్ష్మి ఆంటీ. లక్ష్మి ఆంటీ అంటే మరీ పెద్దావిడ ఏమీ కాదు, మా ఆవిడ కంటే అయిదారు ఏళ్ళు పెద్దేమో అంతే. మా ఫ్లాట్స్ కాంప్లెక్ లో మా ఆవిడకి ఉన్న చాలా మంది ముఖ్య స్నేహితులలో ఒకరు. ఆవిడ వచ్చిందంటే కనీసం ఇద్దరూ ఒక గంట మా బెడ్ రూమ్ లో లాక్ ఇన్ అవుతారు. ఆవిడ వస్తే నాకు ఎప్పుడూ ఆనందమే. ఎందుకంటే ఆవిడ రాగానే మా ఆవిడ, ఆవిడ కి ఇష్టమయిన ఫిల్టర్ కాఫీ ఇస్తుంది ఆవిడకి. ఆవిడతో పాటు మనకీ ఇస్తుంది. రోజూ తాగే కప్పులలో అది లెక్క ఉండదు కాబట్టి మనకి అది బోనస్.

అందుచేతే తలుపు వేసి లాప్ టాప్ దగ్గరికి వచ్చి, కాఫీ కోసం ఎదురు చూస్తూ మెయిల్స్ చూస్తున్నాను. తెలియకుండానే ఇరవై నిమిషాలు అయింది. కాఫీ రాలేదు సరి కదా ఇద్దరూ సడన్ గా మా బెడ్ రూమ్ లోంచి వచ్చారు. మా ఆవిడ బయటికి వెళ్ళడానికి తయారయి వచ్చింది.
వస్తూనే, "మీరు కూడా రండి, లక్ష్మీ ఆంటీ ఏవో చీరలు కొనాలిట. కారులో తీసుకు వెళ్ళాలి మీరు" అంది నిర్ణయం అయిపోయినట్టు.
నా గత అనుభవం బట్టి "ఎందుకు ఉబర్ లోనో, ఓలాలోనో వెళ్ళ వచ్చు కదా, లేదా మెట్రో లో హాయిగా ఉంటుంది కదా?" అని మనం అంటే, అవన్నీ ఏ కారణం చేత ఎలిమినేట్ చేసి కారులో వెళ్ళడానికి నిశ్చయించిందో ఒక్క నిమిషం లో చెప్పేస్తుంది. ఇంక మన దగ్గర దానికి ఆర్గ్యుమెంట్ ఉండదు. అందు చేత మాట్లాడకుండా బట్టలు వేసుకుని కారు తీయడమే తక్షణ కర్తవ్యమ్ అని లేచాను.

"అదేమిటి ఆవిడకి కాఫీ ఇవ్వవా?" అన్నాను దానికి కూడా సమాధానము ఉంటుందని తెలిసినా. "బయట తాగుదాము లెండి. ఆవిడ తొందర పడుతున్నారు, మీరు పర్సు మరిచి పోకండి" అంది నేను బట్టలు వేసుకోవడానికి లోపలి వెడుతోంటే. నాకు ముందే తెలుసు, బట్టలు కొనడం లక్ష్మి ఆంటీ ప్రోగ్రామ్ అయినా, తీరా అక్కడికి వెళ్లిన తరువాత, చాలా అవసరాలు గుర్తుకు వచ్చి ఈవిడ కూడా రెండో మూడో కొనడం మామూలే. ఆ అవసరాలు ఎలా ఉంటాయంటే, "మొన్న మీ చెల్లెలు గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు ఫలానా చీర పెట్టిందా?. వచ్చే నెల కొడుకు రామాన్ని కాలేజీ లో చేర్చడానికి వస్తోంది. వెళ్ళేటప్పుడు చీర పెట్టక పోతే బాగుంటుందా?" అంటుంది

ఆవిడ చీరలు కొనుక్కోవడం, లేదా ఎవరికయినా పెట్టడం చాలా సంతోషంగా చేసే పనులు. వాటికి నా అభ్యంతరం ఎప్పుడూ ఉండదు. కానీ చిక్కు వేరే చోట ఉంది. ముందు ముందు తెలుస్తుంది వెనక సీట్లో వాళ్లిద్దరూ కొత్తగా వచ్చిన చీరల మోడల్స్ గురించి చర్చ లో పడ్డారు.
నేను డ్రైవ్ చేస్తున్నానన్న మాటే కానీ నా ఆలోచనలు మా ఆవిడకి చీరలు నగలు మీద ఉన్న ఆసక్తి మీదకి పోయాయి. నేను ప్రొద్దుటే ఎన్నిదిన్నర కి సిఎన్ బి సి బిజినెస్ ఛానల్ ఆన్ చేస్తాను. తొమ్మిదిన్నర దాకా షేర్ల మీద డిస్కషన్ వింటూ ఉంటాను. నేను ఆన్ చేయగానే, మా ఆవిడ కూడా వంట ఇంట్లోంచి వచ్చి ఒక అయిదు నిమిషాలు చూసి వెడుతుంది. ఆవిడకి కూడా స్టాక్ మార్కెట్ ఆసక్తి ఉందని మీరనుకుంటే పొరపడ్డారన్న మాటే. ఆ ఛానల్ లో రోజూ ప్రొద్దుటే ఒకావిడ చర్చ ప్రారంభిస్తుంది. ఆవిడా చిత్ర రామనాధన్. ఆవిడ రోజుకొక రకంగా తయారయిన వస్తుంది. మా ఆవిడ ఇంటరెస్ట్ ఏమిటంటే, ఆవిడ ఇవాళ ఏమి చీర కట్టుకుంది? ఎలా కట్టుకుంది? అది ఎలాంటి చీర? బోర్డర్ ఎలాంటిది ఇవన్నీ అబ్సర్వ్ చేసి ఒక కామెంట్ చేసి వెళ్లి పోతుంది. స్టాక్ మార్కెట్ అప్ లో ఉందా డౌన్ లో ఉందా అని అడగదు. ఆ విషయం నా ముఖం చూసి చెప్పేస్తానంటుంది.

"కొందునా బ్రదర్స్" దగ్గర ఆగి, కారు వాలెట్ పార్కింగ్ కి ఇచ్చి లోపలి ప్రవేశించాము. షోరూం లో ఏమి చీరలు పెట్టారు? ఏ కౌంటర్ దగ్గర ఏ రకాల చీరలు చూపిస్తున్నారు మొదలయినవన్నీ చూసుకుంటూ, వాళ్ళు ముందే నిర్ణయించుకున్న చీరలు కౌంటర్ ఎక్కడుందో కనుక్కుని ఆక్కడికి మెల్లిగా చేరుకున్నారు.. వాళ్ళని అనుసరించి, అదే కౌంటర్ దగ్గర కొంచెం పక్కగా ఉన్న కుర్చీలో కూలబడ్డాను. కుర్చీలో కూర్చోబోతూ కౌంటర్లో ఉన్న సేల్స్ మన్ ని చూశాను. ముప్పై కి నలభై కి మధ్య ఉంటాయి. కొంచెం మాసిన గెడ్డం. షాపులో, బ్యాంకుల్లో పెట్టినట్టు టీవీ లు కూడా పెట్టారు అన్ని చోట్లా. ఎందుకో మేము ఉన్న కౌంటర్ కి ఎదురుగ ఉన్న టీవీ స్క్రీన్ మీద స్ట్రీమ్ అవుతున్న వీడియో క్లిప్పింగ్ మీద పడింది నా దృష్టి . ఒక లేడి అటూ ఇటూ చూస్తోంది. దగ్గరలోనే వేట కోసం మెల్లి మెల్లి గా తన వైపు అడుగులు వేస్తున్న రెండు పులుల్ని అది ఇంకా గమనించ లేదు.

మా ఆవిడా, లక్ష్మి ఆంటీ సడన్ గా ఎదురుగా వచ్చి నుంచుంటే చిన్నగా నవ్వి ' ఏమి చూపించమంటారండీ" అన్నాడు సేల్స్ మాన్.
చిరునవ్వు ఎక్కువ సేపు ఉండదు అనుకున్నాను నేను మనసులో. "కాటన్ లో లేటెస్ట్ ఏమి వచ్చాయో చూపించండి. అంది లక్ష్మీ ఆంటీ"
"అలాగేనండి" అని. గబా గబా నాలుగు చీరలు తీసి వాళ్ళ ముందు పరిచాడు వివరాలు చెబుతూ "అలా అతను చీరలు విడదీసి పరుస్తోంటే, నాకు ఒకటే బాధ, పాపం మళ్ళీ అవన్నీ అతను మళ్ళీ మడత పెట్టుకోవాలి కదా!

చాలా మంది పెళ్లికొడుకులు మొట్ట మొదటి పెళ్లి చూపులలో చూసిన అమ్మాయిని ఓకే చేయరు. (మొదటి అమ్మాయి ఏ నయనతారో అయితే తప్ప). ఎందుకంటే ఇంతకంటే అందమయిన అమ్మాయిని మిస్ అవుతామేమొ అన్న ఆశ అదే పరిస్థితి ఇక్కడ. మొదట పరిచిన చీరల లోంచి ఎంచుకోవడం ప్రశ్నే లేదు. వాటి కేసి పూర్తిగా చూడకుండానే 'బెంగాల్ కాటన్ లేటెస్ట్ ఏమన్నా ఉన్నాయా ?' అడిగింది లక్ష్మి ఆంటీ.
అతను ఇంకో నాలుగు పరిచాడు. వాటికేసి ఒక మాటు చూసి, పక్క కౌంటర్ లో ఎవరికో అక్కడ సేల్స్ మన్ చూపిస్తున్న చీరలు చూశారు.
"ఆ చీరలు ఏమిటి? " అంది మా ఆవిడ. వాళ్ళు ఏవో మంచివి కొనేస్తున్నారేమోనని ఫీలింగ్ అనుకుంటా. "అవి కోయింబత్తూర్ కాటన్ అండి" అని మళ్ళీ ఇంకో నాలుగు విప్పి వీళ్ళ ముందు పరిచాడు. అతను అలా విప్పేస్తోంటే నాకు ఒకటే బాధ. ఒకవేళ వీళ్ళు ఏ చీర కొనక పోతే అవన్నీ అతను ఎంత నిరుత్సాహంతో మళ్ళీ మడతలు పెట్టుకోవాలా అని. ఎన్ని చూసినా వీళ్ళ ముఖాలలో మార్పు లేదు. అతను వెనక్కి తిరిగి రేక్ లో పైన వున్నవి ఏవో తీస్తున్నాడు. "చూశావా? మొదటే మనం సెలెక్ట్ చేస్తే, లేటెస్ట్ మోడల్స్ బయటికి తీయరు. ముందు పాత స్టాకు వదుల్చు కుంటారు:" లక్ష్మీ ఆంటీ మా ఆవిడకి చెప్పింది నా చెవిలో కూడా పడింది. ఏవో నాలుగు రకాలు తీసి విప్పి చూపుతూ అతను అన్నాడు ' ఇవి శ్రీమంతుడు ' చీరలండి, ఇవి జనతా గేరేజ్ అండి , ఇవి మహర్షి అండి అంటూ సినిమాల పేర్లు చెబుతూ విప్పి చూపిస్తున్నాడు.

"ఆ సినిమాలలో హీరోయిన్లు వాడారా చీరలు" అడిగింది అమాయకంగా మా ఆవిడ. "శ్రీమంతుడు లో హీరోయిన్ అసలు చీర కట్టలేదేమో?" అంది లక్ష్మి ఆంటీ. తన సినిమా విజ్ఙానాన్ని విప్పుతూ.

"హీరో తల్లి కట్టుకుందనుకుంటానండి" అన్నాడు ఆ అమాయకుడు ఏమి చెప్పాలో తెలియక.

"అవునూ, పెద్ద పట్టు చీరలు ఆ హీరోయిన్లు కట్టుకున్న తరువాత, మళ్ళీ మీ షాపులకు వచ్చేస్తాయట కదా? అంది లక్ష్మీ ఆంటీ అతనితో.

"అలా ఏమి ఉండదండి. చాలా మంది షూటింగ్ అయిన తరువాత ఆ చీరల తోటే ఇంటికి వెళ్లి పోయి తిరిగి ఇవ్వరండి" ఎదో తనకి తోచింది ఊహించి చెప్పాడు."అవును అదీ నిజమేనేమో. మొన్న మా అయన చెబుతున్నారు. అదెవరో హీరో పెద్ద పెద్ద బూట్లూ, కవచాలూ షూటింగ్
లో వాడినవి ఇంటికి పట్టుకు పోయి, అదే నిర్మాతకి ఇంకో సినిమాకి అవి కావలిస్తే, వాటినే ఆ హీరో వాటిని అద్దెకి ఇచ్చాడట" అంది లక్ష్మీ ఆంటీ నవ్వుతూ.ఆ తర్వాత ఇంకో ముప్పై చీరల దాకా చూశారు వాళ్ళు. ఏదీ సెలెక్ట్ చేయలేదు. ఎందుకో నా దృష్టి పైన టీవీ స్క్రీన్ మీద పడింది. రెండు పులులూ జింకని పట్టేశాయి, జింక ఆర్తనాదాలు చేస్తోంది.

"అన్నింటిలోంచి రెండు సెలెక్ట్ చేసి, " ఈ రెండూ చాలా బాగుంటాయండి. గతంలో కొన్నవాళ్ళు మళ్ళీ అడిగితే, ఈ మధ్యనే మళ్ళీ తెప్పించామండి. పేక్ చేయించ మంటారా ?" అన్నాడు ఆర్తిగా .

మా ఆవిడా, లక్ష్మీ ఆంటీ ఎదో మెల్లిగా మాట్లాడుకున్నారు. కళామందిర్ అన్న మాట వినపడింది నాకు. అది అక్కడికి చాలా దూరం. నన్ను లాకువచ్చిన కారణం అప్పటికి అర్థ మయింది .

ఇద్దరూ "మళ్ళీ వస్తామండి" అని లేచారు. ఆ సేల్స్ మన్ ముఖం లో కనిపించిన నిరుత్సాహం నా మనసు పిండేసింది.

నేను లేచి అతని దగ్గరికి వెళ్లి "మీరు తీసిన ఆ రెండు చీరలూ పేక్ చేయించండి. " అన్నాను . అతను ముఖం ఒక్క మాటు వికసించింది. నాకు ఆ చీరల ఖరీదు కంటే అంతని ముఖంలో నవ్వు ఎక్కువ విలువ అనిపించింది. బిల్లు చెల్లించి చీరల పాకెట్ పట్టుకుని కారు దగ్గరికి వచ్చి కారెక్కాము.

"మా ఆవిడ అప్పటి దాకా ఉగ్గబట్టుకుని "అదేమిటి అలా రెండు చీరలూ ఏమీ చూడకుండా తీసేసుకున్నారు ?" అంది కారులో వెనక నుంచి.

"అన్ని వందల చీరలలో ఒక్కటీ మీకు నచ్చలేదా? ఒక్కటీ అమ్మలేక పోయినందుకు మనసులో ఏడుస్తూ ఆ చీరలన్నీ అతను ఎలా మడత పెట్టుకుంటాడో ఒక్క మాటయినా ఊహించారా?" అన్నాను, నా భావాలు పైకి చెప్పి.

"బాగుంది చూసినదల్లా కొనేయాలని ఎక్కడుంది? అయినా ఆ షాపువాడు కోట్లు సంపాదిస్తున్నాడు. మీకెందుకు బాధ?"

"షాపువాడి కోట్ల గురించి ఆలోచించిన దానివి, కొద్ది జీతానికి అంత శ్రమ పడుతూ, చీరలు అమ్మితేనే లభించే కొద్దీ పాటి బోనస్ అయినా దొరకని అతని గురించి ఆలోచించావా ?" అన్నాను వాళ్ళు మిస్ అయిన కోణం ఎత్తి చూపుతూ

"అయినా ఇప్పుడు ఆ రెండు చీరలూ ఏమి చేస్తారు ?"

" ఏమి చేస్తానో ఇంటికి వెళ్లిన తరువాత చెబుతాను" అన్నాను డ్రైవింగ్ చేస్తూ. నా మూడ్ చూసి 'కళా మందిర్' డ్రాప్
చేసుకున్నారనుకుంటా. వాళ్ళు ఇంక ఏమీ మాట్లాడకపోతే నేను ఇంటికి పోనిచ్చాను.

ఇంటికి వచ్చిన తరువాత, లక్ష్మి ఆంటీకి, నాకూ కాఫీ ఇచ్చి, తను కూడా తెచ్చుకుని" ఇప్పుడు చెప్పండి . ఆ చీరలు ఏమి చేస్తారు?" అంది మా ఆవిడ "రేపు దీపావళికి నువ్వు మన పనిమనిషి సీతాలుకి, ఆవిడ వాళ్ళ పనిమనిషి మాచమ్మ కి చీరలు ఇవ్వాలి కదా? "అన్నాను అర్థ మైందా" అన్నట్టు .

"మీరు తెచ్చిన చీరలు వాళ్ళకి నచ్చుటయేమిటి? " అని మా విడ కొంచెం ఉక్రోషంగా.

"నేను చెప్పినట్టు మీరు చేస్తే వాళ్ళు ఆనందంగా తీసుకుంటారు" అన్నాను నవ్వుతూ.

"ఏమి చేయాలి" అన్నారు ఇద్దరూ ఒకే మాటు నేను మా ఆవిడతో అన్నాను "నువ్వు రేపు సీతాలు వచ్చినప్పుడు రెండు చీరలూ చూపించి, ఎర్రంచు చీరని తీసుకోమని చెప్పు. ఆలా చెబుతూ నీలం అంచు చీర మాచమ్మ ముందే సెలెక్ట్ చేసుకుందని చెప్పు.. అప్పుడు సీతాలు నిరుత్సాహ పడి తనకి కూడా ఎర్ర అంచు అయితే బాగుండునని అంటుంది. అప్పుడు నువ్వు, మాచమ్మకి చెప్పి చూస్తానని చెప్పి. అప్పటికి ఊరుకో. నువ్వు ఎలా చెప్పావో సరిగ్గా అలాగే రెండు చీరలూ చూపించి మాచమ్మతో లక్ష్మీ ఆంటీని చెప్పమను. అంటే మాచమ్మని నీలం అంచుది తీసుకోమని చెబుతూ, ఎర్రది సీతాలు ఎంచుకుందని చెప్పాలి. అప్పుడు మాచమ్మ ఎర్రది అయితే బాగుండునేమో అంటుంది.. సీతాలుకి నచ్చ చెబుతానని అప్పటికి చెప్పమను. మరునాడు నీలం చీర సీతాలుకీ, ఎర్ర చీర మాచమ్మకీ ఇచ్చేయండి. ఇద్దరూ హాపీ " అన్నాను ప్లాన్ అర్థమైందా అన్నట్టు.

" పొత్తం అంతా విని నాకేసి అదోలా చూసి. "సరే అలాగే చేద్దాం, వాళ్ళు తీసుకోక పోతే మళ్ళీ మీరే కొనాలి వాళ్లకి" అన్నారు.ఓ అలాగే అన్నాను మనస్తత్వ శాస్త్రం ఇచ్చిన ధైర్యంతో.

మరిన్ని కథలు

Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల