ఇరుగు - పొరుగు - కృష్ణ చైతన్య

irugu porugu

ఆ రోజు ఆదివారం కావడంతో ఆ ఇల్లు నిశబ్దంగా ఉంది. రోజూ బబ్లూ స్కూలు, భర్త కిరణ్ ఆఫీస్ అంటూ కాళ్ళకు చక్రాలు కట్టుకు తిరిగే ఇల్లాలు శారద కు ప్రశాంతంగా ఉంది. తన భర్త కిరణ్ ఆదివారం భార్యను ఏ పనీ చెయ్యనివ్వడు, ఆదివారం ఆడవాళ్లకు సెలవు అంటూ ప్రొద్దున కాఫీ దగ్గర నుంచి రాత్రి బబ్లూ గాడి బూస్ట్ వరకు అన్నీ కిరణ్ చూసుకుంటాడు. అన్యోన్య దాంపత్యం వారిది, పెళ్ళి అయ్యి నాలుగేళ్ళు అయ్యింది, ఒక్క గొడవ లేదు, విరుపులు లేవు. బయట ఆటో శబ్దం వచ్చింది, కిరణ్ అమ్మా, నాన్న రామదాసు, నాగేశ్వరి లు వచ్చారు ఊరి నుంచి. వాళ్ళని చూడగానే ఆటో దగ్గరికి వెళ్ళి, లగేజీ తీసుకుంది చేతిలోకి.

శారద - బాగున్నారా మామయ్యా, అత్తయ్యా??

నాగేశ్వరి - ఏం బాగలేక మీ ఇంటికి వచ్చా అనుకున్నావా?

రామదాసు - నేను బాగున్నారా తల్లీ...నువ్వే కొంచెం చిక్కినట్టు ఉన్నావు. అవును ఇప్పుడు అత్తయ్య చేతికి చిక్కి పోయాను మనసులో అనుకుంటూ లోపలికి ఆహ్వానించింది ఇద్దరినీ. లోపలికి రాగానే బబ్లూ తాత దగ్గరికి వచ్చి చుట్టుకుపోయాడు.కిరణ్ - నాన్నా బబ్లూ, తాతయ్య ఇప్పుడే వచ్చారు కదా, అలసిపోయి ఉంటారు, పక్కకి రా....

రామదాసు - ఒరేయ్ కిరణ్, నేను వచ్చిందే వీడి కోసం రా. ఉద్యోగం ఎలా ఉంది రా, ఏమైనా డబ్బులు వెనక వేస్తున్నావా? వచ్చింది వచ్చినట్టు ఖర్చు చేస్తున్నావా? శారద - లేదు మామయ్యా....వచ్చిన జీతం లో 20% సేవింగ్స్ చేస్తున్నా.నాగేశ్వరి - అయినా మనకు ఎందుకండీ, వాడు ఏం చేసుకుంటే మనకు ఎందుకు. నాగేశ్వరికి తన కొడుకు శారద ను ప్రేమించి పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు, కట్నం పోయిందని బాధ, అదే కిరణ్ తండ్రి, నా ఇంటికి కట్నం తీసుకువచ్చే కోడలు కన్నా మంచి గుణాలు తీసుకువచ్చే కోడలు కావాలని కిరణ్ కు సపోర్ట్ ఇచ్చాడు. అప్పటినుంచి కోడలు తో మాట్లాడడం లేదు నాగేశ్వరి. పేరుకే మాట్లాడడం లేదు కానీ, మంచి మనిషి, రామదాసు కూడా తనే మారుతుంది లే అని ఊరికే ఉన్నాడు.

శారద అందరికీ కాఫీ లు తెచ్చి ఇచ్చింది. బబ్లూ కి బూస్ట్ కోసం లోపలికి వెళ్ళింది. శారద లోపలికి వెళ్ళిన ఓ నిమిషానికి డాం అన్న శబ్దం, మొత్తం పొగ, కొద్దిగా మంటలు. చేతిలో ఉన్న కాఫీ గ్లాసు పడేసి వంట గది లోకి పరిగెత్తారు కిరణ్, రామదాసు ఇద్దరూ. సొమ్మసిల్లి ఉన్న శారద ను బయటకి తీసుకొచ్చాడు కిరణ్, స్పృహ లో లేదు, కొద్దిగా కాలిన గాయాలు, ఏడుస్తూనే అంబులెన్స్ కు ఫోన్ చేసాడు కిరణ్. "ఒరేయ్ కిరణ్, అంబులెన్స్ కోసం ఎదురు చూడకు, వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్ళు, నేను ఇక్కడే ఉండి ఫైర్ ఇంజిన్ కు ఫోన్ చేసి ఇల్లు చూసుకుంటాను" అంటూ రామదాసు చెప్పడంతో శారదను చేతిలోకి తీసుకుంటూ, బయటకి వచ్చాడు, అప్పటికే గుమిగూడిన జనంలో ఉన్న ఆటో డ్రైవర్ ఉమాపతి, అటో తో సిద్దంగా ఉన్నాడు.

ఆ కాలనీ లో ఉన్న అందరిలోనూ పరమ కఠినాత్ముడు ఉమాపతి, ఎవ్వరికీ చిన్న సహాయం చేయని మనిషి, ఈరోజు అటోతో సిద్దంగా ఉండడం కిరణ్ కు ఆశ్చర్యంగా అనిపించింది. ఆ అటోను అనుసరిస్తూ, కిరాణాకొట్టు గోవిందు, మెకానిక్ యాదవ్, పిండి మెషిన్ గౌస్ హాస్పిటల్ వరకూ వచ్చి అక్కడే డాక్టర్ రూమ్ దగ్గర ఓ మూలగా నిలబడి ఉన్నారు. నిజానికి కిరణ్ వీరితో ఎప్పుడూ మాట్లాడలేదు, శారద కానీ, బబ్లూ కానీ మాట్లాడడం చూడలేదు, మరి వీళ్ళందరూ ఎందుకు వచ్చినట్టు హాస్పిటల్ కు.

ఇంతలో పూజారి కొడుకు శర్మ కిరణ్ దగ్గరకు వచ్చి, "సర్, ఇల్లు బాగానే ఉంది, పేలుడు వల్ల ఓ గోడ పగిలినది, సిలిండర్ లో గ్యాస్ కొద్దిగా ఉండడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది" అంటూ చెప్పుకుంటూ వెళ్తున్నాడు. కిరణ్ అయితే ఓ కొత్త మనిషిని చూస్తున్నట్టు చూస్తున్నాడు, కారణం తను ఇంతవరకూ శర్మ ను చూడలేదు మరి. "చాలా థాంక్స్ అండి" అని కిరణ్ అంటుంటే, "అయ్యో, అమ్మ కు ఏం కాకుండా ఉంటే చాలు సర్" అని శర్మ, అక్కడకు వచ్చిన వాళ్ళు అంటున్నారు.

తలుపు ఓపెన్ అయ్యింది, డాక్టర్ బయటకి వచ్చి, "పేలిన శబ్దానికి స్పృహ తప్పింది, కాలిన గాయాలు అయ్యాయి, పెద్ద ప్రమాదం లేదు" అని చెప్పటంతో అక్కడ ఉన్న అందరూ ఊపిరి పీల్చుకున్నారు. "హమ్మయ్య ఇక పదండి, ఇల్లు చక్కబెట్టే పని ఉంది" అని గౌస్ అందరినీ కిరణ్ ఇంటికి తీసుకెళ్ళాడు. వారం రోజులు గడిచాయి, శారద కొద్దిగా కోలుకుంది, ఈ వారం లో రోజూ తన కాలనీ వారు ఎవరో ఒకరు హాస్పిటల్ కు రావడం, శారద ఆరోగ్యం గురించి వాకబు చెయ్యడం, వెళ్ళిపోవడం, ఇదే వరుస, ఇక కిరణ్ అసలు విషయం ఏంటో శారద ను అడగాలని నిర్ణయించుకున్నాడు. ఆ ప్రశ్నకు జవాబు కోసం కిరణ్ తో పాటు, కిరణ్ అమ్మా, నాన్నా కూడా ఎదురుచుస్తున్నారు.

ఇంకో మూడు రోజుల గడిచాయి, చెకప్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కిరణ్, శారద, ఇక మందులు ఏవీ వాడనవసరం లేదు అని చెప్పడంతో, శారద పూర్తిగా కోలుకుంది అని అర్థమైంది కిరణ్ కు. పూర్తిగా కోలుకుంది కాబట్టి, ఇక సమయం చూసి అసలు విషయం అడుగుదామనుకు న్నాడు. కిరణ్. ఈ ప్రమాదం జరిగిన తర్వాత మొదటి సారి అందరూ కలిసి భోజనం చేస్తున్నారు, అందరూ నిశబ్దంగా ఉన్నారు. ఎప్పుడూ సరదాగా ఉండే భర్త కిరణ్, అలా నిశబ్దంగా ఉండడం శారద గమనించి, భర్త తో ఇలా అంది.....

శారద - ఎప్పుడూ చలాకీగా ఉండే మీరు, ఇవాళ ఎందుకండి అంత నిశబ్దంగా ఉన్నారు?

కిరణ్ - ఏం లేదు శారద!! నాకు, అమ్మా, నాన్నా కు ఒక విషయం అర్థం కావడం లేదు!!

శారద - ఏంటండీ ఆ విషయం???

కిరణ్ - అది నిన్ను అడగాలో లేదో నాకు అర్థం కావడం లేదు శారద?

శారద - నేను మీ భార్యనండి? ఇక అత్తామామలు నాకు తల్లిదండ్రులతో సమానం? మీరు ఎదైనా సరే నిరభ్యంతరంగా అడగండి!!

కిరణ్ - మన ఇంట్లో ప్రమాదం జరిగినప్పుడు ఎందుకు మన కాలనీ వాళ్ళు అంతలా స్పందించారు?

శారద - అది మన కాలనీ వారి మంచితనం అండీ!!!

కిరణ్ - లేదు శారద, అది మంచితనమే కావచ్చు, కానీ మన ఒక్కరి విషయం లోనే ఎందుకు అని? మొన్న శంకర్ గారి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అయ్యింది కదా!! అప్పుడు ఎవరూ ఇంతలా స్పందించలేదు ఎందుకు??శారద - అంటే??

కిరణ్ - ఉమాపతి మన ఒక్కరి విషయంలోనే ఆటోతో ఎందుకు రెడీ గా ఉన్నాడు, అలాగే గౌస్, శర్మ మన ఇంట్లో ప్రమాదం జరిగింది అంటే ఎందుకు అంత కంగారు పడ్డారు?

శారద - అంటే....అది...మరి...!!

కిరణ్ - నువ్వు మా దగ్గర ఏదో దాస్తున్నావు శారద!!!

శారద - ఏమి లేదండి, ఇన్ని రోజులూ తగిన సమయం రాలేదు కనుక నేను చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను......మన కాలనీ వారందరికీ వారికి అవసరం అయినపుడు ధన, వస్తు, ప్రాణ సహాయం చేశానండి!!

ఆ మాటకి అదిరిపడ్డారు కుటుంబ సభ్యులు.....ఎప్పుడూ మన కళ్ళ ముందర ఉండే శారద ఇన్ని సహాయాలు చేసిందా??

కిరణ్ - ఏంటి శారద? మాకు తెలియకుండా ఎలా చేసావు?

శారద - ఏమి లేదండి!! ఉమాపతి రోజూ ఆటో వల్ల వచ్చిన డబ్బులు అన్నీ తాగుడుకి పెట్టేవాడు, ఉమాపతి భార్య మన పనిమనిషి తో చెప్తుంటే విన్నాను, నేను వారింటికి వెళ్ళి, ఉమాపతి తో మాట్లాడి, ఇలా తాగుడు కి బానిస అయితే రాబోయే పరిస్థితులని వివరించి తాగుడు మానిపించాను. అందుకే ఆరోజు ఆటో తో సిద్దంగా ఉండి ఉంటాడు. ఇక గౌస్ విషయానికి వస్తే, గౌస్ చిన్న పాపకు వైరల్ ఫీవర్ వచ్చి హాస్పిటల్ లో అడ్మిట్ చేసినపుడు, ఫీజు కట్టలేదని డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వలేదు, ఈ విషయం తెలిసి నేను కొంత డబ్బు ఇచ్చాను. పాపం వాళ్ళు తిరిగి ఇస్తామన్నారు, నేనే వద్దు అన్నాను,మీరు ఇంకొకరికి సహాయం చెయ్యండి అని చెప్పాను. అలాగే శర్మ వాళ్ళ నాన్నగారికి ఒక నెల మాత్రల ఖర్చు ఇచ్చాను, ఇక యాదవ్ తండ్రి గారికి ఆక్సిడెంట్ లో రక్తం పోతే, మా ఫ్రెండ్ రక్తం ఇప్పించాను.

అక్కడున్న ముగ్గురికీ గొంతులు మూగబోయి, కళ్ళు చెమర్చాయి. కిరణ్ అందుకున్నాడు...

కిరణ్ - శారదా, నువ్వు ఇవన్నీ మాకు తెలీకుండా చేసావు అంటే నమ్మలేకపోతున్నా!! నాకెందుకు చెప్పలేదు ఇన్ని రోజులూ??

శారద - నన్ను క్షమించండి!! మీకు చెప్పకపోవడం తప్పే.....ఆఫీస్ టెన్షన్ లకు తోడు ఈ టెన్షన్ లు ఎందుకు అని చెప్పలేదు......ఈసారి మీకు చెప్పే సహాయం చేస్తాను......

కిరణ్ - వద్దు శారద, నీకు ఎలా సంతోషంగా ఉంటే, అలా చేయి, కాకపోతే జాగ్రత్తగా ఉండు. నాగేశ్వరి, దగ్గరకు వచ్చి కౌగలించుకుంది శారదను.....

నాగేశ్వరి - నిన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను రా బంగారు తల్లి, నన్ను నీ పెద్ద మనసుతో క్షమించు.

శారద - అయ్యో, ఏంటి అత్తయ్యా ఆ మాటలు, నన్ను ప్రేమగా చూసుకునే ఓ కుటుంబం దొరికింది, ఇది చాలు నాకు...

కిరణ్ - నాన్నా, మీరేం మాట్లాడరే? ఏదో ఒకటి మాట్లాడండి నాన్నా?

రామదాసు - నీ తలకాయ, అసలు గౌస్ చిన్న పాప ట్రీట్మెంట్ కు డబ్బులు ఎవరు ఇచ్చారు అనుకుంటున్నావు? నేనే రా కోడలు పిల్లకు ఇచ్చింది!!!

కిరణ్ - అమ్మో!! నా వెనకాల ఇంత జరిగిందా, ఎంతైనా కిలాడీ మామా కోడళ్ళు అని నిరూపించారు కదా!!

మరిన్ని కథలు

Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ