ట్రాన్స్ జెండర్స్! - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

trans gender

అక్కడక్కడా ఎదురయ్యే ఎత్తు పల్లాల మధ్య సాగిపోయే జీవిత ప్రయాణంలో పైకి రావడం గొప్ప కాదు. జీవితమే శాపగ్రస్థమై, అవకాశాలు కుదరని స్థితిలో ఉన్నత స్థితికి రావడం గొప్ప!

***

ఒకరోజు మా ఇంటిగోడనాకుని నుంచున్నాను. మా తమ్ముడు పరిగెత్తుకుంటూ వచ్చి "అన్నాయ్యా మన వీధిలో ఇద్దరు కొ..లు వచ్చారు. చూడు" అన్నాడు. అసంకల్పితంగా చూశాను. వాళ్లిద్దరూ ఒకమారు నా వైపు చూసి తల దించుకుని ముందుకు సాగారు. వాళ్లకి మావాడి మాటలు వినిపించే ఉంటాయి. ఛ.

"ఒరే, అలా ఎవర్నీ కించపరచేలా మాట్లాడకూడదని చెప్పాను కదా!"అన్నాను గదమాయిస్తున్నట్టు. వాడు వెళ్లిపోయాడు.వీధిలో కూడా అందరూ వాళ్ల వంక వింతగా చూడ్డం, వేళాకోళంగా మాట్లాడుకోవడం చూశాను. సిటీలో పక్కవాడి గురించి పట్టించుకోరంటారుగాని ఎంటర్ టైన్ మెంట్ కోసం ఇక్కడ “ఇలాంటివి’ బాగానే పట్టించుకుంటారు.ఆ తర్వాత రెండు మూడు సార్లు నేను ఇంటికి వస్తున్నప్పుడో వెళ్తున్నప్పుడో వాళ్లు తారస పడ్డారు.

ఒకరోజు ఏడు గంటలకి నేను ఇంటికి వస్తున్నాను. మా కాలనీకి మెయిన్ రోడ్డుకి మధ్యలో ఒక కిలోమీటరు వరకు రాళ్లతో, ముళ్ల కంపలతో నిర్మాణుష్య ప్రదేశం ఉంటుంది. పున్నమి వెన్నెల్లో బాట స్పష్టంగా కనిపిస్తోంది.

"ఏవండీ"అని వినిపించింది.

నేను చాశాను. వాళ్లిద్దరూ ఒక పెద్ద ముళ్లచెట్టు చాటున నిలిచి నన్ను పిలిచారు. వాళ్లు ఇతరులతో అసభ్యంగా ప్రవర్తిస్తారని నా స్నేహితుల ద్వారా విని ఉన్నాను. కొంత జంకు కలిగింది. "మీకేం అపకారం చేయం. మాకోసం ఒక పది నిముషాలు కేటాయించండి. ప్లీజ్" అభ్యర్థించారు. నేను ఆ చెట్టు చాటుకు వెళ్లి అక్కడున్న ఒక పెద్ద రాయి మీద కూర్చున్నాను. వాళ్లూ నాలాగే రాళ్ల మీద కూర్చున్నారు. వాళ్ల వంక చూశాను చెప్పండి అన్నట్టుగా- "మొన్నొకరోజున మీ తమ్ముడు మా గురించి ఒక చులకన పదం వాడుతూ మమ్మల్ని చూపిస్తే, చూసిన మీ కళ్లలో ఒక బాధా వీచిక చూశాం. ఇంతవరకు మా పట్ల మానవత్వభావం, సానుభూతి ఎరగం. అందరూ గేలి చేసే వాళ్లే! మనుషుల ప్రవర్తన తోటే మేము విసిగి వేసారి పోయి మా మనసులను గట్టిపరచుకున్నాం. అందుకే కొన్ని చోట్ల తిరగబడుతున్నాం. హింసలకు పాల్పడుతున్నాం. అన్ని సవ్యంగా ఉన్న మనుషులకే ఈ సమాజంలో ఏవైనా చేసి పొట్టపోసుకోడానికి అవకాశం లేదు. ఇహ మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? అందుకే భుక్తి కోసం రైళ్లలో, బస్సుల్లో డబ్బులడుగుతాం. గృహ ప్రవేశం లాంటి శుభకార్యాలకి వెళ్లి జబర్దస్తీగా డబ్బులు గుంజి తెచ్చుకుంటాం. కాని అది జీవితమా చెప్పండి. మా కాళ్ల మీద మేము నిలబడి గౌరవప్రదంగా జీవిస్తేనే గొప్పకదా!

మాలో కొంతమంది టీ వీ ల్లో అవకాశం పొందారు. మరికొంతమంది కొన్ని వ్యాపారాలు చేస్తున్నారు. రాజకీయరంగంలోకి కూడా ప్రవేశిస్తున్నారట. ఇప్పుడెందుకో మాకు గుర్తింపు, మంచి రోజులూ వస్తున్నాయనిపిస్తోంది. అయితే అంత త్వరగా మా బతుకులు మాత్రం బాగుపడవు. ఇది నిజం.

నా పేరు ఉమామహేష్, వయసు ఇరవై ఏడు. ఇది సీతారామ్. వయసు ఇరవై ఆరు. మా పరిచయం ఇక్కడిదాకా బాగా చెప్పగలను. తర్వాతిది చెప్పడానికే జంకుగా ఉంటుంది. ఆ బిడియం మాది కాదు. సమాజం వల్ల పొందింది. ఈ సమాజం ఎప్పుడూ అంతే, తారతమ్యాలను చూపించి గేలి చేస్తుంటుంది. కాకి కన్నా చిలుక అందమైనదంటుంది. కాకీ కోకిలా నల్లగా ఉన్నా ‘కోకిల తనగొంతుతో గొప్పదనాన్ని పొందింది కాని, కాకి ఎందుకు పనికిరాదు’ అని శాడిజం ప్రదర్శిస్తుంది. ప్రకృతిలో దేని విలువ దానిదే! ఏ జీవీ తానలా పుట్టాలని కోరుకుని పుట్టలేదు. ఇహపోతే మా విషయం. మేము ట్రాన్స్ జెండర్స్ మి. అఫ్కోర్స్ మా ఆకారం మీకావిషయం తెలియజేస్తుందనుకోండి. మా ఇద్దరికీ జీవితంలో ఏదైనా సాధించాలని ఉంది. మా వయసు యువతరానిదే. మేము యువతే! కాని ఆడ, మగల్నే యువతగా పరిగణిస్తారు. సమాజం మమ్మల్ని ఆ కేటగిరీలోకి రానివ్వదు. మాకేం చేయదు.

నాకు కొన్ని అయిడియాలు ఉన్నాయి. పర్మిషన్స్ కోసం వెళ్లినా, రుణాల కోసం బ్యాంకులకు వెళ్లినా వెకిలీ చూపులూ, అసభ్య ప్రవర్తనలు. విసిగిపోయాం. బాగా డస్సి పోయాం. అందుకని మీ ముందు ఒక ప్రపోజల్ పెడుతున్నాం. దయచేసి హెల్ప్ చేయండి" అన్నారు.
ఆ వ్యక్తి మాటల్లోని దృఢత్వానికి అనుకోకుండా తల ఊపాను.

"మా అయిడియాతో ప్రభుత్వ అధికారులను, పెద్దలను కలిసేది మీరు. బ్యాక్ గ్రౌండ్ వర్క్ మేము చేస్తాం. మనందరం పార్ట్ నర్స్. మేమనుకున్నట్టు వర్కవుట్ అయితే మన జీవితాలు మారిపోతాయి. సంఘంలో మాకో గుర్తింపు, గౌరవం లభిస్తాయి. కాదు లభించి తీరతాయి"

"మీరు నన్నే సెలెక్ట్ చేసుకోడానికి కారణం?"

"మీ నిరుద్యోగం"

"నన్ను మీరెలా నమ్మారు? రేపు నేను మీకు అన్యాయం చేస్తే?"అన్నాను.

"చెయ్యలేరు. ఎందుకంటే మీ ముఖంలో ప్రతిఫలించే ప్రతీది మీ మనసులోంచి రిఫ్లెక్ట్ అయిందే. నిరుద్యోగి అయిన మీరు మాతోపాటు అభివృద్ధి చెందుతారు. అయినా మీరు అన్యాయం చేస్తే మేమేం బాధపడం. ఎందుకంటే మాకది మామూలే! కాకపోతే ఒక ప్రయత్నం చేసి మోస పోయా మనుకుంటాం" అన్నాడు ఉమామహేష్.

"ఓకే, ఇవాళ్టి నుంచి మనం ముగ్గురం. కలసి పనిచేద్దాం"అన్నాను వాళ్ల ప్రపోజల్ కి ఒప్పుకుంటున్నట్టుగా. వాళ్ల ముఖంలోని సంతోషం పండు వెన్నెల వెలుగుతో పోటీ పడింది.

***

అయిదేళ్లు గిర్రున తిరిగాయి. వాళ్ల అయిడియాలు, ఆలోచనల సారధ్యం, నా సహకారం అంచెలంచెలుగా మాకో వ్యాపారసామ్రాజ్యాన్ని నెలకొల్పింది. వాళ్లకీ సమాజంలోని పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఏర్పడ్డాయి. వాళ్ల ఆర్థిక పరిస్థితి, ఉన్నత స్థితి అందరి గౌరవం పొందేలా చేస్తోంది. ఏదైనా చేయడం వేరు. కసితో చేయడం వేరు. ఆ కసే వాళ్లకి మంచి పొజిషన్ ఇచ్చింది.

యువత అంటే కేవలం కుర్రతనపు అమ్మాయిలూ, అబ్బాయిలూ మాత్రమే కాదు, వీళ్లూ గుర్తుకు రావాలి. ప్రభుత్వమూ, సామాజిక సేవా సంస్థలు, మనుషులూ వీళ్లని తమలో కలుపుకోవాలి. వీళ్ల ఆలోచనలకీ విలువివ్వాలి. దేశాభివృద్ధిలో వీళ్ల భాగస్వామ్యమూ ఉంటుందన్నది మరువకూడదు.

ఏదేమైనా నేనొక్కడిని ఏవైనా చేసి సాధించేదానికన్నా, వీళ్లతో కలిసి సాధించడమే గొప్ప మానసిక సంతృప్తిని ఇస్తోంది. పేపర్లలో, టీ వీల్లో వచ్చిన మా కథనం మరింత మందిని ముందుకొచ్చేలా చేసింది. మలుపు తిప్పే మార్పెప్పుడూ ఇలాగే కదా మొదలవుతుంది. ఇహ వాళ్లు రైళ్లలో, బస్సుల్లో అల్లరి చేస్తూ, అడుక్కుంటూ కనిపించరు. అది గతం.

***

"భూమ్మీద నాలుగు రోజులు ఉండడానికి వచ్చాం. ఒకరికొకరం సహకరించుకోవాలి. అంతేకాని ఈసడించుకోడం, వెటకారం చేయడం.. ఛ..ఛ..వాళ్లు మనుషులా చెప్పండి. మీలా మమ్మల్నీ మా మనసుల్నీ చదివి సహాయపడేవారుంటే మేము నీచ స్థితిలో ఉండం. ఉచ్ఛ స్థితిలోనే ఉంటాం. చాలా థాంక్సండి. మన ప్రయాణం ఇలాగే కొనసాగాలి"అన్నాడు.

"మీ ఆలోచనలు నన్ను డ్రై చెయ్యక పోతే నేను బహుశా నిరుద్యోగిగానే ఉండేవాణ్ని, లేదా ఒక చిన్న ఉద్యోగంలో బతకలేక చస్తూ ఉండేవాణ్ని. నన్ను పైకి తెచ్చిన మీ ఉపకారం మరువలేనిది"అన్నాను మనఃస్ఫూర్తిగా.

మరిన్ని కథలు

Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి
Emi jariginaa antaa manchike
‘ ఏమి జరిగినా అంతా మంచికే ’
- మద్దూరి నరసింహమూర్తి