ఒకరికి ఒకరు - ఆర్. ఉమాదేవి

okarikokaru

“ఇప్పుడిదంతా అవసరమా అనిపిస్తోంది గీతా!” ఒక వైపు అద్దంలో చూసుకుంటూ తయారవుతూనే అన్నాడు విజయ్.“ తప్పకుండా అవసరమే బావా! ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా వుంటావు?” అంది గీత అతడి ముస్తాబు సరిగా వుందో లేదో చూస్తూ.గీతా, విజయ్ లు బావ మరదళ్ళు. చిన్నప్పటి నుండి ఒకే చోట కలిసి పెరిగారు. అందువల్ల వారి మధ్య ఏదైనా చెప్పుకునే చనువు, నిర్మలమైన స్నేహం ఉన్నాయి. గీత విజయ్ కంటే నాలుగేళ్ళు చిన్నదే అయినా ఆలోచించడం లో కాస్త పరిణితి కలిగినది. పెళ్లి ఈడు వచ్చాక పెద్దవాళ్ళు వాళ్ళిద్దరికే ముడి పెడదాం అనుకున్నా, ఇద్దరూ అందుకు ఒప్పుకోలేదు. ప్రేమకు, స్నేహానికి మధ్యనున్న అతి సన్నని రేఖ మీద వాళ్లకు స్పష్టత ఉంది. దాంతో ఇద్దరికీ వేరు వేరుగా వివాహాలు జరిపించారు.

గీత దాంపత్యం అన్యోన్యంగా కొనసాగుతుండగా విజయ్ కాపురం మాత్రం ఈ మధ్యే విచ్చిన్నమయింది. విజయ్ భార్యను ఎంత ప్రేమగా చూసుకున్నా ఆమె తన మూర్ఖత్వం తో దాన్ని కాలదన్నుకుంది. అతడి మంచి తనం ఆమెకు చేతగానితనంగా అనిపించింది. ఒక బాబు కుడా పుట్టాక కోర్టుకెక్కి విడాకులు తీసుకుంది. బాబు చిన్నవాడు కావడంతో కోర్టు తల్లికే అప్పగించింది. దాంతో విజయ్ ఒంటరి వాడయి పోయాడు. కొడుకు కాపురం మూన్నాళ్ళ ముచ్చట అయిపోవడంతో అతడి తల్లితండ్రులు కృంగిపోయారు. బంధువుల సానుభూతిని, స్నేహితుల, సహోద్యోగుల జాలి చూపులను భరించడం విజయ్ కు కష్టంగా ఉంది.

విజయ్ విషయాలు తెలిసి గీత అప్పుడప్పుడు వచ్చి అతడికి ధైర్యం చెప్పేది. “నీ సహచర్యం పొందే అదృష్టం ఆమెకు లేదు బావా! కానీ నువ్విలా డీలా పడిపోవడం ఎం బాగా లేదు. నిన్ను చూసి అత్తయ్యా మామయ్యా కూడా దిగులు పడిపోతున్నారు చూడు. వారి కోసమైనా నువ్వు మళ్ళి మనుషుల్లో పడాలి.” అని నచ్చ చెప్పేది. చివరకు ఎలాగైతేనేం గీత ప్రయత్నాలు ఫలించి విజయ్ మళ్ళి పెళ్లి చేసుకోవడానికి సుముఖత వ్యక్తం చేసాడు.

ప్రస్తుతం ఆ పెళ్లిచూపులకే వాళ్ళు బయలుదేరుతున్నారు. అటు వైపు అమ్మాయి లతది కూడా ఇంచుమించు ఇలాంటి నేపథ్యమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడు మోసం చేసి పారిపోతే ఒక పాపతో కన్నవాళ్ళ పంచన చేరింది. ఎంత చెడ్డా కూతురి బ్రతుకు ఇలా అయిపోవడం చూడలేక ఆ అమ్మాయి తల్లితండ్రులు ఆమెకు మళ్ళీ పెళ్లి తలపెట్టారు. విజయ్ కూడా అలాంటి అమ్మాయి అయితే కష్టం సుఖం తెలిసి ఉంటాయని, ఇద్దరి జీవితాలు బాగుపడతాయని పెళ్ళికి ఒప్పుకున్నాడు.పెళ్ళిచూపుల తతంగం ముగిసింది. అమ్మాయి తల్లితండ్రులు పాప భవిష్యత్ తమదే అని వాగ్దానం ఇచ్చిన పిమ్మట విజయ్ తల్లితండ్రులు పెళ్ళికి అంగీకరించారు.

లతా అభ్యంతరం చెప్పబోయినా ఆమె తల్లితండ్రులు వారించారు. నీకింకా చిన్న వయసే. ఇప్పటి నుండి నీ జీవితం ఇలా మోడువారి పోవటం మేము చూడలేము. పాప ఎలాగు మాతో మాలిమి అయింది.కాబట్టి మా దగ్గరే పెంచుకుంటాము. నీ బ్రతుకు బాగుపడితే మాకంతే చాలు అని ఆమెను ఒప్పించారు.

కొద్దిమంది బంధువుల సమక్షం లో లతా, విజయ్ ల పెళ్లి నిరాడంబరంగా జరిగిపోయింది.లతకు అప్పటికే ఉద్యోగం ఉంది. పెళ్ళయ్యాక ఇద్దరు ఒకే వూరికి బదిలీ చేయించుకున్నారు. మెల్లమెల్లగా వారిద్దరూ పాత గాయాలు మరిచి, మొహమాటాలు విడిచి కొత్త జీవితం ప్రారంభించారు. ప్రొద్దున్నే లేచి తయారవడం, ఎవరెవరి ఉద్యోగాలకు వాళ్ళు వెళ్ళిపోవడం,తిరిగి సాయంత్రం ఇల్లు చేరడం ఇదీ వారి దినచర్య. రోజూ విజయ్ ముందుగా ఇల్లు చేరుకుంటాడు. తర్వాత మరో అరగంటకు లత వస్తుంది. రాగానే భర్తకు కాఫీ కలపడం, మళ్ళీ రాత్రికి వంట......మరుసటి రోజుకు కావలసినవి సిద్దం చేసుకోవడం.......ఉదయానే టిఫిన్లు ..ఇద్దరికీ లంచ్ బాక్సులు ........ఇలా లతకు కాసేపు కూడా ఊపిరి సలపదు.

విజయ్ తనకు పనిలో ఏదైనా సహాయం చెయ్యాలనుకున్నా ఇక్కడికి వచ్చే ముందు “మొదటి పెళ్ళాన్ని నెత్తి కేక్కించుకుని అలుసై పోయావు. ఈ సారైనా జాగ్రత్తగా ఉండు” అని తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చి ఆ ప్రయత్నం మానుకుంటాడు. లతకు కూడా వాళ్ళమ్మ “అసలే రెండో పెళ్లి. అల్లుడు కాస్త అటు ఇటు ప్రవర్తించినా నువ్వే సర్దుకుపోవాలి” అని చెప్పి పంపింది. అందువల్ల లత అతడిని ఏమీ అడగదు. అతడు ఏమీ పట్టించుకోడు.

అలా వారి కాపురం ఏదో యాంత్రికంగా సాగిపోతోంది. గొడవలు లేవు అలాగని సరదాలు, సంతోషాలు లేవు. విజయ్ కు, లతకు కూడా తమ సంసారం లో సారం లోపించిందని అనిపిస్తోంది గాని అదేమిటో తెలీడం లేదు. ఎవరికి వారు తాము ఆశించిన ప్రేమ ఎదుటి వారి నుండి దొరకడం లేదని అనుకుంటున్నారు కానీ బయట పడటం లేదు.

వరుసగా మూడు రోజులు సెలవులు రావడం తో విజయ్ తన అమ్మానాన్న ల దగ్గరికి వెళ్లి వద్దామని ప్రతిపాదించాడు. లతకు అదే సమయం లో వేరే ఊరిలో ఆఫీస్ కు సంబంధించి ఒక కార్యక్రమానికి వెళ్ళాల్సి వచ్చింది. తనకు రావడం వీలు కాదంది. దాంతో విజయ్ ఒక్కడే తన ఊరికి బయలుదేరాడు. గీత కూడా అప్పుడే తన పుట్టింటికి వచ్చింది. విజయ్ వచ్చాడని తెలిసి వాళ్ళింటికి వెళ్ళింది.

“ఎలా వున్నావు బావా?ఎలా ఉంది నీ కొత్త కాపురం?” ఎంతో ఉత్సాహంగా అడిగింది అతన్ని చూడగానే. జీవం లేని నవ్వు నవ్వాడు విజయ్.

అతడి వాలకం చూసి “సరే బావా! సాయంత్రం మామిడి తోటకు వెళదాం. తయారుగా ఉండు.” అని చెప్పి వెళ్ళిపోయింది. సాయంత్రం అవగానే గీత తయారై వచ్చింది. త్వరగా రా బావా! అంటూ విజయ్ ను బయల్దేర దీసింది. సంధ్య వేళలో పల్లెటూరి అందాలు వర్ణించడానికి కవులే అయి ఉండక్కర్లేదు. కమ్మగా ముక్కు పుటాలను తాకే మట్టి వాసన..... దూరంగా ఆలయం లో మ్రోగే చిరుగంటల సవ్వడి....., ఒంపులు తిరిగి వయ్యారంగా ప్రవహించే పిల్ల కాలువ.....గుడి ముందరి చెరువులో విరిసిన కలువ బాలలు .....ఇవన్ని చూస్తే సామాన్యుడికి కూడా భావుకత్వం వచ్చేస్తుంది. గీత విజయ్ ల కు అవన్నీ సుపరిచితాలే. దారిలో పలుకరించే ఆత్మీయులకు చిరునవ్వుతో జవాబిస్తూ ఇద్దరు మామిడి తోట చేరుకున్నారు.

“ఇప్పుడు చెప్పు బావా! నీ విశేషాలు..” కిందకు దిగిన ఒక మామిడి కొమ్మ మీద కూర్చుంటూ అడిగింది.

“విశేషాలు ఏమున్నాయి గీతా! బాగానే ఉన్నాం. ఒంటరితనం అయితే లేదు.” తను మరో కొమ్మ మీద కూర్చున్నాడు.

“అదేంటి బావా! అంత నీరసంగా మాట్లాడుతున్నావు? మీరిద్దరూ సంతోషంగా లేరా? ఏవైనా గొడవలా?” ఆదుర్దాగా అడిగింది.

“గొడవలేమీ లేవు గీతా! కానీ ఏదో రొటీన్ గా ఉంటుంది. మా దాంపత్యం లో జీవం లేనట్టు అనిపిస్తుంది. కారణం ఏమిటో తెలీడం లేదు”

“అసలేం జరిగిందో చెప్పు. సమస్యేమిటో తెలిస్తే కదా పరిష్కారం ఆలోచించడానికి...”

తన విషయాలన్నీ చెప్పాడు విజయ్. నేను అలసిపోయి ఇంటికి వస్తే ఇంట్లో నాకు సేద తీర్చే ఇల్లాలు కావాలనుకున్నాను. కానీ తను కూడా ఉద్యోగం చేసి అలసిపోయి వస్తుంది. అలాగని నాకేం లోటు చెయ్యదనుకో. అయినా నాకు ఏదో అసంతృప్తిగా ఉంటుంది. తన ముఖం లో అచ్చమైన సంతోషం ఉండదు. ఏదో భర్త కాబట్టి చెయ్యాలన్నట్టు చేసినట్టనిపిస్తుంది.ఇక నా ముఖం లో సంతోషం ఎక్కడినుండి వస్తుంది చెప్పు. అన్నాడు.

అతడు చెప్పినదంతా శ్రద్ధగా వింది గీత.

“లోపం ఎక్కడుందో గ్రహించావా బావా?” ప్రశ్నించింది అతడిని.

“ఊహు “ తల అడ్డంగా ఊపాడు విజయ్.

“మీరిద్దరూ ఒక సారి జీవితం లో దెబ్బ తిన్నారు. దాంతో పెళ్లి అనే బంధం మీద కాస్త అభద్రతాభావం కలిగింది. మీ ప్రేమలను ఒకసారి అపాత్రదానం చేసారు. ఇప్పుడు మీ భాగస్వామి నుండి ప్రేమను ఆశిస్తున్నారు గాని ఒకరికి ఒకరు ప్రేమను ఇవ్వాలనుకోవడం లేదు. అదే ఈ సమస్యకు కారణం”. అంది గీత.

“అర్థమయ్యేలా చెప్పు గీతా!” అన్నాడు విజయ్.

“ఎం లేదు బావా! నువ్వు అలసి పోయి ఇంటికి వస్తే నీకు కాఫీ కలిపిచ్చే వారు లేరని బాధ పడుతున్నావు గాని ఆమె అదే స్థితి లో వస్తే నీవు ఎప్పుడైనా ఆమెను సేద తీర్చాలనుకున్నావా? ఆమె సంతోషం ఎక్కడ వుందో నువ్వు గ్రహించి తనకు అందిస్తే అంతకు పదిరెట్లు నీకు లభ్యం అయ్యేది. మనం ఏది ఇస్తే అదే తిరిగొస్తుందని నీకు తెలుసుగా బావా! ఇప్పుడు ప్రేమను ఇవ్వడం నువ్వే ముందు మొదలు పెట్టు. తర్వాత ఎంత తిరిగిపొందుతావో నువ్వే చూడు”

మనం కొంత మందిని చూసినప్పుడు ఎంత అన్యోన్యంగా వున్నారో అనిపిస్తుంది. ఏమీ ఆశించకుండా భాగస్వామిని ప్రేమించే స్వభావం ఆ దంపతులలో ఒకరికైనా కచ్చితంగా ఉంటుంది. ఇద్దరికీ ఉంటె అది మరింత స్వర్గమే. ఒకరి ఇష్టాలను మరొకరు తీర్చడం....అభిప్రాయాలు గౌరవించుకోవడం.....ఒకరి బాధను మరొకరు అనుభవించడం.....ఒకరు పొరబాటు చేస్తే మరొకరు క్షమించుకోవడం........ఇలా ఒకరికి ఒకరుగా ..... ఇద్దరు ఒకరుగా మారిపోతారు.నీ ఇష్టమే నా ఇష్టం అనడం వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోవడం కాదు....ఇష్టమైన వ్యక్తిగా మారిపోవడం. అంతే.

నువ్వు నీ మొదటి వివాహం విషయం లో ఇలాగె వున్నా అవతలి వ్యక్తి మూర్ఖురాలు అవడం తో అది వ్యర్థం అయిపొయింది. ఇప్పుడు సరైన వ్యక్తి దొరికినపుడు నీ ప్రేమను వ్యక్త పరచకుండా తన నుండే ఆశిస్తున్నావేమి బావా! నీ సంతోషం ఎక్కడో లేదు. నీ చేతుల్లోనే, నీ చేతల్లోనే ఉంది. అంది గీత.

విజయ్ కాసేపు ఏదో ఆలోచిస్తున్నట్టు ఉండిపోయాడు.“నువ్వు చెప్పింది నిజమే గీతా! నేనిలా ఉండడానికి కొంత నా గత జీవితం కారణం అయితే మరికొంత అమ్మ మాటలు కారణమయ్యాయి. ఇపుడు నా జీవితం ఎలా మలుచుకోవాలో నువ్వు సున్నితంగా తెలియచేసావు. థాంక్ యూ వెరీ మచ్ “ మనస్పూర్తిగా అన్నాడు విజయ్.

అప్పటికే చీకట్లు ముసురుకుంటూ వుండడం తో ఇద్దరు లేచి ఇంటి దారి పట్టారు. మరుసటి రోజు మరో సారి గీతకు కృతజ్ఞతలు చెప్పి తన ఊరికి బయలుదేరాడు. లత క్యాంపు నుండి వచ్చే సరికే వంటింట్లో ఏదో చప్పుడవుతోంది. సూట్ కేసు ను హాల్లోనే వదిలి నేరుగా వంట గది కే వెళ్ళింది. విజయ్ ఏదో వంట ప్రయత్నాల్లో వున్నాడు. ఆమె విస్మయంగా చూసింది.

“అయ్యో! ఎం చేస్తున్నారండి? నేను వచ్చేసానుగా...తప్పుకోండి నేను చేస్తాను” అంది లతా.

“ఎం వద్దు గాని నువ్వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా...వంట అయిపోవచ్చింది. వేడి వేడిగా భోం చేద్దాం” అన్నాడు విజయ్.ఆమె ఆశ్చర్యం లోంచి తేరుకోక ముందే “నీకు మరో సర్ప్రైజ్ ఉంది. వెళ్లి మన బెడ్ రూమ్ లో చూడు” కుక్కర్ ను స్టవ్ మీద నుండి దించుతూ అన్నాడు.ఇంకా ఏమిటో అనుకుంటూ సూట్ కేసు తీసుకుని బెడ్ రూమ్ లోకి వెళ్ళింది. అక్కడ చూసిన దృశ్యం ఆమెకు ఆశ్చర్యానందాలతో నోటమాట రాకుండా చేసింది. బెడ్ పైన బొమ్మలతో ఆడుకుంటూ తన పాప. ఒక్క ఉదుటున వెళ్లి పాపను గుండెలకు హత్తుకుంది. ఇదేమిటి?.....ఎవరు తీసుకొచ్చారు?....అప్పుడే గదిలోకి వచ్చిన విజయ్ వైపు ప్రశ్నార్థకంగా చూసింది.

“నేనే తీసుకొచ్చాను. ఇక మీదట పాప మనతోనే ఉంటుంది.రేపే వెళ్లి ఇక్కడ స్కూల్ లో జాయిన్ చేయిస్తున్నాను”అన్నాడు ఆమె కళ్ళల్లో ఆనందాన్ని తనివితీరా చూస్తూ. ఆమెకు సంతోషం, దుఖం ఒక్కసారే వచ్చాయి. పరుగున వెళ్లి అతడి హృదయం పైన వాలిపోయింది. ఆమె కన్నీళ్లు అతడి షర్టు ను తడిపేసాయి.

అతడు మెల్లగా ఆమె చుబుకాన్ని పట్టి లేపి “పిచ్చీ! ఎందుకు ఏడుస్తున్నావు? ఇక మీదట నీ సంతోషమే నా సంతోషం” అన్నాడు ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ..తన బాబు దూరమైనపుడు తండ్రిగా తనెంత బాధ పడ్డాడో తెలుసు.అలాంటిది నవమాసాలు మోసి కన్న పాప దూరమైతే లత ఇంకెంత బాధపడి ఉంటుందో విజయ్ అర్థం చేసుకున్నాడు. తన బాధను దూరం చెయ్యడమే తనకు నిజమైన సంతోషం అనిపించి ఊర్నుండి వస్తు వస్తూ అత్తగారింట్లో పాపను తీసుకొచ్చాడు.

“గీతో”పదేశం తన జీవితాన్ని ఇక ఆనందమయం చేస్తుంది అనుకుంటూ లతను మరింతగా హత్తుకున్నాడు విజయ్.

మరిన్ని కథలు

Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ