తల్లి వేరు - బలభద్రపాత్రుని ఉదయ శంకర్

talli veru

అప్పంభొట్లు వంశపారంపర్యంగా వస్తున్న పౌరోహిత్య వృత్తిని కొనసాగిస్తూనే, తన ఏకైక వారసుడు పెద్దిభొట్లుకి కూడా మంచి తరిఫీదునిచ్చాడు. కొడుకు కూడా పౌరోహిత్యం చేస్తూ వంశం పేరు నిలబెట్టాలని తలపోశాడు. అయితే మొదట్లో బాగానే ఉన్న పెద్దిభొట్లుకి వయసు పెరిగే కొద్దీ ఈ వృత్తి పట్ల నమ్మకం పోయింది.

శుభ ముహూర్తాలు ఉన్న రోజుల్లో ఫర్వాలేదు కానీ శూన్య మాసాల్లో ఎక్కడా పెళ్ళీ, పేరంటాలు ఉండవు. అప్పుడు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఇది ఈ వృత్తికి ఒక పార్శ్వం మాత్రమే. ఇక సినిమాల ప్రభావమో, తరాల అంతరమో గానీ - పురోహితుల పట్ల సమాజంలో గౌరవం తగ్గి అవమానాలు, అవహేళనలు పెరిగాయి. యువ పురోహితులకు పెళ్ళిళ్ళు కావటం కూడా దుర్లభం అవుతుంది. ఇది రెండో పార్శ్వం. ఇవన్నీ కలిసి ఆ యువకుడిలో పౌరోహిత్యం మీద ఒక రకమైన ఏహ్యభావాన్ని కలుగజేశాయి.

కొడుకు అమాయకత్వం చూసి నవ్వుకుని “పిచ్చి సన్నాసి! మన వృత్తి కున్న విలువ నీకు ఇంకా అర్థం కాలేదురా. పురోహితుడు అంటే పుర హితాన్ని కాంక్షించే వాడు. మనం పెట్టే ముహూర్తాలతో, చేయించే క్రతువులతో ఎంతోమందికి శుభం జరిగి, వృద్ధిలోకి వస్తారు. వాళ్ళు మనకు ముట్టజెప్పే తృణమో, పణమో మన జీవితాలని నిలబెడుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం, అది మరొక ఎత్తు. ఇది చాలదా ఒక పురోహితుడి ఆత్మ సంతృప్తికి” అనేవాడు అప్పంభొట్లు.

ఎంత చెప్పినా తండ్రి మాటలతో ఏకీభవించలేకపోతున్నాడు పెద్దిభొట్లు. కానీ ఎదురు చెప్పే ధైర్యం లేకనో, తండ్రి మీద గౌరవమో అతడిని మిన్నకుండేలా చేసింది. దీనికి తోడు పెద్దిభొట్లుకి సంబంధాలు కూడా రావటం లేదు. ఈ విషయంలో అప్పంభొట్లుకి కూడా కాస్త విచారంగానే ఉంది. చివరికి తన స్వంత బావమరిది కూడా తన కూతుర్ని ఇవ్వటానికి ఇష్టపడటం లేదు. చేసేదిలేక కొడుక్కి ఇంకా కళ్యాణ ఘడియ రాలేదని సరిపెట్టుకున్నాడు.

పెద్దిభొట్లు స్నేహితులందరూ మంచి మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు. తను మాత్రం ఎక్కడ ఏ శుభకార్యం జరుగుతుందా ఎవరు పిలుస్తారా అని ఎదురు చూస్తున్నాడు.

రాను రాను అతడిలో అసంతృప్తి జ్వాలలు రగిలిపోతుంటే అతడు స్ధిమితంగా ఉండలేక పోతున్నాడు. తను తండ్రితో ఉన్నన్నాళ్ళు తన జీవితానికి ఎదుగుబొదుగూ ఉండదు. అతడు పరిపరి విధాలుగా ఆలోచించి, చివరికి ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాడు. ఒకరోజు తల్లి, తండ్రి అక్క ఇంటికి వెళ్ళిన సమయంలో - 'తను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాననీ, తన కోసం వెదికే ప్రయత్నం చేయవద్దనీ' ఉత్తరం రాసి టీవీ రిమోట్ కింద పెట్టి గౌతమ బుద్ధుడిలా మహాభినిష్క్రమణం చేశాడు.

సాయంత్రానికి ఇంటికి చేరిన అప్పంభొట్లు, ఆయన భార్య సావిత్రి కొడుకు ఉత్తరం చూసి ఖంగుతిన్నారు. అప్పంభొట్లు కాస్త నిబ్బరంగా ఉన్నా, సావిత్రి తల్లి మనసు తల్లడిల్లి పోయింది. ఆమె బిగ్గరగా ఏడుస్తూ “అందరికీ ఫోన్లు చేసి కనుక్కోండి. అవసరమైతే పోలీసు కంప్లైంట్ ఇవ్వండి” అంది ఆందోళనగా.

అప్పంభొట్లు భార్యని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆమె భర్త మీద విసుక్కుంటూ “అసలు దీనికంతటికీ కారణం మీరు కాదూ!? వాడికి తోచిందేదోవాడిని చేసుకోనిస్తే వాడూ సంతోషంగా ఉండేవాడు. ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు” అంది.

అప్పంభొట్లు కాసేపు మౌనంగా ఉన్నాడు. ఆయనకీ మనసులో దిగులుగానే ఉన్నా పైకి మాత్రం బింకంగా “వెళ్ళనీవే. వెధవకి జీవితం అంటే ఏవిఁటో తెలిసొస్తుంది” అన్నాడు.

******

పెద్దిభొట్లు దొరికిన బస్సు పట్టుకొని భాగ్యనగరం చేరాడు. హైస్కూల్లో తనతో పాటు చదువుకున్న పవన్ ఇంటికి వెళ్ళాడు. పవన్ బీటెక్ పూర్తి చేసి ఏదో చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడి భార్య మంజుల కూడా ఉద్యోగం చేస్తుంది.

చిన్ననాటి మిత్రుడు వచ్చినందుకు పవన్ మొదట ఎంతో సంతోషించాడు కానీ, నిదానంగా పెద్దిభొట్లు వచ్చిన పని తెలుసుకొని విచారించాడు. “ఒరే పెద్దీ! మా నాన్న చేసిన తప్పే నువ్వూ చేస్తున్నావురా. నేను ఇంటర్ తర్వాత ‘ఇక చదువుకోను, మన కిరాణా కొట్టునే చూసుకుంటానంటే’ మా నాన్న ఒప్పుకోలేదు. పట్టుబట్టి, అప్పు చేసి మరీ నాచేత బీటెక్ చదివించాడు” అన్నాడు.

పెద్దిభొట్లు మిత్రుడి వంక ఆశ్చర్యంగా చూస్తూ “ఇందులో తప్పేవుఁదిరా? బీటెక్ చదివావు కాబట్టే ఉద్యోగం చేస్తున్నావు. నేను నీలాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగలనా? ఏదో నా చదువుకు తగ్గ ఉద్యోగం దొరక్క పోతుందా అని ఆశతో వచ్చాను” అన్నాడు.

మంజుల ఇద్దరికీ కాఫీ కప్పులు అందించి తనూ ఓ కప్పు తెచ్చుకొని అక్కడే కూర్చుంది. ఆమె కాఫీ సిప్ చేస్తూ “ఈ ఉద్యోగాలతో మేమేమీ సుఖపడటం లేదు అన్నయ్యా. ఇప్పుడు ఇంజనీర్లు ఎక్కువై పోయారు. పవన్ ఉద్యోగంలో చేరి మూడేళ్లవుతున్నా, జీతం ఇరవై వేలు దాటలేదు. అందులో సగం ఈ ఫ్లాట్ అద్దెకే పోతుంది. ఇల్లు గడవటం కోసం నేనూ ఓ చిన్న ఉద్యోగంలో చేరాను” అంది.

పెద్దిభొట్లు ఆలోచనలన్నీ తలకిందులవుతున్నాయి. అయినా పట్టు సడలించకుండా “ఉద్యోగం కాకపోతే వ్యాపారం చేస్తాను. నా దగ్గర యాభై వేలు న్నాయి. దాంతో ఏదైనా వ్యాపారం చేసి గౌరవంగా బ్రతుకుతాను” అన్నాడు ధీమాగా.

మంజుల నవ్వుతూనే “కులవృత్తి చేయటంలో ఉన్న గౌరవం ఇంక ఎక్కడ ఉంటుంది అన్నయ్యా? జనంలో భక్తో, పాపభీతో పెరగటం వల్ల పురోహితులకు గిరాకి పెరిగింది” అంది.

మిత్రుడి పట్టుదల తెలిసిన పవన్ మాత్రం చిన్నగా నవ్వి “సరేరా! కొన్ని రోజులుండి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకో. దొరక్కపోతే అప్పుడు ఆలోచిద్దాం” అన్నాడు ఇక చెప్పేదేమీ లేనట్లు.

******

పెద్దిభొట్లు వారం రోజుల పాటు తీవ్రంగా ప్రయత్నించాడు. ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. చాలా చోట్ల అవహేళనలు ఎదురయ్యాయి. అతడికి తండ్రి మీద పీకల దాకా కోపం వచ్చింది, తనని పెద్ద చదువులు చదివించనందుకు.

నగరానికి దూరంగా ఉన్న ఒక దేవస్థానంలో క్లర్కు పోస్ట్ ఉందని పేపర్లో చూసి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. తీరా వెళ్ళాక, ఆ దేవస్థానం వారు అతడి వివరాలు తెలుసుకుని అర్చకుడిగా నియమిస్తామంటే తిరస్కరించాడు.

మిట్ట మధ్యాహ్నం మండుటెండలో కాళ్ళీడుచుకుంటూ నిరాశగా నడుస్తున్నాడు పెద్దిభొట్లు. నాలుక పిడచ కట్టుకుపోతుంది. దగ్గరలో ఇళ్ళు కానీ, దుకాణాలు కానీ కనపడటం లేదు. దూరంగా ఎక్కడో ఒక పెంకుటిల్లు కనబడింది. ఆత్రంగా అక్కడికి వెళ్ళాడు. నలుగురు మనుషులు అక్కడ కుండలు తయారు చేస్తూ కనిపించారు.

వాళ్ళని చూస్తూ మొహమాటంగా “దాహంగా ఉంది. కాసిని మంచినీళ్లు దొరుకుతాయా?” అనడిగాడు.

వాళ్ళలో పెద్ద వాడైన కుమ్మరి కోటయ్య పెద్దిభొట్లుని ఎగాదిగా చూసి “ఎవురు బాబూ నువ్వు? బాగా ఎండన పడి వచ్చావు. రా! కూకో” అని చెట్టు కింద అరుగు చూపించి, పక్కకి తిరిగి “అరే సాంబిగా! బోరు కాడికెళ్ళి కొత్త ముంతలో నీళ్లు పట్రా” అన్నాడు.

పచ్చని ఆ వేపచెట్టు నీడలో చల్లని నీళ్లు తాగాక, పెద్దిభొట్లుకి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లైంది. కోటయ్య కేసి చూసి “చాలా ధాంక్స్. నా ప్రాణం నిలబెట్టారు” అన్నాడు.

కోటయ్య అతడి చేతిలో రెండు జామ పళ్ళు పెట్టి “ముందు ఇయి తిను. కడుపు సల్లబడతది” అని పెద్దిభొట్లు గురించిన వివరాలు అడిగాడు.

పెద్దిభొట్లు జామపండు తింటూ ఒక్కొక్కటిగా తన వివరాలు చెప్పాడు. అంతా విన్న కోటయ్య పగలబడి నవ్వుతూ “ఎంత ఎర్రిబాగులోడివయ్యా పంతులూ! నాన్న గారు కట్టపడి మంత్రాలు నేర్పిస్తే, వద్దని పారిపోయి వచ్చినావా? నీ సదువుకి ఈడ కొలువు దొరుకుతుద్దా?” అన్నాడు. పెద్దిభొట్లు ఏం మాట్లాడలేదు.

కోటయ్య తిప్పుతున్న చక్రం ఆపి “అసలు నాకు తెలవక అడుగుతా. మంత్రాలు సెప్పుకుని పెళ్ళిళ్ళు, పేరంటాలు సేయించటానికి ఏందయ్యా ఇబ్బంది?” అన్నాడు.

అసలే తన వృత్తిని తాను అసహ్యించుకుంటున్న ఆ యువ పురోహితుడు చిరాకు ప్రదర్శించి “మా బాధలు నీకేం తెలుస్తాయి? మా వృత్తికి ఒక టైం ఉండదు. సెలవలుండవు. అలా అని అన్ని రోజులూ పనులూ ఉండవు. స్ధిరమైన సంపాదన లేదు. జనం కూడా తెలివి మీరిపోయారు. చిన్న చిన్న పూజలు, శుభకార్యాలకు మమ్మల్ని పిలవటం మానేసి, ఫోన్ లోనే మంత్రాలు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఇంక మాకు గిరాకీ ఏం ఉంటుందీ?” అన్నాడు.

కోటయ్య విచిత్రంగా చూసి “అయితే ఏంది? పెరట్లో బావినొదిలేసి ఎండమావులెనకాల లగెత్తటమేనా? మన పనిని మనవేఁ సక్కదిద్దుకోవాల. కాలాన్ని బట్టి మారుతూ పోవాల.

నా సంగతే సూస్కో! పాతికేళ్ల కింద ప్రతి ఇంట్లో కుండలు, కూజాలు ఉండేవి. ఇప్పుడో… అన్ని కొంపల్లో ఫ్రిజ్జులే. అప్పట్లో ఇళ్ళలో ఖాళీ జాగాలుండేవి. కుండీల్లో మొక్కలు పెంచేవోళ్ళు. ఇప్పుడన్నీ అపార్టుమెంట్లే ! మరి నేనేవఁన్నా యాపారం వదిలేశానా?” అన్నాడు.

పెద్దభొట్లు కోటయ్య వంక కుతూహలంగా చూశాడు. అవును కదా! కోటయ్యలాగా కులవృత్తిని నమ్ముకున్న వాళ్ళ పరిస్ధితి ఇప్పుడెంత దారుణంగా ఉందో!? “మరి నువ్వు తయారు చేసే కుండలు, పూల కుండీలు ఎలా అమ్ముతున్నావు?” అనడిగాడు ఆశ్చర్యంగా.

కోటయ్య నోట్లో ఉన్న చుట్టను దూరంగా విసిరేసి, కులాసాగా నవ్వాడు ఇదంతా మామూలేనన్నట్లు. అతడు పెద్దిభొట్లుని పక్కకి తీసుకెళ్ళి అక్కడ పేర్చిన కళాఖండాలను చూపించాడు. బాల్కనీల్లో వ్రేలాడదీసే పూల కుండీల నుంచి, టీపాయ్ ల మీద పెట్టుకొనే ఫ్లవర్ వేజుల దాకా రకరకాల అలంకరణ వస్తువులు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. కోటయ్య భార్య, కూతురు అక్కడికొచ్చిన కొనుగోలుదారులకు వాటిని గురించి వివరించి చెపుతూ, తేలిగ్గానే అమ్మేస్తున్నారు.

పెద్దిభొట్లు ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే, “మా తాతలు సేసినట్టే నేను కూడా ఒఠ్ఠి కుండల్నే తయారు సేస్తే మాకెట్టా గడుస్తాది బాబూ? అప్పట్లా లేవు రోజులు. ఇదిగో మట్టిని ఇట్టా రకరకాల వస్తువులుగా సేస్తేనే ఈరోజుల్లో ఎవురైనా కొనేది” అన్నాడు కోటయ్య.‌

తను చూస్తుండగానే డజను కుండీలు అమ్ముడు పోయాయి. చేస్తున్న వృత్తిలో కొత్త కొత్త మెళకువలు నేర్చుకుంటే సంపాదనకేం లోటు ఉండదని కోటయ్య అతడికి ఒక చిన్న హితబోధే చేశాడు. పెద్దిభొట్లుకి తన వృత్తి మీద ఇంకా నమ్మకం కలగలేదు. “మీదంటే వస్తువుల తయారీ కాబట్ఠి కొత్తగా చేస్తావు. మాది అలా కాదు కదా! ఎన్నాళ్ళు పోయినా అవే మంత్రాలు. అదే పని. కొత్తదనం ఏవుఁటుంది?” అన్నాడు నిరాశగా.

కోటయ్యకి చిరాకేసింది. పెద్దిభొట్లు భుజం మీద చెయ్యేసి “అట్టా దిగాలు పడమాకు పంతులూ! ఆలోసిస్తే ఏదోక ఉపాయం తట్టకపోదు. మనం కూకున్న కాడికే యాపారం వొచ్చే రోజులు పోయాయి. మనవేఁ ఎల్లి నాలుగు ఖాతాలు పట్టుకోవాల” అన్నాడు.

మూసుకు పోయిన పెద్దిభొట్లు మెదడు తెరుచుకుంటున్నట్లే ఉంది. కానీ కోటయ్య చెప్పేది అర్ధం అయీ అవనట్లుగా ఉంది. మళ్ళీ అడగాలంటే అతిశయం అడ్డొచ్చింది.

పెద్దిభొట్లు మనసును చదివిన వాడిలా “ఓ పది దుకాణాల్లో శుక్రారం పూజల్జేసే ఖాతాలు సూసుకుంటే చాలదంటయ్యా? లగ్గాల్లేనప్పుడు నాల్రూపాయలు సంపాదించుకోటానికి! యాపారం సేస్తానని సరదా పడతన్నావు గదా. ఇళ్ళలో రోజూ పూజలు చేస్కునేటోళ్ళకి కావాల్సిన సామాను ఆళ్ళ ఇళ్ళ కాడే అమ్ము. ఇది మాత్రం యాపారం కాదా ఏంది?” అన్నాడు కోటయ్య.

ఇప్పుడు పెద్దిభొట్లుకి మనసు తేలికపడింది. మట్టి పిసుక్కునే కోటయ్య గీతోపదేశం చేసిన మాధవుడిలా గోచరించాడు. అతడు లేచి కోటయ్యకు నమస్కరించి “మా నాన్న నాకు మంత్రాలు నేర్పి, వృత్తిలో ఎదగమని బీజాలు వేస్తే - నువ్వు పాదు చేసి నీళ్ళు పోశావు. నీ మేలు మర్చిపోలేను కోటయ్యా!” అన్నాడు.

కోటయ్య నవ్వుతూ “ఇందులో నేన్జేసిన మేలేవుఁది బాబూ? కులవృత్తి చెట్టుకి తల్లివేరు లాంటిది. దాన్ని నమ్ముకుంటే మంచి జరుగుద్దని సెప్పానంతే!” అన్నాడు.

పెద్దిభొట్లు కోటయ్య దగ్గర సెలవు తీసుకుని అక్కడి నుంచి కదిలాడు. ఇంటికి చేరగానే పవన్ మిత్రుడి చెయ్యి పట్టుకొని “కంగ్రాట్స్ రా పెద్దీ. ఒక రిటైల్ స్టోర్లో బిల్లింగ్ క్లర్కు ఉద్యోగం నీకిస్తామన్నారు. రేపు పొద్దున్నే వెళదాం” అన్నాడు.

అతడు తల అడ్డంగా ఊపి “వద్దురా. నేనెంత పొరపాటు చేశానో నాకర్ధమైంది. ఒక నిరక్షరాస్యుడికి ఉన్న జ్ఞానం నాకు లేకపోయింది. సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగాల కన్నా తల్లివేరు లాంటి కులవృత్తి గొప్పదనాన్ని ఓ కుమ్మరి నాకు చెప్పాడు. నేను వెంటనే ఇంటికి వెళ్ళి పోతాను. ఇప్పటికే అమ్మ, నాన్నలను ఎంతో క్షోభ పెట్టాను” అన్నాడు బాధగా.

మంజుల అతడిని మనస్ఫూర్తిగా అభినందించి “తొందర్లోనే మేమూ వచ్చేస్తున్నాం అన్నయ్యా. మన ఊళ్ళోనే డిపార్టుమెంటల్ స్టోరు పెట్టబోతున్నాం. మావయ్య గారిని ఇప్పటికే ఒప్పించాం” అంది ఉత్సాహంగా.

కొత్త కొత్త ఆలోచనలు మెదడు నిండా మెరుస్తుండగా, పెద్దిభొట్లు తిరుగు ప్రయాణానికి బస్సు ఎక్కాడు.

మరిన్ని కథలు

Sammohanastram
సమ్మోహనాస్త్రం
- బొబ్బు హేమావతి
Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి