ఒక్క క్షణం - పద్మావతి దివాకర్ల

okka kshanam

శనివారం సాయంకాలం శేఖర్ ఇంటికి రాగానే హడావుడిగా, "రమ్యా! బట్టలు సర్దు. రేపు ఉదయం మనం ఓ చోటకి వెళ్ళబోతున్నాం. మన చింటూకి కూడా పరీక్షల తర్వాత సెలవు ఇచ్చారుగా! అందరం కలసి జాలిగా వెళ్దాం." అన్నాడు.

"ఏమండీ, ఎక్కడికి ప్రయాణం? ఇంత హఠాత్తుగా తలబెట్టారు!" అడిగింది రమ్య భర్తని.

"సస్పెన్స్! అక్కడికి చేరినతర్వాత చెప్తాగా! అందాకా ఓపిక పట్టు. రేపు మిమ్మల్ని ఓ ముఖ్యమైన ప్రదేశానికి తీసుకువెళ్తున్నాను. నా జీవితంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న సంఘటన జరిగిన చోటది. ముందు బేగ్‌లు సర్దు ఓ రెండుమూడు రోజులు ఉండేటట్లు." అన్నాడు శేఖర్.

మరి మారుమాట్లాడక బ్యాగ్‌లు సర్దడం ఆరంభించిందామె. శేఖర్ ఓ పెద్ద బిజినెస్ మాగ్నెట్. అతను వ్యాపారరంగంలోకి ప్రవేశించి నాలుగైదేళ్ళే అయింది. అయితేనేం, ఇవాళ అతను ఆ పట్టణంలోనే ఓ పెద్ద వ్యాపారస్తుడుగా మాత్రమే కాదు, పారిశ్రామికవేత్తగా కూడా మంచి గుర్తింపు పొందాడు. వ్యాపారం ప్రారంభించిన దగ్గర్నుంచి అతను పట్టిందల్లా బంగారమైంది. ఆ పట్టణంలో ఇప్పుడు అతనికెన్నో వ్యాపారసంస్థలున్నాయి ఓ నాలుగు పరిశ్రమలున్నాయి. అతని వద్ద పనిచేసే వాళ్ళు వందలాది మందికి పైగా ఉన్నారు. ఈవేళ అతను పదిమందికి తిండిపెట్టగలిగే ఉన్నత స్థితిలో ఉన్నాడు.

ఆదివారం తెల్లవారగానే కారు షెడ్లోంచి తీసాడు డ్రైవరు అప్పారావు. పనివాడు వీరయ్య బ్యాగ్‌లు తెచ్చి కారు డిక్కిలో పెట్టాడు. శేఖర్, రమ్య, చింటూ ముగ్గురూ వెనకసీట్లో కూర్చున్నారు. శేఖర్ చెప్పినవైపు కారు బయలుదేరదీసాడు డ్రైవర్ అప్పారావు. ఖరీదైన కారు మెత్తటి రోడ్‌పై దూసుకుపోతోంది. శేఖర్, రమ్య కారు అద్దాల్లోంచి ప్రకృతి దృశ్యాలు చూడడంలో లీనమైయ్యారు. చింటూ ఐపాడ్‌లో కార్టూన్ షో చూసుకుంటున్నాడు.

కొద్దిసేపు తర్వాత రమ్య మెల్లగా అడిగింది, "మనం ఎక్కడకి వెళుతున్నామో చెప్పనేలేదు! అంత రహస్యమా?" శేఖర్ చిన్నగా నవ్వాడు. "ఇందులో రహస్యమేమీ లేదు. అయిదేళ్ళక్రితం జరిగిన ఓ సంఘటన నా జీవిత గమ్యాన్నే పూర్తిగా మార్చేసింది. అసలు ఈ రోజు నేను ఇలాంటి ఉన్నత స్థితిలో ఉన్నానంటే దానికి కారణభూతుడైన ఓ మహానుభావుణ్ణి కలసుకోవడానికే మనమిప్పుడు వెళుతున్నాం. నేను మళ్ళా పునర్జన్మ ఎత్తి ఇప్పటి ఈస్థితికి రావడానికి ఆ మహాపురుషుడు పెట్టిన ప్రాణభిక్షే కారణం."

"నిజంగా! అదేంటి? నాకెప్పుడూ ఈ విషయం చెప్పనేలేదే? ?" ఆశ్చర్యంగా అడిగింది రమ్య.

"అవును! నా గతం చాలా భయంకరమైనది. ఇప్పటివరకూ నీకు నేను చెప్పలేదు. అయితే అది చెప్పకపోవడంవల్ల నేనెప్పుడూ తప్పు చేసానని మాత్రం అనుకోలేదు. అయితే నీకివాళ నా గతం గురించి పూర్తిగా చెప్తాను. నువ్వనుకున్నట్లు నేనేమీ ఆగర్భ శ్రీమంతుడ్ని కాను." అంటూ తన గురించి చెప్పసాగాడు శేఖర్.

కారు అప్పుడే మెయిన్‌రోడ్ వదలి కుడిచేతివైపు తిరిగి పయనించ సాగింది. రోడ్డుకి ఇరువైపులా పచ్చని పైరు కంటికి ఇంపుగా కనిపిస్తోంది. కారు అద్దాల్లోంచి బయటకు చూస్తూ శేఖర్ మాటలు వినసాగింది రమ్య. * * *

డిగ్రీ చేతికొచ్చి ఉద్యోగంవేటలో పడ్డాకగానీ తెలియలేదు శేఖర్‌కి ఉద్యోగం సంపాదించడం అంత సులభం కాదని. పేపర్‌లో పడ్డ అన్ని ఉద్యోగ ప్రకటనలు చూసి దరఖాస్తు చేసుకున్నా చాలా వాటికి ఇంటర్యూలకి కూడా పిలుపు రాలేదు. అప్పటికే శేఖర్ తండ్రి రాజయ్య అతన్ని చదివించడానికి అష్టకష్టాలూ పడ్డాడు. రాజయ్య తన చిన్న ఉద్యోగంలో వచ్చిన జీతంతో కొడుకును డిగ్రీ వరకూ చదివించాడు. శేఖర్ తర్వాత కూతురు సుమకూడా అప్పుడే కాలేజీలో డిగ్రి రెండవ సంవత్సరంలో జాయినైంది. తల్లిలేని పిల్లలిద్దరిని వృద్ధిలోకి తీసుకురావాలనే తపన రాజయ్యది. తనిక ఉద్యోగం సంపాదించి తండ్రిని సుఖపెట్టాలనుకున్నాడు శేఖర్. ఆ తర్వాత చెల్లెలు సుమ పెళ్ళి చేయాలనుకున్నాడు. వెంటనే ఉద్యోగంకోసం వేట ఆరంభించాడు. చాలా ఆఫీసులు, వ్యాపార సంస్థల చుట్టూ తిరిగాడు. ఫలితం శూన్యం! ఎక్కడకెళ్ళినా 'నో వేకెన్సీ' బోర్డులే దర్శనమివ్వసాగాయి. అప్పటివరకుగాని ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమో తెలిసిరాలేదు శేఖరానికి. తనకున్న సాదాడిగ్రీతో చాలా చోట్ల కాళ్ళరిగేలాగ తిరిగాడు శేఖర్ ఉద్యోగంకోసం. అలా ఉద్యోగంకోసం ప్రయత్నిస్తూ ఓ సంవత్సరం గడచిపోయింది. తండ్రికి తను చేయూతనివ్వకపోగా తిరిగి అతని మీద ఆధారపడి బ్రతకటం చాలా బాధాకరమనిపించింది శేఖర్‌కి.

అలా ఉద్యోగంవేటలో ఉండగా శేఖర్‌కి ఒకరోజు తన క్లాస్‌మేట్, స్నేహితుడు అయిన శంకరం కనిపించాడు. శంకరం చక్కగా మంచి తెల్లటి డ్రెస్స్‌వేసుకొని, భుజానికి ఓ ఆఫీస్ బ్యాగ్ ధరించి గజపతినగర్‌వీధిలో ఓ ఇంట్లోంచి బయటికి రావడం శేఖర్ కళ్ళబడింది. శంకరాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు శేఖర్. శంకరం ఏదో ఉద్యోగంలో చేరినట్లుంది అనుకున్నాడు శేఖర్. తనకి తెలియకుండా శంకరం ఎప్పుడు ఉద్యోగం సంపాదించినట్లు? శంకరం కూడా తనలాగే చదువుపూర్తి చేసుకొని నిరుద్యోగిగా ఉండేవాడు. తనవెంటే చాలా ఇంటర్యూలకి హాజరయ్యాడు కూడా. అతనెలాగ ఉద్యోగం సంపాదించాడో ఆ రహస్యం తెలుసుకోవాలనుకున్నాడు శేఖర్. వెంటనే శంకరాన్ని పలకరించాడు. "ఏమోయ్!...శంకరం!...ఎప్పుడు ఉద్యోగం సంపాదించావు? ఏం ఉద్యోగం సంపాదించావు? ఎలా సంపాదించావు, నాకుకూడా కాస్త చెప్పు!" అన్నాడు శేఖర్. శంకరం ష్టయిల్‌గా, గర్వంగా నవ్వాడు.

"ఈ మధ్యనే మన పట్టణంలో 'అక్వాగోల్డ్' అనే ఫైనాన్స్ కంపెనీ ఒకటి తమ కార్యకలాపాలు ప్రారంభించారు. ఇప్పటికే ఈ 'అక్వాగోల్డ్' అన్న సంస్థకు మనతెలుగు రాష్ట్రాలలోనే కాక పొరుగు రాష్ట్రాలలో కూడా చాలా శాఖలున్నాయి. నీకు బాగా తెలిసే ఉంటుంది ఈ కంపెనీ గురించి. నెలరోజుల క్రితం ఏజెంట్లకోసం పత్రికలో ప్రకటనలు కూడా ఇచ్చారు. బహుశా నువ్వు చూడలేదేమో? నాలాగే చాలామంది ఇంటర్యూకి వచ్చారు. దాదాపు అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. నెలకి పదివేలు జీతం. ఆపై మనం ఎంత డిపాజిట్లు సేకరిస్తే అంత కమీషన్, ఇన్సెంటివ్‌లూను. నెలకి దాదాపు పాతికవేల వరకు సంపాదించుకోవచ్చు." అని సంతోషంగా చెప్పాడు శంకరం.

"ఇంతమంచి ఉద్యోగం నువ్వు సంపాదించుకొని మరి నాకెందుకు చెప్పలేదురా? నేను నీకు పోటీకి వస్తాననా?" నిష్టూరంగా అడిగాడు శేఖర్.
'అదికాదురా! నీకు చెప్పాలనే అనుకున్నారా! ఈలోపున ఇంటిపనులతో వీలవక చెప్పలేదు, ఆ తర్వాత పని ఒత్తిడి వల్ల వీలవలేదు, అంతే కానీ నీమీద ద్వేషం ఎంతమాత్రం లేదు నాకు." అన్నాడు శంకరం.

'అయ్యో!...ఎంతమంచి అవకాశం చేజారిపోయిందో!' అని మనసులో అనుకొని బాధపడుతున్న శేఖర్‌ని వెన్ను తట్టి, "నువ్వంత బాధపడవలసిన అవసరం ఏమీ లేదు. నిన్న నాకు ఆఫీస్‌లో బాస్ చెప్పాడు తెలిసినవాళ్ళెవరైనా ఉంటే చెప్పమని, వాళ్ళకి ఇంకో వందమంది ఏజెంట్లను నియమించే ప్లాన్ ఉందట! చుట్టుపక్క గ్రామాలకి కూడా వాళ్ళ కార్యకలాపాలు విస్తరిస్తారట. నువ్వు కూడా వాక్ఇన్ ఇంటర్వూలో పాల్గొనవచ్చు." శంకరం అన్నాడు.

ఆ మాటలకి చాలా సంతోషించి అప్పుడే ఉద్యోగం దొరికినట్లు ఫీలయ్యాడు శేఖర్. "నువ్వు రేపు ఉదయం పదిగంటలకల్లా 'అక్వాగోల్డ్' ఆఫీస్‌కి వచ్చేయ్! నేను మా బాస్‌ని నీకు పరిచయం చేస్తాను. నీకు కూడా తప్పక అవకాశం దొరుకుతుంది." తనవంతు హామీ ఇచ్చాడు శంకరం.
ఆ మరుసటిరోజు అక్వాగోల్డ్ ఆఫీస్‌కి వెళ్ళిన శేఖర్‌కి కూడా ఆ కంపెనీలో ఉద్యోగం లభించడంతో అతను ఆనందంతో తబ్బిబ్బయ్యాడు.
క్రమంగా ఉద్యోగబాధ్యతలతో తలమునకలయ్యాడు శేఖర్ కొద్దిరోజులలోనే. అతనికి నెలనెలా టార్గెట్ ఇవ్వడంతో మరింత శ్రమించవలసి వచ్చింది. ఇప్పుడు శేఖర్‌కి రోజుకు ఇరవైనాలుగు గంటలసమయం కూడా చాలడంలేదన్నంత బిజీగా తయారయ్యాడు.

మొదటి నెల సంపాదన చూసి చాలా మురిసిపోయాడు శేఖర్. డిపాజిట్లు సేకరించడానికి తనకి తెలిసినవాళ్ళ ఇళ్ళకి, బంధువుల వద్దకు వెళ్ళాడు. ఆ సంస్థకి మంచి పేరు ప్రతిష్టలు ఉండడంవల్ల ఎవరూ లేదనకుండా 'అక్వాగోల్డ్'లో డబ్బులు జమచేసేవారు. ఆ సంస్థ ఇచ్చే ప్రకటనలకి జనం బాగా ఆకర్షితులై శేఖర్‌కి తన టార్గెట్ పూర్తి చేసుకోవడానికి బాగానే సహకరించారు. ముఖ్యంగా ప్రభుత్వబ్యాంక్‌లు ఇచ్చే వడ్డి కన్నా 'అక్వాగోల్డ్'వారు ఇచ్చే వడ్డి అధికంగా, ఆకర్షణీయంగా ఉండడమే అందుకు ప్రధాన కారణం. బంధువులు, చుట్టాలు అయితే మనవాడికే కదా కమిషన్ వచ్చేది అని సెంటిమెంటల్‌గా అనుకునేవారు. రేపుపొద్దున్న డబ్బులు అవసరమైనప్పుడు అతను ఎలాగూ తమకు సహాయం చేస్తాడు కదా అనే ఉద్దేశ్యం వాళ్ళది. ఈ విధంగా చుట్టుపక్కల ఊళ్ళు కూడా తిరిగి తనకి తెలిసినవాళ్ళందరి చేతా 'అక్వాగోల్డ్'లో డబ్బులు జమ చేయించాడు శేఖర్.

ఈ లోపు శేఖర్ తండ్రి రాజయ్య కూడా ఉద్యోగం నుండి రిటైర్ అయ్యాడు. అతనికి ఉద్యోగవిరమణ తర్వాత వచ్చిన సొమ్ముయావత్తూ కూడా ఆ సంస్థలోనే పెట్టాడు, కూతురి పెళ్ళికింకా సమయం ఉండటంవల్ల. సుమ చదువింకా పూర్తికాలేదు. వచ్చే ఏడాది చదువు పూర్తైన వెంటనే ఆమె పెళ్ళిచేయాలన్న సంకల్పం ఆ తండ్రీకొడుకులది. అంతవరకూ డబ్బులు దాచుకుంటే హెచ్చువడ్డి వస్తుందన్న ఆలోచన వారిది. ఈ రెండేళ్ళలో శేఖర్ ఆర్థికంగా బాగా పుంజుకున్నాడు. తనకొచ్చే జీతం, ఇన్సెంటివ్స్‌లో చాలా భాగం భద్రంగా దాచుకున్నాడు చెల్లెలు పెళ్ళికి పనికి వస్తాయని. కూతురు సుమ పెళ్ళయినతర్వాత శేఖర్ పెళ్ళి కూడా చేసి కాలుమీద కాలువేసుకొని క్రిష్ణారామా అంటూ మనవలతో హాయిగా గడపాలని రాజయ్య ఆంతర్యం. ఆ ఉద్దేశ్యంతోనే సుమకోసం పెళ్ళిసంబంధాలు వెతకసాగారు తండ్రీ కొడుకులు. తను భద్రపరచిన డబ్బులతో పాటు తండ్రి దాచుకున్న డబ్బులతో చెల్లెలు పెళ్ళి ఘనంగా చేయగలమన్న ధీమాతో ఉన్నాడు శేఖర్.

వాళ్ళ అదృష్టం బాగుండి వెంటనే మంచి పెళ్ళిసంబంధం ఒకటి వచ్చింది. తన స్నేహితుని పెళ్ళిలో సుమని చూసిన మోహన్ ఆమెను ఇష్టపడి తన తండ్రిని రాజయ్య వద్దకు పంపాడు. మోహన్ తల్లి తండ్రి కూడా సుమని చూసి సదభిప్రాయం ఏర్పరచుకున్నారు. అయితే మోహన్ తండ్రి మాధవయ్యకి కట్నం దండిగా తెచ్చే కొడలే కావాలి.

"చూడండి రాజయ్యగారూ! మావాడు మీ అమ్మాయిని ఇష్టపడ్డాడు, అమెనే చేసుకుంటానని పట్టుబట్టాడు. నిజం చెప్పొద్దూ? మాకు కూడా మీ అమ్మాయి, మీ కుటుంబం నచ్చింది. అందుకే మేము కూడా ఈ సంబంధం కలుపుకోవాలనే ఉద్ద్యేశంతో ఉన్నాం. అయితే ఇప్పటికే మావాడికి బాగా కట్నం ఇవ్వడానికి చాలా సంబంధాలు వస్తున్నాయి. మీరు కూడా ఓ పది లక్షలు కట్నం ఇవ్వగలిగితే మీ సంబంధమే ఖరారు చేసుకుంటాం. అయితే డబ్బువద్ద మాత్రం నేను నిక్కచ్చిగా ఉంటాను. అంతే! ఏమంటారు?" అన్నాడు మాధవయ్య. హఠాత్తుగా కట్నం ప్రసక్తి వచ్చేసరికి ఏం మాట్లాడాలో అర్ధంకాలేదు రాజయ్యకి. అయితే శేఖర్ వెంటనే తేరుకున్నాడు. "అదేం మాట మావయ్యగారు? ఒక్కగానొక్క చెల్లెలుకోసం ఆ మాత్రం కట్నం ఇవ్వలేనా? మీరన్నదానికి మేము తయారుగా ఉన్నాం." జవాబిచ్చాడు శేఖర్ తండ్రి వైపు తిరిగి చూసి.

రాజయ్య విస్మయంగా చూసాడు కొడుకు వైపు. 'మరేం ఫర్వాలేదు. ' అన్నట్లు కళ్ళతోనే తండ్రికి జవాబిచ్చాడు శేఖర్. ఆ మాటలకి సంతోషించారు మాధవయ్య దంపతులు. ఆపైన మిగతా మాటలన్నీ చకచక జరిగిపోయాయి. లాంఛనంగా పెళ్ళిచూపులతంతు కూడా జరిగింది. సుమకి కూడా మోహన్ బాగా నచ్చాడు. అదే రోజు సిద్ధాంతిని పిలిపించి నిశ్చితార్థానికి, పెళ్ళికి తేదీలు నిర్ణయం చేసారు.
నిశ్చితార్థం కూడా జరిగిపోయింది, ఇక పెళ్ళి నెలరోజుల్లోకి వచ్చేసింది. తన దగ్గరున్న డబ్బులతో కళ్యాణమంటపానికి, క్యాటరింగ్, ఇంకా చిన్నచిన్నవాటికి కొద్దిపాటి అడ్వాన్స్‌లు ఇచ్చాడు శేఖర్. మాధవయ్యతో చేసుకున్న ఒప్పందం ప్రకారం మరో రెండురోజుల్లో కట్నం డబ్బులివ్వాలి. 'రేపే ఆఫీస్‌కెళ్ళి తను, తన తండ్రి జమచేసుకున్న డబ్బులు తిరిగితీసుకోవాలి. కట్నంకింద పదిలక్షలు ఇచ్చిన తర్వాత తమదగ్గర ఇంకో పదిలక్షలు మిగులుతాయి. అవి పెళ్ళి ఖర్చులకి పనికివస్తాయి.' ఇలా మనసులో అనుకొని, తండ్రి రాజయ్యకికూడా చెప్పి నిద్రకుపక్రమించాడు శేఖర్.

మరుసటిరోజు తండ్రిని వెంటతీసుకొని ఆఫీసుకి బయలుదేరాడు శేఖర్. ఆఫీస్‌వద్దకు వచ్చేసరికి అక్కడ చాలా కోలహలంగా ఉంది. మొదటి వారం కదా, అందుకే అంత రష్‌గా ఉందని ముందు అనుకున్నాడుగానీ, అక్కడున్న పరిస్థితి అలా గోచరించలేదు. జనాన్ని తోసుకుంటూ అతి కష్టం మీద ఆఫీసు వద్దకు చేరుకున్నారు శేఖర్, రాజయ్యలు. ఆఫీస్‌కి తాళం వేళ్ళాడుతోంది. అక్కడున్న జనంలో తీవ్ర ఆందోళన నెలకొని ఉంది. అందులో చాలామంది తమ డబ్బులు వాపసు తీసుకోవడానికి వచ్చినవారే. విషయమేమిటో అర్థంకాలేదు శేఖర్‌కి. అక్కడే శేఖర్‌కి తనతోటి ఏజెంట్లు, ఆఫీస్‌స్టాఫ్‌తో వాగ్వాదం చేస్తున్న కష్టమర్లు కనిపించారు.

అక్కడ శంకరం కనబడడంతో వెంటనే అక్కడకి వెళ్ళి ఆత్రతగా అడిగాడు, "ఏమిటి శంకరం? ఏమిటి జరిగింది? ఈ సందడంతా ఏమిటి? అసలు ఆఫీస్‌కి తాళం వేసుందేమిటి?"

"చాలా ఘోరం జరిగిపోయింది శేఖర్. మన కంపెనీ బోర్డ్ తిప్పేసి, డైరెక్టర్లు మొత్తం డబ్బులతో ఉడాయించారు. రెండురోజులైంది ఈ సంఘటన జరిగి. నువ్వు పెళ్ళిపనుల్లో బిజీగా ఉన్నావుకదా, అందుకే నీకింకా ఈ విషయం తెలియలేదేమో?" జవాబిచ్చాడు శంకరం విచారవదనంతో.
నెత్తి మీద పిడుగుపడ్డట్లు చలించిపోయాడు శేఖర్. మొత్తం డబ్బులన్నీ ఇక్కడే ఉన్నాయి, ఇప్పుడు తనదగ్గర ఇంకేం మిగలలేదే? ఇప్పుడెలా? చెల్లెలుపెళ్ళి ఎలా చేయాలి. ఒక్క క్షణం బుర్రతిరిగినట్లైంది శేఖర్‌కి. కాళ్ళూ, చేతులు ఆడలేదు.

"ఇప్పుడెలా?" అతికష్టంమీద నోరు పెగుల్చుకొని అన్నాడు శేఖర్.

"ఏం చేయాలో నాకూ అర్థంకావడం లేదు. మనం మన డబ్బులేకాక మనకి తెలిసినవారి వద్దనుండి సేకరించిన డబ్బులు కూడా ఇక్కడే దాచాం. వాళ్ళందరూ వాళ్ళవాళ్ళ అవసరాలకోసం దాచుకున్నవే. కొంతమంది పిల్లలపెళ్ళికని, కొంతమంది పిల్లల పై చదువుకోసమని, కొంతమందైతే భవిష్యత్తులో ఇల్లు కట్టుకోవడానికని దాచుకున్నవే. వాళ్ళకిప్పుడు ఏమని సమాధానం చెప్పాలి?" అన్నాడు శంకరం దీనంగా మొహం పెట్టి.

'అవును అదీ నిజమే! తన డబ్బులేకాక, తమవాళ్ళందరివి కూడా ఇప్పుడు మునిగిపోయాయి. ప్రస్తుతం కర్తవ్యం ఏమిటి?' ఇలా పరిపరి విధాల ఆలోచన మదిలో సుళ్ళు తిరుగుతోంది. ఆలోచించేకొద్దీ మెదడు మొద్దుబారిపోతోంది. మరి ఆలోచించలేక భారమైన గుండెతో నిస్సత్తువగా గోడకి చేరబడి నిలబడ్డాడు శేఖర్. ఈలోపున రాజయ్యకూడా వాకబు చేసి అక్కడ విషయం తెలుసుకున్నాడు కాబోలు శేఖర్‌వద్దకు తడబడుతూ వచ్చాడు. అతని కళ్ళముందు అంత వెలుతురులోనూ చుట్టూ అంధకారం గోచరిస్తోంది. మరి నిలబడలేక కింద కూలబడ్డాడు రాజయ్య మనసులోనే ఏదో గొణుక్కుంటూ.

ఈ లోపున అక్కడ ఆందోళన ఒక్కసారిగా ఉదృతం అయింది. ఒక్కసారిగా ఆఫీస్‌మీద జనం తిరగబడ్డారు. ఆ గుంపులో ఎవరో తాళం పగలగొట్టారో, లేక మరి తలుపే విరగగొట్టారోగానీ అందరూ మూకమ్మడిగా లోపల జొరబడ్డారు. లోపలున్న వస్తువులు చిందరవందర చేసారు. దొరికినవి దొరికినట్లే దోచుకున్నారు. డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కొంతమందైతే శాపనార్థలు పెడుతున్నారు. కొంతమందైతే ఏజంట్లను దొరకబుచ్చుకొని వాళ్ళతో తగువు పెట్టుకుంటున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశంచేసి జనాన్ని చెదరగొట్టసాగారు.
ఆఫీస్‌ష్టాఫ్, ఏజెంట్లు ఒకొక్కరే జారుకోవడం చూసిన శేఖర్ తను కూడా తండ్రిని వెంటతీసుకొని కాళ్ళీడ్చుకుంటూ ఇంటిదారి పట్టాడు.
జరిగిన సంఘటనలకి మతిపోయిందిద్దరికీ. కట్నం వద్ద కచ్చితంగా ఉంటానన్న మాధవయ్యకి ఎలా నచ్చచెప్పాలి? ఇతర ఖర్చులకేం చేయాలో అంతుబట్టలేదు. తీవ్రంగా ఆలోచించి, మరేం చేయలేక ఇల్లు అమ్మనిశ్చయించాడు రాజయ్య. ఇల్లమ్మి కట్నంలో సగం అడ్వాన్స్ కింద ఇచ్చాడు. మిగతా సగం పెళ్ళిసమయంలో ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. పోనీ ఇలాగైనా ఓ సమస్యతీరిందని కాస్త ఉపిరి పీల్చుకున్నారు తండ్రీకొడుకులు.

అయితే ఈలోపున శేఖర్ ఏజెంట్‌గా ఎవరెవరివద్దనుండి డిపాజిట్ సేకరించాడో వాళ్ళులో కొందరు ఇంటిపైపడి గలాటా చేసి చేతిలో ఉన్న మిగిలిన డబ్బులు లాక్కుపోయారు. ఫలితంగా పెళ్ళి ఆగిపోయింది. పెళ్ళి ఆగిపోవడంతో అవమానం భరించలేక సుమ విషంతాగి తనువు చాలించింది. అదిచూసి తల్లడిల్లిపోయిన రాజయ్యకి గుండెపోటురూపంలో మృత్యువు ఎదురైంది. తన ప్రమేయం లేకుండానే ఒక్కటి తర్వాత ఒకటిగా జరిగిన ఈ దుర్ఘటనలకి శేఖర్ తట్టుకోలేకపోయాడు. ప్రాణంకన్న మిన్నగా ప్రేమించిన తన తండ్రి, చెల్లెలు పోయినాక జీవితం మీద పూర్తిగా విరక్తి కలిగింది శేఖర్‌కి. లోకమంతా శూన్యంగా తోచింది. తనెవ్వరికోసం బ్రతకాలన్న నిర్వేదం మనసుని కలవరపరచింది. పైగా తన ద్వారా డిపాజిట్ చేసినవాళ్ళందరూ అతనిపై విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారు. అతను కనిపించినప్పుడల్లా గొడవచేస్తున్నారు. వాళ్ళకి జవాబ్బిచుకోలేక సతమతమవసాగాడు శేఖర్. వాళ్ళని తప్పించుకోవడానికి బయటే తిరుగుతున్నాడు రోజంతా. ఇల్లు వదిలి ఎన్నాళ్ళో అయింది. తను ఎక్కడకి వెళుతున్నాడో కూడా గమనించలేని స్థితిలో ఉన్నాడు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. అలా తిరుగుతూ తిరుగుతూ చాలా దూరం వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళుతున్నాడో, ఎంతదూరం వెళుతున్నాడో తెలియదు. సమయం ఎంతైదో కూడా గమనించలేదు.. అప్పుడే గమనించాడు చుట్టూ చీకట్లు ముసురుకున్న సంగతి. అప్పుడే పైకి వచ్చిన చంద్రుడు తన కాంతితో చీకట్లు పారదోలడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. తనవాళ్ళని పోగొట్టుకుని, భికారి అయిపోయి, తీరని అవమానం పాలైన శేఖర్‌లో బతకడానికి ఇక ఏమాత్రం వాంఛ మిగిలి లేదు. ఆత్మహత్యే ఒక్కటే తన సమస్యలకి తగిన పరిష్కారమని అనిపించిందా క్షణంలో శేఖర్‌కి. ఈ ఆలోచన వచ్చినదే తడువుగా ఆ దాపులలోనే ఉన్న పాడుబడిన బావికేసి గబగబ అడుగులు వేసాడు. ఒక కాలు బావిగట్టు మీద వేసి రెండోకాలు ఎత్తాడు. మరుక్షణం నూతిలో పడి ప్రాణం విడిచేవాడే! అయితే, ఏదో అదృశ్యహస్తం లాగినట్లు ఒక్కసారిగా వెనక్కిపడ్డాడు. ఎవరు తన ప్రయత్నాన్ని అడ్డుకున్నారని వెనుతిరిగి కోపంగా చూసాడు శేఖర్.

అతనికెదురుగా తెల్లని చొక్కా, పంచ ధరించిన ఓ మధ్య వయసు వ్యక్తి కనిపించాడు. తెల్లని దుస్తులతో అతనుకూడా తెల్లగా మెరిసి పోతున్నాడు ఆ వెన్నెలకాంతిలో. ముఖంమీద విభూతిరేఖలతో వింత కాంతి వెదజల్లుతున్నాడు. అతని ముఖంలో సునిశిత దరహాసం ఉంది. అతన్ని చూసి కోపం మరచిపోయి అప్రయత్నంగా చేతులు జోడించాడు శేఖర్.

"తప్పు నాయనా! ఆత్మహత్య మహాపాపం. చనిపోయి ఏమిసాధిద్దామనుకున్నావో నాకైతే తెలియదుగాని, అది మాత్రం పిరికివాళ్ళ లక్షణం. భగవంతుడు జీవితాన్ని మనకి ప్రసాదించినది బలవంతంగా మనం జీవితాన్ని చాలించడానికి మాత్రం కాదు. దేవుడు మనకి గురిచేస్తున్న పరీక్షలని తట్టుకొని నిలబడగలగాలి. అదే జీవితమంటే!” నవ్వుతూ అన్నాడతను హితబోధ చేస్తూ.

"అయ్యా! నన్నెందుకు బ్రతికించారో తెలియదు. నన్ను చావనియ్యండి. నాకున్న సమస్యలకి, నా బాధలకీ చావు ఒక్కటే పరిష్కారం." అన్నాడు శేఖర్ పైకిలేస్తూ.

"అసలు ఏమిటి నీ సమస్య? ప్రతీ సమస్యకీ పరిష్కారముంటుంది. అంతేకాని, ప్రతీ చిన్న సమస్యకీ ఆత్మహత్య పరిష్కారం కాదు. జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి." అన్నాడా వ్యక్తి చిరునవ్వుతో.

"హుఁ... పరిష్కారం...నా సమస్య పరిష్కారం లేనిది స్వామి! నా బాధ తీరేది కాదు. అసలు నేనెందుకు బ్రతకాలి? ఎవరికోసం బ్రతకాలి?" అంటూ తన వృత్తాంతం మొత్తం చెప్పాడు. అంతా విని పెద్దగా నిట్టూర్చాడు ఆ వ్యక్తి.

"అంతా విధి లీల నాయనా! అందులో నువ్వు నిమిత్తమాత్రుడివి. ఇందులో నువ్వు చేయగలిగిందేమీ లేదు. గతం గతః. నువ్వు గతంగురించి ఆలోచించి బాధపడకుండా భవిష్యత్తుగురించి ఆలోచించు. పోయినవారిని ఎవ్వరూ వెనక్కి తీసుకురాలేరు. ఆ బాధని భరించాలి, తప్పదు, నీకోసం నీ ముందున్న భవిష్యత్తు కోసం. ఆత్మహత్య చేసుకునేముందు ఒక్కక్షణం ఆగి అలోచిస్తే ఎవ్వరూ ఎప్పుడూ ఆత్మహత్యకి పూనుకోరు. కష్టాలు కలకాలం గూడుకట్టుకొని ఉండిపోవు. ఇవాళ అయిన గాయం రేపు మాసిపోతుంది. కాలమే అన్నిటికీ పరిష్కారం చూపిస్తుంది. విచక్షణ కోల్పోకుండా కేవలం ఒక్కక్షణం ఆలోచిస్తే చాలు. కేవలం ఒకే ఒక్క క్షణం! రేపొద్దున్న ఎప్పుడైనా గుర్తుకువస్తే నువ్వు ఇలా ఒకప్పుడు ఆలోచించినందుకు సిగ్గుపడతావు. ఇప్పుడు నీకోసం నువ్వు జీవించాలి. గతం మరిచిపో! నీకు బతికే యోగం ఉంది, అందుకే నా కళ్ళబడ్దావు. పో!...జీవించి సుఖపడు! మరెప్పుడూ ఆత్మహత్య అలోచన పొరపాటున కూడా తలబెట్టకు." అన్నాడు అతను ఙానబోధ చేస్తూ.
అనిర్వచనీయమైన వింత కాంతితో మెరిసిపోతున్న అతనివైపు సంభ్రమంగా చూసాడు శేఖర్. అతనిలో ఎదో మెస్మరైజింగ్ శక్తి ఉంది. అతని మాటల్లో యదార్ధం గోచరించింది. నిజమే! ఒకే ఒక్క క్షణం ఆలోచిస్తే ఈ లోకంలో ఇన్ని అత్మహత్యలు ఉండవేమో? తన బాధలు తాత్కాలికం గా మరిచిపోయిన శేఖర్‌ అప్రయత్నంగా అతనికి చేతులు జోడించాడు.

"అయ్యా!...మీరెవరో, మహానుభావులు! నా కళ్ళిప్పుడు పూర్తిగా తెరుచుకున్నాయి. నేనిప్పుడు మరింక అత్మహత్యకు పాల్పడను. జీవితంతో పోరాటం చేస్తాను. అయ్యా! తమ పేరు తెలుసుకోవచ్చా?" అన్నాడు శేఖర్. చిన్నగా నవ్వాడు ఆ వ్యక్తి. అతని నువ్వులోనే ఏదో వింత ఆకర్షణ ఉంది. "నా పేరు పురుషోత్తం. నేనిక్కడే ఎదురుగుండా కనబడే ఆ తెల్లటి ఇంట్లో ఉంటాను. ఆ పక్కనేగల శివాలయంలో పౌరోహిత్యబాద్యతలు నిర్వహిస్తున్నాను. లోకంలో అందరూ సుఖంగా ఉండాలనే నా కోరిక. నువ్వుకూడా నీ గతం మరచిపోయి నీ భవిష్యత్తు మీద ఆశలు పెంచుకొని సుఖంగా ఉండాలన్నదే నా కోరిక." అన్నాడు.

“అయ్యా! నేను జీవితంలో స్థిరపడిన తర్వాత మీ ఆశీర్వాదంకోసం తప్పకుండా ఇక్కడికి మళ్ళీ వస్తాను." అన్నాడు శేఖర్ మనస్పూర్తిగా.
"తప్పకుండా నాయనా!" అన్నాడు పురుషోత్తం. తనని ఆత్మహత్యనుండి కాపాడి తనకి పునర్జన్మ ప్రసాదించిన పురుషోత్తం కాళ్ళకి మొక్కి అతని ఆశీర్వాదం తీసుకొని వెనక్కి తిరిగాడు శేఖర్. ఆ తర్వాత మరో పట్టణానికివచ్చి ముందు చిన్నచిన్న పనులుచేసి రోజులు గడుపు కున్నాడు. సంపాదించిన డబ్బుల్లో కొంత దాచుకునేవాడు. ఆ తర్వాత అతన్ని అదృష్టం వరించింది. దాచుకున్న డబ్బులతో చిన్నపాటి వ్యాపారం మొదలుపెట్టాడు. అదృష్టం కలసివచ్చి అతని వ్యాపారం దినదినాభివృద్ధి చెంది ప్రస్తుతం ఉన్న స్థితిలో శేఖర్‌ని నిలబెట్టింది. వ్యాపారం లో అతని దక్షత, నిజాయితీకూడా అతను పైకి ఎదగడానికి బాగా దోహదపడ్డాయి. అతని అకుంఠిత దీక్ష, వ్యాపారంపై ఉన్న నిబద్ధత గమనించి ప్రముఖ పారిశ్రామికవేత్త, కోటీశ్వరుడైన రంగారావు తన కూతురు రమ్యని ఇచ్చి తన అల్లుడ్ని చేసుకున్నాడు.

"అదీ జరిగిన కథ! ఇది జరిగి ఇవాళకి సరిగ్గా అయిదేళ్ళైంది. అయితే ఇప్పటికీ ఆ దురదృష్ట సంఘటనలు మరిచిపోలేక పోతున్నాను. మా నాన్న, మా చెల్లి గుర్తుకువచ్చినప్పుడల్లా అంతులేని వేదనకి గురవుతున్నారు. సరిగ్గా మూడునెలలకిందట మా ఊరు వెళ్ళడం తటస్థించింది. ఇంతవరకూ ఆ 'అక్వాగోల్డ్' సమస్య ఓ కొలిక్కి రాలేదు. నాలాగే చాలామంది సర్వసం పోగొట్టుకున్నారు. ఏజెంట్ల పరిస్థితి అయితే చెప్పొద్దు! నా స్నేహితుడు శంకరం ఏమయ్యాడో ఎవ్వరూ చెప్పలేకపోయారు. నిరుద్యోగులుగా ఉన్న యువకులను ఉద్యోగం పేరుతో ఎరవేసి, చేరదీసి వాళ్ళని, వాళ్ళని నమ్మిన పాపానికి వాళ్ళ బంధుమిత్రులని తన ఉచ్చులోకి లాక్కుంది ఆ కంపెనీ. చాలామంది జీవితాలు ఛిన్నా భిన్నమై పోయాయి. నా మట్టుకు నేను చేయగలిగినంతవరకూ నా వల్ల నష్టపోయిన వాళ్ళకు తగిన చేయూతనిచ్చాను." అన్నాడు శేఖర్.

"చాలా విచారకరమైన సంఘటన. మీరు నిజంగా అదృష్టవంతులు. ఆ పురుషోత్తం ఎవరోగాని మహానుభావుడు మీకు నిజంగా పునర్జన్మ ప్రసాదించాడు." మనస్పూర్తిగా అంది రమ్య.

"అతన్నికలసి కృతఙతలు తెలుపుకోవడానికే బయలుదేరామిప్పుడు. మనం ఇప్పుడు ఆప్రాంతానికి దగ్గరకొచ్చేసాం." అని డ్రైవర్‌నుద్దేశించి, "అప్పారావు! ఆ కుడిచేతి వైపుకి పోనీయ్! అక్కడ ఆ రావిచెట్టు పక్కనుండే తెల్లటి బిల్డింగ్ పక్కన కారాపు" అన్నాడు. అక్కడ కారాపిన తర్వాత కారు దిగారు వాళ్ళు. శేఖర్ ఆ ఇంటివైపు వెళ్ళాడు. అతన్ని అనుసరించారు రమ్య, చింటూ. ఇల్లు పూర్తిగా పాడుపడిఉంది. బయట బాగా బూజులుపట్టి ఉంది. దూరంనుండి తెలియలేదు కాని, ఆ ఇంట్లో చాలా రోజులనుండి ఎవరూ మసలుతున్న సందడి లేదు.
ఆ చుట్టుపక్కలెవరూ లేకపోవడంతో ఆ దగ్గరున్న శివాలయంవైపు వెళ్ళాడు శేఖర్. అప్పుడే ఆలయం మూసివేసి బయటకు వస్తున్నాడు అర్చకుడు.

"ఇప్పుడే ఆలయం మూసివేస్తున్నాను. మళ్ళీ సాయంకాలం నాలుగుగంటలకి తెరువబడుతుంది. అప్పుడే మీరు దర్శనం చేసుకోవచ్చు. అందాకా కావలిస్తే ఈ అరుగుమీద కూర్చోవచ్చు. " అన్నాడతను శేఖర్‌ని చూస్తూనే.

"ఆహఁ...అదికాదు, దర్శనం సాయంకాలం చేసుకుంటాం. కాకపోతే ఇక్కడ ఈ ఇంట్లో పురుషోత్తంగారని ఉండాలి! అతనికోసం వచ్చాం మేము. ఈ ఆలయంలోనే ఆయన అర్చకులుగా ఉన్నారుకదా!" అడిగాడు శేఖర్.

"అతనా! ఆయనిప్పుడు లేరు." అన్నాడు అతను శేఖర్‌వైపు చూస్తూ.

"లేరా! ఎక్కడికి వెళ్ళారు? ఎప్పుడొస్తారు? అతన్ని కలసుకోవాలని వచ్చాం." అన్నాడు శేఖర్.

"ఆయన్ని కలసుకోవడం వీలుపడదు. ఆయనిప్పుడు జీవించిలేరు. ఆయన చనిపోయి చాలాకాలం అయింది." జవాబిచ్చాడు అతను.
ఒక్కసారిగా హతాసుడైనాడు శేఖర్. "ఏమిటి, నిజమా? ఎలా జరిగింది? నేను అయిదేళ్ళక్రితం కలసినప్పుడు బాగానే ఉన్నారే?" అన్నాడు.
"అయిదేళ్ళక్రితమా! ఆయన చనిపోయి పదేళ్ళుపైనే అయ్యిందే! మీరు పొరబడుతున్నారు, బహుశా పురుషోత్తంగార్ని మీరు అంతకుముందు కలసిఉంటారు" అన్నాడతను.

"లేదు! సరిగ్గా అయిదేళ్ళ క్రితం ఇదే రోజు, అదే మే 21వ తారీఖన అదిగో ఆ బావిపక్కన అతను నాకు కనిపించారు." అటువైపు చూపుతూ అన్నాడు శేఖర్.

"అదెలా సాధ్యం! పురుషోత్తంగారు చనిపోయే పదేళ్ళుపైన అయింది. ఆ తర్వాతే నేను ఇక్కడ అర్చకుడిగా చేరాను. కావలిస్తే ఈ ఊళ్ళో మిగతా అందర్నీ అడగండి." విస్తుపోయాడు శేఖర్. ఆరోజు తను పురుషోత్తంగార్ని చూసి ఉండకపోతే మరి ఇంకెవర్ని చూసినట్లు? ఆ రూపం తనమదిలో ఇప్పటికీ సజీవంగానే ఉంది. విభూతిరేఖలతో కాంతివంతమైన ఆ ముఖం తను ఇప్పటికీ మర్చిపోలేదు. అతను తన ప్రాణదాతమరి.! శేఖర్ మనసులో అలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి.

అప్పటికే వీళ్ళమాటలు వినబడి అటువైపు వెళుతున్నఆ ఊరివాళ్ళు ఐదారుగురు పోగయ్యారు. విషయం అడిగి తెలుసుకున్నారు. అందులో దాదాపు ఎనభైఏళ్ళ వయసుగల ముదుసలి ఒకడున్నాడు. అతను శేఖర్‌వైపు తేరిపార చూసాడు. "అవును బాబు! అతనన్నట్లు పురుషోత్తం చనిపోయి ఇప్పటికి పదేళ్ళ పైమాటే అయింది. ఒకప్పుడు పురుషోత్తం ఆలయానికి ఆనుకుని ఉన్న ఇప్పటి ఈ పాడుబడిన ఇంటిలోనే ఉండేవాడు. అతనికో కూతురు ఉండేది, పేరు కమల. ఆమె చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకుంది. తల్లిలేని ఆమెని చాలా గారాబంగా పెంచాడు. ఆమెమీదే తన పంచప్రాణాలు పెట్టుకున్నాడు. ఆమె పక్క ఊళ్ళో కాలేజిలో చదువుతుండగా మరో కులానికి చెందిన అబ్బాయిని ప్రేమించింది. ఆ విషయం తెలిసి పురుషోత్తం ఆమెని కట్టడి చేసాడు. కులాంతర వివాహానికి ఒప్పుకోలేదు. దాంతో ఆమె, ఆ అబ్బాయి కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఆ విషయం జీర్ణించుకోలేకపోయాడు పురుషోత్తం. అంతగా ప్రేమించాడు కూతుర్ని ఆయన. ఆమె అలాంటి పనిచేస్తుందని తెలిస్తే పెళ్ళికి ఒప్పుకునేవాడేమో మరి! ఆత్మహత్య చేసుకునే ముందు ఒక్కక్షణం తన గురించి ఆలోచించి ఉంటే ఆ పనికి ఒడిగట్టకపోయేవారని చాలాసార్లు వాపోయేవాడాయన. ఆ తర్వాత దాదాపు పిచ్చివాడైపోయాడు. చివరిక్షణాల్లో చాలా మానసిక క్షోభచెంది శివైక్యం చెందాడాయన. అలాంటి అతను నీకు అయిదేళ్ళక్రితం ఎలా కనిపిస్తాడు?” అన్నాడతను.

ఆ మాటలు శేఖర్ మెదడులో చాలా ప్రకంపనలు సృష్టించాయి. అతని మెదడు మొద్దుబారిపోయింది. అదెలా సాధ్యం?! అయితే తనకి ఆ రోజు కనిపించినది పురుషోతం కాదా! అతని ఆత్మా ఆ రోజు తను చూసింది? పురుషోత్తం హితబోధ ఇప్పటికీ తన చెవుల్లో మారుమోగుతోందే! అయితే... కేవలం తనని ఆత్మహత్య నుండి కాపాడడానికే పురుషోత్తం ఆత్మరూపంలో తనకు కనిపించాడా! తన కూతురులాగా ఇంకెవరూ ఆత్మహత్యకు పాల్పడకూడదన్న పురుషోత్తం ఆశయంవల్ల ఆ రోజు కనిపించాడా తనకి! ఆ భావన మదిలోకి రాగానే ఒక్కసారి చిగురుటాకులా చలించిపోయాడు శేఖర్. అతని భుజంమీద చెయ్యవేసి అనునయించింది రమ్య.

మరిన్ని కథలు

Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు