కనువింపు - శివరామ ప్రసాద్ వక్కలగడ్ల

kanuvimpu

వేద షాపింగ్ మాల్ లోపలికి ఎంటర్ అవుతూనే , అంతలో అక్కడ షాపింగ్ చేస్తున్న లక్ష్మిని చూసి, ఆనందంగా లక్ష్మీ అని పిలిచింది.

వేద :- హాయ్ లక్ష్మీ! ఏం చేస్తున్నావ్? ఎలా ఉన్నావ్ ? ఎక్కడ ఉన్నావ్ ? ఎన్నాళ్లయ్యిందే నిన్ను కలిసి. ..ఏంటి విశేషాలు చెప్పు …చెప్పవే !

లక్ష్మి :- నువ్వు ఎప్పటికీ మారవే ..ఎదుటి మనిషిని అస్సలు మాట్లాడనివ్వవు . అయినా నా పేరు ఇప్పుడు లక్ష్మి కాదే ! మా వారి కోసం లక్కీ అని మార్చుకున్నా .

వేద :- అదేంటి …నువ్వు మ్యారేజ్ ఎప్పుడు చేసుకున్నావు ..? ఎవర్ని?

లక్కీ :- జస్ట్ 6 నెలలు అవుతుందే …! ఎవర్నీ పిలవలేదు.

వేద :- లవ్ మ్యరేజా ? కొంప తీసి లేచి పోయి పెళ్లి చేసుకున్నావా ..?

లక్కీ :- అదేం కాదు. .కమర్షియల్ మ్యారేజ్ .

వేద :- అదేంటి ….క్రొత్తగా. ..

లక్కీ :- సరే చెప్తా విను .

ఈ మధ్య తరగతి ఆలోచనలు, బాధలు , కష్టాలు, కన్నీళ్లు, చావలేక , ఇటు బ్రతకలేక సమస్యల సుడిగుండాలలో పడి నలిగిపోవడం , అన్నీ దగ్గర నుంచి చూసి భరించలేక పోయాను.మా అమ్మ, నాన్న ముగ్గురు ఆడపిల్లలను చదివించి , పోషించి మా ఖర్చులు అన్నీ భరించటానికే వాళ్ళ జీవితం సరిపోతుంది. ఇక పెళ్ళి అంటే …? ఏదో బ్రతుకుతున్నాం అంటే బ్రతుకుతున్నాం అంతే …అందుకే విసిగిపోయి నేనే ఓ నిర్ణయం తీసుకున్నా ….అదే కమర్షియల్ మ్యారేజ్ .

నేను చదువుకున్నాను , అందంగా ఉంటాను. కాబట్టి నన్ను పెళ్ళాడే వాడు నాతో పాటు, మా ఫ్యామిలీ కష్టాలను ప్రేమించి, వాటి నుంచి మా ఫ్యామిలీని బైట పడేయాలి అని కండీషన్ పెట్టా …ఆ సంగతి తెలిసిన ఒక ఫేస్బుక్ ఫ్రెండ్ ఓకే చెప్పాడు . ఏజ్ ఎక్కువ. ..

అంత అందగాడేమీ కాదు కానీ బ్యాంకు బ్యాలెన్స్ ఫుల్, మంచి శాలరీ , ఆస్తి పరుడు కావడంతో వెంటనే ఒప్పుకున్నాను .ఆశ , అవసరం కలిపి నా పెళ్ళి చేశాయి .హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను.

వేద :- మరి ప్రకాష్. ..?

లక్కీ :- ప్లీజ్ ఆ టాపిక్ వదిలెయ్ …

వేద :- సరే నీ భర్త గురించి చెప్పూ … అంత మంచి వాడైతే …ఇన్నాళ్లు పెళ్ళెందుకు అవ్వలేదట …

లక్కీ :- వయసులో ఎంజాయ్ మెంట్ కి పెళ్ళాం అడ్డు అని …బ్యాచిలర్ లైఫ్ బెటర్ అనుకున్నాడట గురుడు .ఇప్పుడు తప్పు తెలుసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంటర్ అయ్యాడట .నన్ను చూసి ఫ్లాట్ అయ్యి వెంటనే పెళ్లి కి ఓకే చెప్పాడట పాపం .

వేద :- మరి నీతో కమిట్ మెంట్ ఎలా ఉంటుంది ?

లక్కీ :- కమిట్ మెంట్ ఎవడికి కావాలే ? క్యాష్ ఉంటే చాలు …..

3 సంవత్సరాల తరువాత విజయవాడ లో ఒక రోజు పార్క్ లో

పార్క్ లో పిల్లవాడ్ని ఎత్తుకుని ఆడిస్తున్న వేద ….మొహం చాటేస్తూ ప్రక్కకు త్రిప్పుకుని వెళ్లిపోతున్న లక్కీని చూసి వేద లక్కీని పిలిచింది. వినిపించినా వినపడనట్లు వెళ్లిపోతున్న లక్కీని ….లక్ష్మీ ..అని ప్రకాష్ పిలిచిన పిలుపుతో ఆగి చూసింది .ఎదురుగా ప్రకాష్ ..

ప్రకాష్ :- నేను ప్రకాష్ ని …నేను, వేద పెళ్లి చేసుకున్నాం .అడిగో మా ఇద్దరికీ ఒక బాబు పుట్టాడు .రా చూద్దువుగానీ …

అలా ప్రకాష్ చెబుతుంటే కంటిలోని కన్నీటిని, గుండెలోని బాధను దిగమ్రింగుకుంటూ వారి వైపు నడిచింది.

వేద :- ఏంటే …పిలిస్తే పలుకకుండా వెళ్లిపోతున్నావ్ ?

లక్కీ :- అదేం లేదే..

వేద :- అవునూ ..నువ్వు విజయవాడ లో ఏంటి ?మీ వారు ఏడి ఎక్కడ?

లక్కీ :- నా సంగతి సరే ..నువ్వూ , ప్రకాష్ ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు ?

వేద :- నువ్వు వదిలి వెళ్లిపోయాక ప్రకాష్ పిచ్చివాడైపోయాడు .నీ జ్ఞాపకాల తోనే , బ్రతుకుతూ, జీవితానికి, ప్రపంచానికి దూరంగా బ్రతికాడు .అప్పుడు ప్రకాష్ తల్లిదండ్రులు వచ్చి నా దగ్గర చాలా బాధపడ్డారు .నేను తనని ఓదార్చటానికి చాలా ప్రయత్నించాను .నువ్వు తన జీవితంలోకి రావని నచ్చజెప్పాను .అలా …తను నీపై పెంచుకున్న ప్రేమను చూశాక తన ప్రేమ ఎంత గొప్పదో అర్థమైంది .తన మనసు ఎంత సున్నితమయిందో అర్థమయ్యింది. అందుకే మనమిద్దరం పెళ్లి చేసుకుని క్రొత్త జీవితం మొదలు పెడదామని చెప్పాను.మొదట ప్రకాష్ ఒప్పుకోలేదు …కానీ తర్వాత సరే అన్నాడు .మా ప్రేమకు ప్రతిరూపం వీడు ..ఇడిగో చూడు .

ప్రకాష్ :- లక్కీ …నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను .కానీ నువ్వు నన్ను వదిలి వెళ్లిపోయావ్ .జీవితం శూన్యం అనిపించింది. జీవితం మీద విరక్తి తో ,చనిపోదామనుకున్నా …! వేద …నాకు మళ్ళీ పునర్జన్మ ప్రసాదించిన దేవత .వేద నాలోని వైరాగ్య భావాల్ని పారద్రోలి …నా జీవితం చిగురింపజేయటమే కాకుండా జీవితాంతం నా తోడుంటానని ప్రమాణం చేసింది. నేను ప్రతిక్షణం తనకు ఋణపడి ఉంటాను. వీడు ( బాబు ) నా జీవితానికి ఇంకో ఆశగా జన్మించాడు.నేను నిజంగా అదృష్టవంతుడిని.

లక్కీ ప్రేమగా ఆ బాబును తన చేతులలోకి తీసుకుని, తన బాధను గుర్తు చేసుకుని, బోరున విలపిస్తూ బాబును గుండెకు హత్తుకుని మద్దులు పెడుతూ కన్నీటి పర్యంతమవ్వటం చూసిన ప్రకాష్, వేద తనని ఓదార్చటానికి విఫలయత్నం చేశారు. అతి కష్టం మీద, లక్కీ కి ధైర్యం చెప్పి అసలు ఏం జరిగిందని అడిగారు.

లక్కీ :- వేదా …నేను మోసపోయానే …ఆస్తులు, డబ్బు అని అతికిపోయి , నేను ఊబిలో దిగటమే కాకుండా నా ఫ్యామిలీని కూడా నిలువునా సమాధి చేశానే .

వేద :- ( షాక్ తో ) ఏం మాట్లాడుతున్నావే ?అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పు .

లక్కీ :- పెళ్లి జరిగిన తర్వాత కొన్నాళ్లపాటు సరదాగా, జాలీగా , విదేశీ టూర్ లు , హ్యాపీ గా గడిచిపోయిందే జీవితం. ఒక మధ్యతరగతి అమ్మాయికి ఇన్ని భోగాలు కనిపిస్తే, తనను తాను మర్చిపోక ఏం చేస్తుందే ? నేనూ అదే చేశాను .ఎంతగా అంటే తను ఏం చెప్తే అది చేసేంత పిచ్చి దానిలా మారిపోయాను.ఆ తరువాత ఒక రోజు నీ సిస్టర్స్ ఇద్దరికీ దుబాయ్ లో ఉద్యోగం చూశాను .చాలా పెద్ద కంపెనీ , మంచి శాలరీ, నాకు కంపెనీ డైరెక్టర్స్ క్లోజ్ ఫ్రెండ్స్,నీకు ఇష్టమైతే వాళ్ళిద్దర్నీ పంపిద్దాం .ఆ తర్వాత నాకు తెలిసిన వాళ్ళు దుబాయ్ లో చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో మంచి అబ్బాయిలని చూసి పెళ్లి చేస్తే వాళ్ల లైఫ్ సెటిలవుతుంది. ఇప్పటినుంచే వాళ్లు కూడా కల్చర్ పరంగా అలవాటు పడతారు. నాకు కూడా వాళ్ళు చెల్లెలు లాంటి వారే కదా ! అని చెప్పాడు. ఆ మాటలకు నా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇంతలా నా కుటుంబం గురించి, నా వాళ్ల గురించి ఆలోచించే భర్త దొరకటం నా అదృష్టంగా మురిసిపోయాను. ఇంక ఏమీ ఆలోచించకుండా , అందర్నీ బలవంతంగా ఒప్పించి, వాళ్ళిద్దర్నీ దుబాయ్ పంపించాను.

కొన్ని రోజుల తర్వాత, ఒక రోజు నా జీవితంలో ఊహించని సంఘటన ఎదురయ్యింది.ఒక రోజు రాత్రి, నా భర్త నాతో …నేను నిన్ను సెక్సువల్ లైఫ్ లో సంతృప్తి పరచలేక పోతున్నాను .అలా అని నువ్వు నిరుత్సాహపడటం నాకు ఇష్టం లేదు. నేను నీకు న్యాయం చేస్తాను.ఎందుకంటే కొన్నాళ్లకి నువ్వు నాతో సంసార సుఖానికి సంతృప్తిపడక ఇతర వ్యక్తులపై ఆధారపడటం ,వాళ్ళ దగ్గర నా శక్తి సామర్ద్యాలపై కామెంట్ చేయటం నాకు ఇష్టం లేదు.అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను.

నేను త్వరలో ఒక కంపెనీ స్టార్ట్ చేయబోతున్నాను .అందులో ఐదుగురు పార్టనర్స్ .నేను నీకు మిగతా నలుగురుని పరిచయం చేస్తాను.వారిలో ఒకరికి తెలియకుండా ఒకరితో చనువుగా ఉంటూ , వాళ్ళకు కావలసింది వారికి ఇస్తూ , వాళ్ళని నీ గుప్పెట్ట్లో పెట్టుకుని, నాకు హెల్ప్ చేయాలి.అంతేకాదు వాళ్ళకి నువ్వంటే ఎంత పిచ్చో తెలుసా .?నువ్వు ఊ…అంటే ప్రాణాలైనా ఇస్తారు వెధవలు.

నేను ఆ మాట వినగానే, కోపంతో స్టాప్ దిస్ నాన్సెన్స్ అంటూ చంపఛెళ్ళుమనిపించాను.ఇలా ఎలా ఆలోచించగలిగావ్ ..?అని ఏడ్చాను.అయినా వదలకుండా రోజూ టార్చర్ చేసేవాడు. ఆఖరికి ఎంతకీ లొంగకపోయేసరికి నీ చెల్లెళ్ళ భవిష్యత్తును నాశనం చేస్తాను , నీ తల్లిదండ్రులను చంపేస్తాను అని బెదిరించాడు.నా ఒక్క దాని కోసం అందరి జీవితాలు నాశనం చేయటం ఇష్టం లేక వాడు చెప్పిన దానికి ఒప్పుకున్నాను. అలా కొన్ని రోజులు గడిచేసరికి నాకు వాడి గురించి కొన్ని నమ్మలేని నిజాలు తెలిశాయి.అవి ఏమిటంటే వాడు ఒక పెద్ద క్రిమినల్, వాడి మీద సెక్స్ రాకెట్, డ్రగ్స్ డీలింగ్ కి సంబంధించిన కేసులు ఉన్నాయి. అంతేకాదు వాడు ..కంపెనీ పార్టనర్స్ అని చెప్పి నాకు పరిచయం చేసిన వాళ్లు వాడి రిచ్ కస్టమర్లు .నా చెల్లెళ్ళు ఇద్దరినీ దుబాయ్ లో షేక్ లకు అమ్మేసి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకున్నాడు అని నాకు వాళ్లు చెప్తేనే తెలిసింది. ఆ క్షణంలో నా మీద నాకే అసహ్యం వేసింది. నా తప్పుడు నిర్ణయాల వల్ల నా చెల్లెళ్ళు బలైపోయారు. ఎలాగైనా వాడి అంతు చూడాలని నిర్ణయించుకున్నాను.

ఈ విషయాన్ని పోలీసులకు చెప్పి వాడిని అరెస్టు చేయించాలన్న ఆశతో పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన నాకు ఐపిఎస్ ఆఫీసర్ ఎదురు వచ్చాడు. వాడు ఎవరో కాదు నాకు పరిచయం చేసిన నలుగురు లో ఒకడు. నా ఆవేశం చూసి, నా నోరు నొక్కి, నన్ను తప్పుడు కేసులలో అరెస్టు చేయించి, కొన్ని నెలల పాటు జైలులో చిత్రహింసలు పెట్టారు. ఆ తర్వాత నన్ను రహస్యంగా ముంబై లోని వేశ్యా గృహానికి అమ్మేశారు .అదొక నరక కూపం .మా అమ్మ, నాన్న నా గురించి నిలదీస్తే నేను అంతకు ముందు వాడి ఫ్రెండ్స్ తో గడిపిన వీడియోలు చూపించి, నీ కూతురు, నా డబ్బు, దోచుకొని ఎవడితోనో వెళ్లి పోయింది అని నమ్మించాలని చూశాడు.వాళ్ళు నమ్మకపోయేసరికి వాళ్ళని చంపేసి , కూతురు చేసిన పనికి ఆత్మహత్య చేసుకున్నారు అని మా బంధువులను నమ్మించారు.

నా జీవితంలో అన్నీ కోల్పోయాను .నిరాశ , నిస్పృహ, విరక్తి నన్ను ఆవహించాయి…చావాలనుకున్నాను.కానీ దేవుడు నాకు అందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. నేను చేసిన తప్పులకు , బ్రతికినన్నాళ్ళు కుమిలి , కుమిలి చావమని దీవించాడు.రోజూ అక్కడ నరకం చూపించేవారు. పచ్చి మాంసపు ముద్దలైన శరీరాలతో వ్యాపారం చేయించేవారు.

కొన్ని రోజుల తర్వాత నా జీవితంలోకి ఆకాష్ వచ్చాడు.నా శరీరం కోసమని నా దగ్గరకు వచ్చి , నా మనసులోని బాధనంతా తెలుసుకుని ఓదార్చాడు.నన్ను ప్రేమతో దగ్గరకు తీసుకొని, నా జీవితానికి ఒక కొత్త ఆశ కల్పించాడు. ప్రాణాలకు సైతం తెగించి నన్ను ఆ నరక కూపం నుంచి రక్షించి ఇక్కడకు తీసుకుని వచ్చాడు. దేవుడిలా నన్ను పెళ్ళి చేసుకుని నాకు మళ్ళీ జీవితాన్ని ప్రసాదించాడు.ఆకాష్ , నేను ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాం. ఇప్పటికీ ఆ సంఘటనలు గుర్తుకు వచ్చినా , ఆ విషయాలు చెప్పాల్సి వచ్చినా , నా శరీరం భయంతో వణికిపోతుంది. జీవితంలో తీరని వ్యామోహం , విపరీతమైన కోరిక , భరించలేని స్వార్థం , మనిషిని ఎంతటి బలి పశువును చేస్తాయో నాకు ఇప్పటికి గానీ కనువింపు కలుగలేదు…వేద …

అని వెక్కి వెక్కి ఏడుస్తున్న లక్కీ ని వేద , ప్రకాష్ కలిసి ఓదార్చారు.

వేద :- మరి నీ చెల్లెళ్ళ సంగతి. .?

లక్కీ :- ఇక్కడికి వచ్చిన వెంటనే పోలీసు కమిషనర్ గారిని కలిసి జరిగిందంతా చెప్పాను .ఆయన వాళ్ళని త్వరలో ఇండియా కి తీసుకుని వస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు. ..వాడినీ , వాడితో పాటు ఉన్న వాళ్ళని , ఆ పోలిస్ ఆఫీసర్ ని అందర్నీ అరెస్టు చేశారు. నేను చెప్పిన అడ్రస్ లన్నింటినీ సెర్చ్ చేసి చాలా మంది అమాయకులైన ఆడపిల్లలను రక్షించి తీసుకుని వచ్చారు. నా జీవితం నాశనమైనా …నా వల్ల కొంత మంది అమ్మాయిలకైనా ఆ నరకకూపం నుంచి విముక్తి లభించినందుకు సంతోషంగా ఉంది. నా చెల్లెళ్ళు ఇద్దరూ నా దగ్గరకు చేరితే …కొంతైనా నన్ను నేను క్షమించుకోగలుగుతాను .

మరిన్ని కథలు

Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు
Suhasini
సుహాసిని
- బొబ్బు హేమావతి