మేరా భారత్ మహాన్ - కాశీవిశ్వనాథం పట్రాయుడు

mera bharat mahan

మేరా భారత్ మహాన్
*********************
"అంకుల్ నేను మీ అబ్బాయి ఆలీ స్నేహితుణ్ణి దివాకర శాస్త్రిని మాట్లాడుతున్నాను. మీరు త్వరగా కేర్ హాస్పటల్ కి రండి". అవతలి నుంచి ఏమైంది బాబు అన్న మాటని వినిపించుకోకుండానే ఫోన్ పెట్టేశాడు దివాకర్ శాస్త్రి.

అత్యవసర చికిత్సావిభాగం లోకి ఆలీని తీసుకు వెళ్ళాడు దివాకర్.

"యాక్సిడెంట్ కేసా" అని అడిగాడు కౌంటర్లో ఉన్నవాడు.

"ఔను"

"డ్రంక్ అండ్ డ్రైవా?"

"కాదు, మావాడికి అలాంటి అలవాట్లు లేవు"

"మరి ఎలా...?

"రోడ్డు దాటుతూ ఉండగా కారు డేష్ ఇచ్చింది దాంతో తలకి బలమైన గాయమయ్యి బాగా రక్తం పోయింది.తొందరగా ట్రీట్మెంట్ ప్రారంభించండి"అన్నాడు దివాకర్.

"సరే వారికి సంబంధించిన వాళ్ళు సంతకాలు చెయ్యాలి.ఫార్మాల్టీస్ పూర్తి కావాలి. కౌంటర్లో డబ్బులు కట్టాలి అన్నాడు". కౌంటర్లో ఉన్నవాడు.

ఫార్మాల్టీస్ పూర్తిచేసి ఆలీని జాయిన్ చేశాడు దివాకర్.

" ఏమి జరిగిందో చెప్పకుండా త్వరగా రమ్మంటాడు ఈ పంతులు....

"నా బేటాకు ఏమి జరగలేదు కదా! అల్లా నువ్వే కాపాడాలి " అని గాబరా పడుతూ బయలు దేరాడు బాషా.

హాస్పిటల్ వెయిటింగ్ హాల్ లో అటూ ఇటూ తిరుగుతున్న దివాకర్ శాస్త్రిని ఏమైంది బాబు అని గాబరా పడుతూ అడిగాడు బాషా.

జరిగినదంతా చెప్పివాడికి ఏమీ కాదు. త్వరగానే నయం అయిపోతుంది.అన్నాడు దివాకర్.

డాక్టర్ లోపలి నుంచి వస్తూ.. యాక్సిడెంట్ అయిన అబ్బాయి తాలూకా మనుషులెవరైనా ఉన్నారా అని అడిగారు.

"సార్ నేను ఆ అబ్బాయి తండ్రిని..
ఎలాగుంది మా అబ్బాయికి.."
అని ఆతృతగా అడిగాడు బాషా.

"ప్రాణాపాయం తప్పింది. కానీ చాలా రక్తం పోయింది..
త్వరగా రక్తం కావాలి. దాతలని చూసుకోండి.
మీ వాడి బ్లడ్ గ్రూప్ ఓ నెగెటివ్.
అది దొరకడం కష్టం.
దాతని చూడండి అన్నారు డాక్టరు గారు."

దివాకర్ డాక్టర్ తో మాట్లాడుతూ ఉండగా ఆలీని చూడ్డానికి లోనికి వెళ్ళాడు బాషా. నుదిటికి బేండేజ్ తో ఉన్న కొడుకుని చూసే సరికి షాక్ కొట్టినట్లు అయ్యింది బాషాకి.

"ఎంత పని చేసావురా బేటా! ఆ బాపనయ్య తో కలిసి తిరగొద్దని, వాళ్ళకి మనకి నప్పదని ఎన్నో సార్లు చెప్పాను..నువ్వు వినిపించుకుంటే కదా!" అన్నాడు బాషా కొడుకుతో..

అప్పుడే ఆ గదిలోకి వస్తున్న దివాకర్ చెవిన పడ్డాయి ఆ మాటలు...విని చాలా బాధ పడ్డాడు.

*********************************

"అంకుల్ మీరు ఇక్కడే ఉండండి". అని చెప్పి బయటకి వెళ్లి
తన స్నేహితులకు వాట్సాప్ సమూహాలద్వారా సమాచారాన్ని చేరవేసి ఇంటికి వెళ్ళాడు దివాకర్.

**************************

రొప్పుతూ ఇంటికి చేరిన దివాకర్ ని చూసి..
"దివాకరం ఏమయ్యిందిరా? ఆ రక్తం మరకలేమిటిరా?
అయ్యో అయ్యో ఏమండీ తొందరగా రండీ..
అయ్యో దేవుడా ఎంత పని చేసావురా అంటూ
రాగాలు తీసింది తల్లి.

"అమ్మా ఎందుకీ శోకాలు..నాకేమి కాలేదు..
నువ్వు గాబరా పడి అందరిని గాబరా పెట్టుకు.
నాన్నగారు ఎక్కడున్నారు." అడిగాడు దివాకరం.

"ముహూర్తాలకోసం ఎవరో వచ్చారు .వాళ్ళతో మాట్లాడుతున్నారు" అంది తల్లి.

తల్లి మాట వినిపించుకోకుండా ఆదుర్దగా తండ్రి దగ్గరికి వెళ్ళాడు దివాకర్.

రక్తం మరకలతో వచ్చిన కొడుకుని చూసి భయాందోళనకి
గురయ్యాడు తండ్రి.

" నాన్నా! నా స్నేహితుడికి రోడ్డు ప్రమాదం లో చాలా రక్తం పోయింది. హాస్పిటల్ లో ఉన్నాడు. త్వరగా రక్తం ఎక్కించాలని లేకుంటే బతకడం కష్టమని డాక్టరుగారు చెప్పారు.

వాడిది ఓ నెగిటివ్ గ్రూప్. మీది కూడా అదే బ్లడ్ గ్రూప్ కదా!. అందుకే మిమ్మల్ని అడుగుదామని వచ్చాను.
వాడిని ఎలాగైనా బతికించండి నాన్నా ! అని ప్రాధేయపడ్డాడు దివాకర్.

రామశాస్త్రి అయిష్టంగానే కొడుకు దివాకర్ తో హాస్పిటల్ కి వెళ్ళాడు.

హాస్పిటల్ అంతా రోగులతో కిటకిట లాడుతూ ఉంది.

చిరు గాలికి రెప రెప లాడుతున్న దీపం లా కొనప్రాణం తో కొట్టుమిట్టాడుతున్నాడు ఆలీ..

కొడుకు బాధ చూడలేక దాత దొరకాలని అల్లాని ప్రార్థిస్తూ డాక్టర్ గారి గది వైపు వెళ్ళాడు బాషా. అదే సమయంలో హాస్పిటల్ కి చేరుకున్నారు దివాకర్,రామశాస్త్రి.

" నాన్నా నువ్వు రక్తం ఇవ్వవలసింది వీడికే "..అని ఆలీని చూపిస్తూ తండ్రికి చెప్పాడు దివాకర్.

వీడికా నేను రక్తం ఇవ్వవలసింది అనుకుంటూ బయటకి నడిచాడు.

కొడుకు ప్రాధేయపడటం తో కాదనలేక రక్తాన్ని ఇవ్వడానికి
సిద్ధ పడ్డాడు రామశాస్త్రి.

ఆ దృశ్యాన్ని చూసిన బాషా ఆశ్చర్యపోయాడు. ఇన్నాళ్లు నేను ఎవరినైతే ద్వేషించే నో వాళ్లే రక్తం ఇస్తున్నారు . ఎంత విచిత్రం. వారిని వద్దనుకుంటే నాకొడుకు ప్రాణం నిలువదు...అని తనలోతాను అనుకుంటూ ఉండగా..

రక్తం ఇచ్చి ఇంటికి వెళ్లిపోయారు రామశాస్త్రి దివాకరశాస్తి.

ఆలోచనల నుంచి బయటకి వచ్చిన బాషాకి రక్తం ఇచ్చి తండ్రీకొడుకులిద్దరూ వెళ్లిపోయినట్లు తెలిసింది.

నా కొడుక్కి పునర్జన్మ నిచ్చారు వారికి కృతజ్ఞతలు తెలియచేయాలి అని మనసులో అనుకుంటూ ఆలీని వార్డు బాయ్ కి అప్పచెప్పి

రామశాస్త్రి ఇంటికి పరుగున వెళ్ళాడు బాషా. బాషా వీధి గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి

"ఛీ ఛీ మడి మంటగలసి పోయింది. ఆచారం అడుగంటి పోయింది. ఆవు మాంసం తినే వాళ్ళకి రక్తం ఇవ్వడమేమిటి అనుకుంటూ బావిలో నీటిని తోడుకొని మంత్రాలు చదువుతూ తలపై దిమ్మరించుకున్నాడు రామశాస్త్రి. తండ్రి కాస్త చల్లబడ్డాక దివాకర్ ఇలా అన్నాడు తండ్రితో..

నన్ను అలీతో కలసి తిరగ వద్దని చాలాసార్లు మందలించారు.

నిజానికి ఆలీ కుటుంబం చాలా మంచిది

మనం మన ఆచార వ్యవహారాలకు ఎంత విలువ ఇస్తామో వాళ్ళు కూడా అంతే...

ఇస్లామ్ పట్ల ఈ కుటుంబానికి ఎంతో విశ్వాసం .


ప్రతీ రోజు ఐదు సార్లు నమాజులు చేస్తారు.

రంజాన్ మాసం లో కఠినమైన ఉపవాస దీక్ష చేస్తారు.

వండుకున్న దానిని మూడుబాగాలు చేసి ఒక వంతు మసీదుకు

ఒక వంతు పేదవారికి ఇస్తారు.

మిగిలిన భాగాన్ని తింటారు.

ఆశ్చర్య కరమైన విషయమేమంటే ఆలీ కుటుంబం పూర్తిగా శాఖాహారులే. గోవుని గౌరవిస్తారు. ఎక్కడో ఎవరో ఏదో చేశారని వీళ్ళని ద్వేషించడం ఎంత వరకు సమంజసమో ఆలోచించండి నాన్నా అన్నాడు దివాకర్ గద్గద స్వరంతో..

కొడుకు నోటినుంచి దూసుకొచ్చిన వాక్ బాణాలు సూటిగా రామశాస్త్రి హృదయాన్ని తాకాయి.

వీధి గుమ్మం దగ్గర నుంచి తండ్రీ కొడుకుల మాటలు విన్న బాషాకి కళ్ళల్లో కన్నీటి సుడులు తిరిగాయి.

ఇంత మంచి వాళ్ళని ద్వేషించాను నిజంగానే నేను మూర్ఖుడినే అని తనని తానే నిందించు కున్నాడు బాషా.

లోనికి వెళ్లి రెండు చేతులు జోడించి రామశాస్త్రికి నమస్కరించి నా బేటాకు రక్తానిచ్చి కొత్త జీవితాన్ని ప్రాదించారు.మీకు మీ రుణం తీర్చుకోలేనిది. మేము ఇక్కడే పుట్టాం. ఈ మట్టి లొనే కలిసి పోతాం. మీ తోనే కలిసి ఉంటాం. మేమూ భరత మాత బిడ్డలమే.. మమ్మల్ని వేరుగా చూడకండి.. అన్నాడు బాషా కృతజ్ఞతా పూర్వకంగా..

నిజమే బాషా..మన పిల్లలు పరమత సహనం పాటిస్తూ దేశభక్తిని చాటుతూ ఉంటే
మనం మాత్రం సంకుచిత భావాలతో మత చాందసం తో వక్రంగా ఆలోచిస్తున్నాం.. ఇకనైనా మన ఆలోచనలు మార్చుకుందాం....

ఇకనుంచి ఇద్దరు కొడుకులు నాకు..అన్నాడు ఆనందంగా రామశాస్త్రి..

ఆలీకి జరిగినదంతా చెప్పాడు బాషా.

ఆ మాటలు విన్న ఆలీ..

" అబ్బాజాన్ నువ్వెప్పుడూ దివాకర్ తో తిరగవద్దని మనం వేరు వాళ్ళు వేరని చెప్పావు..

శాస్త్రిగారిని ద్వేషించావు...

ఇప్పుడు నాశరీరంలో శాస్త్రిగారి రక్తం ప్రవహిస్తోంది..

నన్నుకుడా ద్వేషిస్తావా అబ్బాజాన్".అన్నాడు ఆలీ..

"లేదురా నా తప్పును తెలుసుకున్నాను. ఇక నుంచి అంతా మన మిత్రులే...

దేశభక్తి అంటే ఏడాదిలో ఒక రోజు జెండాని జేబుకి తగుల్చుకుని ఊరంతా తిరగడమో, ప్రొఫైల్ పిక్చరగా పెట్టుకోవడమో కాదని ఒకరినొకరు గౌరవించుకుంటు కలసి మెలసి ఉంటూ దేశ ఔన్నత్యాన్ని కాపాడడమేనని మీరు తెలియచేశారు . హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ జీవిద్దాం అన్నాడు బాషా ఆనందంగా....

మరిన్ని కథలు

Sammohanastram
సమ్మోహనాస్త్రం
- బొబ్బు హేమావతి
Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి