గ్రీన్ సిగ్నల్ - ఆర్ . సి. కృష్ణస్వామి రాజు

green signal
ఎస్వీ యూనివర్సిటీలో బీ.కామ్ డిగ్రీ పూర్తిచేసి తిరుపతిలోని ఆ వీధీ ఈ వీధీ తిరగసాగాడు మదన మోహనుడు. డిగ్రీ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ పాండురంగం గాంధీ రోడ్డులో కనిపించి క్లాస్ పీకినాడు. "ఎత్తూ బరువూ వున్నావు. ఎగర గలవు. దుమక గలవు. పోలీస్ ఉద్యోగానికి పోరాదా, ఫస్ట్ సెలక్షన్ లోనే బెస్టుగా సెలక్టవుతావు " అవి చెవిలో విజిల్ ఊదినట్లు ఊదినాడు .

మదన మోహనుడు క్షణం ఆలస్యం చేయకుండా సాయి కుమార్ పోలీస్ స్టోరీ సినిమా, కార్తీ ఖాకీ సినిమా, సూర్య సింగం 1,2,3 సినిమాలు ఒకటికి రెండుసార్లు చూసినాడు . అంకుశం సినిమా హీరో రాజశేఖర్ లా , గబ్బర్ సింగ్ సినిమా హీరో పవన్ కళ్యాణ్ లా , పోలీస్ గేమ్ సినిమా హీరో శ్రీహరిలా తనను తాను ఊహించుకొని నాలుగైదు కలర్ ఫుల్ డ్రీమ్స్ వేసుకున్నాడు. పోలీస్ సెలెక్షన్స్ కి వెళ్లి తన విశ్వరూపం చూపించి విజయం సాధించినాడు.తంతే గారెల గంపలో పడ్డట్లు తిరుపతిలోనే తమ ఇంటికి ప్రక్కవీధిలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లోనే కొలువు కుదిరింది .

o o o o o

ట్రాఫిక్ పోలీస్ గా ఎన్టీయార్ సర్కిల్ వద్ద డ్యూటీలో చేరినాడు . ఎస్వీ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చెదివే ఎల్లోరా స్కూటీలో కాలేజీకి వస్తా పోతా మదన మోహనుడిని చూసి మనసుపారేసుకొంది . మొదట్లో ఒకరినొకరు చూసి ముసిముసిగా నవ్వుకున్నారు.రోజులు గడిచేకొద్దీ ఎల్లోరా ఎన్టీయార్ సర్కిల్ దగ్గరికి వచ్చేసరికి గట్టిగట్టిగా స్కూటీ హారన్ మోగించసాగింది. తక్కువ తినని మదనమోహనుడు ఎగిరెగిరి విజిలు వేస్తూ ట్రాఫిక్ కంట్రోల్ చేయసాగాడు. కుర్రాడు కొంచెం కట్టింగు చేసుకుంటే పోకిరి సినిమా హీరో మహేష్ బాబులా వుంటాడు కదా అనుకొంది . అతనికి చెప్పాలనుకొంది- కానీ ప్రేమించడానికి ముందే పెత్తనమా అంటాడేమోనని మదన మోహనుడు ఎలాగున్నాడో అలాగే అంగీకరించి అతడిలోనే మహేష్ బాబుని చూసుకోసాగింది . చిన్నచిన్నగా ఇద్దరి మధ్య వున్న ఐస్ బ్రేక్ అయిపోయింది .

కళ్లు కళ్లు కలిసినాయి. కళ్లతోనే ఒకరికొకరు కోటి సందేశాలు ఇచ్చి పుచ్చుకున్నారు. ధైర్యం తెచ్చుకొని ఒకరికొకరు 'మైనే ప్యార్ కియా' చెప్పుకున్నారు.కుదిరితే కప్పు కాఫీ అనుకున్నారు. కుదిరినాక కప్పుల కొద్దీ కాఫీలు ఖాళీ చేసేసారు.తాటి తోపుకాడ నిలబడి తాటి ముంజలు తిన్నారు. కొబ్బరి తోటలకెళ్లి స్ట్రాలు లేకుండా కొబ్బరి నీళ్లు తాగినారు .

"పెళ్లికాక ముందు మీ మగవాళ్లు కళ్లు బాగున్నాయి పెదాలు బాగున్నాయి చెవులు బాగున్నాయి వెంట్రుకలు బాగున్నాయి అని పొగుడుతారు పెళ్లి అయ్యాక చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద పెద్దగా తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతారు " అని బుంగమూతి పెట్టి చెప్పింది ఎల్లోరా . "డియర్ ! నా మనసంతా నువ్వే అని నీకు తెలియదా , నా ఉఛ్వాస నిశ్వాసలు నీవే అయినప్పుడు నిన్ను ప్రాణంలా చూసుకుంటాను తప్పితే నీ తప్పులు పడతానా? " అని నంగినంగిగా, అమాయకంగా బదులిచ్చినాడు . సిరిమల్లె పువ్వల్లే నవ్వుతూ సిగ్గు మొగ్గలయ్యింది ఎల్లోరా.

"నేను నాలోలేను . అయన ఆయనలో లేడు . ఒకరిలో ఒకరు కలిసిపోయి చాన్నాళ్లయ్యింది . వెడ్డింగ్ బెల్ కొడితేసరి . లేకుంటే మీకు లాంగ్ బెల్ కొట్టేస్తాను" అని చెప్పింది ఎల్లోరా వాళ్ళ ఇంట్లోవాళ్లకి. ఎల్లోరా పేరెంట్స్ వెంటనే శ్రీ గురుదత్త కంప్యూటర్ జ్యోతిష్యాలయానికి వెళ్లి మ్యాచింగ్ జాతకం తీయించినారు. ఆకు వక్క తాంబులాలిచ్చి అయ్యోరిని కలిసినారు. అయ్యోరు జాతకాన్ని రెండు మూడు సార్లు ఎగాదిగా చూసినాడు . వేళ్ళతో అవీ ఇవీ లెక్కించినాడు .పేజీలు ముందుకీ వెనుకకీ తిప్పి తిప్పి చూసినాడు . మ్యాచింగ్ పాయింట్లు 36కి 16 కూడా రాలేదని పెండ్లికి ఎర్రజెండా ఊపినాడు . ఎల్లోరా పేరెంట్స్ దొర్లి దొర్లి ఏడ్చినారు.

మదనమోహనుడి పేరెంట్స్ కూడా పొర్లి పొర్లి ఏడ్చినారు . వారి ఏడుపుకు కారణం వేరే వుంది .తమ స్వంత ఊరు అరమడక పాత మునుసబు మాతంగరావు తన మనవరాలు నిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. మూడెకరాల రోడ్డుసైడు మామిడితోట కూడా రాసిస్తానన్నాడు. బంపర్ ఆఫర్ మిస్సవుతున్నందులకు వెక్కి వెక్కి ఏడ్చినారు. 'ప్రాయంలో పందిపిల్ల అయినా ప్రియంగా వుంటాదిరా నాయనా , ప్రేమ దోమ అని పిచ్చి కూతలు కూయబాకరా నాయనా ' అని కొడిక్కి వార్నింగ్ ఇచ్చినారు . అయినా లవ్ బర్డ్స్ వారి ప్రయత్నాలు విరమించలేదు. ప్రేమ జంట లిద్దరూ కలిసి తమ తమ పేరెంట్స్ ని మంగాపురం గుడికాడ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసినారు . ససేమిరా కాదంటే కాదని పేరెంట్స్ భీష్మించు కొని కుర్చున్నారు.’మీరు మొండి కేయడం మంచిదికాదు, మీరు మా పెండ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి విజిల్ ఊదితేసరి . లేకుంటే ఊరి బయట సువర్ణముఖీ నదీ తీరాన తొండవాడ గుడికాడ డుండుం చేసుకొంటాము’అని అల్టిమేటం ఇచ్చినారు . తిలసహిత కాంచనం దానం బ్రాహ్మణుడికి ఇస్తే సరిపోతుందని అయ్యోరు చెబితే ఎల్లోరా అమ్మానాన్నలు శాంతించినారు . ఎల్లోరా కి ఫ్లాట్ వ్రాసిద్దమని అనుకున్నారు .

పెళ్లి కూతురి పేరున వున్న అలేఖ్య అపార్టుమెంట్స్ లోని ప్లాట్ కొడుకు స్వంతమవుతుందని తెలిసి మదనమోహనుడి పేరెంట్స్ బ్యాలెన్స్ షీట్ వేసుకొని చూసినారు . లాభసాటిగా వుందని వెంటనే రెండు మూడు గ్రీన్ సిగ్నల్స్ , నాలుగైదు థమ్స్ అప్ సంకేతాలూ ఇచ్చినారు .
పేరెంట్స్ పచ్చ జెండాలకి ప్రేమికులిద్దరూ "నీవు లేని నేను లేను , నేను లేక నీవు లేవు .... నేనే నువ్వు నువ్వే నేను , నేను నువ్వూ నువ్వు నేను లేనిచో ఈ జగమే లేదు ..." అంటూ మంచిమనసులు శోభన్ బాబు సినిమా పాట పాడుకున్నారు .

పెళ్లయిన పదహారవరోజే "కాపురం, కొత్త కాపురం.. ఆలు మగలు కట్టుకున్న అనురాగ గోపురం " అంటూ కొత్త కాపురం కృష్ణ సినిమా పాట పాడుతూ అలేఖ్య అపార్టుమెంట్స్ లో వేరు కాపురం పెట్టినారు . సంతోషం తో ఒకరికొకరు ఫ్లయింగ్ కిస్సులిచుకున్నారు . పెళ్లికాక ముందు కదా ఫ్లయింగ్ కిస్సులు- పెళ్లయినాక డైరెక్ట్ కిస్సులే కదా అని గుర్తొచ్చి ఆ రాత్రికి వాయిదా వేసుకున్నారు .

o o o o

ఆదివారం ఉదయం ఆరు గంటలయింది .

అలేఖ్య అపార్టుమెంట్స్ లోని హెల్త్ అవేర్ నెస్ వున్న అబ్బాయిలు అమ్మాయిలు , పెద్దోళ్ళు పిల్లోళ్లు వాకింగ్ ట్రాక్ లో వాకింగ్ లు చేస్తున్నారు . పార్కులో స్విమింగ్ పూల్ దగ్గర నల్ల దుప్పటి పరుచుకొని వజ్రాసనంలో కూర్చొని ఓంకారం చెబుతున్నాడు మదనమోహనుడు . యూనివర్సిటీలో చీఫ్ మినిస్టర్ ప్రోగ్రాం వుందని, శీఘ్రoగా డ్యూటీకి పోవాలని యోగాసనాలు మాని ప్రాణాయామములు మాత్రమే చేస్తున్నాడు . కపాలభాతి, నాడీ శోధన, శీతలీభ్రమరీలు చేసుకుపోతున్నాడు.

వాకింగ్ చేస్తున్న వెటర్నరీ యూనివర్సిటీ స్టూడెంట్ వేణుగోపాలుడు వాకింగ్ ని గబుక్కున ఆపి చెవిలోని ఎయర్ ఫోన్స్ పెరికేసి "దొంగ దొంగ "అని అరిచినాడు . వెహికల్ పార్కింగ్ లోని మోటర్ సైకిల్ ని దొంగతనo చేయడానికి వచ్చిన దొంగ దిక్కులు చూడసాగాడు. వాకింగ్ చేస్తున్న రెడ్డిగారు మరియు రెడ్డెమ్మ ,జాగింగ్ చేస్తున్న నాయుడు గారు మరియు నాయుడమ్మ , న్యూస్ పేపర్లు చదువుతున్న శెట్టి గారు మరియు శెట్టమ్మ,వేప పుల్లలు నములుతున్న అనిల్ జైన్ మరియు మమతా జైన్, ఆయిల్ పుల్లింగ్ చేస్తున్న రాజుగారు మరియు రాజులామెలు దొంగను చుట్టుముట్టారు.

అపార్టుమెంట్ ప్రెసిడెంట్ అనంత పద్మనాభరావు చెప్పినాడని మార్కెటకెళ్లి పందిరి చిక్కుడు కాయలు కేజీ తీసుకువస్తున్న వాచ్ మెన్ వెంకటేశు సైకిల్ లో సర్రున వచ్చి దిగినాడు .సైకిల్ ని ప్రక్కన పారేసి దొంగపైకి దూకినాడు . 'పోలీసు వుండే అపార్టుమెంట్ లోకి ధైర్యంగా దొంగతనానికి వస్తావా, నీకెంత దైర్యంరా ' అంటూ వెంకటేశు ఎగిరెగిరి దొంగని రెండు మూడు పీకులు పీకినాడు . వాచ్ మెన్ మాటలకు అందరూ శ్వాసపైన ధ్యాసలో వున్న మదనమోహనుడి వైపు చూసినారు . మదనమోహనుడు ఉలకలేదు పలకలేదు.
వాచ్ మెన్ వెంకటేశు దొంగని సిమెంట్ స్థంభానికి చాంతాడు తో కట్టేసినాడు . రెడ్డిగారు నాయుడుగారు దొంగకి ధర్మ ఏట్లు (దెబ్బలు) వేసినారు. శెట్టి దంపతులు తిట్ల దండకం చదివినారు . జైన్ దంపతులు వేప కొమ్మని విరిచి బెత్తం మాదిరి చేసినారు.రాజుగార్లు దొంగని బెత్తంతో బాదినారు

కింద జరుగుతున్న గొడవకి గబగబ దిగి వచ్చింది ఎల్లోరా . దొంగని ,జనాల్ని, మదనమోహనుడి మౌనాన్ని చూసింది.పూర్తిగా పట్టించుకోని పోలీసు భర్తని చూసి ముక్కు మీద వేలేసుకొంది. గ్యాస్ స్టవ్ పైన పెట్టిన పెసలపప్పు కూర మాడిపోతోందన్న విషయం గుర్తొచ్చి చకచక మెట్లెక్కి తమ ప్లాట్ లోకి వెళ్లిపోయింది .

ప్రాణాయామములు చేస్తున్న మదనమోహనుడు కదలలేదు, మెదలలేదు. కనీసం కళ్లు అటు ఇటు తిప్పలేదు. స్మైలిoగ్ ఫేస్ తో ధ్యానం పది నిమిషాల పాటు చేసి తనకేమి పట్టనట్లు చక చక మెట్లెక్కి తన ఫ్లాట్ లోకి వెళ్ళిపోయాడు . వాకర్స్ బృందం వింతగా చూసింది .

o o o o

:4::

ప్రాణాయామములు పూర్తి చేసిన మదనమోహనుడు సర సర స్నానం చేసినాడు . టక టక టిఫెన్ తినేసినాడు . గ్లాసు మజ్జిగ గుట గుట తాగేసినాడు . బిరబిర యూనిఫారం వేసుకున్నాడు . ధగధగ మెరిసే బూట్లు తొడిగినాడు . దబ దబ మెట్లు దిగి గోలగోలగా వున్నగుంపు దగ్గరికి చేరినాడు . దొంగని చురచుర చూసినాడు . పండ్లు పటపట కొరికినాడు . దొంగని గడగడ లాడించినాడు . వాడి చెంపలు చెళచెళలాడించినాడు . వాడిని పరపర రోడ్డులోకి ఈడ్చుకెళ్లినాడు. దొంగ లబలబ కొట్టుకున్నాడు .వాడు వలవల ఏడ్చినాడు . ఆటోని తీసుకొని దొంగని తీ(తో)సుకొని చరచర పోలీస్ స్టేషన్ కెళ్లినాడు మదనమోహనుడు. యూనిఫారం వేయకముందు , వేసినాక మదనమోహనుడి వాలకం చూసిన వాకర్స్ బృందం గుసగుసలాడింది . 'ఆ' అని నోరు తెరిచేసింది ఎల్లోరా . వీధిలోని వారంతా దొంగని తుక్కుతుక్కుగా తిట్టినారు . వాడికి పోయేకాలం వచ్చిందని దుమ్మెత్తి పోసినారు .

o o o o

రాత్రి ఎనిమిది గంటలకు డ్యూటీ దిగి ఇంటికి వచ్చినాడు మదనమోహనుడు . వెచ్చగావేడినీళ్లలో రోజ్ వాటర్ వేసుకొని స్నానం చేసి వచ్చి భోజనానికి కూర్చొన్నాడు . వేడి వేడి అన్నం వడ్డించింది ఎల్లోరా . పొట్టేలు తలకాయ కూర రుచిగా చేసి పెట్టింది . మెతుకు మిగలకుండా చిన్న ఎముక కూడా వదలకుండా తృప్తిగా తిని లేస్తుంటే ఎల్లోరా చిన్నగా అడిగింది. "ప్రాణాయామములు చేస్తున్నప్పుడు దొంగని పట్టించుకోని మీరు డ్యూటీ కెళ్లేటపుడు అంతగా రియాక్టయ్యారు ఏమిటండీ విశేషం "అని .

న్యాప్ కిన్ తో చెయ్యి, నోరూ తుడుచుకుంటూ "ఎల్లోరా ! కర్ణుడికి కవచ కుండలాలలాంటివి నాకు నా యూనిఫారమ్ . నేను యూనిఫారం లో వుంటే నిండు గాలి బెలూన్ లా వుంటాను . యూనిఫారం తీసేస్తే గాలిలేని బెలూన్ లా అయిపోతాను . అరగొండ ఎలిమెంటరీ స్కూల్లో చదువుకొనేటప్పుడు నన్ను అందరూ "నోట్లో వేలు పెడితే కొరకలేని వాడు " అని అనుకునేవాళ్లు . ఈ ఉద్యోగం లో చేరేటప్పుడు కూడా మా దాయాదులంతా నీవేమో సాఫ్ట్ వేర్ నీ ఉద్యోగమేమో హార్డ్ వేర్ , ప్రతినిత్యం యోగ ధ్యానంలు చేసి నిన్ను నీవు రిఫ్రెష్ చేసుకో ' అని హితువు పలికినారు . వాస్తవంగా సున్నిత మనస్కుడను, అతి భయస్తుడను అయిన నేను యూనిఫారం వేస్తే మాత్రం బాహుబలి లెక్కన మారిపోతాను . ఇందులో మంత్రం తంత్రం మహత్యం ఏమి లేదు . అంతా యూనిఫారం మహిమ " అని చెబుతూ కుర్చీని ఆమె దగ్గరికి జరిపినాడు.
ఆసక్తిగా వింటున్న ఎల్లోరా కేసి చూస్తూ మళ్లీ " ప్రజలు కూడా మాకంటే మా డ్రస్సుకే ఎక్కువ గౌరవం ఇస్తారు . మాకున్న శక్తి మాది కాదు . చాలా వరకు డ్రస్సుదే . నేరస్తులు కూడా మమ్మల్ని మామూలు సివిల్ డ్రస్సులో చూస్తే భయపడరు . యూనిఫారంలో చూస్తే మాత్రం గజగజ వణికిపోతారు .

నీకు తెలియదు ఎల్లోరా !మాకు ఖాకీ డ్రస్సు వేసుకొంటే ఏనుగంత బలం వస్తుంది . చిరుతపులి అంత వేగం వస్తుంది . సింహం అంత రాజసం వస్తుంది . ఇక ఉదయం జరిగిన సంఘటనకి వస్తే నేను ప్రాణాయామములు చేస్తున్నప్పుడు దొంగతనానికి దొంగ ప్రయత్నించడం , అందరూ చేరి వాడిపైన దాడి చేయడం సాధారణ విషయంగా అనిపించింది . కానీ డ్రస్సు తగిలించాక బాడీలో వైబ్రేషన్స్ మొదలయ్యాయి . ఎనర్జీ లెవెల్స్ పెరిగాయి , పూనకం వచినట్లయ్యింది . నాలోని పోలీస్ బయటకి వచ్చాడు ... అంతే " అంటూ తను తెచ్చిన స్వీట్ ప్యాకెట్ ని తెరిచినాడు . అందులోంచి చిన్న రసగుల్లను ఆమెకు తినిపించబోయాడు . ఆమె సుతిమెత్తగా వద్దంది . కోపగించుకొందేమో అనుకున్నాడు . స్వీటు ప్యాకెట్ మొత్తం పెరుక్కొని పెద్ద లడ్డు తీసుకొని గుటుక్కున మింగింది.

ముసిముసిగా నవ్వుతూ తను మార్కెట్ నుంచి తెచ్చిన మూర తెల్ల కాగడాలు తీసి ఆమె జడలో తురమబోయాడు . ఉరిమి చూసింది . అలిగిందేమో అనుకున్నాడు . మోటు సరసం అన్నట్లుగా చేయి విదిలించి, తెల్ల తడి గుడ్డ లో దాచి వుంచిన సెంటు మల్లెలు తెచ్చి మొగుడు చేతికిచ్చింది . సెంటు మల్లెల గుబాళింపుతో పడకగది పరవశించి పోయింది . అభిమానంగా ఆమెను దగ్గరికి తీసుకుంటూ లైట్ ఆఫ్ చేసాడు . గదిలోని గ్రీన్ బెడ్ లైట్ గదినంతా పచ్చదనాన్ని పరిచింది .

తెల్లారేసరికి లేచి తల స్నానం చేసి సేమియా ఉప్మా సిద్ధం చేసింది ఎల్లోరా . యూనిఫారం మాసి పోయిందంటే ఉతికి యూనిఫారంని ప్రిస్టేజి వారి ఐరన్ బాక్స్ తో ఐరన్ చేస్తూ వుంటే ఆమెలో పాజిటివ్ వైబ్రేషన్స్ మొదలయ్యాయి .

వెంటనే యూట్యూబ్ ఆన్ చేసి కర్తవ్యం సినిమాలోని విజయశాంతిని, పోలీస్ సిస్టర్స్ సినిమాలోని రోజాని , కిరణ్ బేడీ సినిమాలోని మాలాశ్రీని చూసి మోటివేట్ అయ్యింది . నెల రోజుల పాటు పతంజలి యోగశాస్త్రం చదివి యోగాసనాలు ప్రాణాయామములు నేర్చుకొంది . వాకింగ్ జాగింగ్ ట్రెక్కింగ్ స్విమ్మింగ్ ఆయిల్ పుల్లింగ్ లు చేసి సన్నబడింది. విల్లులా ఒళ్ళువంగేట్లు ఆహార నియమాలు పాటించింది . తిరుపతి ఎస్వీయూనివర్సిటీ గ్రౌండ్స్ లో పోలీస్ కానిస్టేబుల్ ఎంపికకు హాజరయ్యింది. గ్రౌండులో మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ దాకా గ్రాండు గ్రాండు గా గెలుపులు సాధించింది . పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం పట్టేసింది.

o o o

ఉద్యోగం రావడం తో విజయోత్సహంతో స్కూటీలో వెళుతున్న మొగుడూ పెళ్లాలిద్దరూ ఎన్టీయార్ సర్కిల్ వద్ద రెడ్ సిగ్నల్ పడటంతో బండిని నిలిపారు.తొరూరు మల్లెలు తట్టలో పెట్టుకొని ఊగతా ఊగతా వచ్చిన తులసి యంగ్ కపుల్ దగ్గరికి వచ్చి నిలిచింది . మూర సన్నజాజుల మాల కొని ఎల్లోరా చేతికిచ్చినాడు మదనమోహనుడు . ముసిముసిగా నవ్వుకొంది ఎల్లోర. వారిని చూసి సిగ్నల్ బోర్డులోని గ్రీన్ సిగ్నల్ మిల మిలా మెరిసింది . ఇద్దరూ ఖుషీఖుషీగా నవ్వుతూ తుర్రుమని ఇంటి వైపుగా వెళ్లారు .

మరిన్ని కథలు

Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు
Suhasini
సుహాసిని
- బొబ్బు హేమావతి