అనుకున్నదొక్కటీ - కర్రా నాగలక్ష్మి

anukunnadokkatee

దినేష్ కి రెండు రోజులుగా సెల్ లో మెసేజెస్ చెక్ చేసుకోడేమే పని గా మారింది . ఏకాగ్రత తగ్గడంతో చేస్తున్న పనిలో చిన్న చిన్న తప్పులు దొర్లి దానికి తగ్గ నష్టాలు కూడా జరిగేయి . దానికి యెంత మాత్రం బాధపడలేదు . అయినా ఒకటో రెండో లక్షలు అప్పనంగా ఒళ్లో వాలబోతూ వుంటే యీ చిన్న చిన్న నష్టాలను పట్టించుకునేంత మూర్ఖుడు కాడు దినేష్ .

ఎన్ని మార్లు సెల్ ని చూసుకున్నా యెదురు చూస్తున్న మెసేజ్ రాలేదు . అసహనంగా అటూయిటూ పచార్లు చేసేడు . నాలుగైదేళ్లగా యీ వృత్తిలో వున్నా యిలా యెప్పడూ జరగలేదు . దినేష్ రీసెర్చి ప్రకారం మధ్య తరగతి ముద్దుగుమ్మలని కాస్త బెదిరిస్తే చాలు బేర్ మని కాళ్లబేరానికొస్తారు , అలాంటిది యీ అమ్మాయిలు బెదిరిస్తే పట్టనట్టుగా వున్నారు . అప్పటికే రెండు కాల్స్ చేసేడు . ఏమీ రెస్పాన్స్ లేదు . అలాగని యింత కష్టపడి తయారుచేసిన ప్లాను మధ్యలో వదిలేయడానికి మనసొప్పటం లేదు . కొన్ని ముదురు కేసులు ఒకటి రెండు బెదిరింపులకు లొంగరు , సరే మరో రెండు ఛాన్సు లిచ్చి చూద్దాం , తను అడిగిన మొత్తం యెక్కువయిందేమో ? బేరం తగ్గిస్తే ప్లాను వర్కవుట్ అవుతుందేమో ?

విసురుగా గ్లాస్ డోరు తోసుకుంటూ " అమెరికా వీసా కి పాస్ పోర్ట్ ఫొటోలు " లోపలి కొచ్చిన పాతికేళ్ల యువకుడు అన్నాడు .పానకంలో పుడకలా వీడిప్పడే రావాలా ? అని విసుక్కో బోయి యిలాంటి వ్యాపారాలు చేసే వారికి ఓపిక వుండాలోయ్ అని తనకుతానే చెప్పుకుని కెమేరాని సిద్దం చేసుకోడం లో మునిగి పోయి తాత్కాలికంగా తన ఆలోచనలకు ఫుల్ ష్టాప్ పెట్టేడు .

దినేష్ రాష్ట్రరాజధానిలో ఓ ఫోటో స్టూడియో ఓనరు . అతనికి ఫోటో గ్రాఫీ హాబీ కాదూ అవుసరమూ కాదు . అతని అసలు ఆర్జనకి ముసుగు మాత్రమే . యెన్నో తర్జనభర్జనలు పడ్డ తరవాత తన కార్యకలాపాలకు స్టుడియో ముసుగు వేసేడు . ఎర్ర టోపి మామల కళ్ల బడకుండా వుండడానికి ఏరియాని మార్చడం సెల్ ఫోనుతో పాటు చిప్ ని కూడా మార్చడం లాంటివి చేస్తూ వుంటాడు . దినేష్ టార్గెట్ ని యెంచుకొడం కూడా పూల్ ఫ్రూఫ్ గా వుండేటట్టు చూసుకుంటాడు . సాధారణం గా తన వ్యాపారంలో రిస్క్ లేకుండా చూసుకుంటాడు . కలిగిన వాళ్ల తో డీలింగ్స్ కాసుల వర్షం కురిపించొచ్చు , కటకటాలు లెక్కబట్టే పరిస్థతి కూడా రావొచ్చు . పరువును పట్టుకు ప్రాకులాడే మధ్య తరగతి బెస్టు . పిల్లలకి ఉగ్గు పాలతో పరువు ప్రతిష్ట అనేది రంగంచి పోస్తారు కాబట్టి వాళ్ల దగ్గరనుంచి డబ్బు రాబట్టడం పెద్ద కష్టం కాదు . ఇంట్లో పెద్దలతో సంప్రదించో , దించకుండానో ఓ లక్ష వరకు యిచ్చెయ్యగలరు . మెళ్లో గొలుసు , చేతిగాజులు అమ్మితే ఓ లక్ష యీజీగా వస్తుంది . తరవాత కాలేజీ నుంచి వస్తుంటేనో వెళుతుంటేనో కత్తి చూపించి నగలు వలిచేసేడని దొంగ తమ్ముళ్ల మీద పెట్టి కన్నీళ్లు పెట్టుకొని అమ్మా నాన్నలని జోకొట్టగలరు . అందుకే దినేష్ లక్ష కంటే యెక్కువ ఆశించడు .

పరుగెత్తి పాలు తాగుదాం అనుకొనే రకం కాదు , అప్పనంగా నిలుచున్న చోటికి వచ్చే అవకాశాలను అందుకొని పబ్బం గడుపుకుంటే చాలనుకొనే రకం .

సొమ్ము అందుగానే ముందు జాగ్రత్తగా అండర్ గ్రౌండు అయిపోవడం , కాసులు ఖర్చయేంతవరకు మరో పని ముట్టక పోవడం అతని అలవాటు సొమ్ములయిపోగానే అనామకుడిలా మరో ఏరియాలో సర్వే చేసుకొని కొత్త స్టుడియో ప్రారంభించడం , కొత్త టార్గట్ ని వెతుక్కోడం యిదీ అతని పని . ఈ మధ్య టి.వి లలో ' యెదురింటి యెంకమ్మ ' , మా యింటి మల్లమ్మ ' లాంటి షో లకి కూడా ఫుల్ సైజు ఫోటో జతచెయ్యమని అనడం దినేష్ లాంటి వాళ్లకి చేతినిండా పని కల్పిస్తోంది .యెలా అనుకుంటున్నారా ? , పెళ్లిచూపులకనో , యెంకమ్మ షోలకనో ఫోటో తీయించుకోడానికని వచ్చిన అమ్మాయిలలో తనకు పనికొస్తుంది అనుకొనే కేండిడేటు ని యెంచుకుని ఆ ఫొటో మీద టెక్నాలజీ వుపయోగించి నగ్న చిత్రాలు తయారు చేసి వాటిని చూపించి రాలినకాడికి డబ్బులు యేరుకోడం యిదీ గత కొన్ని సంవత్సరాలుగా దినేష్ చేస్తున్న పని .

అందులో భాగంగా పదిరోజుల కిందట స్టూడియోకి వచ్చిన ముగ్గురు ముద్దుగుమ్మలను యెంచుకొని వారి ఫోటోలకు మార్పులు చేర్పులు చేసి చూపించి బెదిరించేడు . ముగ్గురూ కలిసి రావడంతో ముగ్గురూ దోస్తులని తలిచేడు . ముగ్గురూ లక్ష చొప్పున చెల్లించాలని లేక పోతే సోషల్ నెట్వర్క్ లో పోష్టు చేస్తానని బెదిరించి నాలుగు రోజుల గడువు యిచ్చేడు . గడువు గడిచి పోయినా వాళ్ల దగ్గరనుంచి యెటువంటి స్పందన రాలేదు . ముగ్గురు కూడబలుక్కొని యే నిద్ర మాత్రలో మింగెయ్యలేదు కదా ! ఒక్క సారి గుండె గుభేలు మంది . అలా కనక జరిగితే యెర్ర మావలు డొంక లాగుతారు .

సెల్ తీసి ఫోను చెయ్యబోయేడు . తనూహించినదే నిజమైతే యీ నంబరు యెర్ర మావల దగ్గర వుంటుంది , వెంటనే వూచల వెనక్కి తొయ్యడం ఖాయం . యిలాంటి పరిస్థితి యెప్పుడూ యెదురవలేదు . ఏం చెయ్యాలో తోచటం లేదు .ఆలోచన తట్టగానే షాపు మూసి బయట పడ్డాడు . జిపియెస్ లో వాళ్లిచ్చిన అడ్రెస్సు యెక్కంచి బైక్ స్టార్ట్ చేసేడు . ఆ వీధిలో అవాంఛనీయ సంఘటనలు యెదురైతే అటునుంచి అటే పారిపోవాలని కూడా డిసైడ్ అయేడు . రెండుమూడు చక్కర్లు కొట్టినా తేడా యేమీ అనిపించలేదు .అంత మాత్రాన యేమీ జరగలేదనుకోడానికి లేదు . నిన్నో మొన్నో జరిగి యివాళటికి చల్లబడి వుండొచ్చు . అలాంటప్పుడు యింకా జాగ్రత్త పడాలి . అందుకే వీధి చివర నున్న పచారి కొట్టు దగ్గర బండి స్టాండు వేసి లోనికి వెళ్లేడు .

" సార్ చిన్న యిన్ఫర్మేషన్ ... , మా చెల్లికోసం అద్దె యిల్లు వెతుకుతున్నాం . యెదురుగా అక్కడ ఆ యింట్లో రూముందన్నారు . చెల్లి డిగ్రీ చదువుతోంది , మీకు తెలిసే వుంటుంది వారి గురించి , గొడవలేమి రావుకదా సర్ " యెంతో వినయం వందనం వొలకబోస్తూ అడిగేడు దినేష్ . " యే యిల్లూ ......... అదేనా ? ఫరవాలేదు మంచివాళ్లే. ...... ఆ పక్కిల్లుంది చూసేవూ ......" అని వేలితో దినేష్ కి కావలసిన యింటిని చూపించేడు . ఏ మాట వినవలసి వస్తుందో అని దినేష్ మనసు గుబగుబ లాడింది .

" ఆ యిల్లా ? యేమైంది సార్ , ఆత్మహత్య లాంటిది ....." నాలుక కరుచు కున్నాడు .

" అబ్బబ్బే కాదయ్యా బాబూ ఆ యింట్లో కూడా కాలేజీ పిల్లలున్నారయ్యా ! మంచి పిల్లలు మీ చెల్లికి వాళ్లతో పరిచయం చేస్తే చక్కగా నలుగురూ కలిసే కాలేజీ కి వెళ్లొచ్చు , యిప్పుడే వెళ్లేరయ్యా " అన్నాడు ప.కొ.య. తెలీకుండానే అమ్మయ్య అనుకున్నాడు దినేష్ . " ధాంక్స్ సర్ వస్తా " అని అక్కడ నుంచి బయలుదేరేడు దినేష్ .

మరి వీళ్ల మౌనానికి కారణం పోలీసు బాబుల దగ్గరకి వెళ్లిపోలేదుకదా ! అయుండదు , సరే పబ్లిక్ బూత్ నుంచి ఓ కాల్ చేస్తే సరి , అనుకున్నదే తడవుగా పబ్లిక్ బూతు దగ్గర ఆగి నెంబరు తిప్పి సాయంత్రం సరిగ్గా నాలుగింటికి ' డబ్బు తెచ్చేరా సరి లేదా అయిదింటికల్లా సోషల్ నెట్ వర్క్ లో మీ ఫోటోలు అప్ లోడ్ చెయ్యడమే కాదు మీ ఫోన్ నంబరు కూడా పెట్టెస్తా ' అన బెదిరించి తన షాపుకి యెదురుగా వున్న మాల్ లో అటూ యిటూ తిరుగుతూ ఓ కన్ను షాపు మీద వేసి వుంచేడు . సాయంత్రం నాలుగు వరకు యెవరూ తన షాపు దరిదాపులకి రాలేదు . పెద్ద ముల్లు నాలుగు నుంచి అయిదు మీదకి వెళ్లి అరగంటయినా ఆ పిల్లల జాడలేదు .

వెంటనే ముగ్గరి ఫోటోలు ఫోను నెంబర్ల తో సహా సోషల్ నెట్ వర్క్ లో అప్ లోడ్ చేసేడు .షాపు దగ్గర , పోలీస్ స్టేషను దగ్గర కాపు కాసేడు . ఎలాంటి అలజడీ లేదు , వారం రోజులవరకు యెలాంటి అలజడి లేకపోయే సరికి కొత్త కేసు కోసం వెతుక్కో సాగేడు . కాని ఆ ముగ్గురినీ మరిచిపోలేక పోతున్నాడు . అందరూ యిలాగే భయం భక్తి లేకుండా తెగిస్తే తనలాంటి వారి గతేం కావాలి .పదిహేను యిరవై రోజులు యెలాగో వూరుకున్నాడు , రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ల మీద కసి పెరగసాగింది , యెలాగైనా బుద్ది చెప్పాలి యెలా ? అన్నదే దినేష్ బుర్ర తినేస్తోంది . ఇంతలో ఓ మంచి ఆలోచన తట్టింది , ఆలోచన కార్యరూపం లోకి తేడానికి మరో పదిరోజులు పట్టింది .

ఆ రోజు చాలా నిశ్చింత గా అనిపించింది . మరునాడు బైక్ మీద ఆ వీధి లో నాలుగు చక్కర్లు కొట్టి వచ్చేడు . అవాంఛిత సంఘటనలు యేమీ యెదురు కాలేదు . రెండు రోజులు పోయేకా మళ్లా వెళ్లి చూసేడు . ఆ వీధిలో యెలాంటి అలజడీ లేదు . ఇంక ఆగలేక పచారీ కొట్టు జమానిని " యిక్కడ రూములు అద్దెకి వున్నాయా ? " అని అడిగేడు .

" మన చెల్లి గారికాండీ ఆ యెదరిల్లు ఖాళీ అండి మొన్ననే ఆ పిల్లలు ఖాళీ చేసి పోయేరుకదండీ " ప.కొ.య అన్నాడు .తనతో దాగుడు మూతలు ఆడుతున్నారా ? యెంత ధైర్యం ఇల్లు మార్చెస్తే తను వదిలి పెడతాననుకున్నారేమో , ఫోను నెంబరు వుందిగా ? అదీ మార్చెస్తే వీళ్లని పట్టు కోడం కష్టమే , యింకా మార్చకుండా వుంటారా ? అనుమానమే , వుత్తినే చేతులు ముడుచుకొని కూర్చొనే బదులు మరో ఫోన్ కాల్ అంతే కదా ! యీ రాయి తగిలి పళ్లు రాలొచ్చు లేదా ...... వ్యపారమన్నాకా లాభాలు వుంటాయి , నష్టాలు వుంటా మరి .

నెంబరు ప్రెస్స్ చేసి ' ఈ నెంబరు వాడుకలో లేదు ' అనే జవాబు కై యెదురు చూడసాగేడు . రింగు వెడుతోంది . వెంటనే బెదిరింపు మాటలు రెడీ చేసుకున్నాడు . " హలో .... " ఆ గొంతు అరవిందదే .

" క్లిప్పింగు చూసుకున్నావా ? యెలా వుంది , యిప్పటికీ లొంగక పోతే ...... , యీ సారి దెబ్బకి తట్టుకోలేవు " . గొంతును కర్కశంగా పలికించేడు .

" మీరాండి .... నమస్కారమండి ....... ధేంక్సండి "

" ధేంక్సేంటీ ....... నేనెవరో పోల్చి నట్టు లేదు " అన్నాడు దినేష్ .

" అయ్య బాబోయ్ మిమ్మల్ని యెలా మరిచిపోతావండి , దిక్కు మొక్కు లేక పెద్దాపురం నుంచొచ్చే మండి , బ్రోకరు కిద్దామని ఫొటోలు దిగేమండి , మీరెమోనండి కాణీ ఖర్చు లేకుండా మంచి పబ్లిసిటీ యిచ్చేరండి , దాంతో మా దశ తిరిగేసిందండి , మీరు మళ్లీ క్లిప్పింగు పెట్టేరండి దాంతో అయిటమ్ సాంగ్సు కి ఆఫర్ల మీద ఆఫర్లండి , మీ రుణం తీర్చుకో లేమండి , స్టుడియో లోనే వుంటారుగదండీ , మా మేనేజరు చేత రిలీజింగు ఫంక్షన్ కి పాసు పంపుతానండి , తమరు తప్పక రావాలండి " .

అటు పక్క ఫోను కట్చేసిన శబ్దం యిటు పక్క దభేల్ మన్న శబ్దం ఒకేసారొచ్చేయి .

మరిన్ని కథలు

Sammohanastram
సమ్మోహనాస్త్రం
- బొబ్బు హేమావతి
Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి