స్నేహితుడు - శ్రావణి గుమ్మరాజు

snehitudu

సమయం రాత్రి 12 గంటలు మొబైల్ "బాటరీ లో" చూపిస్తోంది అప్పటిదాకా వరుసగా కాల్స్ చేస్తూ, మెసేజులు చేస్తూ ప్రయత్నం ఆపని సత్యలో ఒక్కసారిగా నీరసం ఆవరించింది ఇంకెంతోసేపు ఈ మొబైల్ సపోర్ట్ చేయదు ఏంచేయాలో అర్థం కానట్టు పిచ్చోడిలా బేలగా నేల చూపులు చూస్తున్నాడు దాదాపు మూడు గంటల క్రితం తను విన్న మాటలే గుర్తొస్తున్నాయి.

నా హోప్స్ పోయాయి సత్యా.... నేను పొరబడ్డానా అంటే నమ్మలేకపోతున్నా, ఇన్నాళ్లు అనుకున్నది ఈనాడు నిజం కాదు అని తెలిసింది. నాబలం అనుకున్నది కాస్తా నాకు బలహీనత అయిపోయింది. ప్రతిరోజు ప్రతి నిమిషం ఎన్నో ఆశల మేడలు కట్టుకుని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన మనిషి ఇవ్వాళ కాదు పొమ్మంటున్నట్టు మాట్లాడుతుంటే నా ప్రాణం పోయేలా ఉంది సత్య అంటూ కాల్ లో చెబుతున్నా కంటి చెమ్మ తనకు కళ్ళముందు కనపడినంత హృద్యంగా ఉన్నాయి ఆ మాటలు.

బుజ్జి నువ్వూరికే ఫీల్ అయిపోకే.... టైం కానీ టైం లో ఎందుకు ఇలా ఫీల్ అవుతావు ఫీల్ అవ్వడం వల్ల ఇంకా డిప్రెషన్ లోకి వెళ్తావ్ తప్ప ప్రాబ్లెమ్ సాల్వ్ అవ్వదు. చెప్పిన మాట విని భోజనం చేసి పడుకో.... రేపు మాట్లాడదాం సరేనా..... అంటున్నాడు. నిజానికి అతను ఎమర్జెన్సీ వర్క్ ఉంది రమ్మనడంతో డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఎప్పుడు మెల్లిగా, అనునయంగా ఏ విషయం అయినా విడమరిచి చెప్పి ఆమెలోని మానసిక ఒత్తిడిని చాలా మటుకు దూరం చేయగలిగేది అతనే, కానీ ప్రస్తుతం ఆమె పరిస్థితి అర్థం అవుతున్నా కనీసం ఓదార్పుగా మాట్లాడి మానసిక స్థైర్యాన్ని ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ దాదాపు మూడు గంటల తర్వాత తన వర్క్ అయిపోగానే అతను మొదట చేసిన పని ఆమెను కాల్ చేయడం ఇక్కడ ఆమె అంటే ఆమె పేరు మానస ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా మానస లిఫ్ట్ చేయట్లేదు ఎన్ని మెసేజ్ లు పెట్టినా చూడట్లేదు. ఆడ మగ మధ్య స్నేహం అంటే దానికి కూడా ఒక అక్రమసంబంధం అంటగట్టేసి వాళ్ళను లవర్స్ ఏమో అనే టాగ్ వేస్తున్న సమాజంలో అలాంటివి ఏం పట్టించుకోకుండా ఎలాంటి విషయాలు అయిన ఒకరిదగ్గర మరొకరు దాచకుండా బయటకు చెప్పుకుని సలహనో, సూచనో లేక మందలిపులో విక్కిరింతలు ఇలాంటి సరాగాలతో చాలా గట్టిగా పెనవేసుకున్న స్నేహ బంధం వారిది.

సత్య ఎన్నిసార్లు కాల్ చేసినా మానస నుండి ఎలాంటి స్పందన లేదు. డ్యూటీ అయిపోయి తాను చేరాల్సిన ఊరెళ్లడానికి బస్టాండ్ లో ఉన్నాడు. ఒకవైపు మొబైల్ కుయ్ కుయ్ అని సౌండ్ చేస్తోంది చేతిలో పట్టుకున్న మొబైల్ వైపు చూస్తూ దానిమీద కోపంతో ఇక సచ్చిపోవే అంతే కదా నువ్ చేసేపని అని అప్రయత్నం గా అనేసాడు అనడం అయితే అనేసాడు కానీ ఆ చావు అన్న మాట సత్యలో మళ్ళీ గుబులు రేపింది. నిజంగా తను ఏమైనా చేసుకుంటే ఆ ఊహే ఒళ్ళు గగుర్పొడిపేలా ఉంది. చీ.... తను అలా చెయ్యదు అని తనకు తాను ఎంత ధైర్యం చెప్పుకుంటున్న మనసు పొరల్లోనుండి ఆవేదన ఉబుకుతూనే ఉంది. ఏం చెయ్యాలిప్పుడు భగవంతుడా ఒక్కసారి అదెలా ఉందో తెలిసేలా చెయ్యి అని వేడుకుంటున్నాడు పైకి చూస్తూ.

ఈలోపు సౌండ్ చేసుకుంటూ మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది నిస్సారంగా వెయిటింగ్ చైర్ లో కూలబడిపోయాడు కళ్ళలో సన్నని సుడి మొదలయ్యింది తను వెళ్లాల్సిన బస్ వచ్చి అదెక్కి ఇంటికి చేరి ఈ ఛార్జింగ్ పెట్టి తనకు ట్రై చేసిసరికి కనీసం గంటకు పైన పడుతుంది అసలు ఇంతవరకు కూడా అదెలా ఉందొ ఏమో అనే ఆలోచనే, అంతలోనే పక్కనే ఎవరో కూర్చున్నట్టు అవ్వడంతో ఈ లోకం లోకి వచ్చాడు. 5 నిమిషాలు తరువాత పక్కన మనిషి తననే గమనిస్తున్నట్టు అనిపించడంతో తల తిప్పి చూసాడు. ఎవరో పరిచయం లేని మనిషి నవ్వాడు సత్యని చూసి, గుండెల్లో ఆందోళన మధ్య లేని నవ్వును పెదాలపైకి తెచ్చి పెట్టుకొని ప్రతిగా సత్య కూడా నవ్వాడు. ఏంటి బ్రో చాలా ముభావంగా ఉన్నావ్ అన్నాడు అవతలి మనిషి. ఏమి లేదు అన్నాడు సత్య అక్కడ మానస ఎలా ఉందొ అన్న బాధ తనది ఎవరితో మాట్లాడాలని లేదు అతనికి. ఇబ్బంది అయితే చెప్పద్దు బ్రో బట్ ఏమైన హెల్ప్ చెయ్యగలనేమో అని అడిగాను అంతే ఈరోజు ఏదో ఆక్సిడెంటల్ గా కలిసాం ఇక్కడ బస్ వస్తే నువ్వొకవైపు నేనొకవైపు వెళ్లిపోతాం, ఈలోపు నీ ఫేస్ లో బాధను చూసి నీకు నేనేమైన హెల్ప్ చేస్తే నువ్ హ్యాపీ గా వెళ్తావ్ నేను తృప్తిగా వెళ్తా నీ ప్రాబ్లెమ్ సాల్వ్ అవుతుందేమో అని అడిగా అంతే సారీ.... అన్నాడు. నాకే హెల్ప్ అక్కర్లేదు అని గట్టిగా అరుద్దాం అనుకున్నాడు గొంతు నుండి మాట బయటకు వచ్చింది. కానీ పెదవి దాటలేకపోయింది అప్పుడే సడెన్ గా గుర్తొచ్చి మీ దగ్గర పవర్ బాంక్ ఉందా అని అడిగాడు. హా ఉంది అన్నాడు అవతలి మనిషి.జస్ట్ ఒక టెన్ మినిట్స్ నా మొబైల్ ఛార్జింగ్ పెడతారా ప్లీస్ అన్నాడు. పెట్టుకోండి అంతేగా అని బాగ్ లో నుండి పవర్ బ్యాంక్ తీసిచ్చాడు అతను.

మొబైల్ ఛార్జింగ్ పెట్టి రెండు నిమిషాల తరువాత మొబైల్ ఆన్ చేసి కాల్ చేయసాగాడు ఎంతసేపటికి అవతల మానస లిఫ్ట్ చెయ్యడం లేదు. ఏం చేసి చస్తున్నావ్ నువ్ ఒక్కసారి లిఫ్ట్ చెయ్యవే బుజ్జి ప్లీస్ అని మనసులో అనుకుంటూ బయటకు అనేసాడు. వాట్ హపేండ్ బ్రో ఏంటి ఏమైంది ఎందుకు అంత ఎమోషన్ పక్కనే ఉన్న వ్యక్తి భుజం పట్టి ఓదారుస్తున్నట్టే అన్నాడు. ఏం లేదు అని వెంటనే అక్కడి నుండి లేచి వెళ్లిపోదాం అనుకున్నాడు కానీ అక్కడి నుండి కదిలితే మొబైల్ కు పవర్ బాంక్ సపోర్ట్ కుడా ఉండదు అనుకుని అక్కడే స్తబ్దుగా ఉండిపోయాడు. ఎవరికైనా కాల్ చెయ్యాలా నా మొబైల్ లో ట్రై చెయ్యండి ఒకసారి ఏమైనా రెస్పాన్డ్ అవుతారేమో అవతలి వాళ్ళు అన్నాడు అవతలి వ్యక్తి. బ్రో సమస్య ఉన్నపుడు పంతాలు, మోహమాటాలు ఉండకూడదు నేను ఫ్రెండ్ ను అనుకో.... మొబైల్ తీసుకుని ట్రై చెయ్యి అని అంతవరకు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటున్న అతను మొబైల్ తీసి సత్య చేతుల్లో పెట్టాడు. అంతవరకు ఎవరో వీడు అందరి విషయాలు కావాలి ఈ జనాలకు అనుకున్న వాడు కాస్తా అతను ఇస్తున్న ఓదార్పును అతని హెల్పింగ్ నేచర్ ను అర్థం చేసుకుని అతని మొబైల్ నుండి మానస మొబైల్ కు ట్రై చేసాడు కానీ సిట్యుయేషన్ సేమ్ రిపీట్ అయింది లిఫ్ట్ చేయట్లేదు. ఎవరి కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు ఎందుకని మనసులో ఏదో మూల అనుమానం మొదలయ్యింది సత్య కు ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అని. ఒక్కసారిగా తల పట్టుకున్నాడు.

ఏంటి బ్రో ఏమైంది??? అడిగాడు అతను. లిఫ్ట్ చేయట్లేదు అన్నాడు గొంతు జీరబోతుండగా....పడుకుని ఉంటారు కదా బ్రో ఈ టైమ్ లో అన్నాడు సముదాయింపుగా..... నిజంగా పడుకుని ఉంటే ప్రాబ్లెమ్ లేదు కానీ...... ? తరువాత చెప్పలేను ఇక అన్నట్టు గొంతు మూగబోయింది. బ్రో ప్లీస్.... కూల్ పోనీ ఇంకా వేరే నెంబర్ కు ట్రై చెయ్యి ఆ అమ్మాయి ఎవరు బ్రో లవర్ హా...... అడిగాడు అతను సత్యను.

సత్య చురుక్కున అతనివైపు చూసి ఒకబ్బాయి నోటి వెంట ఒక అమ్మాయి పేరు వస్తే వాళ్ళకి ఒక అక్రమసంబందం అంటగట్టేసి లవర్స్ అని ట్యాగ్ వేస్తారు ఎందుకు??? ఆవేదనగా అడుగుతున్నాడు. నిజానికి సమాజం గూర్చి ఎన్నడూ ఆలోచించని అతను బయటి వాళ్ళ భావాలతో మనకేం పని తప్పు చెయ్యనపుడు అని ఆలోచించే అతను మొదటి సారి నోరు విప్పాడు. సమాజం లో ఎందరో ఎన్నో రకాల మనస్తత్వాలు ఉంటాయి బాస్ ప్రతి ఒక్కరిలో మంచి చెడు ఉంటాయి, అమ్మాయిలు అబ్బాయిలు ఆ పువ్వులు, తుమ్మెద లాంటి వారు ఆకర్షణ సహజం. కానీ ప్రతి ఒక్కరి మధ్యన అదే ఉండదు. ఇంట్లో అమ్మ, చెల్లి, అక్క మీద మనకు ఎంతో గౌరవం, ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఉంటాయి దాన్ని మనం బయటి అమ్మాయిల దగ్గర చూపించము ఎందుకు???? వాళ్ళు మన రక్త సంబంధీకులు కాదనే ఒక్క కారణమే కదా, ఒకమ్మాయి ఒకబ్బాయి బయట పక్కపక్కనే వెళ్తుంటే చూసేవాళ్ళలో దాదాపు 90% మంది వాళ్ళు లవర్స్ అనేస్తారు, వాళ్ళు రక్తసంబంధీకులు కాకపోయినా, ఫ్రెండ్స్ అనే ఆలోచన కూడా ఎందుకు రాదు అందరికి. ఎక్కడో కొందరు విలువలు వదిలేసి తిరిగితే అందరూ అలాగే ఉంటారు అనుకోకూడదు కదా..... మన మనసు అర్థం చేసుకుని మనతోడు ఉండే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా సరే బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారు బాస్ ఆపకుండా చెప్పుకుంటూ పోతున్నాడు సత్య.

దేవుడా ఎవరు అమ్మాయి లవర్ హా అన్నందుకు ఇంత గడ్డి పెడుతున్నాడు ఎంటిరా బాబు అని అతను గుడ్లు తేలేస్తున్నాడు. బాస్ ప్లీస్ నేను కాజువల్ గా అన్నాను అంతే అమ్మాయిల్ని తప్పుగా మాట్లాడేవాడిని కాను బాబోయ్ బుద్ధి తక్కువై అన్నాను ఆ అమ్మాయి మీకు ఏమైతే నాకెందుకు మీరు వేరే ట్రై చెయ్యండి. పోవట్లేదు అని తలపట్టుకున్నాడు సత్య. వాళ్ళ ఇంట్లో లేక ఫ్రెండ్స్ ఇంకా వేరే వాళ్లకు ట్రై చెయ్యండి బాస్ మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెడుతున్నారు పాపం తెల్సి తెల్సి ఒక ఆడపిల్లకు ఏదో అవుతుంది అంటే మనసు నిలవట్లేదు అన్నాడు అతను.

ఒక్క నిమిషం తరువాత ఏదో గుర్తొచ్చి వెంటనే తన మొబైల్ నుండి డయల్ చేసాడు అవతల రింగ్ అవుతుంది టైమ్ కానీ టైమ్ లో లిఫ్ట్ అవుతుందో లేదో అని టెన్షన్ గా ఉన్నాడు. మూడు రింగ్ ల తరువాత కాల్ లిఫ్ట్ చేసి హలొ.... అన్నారు అవతల. ఆంటీ నేను సత్య ను అన్నాడు వెంటనే. సత్యనా... అని కొన్ని సెకండ్ల తరువాత ఓహ్!! సత్య నువ్వా.... ఏంటి ఈ టైమ్ లో కాల్ చేశావ్ అడిగారు మానసా వాళ్ళమ్మ. అది మానస ఏం చేస్తోంది ఆంటీ......ఈ టైమ్ లో ఏం చేస్తుంది బాబు పడుకుంది. ఏంటి??? ఏమైంది??? ఏదో కంగారుగా మాట్లాడుతున్నావ్!!

ఆహా,అబ్బే కంగారు ఏం లేదు ఆంటీ, తనదగ్గర జ్యోతి నెంబర్ ఉండాలి నా మొబైల్ లో సాఫ్ట్వేర్ ప్రాబ్లెమ్ వల్ల మిస్ అయింది, వాళ్ళ ఫాదర్ కు హార్ట్ అటాక్ వచ్చిందట ఇందాకే వేరే వాళ్ళ ద్వారా తెల్సింది కాల్ చేసి మాట్లాడుదాం అని మానస కు ట్రై చేసాను తను లిఫ్ట్ చేయట్లేదు అందుకే అడిగా అంతే.... ఏదో తిరగా మరగా చేసి అప్పటికప్పుడు అల్లెసీ ఆవిడకు ఎలాంటి అనుమానం రాకుండా చెప్పాడు. అయ్యో అవునా.... పాపం ఎలా ఉంది జ్యోతి వాళ్ళ నాన్న కు నువ్వు ముందే నాకు చేసి ఉంటే సరిపోవు కదా నీకు తెలీనిది ఏముంది పడుకుందంటే ఇది దున్నపోతు అయిపోతుంది, దున్నపోతు మీద వర్షం పడితే ఎలా ఉంటుంది అలా ఉంటాయి నువ్వు చేసే కాల్స్ కూడా.... నేను లేపి చెబుతా ఉండు అని మొబైల్ లైన్ లో పెట్టి తీసుకెళ్లింది ఆవిడ. అంతసేపు టెన్షన్ పడుతూ మాట్లాడిన వాడల్లా ఆవిడ మాటలకు గట్టిగా నవ్వేశాడు అంతలోనే ఏం వినాల్సి వస్తుందో అని టెన్షన్ పడుతూ చూడసాగాడు.రెండు నిమిషాల తరువాత బాబు అది కాల్ చేస్తుంది అంట మాట్లాడు అని చెప్పి కాల్ కట్ చేశారు ఆవిడ.

కాల్ చేస్తుంది అంటే అది బానే ఉంది అన్నమాట అనుకుంటుండగానే మానస నుండి కాల్ వచ్చింది లిఫ్ట్ చేయగానే హాలో అని మత్తుగా అవతలి నుండి వినిపించింది. హెలో బుజ్జి ఏంటే అంత నిద్ర పోతున్నవా.... టైమ్ పన్నెండు దాటితే నిద్రపోక, జాకింగ్ కు పోతారా.... ఏందిరా ఎదవా... నీ ఎటకారంకు ఏం తక్కువలే... ఇక్కడ బతికుండగానే నా ప్రాణం తీసావ్ కదే.... కొంగ రెట్ట మొహం దానా.....నువ్వే కాకిరెట్ట మొహం అర్ధరాత్రి పొద్దు కాల్ చేసి గోకుతున్నావ్... జ్యోతి వాళ్ళ నాన్నకు ఏదో అయింది నెంబర్ కావాలి అని చెప్పి నువ్ చేస్తున్నది ఏంట్రా..... లాస్ట్ టైమ్ నీతో మాట్లాడాలి అనిపించిందే....... ఆ మాట విని ఫోన్ లో మానస, సత్య పక్కన ఉన్న అతను కూడా షాక్ అయిపోయారు. ఏంట్రా.... లాస్ట్ టైమ్ ఏంటి మైండ్ దొబ్బిందా నీకు???? నువ్వెలాగైన అనుకో బుజ్జి కానీ నీతో మాట్లాడాలి అనిపించిందే.... నేను చాలా డిప్రెషన్ లో ఉన్నా నాకు బతకాలని లేదే అందుకే చివరగా నీతో మాట్లాడలనిపించింది నీకు కాల్ చేశా.... రేయ్ పిచ్చి గాని పట్టిందా నీకు ఎర్రగడ్డ కు పంపాలా.... అసలు ఏమైంది చెప్పకుండా ఏంటి నీ ఆలోచన..... నిలదీస్తున్నట్టు అడిగింది.నాకు గీత గుర్తొచ్చింది తనకు కూడా నామీద ఎంత ప్రేమ ఉందొ తెల్సు గా నీకు...ఉండచ్చు రా నేను కాదనలేదు కానీ బ్రేకప్ అయిపోయాక ఇపుడు మళ్ళీ ఏందిరా.... ఇదంతా??? నేనేం చెయ్యను నామనసు కుదురుగా ఉండట్లేదు పిచ్చెక్కుతోందే😫😫

రేపు హనుమాన్ టెంపుల్ పక్కన ఉన్న పార్క్ కు రా నిన్ను కలవాలి నీతో మాట్లాడాలి అంతవరకు పిచ్చిగా ఆలోచించకుండా పడుకో..... ఏమైనా తేడా వస్తే నీవెనుక నేను కూడా క్యూ లో వస్తా..... పైకి గుర్తుపెట్టుకో అని ఫోన్ పెట్టేసింది...రావే చెబుతా నీకథ దొంగ మొహం దానా అనుకున్నాడు సత్య. థాంక్స్ బ్రో.... నిజంగా నువు హెల్ప్ చేశావ్ లేకపోతే ఇంకెంతసేపు ఇలా టెన్షన్ పడాల్సి ఉండేదో..... అన్నాడు సత్య పక్కన ఉన్న అతనితో.. పర్లేదు బ్రో మీ ఫ్రెండ్ కు ఏం కాలేదుగా హ్యాపీ గా ఉండండి. మళ్ళీ ఎదో స్కెచ్ వేసినట్టున్నావ్ అర్థం అయింది బాగా కొట్టుకోండి అంటుండగా బస్ రావడంతో అతను టాటా చెప్పి వెళ్ళిపోయాడు.

మరుసటిరోజు సాయంత్రం పార్క్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు సత్య, మానస వచ్చి రాగానే సత్య చెంప చెళ్లుమనిపించింది. "పిచ్చా.... టైం కానీ టైం లో నీ మాటలకు నేనెంత బయపడ్డానో తెలుసా......." అంది ముక్కుపుటాలు అదురుతుండగా. సత్య వెంటనే మానసను లాగిపెట్టి కొట్టి అదే ప్రశ్న నేను అడుగుతున్నా.... టైం కానీ టైం లో నువ్వు బాధపడింది కాక ఎన్ని సార్లు కాల్ చేసిన లిఫ్ట్ చేయలేదు. నేనెంత బాధపడి ఉండాలి అని కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా పచ్చికమీద కులబడ్డాడు. ఒక్కసారిగా రాత్రి సత్యతో మాట్లాడినవి గుర్తుచేసుకుంది మానస. నిజమే అప్పటి పరిస్థితిలో అలాగే అనిపించింది. కానీ అవతలి మనిషి ఇంత బాధపడతాడు, భయపడతాడు అనుకోలేదు. సారీ సత్యా.... అంది మెల్లిగా. ఎవరిక్కావాలే నీ సారీ!!! మీ అమ్మ నాతో ఎపుడు ఒకమాట చెప్పేది. మీ నాన్న రెండు ఆపిల్స్ నీకు ఇచ్చి అమ్మకు నీకు అని చెబితే నువు రెండు కొరికి తియ్యగా ఉన్నది అమ్మకు ఇచ్చేదానివట. మీ నాన్న నిన్ను భుజాలపై ఎత్తుకుంటే వద్దు డాడీ నీకు నొప్పేస్తుంది అనేదానివట నిన్ను ప్రేమగా చూసుకుని నీకోసం మంచి భవిష్యత్తును పోగేసుకుంటున్న మీ అమ్మ నాన్నలకు ఎవడో గొట్టం గాడు నిన్ను అవాయిడ్ చేశాడని చచ్చిపోయి చీకటి మిగల్చాలి అనుకుంటున్నావా నువ్వు సిగ్గు లేదా అన్నాడు కళ్ళలో ఎర్రని జీర నింపుకుని. పిల్లలంటే తల్లిదండ్రుల కళ్ళలో వెలుగు నింపాలి కానీ కళ్ళలో ఉన్న వెలుగులు ఆర్పేసి చీకట్లోకి నెట్టకూడదు మానసా.... అన్నాడు కన్నీళ్లు కారుస్తూ. నువు చెప్పింది నిజమే సత్యా..... జీవితాన్నిచ్చిన తల్లిదండ్రులను, అన్నింటిలో తోడుండి నాకు సలహా ఇచ్చే స్నేహితులను మరిచి ఒక్కడి ప్రేమకోసం తపించిపోయా.... ఏదో పిచ్చి ఆలోచనలు చేసాను. సారీ సత్యా.... ఇంకెప్పుడు నాగూర్చి పట్టించుకోని వాళ్ళ గూర్చి నేను ఆలోచించను. ప్రేమంటే విత్తనం మట్టిలో నుండి మొలకెత్తినట్టు రావాలి కానీ ప్లాస్టిక్ పూలను పెట్టి నిజమైన పువ్వులని నమ్మించలేం కదా!! నాకు అర్థమైంది వాడి ప్రేమ ఒక ప్లాస్టిక్ పువ్వని మొదట ఆకర్షించి దగ్గరికెళ్లాక అదొక కృత్రిమత్వం అని. నిన్ను బాధపెట్టినందుకు క్షమించురా.... ప్లీస్!!! అని కన్నీళ్లతోనే తన మనోవేదనను బయటపెట్టింది మానస.

మానసా బంధం అంటే మనం రెండు అడుగులు వేస్తే అవతలి మనిషి కనీసం ఒక్క అడుగైన వెయ్యాలి లేకపోతే మనసును ఊగిసలాడేలా చేస్తుందిరా!! నువ్విక్కడ ఏదో చేసుకోవాలి అనుకుంటావ్!! అవన్నీ ఎక్కడో ఉన్న వాడికి తెల్సి నీదగ్గరకు వచ్చి ఆపడానికి వాడేమైన హీరోనా, వాడిదగ్గర ఏమన్నా మాయదర్పణం ఉంటుందా చెప్పు. వాడిదగ్గర మాయదర్పణం ఉంటుందో లేదో కానీ నీదగ్గర మాత్రం ఒక ఫ్రెండ్షిప్ కార్డ్ ఉంటది లే...... నువు ఉన్నావ్ ఇక నాకు బాగా గడ్డిపెట్టడానికి అంది అక్కడి వాతావరణం ను తేలికపరచడానికి. అవునే గడ్డి పెట్టడానికి నేనున్నా దా ఇదిగో తిను అని పచ్చిక లాగి మానస కు ఇవ్వబోయాడు..... యాక్ తూ.... నువ్వే తిను నాకేమొద్దు గడ్డి తినేవాళ్లకు తెలివి ఆలోచన ఎక్కువట ఇన్నిడేస్ అదే తిన్నావేమో నువ్వు అని లేచి పరిగెత్తింది..

హ అయితే నువ్వు కూడా తిని తెలివితేటలు పెంచుకో బాగా చించచ్చు ఆలోచనలు అని వెనకే పరిగెట్టాడు గడ్డి చేతిలో పట్టుకుని. వాళ్ళిద్దరి ఎదురుగా ఒక ఆంబోతు వచ్చి సత్య చేతిలో గడ్డి నోటితో లాక్కుంది. ఒసేయ్ ఇక్కడ నిజమైన ఆంబోతు వచ్చింది పద పోదాం అని జంప్ అయ్యారు సత్య, మానస. స్నేహం రక్తసంబందం కాకపోయినా జీవితాన్ని ఒక మార్గంలో తీసుకెళ్లేందుకు, మంచి సలహాలు సూచనలు ఇచ్చి ధైర్యాన్ని గుండెకు అద్ది వెన్నుతట్టి నిలిచే గొప్ప బంధం. రచయితగా నామాట:- స్నేహమంటే ఆస్తి, అంతస్థు, తో ముడిపడేది కాదు, అవసరానికి అవకాశవాదానికి నీడనిచ్చేది కాదు, కోటల్లో, బవంతుల్లో ఉంటే పుట్టేది కాదు. స్నేహమంటే స్వచ్ఛమైన మట్టి పరిమళంలో మొలకెత్తే విత్తనంలాంటిది ప్రకృతి ఎంత ఆహ్లాదాన్ని ఇస్తుందో..... స్వచ్ఛమైన స్నేహం అంతటి ఆప్యాయతను పంచుతుంది. మంచి స్నేహితునిదగ్గర మన మనసు ఒక తెరిచిన పుస్తకమే..... నా స్నేహితులకు ఈ కథ అంకితం.

మరిన్ని కథలు

Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ