ఏది దూరం - పద్మావతి దివాకర్ల

edi dooram
"ఏవండోయ్!...ఈ నెలాఖర్లో మా పెద్దమ్మ కూతురు సావిత్రక్క లేదూ, దాని కూతురు రేఖ పెళ్ళి ఉంది విశాఖపట్నంలో. ఇవాళ మధ్యాహ్నం ఫోన్‌చేసి మరీ చెప్పింది మనల్ని తప్పకుండా మూడు నాలుగు రోజులు ముందు రమ్మని. మనం తప్పకుండా వెళ్ళాలండీ! మీరు మీ ఆఫీస్‌లో సెలవుకోసం అడగండి." అంది రామలక్ష్మి అప్పుడే అఫీస్‌నుండి వచ్చిన భర్త సుధాకర్‌తో.

"నువ్వొకర్తివీ వెళ్ళు లక్ష్మీ! నాకు ఆఫీస్‌లో సెలవు దొరకడం కష్టంకావచ్చు." తప్పించుకోజూసాడు సుధాకర్.

"అలా కాదండి! ఈ పెళ్ళికి మన దగ్గర బంధువులేకాదు, దూరం బంధువులు కూడా వస్తున్నారు. మనవాడికి పెళ్ళిసంబంధం దొరకడం కష్టంగా ఉందికదా. అసలే మనం ఒడిషాలో ఉండడం వల్ల ఏ పెళ్ళిసంబంధం కుదరటం లేదు. కనీసం ఈపెళ్ళిలోనైనా అక్కడ మనకి తెలిసినవారి సంబధాలేమైనా కలుస్తాయేమో! ఎవరు చెప్పొచ్చారు ఎవెరికెక్కడ రాసిపెట్టివుందో? అసలు చాలా సంబంధాలు ఇలా పెళ్ళిళ్ళలోనే కుదురుతాయిట తెలుసా? మీ బాస్‌కి చెప్పి ఎలాగోలా సెలవు పెట్టుకోండి.” అంది రామలక్ష్మి. అంత గట్టిగా ఆమె చెప్పడంవల్ల అలాగేననక తప్పిందికాదు సుధాకర్‌కి.

సుధాకర్ ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో ఓ ప్రభుత్వరంగ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉన్న ఒక్కగానొక్క అబ్బాయి నరేష్‌కి కూడా చదువు పూర్తైన తర్వాత అదేచోట ప్రభుత్వరంగ బ్యాంక్‌లో ఉద్యోగం వచ్చింది. అదే ఊళ్ళో నరేష్ కూడా ఉద్యోగంలో చేరడంతో రామలక్ష్మి ఆనందానికి అవధులు లేవు. కొడుకుకూడా తమవద్దే ఉంటాడని ఆమెకి చాలా ఆనందంగా ఉంది. అయితే ప్రమోషన్స్ వస్తే ఎలాగూ ట్రాన్స్‌ఫర్లు తప్పవు. ప్రమోషన్ కూడ ఏదో అయిదారేళ్ళనాటి మాట. అందాక ఎలాగూ తమవద్దే ఉంటాడు. నరేష్ ఉద్యోగంలో చేరిన ఏడాదినుండి పెళ్ళి ప్రయత్నాలు చేస్తోంది రామలక్ష్మి. ఎన్ని సంబంధాలు చూసినా ఏదీ కుదరకుంటోంది. అప్పటికే తెలిసినవారందరికీ చెప్పారు. మ్యాట్రిమనిలో కూడా పెట్టారు. అసలే ఇప్పుడు అమ్మాయిల కొరతకూడా ఉంది. సంబంధాలు కుదరకపోవడానికి అదీ ఒక కారణం. మధ్యమధ్య కొన్ని సంబంధాలొచ్చినా ఏవీ ఖాయం కావటంలేదు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ జాబ్‌చేసే అబ్బాయిలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు ఈ తరం అమ్మాయిలు. అదికూడా సంబంధాలు పెద్దగా రాకపోవడానికో కారణం. నిజమే మరి! ఇవాళారేపు అమ్మాయిల పెళ్ళంత సులభం కాదు అబ్బాయిలకి పెళ్ళి కుదరడం!

అలా ఆరోజు సాయంకాలం కోణార్క్‌లో విశాఖపట్నం బయలుదేరారు సుధాకర్, రామలక్ష్మి దంపతులు. వాళ్ళిద్దరూ రెండురోజులు ముందే రావడంచూసి సావిత్రి చాలా సంతోషించింది. పెళ్ళి దగ్గరకొచ్చేయడంతో అప్పటికే చాలామంది దగ్గర బంధువులు వచ్చేసారు. ఇల్లంతా పెళ్ళిసందడితో కళకళ లాడుతోంది. రామలక్ష్మి కూడా పెళ్ళిపనుల్లో సావిత్రక్కకి సాయపడసాగింది. మాటల్లో సావిత్రిని అదును చూసి అడిగింది రామలక్ష్మీ, "అక్కా! ఇప్పుడు రేఖ పెళ్ళికి వస్తున్న మన చుట్టాలలో ఎవరింట్లోనైనా పెళ్ళీడు అమ్మాయిలు గానీ ఉన్నారా?"

"ఎవరికోసమే?" అనేసి అంతలోనే రామలక్ష్మి కొడుకు నరేష్ గుర్తుకువచ్చి, "ఓహో!...మీ నరేష్‌కోసం సంబంధాలు చూడడం మొదలెట్టావా ఏమిటి?" అంది సావిత్రి.

"అవును! వాడికోసమే పెళ్ళిసంబంధం చూస్తున్నాము. తెలిసినవాళ్ళందరికీ చెప్పాం. మ్యాట్రిమనిలో కూడా పెట్టి రెండేళ్ళయింది. అయినా ఇప్పటివరకూ సరైన సంబంధం ఏదీ రావడంలేదు. ఇప్పటికే వాడికి దగ్గరదగ్గర ముప్ఫైఏళ్ళ వయసు వచ్చింది. వచ్చిన సంబంధాలు కూడా ఏవీ కుదరటంలేదు. నీకు తెలిసిన సంబంధాలు ఎవైనా ఉంటే చెప్తావని అడిగేను."అంది రామలక్ష్మి.

"తప్పకుండా! అయితే ఈ మధ్య నాకు తెలిసి పెళ్ళి కావలసిన అబ్బాయిలేఎక్కువమంది ఉన్నారు. దగ్గరదగ్గర అరడజను పెళ్ళికావలసిన అబ్బాయిలు ఉన్నారు మన బంధువర్గంలో. అయితే, పెళ్ళికావలసిన అమ్మాయిలు ఎవరూ ఉన్నట్లు లేదే!" అంటూ ఆలోచనలో పడింది సావిత్రి.

"అలాకాదు! కాస్త బాగా ఆలోచించుకొని చెప్పు పోనీ!" అంది రామలక్ష్మి. ఈ లోపున అక్కడకి బ్యూటీ పార్లర్‌నుండి ముస్తాబు చేసుకొని పెళ్ళికూతురు రేఖ, ఆమె కూడా వెళ్ళిన స్నేహితురాళ్ళు రావడంతో అందరి దృష్టి అటువైపు మళ్ళింది. పెళ్ళికూతురు రేఖ అసలే చక్కని చుక్క. ఇప్పుడు బ్యూటీపార్లర్‌నుండి వచ్చినతర్వాత ఇంకా బాగా మెరిసిపోతోంది.

సరిగ్గా అప్పుడే ఇంటిబయట ఆగిన క్యాబ్‌లోంచి దిగారు రమణమూర్తి, ఆయన భార్య మాలతి. వచ్చీ రాగానే, "హాయ్! చెల్లీ, పెళ్ళిపనులెలా నడుస్తున్నాయి? బావగారేం చేస్తున్నారు? పెళ్ళి కూతురు ఏదీ ఎక్కడా?" అంటూ ప్రశ్నలవర్షం కురిపించాడు రమణమూర్తి హడావుడిగా. రమణమూర్తి సావిత్రికి పెద్దనాన్న కొడుకు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నాడు.

"రా అన్నయ్యా! ఇదిగో పెళ్ళిపనుల్లో నాకు, మీ బావగారికి అసలు తీరుబాటు లేదనుకో! ఇదిగో ఇప్పుడే రేఖ బ్యూటీపార్లర్‌కి తన స్నేహితురాళ్ళతో వెళ్ళి ఇప్పుడే వచ్చింది. అదిగో ఆ గదిలో ఉంది." అని, "వదినా!..ఎలా వున్నావు?" అని వదినని పలకరించింది.
మాలతి జవాబిచ్చి పెళ్ళికూతురి గదిలోకి వెళ్ళింది. రమణమూర్తి అక్కడే కొద్దిసేపు సావిత్రితో మాట్లాడి ఆ తర్వాత అమె వాళ్ళు ఉండడానికి చూపించిన గదికి వెళ్ళాడు బ్యాగ్‌తీసుకొని. రామలక్ష్మి ఇంతకుముందు వాళ్ళని కొన్ని పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్‌లో చూసిందిగాని, వాళ్ళెవరో మాత్రం గుర్తుకు రాలేదు. అందుకే సావిత్రినడిగింది.

"వాడా!...మా అన్నయ్య, అదే... మా పెద్దనాన్న కొడుకు రమణమూర్తి. ఆమె వదిన మాలతి. ప్రస్తుతం వాళ్ళు హైదరాబాద్‌లో ఉంటున్నారు. మా అన్నయ్య చాలా సరదా మనిషనుకో, అలాగే వదిన కూడా." అంది సావిత్రి. కొద్దిసేపు ఆగి, వెంటనే ఏదో గుర్తుకు వచ్చి, "ఆ!...ఇప్పుడు నువ్వు అడిగావుకదా పెళ్ళికూతుర్లు ఎవరైనా ఉంటే చెప్పమని మీ నరేష్ గురించి. నువ్వు ఇలా అన్నావో లేదో మాటలలోనే వచ్చాడు మా అన్నయ్య. ఇందాక నాకు గుర్తు రాలేదు కాని, మా అన్నయ్యకి పెళ్ళికావలసిన అమ్మాయి ఉంది. పేరు రమ్య. చక్కని చుక్క. ఇప్పుడే ఎంబియే పూర్తి చేసింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉద్యోగం కూడా చేస్తోంది. అమెకి పెళ్ళి సంబంధం చూస్తున్నానని ఇదివరకోసారి కనపడినప్పుడు చెప్పాడు అన్నయ్య." అంది సావిత్రి.

ఆమె మాటలు విన్న రామలక్ష్మికి వెంటనే ఉత్సాహం కలిగింది. "అయితే అక్కా! కొంచెం మా తరఫునుండి మాట్లాడకూడదా?" అంది.
"అలాగే లేవే! నీకు తెలుసుననుకొని వాళ్ళని పరిచయం చేయలేదు. ఇప్పుడు తెలిసిందిగా, మీ ఇద్దర్నీవాళ్ళకి పరిచయం చేస్తాను. మీరు ముందు వాళ్ళతో మాటలు కలపండి. ఆ తర్వాత నేను కూడా చెప్తాను, సరేనా?" అంది సావిత్రి.

"అలాగే అక్కా!" అంది రామలక్ష్మి.

తను అన్నట్లుగానే భోజనం సమయంలో రామలక్ష్మి, సుధాకర్‌కి తన అన్నయ్య రమణమూర్తిని, వదిన మాలతిని పరిచయం చేసింది సావిత్రి.
ఆ సాయంకాలం సుధాకర్ రమణమూర్తితో మాట్లాడుతుండగా, రామలక్ష్మి తను కూడా మాలతిని మాటల్లో పెట్టింది. మాటల్లో పెట్టి మెల్లిగా పెళ్ళి మాటలు కలిపాడు సుధాకర్. తన గురించి అంతా చెప్పుకొని అబ్బాయి నరేష్ చదువు, ఉద్యోగం మొదలగు వివరాలు చెప్పాడు సుధాకర్. అలవాటుగా దగ్గర ఉంచుకోవడంతో రమేష్ ఫొటో, జాతకం కూడా చూపించాడు రమణమూర్తికి. వివరాలు అన్నీ కనుక్కొని ఇంటికి తిరిగి వెళ్ళిన వారం రోజుల్లో ఏ సంగతి చెప్తానన్నాడు రమణమూర్తి. రామలక్ష్మికి కూడా మాలతి వద్ద నుండి అటువంటి సమాధానమే లభించింది.

ఆ తర్వాత పెళ్ళిపనుల్లో ఎవరికీ తీరికలేకుండా పోయింది. పెళ్ళి వైభవంగా జరిగిపోయింది. అయితే రామలక్ష్మి అక్కడ ఉన్నంతసేపూ కావాలని మాలతితో పదేపదే మాటలు పెట్టుకునేది. తిరిగి బయలుదేరే సమయానికి సుధాకర్ రమణమూర్తికి మరోసారి విషయం గుర్తు చేసాడు. రామలక్ష్మి సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. పదే పదే తన కొడుకు గురించి చెప్తునే ఉంది మాలతితో.

ఇంటికొచ్చిన దగ్గరనుండి రమణమూర్తి ఫోన్‌కోసం ఎదురుచూడసాగారు సుధాకర్ దంపతులు. వారం మాట అటుంచి, కనీసం పది రోజులైనా వాళ్ళదగ్గరనుండి ఏ కబురు రాకపోవడంతో రామలక్ష్మి తెగ తొందరపెట్టింది సుధాకర్‌ని వాళ్ళతో మాట్లాడమని.

"ఉండవే! మనం మగపెళ్ళివారమే! కొంచెం ఆగు, వాళ్ళనుంచి ఫోన్ రానీ!" అన్నాడు సుధాకర్.

"అలాగనకండి. ఇవాళారేపు పెళ్ళి కావలసిన అమ్మాయిలు దొరకడమే కష్టంగా ఉంది. అమ్మాయి ఫొటో చూసాం కదా. ఆమ్మయి చాలా బాగుంది. అబ్బాయికీ నచ్చింది. మనవాడి ఫొటో, జాతకం కూడా వాళ్ళు తీసుకెళ్ళారు మరి. వాళ్ళతో ఓ మాటనుకుంటే ముందు పెళ్ళిచూపుల వరకూ వెళ్ళవచ్చు. ఆ తర్వాత అంతా భగవతేఛ్ఛ." అంది రామలక్ష్మి.

"అలాగేలేవే!" అని నసిగి మరో రెండుమూడు రోజులు నాన్చాడు సుధాకర్. ఆ తర్వాత మరి భార్య పోరు పడలేక ఆ ఆదివారం రమణమూర్తికి ఫోన్‌చేసాడు. రమణమూర్తి ఫోన్ఎత్తిన తర్వాత విషయం చెప్పాడు సుధాకర్. అటువైపునుండి రమణమూర్తి చెప్పిన జవాబు విని ఖిన్నుడైనాడు.

"ఎమిటండీ! ఏమన్నాడు రమణమూర్తి?" అని అడిగింది రామలక్ష్మి ఆతృతగా.

"మన ఊరు వాళ్ళకి చాలా దూరమట! ఇంత దూరం అమ్మాయిని ఇవ్వడం ఇష్టంలేదట." నిట్టూర్చి అన్నాడు సుధాకర్. ఆ మాటలకి రామలక్ష్మి ఆశ్చర్యపోతూ, "నిజమే! దూరమైతే మాత్రం, ఇవాళారేపు ఎన్ని ప్రయాణ సాధనాలులేవు? ఒకప్పటిలా కాక ఇప్పుడు అందరివద్ద స్మార్ట్‌ఫోన్లు ఉంటున్నాయి. ఎప్పుడైనా, ఎక్కడికైనా మాట్లాడుకోవచ్చు. పైగా దూరమైనా హైదరాబాద్‌నుండి ఇక్కడకి నేరుగా ఫ్లయిట్ కూడా ఉంది కద." అంది.

"అవును నిజమే! ఈ ప్రపంచీకరణవల్ల ప్రపంచమంతా చిన్నదైపోయింది. ఎన్నడూ లేని ప్రయాణ సౌకర్యాలున్నాయి నేడు, కానీ వాళ్ళకి మన సంబంధం మాత్రం ఇష్టంలేదని రమణమూర్తి స్పష్టంగా చెప్పాడు. ఇది చాలా దూరమట. మరి మనం ఇంకేం చేయగలం?" అన్నాడు సుధాకర్.

"ఇదెక్కడి విడ్డూరం! దూరమట, దూరం!" అంటూ వంటింటి వైపు నడిచింది రామలక్ష్మి.వారం రోజులతర్వాత ఒకరోజు సావిత్రి ఫోన్ చేసింది రామలక్ష్మికి.

"ఎమిటే లక్ష్మీ!...రమణమూర్తి అన్నయ్యని పెళ్ళి సంబంధం విషయమై మీరేమీ మాట్లాడలేదా!" అని అడిగింది.

"అడగకపోవటేమిటే అక్కా! ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఫోన్‌కోసం ఎదురుచూసి ఆఖరికి చేసాం. వాళ్ళకి మన సంబంధం ఇష్టం లేదుట. దానికి కారణం ఏమిటి చెప్పారో తెలుసా అక్కా? మా ఊరు చాలా దూరమట! ఇంత దూరం వాళ్ళమ్మాయిని ఇవ్వరట!" అంది రామలక్ష్మి.

"పోనీలేవే! వాళ్ళకి అభ్యంతరమైనప్పుడు మనమేమి చేయగలం? అసలిప్పుడు ఎందుకు ఫోన్ చేసానంటే రాజేశ్వరి నా క్లాస్‌మేట్‌ని చాలారోజుల తర్వాత నేను ఈ మధ్యే కలిసాను. వాళ్ళ అమ్మాయికోసం పెళ్ళి సంబంధాలు చూస్తున్నట్లు తెలిసింది. అప్పుడు మళ్ళీ నాకు నువ్వు గుర్తుకు వచ్చావు. ఒక పని చేస్తావా? ఈ ఆదివారం మంచి రోజు. నువ్వు ఇక్కడకి వస్తానంటే నేను పెళ్ళిచూపులు ఏర్పాటు చేస్తాను. సరేనా!" అంది సావిత్రి. ఆమె మాటలకి సంతోషించింది రామలక్ష్మి.

"అలాగే, తప్పకుండా వస్తాను." అని జవాబిచ్చింది రామలక్ష్మి. అనుకున్నట్లుగానే శనివారానికల్లా విశాఖపట్నం చేరారు వాళ్ళు ముగ్గురూ. ఆదివారం పెళ్ళిచూపులకార్యక్రమం జరిగింది. ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు కలవడంవల్ల, ఇద్దరూ పరస్పరం ఇష్టపడ్డారు. పెద్దవాళ్ళు కూడా ఓ అంగీకారానికి వచ్చారు. ఆ తర్వాత వాళ్ళమధ్య పెళ్ళి కబుర్లు చకచక జరిగిపోయాయి.

ఆ మరుసటి రోజు ఇంటికి తిరిగి బయలుదేరినప్పుడు రామలక్ష్మి అంది, "అక్కా! మాకు చాలా సహాయం చేసావు అక్కా! మొత్తానికి మా వాడి పెళ్ళి కుదిరినందుకు నాకు చాలా సంతొషంగా ఉంది."

"ఎవరికెక్కడ రాసిపెట్టి ఉంటే అక్కడే కుదురుతుంది. పుట్టినప్పుడే దేవుడు ఎలాంటివన్నీ ముందే రాసిపెట్టిఉంటాడు." నవ్వుతూ అని, కొంచెంసేపు ఆగి అంది, "అన్నట్లు, నీకోసంగతి చెప్పనా! దూరం అనే నెపంతో మీ సంబంధం వదులుకున్న రమణమూర్తి కూతురికి పెళ్ళి కుదిరింది. ఎక్కడి సంబంధమో తెలుసా?..." అంది సావిత్రి.

"ఆఁ...చెప్పు. ఎక్కడ కుదిరింది." అడిగింది రామలక్ష్మి.

"వాళ్ళమ్మాయికి ఓ అమెరికా సంబంధం కుదిరింది. పెళ్ళికొడుకు అమెరికాలో ఉన్నాడు.మొన్నీమధ్యనే నాకు తెలిసింది. అందుకే బహుశా మీ సంబంధం వదులుకున్నాడేమో?" అంది సావిత్రి. విస్తుపోయింది రామలక్ష్మి. చాలా దూరమని తమ సంబంధమే వదులుకున్నాడు కదా, మరి అమెరికా ఇంకా చాలా దూరం కాదా మరి, అనుకుంది ఆమె మనసులో. అదే మాట సావిత్రితో అంది కూడా.

"నిజమే వాళ్ళ దృష్టిలో అమెరికా దూరం కాదేమోమరి?" సాలోచనగా అంది సావిత్రి.

మరిన్ని కథలు

Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి
Emi jariginaa antaa manchike
‘ ఏమి జరిగినా అంతా మంచికే ’
- మద్దూరి నరసింహమూర్తి