కరణేషు మంత్రి - శింగరాజు శ్రీనివాసరావు

good support

మనసంతా దిగులుతో నిండిపోయింది. ఏదో తెలియని అలజడి గుండె పొరలను కుదిపేస్తున్నది. ఎన్నో ఆశలను పోగు చేసుకుని, బంధాలను అవతలకునెట్టి, వేల కిలోమీటర్లు దాటి వచ్చాను. అనుకోని ఈ అవాంతరం ఇప్పుడు ఉనికినే అస్తవ్యస్తం చేస్తున్నది. అగ్రరాజ్యం అంటే భూతలస్వర్గం అనుకున్న లోకానికి, చిన్న అవాంతరం వస్తే అది శవాల గుట్ట అవుతుందని, ఇప్పుడున్న స్థితి కళ్ళకు కట్టినట్టు చెబుతున్నది. ఒక వైపు బ్రతుకు భయం, మరొకవైపు బ్రతుకెలాగన్న భయం కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. ఆర్థికవ్యవస్థ అతలాకుతలమైన స్థితిలో ఉద్యోగాలు ఉంటాయో, ఊడుతాయో తెలియడం లేదు. ఒకవేళ ఉద్యోగానికి ఉద్వాసన పలికితే అరవై రోజుల లోపే తట్టాబుట్టా సర్దుకువెళ్ళాలి. ఈ ముంపు ఇప్పుడే రావాలా? నా వీసా గడువు ఇప్పుడే పూర్తవాలా? నా ఖర్మ కాకపోతే. వచ్చి మూడు సంవత్సరాలయింది. ఇంకో మూడేళ్ళ వీసా పొడిగిస్తారు. అది ముగిసేలోపు గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. తిన్నగా I-140 తెచ్చుకోగలిగితే ఆ తరువాత పొడిగింపు దానికదే వస్తుంది, అలా అలా అమెరికాలో స్థిరపడిపోవచ్చు అని కలలు కన్నాను. 'ఉన్న ఒక్కగానొక్క నలుసువు మమ్మల్ని ఇలా వదిలేసి పోతావటరా' అని అమ్మ మొత్తుకుంటున్నా, నాన్నతో చెప్పి ఒప్పించి మరీ వచ్చాను. ఇప్పుడేమో భవిష్యత్తు అగమ్యగోచరంగా కనిపిస్తున్నది.

తలపక్కకు తిప్పి చూశాను. పావని ప్రశాంతంగా నిద్రపోతున్నది. అదృష్టవంతురాలు దేన్ని గురించి ఆలోచించదు అనుకున్నాను. నా కదలికలకు మెలకువ వచ్చిందేమో

" ఏమండీ. ఇంకా నిద్రపోకుండా ఏమి ఆలోచిస్తున్నారు" అంది కళ్ళు నులుముకుంటూ.

"ఎందుకో నిద్రపట్టడం లేదు. ఎంత వద్దనుకున్నా రేపేమవుతుందో అన్న ఆలోచన స్థిమితంగా ఉండనివ్వడం లేదు" చెప్పకూడదనుకుంటూనే నోరుజారాను.

" చూడండి మహాశయా గత పది రోజులుగా మీరు అదేపనిగా ఆలోచిస్తున్నారు. కరోనా వైరస్ అమెరికాలో విలయతాండవం చేస్తున్నది నిజమే. కానీ మనమిప్పుడు ఏం చెయ్యగలం. మన జాగ్రత్తలో మనం ఉంటూనే వున్నాం కదా. అంతకంటే ఏం చెయ్యగలం. సరే మీలాగ ఆలోచిస్తూ కూర్చుంటే అది పారిపోతుందా, లేక మీకు వచ్చి అంటుకుంటుందా. ఏదయినా జరిగేది జరగక మానదు. మీకు నిద్ర దండగ. నాకు ఇదిగో ఇలా నిద్రాభంగం. నెత్తిన ఆ నాలుగు పీచులు ఊడి తల మైదానమయ్యే దాకా ఆలోచించక పడుకోండి" విసురుగా దుప్పటి ముసుగుతన్ని పడుకుంది పావని.

తనెప్పుడూ అంతే దేన్నీ సీరియస్ గా తీసుకోదు. నెత్తిన బండ పడుతున్నా, పడిన తరువాత చూసుకుందాములే అనే రకం. ఒక రకంగా చెప్పాలంటే టేకిట్ ఈజి పాలసీ అన్నమాట. విధిలేక నేనూ ముసుగుతన్నాను. నా చెయ్యి తన మీద వేసుకుని దగ్గరకు లాక్కుంది. నేనిలా అన్యమనస్కంగా ఉన్నపుడు తను వాడే టెక్నిక్ అది.

*******

పావని ఇచ్చిన కాఫీ తాగుతూ కరోనా లైవ్ అప్డేట్స్ చూస్తున్నాను. మూడు లక్షల పైచిలుకుగా తేలారు వ్యాధి పీడితులు నేటికి. అందులో ఎనిమిది వేల మరణాలు. ఇంకా లక్ష పైగా మరణించవచ్చని సాక్షాత్తు అధ్యక్షుల వారే సెలవిస్తున్నారు. వీసా నిబంధనలు కఠినతరం చేశారని, ఈ సరికే వీసా గడువు ముగిసిన వారికి పొడిగింపు కష్టమవుతుందని, ఉద్యోగాలు వదలి వెళ్ళిపోవలసి వస్తుందని రోజులాగే చెబుతున్నారు. అదే విషయమై నేను రాత్రంతా ఆలోచించింది. ఉద్యోగం పోతే తలెత్తుకుని బ్రతకడం ఎలా? అదే దిగులైపోయింది నాకు. ఇంతటి సంక్షిష్టస్థితిలోను ఏ మాత్రం దిగులుపడదు పావని. అందుకంటే నాకు కోపం తనమీద. ఇంతలో ఫోను మోగింది. బహుశా నాన్న గారయుండవచ్చు. చూశాను. నాన్నగారే

"హలో నాన్న ఎలా ఉన్నారు మీరు. అక్కడ కూడ కరోన బాగానే పెరుగుతున్నదటగా"

"అవును రా. అయితే ఇక్కడ మమ్మల్ని గడప దాటనీయకుండా మూడు వారాలు లాక్ డౌన్ ప్రకటించారుగా. పాలకు, కూరలకు తప్ప కిందికి దిగడమే లేదు. మా సంగతి సరే. మీకు ఏమిటిరా మరీ భయంకరంగా చెబుతున్నారు. మాకు మీరెలా ఉన్నారా అనే దిగులు. మాదే ముందిరా ఎటైనా ఇబ్బందిలేదు. మీరు జాగ్రత్త. వాళ్ళు పంపేపనయితే వచ్చేయండిరా"

నాన్న గొంతులో జీర.

" ఇక్కడ ఇబ్బందేమీ లేదు నాన్నా. మేము కూడ ఎక్కడికీ వెళ్ళటం లేదు. ఇంటినుంచే పని చేస్తున్నాము. నెలకు సరిపడా సరుకులు తెచ్చుకున్నాం. మీరేం దిగులుపడకండి మా గురించి"

" నాకన్నా అమ్మ దిగులు పడుతున్నదిరా. మనకేమన్నా పదిమంది ఉన్నారా. ఉన్నది ఒక్కడు. వాడక్కడ మనమిక్కడ అని ఒకటే సతాయింపు. అదిసరే నీ వీసా పొడిగింపు సంగతేమయింది. వార్తల్లో పొడిగింపు కష్టమంటున్నారు"

" అది ఇంకా తేలలేదు నాన్నా. ఇంకా నెల సమయముందిలే. ఈ లోపల వస్తుందేమో చూద్దాం"

"రాకుంటే పరిస్థితి ఏమిటిరా. మిమ్మల్ని పంపిస్తారా? విమానాలు బయలు దేరుతాయా? వస్తే ఇక్కడ క్వారంటైనని పద్నాలుగు రోజులు ఆసుపత్రిలో ఉంచుతారురా. అదో నరకం. అయినా ఈ మాయదారి వైరస్ ఇప్పుడే రావాలా. మన దరిద్రం కాకపోతే"

అది బాధో, భయమో, దిగులో అర్థంకాలేదు.

" ఇప్పుడవన్నీ ఎందుకులే నాన్నా. తెలిసిన తరువాత ఆలోచిద్దాం . మీరు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండండి" నాకు లేకున్నా, నాన్నకు ధైర్యం చెప్పాను.

" ఒరేయ్ పార్థూ. ఏదైనా అటు ఇటు అయి ఇక్కడికి రావలసివస్తే దిగులుపడకు. ఇక్కడే ఏదో ఒక పని చూసుకోవచ్చు. నాకు యాభై వేలు పెన్షను వస్తుంది. లంకంత ఇల్లుంది. అమ్మాయి, నువ్వు హాయిగా ఉండవచ్చు. అందరం కలిసి ఉంటే ఖర్చులు బాగా తగ్గుతాయి. ఒకరికొకరం ఆపుగా ఉంటాం. ఏదో నువ్వు మోజు పడ్డావని, అందరూ వెళ్తుంటే నిన్ను మాత్రం ఆపడం ఎందుకని సరే అన్నాను. నువ్వు అనవసరంగా ఆలోచించి ఆరోగ్యం పాడుచేసుకోకు. ప్రశాంతంగా ఉండు. ఏం జరిగినా మనమంచికే అనుకుని నిబ్బరంగా ఉండు. పావని బాగుందా. తనని కూడ ఆలోచించవద్దని చెప్పు. ఉంటానురా" అని ఫోను పెట్టేశాడు నాన్న

అందరూ ఆలోచించవద్దంటారు. కానీ ఎలా? బంగారమంటి ఉద్యోగం. లక్ష డాలర్ల జీతం. అక్కడికి వెళితే అసలు ఉద్యోగం దొరకదు. ఈ మాంద్యం గోలలో ఇచ్చేవాడెవరు. భగవంతుడా ఏది దారి.

"ఎవరు మామయ్యగారేనా. ఏంటట సంగతులు" కుర్చీలో కూర్చుంటూ అడిగింది పావని.

" ఏమున్నాయి మామూలే. కరోనా తీవ్రత అధికంగా ఉందిగదా. ఉంచుతారా... పంపుతారా.. వీసా పొడిగిస్తారా... ఉద్యోగం లేకపోయినా ఫర్వాలేదు. వచ్చేయండి. అదే రికార్డు. ఆయనకేం అలాగే చెబుతారు. అక్కడికి పోయి ఏం చెయ్యాలి. ఈ గందరగోళ పరిస్థితులలో ఉద్యోగం ఎవరిస్తారు? ముష్టెత్తుకోవలసిందే" భయంతో కూడిన దిగులు పట్టుకుంది నాకు.

" చూడండి. అస్తమానం అలా దిగులు పడితే జరిగేది జరగక మానుతుందా. మీరన్నట్టే వీసా పొడిగించక మనలను భారత్ వెళ్ళిపొమ్మంటే, జీవితం ఇంకేం మిగిలిందని ఆత్మహత్య చేసుకుందామా. చెప్పండి" పావనిలో కోపం తొంగిచూసింది.

" అంతకంటే దారేముంది" అదే నిర్లిప్తత నాలో.

" అదే పిరికితనమంటే. చచ్చి ఏంసాధిద్దాం. ఈ వయసులో మనలను కన్నవారిని క్షోభ పెడదామా. అయినా ఈ అమెరికా సంపాదనలు ముందు తరాల్లో ఉన్నాయా. వాళ్ళు బ్రతకలేదా. ఏదో కాలం కలిసివచ్చి ఇంటికొక ప్రవాసాంధ్రుడు తయారయ్యాడు గానీ. కాస్త గొప్పలు పక్కనబెట్టి ఆలోచించండి. మనకు తినాగొడవ ఉందిగా. మా నాన్నకు నేను ఒక్కదాన్ని. పదెకరాల పొలం ఉంది. సంవత్సరానికి ముప్ఫై లక్షలు కౌలు వస్తుంది. సొంత ఇల్లు. భీమా ఏజంటుగా నాన్న సంపాదిస్తూనే ఉన్నారు. ఇక మామయ్యకు యాభైవేలు పెన్షను. మనం ఇండియా వెళ్తే ఊరికే కూర్చోము కదా. ఏడాదికో, రెండేళ్ళకో ఏదో ఒకటి దొరకదా. అన్నిటికీ భయమే"

" నీకేం నువ్వు ఇప్పుడు అలాగే అంటావు. తీరా అక్కడికి వెళ్ళాక, ఏ ఉద్యోగమూ రాదు. ఒకవేళ వచ్చినా, అది నీ చీరెలకే చాలదు. అప్పుడు మళ్ళీ దెప్పుతావు. చేతగాని మొగుడని" నీతులకు, చేతలకు చాలా దూరమనే నా నమ్మకాన్ని సమర్ధించుకుంటూ

ఉలిక్కిపడింది పావని. ఎక్కడో బాధ కలిగినట్లుంది.

" మీ దృష్టిలో భార్యంటే భర్తను పీడించుకుతినే పిశాచని, మీ కష్టాలు పట్టించుకోకుండా తమ ఇష్టాలను నెరవేర్చుకుంటారని అనుకుంటున్నారు కదూ" కళ్ళు చెమర్చాయి.

ఎప్పుడూ అల్లరిగా, లెక్కలేనితనంగా కనిపించే పావనిలో బాధను తొలిసారిగా చూశాను. ఛ. ఎంత తప్పుగా మాట్లాడానో అనిపించింది.

" అది కదు పావనీ" ఏదో చెప్పబోయాను.

" మీరే కాదండీ. అందరు భర్తలు అలాగే అనుకుంటారు. మీ సంపాదన చూసి మిమ్మల్ని చూస్తున్నామని, అది లేని రోజు మిమ్మల్ని లెక్కచేయమని. ఇది అనాదిగా మగవారిలో పేరుకుపోయిన దురభిప్రాయం. మీ కష్టాలలో పాలుపంచుకోవడానికే మేము ఉద్యోగాలు చేస్తాం. వేడినీళ్ళకు చన్నీళ్ళు తోడయితే సంసారం సాఫీగా ఉంటుందని తాపత్రయపడతాం. మీ నవ్వులో మా నవ్వును చూసుకుంటాం. కాపురం సంతోషంగా ఉండాలంటే కావలసింది కోట్లు కాదండి. అన్యోన్యత. ఒకరి బలహీనతను మరొకరు బలంగా మార్చడం. మనం ఇండియా వెళితే మనలను మనవాళ్ళు చిన్న చూపు చూడరు. కలసివుండి కలో, గంజో తాగుదామంటారు. అదేనండి కుటుంబమంటే. నేను కోరుకునేది ఆ కుటుంబాన్నే గానీ, మీ అమెరికా సంపాదనను కాదు. మనల హేళన చేసేవారు ఎవరూ, ఒక్క ముద్ద కూడ మనకు పెట్టరు. వాళ్ళతో మనకెందుకు. నా చీరలకే సంపాదన సరిపోదన్నారు. ఉంటే పట్టు కట్టే మేము, లేని రోజు నారచీర కట్టడానికైనా వెనుకాడము. డబ్బు విలువ కంటే కుటుంబం చాలా విలువయినది. అది తెలుసుకోవడానికి ప్రయత్నించండి"

మొట్టమొదటిసారిగా తనలో ఒక నిబద్దత గల మహిళ కనిపించింది నాకు. తనలో ఎంత లోతు మనిషి ఉందో అర్థమయింది నాకు.

" సారీ పావనీ. నిన్ను బాధపెట్టానేమో కదూ" చేతులు పట్టుకన్నాను.

" రోజూ మీ బాధ చూడలేక ఇవాళ ఇలా బయటపడ్డాను. వెధవ ఉద్యోగం ఉంటే ఉంటుంది. ఊడితే ఊడుతుంది. మనిషి ఎప్పుడూ పోయినదాని గురించి ఆలోచించకూడదండి. ఈ అనర్ధాన్ని ఎలా అధిగమించాలా అని ఆలోచించాలి. కష్టపడే వారికి తిండికి ఢోకాలేదండి. హాయిగా మన ఊరు వెళదాం. చేసుకునే ఓపికుంటే మన పొలం మనం చేసుకుందాం. లేదంటే ఏ హోటలో, కర్రీపాయింటో ఏదో ఒకటి పెట్టుకుందాం. బ్రతకడానికి కావలసింది కుటుంబం అండేగాని డబ్బుకాదు. రోజు వారి కూలీలు ఎంత హాయిగా ఉంటారో చూడండి. మనం కూడ అలానే ఉందాం. ఇలా వాళ్ళక్కడ మనమిక్కడ దిగులుతో. అవసరమా. అందరం ఒకేచోట ఒకరికి ఒకరు తోడుగా. మిమ్మల్ని నిరాశపరచాలని కాదు. ఇది నా మనసులో మాట" నాచేతిని నొక్కింది.

" నిజమే పావని. పక్కవారితో పోటీలు పడి దేశంకాని దేశానికొచ్చి కమ్మని భోజనం లేక, నా అని పలకరించే దిక్కులేక, కేవలం సంపాదనే ధ్యేయంగా బ్రతుకున్నామా అనిపిస్తుంది. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా వుంది పావనీ. అందరూ కుటుంబ విలువలు తెలియక ఉమ్మడి కుటుంబాలకు దూరంగా అర్థం లేని బ్రతుకులు బ్రతుకుతున్నారు. ఎవరిదాకానో ఎందుకు, నా మటుకు నేను చేసింది అదే పనిగా. నీ మాటలు నాలో ధైర్యాన్ని నింపాయి. జీవితంలో ముందుకు సాగేలా నన్ను ఉత్తేజపరిచాయి. అందుకేనేమో భార్యను "కరణేషు మంత్రి" అన్నారు. ఇక కరోనా నన్నేమీ చేయలేదు. వీసా పొడిగింపు ఏమయినా బాధలేదు. కుటుంబంలో ఒకరికి మరొకరు ధైర్యమయితే ఏ కష్టమూ వారినేమీ చేయలేదు" సంతోషం నిండిన మనసుతో పావనిని దగ్గరకు తీసుకున్నాను, ఈ భర్తలు ఎప్పుడూ భార్యలను అర్ధం చేసుకోవడంలో అడుసులో కాలు వేస్తూనే ఉంటారు అనుకుంటూ.

మరిన్ని కథలు

Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు