Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

యాత్ర

 జరిగిన కథ: మేలి ముసుగులో ఉన్న షహనాజ్  మొహంలోని ఫీలింగ్స్ ను జీవన్ రకరకాలుగా అభివర్ణించుకుంటూ..ఓ పక్క మ్యూజిక్ సిట్టింగ్స్ తోనూ విడిది, ప్రయాణం సరదాగా సాగుతుంటుంది........ ఆ తరువాత ...................

జిల్లర్ తాల్ బన్” స్టేషన్లో ఆగి రెండు నిమిషాలకి మళ్ళీ బయల్దేరింది రైలు.

ఒక్కొక్కరికీ ఒకో చికెన్ పొట్లం, అర లీటరు మినరల్ వాటరు బాటిల్ పంచేడు జార్జి ప్రసాద్. విప్పుకుని తింటున్నారు. ఉప్పూ కారం లేదు గానీ కమ్మగా ఉంది. గోవిందు తప్ప అందరూ తినేశారు. గోవిందు పొట్లం విప్పి గోవిందు పొట్లం విప్పి కంపార్ట్ మెంట్లో అందరికీ దాన్ని తిప్పి చూపిస్తూ ఇందులో వేసిన మాసం ఏంటని సైగల్తో అడుగుతున్నాడు చందర్రావు. చాలా మంది లేంబ్ అన్నారు. కొందరయితే బీఫ్ అన్నారు. చివరికి తేలిందేంటంటే అది ఒక ఆవుదూడ మాంసం. నెత్తీ నోరూ బాదుకుంటూ బాత్ రూమ్ లో కెళ్ళి కక్కుకోవడం మొదలెట్టాడు చందర్రావు.వేలకి వేల ఎకరాల్లో మైదానాల మీద పడే ఎండపొడలు కొండల మీదెక్కడో పురాతనమైన కేజిల్స్, చర్చిలు అవి చూస్తుంటే మధుమతి సినిమాలో ఆజారే పరదేశీ గుర్తుకొస్తుంది. హోటలు రూమ్ లో ఉన్న షహనాజ్ గుర్తుకొస్తుంది.

ఓర్ల్ స్టేషన్లో ఆగింది రైలు. అప్పటికి వాళ్ళు రైలెక్కి గంటయింది. అంటే సాల్స్ బర్గ్ వెళ్ళడానికి ఇంకా గంట పడ్తుంది. అది వీళ్ళకి వేసవి కాలమట. జీవన్ కి మాత్రం ఒక వెచ్చటి శీతాకాలం మధ్యాహ్నం లాగుంది. పక్కన ముగ్గురబ్బాయిలూ, ఒక అమ్మాయూ కల్సి పేకాడుతున్నారు. అదో రకంగా ఉన్నాయి వాళ్ళ పేక ముక్కలు. ఆ అమ్మాయి వైలెట్ కలర్ స్లీవ్ లెస్ బనియన్ లాంటిది వేసుకుంది. లోపల నల్లని బ్రా. దాని తాళ్ళు బయటికి కనిపిస్తున్నాయి. అమ్మాయి ముఖాన్నే చూస్తున్నాడు జీవన్. ముక్కు, నోరూ కొంచెం ఏకమైంది. పాము ముఖం లాగుంది. పల్చగా నల్లగా ఉన్న సిల్కు పాంటు బాగా జరిగిపోయింది కిందికి.సాల్స్ బర్గ్ దగ్గర పడ్తున్నకొద్దీ జీవన్ మనసు అదో విధంగా అయిపోవడం మొదలెట్టింది. ఎన్నో ఏళ్ళ నించి నేను విన్న చదివిన మొజార్ట్ పుట్టిన ప్రదేశానికి వెళ్ళబోతున్నాడిప్పుడు. అన్న ఫీలింగ్ తో జ్వరమొచ్చినట్టు అదోలాగయిపోతూ ఎప్పుడొస్తుందా ఆ వూరు అని చూస్తున్నాడు.

చూస్తున్న కొద్దీ ఆలస్యమవుతుంది.

ఎంతకీ రావడం లేదు.

అలా చూసిన జీవన్ కి మాగన్నుగా నిదర పట్టింది.

స్లో అవుతున్న రైలు పెద్ద కాలవ దాటుతుంటే కొండ మీద పెద్ద కేజిల్ కనిపించే సరికి ఒళ్ళు ఝళ్ళుమంది. అలా చూస్తుండిపోయాడు. వీడియో కెమెరా ఆన్ చేసేడు యోగి.

సాల్స్ బర్గ్ స్టేషన్లో దిగడంతోనే ఒక పావురం వచ్చి అక్కడ వాలింది. అదే ద్యాసలో ఉన్న జీవన్ కి అది మొజార్జ్ట్ ఆత్మేమో అన్న భావన కలిగింది. చాలా పల్చగా జనం ఉన్న స్టేషన్లో నడుస్తుంటే అక్కడా కనిపించిన పావురాల్ని రెప్పార్వకండా చుస్తుండిపోయిన జీవన్ జన్మలో ఎప్పుడు రైల్వే స్టేషన్లో పావురాల్ని చూడ్డం జరగలేదు.

స్టేషన్ బయటికొచ్చాకా జార్జి ప్రసాదు అడగమంటే మొజార్ట్ మ్యూజియం ఎక్కడని చాలా మందిని అడిగేడు గోవిందు. ప్రతివాళ్ళు షోల్డర్ ఎగరేసి తెలీదని చెప్పడం తప్ప ఇంకేం అన్లేదు. జీవన్ దగ్గరికొచ్చి “ఇదేంటి సార్, మీరేమో ఇది మొజార్ట్ ప్లేసన్నారు. అడుతుతుంటే ఒక్కడూ మాటాడ్డేంటి..?” అన్నాడు గోవిందు.

“మన ఇంగ్లీషు ఏక్సెంట్ వాళ్ళకి అర్థం గావటం లేదని నా డౌటు. పైగా వీళ్ళు కూడా మనలా టూరిస్టులు” అన్నాడు యోగి. చివరికి ఒక బ్రిటీషనర్ కి కొంచెం అర్థమైంది గోవిందు బాధ. దగ్గర్లో ఆగి ఉన్న ట్రామ్ కేసి చూపించి దాని డ్రైవర్ని అడగమనే సరికి అటు పరిగెత్తేడు.గోవిందు అన్న దాంట్లో ఒక మొజార్ట్ అన్న ముక్కం మట్టుని అర్థం చేసుకున్న డ్రైవరు జర్ననీ లో అడిగేడు. అతని హావభావాల్ని బట్టి ఎంత మంది అన్నట్టు అర్థమైంది. “ఫైవ్... ఫైవ్...” అని అయిదేళ్ళు చూపించాడు యోగి. డబ్బులు తీసుకుని టిక్కెట్టిచ్చేడు డ్రైవరు. వాళ్ళు సీట్లలో కూర్చున్న కాస్సేపటికి కదిలింది ట్రామ్ బండి. చాలా బాగుంది ట్రామ్ లో ప్రయాణం.

ముఖ్యంగా లోపల శుభ్రం. ఆ సీట్లు కుట్టిన విధానం అబ్బో.... అద్భుతం.

రకరకాల ప్రదేశాల్ని దాటుకుంటూ ముందుకెళ్తుంది ట్రామ్.

బ్రిస్టల్ హోటల్ అన్న బిల్డింగ్ దాటాకా మోడ్రన్ కట్టడాలు పోయి పాతకాలం నాటి భవనాలూ చిన్న చిన్న కోటల్లాంటివీ, చర్చిలూ ఎదురవుతాయి ఆ సిటీలో. అది ఓల్డ్ టౌనట.

ఒక చోట ఆగింది ట్రామ్ బండి.

చాలా మంది దిగుతున్నారు. వాళ్ళతో పాటూ వీళ్ళూ దిగారు.

వీళ్ళతో పాటు దిగిన గుంపు కూడా మొజార్ట్ ప్లేసెస్ చూడ్డానికే అని అర్థం గావటంతో ఆ గుంపు వెనకే నడుచుకుంటూ వాళ్ళెటు వెళ్తే వీళ్ళూ అటు వెళ్ళారు. ఆల్మోస్టు వాళ్ళని ఫాలో అయ్యేరు.

రెండు మూడు మలుపులు తిరిగాక ఆ వీధిలోకి మలుపు తిరిగి అలాగుండిపోయేడు జీవన్.

ఆ వీధి వెడల్పు కేవలం ముప్పై అడుగులు కూడా ఉండదు. ఎడా పెడా ఆకాశాన్నంటే భవనాలు, షాపులు మ్యూజిక్ ఇనుస్ట్రుమెంట్స్ అమ్మే షాపులూ, పెద్ద పెద్ద క్లాత్ షోరూమ్స్, స్వరోస్కీ షోరూమ్స్ అన్నీ పెద్ద పెద్దవి. రకరకాల దేశాల్నించి వచ్చిన టూరిస్టులతో కళకళ్ళాడి పోతుందా సందు. ఆ సందుకి ఎదురుగా ఎత్తైన కొండ. ఆ కొండ మీద రైల్లో వచ్చేప్పుడు వీళ్ళు చూసిన పెద్ద కేజిల్.

కొంచెం ముందుకెళ్ళాకా ఆ సందుకి ఎడం పక్కన పసుపు రంగు వేసుకున్న నాలుగు ఫోర్ల భవనం. అందులో మూడో ఫోర్లో పుట్టాడట మొజార్ట్. బిల్డింగ్ బయట రాసుంది మొజార్ట్ బర్త్ ప్లేస్ అని.

ఒకో టిక్కెట్టూ అయిదున్నర యూరోలు.

టిక్కెట్లు ఇచ్చే అయ్యాయి యోగి చేతిలో హేండీ కేమ్ చూసి “లోపల ఫోటోలు తియ్యకూడదు” అంది ఇంగ్లీషులో.

“తీస్తే..?” అన్నాడు.

జవాబుగా ఏదో అందిగానీ వీళ్ళకి అర్థం కాలేదు.  వెళ్తున్న ఒక మనిషి కి రెండో వాడు ఎదురైతే క్రాసయి వెళ్ళలేనంత ఇరుకైన దారమ్మట నడుచుకుంటూ ఆ భవనం మూడో అంతస్తులోకి వెళ్తున్న జీవన్ కి ఒక రకమైన ఆనందం. అతని విషాద చరిత్ర చదివి ఉన్న జీవన్ లో ఒక రకమైన వేదన. చనిపోబోయే రోజుల్లో అతను రాసిన సింఫనీ, కోటీశ్వరుల ఇళ్ళల్లో విందులూ వినోదాలూ జరిగేప్పుడు వాయించమని ఎరేంజ్ చేయించుకునే రిచ్చెస్ట్ సింఫనీ అట.

మూడో ఫోర్ లోకి వెళ్ళాకా మొదటి గదిలో చూసింది మొజార్ట్ వాడిన చెంబులూ, బిందెలు, గ్లాసులూ, తపేళాలూ వగైరా సామాగ్రి. తర్వాత ఒక టాంగా, ట్రంకు పెట్టి, వెదురు బద్దలతో చేసిన బుట్ట.., ఇంకొంచెం ముందు కెళ్ళారు. ఒక పియానో... బహుషా మొజార్ట్ తండ్రి అయిన లియో పోర్డ్ మొజార్ట్ కూడా మ్యూజీషియన్ గాబట్టి ఆయనదై ఉంటుంది. దయచేసి దాన్ని ముట్టుకోవద్దు అని జర్మనీలోనూ ఇంగ్లీషులోనూ రాసుంది. నెమ్మదిగా నడుచుకుంటూ ఇంకొంచెం ముందుకెళ్ళారు. అద్దాల్లో పెట్టి ఉన్న చిన్న వయోలిన్ అది. ఆ వయోలిన్ తో మొజార్ట్ అయిదో ఏట ప్రోగ్రాం ఇచ్చాడట. దాని పక్కనే అతను వాడిన వయోలా (వయోలిన్ ఫేమిలీ), ఇంకొంచెం ముందుకెళ్ళాం... మొజార్ట్ వాడిన వయోలిన్. చాలా చిన్న వయసులో చనిపోయిన అతను మరణించే దాకా వాడిన ఇనుస్ట్రుమెంట్ ఇదే.

అక్కడ్నించి ఇంకో గదిలోకెళ్ళారు. చిన్న గది అది. అందులో ఆనాటి మంచం పరుపూ దిళ్ళు వేసి ఉన్నాయి. 1756 జనవరి 27 వ తేదీన పుట్టాడట మొజార్ట్. ఒక్కసారి కళ్ళు మూసుకుని జీవన్ కిష్టమైన మొజార్ట్ ని తల్చుకున్నాడు. అతని విషాదాంతాన్ని చదివిన జీవన్లో ఒక రకమైన వేదన, అదో రకంగా అయిపోయాడు. చెప్పు కోడానికి జీవన్ పక్కన మొజార్ట్ గురించి తెల్సిన మనిషెవరూ లేడు. ఒకానొక వేదనతో చాలా బరువుగా తయారైంది మనసు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
naa preyasini pattiste koti