Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
yatra

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

 

జరిగినకథ: విరాట్ ఆదేశాల మేరకు ధర్మ అతని గ్యాంగ్ ఏ ఎస్ పి ప్రకాశ్ కి మర్యాద నేర్పిస్తారు. హాస్పిటల్లో ఉన్న ప్రకాష్ తనకు వచ్చిన ఫోన్ కాల్ తో ఉడికిపోతాడు... రాఖీ పౌర్ణమి నాడు సహస్ర , దీక్షలు ఇద్దరు వచ్చి విరాట్ ,చందూలకు రాఖీలు కడతారు.                                       ఆ తరువాత ...................

ఈ లోపల చందూ కల్పించుకుంటూ

‘‘ఏరా సహస్ర ఇప్పుడు నా చెల్లెలని మర్చి పోయావా? ఈ వరసన మన ఫ్రండ్‌షిప్‌  కాస్తా బంధుత్వంగా మారిపోయి నువ్వు నా భావ అయిపోయావ్‌. ఇక నువ్వేమన్నా వూరుకోను. నువ్వేమీ అన కూడదు. అంతే’’ అన్నాడు నవ్వుతూ.

‘‘నువ్వాగన్నయ్య’’ అంది కోపంగా సహస్ర.

‘‘ఏయ్‌ విరాట్‌ ఏదీ నా ముఖం చూసి చెప్పు. చిక్కుల్లో పడిరది నువ్వా నేనా?  పేపరు ప్రకటనిచ్చి చిక్కుల్లో పడేసింది నువ్వే కదా? అందుకు బాధ్యత వహించి నన్నూ కాపాడాలా వద్దా?’’ అంటూ నిలదీస్తుంటే విరాట్‌  నవ్వేసాడు.

‘‘ఒకె ఒకె తమాషాకన్నాను గాని పాయసం చల్లారి పోతుంది. త్వరగా యివ్వు’’ అన్నాడు.

ఉత్సాహంగా కబుర్లు చెప్పుకొంటూ

నలుగురూ పాయసం తాగారు

సహస్ర దీక్షలు ఇక బయలు దేరుతుండగా ఒక్క నిముషం అంటూ ఆపాడు విరాట్‌.

‘‘చందూ... రాత్రి మనం తెచ్చిన కేరీ బ్యాగ్‌ తీసుకురా’’ అన్నాడు. చందూ బేగ్‌ తెచ్చి సహస్ర కిచ్చాడు. ఆ బేగ్‌ లో ముస్లిం యువతులు తల నుంచి పాదాల వరకు ధరించే నల్ల బురఖాలు రెండు జతలున్నాయి. విరాట్‌ లేచి ముందుకొచ్చాడు.

‘‘ఇవెందుకు?’’ అంది సహస్ర.

‘‘ఎందుకా! చందూ ఒకటి నేనొకటి వేసుకొని తిరుగుదామని. ముఖం చూడు, ఇవి మీ కోసం. నీ సేఫ్‌ కోసం. నువ్విలా ముఖానికి చున్నీచుట్టుకుంటే చాలదు. శతృవుల కంట బడితే ఈజీగా గుర్తు పడతారు. ఇక నుంచి ప్రతిక్షణం జాగ్రత్తగా వుండాలి మనం. ఈ క్షణం నుంచే బురఖా లోకి మారి పోతున్నామ్‌’’ అన్నాడు విరాట్‌.

‘‘లేదు లేదు’’. అనరిచింది వెంటనే సహస్ర

‘‘నాకిలాగే బాగుంది. బురఖా వేసుకుంటే వూపిరాడనట్టుంటుంది. ప్లీజ్‌ విరాట్‌.’’

‘‘నథింగ్‌ డూయింగ్‌. దీక్ష నువ్వు కూడ బురఖా ధరించాలి. మీ యిద్దరూ క్లోజ్‌ ఫ్రండ్స్‌. నిన్ను గుర్తు పట్టినా వాళ్ళు నీ పక్కనుంది సహస్రని
గుర్తించే ప్రమాదం ఉంది’’ హెచ్చరించాడు.

‘‘వద్దంటున్నాగా నాకిష్టం లేదంతే’’ మొండిగా అరిచింది సహస్ర.

‘‘వేసుకుంటున్నావ్‌. తప్పదు’’

‘‘ఒకె దార్లో తీసేస్తాను’’

‘‘దీక్ష వెంటనే నాకు ఫోన్‌ చేస్తుంది.’’

‘‘ఓ మై గాడ్‌! ఈ బలవంతం ఏమిట్రా దేవుడా? పొరపాటున ముస్లిం లేడీస్‌ ఎవరన్నా మమ్మల్ని పలకరిస్తే ఉర్దూ గాని హిందీ గాని ఒక్క ముక్క మాకు రాదు.’’

‘‘అదెంత పని? నాలుగు ముక్కల్లో మీకు ఉర్ధూ హిందీ అంతా నేర్పేస్తాను.’’

‘‘నాలుగు ముక్కల్లో...ఎలా బాబూ?’’ అంది పరిహాసంగా సహస్ర.

‘‘వేరీ సింపుల్‌ డియర్‌. ఎవరన్నా ముస్లిం మిమ్మల్ని పలకించారనుకో. వెంటనే ఆదాబ్‌, లేదా ఆదా బర్సే అను. అంటే మనం నమస్తే చెప్పినట్టన్న మాట. రెండోది మాట్లాడి వచ్చేటప్పుడు ఖుదా ఆఫీస్‌ అను చాలు. అంటే ఇక సెలవు అనర్ధం. ఇక మధ్యలో క్యాహై? నహి నహీ, జీహా, మాలూమ్‌ నై ఈ నాలుగు మాటలు సందర్భాన్ని బట్టి ప్రయోగించండి అంటే ‘ ఏమిటి?........లేదు లేదు......... అవును....... తెలీదు’ అని ఆ మాటల అర్ధం మిగిలిందంతా తెలుగులో చెప్పండి ఫినిష్‌. మీకు అద్భుతంగా హిందీ వచ్చేసినట్టే’’ అంటూ బోధించాడు విరాట్‌.అంతా విని ఆముదం తాగినట్టు ముఖం పెట్టింది సహస్ర

‘‘ఏడ్చినట్టుంది. నీ నాలుగు ముక్కల హిందీ. బీచ్‌ మే ఓలోగ్‌ క్యా పూచేగా యే? హమ్‌ కో కైసే మాలూమ్‌ పడేగా?’’ అంది.అంతేతెరిచిన నోరు మూయటం మర్చిపోయి ఆశ్చర్యంతో కళ్ళప్పగించి చూస్తూ బాప్‌రే అంటే సోఫాలో కూలబడ్డాడు విరాట్‌.

ఇక ఆపుకో లేక

దీక్ష చందూలు పడి పడి నవ్వారు. వాళ్ళతో శృతి కలిపింది సహస్ర.

‘‘ఒరే విరాట్‌ తనకు హిందీ రాదంటే నమ్మేసావా? తనేమీ తక్కువ కాదురా బాబూ. తెలుగు, తమిళం ఇంగ్లీషు, హిందీ, జర్మన్‌ అయిదు భాషల్లో మాస్టర్‌  సహస్ర. నీలాగే. అఫ్‌ కోర్స్‌ నీకు అదనంగా స్పానిష్‌  బాష వచ్చనుకో’’ అన్నాడు నవ్వాపు కొంటూ చందూ.

‘‘ఆశ్యర్య పోయింది చాలు లే’’ అంటూ చేయి అందించి విరాట్‌ని లేపింది సహస్ర.

‘‘ఎదుట వాళ్ళని ఫూల్‌ని చేయటం నీకే కాదు మాకు వచ్చు. వద్దు మొర్రో అంటున్నా బురఖా వేసుకోమని విసిగిస్తావా? సరి. నీ మాట కాదనలేక వేసుకుంటాను. కాని ఎక్కడ చిరాకేస్తే అక్కడ తీసేస్తాను’’ అంది బురఖా అందుకుంటూ.

‘‘తీయ కూడదు’’ సీరియస్‌ గా హెచ్చరించాడు విరాట్‌.

‘‘ఇంటి దగ్గర వేసుకున్న బురఖా తిరిగి ఇంటికొచ్చే వరకు తీయ కూడదు. ఎందుకు చెప్తున్నానో అర్ధం చేసుకో’’ అన్నాడు.‘‘ఒకె ఒకె’’ అంది సహస్ర.

సహస్రతో బాటు దీక్ష కూడ బురఖాల్లోకి మారి పోయారు, కళ్ళుమాత్రం కనబడేలా వున్న ముఖం మీది క్లాత్‌ను దించగానే ఇక వాళ్ళనిఎవరూ గుర్తించ లేరనిపించింది. ఒక జత ఇంకా కేరీ బాగ్‌లో ఉంది. సాయంత్రం వాటిని పట్టుకెళ్తామంటూ వాటిని అక్కడే వదిలేసి ఇద్దరూ స్కూటీ మీద బయలు దేరి వెళ్ళి పోయారు.

‘‘ఏరా ...మనం ఆఫీస్‌ కు వెళ్తున్నాంగా?’’ సందేహ నివృత్తి కోసం అడిగాడు చందూ.

‘‘వెళ్తున్నాం. కాని మధ్యాహ్నం నేను లీవు పెట్టి పని మీద బయటి కెళ్తాను. ఆఫీసు వదిలే టైముకొచ్చి నిన్ను పికప్‌ చేసుకుంటాలే అన్నాడు విరాట్‌.

‘‘ఏం పనిరా? వేరే ఏ పనుందని?’’ అర్ధం గాక అడిగాడు చందూ.

‘‘ఎందుకు లేదు? అసలు పని ఇప్పుడే మొదలవుతోంది. నా అనుమానం కరక్టయితే నా గురించో సహస్ర గురించో రాత్రికే చాలా మంది చెన్నై చేరుకునుండాలి. వీళ్ళు ఎవరికీ అనుమానం రాకుండా సాదా హోటళ్ళలో బస చేస్తారు. వాళ్ళ కదలిక లేమన్నా తెలుస్తాయేమో ఓ రౌండు చుట్టి వస్తాను. నువ్వు త్వరగా టిఫిన్‌ సంగతి చూడు.  టైం కి బయలు దేరాలి. ఈ లోపల నేను ఓ సారి ధర్మాకి ఫోన్‌ చేసి మాట్లాడతాను’’ అంటూ ఫోన్‌  అందుకున్నాడు విరాట్‌.

ఏదో అడగాలనుకొని కూడ విరమించుకొని కిచెన్‌లోకి వెళ్ళి పోయాడు చందూ ఫోన్‌  చేయగానే లైన్ లో కొచ్చాడు ధర్మా.

‘‘ఏరా ఎక్కడున్నావ్‌?’’ అడిగాడు విరాట్‌.

‘‘ఇప్పుడే బయటకి బయలు దేరుతున్నాను. నువ్వు ఫోన్‌ చేశావ్‌. చెప్పరా. ఏమంటాడు మీ ఎ యస్‌ పి?’’ నవ్వాడు ధర్మ.

‘‘వాడి సంగతి కాసేపు పక్కన పెట్టరా. మేటర్‌  సీరియస్‌. చెప్పేది జాగ్రత్తగా విను. మధురై త్యాగరాజన్‌ మనుషులు మన సర్కిల్ లో ఎవరికన్నా తెలుసా?’’

విరాట్‌  ప్రశ్న వినగానే  అవతల ధర్మ షాకై ఉండాలి  పదిహేను సెకన్ల తర్వాత గాని  తిరిగి అతడి గొంతు విన్పించ లేదు.‘‘ఏమిట్రా! ఎ యస్‌ పి లాంటి సొర చేప గురించి అడిగావంటే ఏదో అనుకున్నాను. ఇప్పుడు ఏకంగా త్యాగరాజన్‌ లాంటి తిమింగలం గురించే అడుగుతున్నావ్‌. ఏమైందసలు?’’ ఆందోళన నిండిన స్వరంతో అడిగాడు ధర్మ.

‘‘అదంతా ఫోన్‌లో చెప్పటం మంచిది కాదురా....’’

‘‘ఎందుక్కాదు? నీ సెల్‌ నంబర్‌ మీద నిఘా వుందని అనుమానమా?’’

‘‘అదేం లేదు. అప్పుడే ఆ నంబర్‌ మీద నిఘా ఉంటుందని అనుకోను....’’

‘‘అయితే చెప్పటానికేమైంది? ఏం జరిగింది? నువ్వు చెన్నైలోనే ఉంటున్నావా?’’

‘‘ఆ డౌటు అక్కర్లేదు. ఇప్పట్లో బయటికొచ్చే ఉద్దేశం లేదు.’’

విరాట్‌ మాటలకు ధర్మ మరింత ఆశ్చర్య పోతూ ‘‘నిజం చెప్పు విరాట్‌? నువ్వు రిస్కులో ఉన్నావా?’’ అనడిగాడు.

‘‘కంగారు పడకు. క్లుప్తంగా చెప్తాను. నిన్న పేపర్లో సహస్రనే అమ్మాయిని పట్టిస్తే కోటి అనే ప్రకటన ఫోటోతో సహా వచ్చింది. చూసావా?’’ గుర్తు జేసాడు విరాట్‌.

‘‘చూసాను. ఆ అమ్మాయి ఎవరో కాదు. ఇక్కడ మహా దేవ నాయకర్‌ కూతురు సహస్ర. తండ్రి చూసిన సంబంధం ఇష్టం లేక ఎక్కడికో వెళ్ళి పోయిందునుకున్నారు. ఈ ప్రకటనతో ఆమె చెన్నైలోఉందని ఎవరినో ప్రేమించిందని జనం అనుకుంటున్నారు.’’

‘‘ఆ ప్రేమించింది ఎవరినో కాదు నన్నే. ఆ ప్రకటన ఇచ్చిందీ నేనే’’ అంటూ రైల్లో సహస్రను చూసిం తర్వాత జరిగిందంతా సింపుల్‌గా వివరించాడు విరాట్‌.

‘‘సహస్ర రచయిత్రి మాత్రమే కాదు. ప్రముఖ జర్నలిస్టు లహరి కూడ తనే. ఇది చాలనుకుంటాను. జగన్మోహన్‌ సహస్రకి గొడవకి కారణం గ్రహించటానికి’’ అన్నాడు.

‘‘అర్ధమైందిరా బాబూ. చాలు. ఏరా, ఇన్ని రిస్కుల్లో వున్న ఆమెను లవ్‌ చేయటం అవసరమంటావా?’’ అనడిగాడు అంతా విన్న ధర్మా.‘‘ప్రేమించాకే రిస్కుల గురించి తెలిసింది. వదిలేయ మంటావా? నేనిచ్చిన ప్రకటన వల్లే తను చెన్నైలో వున్నట్టు అందరికీ తెలసిపోయింది కాబట్టి తనను రక్షించుకోవాల్సిన బాధ్యత కూడ నా మీదే ఉంది. ఇంతకీ నేనడిగింది నీ వల్ల అవుతుందా లేదా?’’‘‘నా గురించి మనవాళ్ళ గురించి తెలిసి కూడ అలా తొందర పడతావేంటిరా? త్యాగరాజన్‌ మనుషుల్లోచాలా మంది మనకి తెలిసిన వాళ్ళేరా. వాళ్ళందరికీ కేరాఫ్‌ అడ్రస్‌ టేకు తోటలోవున్నజగన్‌ మోహన్‌ గెస్ట్‌ హౌస్‌. త్యాగరాజన్‌ కి ఎట్టయప్పని ఒక రైట్‌ హ్యాండ్‌ వున్నాడు. వాడి చేతి కింద పని చేస్తారంతా.’’

‘‘ఒకె. ఎట్టయప్ప మనుషులంతా మధురైలోనే వున్నారా లేక కొందరయినా మధురై వదిలి వెళ్ళారా? ఎప్పుడు వెళ్ళారు, వాళ్ళ వివరాలు కావాలి.’’

‘‘అంటే లహరిని అంతం చేయటం కోసం ఒక బేచ్‌  చెన్నైకి బయలు దేరి వుంటుందని నీ అనుమానం. అంతేగా?’’

‘‘యస్‌...అదొక్కటే కాదు. లహరిని పట్టి ఇంటికి తీసుకు రావటానికి మహ దేవనాయకర్‌ కూడ మనుషుల్నిపంపించి ఉంటాడని నా అనుమానం. ఆ వివరాలు కూడ తెలుసు కోవాలి.’’

‘‘ఒకె ఇక నాకు వదిలేయ్‌. మధ్యాహ్నం లోపే నీకు అన్ని వివరాలతో ఫోన్‌ చేస్తాను. ఇక విషయం చెప్పు. మీరు ఒంటరిగా ఉన్నారా అక్కడ? ఎందుకైనా మంచిది. నన్ను బేచ్‌తో చెన్నైలో దిగి పోమ్మంటావా?’’

‘‘వద్దు వద్దు, అవసరమనుకుంటే అప్పుడు చెప్తా’’

‘‘పోనీ చెన్నైలో ఎక్కడున్నారు? అదన్నా చెప్తావా?’’

‘‘ఏర్‌ పోర్ట్‌  సమీపంలో ఉత్తరంగా గోస్వామి కాలనీ అని చిన్న కాలనీ ఒకటుంది. అక్కడ మొదటి వీధి మూడో ఇంట్లో నేను మూడో వీధి చివరి యింట్లో సహస్ర ఉంటున్నాం. బట్‌ తొందర పడి మీరు రావద్దు.’’

‘‘ఒకె మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. నేను మధ్యాన్నం లోపే ఫోన్‌ చేస్తాను’’. అంటూ లైన్‌ కట్‌ చేసాడు ధర్మ.

మరో గంటలో విరాట్‌  చందూలు తమ బైక్‌ మీద ఆఫీసుకు బయలు దేరారు.

I              I                     I

అది తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయం

ఉదయం పది గంటలకు కార్యాలయానికొచ్చిన సి యం శెల్వి చెందామరై రెండు గంటల పాటు ముఖ్యమైన ఫైళ్ళు చూస్తూ, ఛీఫ్‌ సెక్రటరీ ఇతర సిబ్బందితో ముఖ్యమైన విషయాలు చర్చిస్తూ బిజీగా గడిపారు. సుమారు పన్నెండున్నర సమయంలో ఇంటికి బయలుదేరుతూ ఏదో గుర్తుకొచ్చి ఆగిందామె. అటెండర్‌ను పిలిచి కొన్ని రోజుల క్రితం న్యూస్‌ పేపర్స్‌ తెప్పించుకుని అందులో ప్రకటనని ఆసక్తిగా మరోసారి చదివిందామె.

నా ప్రియురాల్ని పట్టిస్తే కోటి అంటూ సహస్ర పోటోతో సహ వచ్చిన ప్రకటన. కొన్ని రోజుల క్రితమే ఆ ప్రకటన కన్నా అందులోని యువతి ఫోటో సి యం ని విశేషంగా ఆకర్షించింది. ఎందుకంటే ఫోటో లోని సహస్రను ఎక్కడో చూసిన గుర్తు. కాని ఎంత ఆలోచించినా ఎక్కడో గుర్తు రావటం లేదు. తర్వాత చూద్దామని పక్కన ఉంచి ఆ సంగతి మర్చి పోయింది. పనుల ఒత్తిడిలో ఆ విషయం గుర్తు రాలేదు. ఇప్పుడు సడెన్‌ గా గుర్తొచ్చి తిరిగి పేపరు మీద దృష్టి సారించిందామె.

ఎవరీ సహస్ర?

ఈమె సాధారణ యువతి కాదు

తను ఈ అమ్మాయిని చూసింది

ఎక్కడ? ఎప్పుడు?

సెక్రటరీని ఇతర సిబ్బందిని పిలిచి ఫోటో చూపించి అడిగినా ఎవరూ ఏమీ చెప్ప లేక పోయారు. అంతలో తమ అధికార పార్టీ ప్రచార సారధిగా వ్యవహరిస్తున్న దేవయాని అనే ఆమె ముఖ్యమంత్రిని కలవటం కోసం వచ్చింది. దేవయానికి జ్ఞాపక శక్తి ఎక్కువ. ప్రకటనలోని సహస్రను చూడగానే ఆమె నవ్వుతూ.

‘‘ఏంటి మేడమ్‌ ఈ అమ్మాయి ఎవరో గుర్తుకు రాలేదా?’’ అంది ఎదురుగా కూచుంటూ.

‘‘లేదు ఎవరీ అమ్మాయి? నీకు తెలుసా?’’

‘‘తెలుసు. నిజానికి ఈ విషయం తెలుసుకుందామనే నేను మీ వద్ద కొచ్చాను. ఈ సహస్రను పట్టుకోమని హోం మినిస్టర్‌ గాని మీరు గాని చెన్నై పోలీసులకు ఆర్డర్స్‌ ఏమన్నా ఇష్యూ చేసారా?’’

‘‘నోనో...అసలీ అమ్మాయి ఎవరో గుర్తు రాక నేను బుర్ర చించుకొంటుంటే మధ్యలో ఈ ఆర్డర్సేమిటి. అరెస్ట్‌ లేమిటి నాన్సెన్స్‌. ఏమైంది దేవయాని...నాకు తెలీకుండా ఏం జరుగుతోందిక్కడ?’’

‘‘అది మీకే తెలియాలి. ఈ అమ్మాయి ఎక్కడ కన్పించినా వెంటనే అరెస్ట్‌ చేసి సమీప పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించమని చెన్నై సిటి పోలీస్‌ కమీషనర్‌ ఆర్డర్స్‌ ఇష్యూ చేసారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఫోటో దగ్గరుంచుకొని గాలిస్తున్నారు పోలీసులు.’’

‘‘ఒకె ఒకె....... కారణం అడిగి తెలుసు కుందాం. ఇంతకీ ఈ సహస్ర ఎవరు? నీకయినా తెలుసా?’’ ఆసక్తిగా అడిగారు సియం’’‘‘మధురై మహ దేవ నాయకర్‌ గుర్తున్నారా?’’ అడిగింది దేవయాని.

‘‘యస్‌...యస్‌...ఆయన గుర్తు లేక పోవటం ఏమిటి? ప్రతిపక్ష పార్టీకి కంచు కోట లాంటి మధురై ప్రాంతంలో త్యాగరాజన్‌ ఉండగా మనం ఒక్క సీటు సాధించ లేమనుకున్నాంకానిమహదేవనాయకర్‌ కృషితోమనపార్టీబలోపేతమైఅక్కడఅధికసీట్లుసాధించుకోగలిగింది.’’

‘‘అవును గదా. అప్పట్లో పార్టీ టికెటిస్తాంఎం పి గానో ఎమ్మెల్యే గానో పోటీ చేయమని మనం కోరినా మహ దేవ నాయకర్‌ ఒప్పుకోలేదు. నాక పదవులక్కర్లేదు మీరు అధికారంలోకి వచ్చి తమిళ ప్రజలకు సుస్థిరమైన మంచి పరిపాలన అందించండి అది చాలు అంటూ సున్నితంగా మన అభ్యర్ధనను తిరస్కరించిన పెద్ద మనసు ఆయనది. మన పార్టీకి వీరాభిమాని. అటువంటి మహా దేవ నాయకర్‌ ఏకైక కుమార్తె ఈ సహస్ర. పూర్తి పేరు లక్ష్మీ సహస్ర.’’

‘‘ఓ మైగాడ్‌..............అంటే...........’’

‘‘యస్‌ మీ డౌటు కరక్టే మేడం. రచయిత్రి సహస్రగా ఈమె అందరికీ తెలుసు. కాని ప్రముఖ జర్నలిస్టు లహరి తనే అని తెలీదు.’’

‘‘డామిట్‌’’ అంటూ నుదురు రుద్దుకుంది సి యం చెందామరై.

‘‘నా డౌటు వేస్ట్‌ కాలేదు. వెరీ ఫెమిలియర్‌ ఫేస్‌. అందమైన ఈ ముఖాన్నిఎక్కడో చూసిన గుర్తు. కాని నువ్వు చెప్పే వరకు గుర్తు రాలేదు. ఆ జగన్మోహన్‌ భూ కుంభకోణాల్ని పునాదులతో సహ తవ్వి పేపర్లకెక్కించి సెంట్రల్‌ గవర్నమెంటుకే దడ పుట్టించిన డాషింగ్‌ లేడీ. జర్నలిస్టు లహరి....’’

‘‘కరెక్ట్‌గా వూహించారు మేడమ్‌. ఆమెను మీరు స్వయంగా కలిసారు కూడ. గుర్తుందా? గత ఎన్నికల్లో మనం మధురైకు ప్రచార నిమిత్తం వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా మిమ్మల్ని కలిసి మీ ఇంటర్యూ తీసుకుంది. కీలకమైన ఎన్నో ప్రశ్నలకు ఓపిగ్గా మీరు బదులిచ్చారు. లహరిని అభినందించారు. ఆ ఇంటర్యూ విశేషాలు అన్ని పత్రికల్లోను వచ్చాయి. మీ మనో భావాల్ని సూటిగా ప్రజల మధ్యకు తీసుకు పోడానికి ఆ ఇంటర్వు ఎంతో దోహద పడిరది. మన పార్టీ ఘన విజయానికి ఆ ఇంటర్యు కూడ ఒక కారణం.’’

‘‘అవును దేవయాని ఆ విషయం నాకు బాగానే గుర్తుంది. ఇంతకీ ఈ అమ్మాయికి పెళ్ళయిందా? చెన్నైలో ఎందుకుంటోంది? పేపరు ప్రకటనిచ్చిన ఈ ప్రియుడు ఎవరు? మహ దేవ నాయకర్‌ కి ఈ విషయం తెలుసా? ఒక వేళ ఆ రోజు మధురైలో కోర్టు బయట తన మీద జరిగిన హత్యా ప్రయత్నానికి భయపడి చెన్నైలో అజ్ఞాతంగా ఉంటోందా...నీ దగ్గర వేరే ఇన్ ఫర్మేషనేమన్నా వుందా.?’’‘‘మేడం ఇక్కడికొచ్చే  ముందే మధురై లోని మన పార్టీ కార్యాలయానికి ఫోన్‌ చేసి మాట్లాడాను. తన కూతురే జర్నలిస్టు లహరి యని మహా దేవ నాయకర్‌ కు తెలీదు. తను చూసిన సంబంధం నచ్చక తన కూతురు ఇల్లొదిలి వెళ్ళిపోయిందనుకుంటున్నారు. చెన్నై రాక ముందు ఆమెకు లవ్‌ ఎఫైర్స్‌ ఏమీ లేవు. ఇక్కడే ఈ ప్రకటనిచ్చినవాడ్ని లవ్‌ చేసుండాలి’’ అంటూ తనక తెలిసిన సమాచారం అంతా వివరించింది దేవయాని.ఒక్క క్షణం ఆలోచించింది సి యం సెల్వి చెందామరై...

‘‘ఒకె ప్రకటనలో ఇచ్చిన ఈ నంబర్‌ కి ఫోన్‌ చేసి ఆ కుర్రాడ్ని అడిగితే ఏం జరిగిందో చెప్తాడుగా! ఫోన్‌ చెయ్యి నేను మాట్లాడుతాను’’ అంది.‘‘ముందు కమీషనర్‌ కి ఫోన్‌ చేసి సహస్ర మీద అరెస్ట్‌ వారంట్‌ ఇష్యూ చేయటానికి కారణం ఏమిటో తెలుసుకుంటే మంచిదేమో.’’‘‘డోన్ట్‌వర్రీ. కమీషనర్‌ ని ఇక్కడికే పిలిపిద్దాం’’ అంటూ సెక్రటరీని పిలిచి కమీషనర్‌ గార్నివెంటనే రమ్మని ఫోన్‌ చేయమని చెప్పింది. ఈ లోపల దేవయాని పేపరు ప్రకటన లోని నంబర్‌ కి ఫోన్‌ చేసింది.

ఆఫీస్‌ లో కంప్యూటర్‌ ముందు బిజీగా ఉండగా విరాట్‌ సెల్‌  మోగింది. చూస్తే కొత్త నంబరు అది. తన పర్సనల్‌ నంబర్‌కి ఎవరో ఫోన్‌ చేసారు. తీయాలా వద్దాని పది క్షణాలు సందేహించి చివరకు ఆన్‌ చేసాడు.

‘‘హలో..... ఎవరు? ఎవరు కావాలి?’’ అడిగాడు.

‘‘బాబూ నీ పేరేమిటో తెలీదు. నా పేరు దేవయాని. అధికార పార్టీ ప్రచార కార్య దర్శిని. సహస్ర కోసం పేపర్లో ప్రకట నిచ్చింది నువ్వే కదూ?’’ అంటూ శాంత గంభీర స్వరంతో లేడీ వాయిస్‌ అటు నుంచి విన్పించింది.

విరాట్‌ కి చెప్ప రాని షాక్‌

అధికార పార్టీ తాలూకు అనగానే అప్రమత్తమయ్యాడు. ఈమె ఇంట్రస్టేమిటి? ఎందుకు ఫోన్‌ చేసిందీ? అర్ధం కాలేదు.

‘‘చెప్పండి మేడం. ప్రకటనిచ్చింది నేనే’’ అన్నాడు పొడిగా.

‘‘సి యం గారు నీతో మాట్లాడాలంటున్నారు. మాట్లాడతారా?’’

సి యం అనగానే

మరో సారి ఉలికి పాటు చెందాడు విరాట్‌

ఏమిటది? స్టేట్‌ చీఫ్‌ మినిస్టర్‌ సెల్విచెందామరై కి ఈ విషయంలోఇంట్రస్టేమిటి? ఏం మాట్లాడాలనుకుంటోందావిడ. ఇదో కొత్త సమస్య కాదు గదా? పరి పరి విధిలా ఆలోచిస్తూనే

‘‘ఇవ్వండి మేడం’’... మాట్లాడతాను అన్నాడు.

అయిదు సెకన్ల తర్వాత ‘హలో’ అంటూ అటు నుంచి సి యం మృధు మధురమైన గొంతు విన్పించింది పార్టీ సభల్లో ఆమె మాట్లాడటం రెండు మూడు సార్లు విన్నాడు. తన వాగ్ధాటితో సభికుల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుందామె. మంచి వక్త.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
vedika