Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

యాత్ర

జరిగిన కథ :  కొంత మొత్తం అప్పుగా ఇస్తే బట్టలజత కొనుక్కుంటానని యోగి ని అడుగుతాడు గంగరాజు...పాపం కొన్నిరోజులుగా ఆడవాళ్ళ బట్టలు వేసుకోవడం వల్ల కాబోలు, ఆడవాళ్ళ బాడీ లాంగ్వేజ్ మొత్తం వచ్చేసింది వీడికి అనుకుంటాడు లోలోననవ్వుకుంటూ యోగి...ఆ తర్వాత...

రాత్రి భోజనాల హాలులోకి తెల్లటి సూటు లాంటిది ఎర్ర షూస్ వేసుకుని హరిప్రియా, నల్ల డ్రస్సు వేసుకుని అనిల్ దిగారు. ఒక పళ్ళెంలో చికెను ఇద్దరూ స్పూన్లేసుకుని తిన్నారు. ఒకే మగ్ లో యూరోకోలాని చెరో స్ట్రా వేసుకు తాగారు. అన్నం కూరలూ ఒక పళ్ళెంలో వేసుకుని తింటుంటే యూనిట్లో వాళ్ళంతా వాళ్ళనే చూస్తున్నారు.

అంతలో గోవిందు చేసిన మిమిక్రీ ప్రోగ్రాం చూసి అంతా నవ్వుతున్నారు. లాస్ట్ ఐటమ్ గా శంకరాభరణంలో ఒక పాట. ఆ క్లాసికల్ సాంగుని అక్కినేని అయితే ఎలా చేస్తారు ? ఎన్ టి ఆర్ ఎలా చేస్తారు ? అని చేసి చూపిస్తున్న గోవిందు చాలా ఫాస్ట్ గా చేస్తుంటే మధ్యలో ఒక లేడీ వచ్చి ఎలా బడితే అలా ఆడేసింది.ఎవరా అని చూస్తే గంగరాజు. అవాళ్టితో రెండో పాట అయిపోయిందట. దానికి హీరోయిన్ కి వాడిన డ్రస్సట అతనేసుకున్నది.

అక్టోబర్ – 8

మర్నాడు నిద్ర లేచే సరికి టైమెంతయిందో తెలీదు. ఏగ్జమ్స్ కొండల వెనక ఎర్రగా ఉంది ఆకాశం. ఇంకాస్సేపటిలో సూర్యోదయం కాబోతుంది. అంతలో నిద్రలేచిన యోగి “గొంతంతా నొప్పిగా ఉంది సార్, డాక్టర్ దగ్గరకెళ్ళాలి” అన్నాడు.

వేణు దగ్గర కెళ్ళి చెబుదాం అనుకుంటుండగా, ఆ వేణుక్కూడా జ్వరంగా ఉందట.

301 లోకి వెళ్ళే సరికి వంట కుర్రోడు రాము బెర్ముడా వేసుకుని పడుకున్న వేణు కాళ్ళు నొక్కుతున్నాడు.

యోగి గొంతు గురించి చెప్పి “వాడూ, మీరూ కల్సి డాక్టర్ దగ్గరకెళ్ళగూడదా..?” అన్నాడు జీవన్.

“ఇక్కడ డాక్టర్లు మనల్ని చూడరు. చూడాలంటే చాలా తతంగం ఉంది” అన్నాడు.

“తతంగం అంటే...?”

“మనం ఇక్కడి కొచ్చేముందు ప్రతి ఒక్కళ్ళకీ యునైటెడ్ ఇండియా వాళ్ళ దగ్గర ఇన్సురెన్స్ చేయించాను. ఇప్పుడు డాక్టర్ మమ్మల్ని చూడాలంటే మా ఇన్సురెన్స్ పోలసీలు చూడ్డంతో పాటు ఢిల్లీలో ఉండే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాటాడాలి. వీడి ప్రశ్నలన్నిటికీ వాళ్ళు సమాధానం ఇవ్వాలి. అమ్మో చాలా గొడవ” అన్నాడు. అంతలో అక్కడి కొచ్చిన జాస్తి చౌదరి “పోన్లే ఇవాళ్టికి యోగిని రెస్ట్ తీసుకోనియ్యండి. షూటింగ్ స్పాట్ కి వెళ్దాం పదండి” అన్నాడు.

“అక్కడికి మేమెందుకు..?” అన్నాడు జీవన్.

“ఇవాళ షూటింగ్ వరల్డ్ ఫేమస్ స్వరోస్కి ప్రెమిసెస్ లో. ఇలాంటి ఛాన్సు మళ్ళీ రాదు పదండి” అన్నాడు.

స్వరోస్కి... 1862 లో పుట్టి 1956 లో మరణించిన డేనియల్ స్వరోస్కి గ్రూపు ఫౌండర్ స్వరోస్కిలు ఫాక్టరీ లోపలకెళ్ళి చూడాలన్న నా కోరిక తీరబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది.

పావుగంటలో రెడీ అయిపోయిన వేణు రోజుకీ యాభై యూరోలు పెట్టి అద్దెకి తెచ్చిన కారు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. యోగి, జీవన్, జాస్తి చౌదరి, చిన్నారావు గారూ గబ గబా ఎక్కేసారు.

కారు బయల్దేరింది.

దగ్గర దగ్గర పదిహేను కిలోమీటర్ల ప్రయాణం.

ఆ ఫాక్టరీలో కెళ్ళే సరికి పదిహేను బస్సులు ఆగి ఉన్నాయి. రకరకాల దేశాల్నించి వచ్చిన జనం దూరంగా ఫాక్టరీ లోపలికెవరికీ ఎంట్రీ లేదట. దాని కెదురుగా పెంచిన గడ్డిని పెద్ద తలకాయ బొమ్మ షేపులో కత్తిరించారు. కళ్ళ దగ్గర అతికించిన పెద్ద పెద్ద క్రిస్టల్స్ లో రంగులు మారుతున్నాయి. ఆ తలకాయ కింద ఉందట స్వరోస్కి నిపుణులు తయారు చేసిన నగల ప్రదర్శనశాల.షూటింగ్ దగ్గర కెళ్ళారు.పరుగెత్తుకుంటూ ఎదురొచ్చాడు సలీం.

హీరో సందేశ్ మూమెంట్ నేర్చుకుంటున్నాడు.

అక్కడో పది నిమిషాలున్నాక జార్జి ప్రసాద్ వెళ్ళి ఒక అరడజను టిక్కెట్లు తెస్తే స్వరోస్కి క్రిస్టల్ వరల్డ్ కెళ్ళారు.

లోపలికి ఎంటరయిన వెంటనే నగ తయారు చెయ్యడానికి ప్రపంచం మొత్తం మీద అతి పెద్ద రాయిని అద్దాల మధ్యలో పెట్టారు. కుడి పక్క అద్దాల్లో లైఫ్ సైజ్ నల్లటి గుర్రం బొమ్మని నగలతో అలంకరించారు. జనం ఒక పక్క నించి అడ్డొచ్చేస్తున్నారు గానీ, ఎంత సేపయినా చూద్దామనిపించేంత బాగుందా డెకరేషను. ఎడం పక్క ఏబ్ స్ట్రాక్ట్ మనిషి బొమ్మ. ముంజేతికి వదులుగా పెద్ద క్రిస్టల్. ఇంకో పక్కకి సాల్విడార్ డాలి టైమ్ రన్నింగ్ అవుట్ పెయింటింగ్ ని రాయితో చేశారు. అసలు ఒరిజినల్లో డాలీ వేసిన పెయింటింగ్ ఎలాగుంటుందంటే పెద్ద గడియారాన్ని మడత పెట్టి చెట్టు కొమ్మకి ఆరేసి ఉంటుంది. ఇక్కడ అదే గడియారాన్ని మడత పెట్టి హేంగర్ కి తగిలించారు. మైకు పట్టుకుని వచ్చిన ఒకమ్మాయి జర్మన్ భాషలో అయిదు నిమిషాల పాటు మాటాడాకా చప్పట్లు కొట్టారంతా. అక్కడ్నుంచి గుంపు ముందుకి కదుల్తుంటే వీళ్ళూ కదిలేరు.

లోపల త్రీడీ షో జరుగుతుంది.

ఆ మ్యూజిక్కు విజువల్సూ చూస్తున్న జనాన్ని ఇంకో లోకానికి తీసుకెళ్ళిపోతున్నాయి. కలల్లో కనిపించే లోకాలు గుర్తుకొస్తున్నాయి. అంతా చీకటి మయం. అక్కడ్నించి ఇంకో హాల్లో కెళ్ళాలి. మైల్డ్ మ్యూజిక్. అంతా కదుల్తుంటే వాళ్ళని ఫాలో అయ్యేరీళ్ళు.పెద్ద పుర్రెకి నగలు అలంకరించారు. నోట్లో క్రిస్టల్స్ అద్దిన సిగరెట్. అలాంటి చాలా రకాల బొమ్మలు.

ఇంకో చోట క్రిస్టల్ మెడిటేషన్ రూమట. అక్కడ కాస్సేపు ఆగి నడుస్తుంటే నిజంగానే కలలో ఏదో లోకంలో ప్రయాణం చేస్తున్నట్టుంది. క్రిస్టల్ థియేటరూ కెళ్ళాలి. కుందేలు పిల్లా చంటిపిల్లా కల్సి ఒక పుల్లకి పెద్ద ద్రాక్ష పళ్ళ గుత్తి. మధ్యలో ఒకో పండు కట్ చేసి లోపల క్రిస్టల్ అద్దారు. ఇంకో చోట తావరాకుల తీగ కొన్ని ఆకుల మధ్యలో రంగు రంగుల క్రిస్టల్స్ అతికిన సీతాకోకచిలుకలు ఇలా రకరకాల అలంకరణలు.ఒకచోట చిన్న దారి కనిపించింది. తెల్లగా పొంగుతున్న పాల నురుగు లాగుంది. మా ముందు జనం ఎప్పుడో వెళ్ళిపోయేరు. నడవొచ్చో లేదో అర్థం గావటం లేదు. వాళ్ళ వెనక నించొచ్చిన పదేళ్ళ కుర్రాడు పరుగెట్టుకుంటూ ఆ దార్లో వెళ్తుంటే వీళ్ళు ఫాలో అయ్యేరు. దాని పేరు ఐస్ పాసేజట.ఇలా రకరకాల వింతలూ విన్యాసాల్ని తిలకిస్తూ కళ్ళు చెదిరిపోయే క్రిస్టల్ గేలరీలోకి అడుగు పెట్టారు. ఊహించని విధంగా రాళ్ళతో అద్భుతమైన నగల్ని తయారు చేసి షో కేసుల్లో పెట్టారు. ప్రతీది ఖరీదైందే, మామూలు ఖరీదు గాదు. తన మిసెస్ కి చిన్న లాకెట్, చెవులకి రింగుల్లాంటివి కొన్నాడు యోగి. ఎంతయిందిరా అంటే వెయ్యి యూరోలన్నాడు. అంటే దగ్గర దగ్గర ఏభై వేలు. నడుచుకుంటూ ముందుకెళ్ళాడు జీవన్. టీ షర్టులూ, బ్రాలూ, బనియన్లు కూడా క్రిస్టల్ పొదిగి అమ్మకానికున్నాయి. ఒకచోట హరిప్రియా, అనిల్ కనిపించారు. ఒక సన్నటి గొలుసు హరిప్రియ మెడలో అలంకరిస్తున్నాడు అనిల్.

దాదాపు గంట తర్వాత బయటికొచ్చారు.అక్కడ షూటింగ్ అయిపోయిందట. అంతా బస్సు ఎక్కుతున్నారు. మమ్మల్నీ ఏగ్జమ్స్ పంపించెయ్యమని వేణు గార్ని అడిగేడు జీవన్. “దీని తర్వాత రైల్వే స్టేషన్లో షూటింగుంది. అక్కడ ట్రయినెక్కించేస్తాను. బస్సెక్కేసి మాతో వచ్చేయండి” అన్నాడు వేణు.

బస్సెక్కాకా పక్క సీట్లొ ఉన్న చందర్రావు ని అడిగేడు జీవన్ “ఎలాగుందండి స్వరోస్కి క్రిస్టల్ వరల్డ్..?” అని.

“అవన్ని నిజం వజ్రాలు కావంట గదా..?” ప్రశ్నేసేడు చందర్రావు.

“ఔను” అన్నాడు

పెద్దగా నవ్వేసిన చందర్రావు “ఇక్కడ జనాన్ని చూస్తుంటే అప్పుడప్పుడూ ఈ తెల్లోళ్ళకి బుర్రలుండవని అనిపిస్తుందండి. లేకపోతే ఆ గాజు రాళ్ళని లక్షలూ కోట్లూ పెట్టి అలా కొనేసుకుపోతారా చెప్పండి..!?” అన్నాడు.

“అవన్నీ ప్రపంచమంతా పేరెల్లిన క్రిస్టల్సండీ”

“ఏవండీ, మీరేవన్నా అనుకోండి నన్నడిగేరు గాబట్టి నా అభిప్రాయం చెప్పేను తప్పంటారా..?”

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
vedika