Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

.

జరిగినకథ: గ్రీన్ రూం లో మేకప్ తీసేస్తున్న చంద్రకళ దగ్గరికొచ్చి సరదాగా మాట్లాడుతుంటాడు జగదీష్. ఇంతలో రాణి అక్కడకు వచ్చి జగదీష్ ని తనతో రమ్మంటుంది. నాట్య ప్రదర్శన అనంతరం అందరూ డిన్నర్ ఎంజాయ్ చేస్తారు. చంద్రకళ నాన్నగారు ఆలపించిన "సాలీడా" పాటకి  అందరూ ఎంతో ముగ్దులవుతారు. నాన్న ఆకాశమంత అనిపిస్తుంది చంద్రకళకి.  ఆ తరువాత...

“పది నిముషాల్లో మదురై వచ్చేస్తుంది. ఇక లేవండి,” అంటూ నాన్న, అంకుల్ అందరినీ నిద్ర లేపారు.  ఇంకా పూర్తిగా తెల్లారలేదు.
ట్రైన్ దిగి అరగంటలో  మేముండబోయే  పామ్-గ్రోవ్  రిసార్ట్స్  చేరాము.

అందరి స్నానాలు, బ్రేక్ ఫాస్ట్ అయ్యాక, గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని తిరిగి రిసార్ట్స్ కి వచ్చాము.

రిసార్ట్స్ లోని వెజిటేరియన్ బఫే హాల్లో, లంచ్ చేద్దామన్నారు అంకుల్. 

“నేను, చంద్ర ఏదన్నా లైట్ గానే తింటాము... మేకప్ స్టార్ట్ చేసుకోవాలి,” అంది అమ్మ....

“ఔను కదా! అయితే మీరు కాటేజీకి వెళ్ళిపొండి. మీకు రూమ్ సర్వీస్ ఆర్డర్ చేస్తాను... ప్రోగ్రాం ముందు మీరు ఏం తింటారో నాకు తెలుసులే,” అన్నారు నాన్న.

“డాడీ, మేము పక్కనే ఉన్న ‘పీట్జా’ – ఇటాలియన్ ప్లేస్ కి వెళతాము...” అంకుల్ తో అంటూ పక్కనే ఉన్న జగదీష్ చేయందుకొంది రాణి.

“ష్యూర్... అలాగే తల్లీ ... జస్ట్ ఐస్ డ్రింక్స్ తాగవద్దు.  నువ్వు పాడాలి కదా!” అన్నారు అంకుల్...

“పాటకి ముందు నీకు రెస్ట్ కూడా అవసరం.  లంచ్ చేసి వచ్చేయండమ్మా రాణి, ప్రోగ్రాం కి ఎక్కువ టైం కూడా లేదుగా మరి...,” గుర్తు చేసింది నీరు ఆంటీ...

రాణి చేతి నుండి తన చేయి విడిపించుకుంటూ, “హోల్డ్ ఆన్ రాణీ.  నీకు, నాకే కాదు వినోద్ బాబుకి కూడా ఇటాలియన్ ఫుడ్ చాలా ఇష్టం,” అంటూ వినోద్ వైపు తిరిగి, “కమాన్ వినోద్, మనం పీట్జా తిందాం,” అంటూ వాడి చేయందుకున్నాడు జగదీష్.

**

కాటేజీలోనే  నా మేకప్ కానిచ్చి, ఆడిటోరియంకి వెళ్ళాము. అప్పటికే,  ‘కళామంజరి’  వారి  గ్రీన్ రూమ్స్ లో,  ఫెస్టివల్ పార్టిసిపెంట్స్ – మరికొందరు వచ్చున్నారు.  వాళ్ళల్లో  ముగ్గురు డాన్సర్స్, నలుగురు సింగర్స్.  అందరూ పద్దేనిమిదేళ్ళ లోపు వాళ్ళేనట.

ఫెస్టివల్ వారు నాకిచ్చిన పర్ఫామెన్స్  టైం ఇరవైఐదు నిముషాలు.  నాలుగు ఐటమ్స్ చెయ్యాలి.
రాణి కూడా అలాగే, తన పాటలన్నీ వరసగా పాడాలి. 

‘వేదిక’ మాత్రం  మునుపెన్నడూ  చూడనంత పెద్దదిగా ఉంది.  ఓ పక్కన వాయిద్యాల వారికి పెద్ద ప్లాట్ ఫాం,  చుట్టూ టి.వి కెమెరాలు.  ‘వేదిక’ ని ‘మహా శివుని కైలాసం’ సీన్ లా ఏర్పాటు  చేసారని కామెంట్ చేసింది అత్తయ్య.  ఆడియన్స్ కూడా  మామూలు కంటే ఎక్కువగా, వేల సంఖ్యలో ఉన్నారు...

వచ్చిన న్యాయనిర్ణేతలు నాట్య సంగీత రంగాల్లో పేరున్నవారట.  ఉత్తమ నర్తకిని ఎంపిక చేసి, అవార్డ్ ఇస్తారట.  అవార్డు వచ్చిన వారికి ఆ రంగంలో జాతీయంగా గుర్తింపు ఉంటుందట.

ఫెస్టివల్  కో-ఆర్డినేటర్  ఒకామె మా నుండి, నా ఐటమ్స్ వివరాలు తీసుకున్నారు..

**

ఉత్సాహంగా వేదిక మీద అడుగుపెట్టాను....  మునుపెన్నడూ తెలియని ఓ కొత్త ఆనందం తోచింది... నన్ను అనుసరిస్తున్న స్పాట్-లైట్స్ రంగులు మారుతుంటే, ఓ హరివిల్లు మీద నర్తిస్తున్న భావం కలిగింది...

‘‘రామ పట్టాభిషేకం’, ‘నీలమేఘ శరీర-తరంగ  నృత్యం’ చేస్తుండగా, ప్రేక్షకుల చప్పట్ల నుండి రెట్టింపు ఉత్సాహాన్ని పొందాను.  అలుపనిపించలేదు.

‘జావళి’  చేస్తున్నప్పుడు మాత్రం, ఒక్క క్షణం జగదీష్ చేసిన కామెంట్  గుర్తు చేసుకున్నాను ...

‘ఈ ‘జావళి’ డాన్సులో, నీ ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్ మాజికల్ ‘ అన్నాడు వర్ధంతి ప్రోగ్రామప్పుడు....

‘జావళి’ కోసమే, సున్నితమైన ఎక్స్ ప్రెషన్స్ అద్దం ముందు ప్రాక్టీస్ చేయించింది అమ్మ.  

ఆఖరి ఐటంతో పాటు మంగళం చేసి, ఆగని కరతాళధ్వనుల నడుమ ‘వేదిక’ మధ్యకి వెళ్లి,  సభకి నమస్కరించాను..........

**

వేదిక మెట్లు దిగుతుండగా, బయట హాల్లో నుండి, జగదీష్ నావైపు రావడం కనిపించింది. ...ఆ వెనుకే రాణి, అమ్మ కూడా.  వాళ్ళని చూస్తూ, వేదిక మెట్లు దిగుతుండగా,  కాలికి ఏదో  తగిలి పడబోయాను.  “వాచ్ ఔట్, బి కేర్ ఫుల్ ,” అంటూ చేయందించాడు జగదీష్.  పక్కనే చాచి ఉన్న అమ్మ చేయి అందుకొని దిగాను.  కాలు నొప్పిగా అనిపించింది.  గ్రీన్ రూం వైపు నడిచాము.

**

రాణి పర్ఫామెన్స్ కి ఇంకా  పదిహేను నిముషాల సమయం ఉందట.

అంకుల్, నాన్న మా వద్దకు వచ్చారు. 

“బాగా చేసావు చంద్రకళా,  అవార్డు నీకే వస్తుంది చూడు,” అన్నారు  అంకుల్.

“గజ్జెలు మాత్రం తీసేసి,  వెళ్లి రెండో వరసలో మణత్తయ్య  పక్కన కూర్చోండి.  మన రాణి పాడబోతుంది...  ఇంకా, గంట ప్రోగ్రాం వుంది.  అంతా అయ్యి, అవార్డ్స్ అనౌన్స్ చేసిన తరువాతే మనం వెళ్ళేది,” అని చెప్పి వెళ్ళారు నాన్న.

**

అమ్మ సాయంతో మెల్లగా వెళ్ళి ఆడియన్స్ లో కూర్చున్నాను.  జగదీష్ నాకు తాగడానికి మిల్క్-షేక్ తెచ్చిచ్చి పక్కనే కూర్చున్నాడు.
పాదం నొప్పెడుతుంది.  రాణి పాట తరువాత, లాస్ట్  పర్ఫామెన్స్ వింటూ మిల్క్-షేక్ ఫినిష్ చేసాను.

ఫెస్టివల్ వారు అవార్డ్స్ అనౌన్స్ చేసేలోగా, మ్యూజిక్ ప్రోగ్రాం ఎంజాయ్ చేయమని అనౌన్స్ చేసారు కోఆర్డినేటర్.

సీటులో  వెనక్కి వాలి, అమ్మ భుజం  పైన తల ఆన్చి కళ్ళు మూసుకున్నాను.

**

గొల్లుమని గొడవ, చప్పట్లు.  “చంద్రా, లే,” అంటూ నా భుజాలు పట్టి కుదిపేస్తున్న జగదీష్. ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను.   అంటే నేను కాస్త చిన్న కునుకు తీసానేమో! ..... చుట్టూ చూస్తే, అంతా హడావిడిగా కనిపించారు...

“నేను చెప్పింది కరెక్ట్,  చంద్రకళా  రామ్మా, నువ్వు ‘వేదిక’ పైకి వెళ్ళాలి,” అంటున్న  భూషణ్ అంకుల్.

“పర్వాలేదు,  మెల్లగా నడువు. ఆగుతారులే,” అంటూ నా భుజాల చుట్టూ చేతులు వేసిన అమ్మ. మరి కాస్త దూరంలో చేయందిస్తూ నిలబడున్న నాన్న.  నాన్న వంక చూసాను.  ముఖం వెలిగిపోతుంది.  నాన్న కళ్ళల్లో ఆనందం,  నా మీద ప్రేమ కనిపించాయి.  మెల్లగా లేచి నాన్న చేయందుకున్నాను.  కుంటుతూ,  వెంట నడిచాను.   ఎప్పటిలా నా భుజాల చుట్టూ చేయి వేసి, అమ్మ వెనుక రాగా,  నాన్న చేయూతతో  ‘వేదిక’ పైకి నడిచాను.. 

చప్పట్లతో మోగిపోయింది ఆడిటోరియం.  ఇంతలో మైకులో ప్రకటన..

.నాట్యమయూరి  చిరంజీవి  చంద్రకళని ఈ యేడు ‘కళామంజరి’ ఉత్సవంలో, సాంప్రదాయ నృత్య  విభాగంలో  విజేతగా ఎన్నుకున్నాము.  ఆ  చిన్నారికి  యాభైవేల  నగదు బహుమతి  అందిస్తారు ఉత్సవ కార్యదర్శి...”

అమ్మనాన్నల్ని కూడా వేదికపైకి ఆహ్వానించాక, నా మెడలో పూల దండ వేసి,  ట్రోఫీతో   పాటు,  నాకు నగదు బహుమతి  అందించారు.ముఖ్య అతిధి - నృత్య కళాకాకారిణి, పద్మశ్రీ. డా. కాదంబరి మైక్  ముందుకు  వచ్చారు.

“....ఇంతటి పిన్న వయస్సులో,  అంత  చక్కగా  హావభావాలు  చూపించడం అరుదైన విషయం. ఆమె పాదాలు లయబద్దంగా అడుగులు వేసిన తీరుకి,  పాదరసంలా సాగిన ఆమె కదలికలకి, చక్కని  మోమున  మెరిసిన  ఆ  కనుదోయికి, ఆ  చిరునగవుకి  ఇక్కడున్న నాట్యాభిమానులతో పాటు, న్యాయ నిర్ణేతలు కూడా  ముగ్దులయ్యారు. 

చంద్రకళకి బంగారు భవిష్యత్తు ఉంది.  ఆ నాట్యమయూరిని,  ఆమె తల్లితండ్రులైన  శారద, మేజర్. సత్యదేవ్  గార్లని అభినందిస్తున్నాను,”  అంటూ ముగించాక,  నా భుజాల చుట్టూ షాల్ కప్పి పూల గుచ్చాన్ని అందించారు......

**

కరతాళధ్వనుల నడుమ,  నాన్న సాయంతోనే ‘వేదిక’ పై నుండి దిగాను. నాకు తెలియకుండా నా కళ్ళలో నీరు నిండింది.  తెలియని సంతోషంతో నా ఊపిరి నాకు చల్లగా హాయిగా అనిపించింది.

ఈ అనుభూతి నాకు ఎంతో శక్తినిస్తుంది....

అడుగడుగునా మమ్మల్ని జనం ఆపి మెచ్చుకుంటుంటే, నాన్న ముఖం చూశాను.  ఎంతో గర్వంగా నన్ను దగ్గరగా పట్టుకుని నవ్వుతూ నడుస్తున్నారు.  అమ్మని చూశాను. ముఖం మీద చిరునవ్వుతో మా వెంట నడుస్తుంది. 

నాలో డాన్స్ అంటే ఉన్న ఇష్టానికి ఇంత గుర్తింపు,  డాన్స్ చూస్తున్న అందరికీ, నేనంటే కలుగుతున్న అభిమానం నాకు బాగుంది.  ఆ ‘వేదిక’ అంటే నాకిప్పుడు - నాన్న, అమ్మలంటే  ఉన్నంత  ఇష్టం.  అందుకే  అమ్మ  చెప్పినట్టు,  ప్రతిసారి  ‘వేదిక’  నెక్కే ముందు  దానికి నమస్కరిస్తున్నాను. 

**

రిసార్ట్  చేరగానే, నాకు కాటేజీ బయట దిష్టి తిప్పేసింది అమ్మ.  కాలు నొప్పితో నడవడానికి కష్టంగా ఉంది. రూంలోకి వెళ్ళాక చూసుకుంటే,  కాలు బాగా వాచిపోయింది. 

మేకప్ తీసేసి,  వేడినీళ్ళతో కాపడం పెట్టిన కాసేపటికి కొంచెం నయమయింది. 

నాన్న హోటల్ మానేజ్మెంట్ కి ఫోన్ చేసి, డాక్టర్ కోసం అడిగి, అపాయింట్మెంట్ తీసుకున్నారు.   డిన్నర్ విషయమై అంకుల్ కి ఫోన్ చేసారు.

**

నా కాలు పరీక్షించి గట్టిగా బేండేజీ వేసారు డాక్టర్.  స్ప్రైన్  అని చెప్పి,  రెండు వారాలు  రెస్ట్ ఇవ్వమన్నారు.  నొప్పికి పిల్స్ ఇచ్చి వెళ్ళారు....
ఇంతలో అంకుల్ అందర్నీ తీసుకొని మా కాటేజీకే వచ్చారు.  

వినోద్ బాబు పరుగున వచ్చి నన్ను ముద్దు పెట్టుకొని, “నీ డాన్స్ బాగుంది.  అయితే ఆ మనీ, ఆ ట్రోఫీ మాత్రం నాకిచ్చేయి అక్కా,” అన్నాడు. 

“చెప్పలేనంత, సంతోషంగా ఉంది, అలాగే అమ్మనడిగి తీసుకో,” అన్నాను.

జగదీష్, అత్తయ్య, మామయ్యా, అంకుల్, ఆంటీ తో పాటు కన్నన్, మీనాక్షి కూడా నన్ను మెప్పుల్లో ముంచేసారు.

దూరంగా మౌనంగా ఉండిపోయిన రాణి వద్దకు వెళ్ళారు రాంమామయ్య.

...” ఏమ్మా, అలిసిపోయావా?  ఇలా రా,” అంటూ  రాణిని  పిలిచుకొచ్చి నా పక్కనే  సోఫాలో కూర్చోబెట్టారు.

“నీవు శ్రావ్యంగా పాడావు.  ఆణిముత్యాల్లాంటి పాటలు, స్వరాలు సునాయాసంగా ఆలపించావు.... నీవేం తక్కు వ కాదు.  “గోల్డెన్ వాయిస్” నీది,” అన్న రాంమామయ్య తో పాటు అందరం చప్పట్లు కొట్టాము....

దాంతో, రాణి హ్యాపీగా కనిపించింది. నవ్వులు చిందించింది.  నేను కూడా అభినందనలు తెలిపాను..

ఇంతలో అంకుల్ ఆర్డర్ చేసిన డిన్నర్ రావడంతో అందరం మా కాటేజీలోనే భోంచేసాము.  చాలా సేపు కబుర్లు చెప్పుకున్నాము. 

**

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
deathmistery