Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
deathmistery

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

 

 జరిగినకథ: సహస్ర స్పృహలో కొచ్చిందని తెలిసి విరాట్ చాలా సంతోషిస్తాడు. విశాల తనకు సహస్రకు మధ్య అపార్ధాలు తొలిగిపోయాయని విరాట్ కు చెప్తుంది. విరాట్ మనసు కొంత కుదుటపదుతుంది. విరాట్, సహస్ర పరిస్థితులను చూసి దీక్ష, విశాల  చాలా బాధపడుతారు . విశాల తన స్నేహితురాలు డాక్టర్ గుణ దీపికను అందరికీ పరిచయం చేస్తుంది. మునుస్వామీ, వెంకట రత్నం నాయుడు తనూ బాల్య స్నేహితులమని, కాంచనమాల తన స్నేహితుడి చెల్లెలనీ చెప్పగానే  దీక్ష చందూలు ఉద్వేగానికి లోనవుతారు.  ఆ తరువాత...    

ఇక రంగనాథ చౌదరి తరపు వాళ్ళకి కులం అడ్డంకి అయింది. తమ కులం గాని అమ్మాయి కోట్లు కట్నంగా తెచ్చినా అంగీకరించమన్నారు వాళ్ళు. ఈ గొడవలో ఎటూ చెప్పలేక వెంకటరత్నం నాయుడు మౌనం వహించాడు...’’

కొద్ది క్షణాలాగి చెప్పటం ప్రారంభించాడు.

‘‘మా పెద్దాయన విశ్వేశ్వర నాయుడికి మన కులాలు ఆచారాలు కట్టుబాట్లు అంటే ఎంతో గౌరవం. కాబట్టి  పెళ్ళికి అంగీకరించక పోగా కాంచనమాలకు వేరే సంబంధాలు చూడ్డం ఆరంభించాడు. అటు చౌదరి ఇంట్లోను అదే పరిస్థితి.

ఇక తమ పెళ్ళి చేయరని అర్థం కాగానే ఆ జంట వేరే దారిలేక ఒకరాత్రికి రాత్రి కోయంబత్తూరు వదిలేచిపోయారు. అంతే ఆ తర్వాత వాళ్ళెక్కడున్నారో, ఏమయ్యారో ఎవరకీ తెలీదు. ఎంత వెదికించినా వారి జాడ తెలీలేదు. పెద్దాయన పోయేవరకు పట్టుదలగా వున్నా చివరిరోజుల్లో కూతుర్ని చూడలేక పోయానే అనే బెంగతోనే ఆమెపేరు కలవరిస్తూ కన్ను మూసాడు. ఆ తర్వాత`

అల్లరి చిల్లరగా తిరుగుతున్నానని నన్ను పిలిచి తమ నూలుమిల్లులో పనిచ్చి మేస్త్రీని చేసాడు వెంకటరత్నం నాయుడు.
అందుకే ఎంత బాల్యమిత్రులమైనా వాడ్ని పెద్దయ్యగారు అనే పిలుస్తాను. లేదంటే పదిమందిలో వాడ్ని అలవాటులో పొరబాటుగా అరే ఒరే అంటే బాగుండదు గదా. తండ్రి పోయాక కూడా దొరికితే చెల్లిని బావను తెచ్చి తన వద్ద ఉంచుకోవాలని వాళ్ళకోసం చాలా చోట్ల గాలించాడు. ప్రయోజనం లేకపోయింది. మా గారాల చిట్టితల్లి కాంచనమాల భర్తతో ఇప్పుడెక్కడుందో ఎలాఉందో పిల్లలెంతమందో’’ అంటూ చెమర్చిన కళ్ళు తుడుచుకున్నాడు మునుసామి.

చందూ దీక్షలు ముఖముఖాలు చూసుకున్నారు.

మునుసామి చెప్పిందాన్ని బట్టి చూస్తే నూటికి నూరు శాతం వెంకటరత్నంగారి చెల్లెలే ఈ కాంచనమాల కావచ్చని నమ్మకం ఏర్పడుతోంది. ఇక మునుసామి ఆవిడ్ని చూసి ధృవీకరించటమే మిగిలింది. ఇంతలో మునుసామి తిరిగి మాట్లాడ్డంతో ఇద్దరూ అతడివైపు చూసారు.
‘‘వెంకటరత్నంనాయుడిది ఎంత గొప్ప మనసో  మీకు తెలీదు. అంత గొప్పమనసు గాబట్టే మా కార్మికులంతా ఆయన్ని దైవంలా భావిస్తారు. కార్మికుల్లో ఏ ఇంట శుభకార్యం జరిగినా కుటుంబపెద్దలా భార్యా సమేతంగావచ్చి దగ్గరుండి జరిపిస్తారు. సగం ఖర్చు ఆయనే ఇస్తాడు. తనకూతురు కనకమహాలక్ష్మి వివాహం జరిపించినట్టే నా ముగ్గురు కూతుళ్ళకీ తనే దగ్గరుండి వైభవంగా పెళ్ళి జరిపించాడు. ఈ రోజు నా కొడుకులిద్దర్లొ ఒకడు అమెరికాలోను ఒకడు జర్మనీలోను సాప్ట్వేర్ ఇంజనీర్లుగా సెటలయ్యారంటే అది ఆయన చలవే. స్నేహానికి బంధుత్వానికి ప్రాణమిచ్చే మనిషి. అలాంటివాడు తన సొంత చెల్లెల్ని కాదనుకుంటాడా. ఇప్పటికీ ఆయన గుండెల్లో చెల్లెలు బావ వాళ్ళ జాడ తెలీలేదన్న బాధ ముల్లులా గుచ్చుతూనే వుంది.

నా భార్య పోయి నాలుగేళ్ళయింది. దాన్ని మర్చిపోలేక మందుకి అలవాటు పడ్డాను. ఈ విషయంలో నాయుడికీ నాకూ ఎప్పుడూ గొడవే. అయినా ప్చ్. మానుకోలేను’’ అంటూ బాధగా చూసాడు. తిరిగి తనే...

‘‘సరి సరి మనం ఎక్కడినుండి ఎక్కడికో వెళ్ళిపోయాం. ఇదిగో అల్లుడూ నాకు జానీవాకర్.. మర్చిపోవుగా’’ అంటూ తిరిగి గుర్తు చేసాడు.
‘‘దాందేముంది మామా. ఇస్తానన్నాగా ఇప్పుడు ఇక్కడ మాకు తెలిసిన కాంచనమాల ఒకావిడ వుంది. నువ్వామెను చూసి ఒకవేళ మీ చెల్లెలు కాంచనమాల అవునో కాదో తేల్చి చెప్పేస్తే ఓ పనయిపోతుంది’’ అన్నాడు చందూ.

ఆ మాటతో మునుసామి...

ఒక్కసారిగా ఆశ్చర్య చకితుడయ్యాడు.

‘‘అంటే... ఇంతసేపూ నాతో మాట్లాడించింది. మీ డౌట్ క్లియర్ చేసుకోడానికా!’’ అనడిగాడు.

చందూ నవ్వి...

‘‘మామా నీ జానీవాకర్ గురించి భయంలేదు. నేను గ్యారంటీ సరేనా. నువ్వోసారి చూసి ఆవిడ కాంచనమాల అవునో కాదో చెప్పుచాలు’’ అన్నాడు.

‘‘అల్లుడూ. తను గనక మా కాంచనమాలయితే నువ్వుకాదురా. నేనే నీకు రెండు జానీవాకర్ బాటిల్లు కొనిస్తాను. కాని మీ పిచ్చిగాని లోకంలో ఆ పేరుతో ఎంత మంది లేరు’’ అన్నాడు నిరుత్సాహంగా మునుసామి.

‘‘మామా ఓ మాట చెప్పు. ఇప్పుడు చూసినా తనను గుర్తుపట్టగలవు గదా?’’ అడిగాడు చందూ.

‘‘అందులో డౌటు....’’

‘‘బాబాయ్ అసలు విషయం చెప్తా విను’’ అంటూ దీక్ష తను కాంచనమాల గదిలో చూసిన బ్లాక్ అండ్ వైట్ ఫోటో సంగతి బయట పెట్టింది. ఆ మాట వినగానే మునుసామి ముఖం ఒక్కసారిగా విప్పారింది.

‘‘ఆగాగు’’ అన్నాడు కంగారుగా.

‘‘ఫోటోలో పెద్దాయనకి పెద్ద మీసాలు తలమీద తెల్లటర్బను నల్లకోటు ధరించి వున్నాడా?’’

‘‘అవును’’ అంది ఎగ్జయిట్ గా దీక్ష.

‘‘అర్థమైందమ్మా. ఇంకేం చెప్పక్కర్లేదు. ఎక్కడుందావిడ. పక్క ఇల్లా, వీధి చివరా. నన్నక్కడికి వెంటనే తీసుకెళ్ళండి’’ అన్నాడు ఉత్కంఠగా.
మునుసామి ఆతృత చూసి ఇప్పుడే విషయం చెప్పేయాలనుకుంది దీక్ష కాని చెప్పొద్దని కళ్ళతోనే సైగచేసాడు చందూ. ‘‘కంగారు పడకండి అక్కడికేవెళ్దాం. కాని ఈ విషయం ఇప్పుడే విరాట్ కి తెలీకూడదు నిశ్శబ్దంగా మా వెనకే కిందకు వచ్చెయ్’’ అంటూ వరండా చివరికి దారితీసాడు చందూ.

ఆవెనకే మునుసామి...

చివరిగా దీక్ష ఒకరి తర్వాత ఒకరు...

వరండా దాటి మెట్లవెంట కిందకు వెళ్ళిపోయారు. టివిలో వార్తలు చూస్తున్న విరాట్ గాని విశాల సహస్రలు గాని వాళ్ళు కిందకు వెళ్ళటం గమనించలేదు.

వాళ్ళు వెళ్ళిన అయిదు నిముషాల తర్వాత....

ఉన్నట్టుండి ఎవరో ఏడుస్తున్న శబ్ధం విన్పించి అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో అర్ధంగాక వెంటనే టివి స్విచ్ ఆఫ్ చేసాడు విరాట్.

‘‘ఆగొంతు  మమ్మీ గొంతులా వుంది. నేవెళ్ళి చూసొస్తాను.’’ అంటూ గాబరాతో బయటకు పరుగెత్తింది విశాల.

ఆమె వెనకే విరాట్ కూడ పరుగెత్తాడు. మెట్లు దిగి వెళ్ళేంత ఓపిక లేని సహస్ర మాత్రం గాబరాపడుతూ అక్కడే ఉండిపోయింది.

ముందుగా మెట్లు దిగి హాల్లోకొచ్చిన విశాలకి పనిమనిషి కంగారుగా తన కోసం రావటం కన్పించింది.

‘‘ఏమైంది? మమ్మీ ఎందుకేడుస్తోంది?’’ అనడిగింది విశాల.

‘‘తెలీదమ్మా మీకోసమే వస్తున్నాను. చందూగారి  వెంట ఓపెద్దాయన వచ్చారు. అన్నయ్యా అంటూ అమ్మగారు ఏడుస్తున్నారు. మాకేం అర్ధంగావటంలేదు.’’ అంది పని మనిషి. ఆమాటలు విని...

వెనకే మెట్లుదిగిన విరాట్ కూడ...

ఆశ్చర్యపోయాడు.

‘‘కాంచనమాల ఆంటీ  మునుసామిగారి చెల్లెలా. ఇదేం ట్విస్టో ఏ రకంగా చెల్లెలో అర్ధంకాలేదు. పదచూద్దాం’’ అంటూ విశాల వెంట కాంచనమాల గదిలోకి పరుగుతీసాడు.

ఇద్దరూ లోనకెళ్ళేసరికి...

బెడ్ చివరగా కూచునుంది కాంచనమాల. పైట చెంగు నోటికి అడ్డంపెట్టుకొని ఏడుస్తోంది. పక్కన కూచున్న దీక్ష ఆవిడ్ని ఓదారుస్తోంది. ఇటు సోఫాలో కూలబడి ఏడుస్తున్న మునుసామిని చందూ ఓదారుస్తున్నాడు.

విరాట్ కి గాని, విశాలకి గాని ఏమీ అర్ధంగాక సస్పెన్స్ తో ఉక్కిరి బిక్కిరవుతున్నారు.

‘‘చందూ ఏమిట్రాయిది? ఏమైంది? ఆంటీ గురువుగారి చెల్లెలా!’’ అడిగాడు.

ఆ మాటకి చివ్వున తలతిప్పి...

విరాట్ వంక చూసాడు మునుసామి.

దుఖ్ఖాన్ని దిగమింగి కళ్ళుతుడుచుకొంటూ ‘‘అవును చినబాబు నాకు ఈ కాంచనమాల చెల్లెలే కాని అసలు అన్ననేను కాదు. తను ఎవరి చెల్లెలో తెలుసా? అటు చూడు ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో ఇద్దర్నీచూడు నీకే అర్ధమవుతోంది’’ అన్నాడు.ఇంత వరకు విరాట్ ఆ గదిలోకి రాలేదు గాబట్టి ఫోటో గురించి తెలీదు. ఇప్పుడే ఆ ఫోటోని చూడగానే మరోషాక్. ‘‘అరే, ఇది మా ఇంట్లో కూడ వుంది. మా తాతగారు డాడీ కలిసిఎప్పుడో తీయించుకొన్న ఫోటో ఇదిక్కడికెలా వచ్చింది?’’ అనడిగాడు.

‘‘ఎలా అంటే వెంట తెచ్చుకుంటే వస్తుంది చినబాబు. మీకో మేనత్త ఉందని ఎప్పుడన్నా విన్నావా?’’

‘‘ఎప్పుడో విన్నగుర్తు. కాని తెలీదు.’’

‘‘ఇప్పుడు తెలుసుకో. కాంచనమాల ఎవరోకాదు నీకు స్వయానా మేనత్త. మీ డాడీకి తోడబుట్టిన చెల్లెలు విశాల ఎవరో కాదయ్యా నీ మరదలు’’ అంటూ మునుసామి క్లుప్తంగా వివరిస్తుంటే విరాట్ తో బాటు విశాల కూడ విభ్రాంతి చెందారు.

విశాలకి అప్పుడు అర్ధమైంది ఉదయం దీక్ష ఆ ఫోటోగురించి తనను తరచి తరచి ఎందుకడిగిందో. తను ప్రాణాధికంగా ప్రేమిస్తున్న విరాట్ స్వయానా తనబావ అనితెలీగానే ఆమెకు ఎంతో థ్రిల్గాను పులకింత గాను వుంది. మునుసామి మాట్లాడుతూనే వున్నాడు.‘‘దైవమా నువ్వున్నావయ్యా లేక పోతే ఏనాడో చేజారి పోయిందనుకున్న రత్నం తిరిగి మాకిప్పుడు దొరికేదా! ఎంతకాలం ఎన్ని

సంవత్సరాలు..........మేనరికం వద్దాన్నాడని ఈ విధంగా మరదల్ని జతకలిపావే నీ లీల వర్ణింపతరమా!’’ అంటూ ఆనందంతో కళ్ళు తుడుచుకున్నాడు.

ఆమాటలు వింటూ గబగబా తల్లివద్ద కెళ్ళింది విశాల ‘‘మమ్మీ ఇదంతా నిజమేనా? బాబాయ్ చెప్పింతా నిజమా?’’ అనడిగింది.దుఖ్ఖందిమింగుతూ...

అవునన్నట్టు తలూపింది కాంచనమాల.

‘‘ఆయన బాబాయ్ కాదమ్మా నీకు మావయ్యవుతాడు. నాకు అన్నయ్యవుతాడు. నా సొంత అన్నయ్య ఎంతో మునుసామి కూడ అంతే’’ అంది.

‘‘అయితే  ఎందుకింత దుఖ్ఖం? సంతోషించాలిగదా!’’

‘‘ఎలా సంతోషించను? పుట్టింటికి దూరమైనబాధ ఇన్నేళ్ళూ నా గుండెల్లో గూడుకట్టుకొనుంది. అందుకే మునుసామి అన్నయ్యను చూడగానే దుఖ్ఖం ఆవుకోలేక పోయాను. అయినా వద్దు మనకెవ్వరూ లేరు అంతే. వాళ్ళతోకలవటం మీ డాడీకి ఇష్టంలేదు’’ అంది కాంచనమాల.
అప్పుడు ముందుకొచ్చాడు విరాట్.

‘‘అత్తయ్య మావయ్య ఇప్పుడు లేరు. ఉంటే అభ్యంతరం చెప్పేవారుకాదు. ఎవరూ లేరనుకుంటే ఎలా? విశాల ఏమైపోవాలి? ఆగు ఇప్పుడే ఫోన్ చేసి మమ్మీ డాడీ యిద్దర్నీ బయలుదేరి రమ్మంటాను’’ అంటూ ఫోన్ అందుకోబోయాడు.

అతడి ప్రయత్నాన్ని వారించాడు మునుసామి.

‘‘తొందర పడకు చినబాబు. ఒకటి రెండ్రోజుల్లో ఎలాగూ వాళ్ళిక్కడికి వస్తున్నారు. వాళ్ళకి మనమిచ్చే అపురూపమైన కానుక ఈ తల్లీ కూతుళ్ళు కాబట్టి ఇప్పుడే ఈ విషయాలేవీ ఫోన్లో వాళ్ళకి చెప్పకు’’ అంటూ కాంచనమాల వంక చూసి...

‘చూడమ్మా నీ భర్తకు ఇష్టంలేకపోవచ్చు. ఆయన పోయిన విషయాన్ని మాకు చెప్పకపోయిన కనీసం నీ భర్తతాలూకు బంధువులకయినా అప్పట్లో తెలియపర్చి ఉండాల్సింది. వాళ్ళు జరిపించాల్సిన కర్మాకాండ లేవీ జరిపించలేదుగదా. ఇప్పుడీ విషయం తెలిస్తే వాళ్ళెంత బాధపడుతారో ఆలోచించావా?

వాళ్ళిప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేదమ్మా! రంగనాథ చౌదరి అన్నదమ్ములు దారిలో నేనెక్కడ కన్పించినా మీ వివరాలేమన్నా తెలీశాయోమోనని అడుగుతుంటారు. అంతేకాదు మీరు ఎప్పుడు తిరిగొచ్చినా నీ భర్తవాటా ఆస్థిమీకు అప్పగించాలని అలాగే ఉంచారు.అపోహలు వద్దు తల్లీ. ఈ రోజు మీరింత ఉన్నత స్థితిలో ఉన్నారంటే నాకు చాలా గర్వంగా ఉంది. నీ భర్త పట్టుదల కృషి అర్ధమవుతుంది. మీరు కోయంబత్తూరు వస్తే అంతా అక్కున చేర్చుకునే వాళ్ళేగాని మిమ్మల్ని ద్వేషించేవాళ్ళిపుడు ఎవరులేరు. మిమ్మల్ని చూస్తే వెంకటరత్నం నాయుడుదంపతులు ఎంత ఆనందిస్తారో నాకు తెలుసు’’... అంటూ మునుసామి కాంచనమాలకు నచ్చచెప్పే ప్రయత్నంచేస్తున్నాడు.

ఇంతలో ఉన్నట్టుండి వేగంగా పరుగెత్తింది విశాల. ఎందుకంటే ఓపిక లేకపోయినా ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆత్రంలో రెయిలింగ్ ను పట్టుకొని నెమ్మదిగా మెట్లు దిగుతున్న సహస్రను ఆమె చూసింది. వేగంగా పరుగెత్తి మెట్లమీద ఎదరువెళ్ళి తూలుతున్న సహస్రను ఒడిసి పట్టుకుంది. ఈలోపల ఏమైందో అర్దంగాక అటు చూసారంతా.

‘‘అక్కా! నేవచ్చి చెప్తానన్నాను గదా. ఇంత నీరసంతో నువ్వెందుకు మెట్లు దిగిరావటం?’’ అంటూ కోప్పడిం ది విశాల.

‘‘నేను కళ్ళు తెరవగానే చూసి ఎవరమ్మా నువ్వని అడిగితే నేను నీ అమ్మలాంటి దాన్నే అంది. అలాంటి అమ్మకి ఏకష్టం వచ్చిందో ఎందుకు ఏడుస్తోందో తెలుసుకోవాలని నాకుమాత్రం ఆరాటంగా ఉండదా?’’ అంది సహస్ర.

‘‘కష్టం ఏమీ లేదక్కా. సంతోషించే విషయమే. మమ్మీకి గతం గుర్తొచ్చి ఏడ్చింది. మునుసామి మూలంగా ఈ విషయం ఇప్పుడు బయటపడింది. మమ్మీ వెంకటరత్నం నాయుడుగారి చెల్లెలు. విరాట్ ఎవరోకాదు. మమ్మీకి మేనల్లుడు. నాకు బావ’’ అంటూ జరిగింది క్లుప్తంగా వివరించింది విశాల.

ఆ మాటలకు...

సహస్ర కూడ సంతోషించింది.

‘‘ఇకనేం శుభవార్త చెప్పావ్. వాడు నీకు బావయితే నాకు బావేకదా. పద నన్నక్కడకి తీసుకెళ్ళు’’ అంటూ విశాల భుజం మీద చెయ్యేసి పట్టుకుంది సహస్ర. జాగ్రత్తగా మెట్లు దించి సహస్రను కాంచనమాల గదిలోకి తీసుకెళ్ళింది విశాల. ఇక ఆ తర్వాత ఆనందంతో హేపీగా కబుర్లలో మునిగిపోయారంతా.

సియం శెల్వి చెందామరై మరునాడు మరోమారు విరాట్కి ఫోన్ చేసుండేదేమో. కాని ఆ రోజు నుంచి పక్షం రోజులపాటు అసెంబ్లీ సమావేశాలుండటంతో తిరిగి ఫోన్ చేయలేదు. కాని విరాట్ కిచ్చిన మాట నిలబెట్టుకుందామె. సియం ఆర్డర్ తో అరెస్టయిన కదిరేషన్ మునుసామి మనుషులు అయిదుగుర్ని ఆ ఉదయమే వదిలేసారు పోలీసులు. వాళ్ళు క్షేమంగా తిరిగి రావటంతో అంతా సంతోషించారు.

*******************************

ఆ రోజు ఉదయం పదకొండు గంటలకు..

తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు.

గందరగోళంగా ఆరంభమయ్యాయి.

మధురై అల్లర్ల సంఘటన ప్రతి పక్షాలకు ముఖ్యంగా త్యాగరాజన్ తాతగారి పార్టీకి ఒక ఆయుధంగా లభించింది. ఆ అల్లర్లను తమ పార్టీకి అనుకూలంగా మార్చుకుని అధికార పార్టీది అసమర్ధపాలన అంటూ ఎండగట్టాలన్న వ్యూహ రచనతోనే సమావేశాలకు హాజరవటం జరిగింది.
సభలో ప్రవేశపెట్టాల్సిన పెండింగు బిల్లుల్ని గాని ప్రశ్నోత్తరాల సమయాన్నిగాని అంగీకరించకుండా వాయిదా తీర్మానం పైన మధురై సంఘటనల గురించి వెంటనే చర్చ జరగాలంటూ ప్రతి పక్షాలు పట్టుబట్టాయి.

నా మనవడు త్యాగరాజన్ అమాయకుడు. చట్టాన్ని గౌరవించే వ్యక్తి. న్యాయమైన పద్ధతిలో తన వ్యాపారాలేవో తను చూసుకుంటున్నాడు. గిట్టని వాళ్ళు మా ప్రతిష్టను మా పార్టీపరువును దిగజార్చే వుద్దేశంతో తప్పుడు నేరాలను దొంగ సాక్ష్యాలను ఆపాదిస్తూ సుప్రీంకోర్టు నాశ్రయించారు. ఆ జర్నలిస్టు వెనక ఎవరు ఉందీ మాకు తెలుసు.

అయినా చట్టాన్ని గౌరవించి మౌనం వహించాం. కాని నా మనవడు మధురైలో లేని సమయంచూసి అధికార పార్టీ సానుభూతి పరుడైన మహదేవనాయకర్ అల్లరి మూకల్ని రెచ్చగొట్టి స్వయంగా ముందుండి మా ఆస్తులమీద దాడి చేయటమేగాక ఎస్టేట్ భవంతిని తగలబెట్టించటం అమానుషం. అరాచకం. ప్రభుత్వ అసమర్ధతకి పరాకాష్ట.

సకాలంలో అదనపు బలగాల్ని గాన్ని స్పెషల్ఫోర్స్ని గాని పంపించకుండా కావాలనే ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకోబట్టే మధురైలో అంతటి హింసాకాండ విధ్వంసం చోటుచేసుకున్నాయి. దీనికి తనేపూర్తి బాధ్యత వహిస్తు సభలో దీనిపై చర్చ జరగాల్సిందే. ఈ ప్రభుత్వం బదులు చెప్పాల్సిందే అంటూ చిందులుతొక్కాడు మాజీ సియం.

ఒక దశలో ఎవరేంమాట్లాడుతున్నారో అర్ధంగానంత గందరగోళం అరుపులు కేకలతో సభ హోరెత్తిపోయింది. స్పీకర్ సభ్యుల్ని  శాంతింపచేయటానికి చేసిన ప్రయత్నాలుగాని ఇచ్చిన హామీలుగాని ఏవీ పనిచేయలేదు. దాంతో మధ్యాహ్న విరామంలోపే సభ రెండుసార్లు వాయిదాపడిరది.

అయితే ఇలా జరుగుతుందని ముందే వూహించిందిగాబట్టి సియం శెల్వి చెందామరై తొందరపడలేదు. తిరిగి సభ ఆరంభంకాగానే తప్పని పరిస్థితిలో చర్చకు అనుమతిచ్చారు స్పీకర్. అప్పుడు సియం ఒక్కసారిగా ప్రతి పక్షాలమీద విరుచుకు పడిరది. చాలా ఘాటుగా ప్రతిస్పందిస్తూ గతంలో మాజీ సియంగారి హయాంలో ఆయన రెచ్చగొట్టిన అల్లర్లు చేసిన ఘనకార్యాల గురించి ఆధారాలతోసహా సభలో బయటపెట్టి ప్రతిపక్షాల నోళ్ళు మూయించే ప్రయత్నం చేసింది.

ఇలా ఓ పక్క అక్కడ అసెంబ్లీ సమావేశాలు హాటు హాటుగా ఘాటుగా సాగుతుంటే, మరో పక్క కూల్ కూల్గా సమాధాలిస్తున్న త్యాగరాజన్ లైవ్ ఇంటర్వూను ఒక ప్రయివేట్ టివి ఛానల్ వాళ్ళు ప్రసారం చేయటం ఆరంభించారు.

ఆ ఇంటర్వూని ఓల్డ్ మాంబళం ముదలియార్ స్ట్రీట్లోని ఇంట్లో వున్న విరాట్, సహస్ర, విశాల అంతా ఆసక్తిగా వీక్షింపసాగారు. మధురైలో నిన్న జరిగిన అల్లర్లకు కారణం ఏమిటంటారు? ఇంటర్వూ చేస్తున్న వ్యక్తి చాలాహుషారైన వాడు. ప్రశ్నల్ని సూటిగా సంధించటంలో దిట్ట. అతడి ప్రశ్నవిని చిరునవ్వుతో భుజాలెగరేసాడు త్యాగరాజన్.

ఈ విషయం నాకన్నా మీకే ఎక్కువ తెలియాలి. నేను వాస్తవ వాదిని. వూహించి కారణాలు చెప్పటం నాకిష్టం ఉండదు. ఆ పైన ఇక్కడ చెన్నైలో వున్న నన్ను కారణాలు అడిగితే ఏం చెప్పగలను అన్నాడు.

కాని మీరు మధురైలోనే ఉన్నారని అల్లర్లు ఆరంభంకాగానే మీరు అక్కడినుంచి చెన్నైకి పారిపోయి వచ్చేసారని ఓమాట జనంలో వినబడుతోంది. దీని మీద మీస్పందన ఏమిటి?

ఇంటర్వూ చేస్తున్న వ్యక్తి చాలా సూటిగా ముఖమాటంలేకుండా అడిగిన ప్రశ్నయిది దీనిక్కూడ ఏమాత్రం తొణక్కుండా చిరునవ్వు నవ్వాడు త్యాగరాజన్్.

సమస్యల్ని ఫేస్ చేయటమేగాని పారిపోవటం అంటే ఏమిటో  నాకింతవరకు తెలీదు. అయినా పారిపోయి రావాలసిన అవసరం నాకేముంది? తప్పుచేసిన వాళ్ళే భయపడి పారిపోతారు. నేనే తప్పుచేయలేదు మీరు విన్నది అవాస్తవం. కట్టుకథ. నిజానికి నేను మధురైలోనే ఉండుంటే పరిస్థితి అంత ఘోరంగా ఉండేదికాదు.

ఇక్కడ మా హెడ్డాఫీసులో పనిమీద నాలుగురోజుల క్రితమే నేను చెన్నై వచ్చాను. అప్పట్నుంచి ఇక్కడే ఉన్నాను. ఉన్నానడానికి సాక్ష్యం మా ఫ్యామిలీ మా ఆఫీసు స్టాఫ్ నా ఫ్రెండ్స్, సో........నా గురించి ప్రత్యర్ధులు కావాలని చేస్తున్న దుష్ప్రచారం అది అంటూ బదులిచ్చాడు.‘‘జర్నలిస్టు లహరి అసలు పేరు లక్ష్మీ సహస్ర. ఇంట్లో సహస్రగా పిలుస్తారు. రచయిత్రి సహస్రగా కూడ ఆమెకు మంచి పేరుంది. అభిమానులున్నారు.

జర్నలిస్టు అయ్యాక తన పేరును లహరిగా పాపులర్ చేసుకుంది. ఇంతకాలం జర్నలిస్టు లహరి తన కూతురు సహస్రని మహదేవనాయకర్కు తెలీదు. మీ మనుషులే కోర్టుబయట లహరిమీద హత్యాప్రయత్నం చేసారని అందుకే ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిందని తెలిసాకే మహదేవనాయకర్ వర్గం దాడికి తెగబడిరదని మధురైలో అల్లర్లకు ప్రధాన కారణం ఇదేనని అంటున్నారు.తన ఇంటర్వూలో మహదేవనాయకర్ కూడ ఈ వి షయాన్నే ప్రస్తావించారు. ప్రస్తుతం లహరి ఇక్కడే చెన్నైలో ఎక్కడో అజ్ఞాతంగా ఉంటోంది. మొన్నటికి మొన్న తేనాంపేట రౌడీ శిఖామణి అంతటి వాడ్ని వాడి రైడీ మూకను చీల్చి చెండాడిరది కూడ ఈ సహస్రే అని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్