Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
naa preyasinipattiuste koti

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక



జరిగిన కథ: చంద్రకళ నాన్నగారు హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి వారం రోజులు గడిచినా హెల్త్ స్టేటస్ మాత్రం ఇంకా క్లియర్ గా ఎవ్వరికీ తెలియదు. మేజర్ గారిని చూడడానికి రాణి తల్లిదండ్రులు వస్తారు. ఆ తరువాత... 

 

“ఊరుకోమ్మా శారదా, నువ్వింత బాధ పడితే ఎలా?” కోటమ్మత్త అమ్మని సముదాయిస్తుంది.

ఏం జరుగుతుందో అర్ధం కాక.... వాళ్ళున్న గదికి దగ్గరగా అడుగులు వేసాను.


అంతలో భూషణ్ అంకుల్ గొంతు వినబడింది.

“చూడండి, మీరిద్దరు ఇంతగా డీలా పడకండి.  మీ పిల్లలు పసివాళ్ళు.  ఇప్పుడు వాళ్ళు ఇంట్లో లేక పోవడం నయమయింది.  మిమ్మల్ని ఇలా చూస్తే బెంబేలెత్తి పోతారు,” అన్నారాయన.

కొద్ది మౌనం తరువాత,..  “చూడు సత్యం, నీకు వచ్చిన ఈ ‘మయస్తీనగ్రావిస్’ అనే వ్యాధి మామూలుగా అయితే, ‘మజిల్ వీక్ నెస్’ అనవచ్చు.  అంటే ‘కండరాల బలహీనత’.  ఇదే హెల్త్ కండిషన్ –నాకు తెలిసిన ఓ ఆర్టిస్ట్ క్కూడా ఉంది.  వ్యాధి సోకిన తరువాత కూడా ఇరవైయేళ్ళగా సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు.  అతని జీవితం బాగానే ఉంది. కాబట్టి, నీవు మరీ అధైర్య పడే పని లేదు.

ఆర్మీ డ్యూటి నుండి విరామం తీసుకొని, కమర్షియల్ టాక్సెస్ లో పొజిషన్ తీసుకో.

పోతే, ఎటువంటి అవసరానికైనా మీకు మేమున్నామని కూడా గుర్తు పెట్టుకో,” , “ఇక బాధ పడకు...ఆల్టర్నేట్ ప్లాన్స్ ఆలోచించవోయ్,”  మళ్ళీ అంకుల్...


నా గుండెలు జారినట్టయ్యింది.  ఏడుపొచ్చింది.. నాన్నకేమయిందో...

ఇంతలో నీరసంగా నాన్న గొంతు....

“అది కాదు భూషణ్,  చంద్రకళని కళాకారిణిగా పైకి తేవాలంటే, ఇక్కడ ఎన్నో అవకాశాలతో పాటు నీ సపోర్ట్ ఉంది..  పోతే, నా సివిల్ జాబ్ కూడా, అనువైన పోస్టింగ్ రావాలంటే టైం పడుతుంది... ఫామిలీని ఇక్కడే చెన్నైలో ఉంచి, నేను వెళ్లి వస్తుండాలి.

అలా చేయాలన్నా, ఈ వ్యాధితో లైఫ్ ఎలా ఉంటుందో! ఒక కన్ను పూర్తిగా వీక్ అవ్వడంతో, అదొక పెద్ద అడ్జస్ట్ మెంట్...అంతా అగమ్య గోచరంగా ఉందోయ్,” నాన్న గొంతు కూడా బరువుగా మారింది.


“ఇంక ఊరుకో సత్యం. శారద గారిని చూడు, యేడ్చేస్తున్నారు.  ప్రస్తుతం నీది తీవ్రమైన పరిస్థితి కాదనే చెప్పారుగా!  నాకు తెలిసిన మంచి నిపుణులు ఉన్నారు.  సెకెండ్ ఒపీనియన్ కోసం మరో న్యురాలజిస్ట్ ని కూడా సంప్రదిద్దాము. కాబట్టి, అధైర్య పడవద్దని పదే పదే చెబుతున్నా, విను,”  నమ్మ పలికారు అంకుల్.

ఒక్క క్షణం అంతా మౌనం... ఏం చేయాలో తోచలేదు. అడుగు ముందుకు వేయ బోయి, ఆంటీ మాట విని ఆగాను..


“మమ్మల్ని పరాయి వాళ్లగా భావించకండి సత్య గారు. మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. చంద్ర కళ మాకు సొంత బిడ్డ లాంటిదే. ఆ అమ్మాయంటే మాకు అభిమానం, ప్రేమ,” అందామె మృదువుగా...


అమ్మ వెక్కి వెక్కి దుఃఖ పడటం వినబడుతుంది...

“శారద,.  నా తమ్ముడు బాగయి పోతాడమ్మా. నమ్మకముంచు. భూషణ్ గారు కూడా చెబుతున్నారుగా... భయ పడ వద్దని భరోసా ఇస్తున్నారుగా.  ఇక నువ్వు లేచి ముఖం కడుక్కో..క్లబ్బు నుండి బాబు,  క్లాస్ నుండి చంద్రా వచ్చేస్తారు..,” కోటమ్మత్త గొంతు...


“అవును శారద, కాస్త మీరు మనసుని కుదుట పరుచు కొండి...... ఆ రిపోర్ట్స్ లోపల పెట్టేయండి.  మనం అన్ని సంగతులు అలోచించి ముందుకు సాగుదాము,” మళ్ళీ నీరూ ఆంటీ గొంతు...


“ఇక నుండి, కొద్ది కాలం, చంద్ర కళ టెలి ఫిలిం షూటింగ్–ప్రోగ్రాముల విషయాలు పూర్తిగా నాకు వదిలేసి, నీ విషయాలు చూసుకో సత్యం,” అన్నారు అంకుల్..


“ఇంకా మూడు నెలల వరకు అయితే, మెడికల్ లీవ్ కొనసాగించమని వైద్యులే సూచించారు.  పరిస్థితిని బట్టి,  అవసరమయితే మరో మూడు నెలలు పొడిగిస్తారు కూడా,” జవాబుగా నాన్న గొంతు...

**

నేనిక గబ గబా అక్కడి నుండి కిందకి వచ్చేసాను. గేట్ వెనుక గార్డెన్ లో బెంచ్ మీద కూర్చున్నాను.

‘అసలేమిటిదంతా? ఏమవుతుంది? మెడికల్ రిపోర్ట్స్ వచ్చాయన్న మాట. నాన్నకి ఏదో వ్యాధి ఉందని తెలిసిందన్నమాట.. అంకుల్ మాటల్ని బట్టి, ఇదే వ్యాధి ఉన్న ఒకాయన బాగానే ఉన్నాడుగా! అలాగే నాన్న కూడా బాగుంటారు.

కాని, మరి తనకి ఒక కన్నుకనబడదు అంటున్నారే నాన్న?....ఆలోచనలతో కంగారుగా ఉంది. ఆపుకోలేని దుఃఖం వచ్చింది...


నాన్న హెల్త్ విషయంగా, అమ్మ వాళ్ళు, ఎవరికి ఏమి చెబుతారో, ఏమి చేస్తారో వాళ్ళిష్టం... నేను మాత్రం అన్ని విధాల వాళ్లకి సహాయంగా ఉంటాను... అంతా అయోమయంగా ఉంది.

కళ్ళు తుడుచుకుని, గేటు వైపు చూస్తూ కూర్చున్నాను....


కాసేపటికి, భూషణ్ అంకుల్ వాళ్ళ కారు గేటు ముందు నుండి కదలడం, క్లబ్ నుండి మా కార్ లోనికి రావడం ఒకే సారి జరిగాయి.

చేతిలోని కవర్ తో, పార్క్ ఏరియా నుండి కదిలి, ఫ్లాట్ కి మెట్లెక్కాను....నా వెనుకే, వినోద్ కూడా.....

**

ఇంట్లో అంతా నిశ్శబ్దం... కోటమ్మత్తే మాకు లంచ్ పెట్టింది. నాన్నెందుకు గమ్మున పడుకున్నారని అడిగాడు వినోద్. నాన్నకి నడుం నొప్పి ఎక్కువైందంటూ, కన్నన్ ని పిలిచి, అతని చేత నాన్న నడుం పట్టించింది. అమ్మకేమో బాగా తలనొప్పి, గొడవ చేయద్దంది.

లంచ్ చేసి, నేను, వినోద్ ఎవరి గదుల్లోకి వాళ్ళం వెళ్ళి పోయాము...


దిగులుగా అనిపించి, జగదీష్ కి ఫోన్ చేసాను.

“హాయ్ ట్వింకిల్ టోస్, వాట్స్ హాపెనింగ్,” అన్నాడు.

“నేనే చేద్దామనుకుంటున్నా..గ్రేట్ న్యూస్ చెప్పడానికి.. అసలు ఊహించ గలవా?  ఈ ఇయర్ చెస్ చాంపియన్ని నేనేనని.. అదీ సీనియర్ డివిజన్ లో పార్టిసిపేట్ చేసి గెలిచాను,”  అన్నాడు సంతోషంగా.......

కంగ్రాట్స్ చెప్పాను....

“ఇప్పుడు చెప్పు, ఈ టైం లో ఫోన్ చేసావంటే, ఏమిటి సంగతి.  కొత్త డాన్స్ ప్రాజెక్ట్స్ ఏమన్నా?” అడిగాడు...

“ఉన్నవే... వివరాలు, డేట్స్ తెలిసాయి....సమ్మర్ మొదటి వారంలోనే హైదరాబాద్ ప్రోగ్రాం ఉంటుంది.  రాగానే, టెలి-ఫిలిం షూటింగ్ అట. నువ్వు రాలేవుగా. యువిల్ బి మిస్డ్,” అన్నాను...


“అవును చాంద్, మరో రెండు సమ్మర్స్ వరకు ఎక్కడికీ కదల కుండా ఇక్కడ వర్క్ చేస్తేనే నా కాలేజ్ అడ్మిషన్ ఈజీ అవుతుంది.... అయినా షూటింగ్ జరిగేప్పుడు, ప్రతి రోజు ఫోన్ చేసి వివరాలు కనుక్కుంటాగా...

ఐ విల్ మిస్ యు ఎండ్ ఆల్ యువర్ డాన్స్ యాక్టివిటీ,” అన్నాడు...


అప్పుడప్పుడు నన్ను ‘చాంద్’ అని కూడా అంటుంటాడు..నాకదీ ఇష్టమే..


“అవునూ, హైదరాబాద్ ప్రోగ్రాం అంటే ఆ మూవీ స్టార్స్ తో కలిసి చేసే ప్రోగ్రామేనా?”  అడిగాడు..

అది విని నవ్వొచ్చింది...

“చాంద్, నువ్వు వాళ్ళ కన్నా బెటర్ గా చెయ్యాలి... నీ స్ట్రాంగ్ పాయింట్ – నీ అభినయం... వర్క్ ఆన్ దట్,”,  “ఇక వెళ్ళనా? జిమ్ లో ఉన్నాను, ” అన్నాడు....

జగదీష్ తో మాట్లాడాక నా మనసు కాస్త తేలికయింది...

**

ఫస్ట్ ప్రోగ్రాం కి హైదరాబాదు, అక్కడి నుండి అహ్మదా బాదుకి, మా ట్రైన్ జర్నీ ఎంజాయ్ చేసాము. మంజరి, కాంచన ఆపకుండా కబుర్లు చెప్పారు.

సినిమా హీరాయిన్స్ తో జర్నీ కూడా, సరదాగా ఓ అనుభవమే...

ప్రోగ్రాముల్లో, ముందుగా నేను కాళీయ కృష్ణుడిగా నర్తించి, తరువాతి సెగ్మెంట్ కి హెయిర్-స్టైల్, కాస్ట్యూమ్ మార్చి,  విడి గా డాన్స్ ఐటమ్స్ తో పాటు, మంజరి కాంచనలతో కలిసి అన్నమయ్య కీర్తనలు చేసాను.....


వాటిల్లో,

కులుకక నడవరో కొమ్మలారా!

జల జల రాలే నే జాజులు మా అమ్మకు, ....అనే పాట ఒకటి...


చిరుత నవ్వుల వాడు సిన్నక్క...

వీడు వెరపెరుగడు సూడవే సిన్నక్కా...అనే పాట మరోటి...


ఈ రెండు ఐటమ్స్ - ప్రోగ్రాములకి హైలైట్ అన్నారు అందరూ...

నా పర్ ఫామెన్స్ ని ఆర్గనైజర్స్, పెద్దలు విశేషంగా కొనియాడారని గురువుగారు చెప్పారు.

ఒక్కో సారి మంజరి, కాంచనల కంటే నాకే పేరు, మెప్పు వచ్చాయని కూడా ఆర్కెస్ట్రా వాళ్ళు అన్నారు.  


న్యూస్ రీవ్యులు కూడా అదే రాసాయి.  దొరికినంత వరకు ఆ రీవ్యూలు కలెక్ట్ చేసింది అమ్మ.


అలా ‘వేదికల’ మీద నాకెంతో ఇష్టమైన నాట్యం చేసి, అంత మంది ప్రేక్షకుల మన్నన పొందగలగడం చాలా అదృష్టం’ అన్నది ఎంతో నిజం...అందరూ అన్నట్టు అది ‘గాడ్స్ గిఫ్ట్’...

అని తెలుసును...చాలా ఉత్సాహాన్నిచ్చాయి మా ప్రోగ్రాములు.

**

ప్రోగ్రామ్స్ అయ్యి, చెన్నై చేరి ఇంట్లోకి అడుగు పెడుతూనే,  నా సూట్ కేస్ లోని న్యూస్ పేపర్స్ నాన్నకందించాను.  కోటమ్మత్తని కూడా వచ్చి హాల్లో మా పక్కన కూర్చోమన్నాను.

నాన్న ఆ రీవ్యూస్ చదివి ఏమంటారో వినాలని ఆత్రుతగా ఉంది.


ఒక దాని వెంట ఒకటిగా చేతి కిచ్చిన పేపర్స్ చదువుతున్న నాన్నని చూస్తూ కూర్చున్నాను.


ఎంత సేపైనా చదువుతూనే ఉన్నారు నాన్న. అమ్మ ఇక ఆగ లేక పోయింది....

“ఎంత సేపు చదువుతారు... నేను చెబుతాను వినండి, “ అంది.

“చెప్పు చెప్పు... వింటాను,” అన్నారు నాన్న నవ్వుతూ.

“మీరు చూడాల్సింది,  ఇద్దరు సినిమా స్టార్స్ మధ్య కూడా చంద్ర మెరుపు తీగలా కనబడింది... అలాగే నర్తించింది...,” అంది అమ్మ.


‘ఆ, ఔనా,’...అన్నట్టు తలాడించారు నాన్న....

.... ‘యువ నర్తకి చంద్ర కళ నాట్యం ప్రేక్షకులని మంత్ర ముగ్ధులను చేసింది.. పిన్న వయసులోనే,  ‘భామా కలాపం లేఖ’, ‘నవ రసాలు’ నృత్యాంశ్యాల్లో ఆమె చూపిన హావ భావాలు కళాభిమానులని ఆశ్చర్య పరిచింది.  ఉత్తమ నర్తకిగా చంద్రకళకి ఉజ్వల భవిష్యత్తు ఉందని ముఖ్య అతిధులుగా వచ్చిన శ్రీ స్వామీ దాసు గారు’  ప్రసంగించి,  చంద్రకళకి తమ దీవెనలు అందించారు’.... తెలుగు పేపర్ రీవ్యూ నుండి పెద్దగా చదివారు నాన్న’...


“మన చంద్రకళ హైట్, కదలికలు, అందరిలో ఉన్నతంగా ఉంటాయి మరి,”  అన్నారు.

నేను అక్కడ లేనట్టే మాట్లాడుకుంటున్న వాళ్ళని చూస్తుంటే నవ్వొచ్చింది నాకు......

**

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
death mistery