Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
naa preyasi pattiste koti

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

 

జరిగిన కథ: సెలవులో ఉండడంతో, పాత ఫర్నిచర్ తీసేసి, కొత్తవి పెట్టించే పనిలో పడుతారు చంద్రకళ నాన్నగారు. సోఫా సెట్ నుండి, బెడ్-రూమ్స్ వరకు ఓపిగ్గా సెలెక్ట్ చేసి, నాలుగు రోజుల పాటు, అందంగా అన్నీ సర్దింస్తారు.. ఆ పని అవుతూండగా  రెండు రోజులు కోటమ్మత్తతో పాలెం వెళ్ళొస్తారు ఆ తరువాత...

 

రెండేళ్ళ తరువాత....


సమయం చక చకా సాగి పోతుంది.….  గడిచిన రెండేళ్ళల్లో, మా జీవితాల్లో  కొన్ని మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. ఆరు నెలల తేడాతో,  అనారోగ్యం వల్ల, నానమ్మ, తాత చనిపోవడం, మా మనస్సుల్లో ఎంతో విషాదాన్ని కూడా నింపింది....

నాన్న, నెల్లూరులో కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ గా డ్యూటీలో ఉన్నారు. ఆయనకి వండి పెడుతూ, కోటమ్మత్త , నాన్న వద్దే నెల్లూరు లో ఉంటుంది...

దగ్గరే  అవడంతో, ఇద్దరూ తరుచుగా  చెన్నై  వచ్చి వెళుతుంటారు. 

అప్పుడప్పుడు  ఆయన ఆరోగ్యం తిరగ బెట్టినా,  విశ్రాంతి తీసుకొని కోలుకో గలుగుతున్నారు...నాతోనే కాక వినోద్ తో కూడా  తన హెల్త్ విషయం డిస్కస్ చేస్తున్నారు..నాన్న.

మ్యూజిక్ అకాడెమీ  అసోసియేట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ, అమ్మ, ఇప్పుడు వారాంతాల్లో మాత్రమే క్లాసెస్ చెబుతుంది... 

తమ్ముడు వినోద్ , హై - స్కూల్ స్పోర్ట్స్ - టీమ్ కాప్టెన్ గా, బిజీగా ఉంటున్నాడు..  
 

దాంతో, రెండు సార్లు  పాలెం వెళ్ళడం తప్ప, వెకేషన్ అంటూ మేము ఎక్కడికీ వెళ్ళక, మా వద్దకు ఎవరూ రాక చాన్నాళ్ళయింది.

**

ఇన్నాళ్ళకి, వినోద్  షెడ్యూల్ అనుకూలించడంతో, వెకేషన్ ప్లాన్ చేశాము.

తన కొడుకు వద్దకి కోటమ్మత్త, అమ్మమ్మ వాళ్ళ వద్దకి మేము  బయలుదేరాము. 

క్రిస్టమస్ సెలవలే కనుక, ఢిల్లీ నుండి జగదీష్ వాళ్ళు కూడా గుంటూరు రానున్నారు.

పొలం  విషయాలు చూసుకొని, నాలుగు రోజుల్లో,మా కన్నా ముందే చెన్నై చేర బోతుంది కోటమ్మత్త.. 

**

భోజనాలు చేసి ఇంటి నుండి బయలు దేరాము. అత్తని కర్నూల్  ట్రైన్ ఎక్కించి, మేము గుంటూర్ వెళ్ళే ట్రైన్ ఎక్కాము. 

 

బయలు దేరిన కాసేపటికే,  ట్రైన్ బాగా స్పీడ్ అందుకుంది..

అమ్మ అందించిన ఫ్రూట్ తినడమయ్యాక, నేను, వినోద్ పై బెర్తుల మీద సెటిల్ అయ్యాము.  పట్టాల మీద రైలు పరిగెడుతున్న చప్పుడు వింటూ, నవల చేతిలోకి తీసుకొన్నాను.

 

చేతిలో పుస్తకం పట్టానే కాని,  వెకేషన్  ఎలా ఉండబోతుందోనని ఆలోచించ సాగాను .....

జగదీష్ ని చూసి కూడా రెండేళ్ళకి పైనే అయింది.  ఇంచు మించు ప్రతి రోజూ మాట్లాడుతూనే ఉన్నా,  ఇన్నాళ్ళ తరువాత  జగదీష్  ని కలవడం, వారం రోజులు అందరితో గడపడం  బాగుంటుంది.   జగదీష్ తో  ఇన్-పర్సన్  మాట్లాడాలని ఉంది......

 

అమ్మ పెద్దగా నవ్వడం విని, పుస్తకం మూసేసి, కిందకి చూసాను.   నాన్నకి కబుర్లు చెబుతూ సంతోషంగా నవ్వుతుంది అమ్మ..

తన విద్యకు తగ్గ హోదా లభించినందుకు, అమ్మ సంతోషంగా ఉంది..  నాన్న హెల్త్ విషయంగా కూడా ఆమె మనసు కాస్త కుదుట పడింది...

అన్నిటా  అంకుల్ వాళ్ళ సలహా, అమ్మ తీసుకుంటే,  అంకుల్ని తన ‘లైఫ్-లైన్’ అంటుంటారు, నాన్న.  భూషణ్ అంకుల్ పైన అంతటి గౌరవం, అభిమానం పెంచుకున్నారు అమ్మావాళ్ళు.

 

ఆయన నాకందిస్తున్నచేయూత కూడా, ఆయన పట్ల వారికున్న అభిమానానికి ఓ కారణం.

నా కెరియర్  కి సంబంధించి, అంకుల్ ఈ కొద్ది  వ్యవధిలో ఎంతో చేసారు...

రెండు పేరున్న టి.వి చానెల్స్ తో కాంట్రాక్ట్  తీసుకొని, నెలకి రెండు ఎపిసోడ్స్ చప్పున రికార్డింగ్ చేయిస్తారు.  దాంతో, నృత్య సంగీతాలకి  ప్రాధ్యానత ఉన్న  అరగంట ఎపిసోడ్స్ కి అమ్మతో కలిసి కళా ఖండాలే సృష్టించ గలుగుతున్నాను. ఈ స్పెషల్ ఎపిసోడ్స్ కి వ్యూయర్స్ నుండి, రీవ్యూయర్స్ నుండి మంచి రేటింగ్, ప్రోత్సాహం లభిస్తున్నాయి. 

అలాగే,సాంప్రదాయ కార్యక్రమాలకి యాంకరింగ్ చేస్తుండడంతో,  ఫైనాన్షియల్ గా కూడా స్థిరత్వం వచ్చింది. 

నృత్యకళాకారిణిగా,పైస్థాయిలో గుర్తింపుఅందుకోగలిగాను.

ఈ రెండేళ్ళల్లో, ‘టూర్ ఆంధ్రప్రదేశ్’ పేరిట పది సోలో ప్రోగ్రామ్స్ భారీ ఎత్తున జరిగాయి... ఈ మధ్యనే, నాకు సన్మాన సభలు, ప్రతిష్టాత్మకంగా స్వర్ణకంకణ బహుకరణ కూడా జరిగాయి.  ఆర్ట్స్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతూ, స్వామి నాథన్ పిళ్ళై గారి వద్ద భారత నాట్యం, హంస గారి వద్ద ‘మోహిని అట్టం’ నేర్చుకుంటున్నాను. 

 

నా షూటింగ్ డేట్స్, ప్రోగ్రాం షెడ్యూల్ మానేజ్ చేసి,  నా అకౌంటింగ్ చూడ్డానికి, మూర్తి అనే మానేజర్ ని అపాయింట్ చేసారు అంకుల్.

అంతటితో ఊర్కోలేదాయన.... రెండు వారాల క్రితం  నా బర్తడే కి, నా చేత మంచి కార్ కొనిపించారు.  పేమెంట్స్ చేసుకోగల స్తోమత బేషుగ్గా ఉందంటూ నచ్చజెప్పారు.  

అయన ప్రోత్సాహానికి, మా సంతోషాలకి, మనసులోనే ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటుంటాను.

 

ఓ ప్రక్క అంకుల్ - మా ఫామిలీకి  వెన్ను దన్నులుగా  ఉండి సహాయ పడుతుంటే,  మరో ప్రక్క  రాణి,  జగదీష్ మీద ధ్యాసతో, మా అందర్నీ ఎక్కువ ఇబ్బందే పెట్టిందని తలుచుకుంటే, చాలా కోపం వస్తుంది......

రాణి గుర్తు రాగానే, నాకు తెలీకుండానే నా పిడికిలి బిగుసుకుంది..

ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాను. 

**

ఉన్నట్టుండి  కంపార్ట్ మెంట్ లో  ఎదో విరిగినట్టుగా, పెద్ద చప్పుడవడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను. అమ్మ కూడా చటక్కున లేచి కూర్చుంది.  చూస్తే, వినోద్....తన బర్త్ మీద నుండి కిందకి గెంతాడు. ఉలిక్కిపడ్డ నన్ను చూసి, “సారీ, అన్నిటికీ భయపడతారేంటి?  ...మళ్ళీ బెర్త్ మీద కెక్కేంత వరకు ఆగండి మరి,” నవ్వుతూ అక్కడి నుండి కదిలాడు...

**

గుంటూరులో ట్రైన్ దిగి,  ఇల్లు చేరేప్పటికి,  మా కోసమే వెయిట్ చేస్తున్నారు అమ్మమ్మ, తాతయ్యా.

“రెండు మూడేళ్ళల్లో పిల్లలు ఎంతలా ఎదిగారు!”  అంటూ మమ్మల్ని దగ్గరికి తీసుకున్నారు.. 

“వెళ్ళి స్నానం చేసి రండి.  అందరం కలిసి బ్రేక్ ఫాస్ట్ చేద్దాము.  అన్ని గదులు మీవే..  మీ కోసం  రేవతి వాళ్ళ కుటుంబం మొత్తం ఈ వారం రోజులు ఇక్కడ పని చేస్తారు.  అన్నీ చెప్పి చేయించుకోండి,” అన్నారు తాతయ్య.

**

రెండు రకాల టిఫిన్లు చేయించింది అమ్మమ్మ.  నాన్న కోసం కిచిడి, వెజిటబుల్ ఆమ్లెట్.   అందరికీ ఇడ్లీ సాంబార్.  

వినోద్ కి ఇష్టమని జున్ను.  

“అమ్మమ్మ నీ కుకింగ్ బెస్ట్.  నాకు దహీవడ, పెసరట్టు, మురుకులు, గులాబ్ జాం కూడా చేస్తావా?” అడిగాడు వినోద్ అమ్మమ్మని.

 

“తప్పకుండా మనవడా,” అంది నవ్వుతూ అమ్మమ్మ.

“మొన్న డిసెంబర్ పన్నెండున  పందొమ్మిదేళ్ళు  నిండాయి కదూ చంద్రకళకి! పైజామా లాల్చీలు సరే, బాగానే ఉన్నాయ్.  దాని కోసం పట్టు పరికిణీ వోణీలు కొని పెట్టాను.  ఏకంగా చీరలు కట్టినా అందంగా ఉండేటంత ఎదిగిందిగా!  నీ లాగానే ఉంది శారదా.  కాకపోతే, వాళ్ళ నాన్న రంగు వచ్చిందిలే,” అంది అమ్మమ్మ నా వంక చూస్తూ..  

 

“మీ ‘రాగం-తానం-పల్లవి’ ఎంత బాగుందని?  సీరియల్ గా రావడంతో మన వాళ్ళందరూ కూడా చూసారు... చాలా గర్వంగా ఉందమ్మా చంద్రమ్మా,” అన్నారు తాతయ్య.

నాకు సంతోషమనిపించింది. 

అమ్మమ్మ సరదాగా కబుర్లు చెబుతూనే ఉంది...

ఓ రోజు అమ్మావాళ్ళని, మామయ్యా వాళ్ళని కూర్చోబెట్టి వ్రతం చేయించాలని, ఒక రోజు అందరం  అమరావతి  గుడికి  వెళ్లాలని  ఆమె ఏర్పాట్లు చేసిందిట.. 

 

“మనది ఆ నాటి బంగళా... మీకు తెలిసిందేగా! ఎన్నో గదులు.  అందరికీ తలా ఓ గదిలా ఏర్పాటు చేసేసాము.  హాయిగా కాసేపు రిలాక్స్  అవ్వండి.  సాయంత్రానికి జగదీష్ వాళ్ళు  వచ్చేస్తారు,”  అన్నారు తాతయ్య. 

బ్రేక్ ఫాస్ట్ అయ్యే టైంకి  టైలర్ వచ్చాడు.  అంత పొద్దున్నే టైలర్ ని పిలిపించి నా కొలతలు కూడా ఇప్పించింది అమ్మమ్మ.

**

మధ్యాహ్నం భోంచేసి, సూట్ కేసు నుండి నా ల్యాప్ టాప్ తీసి కాసేపు ఇ-మెయిల్స్ చూసుకున్నాను.  నాకు ల్యాప్ టాప్ లేదని, రాణి అందరిలో గేలి చేసిన సంఘటన ఎన్నటికీ మరువలేను. 

ఆ సంఘటన జరిగిన వారం లోగానే,  నాన్న  నాకు ల్యాప్ టాప్ తెప్పించడం,  నన్ను యోగ శిక్షణలో పెట్టడం,  భూషణ్ అంకుల్ నాకో చక్కని ఇంటర్-యాక్టివ్ వెబ్-సైట్ ని, డిజైన్ చేయించడం చకచకా జరిగాయి, మరి....

 

ఆ ఒక్క సంఘటన వల్ల,  ఈనాడు నేను యోగ లెవెల్-3 పూర్తి చేసాను. 

వెబ్-సైట్ వల్ల కళా రంగాన నా కల్చరల్ యాక్టివిటీస్ ని ఫాలో అవుతున్న వారు అసంఖ్యాకంగా పెరుగుతున్నారు......

విక్రమ్, కవితలు టచ్ లో ఉంటూ, మంచి ఫ్రెండ్స్ అయ్యారు. 

ఏమైనా, రాణి వైఖరి వల్ల నాకెంతో మేలు జరిగినందుకు,  ఇప్పటికీ సంతోషిస్తుంటాను.....

 

నా లోని నృత్య కళకి, ప్రేక్షకుల నుండి ఆదరణే కాదు,  తేజశ్విని గారు, విక్రమ్ వంటి వారి స్నేహాన్నికూడా పొంద గలుగుతున్నాను..

నా జీవితంలో మరో కోణమే లేదు మరి...అని తలుచుకొని నవ్వొస్తుంది....

 

కంప్యూటర్ మూసేసి, పుస్తకం  చదువుతూ  పడుకోగానే,  నిద్ర పట్టేసింది..

**

ఎంత గాఢంగా నిద్ర పోయానో! మెల్లగా కళ్ళు తెరిచి చూసేప్పటికి, సాయంత్రం ఆరయింది.  వినోద్ కి వేరే గది ఉన్నా, నా ఎదురుగా దివాన్ మీద అడ్డంగా పడుకొని నిద్ర పోతున్నాడు.

బద్ధకంగా అనిపించినా లేచి బయటకి వచ్చి చూస్తే, అందరూ ముందు వరండాలో ఉన్నారు.  వెళ్ళి అమ్మ పక్కన కూర్చోగానే, నాకూ కాఫీ అందించింది ఆయమ్మ, రేవతి.

 

“ఇదిగో, నీ పరికిణీ వోణీలు కూడా వచ్చేసాయి. చక్కగా  ఉన్నాయి. ట్రై చేయి,” అంది అమ్మ తన పక్కనున్న ప్యాకట్  అందిస్తూ.

**

కొత్త బట్టలు వేసుకుని,  మొహం కడుక్కుని, ఫ్రెష్ అయ్యి కొత్త బట్టలు వేసుకుని, కిచెన్ లో ఉన్న అమ్మమ్మ వద్దకు వెళ్లాను.  “ఏమైనా హెల్ప్ కావాలా అమ్మమ్మ,” అడిగాను.

 

“నీ బట్టలు నచ్చాయా?” అడిగింది అలమారా నుండి స్టీల్ గ్లాసులు తీస్తూ.

“చాలా బాగున్నాయి, నాకు నచ్చాయి,” చెప్పాను.

 

చక్కగా కుందనపు బొమ్మలా ఉన్నావు వ్రతానికి, గుడికి వెళ్ళేప్పుడు కట్టుకో, అత్తయ్య వాళ్ళకి, జగదీష్ కి మనస్సుల్లో నువ్వు  తప్ప ఎవ్వరు ఉండ కూడదు,” అంటూ తల మీద ముద్దు పెట్టుకుంది అమ్మమ్మ.

అమ్మమ్మ మాటలకి కాస్త ఆశ్చర్య పోయాను కూడా.

 

“తరుచుగా ఫోన్ చేసి అత్తయ్యతో, అలాగే జగదీష్ తోనూ మాట్లాడు,” అంది.

“మాట్లాడుతూనే ఉన్నాములే అమ్మమ్మ,” అన్నాను.

 

*****

 

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్