Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vedika

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోక యాగం

జరిగిన కథ : మధ్యాన్నపు మండుటెండలో ఒక అశ్వంపై దౌడు తీస్తుంటాడో వీరుడు....అతని అశ్వంపై ఉన్న సంచార సామాగ్రిని బట్టి అతడో సుదీర్ఘ పయనం చేయబోతున్నాడని అర్థమవుతుంది..ఆ తర్వాత....

ప్రస్తుతం కొండపైన తాత్కాలికంగా మజిలీ చేసిన బిడారు నాయకుని పేరు భల్లాతకుడు. అవంతీ నగరానికి చెందినవాడు. యాభై సంవత్సరాల వయసు. ఏడడుగు ఎత్తున బలిష్టంగా పోతపోసిన నల్లనిని విగ్రహంలా వుంటాడు. చింపిరి జుత్తు, గుబురు గడ్డం, మధిర సేవించటంతో ఎర్రబారిన కళ్ళతో చూడ్డానికి రాక్షసుడ్ని తలపిస్తాడు. కాని వ్యక్తిగతంగా మనిషి చాలా మంచివాడు. విడిగా బాట సమీపంలో చెట్ల నీడన నులక మంచం మీద విశ్రమించాడు.

ఆ కాలంలో నాలుగు విధాలయిన ప్రయాణ మార్గాలుండేవి. అవి ఒకటి భూమార్గం, రెండు జలమార్గం, మూడు శంకు మార్గం, నాలుగు ఆకాశ మార్గం లేదా వాయు మార్గం.

వీటిలో భూ మార్గం, జల మార్గం అందరికి తెలిసినవే. మూడవదైన శంకుపధం అంటే అతి ప్రమాద కరమైన పర్వత సానువుల వెంట ప్రయాణం. చాలా దుర్గమమైన మార్గాలవి. ఇక నాలుగవదైన వాయు మార్గం విచిత్రమైంది.

ప్రయాణ సౌకర్యం లేని పెద్ద నదుల్ని సువిశాలమైన సముద్రపు కయ్యల్ని, నడవడానికి అవకాశం లేని భయంకరమైన లోయ ప్రాంతాల్ని దాటవలసినప్పుడు ఈ వాయు మార్గాన్ని ఎంచుకొనే వారు.

ఆ కాలంలో గండభేరుండ పక్షులనీ, రాక్షస రాబందులనీ యిలా పెద్ద పెద్ద పక్షి జాతులుండేవి. అవి గగన మార్గంలో ఆహారాన్ని వెదుక్కొంటూ నదులు, కొండలు లోయల్ని దాటి తిరుగుతూ వుంటాయి. ఆ ప్రాంతాన్ని దాటవలసి వచ్చిన మనిషి అప్పుడే చంపిన అడవి గొర్రె, దుప్పిలాంటి ఏదో ఒక జంతువు చర్మాన్ని వలిచి దాన్ని కప్పుకొని కొండ మీద పడుకునే వారు.

అటుగా వచ్చిన రాక్షస పక్షి అదేదో చచ్చిన జంతువనుకొని దాన్ని బలమైన తన గోళ్ళతో పట్టి ఎత్తుకు పోతుంది. అది లోయను లేదా కయ్యను దాటి ఆకాశంలో ప్రయాణం చేస్తూ అవతలి ప్రాంతంలోకి తన గూటికి చేరి పక్షులకి ఆహారంగా వేసేవి. ప్రయాణించిన సాహసికుడు జంతు చర్మాన్ని వాటికి వదిలి పక్షి కంట పడకుండా గూటిలోంచి తప్పించుకొని తన దారిన వెళ్ళేవాడు.

నుగురైదుగురు ప్రయాణించవలసి వచ్చినప్పుడు ఇదే విధంగా మిగిలిన వాళ్ళు కూడా వచ్చే వరకు వేచి వుండి తర్వాత తమ ఆయుధాతో గుంపుగా సాగిపోయే వారు. ఇలా శంకు పధం గాని వాయు పధం గాని రెండూ ఎంతో సాహస వంతులుగాని చేయలేరు. ఒక్కోసారి ప్రాణాలు పోయే అవకాశం వుంటుంది.

ప్రస్తుతం బిడారు నాయకుడైన భల్లాతకుడికి ఈ నాలుగు పథాలు అనుభవమే. గతంలో ఎన్నోసాహసాలు చేస్తూ సుదూర ప్రాంతాల వరకు ప్రయాణం చేసిన అనుభవం అతడిది. ఒకసారి ఇలాగే బ్రహ్మదేశం (బర్మా) ప్రయాణం చేస్తూ బ్రహ్మ పుత్రా నదిని దాట వలసి వచ్చి వాయు పధంలో వెళ్ళాడు. ఆ పక్షి గూటికి చేరే లోపలే దాని కాళ్ళ నుండి పట్టు తప్పి జారి భూమికి నూరు ధనువుల ఎత్తు నుండి కింద పడ్డాడు. అప్పట్లో చని పోవలసిన వాడు అదృష్టవశాత్తూ ఒక ఎత్తయిన వట వృక్ష శాఖల మీద పడ్డంతో బ్రతికి పోయాడు.

అప్పుడు ఎడం కాలికి తగిలిన దెబ్బ మూలంగా ఇప్పటికీ ఓ కాలు ఎత్తెత్తి వేస్తూ నడుస్తూంటాడు. అతడి అశ్వం బలిష్టమైంది కావటం చేత ఎంత దూరమైనా సునాయాసంగా అతడ్ని తీసుకు పోతూంటుంది.

వృక్ష ఛాయలో నులక మంచం మీద విశ్రమించిన భల్లాతకుడికి సేవకుడొకడు జొన్నరొట్టెలు, పట్టు తేనె ఆహారంగా అందించాడు. నులక మంచం మీద లేచి కూచుని జొన్న రొట్టెల్ని తేనెలో ముంచుకుని తిన సాగాడు భల్లాతకుడు.

వర్తకులు, సేవకులు, భల్లాతకుడి నూటయాభై మంది రక్షకులు, జంతువులు, గుర్రాల అరుపులతో ఆ మజిలీ ప్రాంతమంతా కోలాహలంగా వుంది. అంత రొణగొణ ధ్వనిలో కూడ కొండ దిగువ నుంచి బాట వెంట ఒక అశ్వం వేగంగా వస్తున్న గిట్టల శబ్ధాన్ని చెవులు పసి గట్టాయి. భోంచేస్తూనే దృష్టిని అటు సారించాడు భల్లాతకుడు.

********************************************

ఫెళ్ళున కాస్తున్న మంటుటెండలో`

రత్నగిరి వైపు నుండి కొండ పైకి సాగే బాట వెంట ఎగువన పరుగు తీస్తోందో హయము. దాని గిట్టల వెంట ఎర్రటి ధూళి ఎగసి పడుతోంది. గిట్టల శబ్ధం ప్రతిధ్వనిస్తూ చాలా దూరం విన్పిస్తోంది.

అది మచ్చల గుర్రం.

తెలుపు మీద ఎరుపు మచ్చలు కలిగిన బాడబ (ఆడు గుర్రం). సాధారణంగా ఈ జాతి గుర్రాలన్నీ బలిష్టంగా పోతరించి వుంటాయి. కాని ఈ వారువము సన్నగా నాజూగ్గా వేట జాగిలం పోలి బహు చలాకీగా వుంది.

సాధారణ అశ్వాలకన్నా కాస్త పొట్టిగా వుంది. ముఖం కాస్త పొడవుగా వుండి, ముక్కు రంద్రాలు పెద్దవి. మెడ మీది జూలు నల్లగా ఒత్తుగా వుంది. తోక మాత్రం తెల్లగా పొడవుగా కుచ్చులా వుంది. కళ్ళు పెద్దగా వుండి విచిత్రం గాను, ఆకర్షణీయం గాను వుందా హయము. చెవులు సూదుల్లా నిక్క బొడుచుకొనున్నాయి.

అది ఏ జాతి గుర్రమో అంచనా వేయటం కష్టమే గానీ దాని పరుగు చూస్తే మాత్రం ముక్కున వేలేసుకొని ఆశ్చర్య పోవలసిందే. కొండ ఎక్కేప్పుడు కూడ కాస్తయినా వేగం మందగించకుండా రొప్పుతూనే నాలుగు కాళ్ళమీద ఎగబడి దౌడు తీస్తోంది.

అటు వంటి చక్కని అశ్వం మీద ఒక లేబ్రాయపు యువకుడు ప్రయాణం చేస్తున్నాడు. సుమారు ఆరున్నర అడుగుల పొడవుంటే చినవాడు, పెద్దెనిమిదేళ్ళు మించని పసివాడు, నూనూగు మీసాలు కూడా మొలవని ముద్దులొలికే బాలుడు.

ఇప్పుడిప్పుడే యవ్వనంలో అడుగు పెడుతున్న ఆ యువకుని తలమీద నీలిరంగు అందమైన తలపాగా వుంది. దాని తోక వీపు మీదకు జారి వుంది. ఒంటినంటిపెట్టుకునుండేలా తెల్లటి వస్త్రం దట్టీ బిగించి పైన లేత పసుపు వర్ణం అంగీ తొడిగాడు. నడుం నుండి పొడవాటి ఖడ్గం వేలాడుతోంది.

గుర్రం జీనుకు ముందు భాగంలో మంచి నీటితో సొరకాయ బుర్ర వేలాడగా వెనుక భాగంలో రెండు తోలు సంచుల్లో దుస్తులు ఇతర సరంజామా వున్నాయి. కళ్ళాలు బిగిచి అతను అశ్వాన్ని నడుపుతున్న తీరు చూస్తుంటే చాలా చిన్న వయసు నుండే అతడికి గుర్రపు స్వారీలో అభ్యాసం వుందనిపిస్తుంది. ముఖం చంద్ర బింబంలా అద్భుత సౌందర్యంగా వుంది. విశాల నేత్రాలు, చక్కగా తీర్చి దిద్దినట్టు పగడాలవంటి పెదవులు, కొనదేరిన చుబుకం, అద్దాల చెక్కిళ్ళు, శంఖం వంటి మెడ, విశామైన ఛాతీ, సన్నటి నడుం చూస్తుంటే ఆ రూపంలోని అమ్మాయా లేక పసితనం వీడని బాలుడాని సందేహం ఏర్పడక మానదు.

అతడు ఏ పని మీద ఎచటికి ప్రయాణం చేస్తున్నాడో తెలీదు గాని కొండ పైకి చేరక ముందే బిడారు మజిలీ చేసిన ప్రాంతం నుండి కోలాహలం గమనించాడు. కొండ పైకి చేరగానే గుర్రం వేగం మందగింప చేస్తూ ముందుకొచ్చాడు.

కొద్ది సేపట్లోనే మచ్చల గుర్రం బిడారు విడిది చేసిన చోటుకి చేరుకుంది. బాట పక్కనే నీడన తీరిగ్గా కూచుని భోం చేస్తున్న భల్లాతకుడ్ని గుర్తించి చెంగున తన అశ్వాన్ని దిగాడా యువకుడు. కళ్ళాలు జీనుకు తగిలించి అశ్వాముఖాన్ని ముద్దాడి భుజం తట్టాడు. ‘‘ఎక్కడికీ వెళ్ళకు ఇప్పుడే వచ్చెద’’ అంటూ అశ్వం చెవిలో చెప్పి నేరుగా భల్లాతకుడి ముందుకి నడిచాడు.

భల్లాతకుడు ఆశ్చర్య సంభ్రమాలతో అతడ్నే చూస్తున్నాడు.

ఎవడీ యువకిశోరం!

రూపం బాలుడిలా వున్నప్పటికీ నడకలో వయ్యారం ఆ సుకుమారం చూస్తుంటే బాలిక అనిపిస్తున్నదే. ఇంతటి కుసుమ కోమలంగా ఆగుపిస్తున్నాడు. మండుటెండలో ఏ కార్యార్థియై ఒంటిగా ఈ మహారణ్యంలో ప్రయాణిస్తున్నాడో గదా. ఇలా చిత్ర విచిత్రములైన అనేక ఆలోచనలు ముట్టడిస్తుండగా భల్లాతకుడు ఆ యువకుడ్నే తదేకంగా చూస్తున్నాడు.

అతడ్ని సమీపిస్తూనే ఆ యువకుడు సవినయంగా నమస్కరించాడు. ‘‘బిడారు అధినాయకులు, అవంతీ పురవాసులగు శ్రీ భల్లాతకులవారికి ప్రణామములు’’ అంటూ చిరునవ్వుతో పలకరించాడు.

ఆ వినయ విధేయతలు భల్లాతకుడ్ని ముగ్ధుడ్ని చేసాయి. ‘‘బాలకా.. ఎవరు నీవు? నిన్నెప్పుడూ చూసిన గుర్తు లేదే. నేన్నీకు తెలుసా?’’ అనడిగాడు సంభ్రమంగా.

‘‘నేను మీకు తెలియక పోవచ్చును బాబాయ్‌. కాని మీరు సామాన్యులు కాదు గదా. ఈ రత్నగిరి నగరం నుండి అవంతీ పురం వరకు ఈ మార్గంలో మిమ్మల్ని, మీ బిడారును తెలియని వారుందురా? నాకో చిన్న సమాచారం కావాలి. అందుకే మీ దర్శనం కోసం ఆగితి’’ అన్నాడు దరహాసంతో.

ఆ మాటలకు మరీ ముగ్ధుడయ్యాడు భల్లాతకుడు. కాని ఆ గొంతు వింటూ మరోసారి సందేహానికి గురయ్యాడు. ఎందుకంటే, ఆ గొంతు మావి చిగురులు మెక్కి గానం చేస్తున్న ఎలకోయిల గోంతులా మధురంగా వుంది. ఈ వయసుకి ఈ అబ్బాయి గొంతు పురుష స్వరంలా మారాలి. కాని అలా మార లేదంటే తన సందేహం నిజం కాదు గదా! తను పొరబడుతున్నాడా లేక` ఇతడు అబ్బాయి కాదు, అమ్మాయేనా? తాత్కాలికంగా తన సందేహాన్ని పక్కన పెట్టి`

‘‘ఇంతకీ నీ నామ దేయం ఏమిట్రా అబ్బాయ్‌. బాబాయ్‌ అంటూ వరస కలిపి మరీ దగ్గరయ్యావ్‌. రా.. యిలా కూచో’’ అంటూ ఎదురుగా తిన్నె చూపించాడు.

‘‘లేదు బాబాయ్‌... నేను వెళ్ళాలి...’’

‘‘వెళ్ళొచ్చునులే. నీ నామధేయం ఏమి?’’

‘‘అపర్ణుడు’’

‘‘అపర్ణుడా?’’

‘‘అవును అపర్ణుడే. ఏమా సందేహము?’’

‘‘ఏం లేదు గాని పర్ణం అంటే పత్రము. ఆకు అని గదా అర్థము. అపర్ణము అనగా ఆకు కానిది అని గదా. నీవు ఆకు గాకున్న వేరేమి?’’ అంటూ ఛలోక్తిగా అడిగాడు భల్లాతకుడు.

ఆ మాటలకు ఫక్కున నవ్వాడు అపర్ణుడు. అతడి నవ్వు ముఖం చూస్తుంటే మరింత అందంగా వున్నాడనిపించింది భల్లాతకుడికి.

‘‘బాబాయ్‌... అపర్ణ అంటే అమ్మవారు పార్వతీ దేవికి గల పేర్లలో ఒకటి. ఆ పేరు ఎలా వచ్చిందన్నది పక్కన పెడితే వృక్షం యొక్క ప్రధాన అంగాల్లో పత్రం ఒకటి... అవునా?’’ అనడిగాడు.

‘‘అవును.. అయితే?’’ ఆసక్తిగా అడిగాడు భల్లాతకుడు.

‘‘చెట్టుకు పుట్టినది ఆకులు మాత్రమేనా... ఇంకేమీ లేవా?’’

‘‘లేకేమి? పూత, పూలు, పిందె, కాయలు, పండ్లు....’’

‘‘అవును గదా. నేను అపర్ణుడను. ఆకును కానంటే మిగిలిన వాటిలో ఏదో ఒకటనే అర్థం వుంది గదా?’’

‘‘అవునవును వుంది.’’ అంటూ పెద్ద పెట్టున నవ్వాడు భల్లాతకుడు.

‘‘భలే చెప్పావ్‌ అబ్బాయ్‌. నువ్వు పత్రం కాదు అంటే పనస పండులా వున్నావ్‌. నిన్ను పండు అని పిలవచ్చు.’’ అంటూ మళ్ళీ నవ్వాడు. అపర్ణుడు కూడా నవ్వాడు.

‘‘నీలో అందమే కాదు, అద్భుత వాక్చాతుర్యం, తెలివితేటలు కన్పిస్తున్నాయి. నీ రాక మాకు చాలా సంతోషం’’ అన్నాడు నవ్వాపుకొంటూ. ఇంకా తనే`

‘‘చూడు అపర్ణుడా! అతిధి దేవోభవ అన్నారు పెద్దలు. భోజనం వేళకొచ్చిన నువ్వు మా అతిధివయ్యావు. ముందు భోంచేస్తే తర్వాత మాట్లాడుకుందాం. ఆ పక్క మంచినీటి చెలమ వుంది, వెళ్ళి ముఖం కరచరణాలు ప్రక్షాళనం చేసుకొని రా. ఉష్ణ తాపం ఉపశమిస్తుంది వెళ్ళిరా.’’ అన్నాడు.

అతడి మాట కాదనలేక నీటి చెలమ వద్దకెళ్ళి ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కుని వచ్చాడు అపర్ణుడు. అతను తిరిగి వచ్చే సరికి ఆకులో నాలుగు జొన్నరొట్టెలు, దొన్నెలో పట్టు తేనె సిద్ధంగా వున్నాయి. అతడి మచ్చల గుర్రానికి దాణా యివ్వబడింది.

అపర్ణుడు తీరిగ్గా జొన్నరొట్టెలు తినసాగాడు.

‘‘ఇప్పుడు చెప్పవయ్యా. నన్నేదో అడగాలన్నావ్‌ అడుగు.’’ భోజనం ముగించిన భల్లాతకుడు చేయి కడుక్కుని వచ్చి కూచుంటూ అడిగాడు.

‘‘ఏం లేదు బాబాయ్‌. మీరు వచ్చే దారిలో తెల్లటి పవనాశ్వం మీద ఎవరైనా యోధుడు ఎదురయ్యాడా? ఎంత దూరంలో కన్పించాడో చెప్పండి.’’ అన్నాడు అపర్ణుడు.

భల్లాతకుడి కనుబొమలు విశాలమయ్యాయి ఆ మాటలకి. ఆశ్చర్యంగా అపర్ణుడ్ని చూసాడు.

‘‘నువ్వడుగుతున్నది రత్నగిరి యువరాజు ధనుంజయుల వారి గురించి కాదు గదా?’’ అన్నాడు.

‘‘కాక పోవటమేమి... వారి గురించే అడుగుచున్నాను. వారిని ఎరుగుదువా?’’

‘‘ఆహాఁ... పరిచయ భాగ్యం లేదు గాని రత్నగిరి వచ్చిన కొన్ని సందర్భాలలో వారిని చూచినానులే. ఇంతకూ వారితో నీకేమీ పని?’’

‘‘నేను ధనుంజయులవారి మిత్రుడను. ఆయన కన్పించినాడా లేదా?’’

‘‘సందేహమేల? కన్పించాడు. అర్ధ జాము క్రితం అదో, ఆ ఎగువ కొండకు పోవు మార్గమున మాకు అశ్వము మీద పోతూ ఎదురైనాడు. నీ మచ్చల గుర్రం యువరాజా వారి శ్వేతాశ్వాన్ని ఈ రోజుకు చేరుట దుర్లభమే.’’

భోజనం ముగించి చేయి కడుక్కున్న అపర్ణుడు భల్లాతకుడితో ఏదో చెప్పబోతూ ఆగి, చెవులు రిక్కించాడు. ఎక్కడో దూరం నుంచి భూకంపం వచ్చినట్టు, పిడుగులు వర్షిస్తున్నట్టుగా అనేక అశ్వాలు ఏకకాలంలో దౌడు తీసి వస్తున్నట్టుగా కర్ణాకర్ణిగా విన వచ్చిందో శబ్ధం. అది వినగానే అపర్ణుడి ముఖం గంభీరంగా మారి పోయింది. అది గమనించాడు భల్లాతకుడు. లేచి దగ్గరకొస్తూ` ‘‘ఏమైంది?’’ అనడిగాడు.

‘‘నా అంచనా సరైనదైతే ఏదో సైనిక పటాలం ఒకటి అశ్వాల మీద ఇటుగా వస్తోంది’’ అంటూ వేగిరం బాట మీదకు పోయి, కొండ దిగువకు దృష్టి సారించాడు. అది కొండ పైభాగం గాబట్టి అక్కడి నుంచి చాలా దూరం చూడ గలుగుతున్నారు.

దూరంగా బాట వెంట ఎర్రటి ధూళి మబ్బులా ఎగసి పడుతోంది. సుమారు నూరు మంది సైనికులతో కూడిన అశ్విక దళం ఒకటి శరవేగంతో దూసుకొస్తోంది. అగ్ర భాగంలోని అశ్వం నుండి ఎత్తుగా వున్న జెండా కొయ్యకు పెద్ద పసుపు రంగు పతాకం రెపరెపలాడుతోంది. అది రత్నగిరి రాజ్య పతాక. దాని మధ్యలో ఎరుపు రంగు వజ్రం రాజ చిహ్నంగా ముద్రించి వుంటుంది. సందేహం లేదు, అది రత్నగిరి అశ్విక దళం. అది యువరాజు ధనుంజయుల వారి కోసమే బయలుదేరి వుండాలి.

తీవ్రంగా ఆలోచిస్తున్న అపర్ణుడు చివ్వున తిరిగి చూసే సరికి భల్లాతకుడు పక్క కొచ్చి కన్పించాడు. అతను కూడ ఆశ్చర్య సంభ్రమాలతో ఆ అశ్విక దళాన్నే చూస్తున్నాడు.

‘‘సందేహం లేదు, అది రత్న గిరి అశ్విక దళం. వాళ్ళంతా సైనిక శిబిరాలు వదిలి యుద్ధ సన్నాహాలతో ఇటు వస్తున్నట్టుందే... ఏదన్నా యుద్ధం ఒన గూడినదా? రత్నగిరిపై దాడి జరిపేంత ధైర్యం ఏ రాజ్యానికున్నది?’’ తనలో తను అనుకుంటూ, అపర్ణుడిని చూసాడు.

‘‘లేదు లేదు. ఇది యుద్ధ సంరంభం కాదు’’ అన్నాడు వెంటనే అపర్ణుడు.

‘‘యుద్ధ సంరంభం కాదా?’’

‘‘కాదంటిని గదా. వేరే కారణముండు. నాకు అట్టే సమయము లేదు. నేను బయలుదేరుచున్నాను. బాబాయ్‌ మీ ఆతిథ్యానికి కృతజ్ఞుడను’’ అంటూ మరో మాటకి అవకాశం యివ్వకుండా చెంగున ఎగిరి తన మచ్చలగుర్రాన్నధిరోహించాడు. కళ్ళాలు అందుకోగానే తన యజమాని ఉద్దేశం గ్రహించినట్టు గాలితో పోటీ పడుతూ పరుగు అందుకుందా అశ్వం.

భల్లాతకుడికి ఏమీ అర్థం కాలేదు. అటు వస్తున్న అశ్విక దళాన్ని, ఇటు వెళ్తున్న అపర్ణుడి మచ్చల గుర్రాన్ని మార్చి మార్చి చూస్తు` ‘‘ఇది యుద్ధ సంరంభం కాదా` వేరే కారణముందా? అదేమై వుంటుంది. అదేమిటో చెప్పకుండా వెళ్ళిపోతున్నాడే అపర్ణుడు... నీవు సామాన్యుడవు కాదురా...’’ అంటూ అయోమయంగా జుత్తు పీక్కున్నాడు. అప్పటికే మచ్చల గుర్రం బాట వెంట శర వేగంతో కొండ దిగువలో అదృశ్యమైంది.

********************************************

రత్నగిరి యువరాజులుం గారు... శ్రీ శ్రీ శ్రీ ధనుంజయుల వారికి జయహో జయహో... ప్రణామములు ప్రభూ.’’

శ్వేతాశ్వాన్ని సమీపించగానే`

మర్యాద పూర్వకంగా తను అధివశించిన కంచర గాడిదను దిగి సవినయంగా వంగి నమస్కరించాడా నాగా వృద్ధ నాయకుడు. నిశితంగా అతన్నే చూస్తున్నాడు యువరాజు ధనుంజయుడు. ఆ నాగా తీరు కొంచెం కూడ అతనికి అర్థం గావటం లేదు. పోరుకు తెగబడి వచ్చిన వాళ్ళు పోరాడకుండా ఈ రాయబారములేమి?

‘‘మీరంతా నాగాలని, నీవు వీళ్ళ నాయకుడవని అర్థమవుతోంది....’’ ధనుంజయుడు ఇంకా ఏదో చెప్పబోతూండగా వృద్ధనాయకుడు అడ్డం వస్తూ`

‘‘అవును ప్రభూ! నేను వీళ్ళకు మాత్రమే నాయకుడను. మా అసలు నాయకుడు వేరే వున్నాడు. ఆయన పేరు నాగకేసరి. నా పేరు నాగనందుడు’’ అన్నాడు.

‘‘మంచిది. అయితే నాకు అవగతము గాని విషయం ఒకటే! మా రాజ్య భూభాగంలో ఇంత వరకు మీ ఉనికి మాకు తెలీక పోవుట మా అజాగ్రత్త కావచ్చును. కాని... ఉత్తర ఈశాన్యంలో, కొండ కోనల్లో సుదూరంలో ఎక్కడో వుండాల్సిన మీరు ఇక్కడికెందుకొచ్చారు? నా ప్రయాణమునకు అవరోధము కల్పించ కారణం ఏమి? కదన కుతూహలంతో కాలు దువ్వే నీ మనుషులు పోరు ఆరంభించరేమి? అయిననూ మీకును మాకును గత శత్రుత్వములు ఏమియును లేవు గదా! అసలేమి జరుగుతోందిక్కడ?’’ కాస్త స్వరం పెంచి నిలదీస్తున్నట్టుగా అడిగాడు ధనుంజయుడు.

‘‘యువ రాజా వారు క్షమించాలి. తమతో సమరం మా అభిమతం కాదు’’ అన్నాడు నాగానందుడు.

‘‘గాకున్న వేరేమి? అనవసర కాల విలంబన దేనికి? మమ్ము నిలువరింప పని యేమి?’’ వెంటనే అడిగాడు ధనుంజయుడు.

‘‘తగిన కారణముండు ప్రభు. మీరిలా కారడవులబడి యిడుములు పడుట మా అధినాయకునికి నప్పలేదు. అందుకే మీకో హెచ్చరిక  దించమని మా నాయకుడు నాగకేసరి పంపగా యిలా మీ ముందుకొచ్చినాము యువరాజా. మీతో పోరు సలుపునంత వారము కాము గాని, సమరమే శరణ్యమన్న అందుకు సిద్ధపడే వచ్చినాము’’ అంటూ నర్మ గర్భంగా పలికిన నాగానందుని మాటలు యువరాజు ధనుంజయుని ఆలోచనలో పడేసాయి.

ఎక్కడి నాగా నివాసం, ఎక్కడి రత్నగిరి రాజ్యం. తను తమ కోట విడిచి ఇది రెండో రోజే. ఇంతలోనే ఈ వార్త నాగాలకు ఎలా చేరింది? అంత దూరం నుండి వీళ్ళిచ్చటికి ఎలా రాగలిగారు? నాగ కేసరి తనకు పంపిన హెచ్చరిక సందేశం ఏమై వుంటుంది? తన కదలికల్ని సుదూర ప్రాంతంలో వుండి కూడా నాగాలు ఎప్పటికప్పుడు ఎలా గమనించ గలుగు తున్నారు? ఎంతగా ఆలోచించినా ఒక ప్రశ్నకీ ధనుంజయకు సమాధానం లభించటం లేదు. విషయం ఏమిటో నేరుగా అడిగి తెలుసుకోవటం తప్ప మరో దారి లేదు.

‘‘ఇంతకీ మీ నాయకుని హెచ్చరిక సందేశమేమి?’’ సూటిగా విషయాని కొస్తూ అడిగాడు.

నాగానందుడు ఓసారి గొంతును సవరించుకున్నాడు.

‘‘క్షమించండి యువరాజా! నిజానికి ఇది మా నాయకుని హెచ్చరిక కూడ కాదు. అధినాయకుని హెచ్చరిక’’ అన్నాడు.

‘‘ఎవరా అధినాయకుడు?’’ ముంచుకొస్తున్న కోపాన్ని నిగ్రహించుకొంటూ అడిగాడు. సహనానికీ ఓ హద్దుంటుంది. తన సహనాన్ని పరీక్షిస్తున్నారీ నాగాలు.

‘‘నాగలోకాన్ని పరిపాలించే నాగరాజు ప్రభువులే మా అధినాయకులు’’ చెప్పాడు నాగానందుడు.

‘‘నాగరాజా....’’ విస్తుపోయాడు ధనుంజయుడు. ‘‘అవును. నాగరాజు... ఫణీంద్రుడు... మహాపద్ముడు.. ప్రత్యక్షదైవం. మా నాగాల కులదైవం. మా నాయకుడు నాగకేసరి ఆ స్వామికి పరమ భక్తుడు. ఆ స్వామి హెచ్చరిక సందేశాన్నే మీకు చెప్పమని మమ్మల్ని పంపించారు. మీకెవ్వరికీ లేని నాగ లోక ప్రవేశార్హత మా నాగకేసరి నాయకునికుంది.’’

‘‘ఇంతకీ మమ్మల్ని హెచ్చరింప వలసిన అగత్యం మీ నాగరేడు కెందుకొచ్చినది?’’

‘‘అది వారికే తెలియాలి ప్రభూ. కాని వారి హెచ్చరిక సారాంశం మాత్రం యిదే` ఓ రత్నగిరి యువరాజా ధనుంజయా. విధిరాతను అల్ప మానవులు తప్పించ లేరు, తప్పించు కోజాలరు. నాడు అంతటి నీ జేజితాత గారైన పరీక్షిత్తు మహారాజే విధిని తప్పించు కోలేక తక్షకుని మూలంగా మరణించాడు. ఇక నీ తండ్రి ధర్మతేజ మహారాజు ఎంత? ఆలోచించు. వృధా ప్రయాస వలదు.

నీ లక్ష్యాన్ని విడిచి కోటకు మరలి పొమ్ము. నిరర్థకమగు నీ లక్ష్యం కోసం నీ వయసునూ సమయాన్ని వృధా చేసుకోవలదు. ఇక నుండి మీ రాజ్య రక్షణ నీ లక్ష్యంగా వుంచుకో, శుభమవుతుంది. ఈ హెచ్చరిక కాదని ముందుకొస్తే మా ఆగ్రహాన్ని నీవు చవి చూడక తప్పదని గ్రహింపుము. తక్షణం మరలి పొమ్ము.’’ అంటూ విన్నవించాడు నాగానందుడు.

ఆ హెచ్చరిక యువరాజు ధనుంజయుని అగ్రహోదగ్ధుడ్ని చేసింది. వెంటనే కర్ణభేరీలు పగిలి పోతాయా అన్నట్టు ధనుష్టంకారం చేస్తూ అశ్వం పైనుండి ఉరిమి చూసాడు. ఆ చూపుల వేడి తట్టుకోలేక వెంటనే అయిదడుగులు వెనక్కి వేసాడు నాగా వృద్ధనాయకుడు నాగానందుడు.

‘‘అల్ప మానవులా! ఏమా అర్ధ రహిత ప్రేలాపన?’’ అనరిచాడు ధనుంజయుడు.

‘‘అతల వితల సుతల పాతాళముల గ్రుమ్మారు (నివశించు) మీ నాగ రేడుకి మతి తప్పినదా లేక భూలోక మానవుల చరిత్ర మరిచినాడా! లేక మానవుల పూజలు అందుకొంటూ మత్తెక్కి వదరినాడా. అల్ప మానవులట. ఏమా మాట? అల్ప మానవులు విధిరాతను తప్పించలేరు, తప్పించుకొనజాలరా! మానవులు అంత చులకన అయినారా! క్షత్రీయ రాజై కూడ విధిని వెక్కిరించి, రాజర్షి అయి, బ్రహ్మర్షి అయి సృష్టికి ప్రతి సృష్టి చేసిన మహర్షి విశ్వామిత్రుల వారు మానవులు కారా?

అల్పాయుష్కునిగా పుట్టి, అచంచలమగు తన శివభక్తితో మృత్యువునే జయించి చిరంజీవి అయిన మహర్షి మార్కండేయుల వారు మానవులు కాదా? యముని వెంటాడి వేధించి పతి ప్రాణాములి తెచ్చుకున్న సాధ్వి అనసూయ మానవి కాదా? అంత దేనికి దేవ దానవ యుద్ధంలో స్వర్గం వెళ్ళి మహేంద్రునికి సాయంగా యుద్ధం చేసి దానవుల్ని నిర్జించి ఇంద్రుని అర్ధ సింహాసనం అలంకరించి విజయుడను బిరుదు పొందిన పాండవ మధ్యముడు అర్జునుడు మానవుడు కాదా. ఆయన మీ వంశీకు అల్లుడు కాదా..? మీ వంశాంకురం ఉలూచిని వివాహం చేసుకోలేదా? వారి కొడుకు బబ్రువాహనుని మీరు దత్తత తీసుకున్నది నిజము కాదా? భూలోకమందలి నాగాజాతి ప్రజల మూల పురుషుడు బబ్రువాహనుడని మీకు తెలియదా? ఎవరు అల్పులు. కన్పించగానే కర్ర పుచ్చుకొంటే ఆమడ దూరం పారిపోయే అల్ప సర్పజాతులకు రాజువైన నీకే అంత అహంకారమైతే రత్నగిరి రాజ్య భావి సామ్రాట్టుని మాకెంత అహంకారం వుండాలి? త్వరలోనే మీ నాగలోకం వస్తాను. మానవులు అల్పులు కారు అధికులని నిరూపిస్తాను. నాగ, గరుడ, యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వ, దేవ, భూతాల్లో ఎవరైనా గాని మానవ జాతితో ముడి పడకుండా మనుగడ లేదని మీ నాగరాజుకి నా మాటగా చెప్పు...’’ అంటూ వీరావేశంతో పలికిన యువరాజు మాటలకి ముగ్ధుడైన నాగనందునికి నోట కొద్దిసేపు మాట రాలేదు.

‘‘మీ ఆవేశం అర్థం చేసుకోగలను యువరాజా! కాని మేము నిమిత్త మాత్రులం గదా. మీ ఆవేశ పూరిత ప్రసంగం ఖచ్చితంగా మా నాయకుడు నాగకేసరి, అధినాయకుడు నాగరాజు ఫణీంద్రుడు వినే వుంటారు. అయిననూ...’’ అంటూ ఆపైన చెప్పడానికి ఒకింత సందేహించాడు నాగానందుడు.

‘‘ఊఁ.... అయిననూ.... సందేహమేల. వచింపుము వృద్ధ నాయకా. నన్ను వెను తిరిగి పొమ్మందువా?’’ ఒకింత పరిహాసంగా అడిగాడు ధనుంజయుడు.

‘‘లేదు యువరాజా! మిమ్మల్ని వెనక్కి పొమ్మను సాహసం చేయను. అలాగని ముందుకూ పోనివ్వ. మావాళ్ళు మిమ్ము వెళ్ళనివ్వరు.’’ అన్నాడు తన కంచర గాడిద కళ్ళాలు అందుకుంటూ.

తిరిగి అదే సందిగ్ధత.

ఏమిటీ వృద్ధుడి వుద్దేశం?

తనను వెనక్కి పొమ్మనడట. అలాగని ముందుకీ పోనివ్వడట. అంటే పోరుకి సిద్ధ పడినట్టే గదా.

 

ఈ ఉంత్కంఠ  వచ్చేవారం దాకా.........

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్