Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
death mistery

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

 

గతసంచికలో ఏం జరిగిందంటే..  http://www.gotelugu.com/issue138/390/telugu-serials/nagaloka-yagam/nagalokayagam/
 

‘‘స్వామీ నేనో మాటడుగుతాను చెప్పండి. మన ధర్మతేజ ప్రభువుల వారి ఏలుబడిలో ఈ రత్నగిరి రాజ్యాన ధర్మం నాలుగు చెరగులా వ్యాపించింది. ప్రజలు సుఖ శాంతులతో జీవిస్తున్నారు. న్యాయం నెలకొని వుంది. రాజ్యం ఐశ్వర్య సమృద్ధమైవుంది. అవునా?’’

‘‘నిశ్చయంగా అవును. సంశయమేల?’’

‘‘నాకెలాంటి సంశయం లేదు. చిన్నవాడ్ని. మీ అంత అనుభవం నాకు లేదు. కాని ఎందుకు అడుగుతున్నానో ఆలోచించి బదులివ్వండి చాలు. అశేష సిరి సంపదలతో వర్ధిల్లు.  మన రత్నగిరి రాజ్యలక్ష్మికి సర్వ ధర్మాలు తెలుసు. ఆ తల్లి అబద్ధం చెప్పదు. మీకు నమ్మకం వుంది కదా?’’

‘‘వుంది’’ అన్నాడు వెంటనే కరివీరుడు.

ఆ సంభాషణ వింటున్న ధనుంజయునికి అపర్ణుడి ఉద్దేశం ఏమిటో బోధపడక అయోమయంగా చూస్తున్నాడు. విషయం ఎక్కడికి పోతోందో అర్థంగావటం లేదు. కాని ఒక్కటి మాత్రం స్పష్టంగా అర్థమైంది. అపర్ణుడి వాక్చాతుర్యం ఎదుటివారిని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. క్షణాల్లో సమస్యను అన్ని కోణాల నుండి పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుని సలహా యవ్వటంలో అనుభవం నిండిన ఒక ప్రధానమంత్రి లక్షణాలు అపర్ణుడిలో కన్పిస్తున్నాయి. అందుకే అపర్ణుడు ఏం చెప్పబోతున్నాడాని ఇరుపక్షాలు ఎదురుచూస్తున్నాయి. తిరిగి గొంతు విప్పాడు అపర్ణుడు.

‘‘రత్నగిరి రాజ్యలక్ష్మికి చెందిన కొన్ని బంగారు నాణాలు నా వద్ద వున్నాయి. వాటి లోంచి ఒక నాణాన్ని తీసి బొమ్మ  బొరుసు వేస్తాను. ధర్మం  తెలిసిన రాజ్యలక్ష్మి నిర్ణయం యిరువురికీ శిరోధార్యం. బొమ్మపడితే యువరాజా వారు చెప్పినట్టు దళపతి నడుచుకోవాలి. బొరుసు పడితే దళపతి చెప్పినట్టు యువరాజా వారు నడుచుకోవాలి. రత్నగిరి రాజ్య చిహ్నమైన రత్నం  బొమ్మ. మన విదేశీ వ్యాపారానికి గుర్తుగా వెనుక పక్క ముద్రించిన ఓడ బొమ్మ బొరుసు. ఇది మీకు సమ్మతమైతే నాణెం ఎగురవేస్తాను’’ అంటూ అపర్ణుడు తన దట్టీలోంచి ఒక బంగారు నాణాన్ని బయటకు తీసి చూపించాడు. ముందు పక్క రత్నం బొమ్మ, వెనక పక్క తెరచాప ఓడ బొమ్మ  స్పష్టంగా  వున్నాయి.

‘‘నాకు సమ్మతమే’’ అన్నాడు ధనుంజయుడు.

‘‘నాకును సమ్మతం’’ అన్నాడు కరివీరుడు.

అపర్ణుడు నాణాన్ని ఎగురవేసాడు.

అది గింగిరాలు తిరిగి కొంత ఎత్తు ఎగిరి కిందపడింది. చూస్తే అది రత్నం గుర్తు. బొమ్మ. యువరాజు పక్షాన్ని సూచించింది.

కరివీరుని సంశయ నివృత్తి కోసం`

బంగారు నాణాన్ని ముమ్మారు ఎగురవేసాడు అపర్ణుడు. మూడుసార్లు బొమ్మపడి యువరాజుని సమర్థించింది నాణెం. దళపతి ఓటమి నంగీకరించి ధనుంజయుని మాటకు కట్టుబడక తప్పలేదు.

 

‘‘యువరాజా! ధర్మము మీ పక్షాన నిలిచింది. మీ మాటకు బద్ధుడును. రక్తపాత రహితముగా మన సమస్యను పరిష్కరించిన మీ మిత్రుడు ఈ అపర్ణుని మనం అభినందించాలి. ఇక ఆనతివ్వండి. మనసుకు కష్టమైనను మీ ఆనతిని ఇష్టముగా పాటించగలను.’’ అన్నాడు.

‘‘దళపతీ!  మీరు మానధనులని, అనృతము పులుక జాలరని నాకు తెలుసు. కానీ, స్త్రీ యందు, ధన, మాన, ప్రాణములకు హాని వున్న సందర్భమున బొంకవచ్చు. అది దోషము కాదని రాక్షస గురువు శుక్రా చార్యుల వారు చెప్పినది మీరూ వినే వుంటారు. ఎవరికీ హాని కలిగించని అబద్ధము దోషము కాదు.

మీ అశ్విక దళంతో మూడు నాలుగు దినములు అడవుల గ్రుమ్మరి, నేటికి అయిదో దినమునకు రత్నగిరి చేరుకోండి. నేను మీకు కనబడలేదని ప్రభువులకు మనవి చేయండి. నా జాడలు మాళవ రాజ్యం దిశగా వెళ్తున్నట్టు తెలిసి మీరు సరిహద్దుల వరకు వెళ్ళారు. కాని అప్పటికే ధనుంజయుడు సరిహద్దులు దాటి మాళవ రాజ్యంలోకి ఎటో వెళ్ళిపోయారు. జాడతెలీక మీరు వెనుతిరిగారు. మీ దళ సభ్యులు కూడ ఇదే మాట చెప్పేలా వారిని హెచ్చరించండి. ఇక నేను తిరిగి వచ్చులోన మీకెలాంటి సంకటము నేరదు. అర్థమైనది గదా?’’ అంటూ కర్తవ్యాన్ని సూచించాడు యువరాజు.

అంతకుమించి మరో మార్గం కూడ దళపతి కరివీరునికి తోచలేదు. అంతటితో శలవు తీసుకుని యువరాజును వదిలి తన అశ్విక దళంతో వెళ్ళిపోయాడు.

ఆ అశ్విక దళం కనుమరుగయ్యేంత వరకు చూసి వెనుతిరిగిన ధనుంజయ, అపర్ణులు తమ అశ్వాల వైపు అడుగులేసారు.

******************************************

ఆ రోజు మధ్యాహ్నం నాగుల దిబ్బమీద`

ఎవరూ వూహించని సంఘటనే జరిగింది.

‘ఓజో’ ప్రయోగం అర్ధాంతరంగా విఫలమైంది.

ఇది నాగాల చరిత్రలో చాలా అరుదైన సంఘటన.

ప్రయోగం విఫలమవుతున్న సూచన ముందే తెలిసిపోయింది. ధూమనాళికలోని ప్రతిరూపాలు మసక బారటం ముందుగా నాయకుడు నాగకేసరి గమనించాడు. అదే సమయంలో`

హోమగుండం మూడు పక్కలా కూచుని నిష్టగా ప్రయోగంలోవున్న కులగురువు, ఆలయాల పూజారి, గణాచారి ముగ్గురూ ఎవరో ఛెళ్ళున వీపు మీద చరిచినట్లు తృళ్ళిపడి కళ్ళు తెరిచారు. క్షణం కూడ ఆలస్యం చేయకుండా ఎగిరి వెనక్కి దూకేసారు. అదే సమయాన`

హోమగుండం ఫెళ్ళున శబ్ధం చేస్తూ అంత ఎత్తున లేచి తిరగబడింది. ఆ క్షణంలో అలా జరుగుతుందని ముందే తెలిసి హోమకర్తులు ముగ్గరూ వెనక్కి దూకి తప్పించుకున్నారు గాని లేకుంటే నిలువునా అగ్నిస్నానం చేసుండే వాళ్ళు.

అప్పటికే తన ఆసనం నుండి లేచి ‘‘ఏం జరుగుతోంది? ప్రయోగం ఎందుకు విఫలమైంది?’’ అంటూ తన  ఉరుములాటి గొంతుతో అరుస్తున్నాడు నాయకుడు. ఎవరూ బదులు చెప్పలేదు. కాసేపు నిశ్శబ్ధం అలుముకుందక్కడ. కొద్దిసేపటికి గాల్లో వ్యాపాంచిన పొగలు, ధూళి అంతరించి సాధారణ స్థితి నెలకొంది. ఇప్పుడు ధూమనాళిక అదృశ్యమైంది. అందులోని ప్రతిరూపాలూ అదృశ్యమయ్యాయి. ఈ ప్రయోగంలో పాల్గొన్న నాగానందుడు తన కంచరగాడితో దగ్గరకొస్తున్నాడు. అతన్ని అనుసరించి మిగిలిన నాగావీరులూ వస్తున్నారు.

అసలు ఇదంతా ఏమిటో, ఏం జరిగిందో అర్థంగాక నాగకుమారి శంఖుపుత్రి కనులు విప్పార్చి అయోమయంగా చూస్తోంది. నాగాల కులగురువు తన త్రిశూలం అందుకొంటూ నాయకుడు నాగకేసరి వంక గంభీరంగా చూసాడు.

‘‘నాయకా! ఇందులో మా తప్పులేదు. మన ప్రయోగాన్ని ఎవరో తిప్పికొట్టి విఫలంజేసినారు’’ అన్నాడు.

‘‘ఎవరు? ఎవరు విఫలంజేసినారు? అక్కడ రాకుమారుడు తప్ప ఎవరూలేరు గదా’’ తన భారీకాయాన్ని, ఆగ్రహాన్ని నిగ్రహించుకొంటూ అరిచాడు నాగకేసరి.

‘‘అవును నాయకా. ఎవరూ లేరు. కాని ఎవరో రాకుమారునికి సాయం చేసి తప్పించినారు. ఇది అసాధారణ విషయము. ఒజో విద్య మన నాగాల సొంతం. ప్రయోగించాలన్నా, విఫలం చేయాలన్నా మనమే చేయగలం. ఆలోచించండి’’ అంటూ హెచ్చరించాడు కులగురువు.

‘‘అంటే... మనవాళ్ళే ఎవరో రత్నగిరి వారసునికి సాయపడినారందురా?’’

‘‘అవును దొరా!’’ అన్నాడు గణాచారి.

‘‘ఎవరు చేసి వుంటారా పని? మన వాళ్ళెవరునూ గూడెం వదిలిపోలేదాయె. రాకుమారుడెక్కడనో సుదూర ప్రాంతాల్లో వున్నాడు. ఇది జరగని పని’’ అంటూ నాగానందుని వంక చూసాడు నాయకుడు.

‘‘నాగానందా! మీ ప్రతిరూపాలు అక్కడ కొండపై నున్నవి. అప్పుడు రాకుమారుడుగాక ఇంకెవరయినా అటుగా వచ్చుట చూచినారా?’’ అనడిగాడు.

నాగానందుడు ఒకింత ఆలోచించి బదులిచ్చాడు` ‘‘నాయకా! మీరడుగుతుంటే గుర్తుకొచ్చినది. సరిగా చూడలేదు గాని ఏదో ఒక మచ్చల గుర్రం  సమీపంలోకి రావటం కనిపించినది. గుర్రం మీద ఎవరున్నారో చూచే లోపలే ప్రయోగం విఫలమై, మేము వెనక్కి వచ్చినాము’’ అన్నాడు.

‘‘మచ్చల గుర్రమా?’’ సందేహంగా అడిగాడు నాగకేసరి.

‘‘అవును నాయకా. తెలుపు మీద ఎరుపు మచ్చల జాగిలంలాంటి గుర్రము’’

‘‘సందేహం లేదు. మనం కంచర గాడిదలు తప్ప అశ్వాలను ఉపయోగించము. ఆ మచ్చల గుర్రం మీద వచ్చిన వాడు సాయపడి వుండాలి.’’ కాని అతను మాత్రం మన నాగాజాతికి చెందిన వాడై వుండడు. గురునాధా మీ అభిప్రాయమేమి?’’ కుల గురువు అభిప్రాయాన్ని అడిగాడు.

‘‘ఇప్పుడే ఒక అభిప్రాయానికి వచ్చుట సరికాదు నాయకా!’’ అన్నాడు దీర్ఘంగా ఆలోచిస్తూ కుల గురువు.

‘‘మన నాగాల్లో కూడ అందరికీ ఈ విద్య తెలీదు. ఈ రహస్య విద్య కొందరికే తెలుసును. గతంలో ఎవరన్నా బయటవారికి తెలిపివున్నారేమో తెలియదు. ప్రస్తుతం మనం చేయగలిగినది ఏమీలేదు. వేచిచూచెదముగాక’’ అన్నాడు.

‘‘కాని... ఇలా అయితే ప్రభువు నాగరాజుకి నేనిచ్చిన మాట ఏమి కావలె? ఆ రాకుమారుని వెనక్కి మరలించుటకు మరో మార్గమేమి?’’ నాగకేసరి ఆత్రపడుతూ అడిగాడు.

‘‘ఆందోళన చెంద పనిలేదు నాయకా. అందుకు చాలా సమయమున్నది. రాకుమారుడు ఇంకనూ దక్షిణా పధానే వున్నాడు. తమ రాజ్య సరిహద్దులు దాటలేదు. అతడు వింధ్యాటవి దాటి ఉత్తరాపధానికొచ్చే లోన ఏదో విధంగా వెనక్కి మరలించెదము. మరొక్కపరి శుభ తిథి జూచి, మరొక్కమారు ఓజో ప్రయోగించి తగు నిర్ణయము చేసెదముగాక’’ అని చెప్పి అక్కడి నుండి నిష్క్రమించాడు నాగా కులగురువు.

క్రమంగా అంతా చెదిరిపోగా నాగకేసరి, శంఖుపుత్రి ఇరువురే మిగిలారక్కడ. బయట ఎండ తీవ్రంగా వున్నా నాయకుడి ఇంటి ముంగిట తాటి ఆకు చలువ పందిరి కింద చల్లగానే వుంది. అంతక్రితమే కొందరు నీళ్ళు చల్లి వాకిట్లో నిప్పుల్ని ఆర్పేసారు.

శంఖుపుత్రి ఇంకా అక్కడే వుండటం గమనించిన నాగకేసరి తన ఆలోచనలు పక్కనపెట్టి తిరిగి కూచుని ఆమె వంక చూసాడు.

అప్పటికింకా విభ్రాంతి నుండి శంఖుపుత్రి బయటపడినట్టు లేదు. తేరి విప్పార్చిన నేత్రాలతో అంత దూరంలోని మధ్యవృత్తం వంకే తదేకంగా చూస్తోంది. ‘‘పార్థా... కిరీటి... విజయా...’’ అంటూ అర్జునుడి నామాలను ఉచ్ఛరిస్తోంది. అదికూడ కాదు, ఆమె ముఖంలో ఏదో తెలీని పరవశత్వం దోబూచులాడుతోంది. నాయకుడు నాగకేసరికేమీ అర్థం కాలేదు.

‘‘తల్లీ శంఖుపుత్రీ! ఏమైనాది నీకు? అచ్చట ఏమున్నదని చూస్తున్నావు’’ అనడిగాడు.

ఒకటికి రెండుసార్లు పిలిచాకగాని`

బాహ్యస్పృహలోకి రాలేదు శంఖుపుత్రి.

‘‘నాయకా... అర్జునుల వారిని దర్శించిన కనులు గదా. తన్మయంతో పరవశించినాను. నాకీ దినము ఎంతో సుదినము. వారిని కనులార జూచు భాగ్యము లభించినది’’ అంది మృదుమధురంగా.

శంఖుపుత్రి మాటలు నాగకేసరికి ఏమీ అర్థముకాలేదు. ఆమె పలుకులు విచిత్రంగా తోచాయి. తామంతా ఇక్కడే వున్నారు గదా. తమకు కనబడని పాండవమధ్యముడు ఈ శంఖుపుత్రికి ఎలా కన్పించినాడు?

‘‘ఏమంటున్నావు? అర్జునులవారు కన్పించినారా?’’ అడిగాడు.

‘‘అవును నాయకా... వారే.’’

‘‘వారినెప్పుడు జూచినావు?’’

‘‘ఇప్పుడే... ఇక్కడే... ధూమనాళికయందగుపించిన శ్వేతాశ్వ సుందరాంగుడు ఆ సవ్యసాచియే గదా’’ చిలుకపలుకుల్లాంటి ఆమె మాటలాలకించిన నాగకేసరి ఫక్కున నవ్వేసాడు.

అప్పటికి విషయం బోధపడిందతడికి.

రత్నగిరి రాకుమారుడు ధనుంజయుని జూచి అతడే పాండవమధ్యముడు అర్జునుడు అనుకొంటోందామె. ఇంత వయసు వచ్చినా అమాయకత్వం పోలేదీమెకు అనుకున్నాడు. అతడి నవ్వు విని అలిగినట్టు చూసింది శంఖుపుత్రి.

‘‘నాయకా... పరిహాసమేల. అతడు పార్థుడు గాడా?’’ అంది.

‘‘కాదమ్మా. కాని నీవతడ్ని పార్థుడనుకునే ఆయనపేర్లను ఉచ్ఛరించినట్లున్నావు. అవునా?’’

‘‘అవును. అతడు పార్థుడుగాకున్న ఇంకెవరు?’’

‘‘చెప్తానుగాని, నీవింతగా అర్జునుల వారినభిమానిస్తావన్న సంగతి నాకు తెలియదు సుమా. ఏదీ... పార్థుని దశ నామములు నీకు తెలుసునా?’’ అనడిగాడు.

తిరిగి అర్జునుని తలవగానే`

శంఖుపుత్రి బుగ్గలు ఎర్రబారి పులకరించాయి. తన నాగశరీరాన్ని ముడుచుకుని మరింత ముగ్ధగా మారింది.

‘‘ఓ... తెలియకేమి. అన్ని నామములు తెలుసును. అర్జున`ఫల్గుణ`పార్థ`కిరీటి` ధనుంజయ`సవ్యసాచి` గాండీవి`శ్వేతవాహన`విజయుడు`బీభత్సుడు అని ఇవన్నీ పార్థుని పది నామములు. ఇవిగాక జిష్ణువు అని మరో పేరుకూడ కలదు’’ అంది శంఖుపుత్రి.

‘‘ఆహాఁ... ఎంత చక్కగా గుర్తుంచుకున్నావు తల్లీ. ఏదీ పదిపేర్లు ఎలా వచ్చినవో అది కూడ చెప్పు’’ అనడిగాడు కుతూహలంగా నాగకేసరి.

‘‘తెలుపురంగు మేని ఛాయవాడు గావున ఆయన్ని అర్జునుడు అన్నారు. ఉత్తరా ఫల్గుణ నక్షత్రమందు జన్మించినవాడు గనుక ఫల్గుణుడు అన్నారు. కుంతీదేవికి పృధతి అని మరో పేరు వుంది. ఆ విధంగా పార్థుడు అయ్యాడు. మహేంద్ర దత్తమైన కిరీటమును సదా ధరించువాడు కావున ఆయన్ని కిరీటి అన్నారు. సకల సంపదలను జయించినవాడగుటచే ధనుంజయుడయ్యాడు. రెండు చేతులా బాణప్రయోగము చేయు నేర్పరిగా సవ్యసాచి అయినాడు. శివదత్తమైన గాండీవమును ధరించి గాండీవి అయినాడు. ఎప్పుడూ తెల్లటి అశ్వాలు పూన్చిన రథమునధి రోహించువాడు అందుకే శ్వేతవాహనుడన్నారు. అపజయమన్నది ఎరుగని వీరునిగా విజయుడన్నారు. శత్రువు మధ్య బీభత్సమును సృష్టించు మహావీరునిగా బీభత్సుడు అన్నారు. అంతటి మహావీరుని దశనామాలు స్మరించు వారికి సకల శుభములు ఒనగూరునట...’’ అంటూ శంఖుపుత్రి వివరిస్తుంటే ముగ్ధుడై విన్నాడు నాయకుడు నాగకేసరి.

‘‘చక్కగా వివరించినావు శంఖుపుత్రీ. నీ పలుకులు నిజములేగాని నీవు జూచినవాడు మాత్రం పార్థుడుగాడు’’ అన్నాడు.

‘‘గాకపోవుటయేమి? శతవర్షముల పూర్వము నా బాల్యమందు ఎప్పుడో అర్జునుల వారి శౌర్యపరాక్రమములు ఆయన రూపవిలాసముల గురించి ఎన్నో గాధలు వినియుంటిని. వాటికి సరితూగు ఈ వీరుడు అర్జునుడే’’

‘‘కాదంటినిగదా. ఇతని పేరు కూడ ధనుంజయుడే. పాండువంశీకుడు అర్జునుల వారికి ముదికి ముదిమనవడవుతాడు. కలియుగారంభంలోనే పాండవులంతా స్వర్గారోహణ జేసినారు గదా. ఇప్పుడెక్కడి అర్జునుడు. ఇతడు రత్నగిరి మహారాజు ధర్మతేజుని ఏకైక కుమారుడు. కార్యార్థియై  నాగలోకమునకు దారి వెదుకుచూ ఉత్తరాపధానికి బయలుదేరినాడు. అతడి రాక నాగరాజు ప్రభువుకు నచ్చలేదు. అతడి ప్రయత్న భంగమొనర్చి కోటకు మరలించమని నాగలోకాధిపతి ఆనతి. అ ప్రయత్నమే ఈ ఓజో ప్రయోగం. మేమా ప్రయత్నంలో ఉండగానే నీ విటకు వచ్చినావు’’ అంటూ వివరించాడు.

శంఖుపుత్రికి విషయగ్రాహ్యము కాలేదు.

అర్థమైకూడ అర్థంగానట్టుంది.

అతడు అర్జునుడు కాదు. రత్నగిరి రాకుమారుడు గావచ్చు కాని అతడికి నాగలోకంలో ఏమి పని? అతని నిరోధింప నాగరాజుకు అవసరం ఏమున్నది? నాగలోకానికి రత్నగిరి శత్రువా? కాదే అదే అడిగింది.

‘‘ధనుంజయుడు ఎందుకు బయలుదేరినాడు?’’

‘‘తెలీదు?’’

‘‘నాగలోకంలో అతడికి పని ఏమి?’’

‘‘తెలీదు’’

‘‘నాగరాజుకి ధనుంజయుడు శత్రువా? అతడ్ని మరలింప నగత్యం ఏమిటి?’’

‘‘చాలు తల్లీ! నీ ప్రశ్నలు  చాలును.’’ అంటూ నవ్వేసాడు నాగకేసరి.

‘‘నీ ప్రశ్నలకు నా వద్ద సమాధానములు లేవు. ఏమి జరిగినదో కూడ నాకు తెలియదు. నేను నాగరాజ వారి పరమభక్తుడనని నీకు తెలుసు. వారి ఆనతి నెరవేర్చటం మాత్రమే నా పని. ఇంతకుమించి ఏమీ తెలియదు. సరియా? ఇకపద, భోజనవేళ మించినది. లోన అంతా మన కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు నీవు మాతో విందారగింపవలె. లోనికి పోవుదము రమ్ము.’’ అంటూ లేచాడు నాగకేసరి.

‘‘అటులనే వచ్చెదను. నీవు నడువుము. ఒకింత తాళి (ఆగి) వచ్చెదను’’ అంది, తిరిగి తన ఆలోచనల్లో కూరుకుపోతూ శంఖుపుత్రి.

అభ్యంతరం చెప్పకుండా ఓసారి ఆమెను చూసి`

చరచరా ఇంట్లోకి వెళ్ళిపోయాడు నాగకేసరి.

శంఖుపుత్రి తీవ్రంగా యోచిస్తోంది.

ఆమె మదిలో రత్నగిరి యువరాజు ధనుంజయ మెదులుతున్నాడు. అతడి రూపవిలాసాలు మర్చిపోలేక పోతోంది. అసలు విషయం తెలీకున్నా పరిస్థితుల్ని కొద్దికొద్దిగా అర్థం చేసుకోగలుగుతోంది.

ధనుంజయుడు నాగలోకం చేరడానికి బయలుదేరి వస్తున్నాడు. అతడి రాక నాగరాజుకి ఇష్టంలేదు. తన లోకంలో మానవుల ప్రవేశాన్ని ఆయన సహించడు. ధనుంజయుని శత్రువుగానే భావిస్తాడు. అలాచూస్తే నాగరాజు తనకూ శత్రువే. చిరకాలంగా తన మనసులో నాగరాజు మీద పగ, ప్రతీకార జ్వాలలు అలాగే వున్నాయి. ఈ లోకమంతా ప్రేమబంధంతోనే నడుస్తున్న విషయం ఆయనకు తెలియదా? అన్యాయముగా తన ప్రియుడు బ్విుని చంపించాడు. తనను నాగలోకం నుండి బహిష్కరించి దిక్కులేని అనాధను చేసాడు. తన కష్టాకు కారణమయ్యాడు.

అలాంటి తన శత్రువు నాగరాజుమీద పగతీర్చుకొనే ఒక అవకాశం కొరకు చాలాకాలంగా తను ఎదురు చూస్తోంది. మదిలోనే వేదన పడుతోంది. తన వేదన తీరే సమయం కలిసి వచ్చినదా? రాకుమారుడు ధనుంజయుని ప్రయాణం తనకు ఒక అందివచ్చిన అవకాశముగా భావింపవచ్చునా? నాయకుని మాటల్నిబట్టి ధనుంజయుడింకను తన రాజ్య సరిహద్దులు దాటలేదని తెలుస్తోంది. అతడు మర్మభూమిలో కాలుమోపకముందే తను ఓసారి అతడ్ని కలుసుకుంటే మంచిదేమో. శంఖుపుత్రి మనసులో నెమ్మదిగా ఓ పథకం రూపుదిద్దుకుంటోంది. తన మనసులోని ఆలోచనల్ని నాయకుడు నాగకేసరితో పంచుకోవటం శంఖుపుత్రికి ఇష్టంలేదు. అతను నాగరాజు భక్తుడు. తన ఆలోచనలు నాగరాజుకి తెలిస్తే తన ప్రాణాలకు అపాయము. అందుకే నాగకేసరి ముందు ఈ విషయాలేవీ ప్రస్తావించ దలుచుకోలేదామె. ఆమె ఆలోచనలు ఓ కొలిక్కి రాకముందే ఇంట్లోంచి నాయకుడి పిలుపు వినవచ్చింది. అంతటితో తన భావాలను పక్కనపెట్టి విందారగించడానికి చరచరా పాకుతూ నాయకుని గృహంలో ప్రవేశించింది శంఖుపుత్రి.

*********************************************

కరివీరుని అశ్వికదళం కనుమరుగవగానే` రాకుమారుడు ధనుంజయుడు, అపర్ణుడు తమ అశ్వాలనధిరోహించి కొండదిగువకు బయలుదేరారు. బాటవెంట నెమ్మదిగా దౌడు తీస్తున్నాయి గరుడ, ఢాకినీ అశ్వాలు రెండూ.

ఈ కొద్ది పరిచయంలోనే అపర్ణుడిపట్ల నమ్మకమూ, స్నేహభావమూ ఏర్పడింది ధనుంజయుడికి. పిలవకుండానే వచ్చాడు, తనకు మిత్రుడయ్యాడు. రెండు జటిల సమస్యల నుండి అవలీలగా తనను తప్పించాడు. అందుకే కృతజ్ఞతా భావం ఏర్పడింది.

‘‘నాకో విషయం బోధపడుటలేదు అపర్ణా. మూడుసార్లూ బొమ్మపడుట ఏమి? సంభవమేనా? నిజంగా మా రత్నగిరి రాజ్యక్ష్మితల్లి నా పక్షాన నిలిచి మార్గం చూపిందంటావా?’’ దారిలో అడిగాడు ధనుంజయుడు.

ఆ మాటలకు గుంభనగా నవ్వాడు అపర్ణుడు.

‘‘యువరాజా! నన్ను నిజం చెప్పమందురా, అబద్ధము చెప్పమందురా?’’ అన్నాడు.

‘‘నిజమే చెప్పవలె’’ అన్నాడు ధనుంజయుడు.

‘‘ప్రభూ! లోకంలో ఇంద్రజా, మహేంద్రజా, గజకర్ణ, గోకర్ణ, టక్కు టమారాది షడ్వర్గములైన గారడీ విద్యలున్నాయి. అవన్నీ చూసేవారికి కనికట్టు చేసి మోసగించుటకే. ఉన్నదిలేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించేదే కనికట్టు విద్య. నీ విజయము కొరకు వాటిలో ఒక విద్యను ప్రయోగించి కరివీరుని మోసగించినాను’’ నవ్వుతూ అపర్ణుడు వివరిస్తూంటే, నమ్మలేనట్టు చూసాడు ధనుంజయుడు. మోసం ఎక్కడ, ఎలా జరిగిందో అర్థంకాలేదు.

‘‘లేదు లేదు. మోసము జరిగినట్టు నాకు తోచలేదు’’ అన్నాడు.

‘‘ఆహాఁ... ఇది చూడండి ప్రభూ. మీకే తెలియును’’ అంటూ దట్టీలోంచి రెండు బంగారు నాణాలను తీసి ధనుంజయుని చేతిలో ఉంచాడు.

వాటిని పరిశీలించి విస్తుపోయాడు ధనుంజయుడు.

ఒక నాణెం బొమ్మ, బొరుసు కలిగి బాగానే వుంది. కాని రెండో నాణానికి బొరుసు లేదు. ఇరువైపులా బొమ్మ ముద్రించి వుంది. అంటే అపర్ణుడు చేతిలో చూపించింది మంచి నాణమే. కాని గాలిలో ఎగరేసినది మాత్రం ఈ రెండో నాణెము. కాబట్టి ఎన్నిసార్లు ఎగరేసినా బొమ్మేపడుతుంది. ‘భళా! ఏమీ ఈ అపర్ణుడి చాతుర్యము’ అనుకున్నాడు ధనుంజయుడు మనసులో. తనూ నవ్వేస్తూ నాణాలను అపర్ణుడికి తిరిగి ఇచ్చేసాడు.

‘‘ఇలాంటి నాణాలు కూడ వుంటాయాల్`-`? ఇరువైపులా ఒకే బొమ్మతో?’’ అనడిగాడు.

‘‘ఉంటాయి ప్రభూ! మనం తయారుచేసుకుంటే.’’ అంటూ ఫక్కున నవ్వి బదులిచ్చాడు అపర్ణుడు.

‘‘నమ్మలేకున్నాను. నీకు చాలా విద్యలు తెలిసినట్టున్నాయే.’’

‘‘చాలా కాదుగాని ఏవో కొంచెం తెలుసు.’’

మాటల్లోనే అశ్వాలు బాటదిగి, కొండపాదం వైపు వచ్చేసాయి. అపర్ణుడు ఏదో గుర్తుకొచ్చినట్టు యువరాజును చూస్తూ`

‘‘అన్నట్టు మీరింకనూ భోజనం చేయనేలేదనుకుంటాను. అలసినట్టు కన్పిస్తున్నారు. భోజనం చేసి, ఒకింత విశ్రాంతిగైకొని బయలుదేరుట మంచిదికదా?’’ అనడిగాడు.

‘‘అవును మిత్రమా. కాని అందుకు అనువైన చోటు అగుపించుట లేదే’’

‘‘నాతో రండి, చూపిస్తాను. సమీపమందే ఓ చక్కని ప్రదేశము కలదు.’’

‘‘ఊహుఁ... నాకు తెలిసి అలాంటి చోటిచటలేదు. ఆకురాల్చిన చెట్లు నీడనిచ్చుట లేదు. వేడిగాలి, పాదప్రక్షాళనకు నీరుగల చెలమగాని, వాగులు గాని లేవు. జలశయాలు ఎండినవి’’

‘‘నా మాటలు సత్యము యువరాజా! ఇంతకుమించిన వేసవిలో కూడ చల్లటి నీటితో సేదతీర్చే ప్రదేశమొకటి సమీపమునందే యున్నది. నాతో రండి’’ అంటూ అశ్వాన్ని కుడిపక్కకు మళ్ళించి, బాట నుండి చిక్కటి అడవిలోకి దారితీసాడు అపర్ణుడు. అదేమిటో చూడాలని తన అశ్వాన్నికూడ అటు మళ్ళించాడు ధనుంజయుడు.

బాటనుండి సుమారు వేయి ధనువుల దూరంలో అజ్ఞాతంగా వుందాచోటు. రెండు చిన్నగుట్టల మధ్య సన్నటి దారి వెంట ఆవలకుపోగానే కన్పించిందా చోటు. చూడగానే అశ్వాన్ని నిలువరించి, ఆశ్చర్యసంభ్రమాలతో అలాగే చూస్తూండిపోయాడు ధనుంజయుడు.

తాను చూస్తున్నది కలో నిజమో అర్థంకాలేదు..

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్