Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kadali

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోక యాగం

గతసంచికలో ఏం జరిగిందంటే... http://www.gotelugu.com/issue140/396/telugu-serials/nagaloka-yagam/nagaloka-yagam/

 

 

ఆ నౌక తమ సమీపం లోకి రాగానే వారిలో తమ మనిషిని గుర్తు పట్టారు సరంగులు. వెంటనే తమ నౌక నుంచి చెక్క మెట్ల మార్గాన్ని తెరిచారు. ఆ నౌకలోంచి ఒకరి వెనుక ఒకరుగా నలుగురూ మెట్ల మార్గం గుండా వర్తక నౌక లోకి ప్రవేశించారు. వారిని తీసుకొచ్చిన నౌక లోని సరంగులు తమ నౌకను అక్కడి నుండి ఎడంగా తీసుకు పోయి పరిసరాల్లోనే గస్తీ తిరగనారంభించారు.

కొద్ది సేపట్లోనే బాహ్లీకుడు నేరుగా శతానీకుని మందిరంలో వున్నాడు. అతడి అంగరక్షకులిరువురూ ద్వారపాలకుల్లా బయటే నిబడ్డారు. నిజానికి ఈ బాహ్లీకుడు ఎవరో ఆ వర్తక నౌక సరంగులకు గాని అక్కడి పరివారానికి గాని తెలీదు. అతనితో శతానీకుని సమావేశం యొక్క ఆంతర్యం ఏమిటో కూడ అస్సలు తెలీదు. అతడ్ని తీసుకొచ్చిన గాంధారాధీశుని అంతరంగిక సేవకుడికీ తెలీదు. తెలుసుకోవాలన్న కుతూహలం కూడ ఎవరికీ లేదు. రాజకీయ ప్రయాణాలు భవిష్యత్తులో ఏ మార్పులకు హేతువులో ఇప్పుడే చెప్పలేం గాని నాయకులు వాటిని మనసులోనే రహస్యంగా వుంచుకుంటారు. సమయం వచ్చినప్పుడే బయట పడుతూంటారు.

బాహ్లీకుడు వచ్చిన కొద్ది సేపటికే తిరిగి వర్షం ఆరంభమైంది. ఈదురు గాలులులతోబాటు వర్షం క్రమంగా అధికరిస్తోంది. శతానీకుని మందిరం లోకి వర్షం హోరు వినబడుతోంది.

బాహ్లీకుని చూడగానే ముఖం నిండా నవ్వు పులుముకుంటూ చివ్వున లేచాడు శతానీకుడు. బాహ్లీకుడు తన ముసుగు తొలగించుకున్నాడు. మూసిన తలుపు వద్దే నిలబడి సగౌరవంగా వంగి నమస్కరిస్తూ` ‘‘గాంధారాధీశులకు జయము జయము. బాహ్లీకుని ప్రణామాలు’’ అన్నాడు.

ఒకింత ఇబ్బందిగా చూసాడు శతానీకుడు.

‘‘అహో... మిత్రమా బాహ్లీకా. మన మధ్య ఈ గౌరవాలు లాంఛనాలు అవసరమందువా? నేను గాంధారకు వారసునిగా గద్దెనెక్కకముందే మనం తక్షశిల విశ్వవిద్యాలయమందు విద్యాభాస్యంలో సహాధ్యాయిలమని, మంచి మిత్రులమని నీవు మరచినను నేను మరువలేదు సుమా. ఆహాఁ.... ఆ రోజు తిరిగి వచ్చునా! ఎంత కాలమైనది మిత్రమా నిన్ను గాంచి’’ అంటూ దగ్గరకొచ్చి గాఢంగా కౌగిలించుకున్నాడు.

ఒక దేశాధీశుడై ఉండి కూడ తన పట్ల ఇంతటి స్నేహాన్ని ఔదార్యాన్ని శతానీకుడు చూపుతుంటే బాహ్లీకుడు నిలువునా పులకించిపోయాడు. కళ్ళలో ఆనందభాష్పాలు నిలిచాయి.

‘‘ధన్యుడ్ని మిత్రమా. మిమ్మలి దర్శించిన ఈ శుభ రాత్రిని ఎన్నటికీ మర్చి పోలేను. కాని నేరుగా మీరు రత్నగిరికి రాజోచితంగా వేంచేసి వుంటే మీకు మీ పరివారానికి మా ప్రభువులు అపూర్వ స్వాగత సత్కారాలకు ఏర్పాట్లు చేసేవారు గదా. ఈ వర్తక నౌకలో ఇలా మారు వేషంలో రానగత్యం ఏముందని?’’ తన సందేహాన్ని నేరుగా బయట పెట్టాడు బాహ్లీకుడు.

‘‘అగత్యం వుంది బాహ్లీకా. కలికాలం గదా. ఏ క్షణంలో ఎవరి బుద్ధులు ఎలా మారునో చెప్పలేం గదా. మాకు మిత్రదేశములున్నవి, శత్రుదేశములున్నవి. నేరుగా దూర ప్రయాణాలు క్షేమం కాదు. ఆ పైన ఇది సింహళ ద్వీపం వరకు ఉద్దేశించిన రహస్య ప్రయాణం. కేవలం నిన్ను చూచి పోవలెనన్న ఆశ తోనే ఇక్కడ ఓడను లంగరు వేయించాను. రా మిత్రమా... కొద్దిసేపు మధిర సేవిస్తూ ముచ్చట్టాడుకుందాము.’’

‘‘కాని మిత్రమా....’’

‘‘అహో... అభ్యంతరము చెప్పకుము బాహ్లీకా. ఈ రేత్రికి మాతోనే వుంటున్నావు. నాతో భోంచేస్తున్నావు. ఇక్కడే విశ్రాంతిగా గడిపి వేకువనే నిన్ను సాగనంపించాక మేమును బయలుదేరెదము గాక, కాదనకు సుమా’’ అంటూ స్వయంగా చేయి పట్టి తీసుకెళ్ళి ఉచితాసనం మీద కూచుండ జేసి ఎదురుగా కూచున్నాడు శతానీకుడు. రెండు బంగారు లోటాల్లో మధిర నింపాడు.

శతానీకుని దర్శించి అర్ధరాత్రివేళ తీరానికి వెళ్ళిపోవానుకున్నాడు బాహ్లీకుడు. కాని ఇంత దూరం వచ్చిన తన కోసం పగలు రాత్రి కూడ వేచి వున్న మిత్రుని మాటను కాదనలేక ఇక అభ్యంతరం చెప్పలేదు. బయట వర్షం పడుతున్న చప్పుడు విన్పిస్తూనే వుంది. నౌకను తాకి ఎగిరి పడుతున్న కెరటాల చప్పుడూ విన్పిస్తోంది. వాతావరణం చలి చలిగా ఆహ్లాద భరితంగా వుంది. కాసేపు మధిర సేవిస్తూ కుటుంబ క్షేమ సమాచారము చెప్పుకున్నారు. అంతలో ఒకింత బాధగా బాహ్లీకుని వంక చూసాడు శతానీకుడు.

‘‘నిన్నిలా చూస్తూ వుంటే చాలా బాధగా వున్నది మిత్రమా! అదే తట్టుకోలేక పోతున్నాను. ఈపాటికి నిన్నొక స్వతంత్ర రాజుగా చూడాల్సిన వాడ్ని, ఇంకా ఈ రత్నగిరికి ఊడిగము చేస్తూ ఉప సైన్యాధక్షుని గానే వున్నావు. నేను గాంధార ప్రభువును కాగానే నీవే గుర్తుకొచ్చినావు. తీసుకెళ్ళి ఒక ప్రాంతానికి నిన్ను రాజును చేయాలనుకున్నాను. కాని మాది మిగిలిన దేశాల్లా కాదు. కొండలు మిట్ట పల్లాలతో కూడిన దేశము. ప్రజలు కష్టజీవులే గాని మొరటు వాళ్ళు. అక్కడి పద్ధతులు నీకు తెలీదాయె. అలాంటి చోట రాజును చేసి నిన్ను ఇబ్బందులపాలు చేయటం యిష్టం లేక వూరుకుంటి. కాని ఏదో రోజున నిన్ను రాజుగా చూడవలె. అది నా ఆశ. అందుకు ఏ సహాయం కావాలన్నా నేనుంటిని. ఇది మర్చిపోవలదు.’’ అంటూ చిన్నబాణం వదిలాడు. అది బాహ్లీకునికి తగలాల్సిన చోటే తగిలింది. కాని వెంటనే బయట పడలేదు.

శతానీకుడు కుట్రలు కుతంత్రాల్లో ఆరి తేరిన వాడు. వాక్చాతుర్యంలో నేర్పరి. అతడి మాటల గారడీ ఎదుటి వారి మీద సమ్మోహనాస్త్రంలా పని చేస్తుంది. ఎదుటి వారిలో బహీనతల్ని చాకచక్యంగా బయటికి రప్పించగలడు. తన మనసులో వున్నది బయట పెట్టకుండానే ఎదుటి వారి మనోభావాలను బయట పెట్టించగలడు. తర్వాత ఎదుటి వారిని తన ఆయుధంగా మలచుకోగలడు. తేనె పూసిన కత్తి లాంటి శతానీకుని మాటల మర్మాన్ని గ్రహింప లేని బాహ్లీకుడు కొద్ది సేపట్లోనే తన అంతరంగాన్ని బయట పెట్టేసాడు.

తనే తన పథకాలకు అనుకూలంగా రత్నగిరిలో ఒక కత్తిని సిద్ధం చేసి వుంచాలనుకున్నాడు శతానీకుడు. కాని తన కన్నా ముందే ఆ కత్తి ఇక్కడ పదును తేలి సిద్ధంగా వుందని తెలిసి విభ్రాంతి చెందాడు. తన చికిలి కళ్ళ వెనుక ఆ విభ్రాంతిని దాచేస్తూ కొన్ని లిప్తల పాటు అలా బాహ్లీకుని చూస్తుండి పోయాడు.

‘‘మిత్రమా! నీ మాటలు సత్యములేనా? నిజముంగా ఇది నీ దృఢసంకల్పమేనా?’’ నమ్మలేనట్టు అడిగాడు.

‘‘ఆహాఁ.... ఇంకనూ సంశయమా?’’ అన్నాడు నర్మ గర్భంగా నవ్వుతూ బాహ్లీకుడు.

‘‘వారెవా... ఇప్పుడు కదా నా మిత్రుడివన్పించినావు. శభాష్...’’ అంటూ మెచ్చుకోలుగా భుజం తట్టి అభినందించాడు శతానీకుడు.

‘‘ఇప్పటికైనా నీలో రాజ్యకాంక్ష ఏర్పడినందుకు చాలా ఆనందంగా వున్నది బాహ్లీకా. రాజ్యం వీర భోజ్యం. అవకాశాన్ని వీరుడెన్నడూ వదులుకోడు. నీలోని వీరత్వానికి బుద్ధి కుశలతకి పదును పెట్టే సమయం వచ్చినది. త్వరలోనే ఎవరూ వూహించని ఒక అంతర్య్రుద్ధాన్ని రాజ లోకం తిలకించబోతోంది.

ఈ విషయంలో ఒక ఆప్త మిత్రునిగా నా సాయం నీకెప్పుడూ వుంటుంది మిత్రమా. ఈ విషయం మర్చి పోమాకు. రత్నగిరి గద్దె మీద నా మిత్రుడు బాహ్లీకుని చూడటం కన్నను నాకు ఆనందం ఏముంటుంది? నా చిరకాల వాంఛ కూడ అదేనాయె. చూసావా! నిన్ను చూడాలన్న తపనతో నేనిక్కడ ఆగటం ఒకందుకు మంచిదే అయినది’’ అన్నాడు.

‘‘కాని మిత్రమా. ఒక విషయం నన్ను కలవర పరుస్తోంది’’ తన మధిర పాత్రను కాళీచేసి పేలవంగా నవ్వాడు బాహ్లీకుడు.

‘‘నేను పక్కనుండగా నిన్నేకలవరమూ బాధింపదు మిత్రమా! అదంతయు నాకు విడిచి పెట్టుము.’’ అంటూ తిరిగి రెండు పాత్రల్లోనూ మధిర నింపాడు శతానీకుడు. తిరిగి తనే చెప్పాడు.

‘‘నీ ఆలోచన సమయోచితము. ఏమి చేయాలో ఎలా చేయవలెనో నేను చెబుతాను. నేనంటూ కదిలితే మనకు సాయం చేయుటకు మన మిత్రదేశములున్నవి. ఇక చింతయేల? కాని ఇది కత్తి మీద సాము వంటి వ్యవహారము. గుట్టు రట్టయిన యుద్ధం ఒనగూడక ముందే నీకు చెరవాసము, మరణ దండన తప్పదు. కావున ఆచి తూచి అడుగు ముందుకేయవలె...’’ అంటూ హితవు పలికాడు.

‘‘అవును మిత్రమా. తగు జాగ్రత్తలోనే ఉన్నప్పటికీ, ఆచి తూచి అడుగు ఎటు వేయవలెనో ఇంకా అర్థం గావటము లేదు’’ అన్నాడు బాహ్లీకుడు.

‘‘సరి సరి. మిత్రుడిగా నీకు తగిన సలహాలు, సూచనలు చేయుటకు నా అభ్యంతరాలు ఏమీ లేవు. కాని దానికి ముందు ఏదీ దాచకుండా అడిగిన వాటికి నువ్వు బదులివ్వాలి. రత్నగిరి బలం ఏమిటి? బహీనతలు ఏమిటి? నీ ప్రణాళికలు ఏమిటి? సమయం రాగానే నీ పక్కన నిలబడేది ఎంతమంది? అంతా... అంతా నాకు తెలియ వలె. మీ బలాబలాలు తెలిస్తేనే గదా అదనంగా నీకు తగినంత సైనిక సమీకరణ నేను చేయ గలిగేది?’’

‘‘అడుగు మిత్రమా. అవసరం నాది గావున, సమయం వచ్చినది గాబట్టి నీ ముందు ఏదీ దాచను. ఎంత రహస్య సమాచారమైనా చెబుతాను. కాని నేను రత్నగిరి గద్దె మీద కూచోవాలి.’’

‘‘ఇక మర్చి పొమ్ము. రత్నగిరి సింహాసనం నీది. ఆ విషయం మర్చిపో. ముందుగా నాకో విషయం చెప్పుము. నేను గాంధారలో బయలుదేరి కరూర దేశం రేవు పట్టణం చేరగానే అక్కడో మాట విని వుంటిని. రత్నగిరిలో పరిస్థితులు బాగా లేవని అది ఎంత వరకు నిజము?’’

‘‘లేదు లేదు. అలా భావించుట సరి కాదు.’’ అన్నాడు వెంటనే బాహ్లీకుడు.

‘‘అంటే! అంతా సరిగానే వున్నదని అనుకోవలెనా?’’ వెంటనే అడిగాడు శతానీకుడు.

‘‘అనుకోవటం కాదు గాని పరిస్థితులు సవ్యం గానే వున్నవి. అసలు విషయం ఏమందువా? గత రెండు మాసములుగా ప్రభువు ధర్మతేజునికి ఆరోగ్యం సరిలేదు. అప్పట్నుంచి రాజ దర్శనం గగనమై పోయినది. ఆయనకి సోకిన వ్యాధి ఏమిటో బయట ఎవరికీ తెలీకుండా తగు జాగ్రత్తలతో రహస్యంగా వుంచినారు. మహారాజు రాజ మందిరానికే పరిమితమైనారు. రాజవైద్యులు బాహు గుట్టుగా వైద్యము నెరపుచున్నారు. రాజ కుటుంబం, మహా మంత్రి వాసుదేవ నాయకుడు, సర్వ సైనాధ్యక్షుడు అలర్కుల వారికి మాత్రమే రాజ మందిర ప్రవేశం వుంది. పరిపానా పరమైన రాజ నిర్ణయాలన్నీ వారిరువురి మూలంగానే బయట అమలు చేయటం జరుగుతున్నది...’’

‘‘ఆగాగు మిత్రమా... కొంచెము తాళుము’’ అంటూ బాహ్లీకుని మాటకు మధ్యలోనే అడ్డుకున్నాడు శతానీకుడు.

‘‘మీ సర్వ సైనాధ్యక్షుని పేరేమంటివి? అలర్కుడా?’’ విస్మయం చెంది అడిగాడు.

‘‘అవును. కాని ఆయన అసు నామధేయం ప్రపుల్ల సేనుడు. అది ఎవరికీ ఇప్పుడు గుర్తు లేదు. ఆయన అలర్కుని గానే ప్రసిద్ధుడు.’’

‘‘బాగు బాగు. అలర్కము అనిన పిచ్చి కుక్కయని గదా అర్థము?’’

‘‘అవును మిత్రమా’’ అంటూ ఫకాలున నవ్వాడు బాహ్లీకుడు.

‘‘సరి గానే చెప్పినావు. ఒక పిచ్చి కుక్క ఎలా కనబడిన వారిని కరుస్తుందో, అదే విధంగా రణ భూమిలో కంటికి కనబడిన శతృసేనల్ని ప్రచండ వేగంతో ఊచ కోత కోస్తాడు. అందుకే ప్రత్యర్థులు అలర్కుడని గూఢ నామంతో పిలిచే వారు. చివరకు అదే ఆయనకు సర్వనామంగా స్థిరపడింది’’ అంటూ వివరించాడు.

‘‘బాగున్నది. ఇంతకూ ప్రభువు ధర్మతేజునికి సంక్రమించిన వ్యాధి ఏమిటి? అది ప్రాణాంతక వ్యాధిగా భావింప వచ్చునా?’’

‘‘వ్యాధి నిర్థారణ అయినప్పటికీ బయటకు తెలీనీయుట లేదు. రత్నగిరి ప్రజలు ఆయన్ని దైవాంశుడుగా భావిస్తారు. ప్రజలకు తెలిస్తే ఆందోళన చెందుతారని వ్యాధిని రహస్యంగా వుంచినారు. అయితే ఆరు మాసములు మించి ఆయన బ్రతకడని రాచనగరులో గుసగుసలు విన్పిస్తున్నాయి.’’

‘‘ఇంత జరుగుతుంటే యువరాజు ఏం చేస్తున్నాడు? అతడు యుక్త వయస్కుడని, మహా వీరుడని విన్నాము. పరిపాలనా బాధ్యతల్లో కూడ పాలుపంచుకోడా?’’ సందేహాన్ని వ్యక్తం చేసాడు శతానీకుడు.

‘‘యువరాజు ధనుంజయుడు మహావీరుడు, సమర్థుడు. అందులో ఎంత మాత్రమూ సంశయం లేదు. ప్రస్తుతం అతనిక్కడ లేడు. తండ్రి వ్యాధి గుణపడాలన్న ఏవో అరుదైన కొన్ని మూలికలు అవసరమట. అవి ఇచట లభించవట. నాలుగు మాసముల లోపల ఆ దినుసులు తేకున్న ప్రభువు మరణించునట. వాటి కోసం మూడు దినాల క్రిందటే ఎవరికీ చెప్పకుండా నగరం వదిలి వెళ్ళిపోయినాడు యువరాజు ధనుంజయుడు.

క్లిష్ట సమయంలో ఇలా ఒక్కగానొక్క కొడుకు కోటను విడిచి వెళ్ళుట ప్రభువుకి ఇష్టం లేదు. అతన్ని వెనక్కు తీసుకు రమ్మని కరివీరుడను వాని నాయకత్వంలో ఒక అశ్విక దళాన్ని పంపించుట జరిగినది. వెళ్ళినవారింకను నగరానికి తిరిగి రానేలేదు.’’ అంటూ బాహ్లీకుడు వివరిస్తూంటే ఆసక్తిగా విన్నాడు శతానీకుడు.

తలపంకించి గాఢంగా నిట్టూర్చాడు.

బయట వర్షం ఉధృతి తగ్గినట్టు లేదు.

అలల తాకిడికి నౌక వూగుతోంది.

మధిర పాత్రలు కాళీ అయ్యాయి.

‘‘మిత్రమా. కాసేపు రాచనగరు వార్తలు పక్కన పెడదాము. ఇప్పుడు రత్నగిరి సైనిక బలం ఎంతో వివరించు. ఉప సైన్యాధ్యక్షునిగా అవి నీకు తెలీని విషయాలు గావు.’’ అనడిగాడు శతానీకుడు.

అవునన్నట్టు తల పంకించాడు బాహ్లీకుడు.

రాజభక్తి, దేశభక్తి కలిగిన కీలక పదవుల్లోని వ్యక్తులు ఎవరైనా గానీ ప్రాణం పోయినా తమ సైనిక రహస్యాలు బయటపెట్టరు. అవి శత్రు పరమైతే అనర్థ హేతువు. అతి సన్నిహితులక్కూడా చెప్పరు. కాని ఇక్కడ బయటికి చెప్పకున్నా, గాంధారాధీశుని సహాయాన్ని బాహ్లీకుడు వాంఛిస్తున్నాడు. ఈ వంకతోనే రత్నగిరి సైనిక రహస్యాలను బాహ్లీకుడి నుండి రాబట్టాలని శతానీకుడు ప్రయత్నిస్తున్నాడు. ఎవరి ఆలోచనలు వారికున్నాయి గాబట్టి శతానీకుని వలలో బాహ్లీకుడనే పెద్ద చేప సులువుగానే పడిపోయింది. అందుకే ఏదీ దాచకుండా రత్నగిరి సైనిక రహస్యాలను బయట పెట్టడానికి ఉద్యుక్తుడయ్యాడు బాహ్లీకుడు.

‘‘మా సైనిక బలం మొత్తం రెండు ఆక్షౌణీలకు పైనే’’ అన్నాడు తిరిగి నింపిన మధిర పాత్రను అందుకుంటూ.

‘‘అంటే! రెండు లక్షల ముప్పై ఆరువేల మందిగల సైనిక శక్తి. రత్నగిరి వరకు చూస్తే ఇది చాలా ఎక్కువే. ఇందులో నీ ఆధీనమందున్న సైనిక బలమెంత?’’

కుతూహలంగా అడిగాడు శతానీకుడు.

‘‘ఇందులో సగం బలం అంటే ఒక లక్షా పద్దెనిమిది వేల మందితో కూడిన ఒక ఆక్షౌణీ సైనిక బలం నా ఆధీనంలో వుంది. మిగిలిన ఆక్షౌణీ బలం సర్వ సైనాధ్యక్షుడు అలర్కుని ఆధీనమందున్నది. మొత్తం సైన్యానికి సర్వ సైనాధ్యక్షుడు గాబట్టి మేమంతా అలర్కుని ఆజ్ఞకు బద్ధులమై పని చేయాల్సి వుంటుంది.

ఇది గాక, కోట రక్షక దళం, గ్రామ, నగరాల రక్షక దళాలు, సరిహద్దుల రక్షక దళాలు వెరసి అదనంగా అలర్కుని ఆధీనంలో మరో ముప్పై వేల మంది సైనికులు పని చేస్తున్నారు. వీరు గాకుండా మూడు వేల మంది సుశిక్షితులయిన విలుకాండ్రతో కూడిన ప్రత్యేక దళం కూడ అలర్కుని ఆధీనమందు వున్నది.’’

‘‘ఇందులో చతురంగ బలాలుగా చెప్పుకునే రథ, గజ, తురగ, పదాతి దళాల బలగముల సంఖ్య ఎంత?’’

‘‘చతురంగ బలగాన్ని ఎప్పుడూ బలోపేతంగా సర్వ సన్నద్ధంగా ఉంచుట మా ప్రభువు ధర్మతేజుని అలవాటు. ఆయన మహావీరుడు. అరివీర భయంకరుడు. సైనిక పరంగా చిన్న పొరబాటును కూడ ఆయన సహించడు. ఆయన ఆభిరుచుల్ని తుచ తప్పక పాటిస్తాడు అలర్కుడు. మాకు అయిదువేల రథాలు, రథికులు  వున్నారు. రెండు వేల గజ దళం వుంది. ముప్పై వేల అశ్విక బలం వుంది. మూడు వేల విలుకాండ్రు అదనం. మిగిలింది పదాతి దళాలు.’’

ఆ వివరాలు విని మెచ్చుకోలుగా తల వూపాడు శతానీకుడు.

‘‘ప్రస్తుతం మన ఉప ఖండమందు గల ముక్క చెక్కలయిన చిన్న రాజ్యములతో పోలిస్తే రత్నగిరి సైనికంగా చాలా శక్తివంతమైన దేశం. సుమారు మూడు లక్షల సైన్యాన్ని పోషించటం అసాధారణ విషయం. సైనిక పరంగా ధర్మతేజుని మెచ్చుకోవాల్సిందే. మిగిలిన విషయాలు చివరిలో ముచ్చటిద్దాం. ఇప్పుడు నాకు మరో విషయం తెలియాలె. రేపు నీవు తిరుగుబాటు బావుటా ఎగురవేసి అంతర్యుద్ధానికి నాంది పలికినపుడు ఈ మొత్తం సైన్యంలో నీ పక్షాన పోరాడే సైనిక బలమెంత? సుమారుగా చెప్పగలవా?’’ అంటూ కుండ బద్ధలు కొట్టినట్టు సూటిగా అడిగాడు.

‘‘నా ఆధీనంలోని ఒక అక్షౌనీ సైన్యం నా పక్షాన పోరాడుతుంది. అందులో అణుమాత్రం సందేహం లేదు. నా రధికులు, దళపతులు, సేనాపతులు అంతా నా అనుకూలురు, నన్ను సమర్థించువారే. అలాంటి వారినే నా ఆధీనంలోకి ఎంచుకున్నాను. అలాగే నాకంటూ ఒక ప్రత్యేక గూఢచార విభాగం వున్నది. అలర్కుని వేగుల కన్నా చురుకైన వాళ్ళు. వీళ్ళ గురించి ఇంత వరకు అలర్కుని గూఢచారులక్కూడ తెలియదు. చాలా కాలంగా ముందు చూపుతోనే నేను చేసుకున్న అంశాలన్నీ అక్కరకొచ్చే తరుణం ఆసన్నం కానుంది.

కాదంటే అలర్కుని ఆధీనంలోని ప్రభుత్వ సైన్యంతో సరితూగాలన్నా ఇంకనూ నాకు యాభై వేల సైన్యం అవసరమవుతుంది. గెలుపు నా పక్షాన వుండాలన్న కనీసం మరో లక్ష సైన్యం మద్దతు అవసరం’’ వివరించాడు బాహ్లీకుడు.

‘‘ఆ మాట నిజము. ఇక్కడ ముందుగా నాకు రెండు విషయములు నిర్థారణ కావలె. ఒకటి రోగ పీడితుడై మందిరానికి పరిమితమైన ప్రభువు ధర్మతేజుడు లేచి రణ భూమికి రాగలడా? రెండు, మూలికల కోసం వెళ్ళిన యువరాజు ధనుంజయుడు రానున్న నాలుగు మాసాల్లోపనే తిరిగి వస్తాడా?’’

‘‘రెండునూ అసంభవం.’’ అన్నాడు వెంటనే బాహ్లీకుడు.

‘‘నాలుగు మాసాల్లోపల మూలికలు అందకున్న అప్పటికి మహారాజు మరణిస్తాడు. గమ్యం తెలీకుండా ప్రయాణం చేస్తున్న యువరాజు ఇప్పట్లో తిరిగి వస్తాడనుకోను’’ అన్నాడు.

‘‘ఒకవేళ యువరాజు తిరిగి వచ్చినచో?’’

‘‘రాలేడనే అనుకొందును.’’

‘‘ఊహు... ఇలాంటి సందర్భముందు వూహలు నిజం కావు బాహ్లీకా. లాభ నష్టాలు రెంటిని మనం సమతూకం వేసి చూడాలె. ఒకవేళ నీ తిరుగుబాటు ముగిసి రత్నగిరికి రాజువైనాక తిరిగి వచ్చినా లేక యుద్ధ సమయానికి తిరిగి వచ్చినా పరిస్థితి ఏమిటి? రత్నగిరికి మిత్ర రాజ్యాల సాయంతో దండెత్తి రాడన్న నమ్మకమున్నదా? మహావీరుడైన ధనుంజయుడు నీ ద్రోహాన్ని సహించి మిన్నకుంటాడా? ఆ పైన నేను విన్న సమాచారం ప్రకారం మాళవ రాజ్య పట్టమహిషి ధర్మతేజుని సోదరి. రత్నగిరి ప్రమాదంలో వుంటే మాళవ సైన్యం మిన్నకుండునా? ఇవన్నీ ఆలోచించాలి.’’

ఆ మాటలు బాహ్లీకుని ఉత్సాహం మీద నీరు చల్లినట్టయింది. ఆలోచనలో పడినాడు. వదనంలో రంగులు మారాయి. శతానీకుని హితబోధ వాస్తవాన్ని ప్రతిబింబిస్తోంది. చివరకు`

‘‘అవును మిత్రమా. యువరాజు తిరిగి వచ్చిన రాజకీయ గండం నాకు తప్పదు’’ అన్నాడు.

‘‘అయితే ఆలస్యమెందుకు? సరిహద్దు దాటిన యువరాజు తిరిగి రత్నగిరిలో అడుగు పెట్టకూడదు. అందుకు మార్గం ఒక్కటే. అతడ్ని రాజ్యం బయటే ఎక్కడో హతమార్చాలి.’’

‘‘హత్యా....’’

‘‘అవును. హత్యే. రాజకీయ హత్య. బయటకు పొక్కరాదు. మరణ వార్త రత్నగిరికి చేరకూడదు.’’

‘‘కాని మిత్రమా. అది సాధ్యమా? ధనుంజయుడు మహావీరుడు...’’

‘‘అతడిని మించిన మహావీరులు కూడ మన్నులో కలిసి పోయినారు బాహ్లీకా.’’ అంటూ పెద్దగా నవ్వాడు శతానీకుడు. ఆ నవ్వు చూస్తూంటే కలిపురుషుడు నవ్వినట్టు, ఒక నిశాచరుడు వికటాట్టహాసం చేసినట్టుంది. కొన్ని లిప్తల పాటు బాహ్లీకుడి వెన్ను జలధరించింది. సాయం చేసినట్టే చేసి చివరి క్షణంలో తనను తప్పించి ఈ శతానీకుడే రత్నగిరిని అక్రమించడు గదా. రత్నగిరికి తను చేస్తున్న నయవంచనలాగే శతానీకుడు తనకు చేయడని నమ్మిక ఏమున్నది? రాజకీయ నీతి రాక్షస నీతి. అవసరం తనది అయినప్పటికీ తన జాగ్రత్తలో తనుండాలి శతానీకుని విషయంలో అన్పించింది.

‘‘నమ్మకంగా గొంతు కోసే వాళ్ళుంటే అసాధ్యాలు సుసాధ్యాలు కాగలవు బాహ్లీకా. ఎంత వీరుడయినా శత్రువు పట్ల జాగ్రత్తగా వుంటాడు గాని అపరిచితులు , భక్తులు తన చుట్టూ మంచిగా చేరిన వారి పట్ల జాగ్రత్త వహింపరు. ఆకస్మికంగా ఓ అయిదుగురు అతి సమీపం నుండి ఒకేసారి దాడి చేస్తే మట్టి కరవక తప్పదు. నీ గూఢచారుల్లో సమర్థుల్ని అయిదుగురు ఒక జట్టుగా మూడు జట్లను ఎంపిక చేసి మూడు పక్కలా పంపించు. ఒక్కో జట్టును వారితో సంబంధం లేకుండా నీడలా అనుసరించే ఒక్కొక్కడ్ని వెనకే పంపించు. అక్కడ ఏమి జరిగినా తిరిగివచ్చి నీకు సమాచారం అందించేందుకు ఈ ఏర్పాటు అవసరం. అర్థమైనదా?’’ అంటూ సలహా యిచ్చాడు శతానీకుడు.

‘‘ఊఁ.... అర్థమైనది మిత్రమా. తీర్థయాత్రీకుల వేషాల్లో వారిని పంపిస్తాను. ముందుగా ధనుంజయుడు భీమశంకరుని దర్శించేందుకు ఢాకినీ వనానికి వెళ్ళే అవకాశమున్నది. ఎందుకంటే, ప్రభువు ధర్మతేజుడు భీమశంకరుని భక్తుడు. రెండోది అటు పోకుండా నేరుగా మాళవ రాజ్యంలోకి పోవచ్చు. అవంతీపురం తన మేనత్త మేనమామ నగరం (ఉజ్జయిని). అటు ఒక జట్టును పంపిస్తాను. మూడవ జట్టు మాళవం దాటి వింధ్యాటవి మార్గంలో కాపు వేస్తారు. ఎక్కడో ఓ చోట పనయి పోతుంది’’ అన్నాడు ఉత్సాహంగా బాహ్లీకుడు.

మెచ్చుకోలుగా చూసాడు శతానీకుడు.

‘‘ఇప్పుడు... నీ మెదడు పాదరసంలా పని చేయుచున్నది మిత్రమా. నా మాటలు శ్రద్ధగా ఆలకించుము. నేను గాంధారం చేరగానే మిత్ర రాజ్యాలను సంప్రదించి మా గాంధారసైన్యంతో బాటు రెండు లక్షల సైన్యాన్ని నీకు మద్ధతుగా సిద్ధం చేస్తాను. గంధారం నుండి రత్నగిరి వరకు అనేక రాజ్యాలను దాటి ఆ సైన్యం రత్నగిరి చేరటం అసాధ్యం. ఆయా రాజ్యాలతో అకా శత్రుత్వం ఏర్పడుతుంది. కాబట్టి రథాలు, ఏనుగుల సాయం చేయలేను. కరూర దేశం మీదుగా ఓడలు మీద సైన్యం రత్నగిరి వచ్చి పశ్చిమం నుండి రత్నగిరిని తాకుతుంది. ముందు పక్క నీ సేనలు, వెనక నుండి మా సేనలు ముప్పేట దాడితో రత్నగిరికి వూపిరి సలపకూడదు.

ఇదిగాక పాతికవేల అశ్విక దళాలు ఎవరికి అనుమానం రాని విధంగా సాధారణ దుస్తుల్లో జట్లు జట్లుగా బయలుదేరి ఎవరికీ  అనుమానం రాకుండా రత్నగిరి సరిహద్దుకు చేరి వేచి ఉంటాయి. ఇవన్నీ జరగాలంటె సరిగ్గా నేటికి రెండు మాసాల తర్వాత ముందుగా నాకు ధనుంజయుని మరణ వార్తతో బాటు నీవు తిరుగు బాటు ఆరంభించు రోజు పావురం సందేశం మూలంగా నాకు తెలియపర్చాలి. నా ఆంతరంగిక సేవకుడు కరోతి అనేవాడు పావురా సందేశం పంపించుట లోను, వాటికి శిక్షణ ఇచ్చుట లోను బహు నేర్పరి. వాడే నిన్ను నా వద్దకు తీసుకు వచ్చిన వాడు. కొన్ని పావురాలతో బాటు వాడ్ని నీ వద్ద వుంచి వెళ్తాను. ఇక ఈలోపల మహారాజు ధర్మతేజుని ఆరోగ్యం గురించి మర్చిపొమ్ము. మృత్యువును సమీపిస్తున్నవాడు మనల్ని ఏమీ చేయలేడు. ఇప్పుడు రత్నగిరి భవిష్యత్తు సర్వసైన్యాధ్యక్షుడు అలర్కుని మీదే ఆధారపడున్నది. అతడి విషయంలోనే నీవు అప్రమత్తుడవై వుండాలి.’’ అంటూ అనేక విషయాల్ని బోధించాడు శతానీకుడు.

అంతా శ్రద్ధగా ఆలకించాడు బాహ్లీకుడు.

చివరిగా మరోమాట కూడ చెప్పాడు గంధారాధీశుడు.

‘‘మిత్రమా. కేవలము మన స్నేహమునకు గుర్తుగా నిన్ను రాజును చేయాలనే సంకల్పం తోడనే ఇంత భారీ సహాయమునకు నీకు మాట యిస్తుంటిని. ఇందులో నాకంటూ ఏ స్వార్థమూ లేదు. కాదంటే మనతో బాటు మిత్రదేశాల సైనిక ఖర్చున్నాయి. కాబట్టి నీవు సింహాసనం ఎక్కగానే నాలుగు లక్షల వరహాలు సైనిక ఖర్చుకింద చెల్లిస్తే చాలు, సంతోషిస్తాను’’ అన్నాడు.

‘‘ఎంత మాట మిత్రమా!’’ అంటూ ఆనంద పడి పోయాడు బాహ్లీకుడు.

‘‘నీవింత సాయం చేస్తున్నందుకు నేను నీకు ఏ విషయంలో కూడా లోటు రానిస్తానా? నాలుగు కాదు, ఆరు లక్షల బంగారు వరహాలతో బాటు మణిమయ రత్నాల సంచులను కానుగ్గా ఇచ్చి పంపిస్తాను’’ అంటూ మాటిచ్చాడు.

పిమ్మట మరొకొన్ని ముఖ్య విషయాల్ని చర్చించుకున్నారు. అప్పటికి అర్ధరాత్రయింది. మూడో యామాన్ని సూచిస్తూ కోటపై నగారా శబ్ధం సముద్ర జలాల మీద ప్రతిధ్వనించింది. వర్షం కూడ నిలిచింది. ఆ అర్ధరాత్రి వేళ శతానీకునితో బాటు విందు భోజనాలారగించిన బాహ్లీకుడు ఆ మందిరంలోనే మిత్రుని చెంత నిద్రపోయా

డు.

వేకువనే లేచిన బాహ్లీకుడు తన అంగరక్షకుతో తిరుగు ప్రయాణమయ్యాడు. నాలుగు పావురాలతో కూడిన పంజరంతో కరోతి కూడా వారి వెంట తీరానికి బయలుదేరాడు. సమీపంలోనే తిరుగుతున్న చిన్న నౌకలో బాహ్లీకుడి బృందం బయలుదేరుతుంటే ఓడ పైభాగం నుండి వీడ్కోలు పలికాడు శతానీకుడు. ఆ నౌక చీకటల్లో కను మరుగు కాగానే ఆ వర్తక నౌక లంగరు ఎత్తివేయబడిరది. సరంగు తెరచాపు లేపారు. ఎవరూ గమనించముందే శతానీకుని సూచన మేరకు ఆ నౌక ఉత్తర దిశగా కరూర రేవు పట్టణం దిశలో వేగంగా సాగిపోయింది. సూర్యోదయానికి అది రత్నగిరికి కొన్ని యోజనాల దూరంలో వుంది.   
................................
ఈ ఉత్కంఠ వచ్చేవారం దాకా.......................... 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
vedika