Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష : ఓం

Movie Review - Om 3D
చిత్రం: ఓం 3డి
తారాగణం: కళ్యాణ్ రాం, కృతి కర్బందా, నికిషా పటేల్, రావు రమేష్, సంపత్, కార్తిక్, సురేష్, సురేఖా వాణి, సితార తదితరులు
సంగీతం: అచ్చు- సాయి కర్తిక్
కూర్పు: గౌతం రాజు
దర్శ్కత్వం: సునీల్ రెడ్డి
నిర్మాత: నందమూరి అద్వైత్
విడుదల తేదీ: 19 జూలై 2013

"కళ్యాణ్ రాం కత్తి" తర్వాత దాదాపు 3 ఏళ్లకి ఈ రోజు "ఓం 3డి" తో మన ముందుకొచ్చాడు కళ్యాణ్ రాం. సునీల్ రెడ్డి దర్శకత్వం లో స్వీయ నిర్మాణంతో కళ్యాణ్ రాం తెరకెక్కించిన ఈ చిత్రం ఆను పాను ఎలా ఉందో చూద్దాం.

క్లుప్తంగా చెప్పాలంటే:
తండ్రే ప్రాణంగా బతికే కొడుకు అర్జున్ (కళ్యాణ్ రాం). తన తండ్రితో వ్యాపార విషయాల్లో గొడవ పడే దుర్మార్గుడైన బైరెడ్డి (రావు రమేష్) తో తలపడతాడు అర్జున్. ఈ తండ్రీకొడుకులిద్దరూ బతికున్నంత కాలం తన అవినీతికి అడ్డు తగులుతుంటూనే ఉంటారని వాళ్ళిద్దర్నీ చంపడానికి భవాని శంకర్ (సంపత్) అనే నేరస్థుడిని విడుదల చేయిస్తాడు. ఇదిలా ఉంటే అర్జున్ జీవితంలోకి అంజలి (కృతి కర్బందా) ప్రవేశిస్తుంది. ఇక్కడి దాకా కథ సాదాగానే అనిపించినా ఊహించని మలుపులు, ఆలోచనకి తట్టని కథనంతో ఎవరు మంచివారో, ఎవరు దుర్మార్గులో తెలియని మెలికెలతో వంకర్లు తిరుగుతుంటాయి పాత్రలు, సన్నివేశాలు. చివరికి ఎవరు సాత్వికులో ఎవరు కౄరులో తెలియడంతో కథ ముగుస్తుంది.

మొత్తంగా చెప్పాలంటే:
నిజానికి ఇలాంటి కథ రాసుకోవడం కష్టం కాకపోయినా, కథనం రాయడం కత్తి మీద సామే. వందలాది చిత్రాలు చూసి రాటుదేలిపోయిన ప్రేక్షకుల మేధస్సుకి దొరక్కుండా కథ నడపే ప్రయత్నం ప్రశంసనీయం. అయితే కథలో భావోద్వేగాల పాళ్లు లోపించాయి. కథన ప్రణాళిక బాగానే ఉన్నా, బలమైన కారణాలు, లోతైన ఉద్వేగాలు పండించకపోతే రససిద్ధి కలుగదు. ఇక్కడ జరిగిందదే. ముఖ్యంగా అందరి చేతుల్లోను మోసపోయే కథానాయకుడి పాత్ర ఒక పక్క ఉదాత్తం అయిపోతూ ఉంటే  మరో పక్క హెచ్చరికలు చేస్తూ ప్రత్యర్ధులని చితక్కొడుతుంటాడు. అలాగే కొన్ని సన్నివేశాల్లో కాసేపు కథానాయికలే కథానయకుడికంటే తెలివైన వాళ్ళుగా కనిపిస్తారు. మాస్ హీరో ప్రధానంగా సాగే చిత్రాల్లో ఇటువంటివి కథనంలో మూడ్ డిస్టర్బ్ చేస్తాయి.

ఏది ఎలా ఉన్నా కల్యాణ్ రాం లో మాత్రం సరికొత్త కథను తెరకెక్కించాలన్న తపన బలంగా కనిపిస్తుంది. ఆ తపన వెనుక తపస్సు కూడా కనిపిస్తుంది. కానీ ప్రేక్షక దేవుళ్ళు దిగి రావాలంటే ఆ తపస్సు సరిపోదు. ఏ అడ్డంకి లేకుండా కథలోకి లాక్కుపోయే వాతావరణం ఉండాలి. ఈ సినిమా వరకు కళ్ళజోడే అడ్డంకి. చత్వారం వచ్చిన వాడు కళ్ళజోడు పెట్టుకున్నట్టుందే తప్ప, ఈ 3డి లో కొత్తగా కలిగిన అనుభూతి పెద్దగా లేదు. అసలు ఈ సినిమా 3డి లో ఎందుకు చూడాలో చెప్పడం కష్టం.

కృతి, నికిషా ఇద్దరూ తెరకి ఇంపుగా ఉన్నారు. రావు రమేష్ శ్రీకాకుళం యాసలో ఎక్కడా ప్రాంతీయత దెబ్బతినకుండా చక్కగా పలికాడు సంభాషణలన్నీ. హీరో తండ్రిగా నటించిన కార్తిక్ న్యూస్ రీడర్ లాగ డైలాగులు వల్లించాడు. సంపత్ పర్వాలేదు. సురేష్ రకరకాల షేడ్స్ ఉన్న పాత్రలో ఒదిగిపోయాడు. నవ్వుకోవడానికి వీలైన సన్నివేశాలేవీ పెద్దగా లేవు. పాటలకు మాత్రం వంక పెట్టలేము. సంగీతం, చిత్రీకరణ రెండూ ఇంపుగా ఉన్నాయి.

ఒక్క ముక్కలో చెప్పాలంటే: మీ ఇష్టం

అంకెల్లో చెప్పాలంటే: 2.75/5
మరిన్ని సినిమా కబుర్లు
Interview with Viswa by Raja