Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
guravaayanam book review

ఈ సంచికలో >> శీర్షికలు >>

చిరుగూ, మచ్చా,మరకా... - భమిడిపాటి ఫణిబాబు

chirugu machcha maraka

ఒకానొకప్పుడు, అంటే మన తెలుగుతేజం శ్రీ నరసింహరావుగారు భారతదేశ ఆర్ధిక పరిస్థితిని మార్చకముందన్నమాట, ఓ చిరుగు అన్నా, ఓ మరక అన్నా, ఓ మచ్చ అన్నా  ప్రతీవారికీ ఏదో అశుభం లాగ కనిపించేది. చిరిగిన బట్టైతే ఆర్ధిక స్థితిని చెప్పేది.  సినిమాల్లో, వ్యక్తి ఆర్ధిక స్థితిని చూపించాలంటే దండెం మీద వేసిన చిరిగిపోయిన  ఓ పంచో, చీరో చూపించేవారు. దురదృష్టవశాత్తూ హీరోయిన్ మీదో, ఆమె చెల్లెలిమీదో ఏదైనా అత్యాచారం లాటిది జరిగితే, చిరిగిపోయిన విస్తరాకులా అయిపోయింది జీవితం అని ఓ డైలాగు ద్వారా చెప్పేవారు. అత్యంత బీదస్థితిలో ఏ ఉత్తరేణి కుట్టో వేస్తూ హీరోయిన్ తల్లిని చూపించేవారు! గుర్తుండేఉంటుంది ఇదివరకటి రోజుల్లో ఏ పాంటుకైనా, షర్టుకైనా చిరుగుపడిందంటే ఓ టైలరు దగ్గరకి వెళ్ళడమూ, అతనిచేత అదేదో "రఫ్" చేయించుకోడమూనూ ! పైగా చాకలివాడు  ఇస్త్రీ బట్టలు తేకపోవడంచేత ఇంట్లోనే ఉండే ఏ పాత షర్టో వేసికుని, దానికి ఏ చిరుగైనా కనిపించిందా, బయటకు వెళ్ళనిచ్చేవారుకాదు.

ఇంక మచ్చలూ, మరకలూ అంటారా, అందరికీ గుర్తుండేఉంటుంది, అవేవో టీకా లని వేసేవారు. సాధారణంగా ఏ జబ్బమీదో వేసేవారు, కాలక్రమేణా, ఆడపిల్లలకి , ఏ స్లీవ్ లెస్స్ బ్లౌజులైనా వేసికుంటే, ఆ మాయదారి టీకా మచ్చ కనిపిస్తుందని ఏ తొడమీదో వేయించేసి పనికానిచ్చేసేవారు. మరకల విషయానికొస్తే, కొత్తబట్టలు కట్టుకొన్నప్పుడు, పసుపుపెడితే అది కనిపిస్తుందని మొగపిల్లల షర్టు కాలర్లకి మాత్రమే సుతారంగా అంటించేవారు. ఒక్కొక్కప్పుడు పేరంటాలలో కాళ్ళకి పసుపుకూడా, అలా.. అలా.. రాయించుకునేవారు, అలాగే 'మచ్చ' శబ్దాన్ని, ఎవడైనా తప్పు పనిచేస్తే " మీకుటుంబానికి మచ్చ తెచ్చేవుకదరా.." అని చివాట్లేసేవారు.

చెప్పొచ్చేదేమిటంటే ఈ చిరుగులూ, మరకలూ,  మచ్చలూ సామాన్యుల  జీవితాలకి ఓ కొలమానంగా ఉండి, సమాజంలో వారివారి స్థోమతని అడక్కుండానే చెప్పేవి.  ఇదివరకటిరోజుల్లో ఏ పాంటు కైనా, షర్టుకైనా చిరుగనేది ఉంటే ఆ బట్టలన్నీ డిస్కౌంటులో మరీ అమ్మేవారు. చిరిగిపోయిన బట్టంటూ ఇంట్లో ఉంటే, స్టీలుసామాన్లమ్మేవారికిచ్చేసి, బదులుగా, ఏ చారు గిన్నో, గుండుగిన్నో, స్పూనో, ఉధ్ధరిణో... మనకేది ప్రాప్తం ఉంటే అది తీసికునేవారు. పైగా ఏ చీరల దుకాణానికైనా వెళ్ళి ఓ చీర బేరం చేసిన తరువాత, దానికి చిరుగులేదని, ఆ చీరంతా విప్పించి మరీ చూసుకునేవారు. కొంతమందైతే చిరుగున్న బనీను ని కూడా వేసికోనివ్వరు, అది బయటకి కనిపించకపోయినా సరే.

అలాటిది ఒక్కసారిగా ఈ పైచెప్పబడినవన్నీ National obsession గా మారిపోయాయి. ఈ రోజుల్లో బయటకెళ్తే ఎక్కడచూసినా చిరుగులూ, మరకలూ, మచ్చలే దర్శనం ఇస్తున్నాయి. పైగా ఎన్ని చిరుగులుంటే అంత ఫాషనుట. కొంతమందైతే లక్షణంగా ఉండే ఏ జీన్స్ పాంటో కొనుక్కుని, దానిని ఎడాపెడా కత్తిరించేసో, అక్కడక్కడ చింపేసే వాళ్ళని కూడా చూస్తూంటాము. కొన్ని కొన్ని దుకాణాల్లో ప్రత్యేకంగా " చిరుగులు" ఉండే బట్టలే అమ్ముతూంటారు, పైగా ఎన్ని చిరుగులుంటే అంత ఖరీదెక్కువట ! ఆమధ్యన అదేదో యాడ్ వచ్చింది, తన కూతురు టేబుల్ మీద పెట్టిన బట్టమీద చిరుగుకనిపించిందని, ఆ వెర్రితల్లి ఓ కుట్టు వేద్దామనుకుంటూంటే, ఆ కూతురొచ్చి కసురుతుంది!

ఇంక మచ్చల విషయానికొస్తే అవేవో టాటూలుట, ఇదివరకటిరోజుల్లో పచ్చబొట్టనేవారనుకుంటా, అందరూ వేయించుకునేవారు కాదు. ఇప్పుడో, ఓ వెర్రిమొర్రి డిజైనో, ఓ బొమ్మో, అదీకాదనుకుంటే ఏ బాయ్ ఫ్రెండు పేరో, గర్ల్ ఫ్రెండు పేరో శరీరంలో ఎక్కడ ప్రస్పుటంగా కనిపిస్తుందో అక్కడ ప్రత్యేకంగా వేయించుకోడం. నుదుట బొట్టుమాటెలా ఉన్నా, వంటిమీద ఈ టాటూలు మాత్రం ప్రదర్శించేసికోవడం ఈనాటి ఫాషను. అందరూ అలాగే ఉంటున్నారని కాదూ, పెద్దవారికంటే అప్పుడప్పుడే యుక్తవయస్సు వస్తున్న పిల్లలైతే మరీనూ. వారు వేయించుకునే ప్రదేశాలు, ఒక్కోసారి చూస్తూంటే ఆశ్చర్యం వేస్తూంటుంది. అసలు మీరు చూడవలసిన అవసరం ఏముందీ అని మాత్రం అడక్కండి. మనం చూడాలనుకున్నా, చూడకూడదనుకున్నా కనిపిస్తాయి, అదే వీటిలోని ప్రాధాన్యత! వేసికునే బట్టలమీద కూడా చిత్రాతిచిత్రమైన స్లోగన్లోటీ.

ఇంక మరకల సంగతికొస్తే, అదేదో detergent వాడైతే ఏకంగా "మరక కూడా మంచిదే.." అని ఓ ఎడ్వర్టైజుమెంటు కూడా మొదలెట్టాడు! దానితో పిల్లలు కూడా, ఏవర్షంలోనైనా ఆడుకుని బట్టలు ఖరాబు చేసికున్నా, తల్లి ఏమీ అనకూడదు. అధవా ఏదైనా అన్నా కానీ, ఆ యాడ్ ని గుర్తుచేస్తారు!

చివరకి జరిగిందేమిటంటే, ఇదివరకటి రోజుల్లో వేటికైతే ఇంట్లో పెద్దవారు అభ్యంతరాలు పెట్టేవారో, వాటన్నిటికీ ఓ authenticity వచ్చేసింది మరి ! పైగా ఇలాటి వేషాలు లేకుండగా బయటకి వెళ్ళడం ఓ నామోషీగా భావిస్తున్నారు.




భమిడిపాటి ఫణిబాబు

మరిన్ని శీర్షికలు
thulasi pooja