Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చేతిలో చాక్లెట్ పెడితే చాలు .. ఎలా అంటే అలా ... - ప్రణవి

Interview with Pranavi

డబ్బింగ్ చెప్పేవారికి పాటొస్తే పాత తరంలో అదొక అదనపు లాభంగా వుండేది. అందుకు టి.జి. కమలాదేవి వంటి వారొక ఉదాహరణ. ఆ తర్వాతి తరానికొచ్చేసరికి డబ్బింగ్ చెప్పేవారికి పాట రావల్సిన అవసరం లేకుండా పోయింది.  చక్రవర్తి, ఎస్పీ బాలు, మనో లాంటి వారు కూడా డబ్బింగ్ రంగంలో ప్రవేశించి రాణించేసరికి ఈ కళకొక ప్రత్యేకత వచ్చింది. ప్రస్తుత తరంలో ఈ వ్యత్యాసాలేవీ లేవు. వినసొంపైన కంఠస్వరం, ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వగల సామర్ధ్యం వున్న వాళ్ళు అటు డబ్బింగ్ చెప్పొచ్చు ... ఇటు పాటలు కూడా పాడొచ్చు. ఇందుకు తాజా ఉదాహరణ - ప్రణవి. సుమారు 300 సినిమాలకు, 200 టీవీ ప్రోగ్రామ్ లకు డబ్బింగ్ చెప్పి (చెబుతూ కూడా) 100 సినిమాల్లో పాడిన ప్రణవి రికార్డింగ్ కోసం చెన్నై వెళితే వెతికి, వెంటాడి, వేటాడి - ఆమె పుట్టిన రోజు ఆగస్ట్ 16  సందర్భంగా జరిపిన ఇంటర్ వ్యూ ఇది:


"నీ కెరీర్ ఎలా మొదలైంది ... సింగింగ్ తోనా .. డబ్బింగ్ తోనా ?"
"డబ్బింగ్ తోనే ... యూ కేజీలో వుంటుండగానే కళంకిత, అంతరంగాలు, విధి, మాతృదేవోభవ సీరియల్స్ కి డబ్బింగ్ చెప్పాను. "

"మరి పాడడం ఎప్పుడు మొదలు పెట్టావు?"
"సంతోష్ శివన్ గారి 'హేలో' సినిమాలో మెయిన్ క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్తున్నప్పుడు వాయిస్ బావుందని 'మనసులోని చిన్నమాట' అనే పాట పాడించారు. అదే నా ఫస్ట్ ఫిల్మ్ సాంగ్."

"ఇది 17 ఏళ్ళ క్రితం సంగతి కదా  ... ప్రస్థుతం నడుస్తున్న ట్రాక్ లోకి ఎలా వచ్చావ్ ? "
"అలా ఓ వైపు చదువు, మరో వైపు డబ్బింగులు నడుస్తున్న టైమ్ లోనే డైరెక్టర్ వి.యన్. ఆదిత్య గారు నా వాయిస్ విని కళ్యాణి మాలిక్ గారికి చెప్పారు. ఆయన ' ఆంధ్రుడు' సినిమాలో  రెండు బిట్ సాంగ్స్ పాడించారు.  ఆ తరువాత 'చత్రపతి' రీ-రికార్డింగ్ కి కోరస్ వాయిస్ లకోసం పిలిపించినప్పుడు కీరవాణి గారు విని ' శ్రీ రామదాసు' లో 'శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ' పాడించారు."

"తర్వాత కీరవాణి గారు నీతో చాలా పాడించారు కదా ? "
"అవును ... 'అమ్మ చెప్పింది' లో అమ్మగా కోరుకుంటున్నా, మాటల్తో స్వరాలే - పాటలు, 'సంగమం' సినిమాలో పూత వేసిన లేత మామిడి, పాలరాతి శిల్పానికి - పాటలు, 'యమదొంగ' లో 'రబ్బరు గాజులు రబ్బరు గాజులు, నువు ముట్టుకుంటేనే, యంగ్ యమా పాటలు - ఇలా చాలా పాడించారు. అన్నిటికీ మంచి పేరొచ్చింది"

"మాస్ పాటలు పాడడం 'యమదొంగ' తోనే మొదలు కదూ ?"
"నిజమే ... రబ్బరు గాజులు పాటకి ముందు అటువంటి పాటలు పాడలేదు. నేను పాడలేనన్నాను. 'నువ్వు పాడగలవు' అని కీరవాణి గారు పంతం పట్టి పాడించారు. కరెక్ట్ గా 20 నుముషాల్లో అయిపోయింది పాట.  ఆ సినిమాలోనే 'నువ్వు ముట్టుకుంటేనే' పాటక్కూడా సేమ్ అలాగే జరిగింది "

"ఈ పాటల తర్వాత ఇలాంటి పాటలు నీతో ఎవరైనా పాడించారా ?"
"అనూప్ రూబెన్స్  గారు పాడించిన 'ద్రోణ' లో వద్దంటానా వద్దంటానా పాట రబ్బరు గాజులు పాట వినే  "

"ఆ తర్వాత "
"తర్వాత అందరు మ్యూజిక్ డైరెక్టర్లూ నాతో పాడించారు. కోటి గారు 'రాజ్' సినిమాలో 'ప్రతి కళా నాలో' పాడించారు. నా ఆల్ టైమ్ ఫేవరెట్స్ లో ఇదొకటి. మిక్కీ జె. మేయర్ గారు 'హ్యాపీ డేస్' లో 'యా కుందేందు తుషార హార ధవళా' పాడించారు. ఇవాళ్టికీ స్కూళ్ళలో, కాలేజీల్లో ఆ ట్యూన్ తోనే పాడుతున్నారు. మణిశర్మ గారు 'శుభప్రదం' సినిమాలో 'మౌనమే చెబుతోంది' పాట పాడించారు. ఇది బాలూ గారితో డ్యూయెట్. ఓ పక్క మణిశర్మ గారి సంగీతం, మరో పక్క విశ్వనాథ్ సినిమా, ఇంకో పక్క బాలూ గారితో డ్యూయెట్.... ఇది నాకు ట్రిపుల్ ధమాకా సాంగ్ "

"టీవీ, సినీ రంగాలకు నందీ అవార్డులు కూడా అందుకున్నట్టున్నావు ?"
"తూర్పు వెళ్ళే రైలు టీవీ సీరియల్ లో పాటకి, స్నేహ గీతం సినిమాలోని 'సరిగమపదని' పాటకి ఉత్తమ గాయనిగా నందీ అవార్డులు వచ్చాయి. మనసు-మమత టీవీ సీరియల్ లోని పాటకి  టి.యస్.ఆర్.  అవార్డ్ వచ్చింది. రాధ-మధు సీరియల్ టైటిల్ సాంగ్ 'ఆగదేనాడు కాలము' పాటకి ప్రేక్షకుల వైపు నుండి వచ్చిన స్పందన ని నిజంగా మరిచిపోలేనిది."

"మిగిలిన సింగర్స్ తో అంత ఎక్కువగా కలిసున్నట్టుగా కనిపించవు కదా ? "
"అదేం లేదు బాబాయ్ ... నేనందరితోనూ ఫ్రెండ్లీగా వుంటాను. అందరూ కూడా నాతో చాలా అభిమానంగా వుంటారు. కాకపోతే వాళ్ళు షోస్ లో ఎక్కువ కలుస్తుంటారంతే .."

"మరి నువ్వెందుకన్ని షోలు చెయ్యవు ?"
"నేను ఎక్కువగా ప్లేబ్యాక్ మీదే కాన్సన్ ట్రేట్ చేస్తే బాగుంటుందనుకున్నాను. అయినా మొన్ననే  మణిశర్మ గారి యూ.ఎస్. షోలకి వెళ్ళొచ్చాగా ... "

"ఈ మధ్య తమిళ సినిమాల్లో కూడా పాడుతున్నట్టుగా ఫిల్లర్లు వస్తున్నాయి ? "
" బాలా గారి డైరెక్షన్ లో వస్తున్న 'పరదేశి' (తెలుగు, తమిళం లో వస్తోంది) సినిమాకి జీవీ ప్రకాష్ మ్యూజిక్ డైరెక్షన్ లో పాడాను."

"ఇది గాక ఇంకా ఏవో పాడినట్టు స్మెల్  ... "
"ఇప్పటి వరకు నాలుగైదు పాడి వుంటాను "

"అదే ... వాటి వివరాలు కూడా చెప్పొచ్చుగా ..."
"చెప్పాల్సిన టైమ్ లో చెప్పాల్సిన వారు చెప్తారు కదా బాబాయ్ ... ప్లీజ్ ... "

"ఓకే .. ఏం చదువుకున్నావో చెప్పు  ? "
"బి.ఏ. మ్యూజిక్ అయిపోయింది. ఎమ్.ఏ. కంప్లీట్ చెయ్యాలి"

"మ్యూజిక్ చదువు కాకుండా మామూలు చదువు సంగతి చెప్పు ? "
"ఇంటర్ బైపీసీ ఫిజియో థెరపీ వదిలేసి మ్యూజిక్ లో జాయిన్ అయ్యాను"

"సరే ... మళ్ళీ మొదటికి వద్దాం ...  అతి చిన్న వయసులోనే డబ్బింగ్ చెప్పావు కదా ... లిప్ సింక్ అదీ ఎలా తెలిశాయి నీకు ? "
"నిజంగా నాకేం తెలీదు. చేతిలో చాక్లెట్ పెడితే ఎలా చెప్పమంటే అలా చెప్పేదాన్ని"

"అప్పుడు సరే, కాస్త జ్ఞానం తెలిశాక కష్టపడిన డబ్బింగ్ ఏది ?"
"కలవారి చెల్లెలు కనక మహాలక్ష్మి సినిమాకి. అందులో సాయికుమార్ చెల్లెలికి, చిన్నప్పటి సాయికుమార్ కి డబ్బింగ్ చెప్పాను. చిన్నప్పటి ఇంద్రజ పోర్షన్ ని యాక్ట్ చెయ్యడం తో పాటు డబ్బింగ్ కూడా చెప్పాను. "

"కమల్ హసన్ దశావతారం లో బాలు గారు 10 రకాలుగా గొంతు మార్చి డబ్బింగ్ చెప్పినట్టు ఇన్ని రకాల ఫీట్ లు ఒక్క సినిమాలో , చిన్న వయసులో పెద్దగా అనుభవం లేకపోయినా చెప్పి మెప్పించావంటే నిన్ను నిజంగా మనస్ఫూర్తిగా మెచ్చుకోవలసిందే ... "
"అందుకే కదా బాబాయ్ ... ఇంత చిన్న ఇంటర్ వ్యూ ఇచ్చినా నన్ను ఏం అనకుండా వదిలేస్తున్నారు ?"

"అంటే టేకిట్ గ్రాంటెడ్ లా అంతా నీ ఇష్టమేనా ... సరే ... నేనిక్కడ తీరిగ్గా కూచుని నోట్ చేసుకుంటున్నాను ... నువ్వక్కడ చెన్నై రోడ్ల మీద నడుస్తూ ఆన్సర్లిస్తున్నావు. కాబట్టి మానవతా దృక్పథం కోణంలో ఒదిలేస్తున్నా గానీ ఇదొక్కటి చెప్పు ... కొన్ని ప్రయివేట్ ఆల్బమ్స్ కూడా ఇచ్చావు కదా ?"
"శ్రీ వెంకటేశం, శ్వాస, ఫ్యూజన్ రామదాసు, తారామతి, సంహిత, అమోఘ చేశాను. ఇందులో సంహిత మా ఓన్ అల్బమ్. అది పార్ట్ 1 రిలీజయింది. పార్ట్ 2 ఇంకా చెయ్యాలి. మరింక ఉండనా ?"

"ఓ .. తప్పకుండా ఉండు ... మంచి మంచి పాటలు పాడుతూ, చక్కగా డబ్బింగ్ లు చెబుతూ, మరిన్ని అవార్డులు తెచ్చుకుంటూ అందరి హృదయాల్లోనూ చెక్కు చెదరకుండా హాయిగా వుండు "






రాజా (మ్యూజికాలజిస్ట్)

మరిన్ని సినిమా కబుర్లు
Cine Churaka by Cartoonist Bannu