Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
atulitabhandham

ఈ సంచికలో >> సీరియల్స్

అతడు...ఆమె... ఒక రహస్యం!

గతసంచికలో ఏం జరిగిందంటే..http://www.gotelugu.com/issue185/532/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/

(గతసంచిక తరువాయి)ముంబై లోని బాంద్రా కుర్లా కాంప్లెక్సు లోని భారత వజ్రాల మార్కెట్ (బి.డి.బి.) లోని  ఒక టవర్లోని పదహారో అంతస్థు లోని  కీర్తి లాల్ డైమాండ్స్ ఆఫీసులో  ఆ సంస్థ యజమాని కీర్తిలాల్ తో పాటూ అతడి ఛాంబర్ లో  కూర్చుని ఉన్నాడు డిటెక్టివ్  పాణి.   ఆ సంస్థ తాలూకు సెక్యూరిటీ ఆరేంజ్ మెంట్లు చూడడానికి  రెండు సంవత్సరాల కాంట్రాక్టు కుదుర్చుకుంది ఈగల్స్ ఐ డిటెక్టివ్ సంస్థ.  

తమ దగ్గర ఉన్న కొన్ని అరుదైన  వజ్రాలని చూపిస్తున్నాడు కీర్తిలాల్ పాణికి.

నీలి రంగు సంచిలో మెరుస్తున్న వజ్రాలని చూపిస్తూ  గొప్పగా అన్నాడు “త్రిభుజాకార కట్ కలిగిన ఈ వజ్రాలని రెడ్ డైమాండ్స్ అంటారు. వీటిని మా నాన్నగారు ఒక బ్రిటీష్ సంస్థ దగ్గర వేలంలో కొన్నారట.  ఇవి చాలా అరుదైన వజ్రాలు.  మేము వీటిని  కొన్నాక ఒక సంగతి తెలిసింది. ఇంగ్లండులో మాత్రమే దొరికే ఇలాంటి వజ్రాలు మన దేశానికి రావడం ఇది రెండో సారిట. 

బ్రిటీష్ ప్రభుత్వం మనదేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో  రాజులకు సేవ చేసిన కొందరికి అధిక మొత్తంలో భూమిని ధారాదత్తం చేసేవారు. అలా ఎక్కువ మొత్తంలో భూమి పొందిన వారినే సంస్థానాధీశులుగా పేరు పొందారు. సంస్థానాలు అంటే చాలా మొత్తంలో ఎక్కువ గ్రామాలు అధికారి ఏలుబడి కింద ఉండేవి. ఆ సంస్థానాధీశులకి ఒక్కోసారి బ్రిటీష్ వారు ఇలాంటి అరుదైన వజ్రాలని కానుకలుగా ఇచ్చేవారు.  

అలా బ్రిటీష్ చక్రవర్తులు మొదటి సారిగా ఇలాంటి వజ్రాలని పెద్ద మొత్తంలో అప్పట్లో  నిజామాబాద్ జిల్లాలో ఉన్న  సిర్నాపల్లి సంస్థానాధీశులకి కానుకగా ఇచ్చారట.  ఆ తరువాత  అత్యంత ఖరీదైన ఈ రకమైన వజ్రాలు మన దేశంలోకి  రాలేదు.  వాటిని తిరిగి ఇన్నాళ్ళకి మన దేశానికి తీసుకు వచ్చిన ఘనత మా సంస్థకే దక్కింది. ఆ రకంగా  ఈ వజ్రాలు వాటి  మార్కెట్ రేటు కన్నా ఎక్కువ విలువైనవని చెప్పచ్చు”

యధాలాపంగా అతడు చెప్పిన మాటలని వింటున్న పాణి ‘సిర్నాపల్లి సంస్థానం’  అన్న మాటల దగ్గర  అలర్టయ్యాడు.  ఆ పేరు ఎక్కడో విన్నట్టనిపించి “ఏ సంస్థానం అన్నారు?” అని అడిగాడు.

“సిర్నాపల్లి సంస్థానంలో”  అన్నాడు కీర్తిలాల్.

పాణికి రెండు నెలల క్రితం తనకి వచ్చిన మెయిల్ గుర్తుకు వచ్చింది.

“అయితే ఇలాంటి వజ్రాలు  మన దేశంలో సిర్నాపల్లి సంస్థానంలో రాజుల వద్ద ఉన్నాయన్నమాట?!” అన్నాడు  ఆత్రుతగా. కీర్తిలాల్ భుజాలు ఎగరేసాడు “అవి ఆ రకంగా దేశానికి వచ్చిన మాట వాస్తవం. కానీ కాలక్రమేణా  అప్పటి సంస్థానాలు చితికిపోయాయి.  రాజులూ పోయారు. వాళ్ళ దగ్గరున్న సంపదనీ, విలువైన వజ్రాలనీ, ఎవరికి పడితే వారికి  అయినకాటికి అమ్ముకున్నారు.  స్వాతంత్ర్యం వచ్చిన  తరువాత మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు  ఇంగ్లాండుకి చెందిన వజ్రాల వ్యాపారులు మన సంస్థానాధీశుల దగ్గర నుంచి, భూస్వాముల  దగ్గర నుంచీ ఇలాంటి విలువైన సంపదని తక్కువ మొత్తానికి కొనుక్కుని వెళ్ళిపోయారని చెప్పుకుంటారు.  అందుకే  ప్రస్తుతం ఇలాంటి వజ్రాలు  మన దేశం లో ఇంకెవరి వద్దైనా ఉన్నాయన్న నమ్మకం నాకు లేదు”   అతడి మాటల్లో  అలాంటి అరుదైన సంపద కేవలం తన దగ్గర మాత్రమే ఉందని చెప్పుకోవాలన్న  దర్పం కనబడుతోంది.

పాణి అతడి మాటలని పూర్తిగా వినడం లేదు. అతడి ఆలోచనలన్నీ తనకి వచ్చిన మెయిల్ చుట్టూనే తిరుగుతున్నాయి.  ఆ రాజ్ బహదూర్ రాజేంద్ర వర్మ తనని మళ్ళీ కాంటాక్ట్ చెయ్యకపోవడంతో ఆ మెయిల్ గురించి పట్టించుకోలేదు అతడు.  కానీ ఇప్పుడు ఈ కీర్తిలాల్ మాటలు వింటుంటే, అతడు నిజంగానే ఏదో ఆపదలో ఉన్నడేమో, ఆ మెయిల్ని  అశ్రద్ధ చేసి  తప్పు చేసాడేమో అనిపించింది.

బి.డి.బి. నుంచి బయటికి  వస్తుంటే, కారు లోంచే  సెల్ ఫోన్ లో  ఆర్కియాలజీ డిపార్టుమెంట్ లో  పని చేసే తన స్నేహితుడికి ఫోన్ చేసాడు.

“ఒక విషయం చెప్పు? మన దేశంలో పూర్వకాలంలో రాజులు చనిపోతే వారితో పాటూ వారికి ఇష్టమైన వస్తువులని పూడ్చిపెట్టి  సమాధులు కట్టే సంప్రదాయం ఉండేదని విన్నాను. నిజమేనా?”

తలా తోకా లేకుండా పాణి  వేసిన ప్రశ్నకి  ఆ స్నేహితుడికి నవ్వొచ్చింది. అయినా పాణి సంగతి తెలుసు కనుక సీరియస్ గానే సమాధానం చెప్పాడు.

“నువ్వు విన్నది నిజమే. చనిపోయిన వారిని వారికి ఇష్టమైన వస్తువులతో కలిపి పూడ్చిపెట్టి దాని చుట్టూ కొన్ని గుర్తులను అమర్చి ఉంచడం అన్న ఆచారం మనదేశంలో ఉంది.  వాటిని 'కైరన్' అంటారు. ఇటువంటి ‘కైరన్ల’ ఆధారంగానే చరిత్రకారులకి ఎన్నో విషయాలు తెలిసాయి.  ఇలాంటి వాటి ద్వారానే మన దేశంలో ప్రాచీన కట్టడాలైన రాష్ట్ర కూటులు, బోధన్ చాళుక్య, కల్యాణి చాళుక్యులు, కాకతీయుల ఆలయాలు,  ఎన్నో ముస్లిం నిర్మాణాలు బయట పడ్డాయి”

అతడి మాటలు వింటుంటే పాణికి ఉద్వేగంగా అనిపించింది.  అయితే, ఆ రాజ్ బహదూర్ రాజేంద్ర వర్మ తనకి మెయిల్లో రాసినదంతా నూటికి నూరు పాళ్ళూ నిజమన్న మాట. అతడి కోట ఆవరణలో బయటపడిన సంపద సంగతి నిజమే అయితే,  అతడు  ప్రమాదంలో ఉన్నాడన్న  విషయం కూడా నిజమే అయి ఉండాలి.  అయితే,  అంత ప్రమాదంలో ఉన్న వ్యక్తి తనని మళ్ళీ ఎందుకు సంప్రదించలేదు?

తన ఈ మెయిల్ అడ్రస్ సంపాదించిన అతడికి తన సెల్ ఫోన్ నెంబర్ సంపాదించడం కష్టం కాదు.  మరెందుకు తనని కాంటాక్ట్ చెయ్యలేదు?   ఇంకొక డిటెక్టివ్‍ని ఆశ్రయించి ఉంటాడా?

( డిటెక్టివ్ పాణి సరైన సమయంలోనే స్పందించాడా, ఆలస్యమైందా? వచ్చేవారం.......)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nagalokayagam