Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
premiste emavutundi?

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి....http://www.gotelugu.com/issue254/686/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/

(గత సంచిక తరువాయి).. ఆమె దారి పొడవునా ఆగి ఆగి నడుస్తూ యాచకులందర్నీ పలకరిస్తున్నట్టే వాళ్ల ముందోసారి ఆగి ఎగాదిగా పిచ్చిచూపులు చూస్తూ మెట్లెక్కి ఆకాశ ధార దగ్గరకు చేరుకుంది.

ఆకాశంలో నుండి జాలువారుతోందా అన్నట్టు జలజలా రాలుతున్న జలధార కేసి తీక్షణంగా చూస్తూ నిలబడింది. భక్తులు తండోపతండాలుగా మెట్లెక్కుతూ ముందుకు సాగి పోతున్నారు. ధారలు పడుతున్న మెట్ల ప్రక్కనే నిలబడింది ఆమె.

పై నుండి దబదబా పడుతున్న జల ధార పడుతూనే తుళ్ళి తుళ్ళి పైకి ఎగిరి చుట్టు ప్రక్కలంతా పన్నీరు జల్లులా పడుతోంది. క్రింద పడ్డ నీటి చుక్కలన్నీ ఒక్కటై మెట్ల పై నుండి దారలై పారుతున్నాయి.

జల ధార తుంపర్లలో తడుస్తూ నిలబడి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి గుడి కేసి చూసింది ఆమె.

అభయ హస్తం చూపిస్తూ నిలబడ్డ వీరాంజనేయ స్వామి విగ్రహం ‘నేనున్నా’ నంటూ ధైర్యానిస్తూ భీకరంగా కనిపించింది.

అప్రయత్నం గానే  రెండు చేతులూ జోడించింది ఆమె. ఆకాశ ధార దగ్గర నుండి యాంత్రికంగానే వీరాంజనేయ  స్వామి విగ్రహం దగ్గరకు చేరుకుంది.

గుడిలో పూజారి మూల విరాట్టుకు అర్చన చేస్తూ అనుకోకుండా ఆమె కేసి చూసాడు. తన్మయత్వంలో వీరాంజనేయ స్వామి వారి విగ్రహాన్నే చూస్తున్న ఆమెని పరికించి తిరిగి పూజలో నిమగ్నమయ్యాడు. తండోప తండాలుగా మెట్లు ఎక్కుతున్న భక్త జన సందోహం మధ్య తారలా తళుక్కున మెరుస్తోన్న ఆమెని ఎవరైనా ఒక్క క్షణమన్నా చూడక మానరా.

గుడి ముందు హుండీ మీద పడి వున్న  స్వామి వారి సింధూరం చేత్తో తీసుకుని నుదుటి మీద దిద్దుకుని రెండడుగులు ముందుకు నడిచి తిరిగి గుడిలోకి చూసి మూల విరాట్టుకు మళ్లీ భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంది ఆమె.

అష్టోత్తరం ముగించి ఆంజనేయ దండకం చదువుతూ వెనుదిరిగిన పూజారి మెట్లెక్కి వెళ్ళి పోతూ వెనక్కి చూసి నిలబడి మళ్లీ స్వామికి నమస్కరించుకుంటున్న ఆమెని చూసి ఎందుకో ఉలిక్కి పడ్డాడు పూజారి.

తెల్లగా నిగ నిగ లాడుతూ....గుండ్రంగా ఉన్న పెద్ద పెద్ద నేత్రాలను...సంపంగి పువ్వులా....కొనదేరి ఉన్న నాసికాన్ని....ముక్కున మిలమిల మెరుస్తున్న ముక్కు పుడకని....ఆమె కోల ముఖాన్ని.... చూస్తూనే  ఉలిక్కి పడ్డాడు పూజారి.

ఆమె నిర్లిప్తంగా నడుచుకుంటూ ముందుకు సాగి పోతోంది. భక్తుల రద్దీలో కలిసి పోయింది.

గుడి ముందున్న ధ్వజ స్తంభం దగ్గర నిలబడి ఆమె కోసం కళ్ల తోనే వెతుకుతూ తొంగి తొంగి చూసాడు పూజారి.

ఆకాశ ధార...ఆంజనేయ స్వామి ఆలయం దాటి చాలా దూరం మెట్లెక్కుతూ ముందుకు వెళ్లి పోయింది ఆమె.

కోలాహలంగా ఉన్న భక్తుల రద్దీ కేసి చూస్తూ గుడి లోకి వెళ్ళి గుడి ముందు నిలబడ్డ భక్తులకు హారతి ఇస్తూ అందరి తల మీద శఠగోపం పెడుతూ మరోసారి ఆమె వెళ్లిన దిక్కే చూసాడు పూజారి.

‘దేవతలా ఉంది...బాగా తెలిసిన....పరిచయమున్న వ్యక్తిలాగే ఉంది! ఎవరామె? ఎక్కడ చూసాడు?!’ పూజారి మెదడంతా ‘ఆమె’ జ్ఞాపకాల కోసం అన్వేషణ ప్రారంభమైంది.

ఒక్క సారి చూస్తే చాలు. జీవితాంతం గుర్తుండి పోయే సుందరమైన రూపం ఆమెది...గుడిలో అమ్మవారిలా కరుణతో నిండిన ఆకర్షణీయమైన వర్చస్సు.

‘ఎవరామె?! ఎక్కడ....ఎక్కడ....ఎక్కడ....చూసాడు?’ మనసులోనే ‘ఆమె’ జ్ఞాపకాలను మదిస్తూనే తన పనిలో నిమగ్నమయ్యాడు పూజారి.

గుడిలో భక్తులందరికీ వరుసగా పేరు పేరున అర్చనలు చేస్తున్నాడే గాని అతనిలో అంతర్మధనం సాగుతూనే ఉంది. ప్రధాన ఆలయం చేరుకోడానికి ఇంకా కొద్ది దూరమే ఉంది. భక్తులంతా ఉత్సాహంగా పరుగులు పెడుతున్నారు. కొందరు ఆయాసంతో మెట్లకు ఇరు వైపులా ఉన్న చప్టా మీద కూర్చుని సేద తీర్చుకుంటున్నారు.

సింహాద్రి అప్పన్న ఆలయం చేరువవుతున్న కొద్దీ భక్తుల్లో కోలాహం మొదలైంది. భక్తి శ్రద్ధలతో గోవిందా...గోవిందా అని అరుచుకుంటూ భక్తి పారవశ్యంతో ఉప్పొంగి పోతూ మెట్లెక్కుతున్నారు.

మెట్లకిరువైపులా ఉన్న దారల్లో క్యూలో నిలబడి మరీ స్నానాలు చేస్తున్నారు చాలా మంది భక్తులు.

మెట్లకిరు వైపులా సిమ్మెంటు చప్టా దగ్గర చిన్న చిన్న దుకాణాలు ఉన్నాయి. కాశీ తాళ్ళు, ఉంగరాలు, లాకెట్టు అమ్మే వాళ్ళు ఒక వైపు, కొబ్బరి కాయలు, అరటి పళ్ళు అమ్మే దుకాణాలు మరో వైపు వరుసగా లెక్కకు మించి ఉన్నాయి.

వర్తకులంతా మెట్లెక్కుతూ దేవాలయాన్ని చేరువవుతున్న భక్తులను అడ్డగించి మరీ  కొబ్బరి కాయలు  అరటి పళ్లతో ఉన్న ప్లాస్టిక్‌ సంచులు వాళ్ళ చేతుల్లో పెడుతున్నారు. భక్తులు వద్దు వద్దన్నా వినకుండా దబాయించి మరీ వారి దగ్గర డబ్బు లాక్కుంటున్నారు.

వర్తకుల్ని.... వారి చేష్టల్ని.... పరిసరాలను పరిశీలిస్తూ నడుస్తోంది ఆమె. దారల్లో స్నానాలు చేసి వచ్చిన భక్తులు తడి బట్టలతోనే ముందుకు సాగుతున్నారు.

ఆమె నిర్లిప్తంగా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఆగింది. వర్తకులంతా ఆమెని చుట్టుముట్టారు. ఎవరి మట్టుకు వాళ్ళు ఆమెపై కొబ్బరి కాయల సంచులతో దాడి చేసారు.

అందర్నీ తప్పించుకుంటూ ముందుకు నడిచింది ఆమె.

ఎత్తులో కొద్ది దూరంలో ఎదురుగా సింహాద్రి అప్పన్న ఆయం...దాని ముందు ఆకాశాన్ని తాకుతున్నట్టు నిలబడి సాదరంగా ఆహ్వానిస్తున్న గాలి గోపురం.

పిల్లా పాపలతో, ఆడా మగా దైవ దర్శనం కోసం క్యూ లైన్లలో అవస్థలు పడుతున్నారు.

చివరి మెట్టు దగ్గరే నిలబడి సింహాద్రి నాధుడు కొలువై ఉన్న ప్రధాన ఆలయం కేసి చూసింది. గాలి గోపురం లోనుండి దేదీప్యమానంగా వెలిగి పోతూ కనిపించింది గుడి. బంగారం తాపడంతో ధగ ధగా మెరిసి పోతోంది.

చాలా మంది  భక్తులు  ముందుగా  తలనీలాలు  సమర్పించి  స్వామి వారి దర్శనానికి వెళ్లాలని కేశ ఖండన శాల కేసి వెళ్తున్నారు. కేశ ఖండన శాలకు చేరువ లోనే ఉంది గంగ ధార. ఆలయానికి అర కిలో మీటరు దూరంలో ఉంది కేశ ఖండన శాల.

కేశ ఖండన శాలలో తల నీలాలు అర్పించి గంగ ధార లో శుచిగా స్నానాలు చేసి వస్తున్నారు భక్తులు.

నేరుగా కేశ ఖండన శాల దగ్గరకు చేరుకుంది ఆమె. ఆ భవనానికి ఎదురుగా వేడి నీళ్ళు మరగ బెట్టి బకెట్లతో అమ్ముతున్నారు కొందరు వర్తకులు. అంత చలిలో గంగ ధార స్నానం చేయ లేని భక్తులు వేడి నీళ్ళు కొనుక్కుని స్నానాలు చేస్తున్నారు.

గంగ ధారకు వెళ్ళే దారి లోనే ఒక ప్రక్క టోపీల దుకాణాలు...మరో ప్రక్క కేశ ఖండన శాలలో నున్నగా గుండ్లు చేయించుకున్న భక్తుల సౌకర్యార్థం స్నానాలు చేయడానికి వరుసగా ఏర్పాటు చేసిన కొళాయిలు ఉన్నాయి. అక్కడక్కడ చిన్న చిన్న టీ దుకాణాలున్నాయి. ఒకరిద్దరు కుర్రాళ్ళు బ్యాగుల్లో టిఫిన్‌ పొట్లాలు పట్టుకుని తిరిగి తిరిగి అమ్ముకుంటున్నారు. టీ ఫ్లాస్క్‌, గ్లాసు చేత్తో పట్టుకుని ఒకడు ‘టీ’ అమ్ముకుంటున్నాడు.

కొందరు భక్తులు స్వచ్ఛంగా కొండ కోనల్లో నుండి జల జలా పారుతూ వస్తున్న పుట్టుదారైన గంగ ధారలో స్నానం చేయడానికి పరిగెడుతున్నారు.

స్నానం చేసి వస్తూనే అంత హడావిడిలోనూ గుండ్లు చేయించుకున్న భక్తుల చేతిలో నామం, సింధూర తిలకాలతో తిరుగుతున్న జంగమ దేవరకు మొక్కి వారికి దక్షణగా చిల్లర సమర్పించుకుని నుదుట మీద నిలువు నామాలు దిద్దించుకుంటున్నారు.

కేశ ఖండన శాల భవనానికి చేరువ లోనే ఉన్న పెద్ద రాతి చప్టా మీద చతికిల బడి వచ్చే పోయే భక్తులను పరికించి చూస్తూ నిర్వికారంగా కూర్చుందామె.

భక్తులు ఎవరి హడావిడిలో వాళ్లున్నారు. కొందరు కేశ ఖండన శాలలోకి పరిగెడుతూ ఎత్తైన రాతి చప్టా మీద ఒంటరిగా కూర్చుని దిక్కులు చూస్తున్న ఆమె కేసి ఓసారి తేరిపార చూసి వెళ్తున్నారు.

చప్టా మీద కూర్చున్న ఆమె ఉన్నట్టుండి ఛెంగున క్రిందకు దూకింది. ఆమె అలా ఎత్తైన అరుగుల మీద నుండి క్రిందకు దూకడం చూసిన భక్తులు కొంప దీసి పడి పోయిందేమోననుకుని ఆమె దగ్గరకు పరుగున వచ్చి పట్టుకోబోయారు.

చప్టా మీద నుండి దూకిన తనని తాక బోతున్న ఇద్దరు ముగ్గురు ఆడ, మగ భక్తుల కేసి తీక్షణంగా చూసి వారి చేతును విదిలించుకుంటూ టోపీలు అమ్ముతున్న దుకాణం కేసి వెళ్లిందామె.

గంగ ధారకు వెళ్ళే రహదారికటూ ఇటూ ఉన్న పెద్ద రాతి గోడనానుకుని చాలా దుకాణాలు ఉన్నాయి. ఒక వైపు టీ దుకాణాలు, మరో వైపు టోపీలు, ఫేన్సీ దుకాణాలు ఉన్నాయి.

రాతి గోడని ఆనుకుని ఉన్న ఒక టోపీల దుకాణం దగ్గరకు వెళ్లిందామె. దుకాణం ప్రక్కనే రాతి గోడకు అతికించిన రక రకాల పిచ్చి పిచ్చి పోస్టర్లు ముందు నిలబడి తీక్షణంగా చూస్తూ పోస్టర్లన్నీ చేత్తో తడిమింది. పాన్‌ కార్డ్‌ కావాలా? అని ఒకటి, వస్త్ర దుకాణాలు, ఆసుపత్రులు ఒకటేమిటి ఎన్నోరకాల పోస్టర్లు అతికించి ఉన్నాయి.

అందులో ఒక పోస్టర్‌ కలర్‌ లో ఉంది. ఆ పోస్టర్‌లో పదేళ్ళ అందమైన అబ్బాయి ఫోటో దాని క్రింద ఈ అబ్బాయి ఆచూకీ తెలియ జేసిన వారికి పది లక్షల బహుమతి ఇవ్వ బడునని రాసి వుంది! దాని క్రింద నాలుగు ఫోన్‌ నెంబర్లు.

‘కనపడుట లేదు’ అన్న ఆ ప్రకటన చాలా చూడ ముచ్చటగా వుంది. చూసే వాళ్లకి ఆకర్షణగా బహుమతి మొత్తం పెద్ద పెద్ద అంకెల్లో ముద్రించారు.  ఆ పోస్టర్లు ఎక్కడ పడితే అక్కడ గోడలకు అంతికించారు.

అలాంటి పోస్టర్లు నాలుగైదు వరుసగా గోడలను అంటుకుని అందంగా చూపరులను ఆకర్షిస్తున్నాయి.

ఆమె ఆ పోస్టర్లను తదేక దీక్షగా చూస్తూ క్షణం నిలడింది. కుడి చేత్తో ఆ పోస్టర్లనన్నింటిని సదును చేస్తున్నట్టూ తడుముతూ పదిలక్షల అంకెను చూస్తూనే టక్కున ఆగి ఆ అంకెల మీదే దృష్టి నిలిపి నిలడింది ఆమె ఉన్నట్టుండి చుట్టూ దిక్కులు చూస్తూ క్రింద నేలంతా పరికించి చూసింది.

వేడి నీళ్ళు మరగ బెడుతున్న కర్ర పొయ్యి దగ్గర ఓ మూల నిప్పులు ఆర్పేసిన నల్ల బొగ్గులు ఆమె కంటపడ్డాయి.

గబాలున అక్కడకు వెళ్ళి ఒక బొగ్గు ముక్క తీసుకుని తిరిగి గోడ దగ్గరకు చేరుకుంది. కనపడుట లేదన్న ప్రకటనలో క్రింద రాసిన పదిలక్షలున్న అంకె ప్రక్కన వరుసగా సున్నాలు గీసుకుంటూ ఆ పోస్టరంతా సున్నాలతో నింపేసింది ఆమె.

బొగ్గు ముక్క అంతా అరిగి పోగానే ఒక్క సారి చేతులు దుపుకుని సున్నాలతో నిండి పోయిన ఆ పోస్టర్‌ని చూసి ఫకాలున నవ్వింది. నవ్వి... నవ్వి... టక్కున ఆపేసి ఉన్నట్టుండి వలవలా ఏడ్చేసింది.

(సశేషం)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్