Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.... http://www.gotelugu.com/issue260/698/telugu-serials/anveshana/anveshana/

స్వామి వారి కళ్యాణోత్సవాల్లో ఉత్సవ మూర్తులను ఈ రథం మీదే ఊరేగిస్తానరనుకుంటూ రథాన్ని, దాన్ని అలంకరణని తదేకంగా చూస్తూ క్షణం నిలబడింది.

‘‘రండమ్మా!...మీ సామాన్లు ఇక్కడ భద్ర పరుచుకోండి. రోజుకు పది రూపాయలే! దర్శనం అయి పోగానే మీ సామాన్లు మీరు భద్రంగా తీసుకోండి.’’ ఒక కుర్రాడు ‘ఇచ్చట సామాన్లు భద్ర పరచ బడును’ అన్న బోర్డున్న గది దగ్గర నిలబడి అరుస్తున్నాడు.

ఆ అరుపు  వింటూనే  అటు కేసి  చూసింది ఆమె.  ‘‘ఇక్కడ  సామాన్లు  భద్ర పరచ బడును’’  అన్న బోర్డు చూస్తూనే ఉత్సాహంగా వెళ్లి మెళ్లో ఉన్న బ్యాగ్‌ని అక్కడ భద్ర పరచడమే మంచిదనుకుంటూ బ్యాగ్‌ తీసి క్రింద పెట్టింది.

బ్యాగ్‌ కు ఉన్న నెంబర్‌ తాళం ‘కీ’ మనసు లోనే నెమరు వేసుకుంటూ తాళం తెరిచి బ్యాగ్‌ జిప్‌ తీసింది. తనకి అత్యంత అవసరమనుకున్న చిన్న చిన్న వస్తువులన్నీ చేతిలో ఉన్న చిన్న కేష్‌ పర్సు లాంటి దానిలో దాచుకుంది.

బ్యాగ్‌ యథాలాపంగా మూసేసి ‘తాళం’ నెంబర్లు చక చకా కల్లీ బల్లీగా చెల్లా చెదురు చేసి లాక్‌ చేసింది.

బ్యాగ్‌ క్లోక్‌ రూమ్‌లో దాచేసి రశీదు తీసుకుని పర్సులో భద్ర పరుచుకుంది.

‘హమ్మయ్య’ ఇక తనని గుర్తు పట్టడానికి ఒక ఆనవాలుని భద్రంగా దాచేసింది. ఇక రెండో పని!’ అని మనసు లోనే అనుకుంటూ కేశ ఖండన శాల కేసి నడిచింది ఆమె.

దర్జాగా నడుచుకుంటూ వెళ్లి కేశ ఖండన శాల దగ్గర స్వామి వారికి తల నీలాలు అర్పించడానికి చెల్లించాల్సిన రుసుము పది రూపాయలు కట్టి రశీదు తీసుకుంది.

స్వామి వారికి తల నీలాలు సమర్పిస్తున్న భక్తులు ఒకో క్షురకుడి దగ్గర క్యూలో నిలబడి ఉన్నారు.

ఆమె కూడా తన టిక్కెట్టు మీద ఉన్న నెంబరు ప్రకారం ఒక క్షురకుడి దగ్గర  గుండు చేయించుకోవడానికి సిద్ధంగా భక్తుల క్యూలో నిలబడింది.
‘గుండు చేయించుకుంటే ఇక తనని ఆ బ్రహ్మ దేవుడు కూడా గుర్తు పట్ట లేడు’ అనుకుంటూ మనసు లోనే మురిసి పోయిందామె.

***************

ఎస్సై ముందు నిజం ఒప్పుకోక పోతే ముసలమ్మని చంపింది తామేనని రూఢీ చేసుకుని నేరం మోపి జైల్లోకి నెట్టేసినా నెట్టేస్తాడు. చెప్పెయ్యాలి. ఈ గాయాలకి కారణం చెప్పెయ్యాలి. లేక పోతే ఇంతకంటే భయంకరమైన శిక్ష అనుభవించాల్సి వస్తుందని అనుకుంటూ ఇద్దరూ భయం భయంగా ఒకర్నొకరు ఎగాదిగా చూసుకుని కూడబలుక్కున్నట్లు ఇద్దరూ ఒక్క సారే మోకాళ్ల మీద కూర్చుని ఎస్సై కాళ్ల మీద పడ్డారు.
‘‘సార్‌! తప్పయింది క్షమించండి సార్‌! ఆవిడ అందంగా కనిపించే సరికి ఆమె మీద కన్నేసాం సార్‌. అర్ధ రాత్రి ఆమె పడుకున్న చెట్టు దగ్గర కెళ్ళి ఆమెని రేప్‌ చెయ్యాలనుకున్నాం సార్‌!’’ ఏడుస్తూ ఒకడు ఎస్సై కాళ్లు పట్టుకున్నాడు.

ఆ యువకుడు చెప్పింది వినే సరికి ఎస్సైకి మతి పోయింది. ‘తానేదో ఆరా తీయ బోతే ఇంకేదో చెప్తున్నారు వీళ్ళు. చూద్దాం! ఏం చెప్తారో’ అనుకున్నాడు మనసు లోనే.

ఆ కుర్రాళ్లిద్దరూ ఏడుస్తూ ఎస్సై కాళ్ల మీద పడి జరిగింది చెప్తుంటే చుట్టూ గుమి గూడిన జనం ‘అవ్వ’ అనుకుంటూ నోర్లు వెళ్లబెట్టి ఆశ్చర్యంగా చూస్తూండి పోయారు.

‘‘రేప్‌ చెయ్యబోతే`? చెప్పండి ముసలమ్మ అడ్డుగా ఉందని కత్తితో పొడిచి చంపేసారు. అవునా?!’’ గద్దించాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘అయ్యో! ఆ ముసలమ్మ సంగతే మాకు తెలీదు సార్‌. ఆమెని మేమిద్దరం బలాత్కరించ బోయే సరికి ఆవిడ ఆడ పులిలా మా మీద పడి ఎక్కడ నుండి తీసిందో గాని చిన్న చుర కత్తితో ఇదిగో ఇలా మా ఇద్దర్నీ గాయ పరిచి తన్ని తరిమేసింది సార్‌! అది ఆడది కాదు సార్‌! ఆది పరాశక్తిలా మా మీద విరుచుకు పడింది. ఆ దెబ్బతో ఇద్దరం పారిపోయి వచ్చేసాం సార్‌! అంతే సార్‌ జరిగింది.’’ రెండో వాడు ఏడుస్తూ తమ తప్పంతా ఒప్పుకుంటూ ఎస్సై అక్బర్‌ ఖాన్‌ కాళ్ల మీద పడి క్షమించమని వేడుకున్నాడు. ఎస్సైకి తల తిరిగి పోయింది.

‘ఎవరామె?! చుర కత్తి బొడ్లో దోపుకుని తిరిగేంత అవసరం....అగత్యం ఏముంది?!’

ఇంత జరిగాక కూడా ఆమె పోలీసుకు ఎందుకు రిపోర్టు ఇవ్వ లేదు? ఒక వేళ వీళ్ళిద్దరూ అబద్ధం ఆడుతున్నారా?!

‘‘ఆమెని చూస్తే మీరు గుర్తు పట్టగలరా?!’’ వాళ్లిద్దర్నీ క్రింద నుండి పైకి కాలర్‌ పట్టి లేవనెత్తుతూ అన్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘గుర్తు పడతాం సార్‌. ’’ హుషారుగా అన్నారిద్దరు.

‘‘కానిస్టేబుల్‌ వీళ్లిద్దర్నీ స్టేషన్‌కు తీసుకురా!’’ అంటూనే కిరాణా దుకాణం దగ్గర నుండి వచ్చేస్తూ ‘‘అన్నట్టు మీరు కూడా పోలీస్‌ స్టేషన్‌కు ఓసారి రావాల్సి వుంటుది వరహాల శెట్టి గారు.’’ దుకాణం కేష్‌ కౌంటర్‌లో కూర్చున్న వరహాల శెట్టితో చెప్పాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘అలాగే సార్‌’’ అంటూ వినయంగా నిలబడి చెప్పాడు వరహాల శెట్టి.

ఎస్సై అక్బర్‌ ఖాన్‌ బుల్లెట్‌ స్టార్ట్‌ చేసి తారా జువ్వలా ముందుకు ఉరికించాడు.

*******************

కేశ ఖండన శాలలో తల నీలాలు అర్పించి గంగధార దగ్గరకు వచ్చింది ఆమె. అక్కడంతా రద్దీగా వుంది. తల నీలాలు అర్పించిన భక్తులంతా క్యూలో ఒకర్నొకరు తోసుకుంటూ గంగ ధారలో స్నానానికి మునుగుతున్నారు.

ఎక్కడో  కొండ కోనల్లో  నుండి  నిరంతరం  పారుతూ  వచ్చే గంగ ధార అన్నికాలాల్లోనూ ఆగకుండా పారుతూనే ఉంటుంది. గంగ ధారలో మునిగితే పాపాలన్నీ పటాపంచలై పోతాయని భక్తుల నమ్మకం.

తల నీలాలు అర్పించి గంగ ధారలో మునిగి వచ్చిన వాళ్లందరికి జంగమ దేవర ‘నామాలు’ పెడుతూ డబ్బు వసూలు చేస్తున్నాడు.
ఆమె గంగ ధారలో స్నానం చేసి తడి బట్టలతోనే నేరుగా సింహాద్రి అప్పన్న దర్శనానికి క్యూలో నిలబడింది. వంద రూపాయల ప్రత్యేక దర్శనం క్యూ లైను రెండు కిలో మీటర్ల మేర పొడవుగా భక్తులతో చాంతాడులా పాకి పోయి ఉంది.

ఉచిత దర్శనాల క్యూ అయితే మరి చెప్పక్కర లేదు. కొండ మీద మాడ వీధులన్నీ మెలికలు తిరిగి ఉంది క్యూ.

ఏది ఏమైనా ఈ రోజు అప్పన్న స్వామిని దర్శించుకుని రావాలని స్థిరంగా నిర్ణయించుకుందామె.

క్యూలో నించుందే గాని మనసు దేవుడి మీద లగ్నం కావటం లేదు.

‘ముసలమ్మ’కి తన శాలువా కప్పి తప్పు చేసిందా?! ఇప్పుడు తన ఉనికి కూడా బయట పడేలా వుంది. ఎలా?! తన అన్వేషణ కొనసాగడం ఎలా?! తన జీవిత గమ్యం అదే! తన బ్రతుక్కి పరమార్థం...తన జన్మకి చరితార్థం...అదే...తన అన్వేషణ ఫలిస్తేనే తను ఉండ గలదు. లేక పోతే....ఒక వేళ ఫలించక పోతే...అమ్మో’ అనుకుంది. ఆ ఆలోచన మనసులో మెదలగానే నిలువెల్లా భయంతో కంపించుకు పోయింది ఆమె.
‘‘దేశం నలు మూలలా తిరిగైనా తన అన్వేషణ కొనసాగిస్తుంది గానీ, ప్రాణం పోయినా వెనకడుగు వెయ్యదు. వెయ్య లేదు!’’ తన జీవిత గమ్యం అదే కదా స్థిరంగా అనుకుంది ఆమె.

******************

గోపాల పట్నం పోలీస్‌స్టేషన్‌..

ఎస్సై అక్బర్‌ ఖాన్‌ ఒంటరిగా సీట్లో కూర్చుని ఆలోచిస్తున్నాడు. కొండపై నుండి నేరుగా స్టేషన్‌ కొచ్చేసాడు. ముసలమ్మ శవాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తీసుకు వెళ్లారు.

ముసలమ్మ తరఫు వాళ్ళు ఎవరూ లేరు. వస్తారో....రారో....తెలీదు. అనాథ శవంగా కేసు క్లోజ్‌ చేయడానికి వీలు కాదు. ‘హత్య’ చేసి చంపేసారు. ఎవరో? ఇది యాదృచ్ఛికమా?! కావాలనే చంపేసారా? ఎందుకు?! ముసలమ్మ దగ్గర అంత విలువైన వస్తువులు ఏమున్నాయి? లెక్క లేనంత నగలు...నగదు ఉందా?

సహజ మరణమైతే అక్కడే పంచనామాతో కేసు ముగించేసే వాడు. కానీ, ఈ హత్యోదంతాన్ని ఎలా పరిశీలించాలి?! పరిశోధించాలి!
హత్య జరిగిన రాత్రి ముసలమ్మతో ఎవరో మరొకామె కూడా ఉందన్నది రూఢీ అయింది. ఎవరామె! కిరాణా దుకాణం యజమాని వరహాల శెట్టి చెప్పిన దాని ప్రకారం ఎవరో ఒకామె ఈ ముసలమ్మకి రొట్టె, జామ్‌ కొని ఇచ్చిందన్నది నిజం. ఆమె ఆ రొట్టెలో ‘మత్తు’ మందు కలిపిందా?! తెలివి లేకుండా పడుకున్న ముసలమ్మని పొడిచి పారి పోయిందా?! ఎందుకు?! ఆలోచిస్తున్న కొద్దీ తల తిరిగి పోతోంది ఎస్సై అక్బర్‌ ఖాన్‌కి.
ఆ తర్వాతే హత్య జరిగింది.

ఇంతలో స్టేషన్‌ రైటర్‌ ఎస్సై అక్బర్‌ ఖాన్‌  గది దగ్గరకొచ్చి తలుపు తట్టి ‘సార్‌’ అని పిలిచాడు. రైటర్‌ పిలుపుకి ఆలోచనల్లోనుండి తేరుకున్న ఎస్సై ‘‘కమిన్‌’’ అంటూ ద్వారం కేసి చూసాడు. రైటర్‌ స్ల్యూట్‌ చేసి గదిలో కొచ్చాడు.

‘‘చెప్పు.’’ హుందాగా, నీటుగా జేరగిల బడి అన్నాడు ఎస్సై.

‘‘సార్‌! కొండ మీద హత్య చేయబడ్డ ముసలమ్మ దగ్గర దొరికిన చిన్న బట్టల మూటలో ఈ డాక్యుమెంట్లు ఉన్నాయి సార్‌?!’’ అంటూ చేత్తో పట్టుకొచ్చిన కాగితాలు ఎస్సై టేబుల్‌ మీద పెట్టాడు రైటర్‌.

‘‘ఎస్‌!...ఆ ముసలమ్మ దగ్గర బట్టల మూట దొరికింది కదూ. శవం దగ్గర దొరికిన ప్రతి వస్తువు ఎలిబీ లిస్టులో రాయండి.’’ అంటూనే తన ముందు రైటర్‌ పెట్టిన డాక్యుమెంటు పేపర్లు తీసి చూసాడు ఎస్సై. 1971లో రిజిస్టర్‌ అయిన డాక్యుమెంటది.

డాక్యుమెంటు మొత్తం పేజీలన్నీ చదివాడు. డాక్యుమెంటుతో బాటు రెండు పేజీల ఉత్తరం కనిపించింది. ఎప్పుడో ఏడాది క్రితమే రాసిన ఉత్తరం. పైన తేదీని బట్టి గ్రహించాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘నమస్కారం!

మీరెవరో నాకు తెలియదు. నేనెవరో మీకు తెలియదు.

ఉత్తరం ఉపోద్ఘాతం చదువుతూనే అదిరి పడ్డాడు ఎస్సై. ఏరికోరి కొనుక్కున్న రివాల్వింగ్‌ చైర్లో రిలాక్స్‌డ్‌గా కూర్చున్న ఎస్సై అక్బర్‌ ఖాన్‌ ఛటుక్కున ముందుకు జరిగి నిటారుగా కూర్చున్నాడు.

ఆ ఉత్తరంలో ఏముంది? అక్బర్ఖాన్ చేయబోయే కేసు పరిశోధనకి ఎంతవరకూ ఉపయోగపడింది?? కేసుని ఏ కొత్త మలుపులు తిప్పింది?? పోలీసులకు దొరక్కుండా అక్కడక్కడే సంచరిస్తున్న  ' ఆమె ' ఎవరో తెలిసిపోయిందా....?????

ఈ సస్పెన్స్ వీడాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంట దాకా ఆగాల్సిందే........

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
premiste emavutundi?