Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

కాత్యాయని

katyayani

గత సంచికలోని కాత్యాయని  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి... http://www.gotelugu.com/issue297/772/telugu-serials/katyayani/katyayani/

(గత సంచిక తరువాయి)...ఆమేం మాట్లాడకపోయేసరికి "ఏమ్మా, ఆరోగ్యం బాగాలేదా?" అడిగి "పాపం, మీ ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పటి నుంచి కడుపు  నిండా సరిగా తినడం లేదు, కంటి నిండా నిద్రపోవడం లేదు. ఇలా అయితే ఎలా చెప్పు?" అన్నాడు బాధగా.

‘తను ఏం చెబుతుంది? డబ్బు ఎరగా వెదజల్లి మనోహర్ తమ జీవితాలతో ఆడుకున్నాడని ఎలా చెబుతుంది, పైగా మనోహర్ తనతో ఒక రాత్రి గడపమన్నాడని తండ్రితో నిస్సిగ్గుగా ఎలా చెబుతుంది. పరిస్థితులన్నీ ఒక్కసారిగా పగబట్టి కార్నర్ చేసినట్టుగా అనిపిస్తోంది.’

పమిట కొంగుతో కళ్లు తుడుచుకుని "ఏం లేదు నాన్నా, తల నొప్పి వచ్చింది. నొప్పి భరించలేక పోయాను. అందుకని ఇంటికెళ్లి కాఫీతో మాత్ర వేసుకుని కొద్దిసేపు పడుకుని వచ్చాను. పదండి ఆయనున్న వార్డ్ కెళదాం"అంది.

ఇద్దరు వెళ్లేసరికీ తనకు కనెక్ట్ చేసిన మానీటర్ లోని పల్సెస్ వంక నిర్లిప్తంగా చూస్తూ కనిపించాడు కమలాకర్. గదిలోకి వచ్చిన భార్యని, మామగారిని చూసి పేలవంగా నవ్వాడు.

"ఇంకేంటయ్యా..రేపు నీకు ఆపరేషన్ జరిగితే నువ్వు పులి అయిపోతావు. భగవంతుడు ఆ మనోహర్ రూపంలో వచ్చి మనకింత ఉపకారం చేశాడు. నీ మంచి మనసు, కాత్యాయని చేసిన పూజలూ ఎక్కడికి పోతాయి చెప్పు. దేవుడు లేడూ"అన్నాడు అచ్యుతరామయ్య అల్లుడికి ధైర్యం నూరిపోస్తూ.

’పిచ్చి నాన్న, ఆ మనోహర్ ఇదంతా ఊరకే చేస్తున్నాడనుకుంటున్నాడు. మనోహర్ తను చేసినదానికి బదులుగా కూతురు మానాన్ని కోరుకుంటున్నాడని తెలిస్తే కుప్పకూలిపోతాడు’ మంచం మీద మడతలు పడిపోయి లుంగచుట్టుకుపోయున్న దుప్పటీని సరిజేసి కమలాకర్ తలకింద దిండును సరిగా పెడుతూమనసులో అనుకుంది.

*****

హాస్పిటల్ స్టాఫ్ కమలాకర్ ను ఆపరేషన్ కి సిద్ధం చేస్తున్నారు.

"కమలాకర్ కు ఇవాళ ఆపరేషన్ అని తెలుసుగా, మనోహర్ గారు రాలేదేమిటి? ఆయనుంటే కాస్త ధైర్యంగా ఉండేదమ్మా. "అన్నాడు అచ్యుతరామయ్య.

కాత్యాయని ఏం మాట్లాడలేదు.

రెండుగంటల ఆపరేషన్ పూర్తయిం తర్వాత ఐసీయూలో ఉంచారు కమలాకర్ ను.

ఓ పెద్ద ఫ్లవర్ బొకె ను కమలాకర్ స్పీడీ రికవర్ కోసం పంపించాడు మనోహర్. కాత్యాయని దాన్ని పెద్దగా పట్టించుకోలేదు కాని, కమలాకర్ కోలుకున్నాక చూపించాలని దాన్ని భద్రంగా పెట్టాడు అచ్యుతరామయ్య.

ఓ ఐదు రోజులు కమలాకర్ ను ఐ సి యూ లోను, మరో ఐదు రోజులు జనరల్ వార్డ్ లోనూ ఉంచి పూర్తిగా కోలుకున్నాక మళ్లీ ఎప్పుడు విజిట్ చేయాలో, ఏ టెస్టులు చేయించుకుని ఎప్పుడు రావాలో, ఏ మందులు ఎప్పుడెప్పుడు వాడాలో ప్రిస్కైబ్ చేసి సమ్మరీ షీట్ ఇచ్చి డిస్చార్జ్ చేశారు.

అప్పటి దాకా అయిన కర్చులన్నీ మనోహర్ నియమించిన చైతన్య అనే కుర్రాడు దగ్గరుండి చూసుకున్నాడు. మనోహర్ అతన్ని ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా కేవలం పనిమీదే కాన్సన్ ట్రేట్ చేయమన్నట్టున్నాడు, ఎవరితో ఏం మాట్లాడకుండా కావలసిన పనులను గ్రహించి, కొన్ని ముక్తసరిగా అడిగి తెలుసుకుని చక్కగా నెరవేర్చేవాడు.

ఒక రోజు అన్ని ఫెసిలిటీస్ ఉన్న అంబులెన్స్ లో కమలాకర్ ను ఇంట్లో డ్రాప్ చేశారు. పక్కింటావిడ గుమ్మడికాయతో దిష్టి తీసి వాళ్లను లోపలికి ఆహ్వానించింది. కమలాకర్ తల్లికయితే ఆనందం అర్ణవమైంది. కళ్లు ఆనందబాష్పాల చెలమలయ్యాయి.
కాత్యాయని మనసులోకి అప్పుడప్పుడూ మనోహర్ వాంఛ వచ్చి చిత్రవధ చేస్తోంది.

కానీ ఏం చేయగలదు.

ఇంట్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయించాడు చైతన్య. అంతేకాదు దగ్గరున్న పేథలాజికల్ లాబ్ వాళ్లతో, అపోలో మెడికల్ షాప్ వాళ్లతో, కమలాకర్ వాళ్లకు ఏవి ఎప్పుడు కావలసి వచ్చినా ఇమ్మీడియేట్ గా అరెంజ్ చేయ్యాలని వాటికి కావలసిన అమౌంట్ తను పే చేస్తానని చెప్పాడు.

ఇప్పుడు ఇల్లు ఒక రూపాన్ని సంతరించుకున్నట్టుగా అనిపించింది కాత్యాయనికి. రోజులు ఇంతకుముందంత భారంగా లేవు. కమలాకర్ మెల్లగా నాలుగడుగులతో మొదలెట్టి బాగానే నడుస్తున్నాడు. నవ్వుతూ అహ్లాదంగా, ఉల్లాసంగా ఉన్నాడు. పునర్జీవనం పొందాడు కదా! అతన్ని చూస్తే కాత్యాయనికీ ఆనందంగా ఉంది.

అనుకోకుండా కేలండర్ చూసిన కాత్యాయనికి ఇంకో రెండు రోజుల్లో మనోహర్ తనకిచ్చిన టార్గెట్ డేట్ అన్న విషయం స్ఫూరణకొచ్చింది. మనసు వికలం అయిపోయింది.

కాత్యాయని తన భర్తను బతికించిన మనోహర్ అడిగిన అవాంచనీయమైన కోరిక తీర్చడానికి ముందుకెళ్తుందా.. లేదా అనేది తెలుసుకోవాలంటే వచ్చేశుక్రవారం విడుదలయ్యే సంచికలో చూడండి. 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
anveshana