Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
katyayani

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి.... http://www.gotelugu.com/issue297/773/telugu-serials/anveshana/anveshana/

(గత సంచిక తరువాయి)‘‘అది వాళ్ల పర్సనల్ రిస్క్ మీద ఇస్తారండీ! ఎవరైనా గదిలో ఆత్మహత్య చేసుకుంటే ఎన్ని ఆరాలు తీస్తాం. ఒంటరిగా వచ్చిన వాళ్లకి ఎందుకు రూమ్ ఇచ్చావని మనమేగా లాడ్జీ యజమానుల్ని నిలదీస్తాం. అడ్రస్ ప్రూఫ్ లు తీసుకుంటేనే గాని వాళ్లు కూడా రూమ్ లు ఇవ్వరు. ఇవ్వకూడదు. మనకు తెలీంది ఏముంది సార్!’’ అని అన్నాడు రామ్.

అవసరమనుకుంటే కాల్ చేస్తే అరగంటలో దగ్గరుంటానని చెప్పి వెళ్ళిపోయాడు రామ్.

అప్పట్నుండీ అసహనంగా ఆలోచిస్తూనే రూమ్ లో అటూ ఇటూ తిరుగుతున్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.

ఇంతలో సెల్ రింగయింది.

గబాలున  వెళ్లి టీ.వి.  ప్రక్కనే  పెట్టిన  సెల్ తీసి  చూసాడు.  కొత్త  నెంబరు  సెల్ లో ఫీడయి లేదు...ఎవరై ఉంటారబ్బా?! అనుకుంటూ సెల్ చెవి దగ్గర పెట్టుకున్నాడు.

‘‘హలో!’’ నెమ్మదిగా అన్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘సార్! నేను ‘యలమంచిలి’ హౌస్ నుండి మాట్లాడుతున్నాను.’’ తియ్యగా ఉంది గొంతు. ఆ అమ్మాయే అనుకున్నాడు. అక్బర్ ఖాన్ మనసులోనే.

‘‘చెప్పండి!’’ హుందాగా అన్నాడు.

‘‘మీకు రేపు ఉదయం తీరికవుతుందా?’’ అడిగింది మనోరమ.

‘‘ఎందుకో?!’’ హాస్యంగా అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘మీతో మా శోభాదేవి మేడమ్ రహస్యంగా కలవాలనుకుంటున్నారు. మీకూ నాకు తప్ప ఈ విషయం వేరెవరికీ తెలీకూడదన్నారు.’’ నెమ్మదిగా చెప్పిందా అమ్మాయి మనోరమ.

మనోరమ చెప్పింది వింటూనే ఒక్క క్షణం  ఆశ్చర్యపోయాడు  మరుక్షణం ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ‘ఏదో విషయం ఉంది’ అందుకే శోభాదేవి గారే కలవాలనుకుంటున్నారు.’ మనసు లోనే పరిపరి విధాలా ఆలోచించాడు ఎస్సై అక్బర్ ఖాన్.. 

‘‘ఎస్! నేను ఫ్రీగానే ఉంటాను. ఎక్కడ కలవమంటారో కనుక్కోండి.’’ అన్నాడు.

‘‘ఆ విషయం మీకు నేను సాయంంత్రం చెప్తాను సార్! ఇది నా సెల్ నెంబర్. సేవ్ చేసుకోండి. నేను  డ్యూటీ దిగి ఇంటికొచ్చే ముందు కాల్ చేస్తాను. సరేనా?!’’ అంది మనోరమ.

‘ఓ! అంతకన్నా అదృష్టమా! దేవతే దిగి వస్తానంటే ఈ భక్తుడు వేయి కళ్లతో ఎదురుచూస్తూ కూర్చోడా.’’ ఆ అమ్మాయి తనే వచ్చి కలుస్తానని చెప్పే సరికి మరింత సంబర పడిపోయాడు ఎస్సై అక్బర్ ఖాన్. ఆయనకి తెలీకుండానే ఆయనలోని భావుకుడు ప్రేమికుడై విజృంభించేసాడు.
    ‘‘సార్....సార్.... మీరు చేస్తున్న ఉద్యోగానికి...మీ మాటలకి ఎక్కడా పొంతన కనిపించటం లేదు. కొంప దీసి ఈ పైత్యంలో కలలు గంటూ అసలు విషయం మర్చి పోకండి. సాయంత్రం అయిదో గంటకి ఇక్కడ డ్యూటీ దిగగానే కాల్ చేస్తాను. అప్పుడు ఎక్కడ కలవాలో చెప్పండి బై’’ అంటూ టక్కున ఫోన్ పెట్టేసింది మనోరమ.

ఎస్సై అక్బర్ఖాన్ కి  మనసంతా ఉల్లాసంగా ఉంది. ఒక వైపు ఎంతో జటిలమైపోతోందన్న కేసు ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు తనకే తెలీకుండా ఇష్టపడుతున్న మనోరమ తనే స్వయంగా వచ్చి కలుస్తాననడంతో ఉప్పొంగిపోయాడు.

ఆ అమ్మాయిలో ఏదో తెలీని ఆకర్షణ... మాటల్లోనో...చూపుల్లోనో...రూపంలోనో...ఏమో! కానీ, ఎస్సై అక్బర్ ఖాన్ ఆ అమ్మాయి పట్ల ఆకర్షితుడైపోయాడు.

ముప్ఫై ఏళ్ళు మీద పడ్డా...అయిదేళ్ళుగా ఉద్యోగం చేస్తున్నా ఇన్నాళ్లూ పెళ్లి ధ్యాస పట్టలేదు. డ్యూటీ.... డ్యూటీ...డ్యూటీ...అదే ధ్యాస. అదే ధ్యానంలో గడిపాడు. గడుపుతున్నాడు. ఎక్కడ  విశాఖపట్నం... ఎక్కడ చెన్నై... అదీ పరిశోధనలో భాగంగా వస్తే ఈ అమ్మాయి ఎదురు కావాలా?! అయింది. పనిలో ఉన్నప్పుడు... ఊరు మీద పడి తిరిగినప్పుడు... పనిలో పనిగా వంద మంది పలకరిస్తారు. పరిచయమౌతారు. అయ్యారు కూడా! వాళ్ళెవరూ తన మనసుకి ఇంత దగ్గరగా రాలేకపోయారెందుకు?! ఎందుకు?! ఇందుకేనా?! ఇక్కడ ఈ అమ్మాయి నాకోసమే ఎదురుచూస్తోందా?! ఓ! అల్లా! ఇలా కలిపావా మా బంధాన్ని!

మంచం మీద పడి దొర్లుతూ పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ ‘మనోరమ’ ని కలవగానే ఎలా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? అనుకుంటూ ఎన్నో పథకా లు... ప్లాన్ లు వేసుకున్నాడు.

సాయంత్రం అయిదో గంటకి కాల్చేస్తానన్న మనోరమ మాటలు గుర్తుకు రాగానే టక్కున లేచి సెల్ ఫోన్ ఛార్జింగ్ ఉందో లేదో చూసుకున్నాడు. ఫోర్జి ఆండ్రాయిడ్ సెల్ క్షణాల్లో ఛార్జింగ్ అయిపోతోంది. క్షణాల్లో ఛార్జింగ్ ఎక్కిపోతుంది.

సెల్ ఛార్జింగ్ రెండు పాయింట్లే ఉంది. గబగబా ఛార్జింగ్ పెట్టాడు. మనోరమ నెంబర్. ఫోన్ లో సేవ్ చేసుకున్నాడా? లేదా? అమ్మో అన్ నోన్ నెంబరని ఒకోసారి స్పందించడు. అనుకుంటూ పావుగంట క్రితం వచ్చిన రిసీవర్ కాల్స్ చూసాడు     నెంబర్ సేవ్ చెయ్యలేదు. టక్కున ఆ నెంబర్ సేవ్ చేస్తూ క్షణం ఆలోచించాడు. మనోరమ పేరు మీద చేద్దామా? సంతలో చింతకాయలా అన్ని పేర్లలో కలిసి పోకుండా ప్రత్యేకంగా ఉండాలంటే... ఎలా అనుకుంటూ ‘మై హార్ట్’ అని టక్కున ఫీడ్ చేసాడు మనోరమ నెంబరు.

మైహార్ట్!’ మరోసారి చెక్ చేసుకుంటూ ఏదో గుర్తొచ్చిన వాడిలా ఫేంటు జేబులో చెయ్యి పెట్టి చిన్న స్లిప్ తీసాడు. ఉదయం వచ్చేస్తున్నప్పుడు మనోరమ రాసిచ్చిన నెంబరు రెండూ ఒకటేనా అనుకుంటూ చెక్ చేసాడు. అదే నెంబర్. ఆలోచిస్తూనే మధురమైన కలతో కళ్ళు మూసుకున్నాడు ఎస్సై అక్బర్ఖాన్. ఉన్నట్టుండి టక్కున లేచి కూర్చున్నాడు. ఆకలి దంచేస్తోంది. అప్రయత్నంగానే గోడకి వ్రేలాడుతున్న గడియారం కేసి చూసాడు. మధ్యాహ్నం రెండు గంటలవుతోంది.

‘అమ్మో!’ అనుకుంటూ గబగబా బట్టలు వేసుకుని క్రిందకు దిగాడు. రూమ్ లోకే తెప్పించుకు తింటే గదంతా ఖరాబవుతుంది. చెత్తగా ఉంటే చిరాకేస్తుంది. క్రింద రెస్టారెంట్లో నచ్చిన ఫుడ్ ఆర్డరిచ్చి నచ్చినంత సేపు కూర్చుని హాయిగా... నెమ్మదిగా తినొచ్చనుకుంటూ చిన్నగా విజిల్ వేసుకుంటూ దిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.

విధినిర్వహణా? ప్రేమా...? ఎటువైపు అక్బర్ ఖాన్ పయనం??? తెలుసుకోవాలంటే వచ్చే శుక్రవారం విడుదలయ్యే సంచికలో చూడండి.  

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్