Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
katyayani

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి... http://www.gotelugu.com/issue304/787/telugu-serials/anveshana/anveshana/

(గత సంచిక తరువాయి)....." మాతమ్ముడిది………!అరకు వ్యాలీ ఫాం హౌస్ లో ఈ డైరీ దొరికిందని మహాశ్వేత చెప్పింది. అది చదివే షాకయిందట. అప్పుడే విశాఖపట్నంలో పనుందని చెప్పి ట్యాక్సీలో బయలుదేరిందట. కారులోనుండి క్రింద దూకినప్పుడే నాకన్నా ప్రాణంగా ఈ డైరీనే గుండెల్లో దాచుకున్నానత్త అంటూ నన్ను భద్రంగా దాయమని ఇచ్చింది" అంది శోభాదేవి.

" ఏముందబ్బా ఇందులో" అనుకుంటూ పేజీలన్నీ గబగబా తిరగేసాడు అక్బర్ ఖాన్. ఒకచోట పేజీలు మడతపెట్టి ఉన్నాయి. బహుశా మహాశ్వేత ఇదే చదివి గుర్తుగా మడతపెట్టిందా?" అనుకుంటూ ఆ పేజీలు మడత విప్పి మనసులోనే చదువుకున్నాడు అక్బర్ ఖాన్.
మే 18 2010.

విశాఖపట్నంలో ఎక్కడో...ఏదో అనాథ శరణాలయంలో బాబుని వదిలేసి వచ్చానని వాచ్ మెన్ చెప్పాడు. వాడు నా నమ్మినబంటు. అరకువ్యాలీలో ఫాం హౌస్ లోనే పడి ఉంటాడు. ఈ రహస్యం ఎవరికీ చెప్పడుకాక చెప్పడు.

మహాశ్వేతకు ఇంకా తెలివి రాలేదు. డెలీవరీ అయి రెండోరోజు కావొస్తోంది. నాకెందుకో భయంగా ఉంది. ఆయా కంటికి రెప్పలా చూస్తున్నా నాకెందుకో భయంగానే ఉంది. విశాఖపట్నం తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేద్దామంటే నలుగురికి మహాశ్వేత బాలింత అని తెలిసిపోతుంది. ఏం చెయ్యాలి?

మే 20 2010

మహాశ్వేతకు తెలివి వచ్చింది. నాతో మాట్లాడింది. పురిటిలోనే బిడ్డపుట్టి చనిపోయిందని ఆయాతో చెప్పించాను. నమ్మేసింది. మహాశ్వేత ఆరోగ్యం కుదుటపడిటె చెన్నై వెళ్ళిపోవాలి. ఈ రహస్యం రహస్యంగానే మిగిలిపోవాలి.

ఒకదానితర్వాత ఒకటి పేజీలు తిరగేస్తూ చదివాడు అక్బర్ ఖాన్. మే18న మహాశ్వేత ఒక మగబిడ్డకి జన్మనిచ్చింది. విషయమంతా ఒక్కొక్కటిగా అర్థమౌతోంది.

" దీన్నిబట్టి మహాశ్వేతాదేవి అనాధాశ్రమంలో ఉన్న తనబిడ్డకోసం వెతుక్కుంటోంది. అంతేనంటారా?" అడిగాడు అక్బర్ ఖాన్.

" అవును బాబూ! బిడ్డ దొరికేవరకూ ఇంటికి రానని భీష్మించుకు కూర్చుంది" అంది శోభాదేవి.

అవును, ఇంటికి వచ్చినా ఆమె మీద మళ్ళీ హత్యాప్రయత్నం జరగదన్న నమ్మకం ఏముంది" ఇంతకీ ఈ హత్యలన్నీ ఎవరు చేయిస్తున్నారంటారు?" కావాలనే అడిగాడు అక్బర్ ఖాన్.

" ఏమో! ఆ పరమాత్ముడికే తెలియాలి బాబూ!" అంది శోభాదేవి.

"ఎవరో ఏమిటి సార్,! ఆయనే...మేడం మహాశ్వేతాదేవి గారి భర్త హరిశ్చంద్రప్రసాద్ గారే అయుంటుంది" కోపంగా అంది మనోరమ. నిన్న అక్బర్ ఖాన్ చెప్పిందంతా గుర్తుపెట్టుకుని ఉక్రోషంగా అనేసింది.

చిన్నగా నవ్వి మౌనంగా ఉండిపోయాడు అక్బర్ ఖాన్.

" మేడం! ఇప్పుడు మహాశ్వేతాదేవి ఎక్కడున్నారో చెప్పగలరా?" ఉన్నట్టుండి అడిగాడు అక్బర్ ఖాన్.

"మహాశ్వేతకు ఏమీ తెలీదుబాబూ! ఆ హత్యలకీ తనకీ ఎలాంటి సంబంధం లేదు. దయచేసి దాన్ని పోలీసుకేసులో ఇరికించకండి" ప్రాధేయపడుతూ వేడుకుంది శోభాదేవి.

" మాకు తెలుసమ్మా! మహాశ్వేతాదేవిని చంపడానికి వచ్చిన హంతకులు గురితప్పి అన్నెంపున్నం ఎరుగని ముగ్గురు యాచకుల మరణానికి కారకులయ్యారు. అందులో మహాశ్వేతాదేవి తప్పులేదు. మీకు తెలుసా..? మరణించిన ముగ్గురిలో మహాశ్వేతాదేవి అమ్మమ్మ సత్యవతి గారు కూడా ఉన్నారు." చెప్పాడు అక్బర్ ఖాన్.

" ఏమిటి బాబూ నువ్వనేది? మా మరదలు తల్లి, మా తమ్ముడి అత్తగారు ఉన్నారా? నిజమా??" ఆశ్చర్యంతోబాటు ఆందోళనగా అంది శోభాదేవి.

రాజమండ్రిలో తను తెలుసుకున్న విషయాలన్నీ శోభాదేవికి విడమర్చి చెప్పాడు అక్బర్ ఖాన్.

" అనుకోకుండానే తన అమ్మమ్మని కలుసుకుందా మా మహాశ్వేత?" బాధగా అంది శోభాదేవి.

" చెప్పండమ్మా! మనం ఎంత వేగంగా మహాశ్వేతాదేవిగారిని చేరుకోగలిగితే ఆమెకి అంత తొందరగా రక్షణ కల్పించగలము. హంతకుడు తన టార్గెట్ ప్రకారం మహాశ్వేత తండ్రిని చంపేసాడు. మహాశ్వేతని కూడా చంపేయబోయాడు. మహాశ్వేత చావలేదూ. బ్రతికే ఉందన్న రహస్యం తెలిసిపోయింది వాడికి అందుకే ప్రతిక్షణం ఆమె కదలికలు కనిపెట్టి హత్యాప్రయత్నాలు చేస్తున్నాడు.

ప్రపంచం దృష్టిలో మహాశ్వేత చనిపోయి ఉండొచ్చు. కానీ హంతకుడి దృష్టిలో బ్రతికే ఉంది. నిరంతరం మహాశ్వేతాదేవి కదలికల్ని కనిపెడుతూనే ఉన్నాడు. ఏ క్షణాన్నైనా ఆమెని మృత్యువు చేరుకోవచ్చు. దయచేసి ఆమెని రక్షించడంకోసమైనా చెప్పండి" ఆతృతగా అడిగాడు అక్బర్ ఖాన్.

అతడి మాటలు వింటూనే శోభాదేవి భయంతో గజగజ వణికిపోయింది.

" మీరన్నది నిజమే! చెప్తాను...నేను బయలుదేరే ముందే మహాశ్వేత నాకు ఫోన్ చేసింది" అంటూ ఆగింది శోభాదేవి.

" మా మహాశ్వేతాదేవి ఫోన్ చేసిందా? మైగాడ్...హంతకుడికి అడ్రస్ తెలిసిపోయే ఉంటుంది..చెప్పండి..ఎక్కడుంది మహాశ్వేత?" అడిగాడు అక్బర్ ఖాన్.

" హైదరాబాద్ లో ఉప్పల్ దగ్గరట..." చెప్పింది శోభాదేవి.

" అడ్రస్ సరిగ్గా కనుక్కోండి. వెంటనే హైదరాబాద్ పోలీసుల్ని అలర్ట్ చెయ్యాలి" ఆందోళనగా అన్నాడు అక్బర్ ఖాన్.

ఉప్పల్ దగ్గర బిల్డింగ్ అద్దెకు తీసుకుందట బాబూ. తన కొడుకు ఆచూకీ కూడా తెలిసిందట. ఎవరో వచ్చి రెండు నెలల క్రితమే అనాధాశ్రమం నుండి బాబుని దత్తత తీసుకున్నట్టు తెలిసిందని చెప్పింది. వాళ్ళ అడ్రస్ వెతుక్కుంటూ తిరిగిందట. అది తప్పుడు అడ్రస్ అని నిరాశగా ఏడ్చుకుంటూ చెప్పింది" అంటూ మహాశ్వేత తనతో చెప్పిన విషయమంతా పూసగుచ్చినట్టు చెప్పింది శోభాదేవి.

" ఇక మనం ఆలస్యం చెయ్యకూడదు మేడం. మహాశ్వేతాదేవి దగ్గరకు చేరుకోవాలి. మీరు మహాశ్వేత భరత హరిశ్చంద్రప్రసాద్ గారికి ఈ విషయం చెప్పండి. మహాశ్వేతాదేవి బ్రతికే ఉందని చెప్పండి. ఆయనతోబాటు మీరందరూ బయలుదేరి హైద్రాబాద్ రండి, నేను ఇప్పుడే బయలుదేరుతాను." గాబరాగా లేస్తూ అన్నడు అక్బర్ ఖాన్.

ఎస్సై అక్బర్ ఖాన్ ఎందుకంత కంగారు పడుతున్నాడో అర్థమైంది ఇద్దరికీ. ఇంకా ఆలస్యం చేస్తే మేడం మహాశ్వేతాదేవి ప్రాణాలకే ప్రమాదం.
మహాశ్వేతాదేవి భర్త హరిశ్చద్రప్రసాద్ కి ఆమె బ్రతికే ఉందని చెప్పమంటున్నాడంటే ఆయనకు తెలీదనా? ఏమిటీ ఈ ఎస్సై ఆలోచన? మహాశ్వేత భర్తే హంతకుడైతే మేడం బ్రతికే ఉందని తెలుస్తుంది కదా ? మరి ఎవరా హంతకుడు? కొంపదీసి మేడం శోభాదేవి గారి భర్త...? అమ్మో ఇంటిదొంగని ఈశ్వరుడైనా పట్టలేడంటారు....పిచ్చిగా తల బద్దలు కొట్టుకుంటూ ఆలోచించింది మనోరమ.

" మీ మేడం శోభాదేవి గారితో మీరూ బయలుదేరి రండి మనోరమా...మీ ఊరేగా?" నవ్వుతూ అన్నాడు అక్బర్ ఖాన్.

"ఇత్తం" అంది మనోరమ. మహానుభావుడు ఇంత ఆందోళనలోనూ ఎలా నవ్వగలుగుతున్నాడో అనుకుంటూ.

అక్కడ నుండే విశాఖపట్నం పోలీస్ కమీషనర్ ఆఫీస్ కి ఫోన్ చేసి విషయమంతా వివరంగా చెప్పాడు అక్బర్ ఖాన్. హైదరాబాద్ పోలీసులకి మహాశ్వేతాదేవి ఉన్న అడ్రస్ చెప్పి ఆమె ప్రాణాలకే ప్రమాదం ఉందని ఆమెకి ప్రొటెక్షన్ అవసరముంటుందని చెప్పాడు అక్బర్ ఖాన్.
" ఇంతకీ ఈ హత్యలకి కారకులెవరో కనిపెట్టావా ఖాన్?" డిగాడు కమీషనర్.

" సార్! అదే తెలియాల్సి ఉంది. హైదరాబాద్ లోనే ఆ హంతకుడ్ని రెడ్ హాండెడ్ గా పట్టుకుంటాను సార్." అన్నాడు అక్బర్ ఖాన్.

" ఓకే, నువ్వు వెంటనే ఫ్లైట్ లో హైదరాబాద్ చేరుకో. ఈలోగా నేను వెంటనే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫీసుకి డి.ఐ.జి. గారి ద్వారా మెస్సేజ్ పాస్ చేయిస్తాను. అది పరాయి రాష్ట్రం. మన డి.జి.పి. గారితో తెలంగాణ రాష్ట్ర డి.జి.పి. గారికి చెప్పించాలి " చెప్పాడు పోలీస్ కమీషనర్.

" సర్ ! నమస్తే! ఉంటా సర్.." అంటూ ఫోన్ కట్ చేసాడు అక్బర్ ఖాన్....

హైదరాబాద్ చేరబోతున్న కథ కాస్తా కంచికి చేరినట్టేనా? ఏం జరగబోతోంది తెలుసుకోవాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంటదాకా వేచిచూడాల్సిందే....

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్