Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> విశ్వనాథం గారి కోడలు

Daughter-in-Law of Viswanatham

ఆయనకు  షష్టి పూర్తి.   ఆ  సందర్భంగా  రుద్రాభిషేకమో,  ఆయుష్షు హోమమో  చేయిద్దాం అని పిల్లల వినతి. అది  సుతారము ఆయనకు ఇష్టం లేదు. అదే పిల్లలకు చెప్పాడు.  వాళ్ళ పోరు  పడలేక, “ఓరేయ్  పిల్లలూ  ఆ  రోజు మీరంతా  మా యింటికి రండి.  ఒక్కొక్కరే కాదు, పిల్లా జెల్లా  అందరూ  రండి.  కలివిడిగా అందరం  ఆ  రోజు  కలిసి   భోంచేద్దాం. పిల్లల  ఆట పాటలతో ఇల్లంతా  సందడిగా  వుంటే  అదే పెద్ద పండుగ కదూ! అన్నారు.  షష్టి పూర్తి  రానే వచ్చింది.  కొడుకులూ, కోడళ్ళూ, మనవళ్ళూ, మనవరాళ్ళూ అందరూ  వచ్చారు.  అందరికీ  విశ్వనాథం గారు  బట్టలు పెట్టారు.  “ఏవండీ,  రేపు  శుక్రవారం అయింది.  కనీసం  ఇంటి చుట్టూ  వున్న  ముత్తయిదువులను పిలిచి  వాళ్ళకు  తాంబూలాలు ఇచ్చి పంపుతానండీ” అని విశ్వనాథం గారి శ్రీమతి అడిగింది.  “ఊఁ,  సరే” అని అందుకు కావలసిన  ఏర్పాట్లు అన్నీ  ఘనంగానే చేసాడాయన, రమ సహాయంతో.

విశ్వనాధం గారింట  ఆత్మీయత అనురాగాల కలబోసిన మమతల  పండుగ  ఆ  రోజు.  తృప్తిగా భోజన తాంబూలాలయ్యాయి.  సాయంత్రం అవుతోంది. మమ్మల్ని ఐమాక్స్ కి తీసుకెళ్లమని పిల్లల గోల!  విశ్వనాథం గారి పెద్దబ్బాయి ప్రసాద్, తమ్ముడు రవి మొత్తం పిల్లల్ని కాసేపు  సరదాగా నెక్లెస్ రోడ్ లో  తిప్పి వస్తామని  కార్లలో తీసుకెళ్ళారు.  ప్రసాద్ కూతురు సంధ్య మాత్రం – “ నేను వెళ్ళనమ్మా, నీకు  సాయం చేస్తానం”ది వాళ్ళమ్మ  రమతో.

సత్యవతి, భానుమతి  రమాదేవి ఆడపడుచులు.  వాళ్ళిద్దరూ, “సంధ్యా! నువూ  వెళ్ళవే పిల్లలందరితో”  అన్నా వినలేదు.   “పేరంటాలంటే  నాకూ ఇష్టం  అత్తయ్యలూ.. పట్టు పరికిణీ కట్టుకోవద్దూ ”  అంది సొట్టలు పోతున్న బుగ్గలతో.

***

ప్రసాద్, రవి, సత్యా, భాను  విశ్వనాథం గారి  సంతానం.  అందరివీ  మంచి చదువులూ, ఉద్యోగాలూనూ.  ప్రసాద్  ఏకంగా  ఓ మందుల కంపెనీకి  యజమాని.  ప్రసాద్ భార్య  రమ.  రెండో కొడుకు రవి.  రవి, రవి భార్యా ఇద్దరూ డాక్టర్లు.  సత్యా, ఆమె భర్తా ఇద్దరూ కంప్యూటర్ ఇంజనీర్లే.  భానుమతి,  ఆమె భర్తా ఇద్దరూ కూడా.    విశ్వనాథం కొడుకులూ, అల్లుళ్ళూ, కోడళ్ళూ, కూతుళ్ళూ,  అందరూ  హైదరాబాదు లోనే  వుంటారు. అదీ విశ్వనాథం గారి అదృష్టం అంటే.

***

విశ్వనాథం గారింట్లో పేరంటం  అంటే  మాటలా!   పాతికేళ్ళుగా   అదే  ఇంట్లో నివాసం  ఆయే.  ఆయన  పిల్లల చదువుల నుండి   వాళ్ళ పిల్లల   పురుళ్ళు కూడా  ఆ  ఇంట్లోనే.  ఆ   కాలనీ లో తెలీని  వారుండరు.  ఎవరినీ  విడవలేదు.  భానూ,  సత్యా అయితే  ఏకంగా  వాళ్ళ   స్నేహితురాళ్ళనందరినీ కూడా పిలిచేసారు  ఇదే  సందర్భంగా.

సందడే సందడి.  వచ్చిన  వాళ్ళ నందరినీ పలకరించడం, చల్లటి  పానీయాలూ, వండిన పలహారాలూ  పెట్టడం, తాంబూలాలు ఇవ్వడం అన్నీ  రమే  చూసుకొంటోంది. సంధ్య  వాళ్ళమ్మకి కాస్త ఉడతా  సాయం చేస్తోంది.

“ఆడపడుచులు   యింటికి అపుడపుడూ వచ్చిపోయేవాళ్ళు.  వాళ్ళకేం  ఎక్కువగా పనులు చెప్పకమ్మా..” ముందే  హెచ్చరించింది అత్తగారు.   రమ  కాస్త కోరగా  చూసింది.  వాళ్ళూ  నా  వయస్కులేగా అని  దాని భావం. “వాళ్ళిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. వారం అంతా  అలసిపోయివుంటారు.”  వెనకేసుకొచ్చింది  ఆ పిల్లల  కన్న తల్లి.   పెద్దకోడలు  రమకే పనులన్నీ.  చిన్నకోడలు డాక్టరమ్మ ఆయె.  రోగం రోష్ట్టూ వస్తే  వైద్యం చేసేది  ఆమే గనుక ఆమెకు  ఏదీ  చెప్పే పనే లేదు.

విశ్వనాథం గారివద్ద  చదువుకొన్న పిల్లల  తల్లితండ్రులు  చాలా మందే వున్నారు  ఆ బజారులో. వారిలో కొందరు  జంటలు గా కూడా విచ్చేశారు.   విశ్వనాథం గారింటికి  ద్వారాలకి అరటి చెట్లు  ఇటూ  అటూ  కట్టారు.  మామిడి  తోరణాలతో  అలంకరించారు. ఆ  ఇంటి ముందు  వేసిన చలువ పందిరికి   కొబ్బరి మట్టలు కట్టారు.  చెప్పద్దూ!  ఆ   సాయంత్రం  వారింట   తెలుగుదనం వెలిగి పోయిందంటే నమ్మండి. విశ్వనాథం  గారు   తెల్లటి  లాల్చీ  పంచె, కండువాలతో అచ్చు  “సీతారామయ్య గారి  మనుమరాలు” చిత్రం లో  అక్కినేని లా  నిండుగా వున్నారు.  రమలో  తెలుగుదనం ఉట్టిపడుతోంది.   నీలకంఠం రంగు  పట్టుచీరలో  అచ్చరలా  వుంది. సత్యవతి - స్నేహితురాళ్ళకి,  సహోద్యోగులకీ రమను పరిచయం చేసింది,  “మా వదిన .. రమ”  అని.  ఆమె స్నేహితురాళ్ళు అందరూ హైటెక్ సిటి లో పని చేసే వాళ్ళు!  అందరూ, “ఓకే,ఓకే,  మీరేం  చేస్తున్నారు” అని  అడిగారు.   చేతిలో వున్న  పళ్ళెం  పక్కన పెడుతూ,   ..”నేను హౌస్ వైఫ్”  చెప్పింది రమ. వాళ్ళు పేలవంగా ‘ఇంతేనా’ అన్నట్లుగా హేళనగా నవ్వి ముందు కెళ్ళారు. రమ  ఇంటి పట్టునే వుంటుంది. తన భర్తకు, పిల్లలకూ,   అత్తమామలకూ అందరికీ  కావలసినవి సమకూరుస్తుంది. ఉద్యోగం చేయక పోవడం  ఈ  రోజుల్లో  తప్పైనట్లు చూస్తున్నారేమిటో!  రమ మనసు నొచ్చుకొనింది.

విశ్వనాథం గారు పిలిచి  పనేదో చెబితే అటుగా  వెళ్లిపోయింది. యింతలో మనవళ్ళు, మనుమరాళ్ళు  వచ్చేశారు.  వాళ్ళకి కొబ్బరిఆకుతో  పిప్పీ  శబ్దం చేసే  బూరలు  ఎలా చేయాలో నేర్పిస్తున్నారు  తాతగారు.   అదో పాతకాలం విద్య.  పిల్లలు భలే ఆనందిస్తున్నారు.

భానుమతి  చాలాకాలం  తర్వాత  స్నేహితురాళ్ళనందరినీ  ఒక్కసారిగా కలవడం ఇదే!  భాను  స్నేహితురాళ్ళు  సత్యా ను  చూసి  చాలా రోజులే అయింది.  సత్యాని, మిగిలిన కుటుంబ సభులను  అందరినీ పరిచయం చేస్తోంది.  రమనూ   పరిచయం చేసింది భాను.  “మా పెద్దవదిన రమ...  ప్రసాద్  అన్నయ్య  భార్య”   చెప్ప సాగింది.

“ఓహో.  అలాగా.  మీరు   ఎక్కడ పనిచేస్తున్నారు”  అడిగారు అందులో  కొందరు.   కొందరికి  “హౌస్ వైఫ్”  అనీ,  “హోమ్ మేకర్” అనీ  చెప్పింది.  చెప్పడానికి   ఇబ్బంది పండింది  రమ.  ఒకరికైతే  సరే ..  నలుగురూ  ఒకేసారి  అడగడం, వెనువెంటనే అదే సమాధానం చెప్పాల్సివచ్చేసరికి ఆమెలో అంతకు ముందు ఎన్నడూ లేని వెలితి తోచింది.  నేను  ఉద్యోగం  చేయకపోవడం ఏదో  తప్పుగా   చూస్తున్నారేమిటి?  ఉద్యోగం  ఏమైనా స్త్రీ లక్షణమా?      అంతే!  ఆమెకే తెలియకుండా కొలుకుల్లో నీళ్లు  చేరడం మొదలైంది.  వచ్చిన   వాళ్ళలో  చాలా మంది జీన్సూ, షర్టు లూ  వేసుకొన్న వాళ్ళున్నారు.

అంతా  దూరం  నుంచి  గమనిస్తున్న విశ్వనాథం గారు  అక్కడికి  చేరుకొన్నారు.  అందరికీ  సగర్వంగా రమని  మళ్ళీ  పరిచయం చేశారు,  ఆమెను చేరువగా తీసుకొని ఆశీర్వదిస్తూ.

“ఈమె నా పెద్దకోడలు రమ.   ఏం.టెక్. లో బంగారు పతకం సాధించింది. సొంత  వ్యాపారంలో తన  భర్త నిత్యం  తలమునకలై వుండడం చేత  యింటి బాధ్యతలూ,  అతని బాధ్యతలూ, వాళ్ళ పిల్లల శ్రేయస్సూ, మా సంక్షేమం అన్నీ  స్వీకరించి సమర్ధవంతంగా,  ఆనందంగా నిర్వర్తిస్తోంది.   ఈ  మాట  చెప్పడానికి ఏంతో  సంతోషిస్తున్నాను. “ రమ వైపు  చూస్తూ, “అమ్మా రమా! నువ్వు ఇక ఎప్పుడూ   ఎవరికీ “హౌజ్ వైఫ్”ని  అనీ, “హోమ్  మేకర్” అనీ  చెప్పకు.  ఆ పరాయి భాషా పదాలూ,  వాళ్ళ  భేషజాలూ మనకు దేనికి.   “గృహిణి” అనీ,  “గృహలక్ష్మి” అనీ  సగర్వంగా  చెప్పు.  నీవు నిర్వర్తిస్తున్న ఈ  విధులేవీ  వాళ్ళు  చేస్తున్న ఉద్యోగాల కంటే  చిన్నదే కాదు. ఇదే  అన్నిటికంటే  పవిత్రమైనదీ,  ప్రాముఖ్యమైనదీ!”  అని  చెప్పి  వెళ్లిపోయారు  విశ్వనాథం.

రమ  కళ్ళలో  సుళ్ళు తిరగబోయిన  కన్నీళ్లు వెనక్కి వెళ్ళిపోయాయి  ఆమె చెక్కిళ్ళ పై   విరిసిన  ఆనందపు  దొంతరల మాటున!!!                                                

************

మరిన్ని కథలు
The Last House