Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

'ఇద్దరమ్మాయిలతో' : చిత్ర సమీక్ష

చిత్రం : ఇద్దరమ్మాయిలతో
తారాగణం : అల్లు అర్జున్, అమలా పాల్, కాథెరిన్ త్రెస, బ్రహ్మానందం, నాజర్, కాజల్ వసిశ్ట్, సుబ్బరాజు, దేవషి ఖండూరి, శ్రీనివాసరెడ్డి, ఆలి తదితరులు ....
బ్యానర్ : పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
నిర్మాత : బండ్ల గణేష్
దర్శకత్వం : పూరి జగన్నాధ్

"కెమెరామెన్ గంగతో రాంబాబు" తర్వాత పూరీ జగన్నాథ్, "జులాయి" తర్వాత అల్లు అర్జున్ కలిసి ఈ "ఇద్దరమ్మాయిలతో" మన ముందుకొచ్చారు ఈ రోజు. పూరీ అనగానే సంభాషణలమీద, అల్లు అర్జున్ అనగానే ఆద్యంతం నిండి ఉండే ఎనర్జీ మీదా అంచనాలు ఉంటాయి. అవి ఎంతవరకూ ఉన్నాయో చూద్దాం.

క్లుప్తంగా చెప్పాలంటే:
కేంద్ర మంత్రి కూతురు ఆకాంక్ష (క్యాథెరీన్) పై చదువుల కోసం స్పెయిన్ వస్తుంది. తాను దిగిన కొత్తింట్లో ఒక డైరీ చూస్తుంది. అది కోమలి (అమలా పాల్) అనే ఒక బ్రాహ్మణ యువతిది. సంగీతం నేర్చుకోవడానికి తను ఆ దేశానికి రావడం, అక్కడ సంజు (అల్లు అర్జున్)అనే కుర్రాడి ప్రేమలో పడడం వంటి విషయాలు ఆ డైరీ ద్వారా తెలుస్తాయి ఆకాంక్షకి. అంతే కాకుండా తనకు, సంజూకి పెళ్ళి కుదిరిందన్న విషయం కూడా ఆ డైరీ చివర్లో కనిపిస్తుంది. అనుకోకుండా అకాంక్షకి సంజు తారస పడతాడు. తర్వాత ఏమి జరిగిందోనన్న కుతూహలంతో సంజూనే అడిగి తెలుసుకోవాలనుకుంటుంది. ఆ క్రమంలో సంజూ కి దగ్గరవుతుంది. ఆ తర్వాత ఎమవుతందనేది తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే:
అల్లు అర్జున్ గురించి కొత్తగా చెప్పుకునేది ఏమీ లేదు. అంచలంచెలుగా తనను తాను మెరుగుపరుచుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త అభిమానులని సంపాదించుకునే స్థాయికి ఎదిగాడు. కథ ఎలా ఉన్నా తన ఎనర్జీతో ప్రేక్షకులకు విసుగెత్తించకుండా చేయగల అర్జున్ కి ఈ సారి అంత ఎనర్జీని చూపించే అవకాశం లేకపోయింది. కారణం తన పాత్ర సీరియస్ గా సాగడం. ఇక డ్యాన్సులు కంటికి ఇంపుగా ఉన్నాయి కాని ప్రత్యేకతని చాటే స్టెప్పులు కనపడలేదు.

ఇక ఇద్దరమ్మాయిల విషయానికొస్తే అమలా పాల్ కళ్లతోటి, క్యాథెరీన్ ఇతర అందాలతోటి కట్టిపారేసారు. అయితే, పెద్ద సినిమాలో అవకాశం వచ్చిందన్న ఆనందమో ఏమో క్యాథెరీన్ కొన్ని చోట్ల ఓవర్ యాక్షన్ చేసేసింది.

ఇటువంటి సినిమాలకి అతి ముఖ్యమైన వినోదం బాగా లోపించింది అని చెప్పాలి. ఆలి-బ్రహ్మానందం పై వచ్చిన కామెడీ అస్సలు పండలేదు. శ్రీనివాస రెడ్డి ఉన్నా లేనట్టే అనిపించాడు. అల్లు అర్జున్-అమలా పాల్ ల పై సాగే రెండు మూడు సన్నివేశాలు మాత్రం నవ్విస్తాయి. ఇటువంటి సన్నివేశాలు, సంభాషణలు పూరీ మార్కుకి అద్దం పడతాయి. ఏది ఏమైనా కామెడీ ట్రాక్ మీద ఇంకా శ్రధ్ధ పెట్టి ఉంటే బాగుండేది.

లంగా వోణి వేసుకుని స్పెయిన్ లో సంగీతం నేర్చుకోవడానికి వచ్చే అమ్మాయిని చూస్తే తెలుగుదనం చూస్తున్నందుకు జబ్బ చరుచుకోవాలో లేక లాజిక్ కు అందడంలేదని బుర్ర గోక్కోవాలో తెలియని పరిస్థితి.

పాటల పరంగా చూస్తే భాస్కరభట్ల వ్రాసిన "టాపు లేచిపోద్ది", విశ్వా వ్రాసిన ఇంగ్లీషు, సంస్కృతం, తెలుగు కలగలిపిన పాట బాగున్నాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే: తప్పదనుకుంటే ఓ సారి చూడండి

అంకెల్లో చెప్పాలంటే: 2.75/5

మరిన్ని సినిమా కబుర్లు
Cine Churaka!