Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Bendakaya Pulusu

ఈ సంచికలో >> శీర్షికలు >>

తెలుగు కవితలు - -

తెలుగు భాష మీద ఒట్టు - పి వి డి ఎస్ ప్రకాష్

అ ఆ ఇ ఈ లు
అపుడెప్పుడో జారవిడుచుకున్న
చిన్ననాటి నా జ్ఞాపకాలు
క ఖ గ ఘ లు
బాల్యం నడకల ఆనవాళ్ళు
మాటలే రాని పసిప్రాయంలో
అల్లి బిల్లిగా నే దిద్దిన ఓనమాలు
బతుకు పుస్తకానికి
స్వీయ లిఖిత తొలి పలుకులు
అక్షరాల్ని చూస్తే చాలు ...
అమ్మ చేతి గోరుముద్ద ...
లేత చెక్కిలిపై నాన్న పెట్టిన వెచ్చని ముద్దూ ...
జ్ఞాప్తికొచ్చి ఒళ్ళు పులకింతలకి లోనవుతుంది !

అక్షరాల్లోకి తొంగిచూస్తే ....
ఆకుపచ్చతనం ఒంటినిండా నింపుకున్న
మా పల్లెసీమ మనోయవనికపై
మనోజ్ఞంగా కదలాడి తీరుతుంది
ఆడపిల్ల అందమైన పాపిట్లా ఎర్రెర్రని రాదారి ...
ఆడుతూ పడుతూ వీధి బడివైపు నే వేసిన తొలి తొలి అడుగులు
పంతులు గారు వేయించిన గోడకుర్చీ శిక్షలూ ..
ఒకటొక్కటిగా గుర్తొస్తాయి ...
అమ్మతనం ... కమ్మతనం ... నింపుకున్న అక్షరాలు
నాన్న నడిపించిన చేతి వేలి కొసలు

నిజానికి అక్షరాలంటే ...
నా బతుకు ... నా మెతుకు....
నా మొదలు... నా తుది ..
అవి కలసికట్టుగా మహా కావ్యాలనే విరచించాయి కదా ...
అక్షరాలు ఏకతా సూత్రాన్నే వల్లె వేస్తాయి ...
అవున్నిజం ...
రాజమహేంద్రి గోదారి నీట్లో తలారా స్నానించిన
భారతం మీద -
ఓరుగల్లు వెయ్యి స్తంభాల గుడిలో వళ్ళు విరుచుకున్న
భాగవతం మీద ఆన -
విడిపోయినా కలిసున్నా
ప్రతి తెలుగువాడి గుండెమీద అచ్చుపడ్డ అచ్చులూ .... హల్లులూ
ఎపుడూ కలిసే వుంటాయి
తెలుగు భాష మీద ఒట్టు...  !!


తెలుగు వెలుగు - చక్కా చేన్నకేశవరావు

తెలుగు వారము మనము
తెలుగు భాష మనది
తెలుగు వీరులము మనము
తెలుగు పౌరుషము మనది

         ॥ తెలుగు ఘనతను వేనోళ్ళ చాటరా తెనుగు సోదరా ॥

తెల్ల కలువ సొబగు మన తెలుగు
తెల్ల వారు వెలుగు మన తెలుగు
తేట గీతి తెరగు మన తెలుగు
తియ్యందనపు చెరకు మన తెలుగు

         ॥ తెలుగు ఘనతను వేనోళ్ళ చాటరా తెనుగు సోదరా ॥

మకరందాతి మధుర భాష మన తెలుగు
మదిపులకింపచేయు భాష మన తెలుగు
మరువపు పరిమళము వెదచల్లు భాష మన తెలుగు
మనోవిజ్ఞానదాయక భాష మన తెలుగు

         ॥ తెలుగు ఘనతను వేనోళ్ళ చాటరా తెనుగు సోదరా ॥

త్రిలింగ దేశము మనది
తెలంగాణా, సీమాంధ్ర రాష్ట్రము మనది
తెలుగు నేల అన్నపూర్ణ మనది
తెల్లవారిని తరిమి కొట్టిన ఖ్యాతి మనది

         ॥ తెలుగు ఘనతను వేనోళ్ళ చాటరా తెనుగు సోదరా ॥

తెలుగు విజ్ఞాని చేయగలేని వుద్యోగమేది ?
తెలుగు మేధావి స్ప్రుశించగలేని అంశమేది ?
తెలుగు వైతాళికులు జెప్పగా లేని విషయమేది ?
తెలుగు గ్రంధము నుడువని నీతి ఏది ?

         ॥ తెలుగు ఘనతను వేనోళ్ళ చాటరా తెనుగు సోదరా ॥

తెలుగు ప్రాభవము తెలుపు గీటురాయి గలదె ?
తెలుగునాటి వైభవము వర్ణింప పరిమితి గలదె ?
తెలుగు విభవ స్పూర్తికి మించిన భాష గలదె ?
తెలుగు కీర్తి బావుటా నెగరని తావు గలదె ?

         ॥ తెలుగు ఘనతను వేనోళ్ళ చాటరా తెనుగు సోదరా ॥

మరిన్ని శీర్షికలు
Kaakoolu