Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
agent ekambar

ఈ సంచికలో >> సీరియల్స్

Happy Deepavali

మేఘన

జరిగిన కథ

తాగుడు అలవాటు గురించి అడిగినందుకు సుదీర్ఘంగా వివరణ ఇస్తాడు హరి. హరి చేతులను తన కరస్పర్శతో తన క్షమాపణ చెప్తుంది మేఘన. ఆ తర్వాత తన గతం గురించి చెప్పడం ప్రారంభిస్తుంది.....

..................................................

‘‘అంటే... ఇళ్లు తుడవడం, బండెడు గిన్నెలు, బట్టలు ఉతకడం.. వంటావార్పూ చేయడం లాంటి సినిమా హీరోయిన్ కష్టాలేనా..? మరేదో నౌకర్లూ, చాకర్లూ అన్నారు కదా..?’’

‘‘నౌకర్లు, చాకర్లు ఉన్నాగానీ నాతో ఇవన్నీ చేయించి గాని సంతృప్తి పడేది కాదు మా అత్తగారు. నేను భర్తతో కలిసుండడం కూడా తనకిష్టం ఉండేది కాదు. ఒకసారి వినయ్ తో కలిసి సినిమాకి బయల్దేరితే ఏదో వంకతో అలిగి వెళ్లకుండా చేసింది.’’

‘‘ఓహో... టీవీ సీరియల్స్ లోని అత్తగారి లాగానా..?’’

‘‘అచ్చు గుద్దినట్లుగా అంతే డాక్టర్ గారూ. ఏమీ తేడా లేదు. ప్రత్యేకంగా వివరించాల్సిన పనిలేదు. మీరనుకోవచ్చు. నిజంగా ఇలా జరుగుతుందా?’’జరిగింది కాబట్టే నా మనసులో ముద్రపడింది కాబట్టే మీకు చెబుతున్నాను.’’ బాధగా అన్నది మేఘన.

‘‘ఓహ్ మై గాడ్... మరి వినయ్ అంత సపోర్టింగ్ గా ఉన్నప్పుడు ఇంక ప్రాబ్లమ్ ఏముందీ? కన్విన్సింగ్ గా లేదు..’’

‘‘ఆ వ్యాపారం... ఈ వ్యాపారం అంటూ తలిదండ్రుల దగ్గర లక్షలకు లక్షలు గుంజేవాడు వినయ్. ఏ వ్యాపారమూ సక్సెస్ కాలేదు. ఒక్క పది రూపాయలు సంపాదించింది లేదు. ఇంకా ఇంకా పీడిస్తుండడంతో మా మామగారికి మనస్తాపం కలిగింది. ఇంకా ఎంత కాలం... పెళ్లైనా గానీ బాధ్యతలు తెలిసిరావడం లేదు వీడికి. పెళ్లి చేస్తే బాధ్యతలు తెలుసుకుంటాడనుకున్నాం. ఐనా కొంచం కూడా మార్పు లేదు. కష్టమైనా నష్టమైనా వాడంతట వాడు తెలుసుకునేటట్లుగా చేయాలంటే వీడిని ఇంటి నుంచి బయటకు పంపించేయడమే  మార్గమని మామగారు నన్నూ, వినయ్ నీ బయటకు పొమ్మన్నారు. అత్తగారయితే మామయ్య కాళ్ళావేళ్ళా పడి ఏడిచింది. అయినా ఆయన కరగలేదు. మాటమీద నిలబడ్డాడు. వినయ్ కి  కూడా కోపం వచ్చింది. ఏం మీరు చూడకపోతే నేను బతకలేనా అంటూ.. నన్నూ పిల్లాడినీ తీసుకుని వేరు కాపురం పెట్టాడు.

కొంతకాలం అమ్మనాన్నల దగ్గర కాజేసిన డబ్బుతో బాగానే నడిచింది. పోను.. పోను.. ఇంటి అద్దె,  పిల్లవాడి పాల ఖర్చులు, పేపర్ బిల్లు కూడా కట్టలేని పరిస్థితి వచ్చింది.’’

‘‘మరి వినయ్ చాలా బిజినెస్లు చేసి డబ్బు పోగొట్టుకున్నాడు కదా... గుణపాఠం నేర్చుకుని... సిన్సియర్ గా కష్టపడుంటే బాగుండేది...’’‘‘బాగానే చెప్పారు డాక్టర్ గారూ.. వినయ్ నరనరానా సోమరితనం.. ఎలాగోలాగా గడిచిపోతుందిలే అనే భావన జీర్ణించుకుపోయింది. కష్టపడే మనస్తత్వం, ఎదుటి వాళ్లను అంచనా వేసే వ్యాపారతత్వం ఏ కోశానా లేదు. అటువంటి వాళ్ళు ఏ రంగంలోనూ రాణించలేరు. తెలివి తేటలుండి ,కష్ట పడకుండానే  సంపాదించేవాళ్లున్నారు. తెలివి లేకపోయినా కష్టపడి సంపాదించేవాళ్లున్నారు. ఏ కోవకీ చెందని వాళ్లని ఏం చేయగలం? మీరే చెప్పండి.’’

‘‘మరి ఇల్లు గడవడం ఎలా.?’’

‘‘సరిగ్గా అదే సమయంలో రెడ్డీస్ లేబరేటరీస్ లో అకౌంటెంట్ కావాలని పేపర్లో అడ్వర్ టైజ్ మెంట్ చూసి అప్లై చేసాను. లక్కీగా ఇంటర్వ్యూకి పిలిచారు. సెలెక్టయిపోయాను.’’

‘‘అకౌంటెంటా..? అదీ ఒక ఉద్యోగమేనా..? వాళ్లిచ్చేదెంత? చచ్చేదెంత?

నెలంతా గొడ్డుచాకిరీ చేయించుకుని వాళ్లిచ్చే ముష్టి ముప్పై వేలు దేనికొస్తాయి? ఇంట్లోనే ఉండు అన్నాడు వినయ్.’’

‘‘అదేంటండీ... మరీ విచిత్రం... ఆయనా సంపాదించకుండా, మిమ్మల్నీ జాబ్చేయ్యనివ్వకుండా... మరి ఇల్లెలా గడుస్తుందీ? అటు చూస్తే మామగారు సపోర్టు ఇవ్వడం లేదు. మీ వైపు కూడా అంతంత మాత్రం. వినయ్ కు కనీస జ్ఞానం... ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు... ఉండాలి కదా? నేల మీద నిలబడి ఆలోచించాలి కదా? ఏదో బిజినెస్ చేస్తున్నాను... ఎప్పుడో కోట్లు సంపాదించి, బంగారు మేడ కడతాను అంటే ఎలా? ముందు జీవితం సాఫీగా సాగాలి కదా..? వచ్చే కొద్దిపాటి జీతాన్ని కూడా పోగొట్టుకోవడం అవివేకమే అంటాను’’ అన్నాడు హరి.‘‘

ఇదంతా వినయ్ కి అర్థమయ్యేలా వివరించాల్సి వచ్చిందండీ.. అంతే కాదు... ఏదో నేను పట్టుదలగా చదవడం మంచిదయింది. ఒకవేళ నా చదువు పూర్తికాకుండా ఉంటే... ఈ మాత్రం అవకాశం కూడా ఉండి ఉండేది కాదు... ఇవన్నీ చెవిలో ఇల్లు కట్టుకుని చెప్పి, చెప్పి. పోరాడి ఆఖరుకు ఉద్యోగంలో చేరాను.’’

‘‘పోనీ లెండి ఎంతో కొంత ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది. ఇల్లు గడవడం కొంత ఈజీ కావడంతో వినయ్ మిమ్మల్ని బాగా చూసుకుంటాడు. ’’‘‘సరిగ్గా అదే పెద్ద తప్పయిపోయిందండీ.’’

‘‘ఎలా..? తప్పవడం ఏమిటి..? విచిత్రంగా ఉంది.’’

‘‘ఇంటి ఖర్చులు, అవసరాలు అన్నీ నేను చూసుకోవడంతో వినయ్ లో బాధ్యతారాహిత్యం ఇంకా బాగా పెరిగిపోయింది. ఇంటి విషయాలు పట్టించుకోవడం పూర్తిగా మానేసాడు. పొద్దున్నే వెళ్లడం... సాయంత్రం రావడం... నాపై అరవడం, కొట్టడం.’’

‘‘హాఁ.... అరవడం దేనికి....’’

‘‘ఇంటి భారం మొత్తం నాదే కావడం... చిన్న చిన్న రిపేర్లతో సహా అన్ని పనులూ, భారాలు కరంటు బిల్లులు కట్టడం కోసం క్యూలో నిలబడడం... అన్నీ నేనే చూసుకోవడం... అంతా హాయిగానే ఉన్నాగానీ సంపాదనతో పాటు నాకెక్కడ అహంకారం పెరిగిపోతుందో... సంపాదన లేని భర్తని చిన్న చూపు చూస్తారనే భయంతో ఆత్మన్యూనతతో తన చేయి పైన ఉండాలనే ఉద్దేశ్యంతో చిన్న పొరపాటునీ భూతద్దంలో చూసి... చూపించి తిట్టడం మొదలు పెట్టాడు. సూటిపోటి మాటలతో తూట్లు పొడవడం మొదలుపెట్టాడు. ఎప్పుడూ ఇరిటేషన్, చిరాకు...’’

‘‘తను వ్యాపార రంగంలో నెగ్గలేక పోతున్నానే అనే బాధ ఆ రూపంలో బయటకు వస్తుండి ఉండవచ్చు...’’

‘ఏదైనా కానివ్వండి... బలిపశువు నేనే కదా...? ఇంటినీ ఇంటి పరువునీ కాపాడడమే నా పొరపాటయింది. ఇంకో విషయం చెప్పమంటారా డాక్టర్గారూ... వాళ్ల దగ్గరా... వీళ్ల దగ్గర వ్యాపారం అటూ తీయని కబుర్లు చెప్పి లక్షలకు లక్షలు తీసుకున్నాడు. వ్యాపారాలయితే చేసాడు కానీ ఎందులోనూ కలిసి రాలేదు. అప్పిచ్చిన వాళ్లు ఇంటిపై పడితే నా బంగారు నగలు, పీఎఫ్లోన్లు, ఆఫీసు అడ్వాన్సులతో వాళ్లని సమాధానపరిచి పంపించే దాన్ని.’’

‘‘అంత ఈజీగా నమ్మేసి, లక్షలకి లక్షలు ఎలా ఇచ్చేస్తారు.’’

‘‘బాగా అడిగారు...’’

‘‘వినయ్ ఆకృతిలోనూ, మాటల్లోనూ, ప్రవర్తలోనూ ఎంతో సిన్సియారిటీ కనిపిస్తుంది. ఎదటి వాళ్లు ఎంతో తేలిగ్గా కన్వీన్స్ అయిపోతారు... అంతెందుకు? నా మాటలు విన్న తర్వాత కూడా వినయ్ ని మీకు పరిచయం చేస్తే... బిజినెస్ పేరు మీద మీరే స్వయంగా పాతిక లక్షలిచ్చేస్తారు.’’

‘‘అబ్బో... చాలా టాలెంటెడ్.’’

‘‘ఈ టాలెంటేదో నిజంగా బిజినెస్లో ఉంపయోగిస్తే బాగుండేది. నా జీతం, పీఎఫ్లోన్లు, అడ్వాన్సులు, ఇంటికే కాక, వినయ్ చేసిన అప్పులు తీర్చటానికీ, అతని బూట్లకీ, బాడీ స్ప్రేలకీ, పెట్రోల్ కీ సరిపోకపోతే వేరే కంపెనీల నుంచి అసైన్ మెంట్లు తీసుకుని ఇంటికి తీసుకువచ్చి పూర్తి చేస్తుంటే...

నాకు ‘‘డబ్బు పిచ్చి’’ అని పేరు పెట్టి సాధించేవాడు. అసైన్ మెంట్ పేపర్లని చిందరవందర చేసేవాడు.’’

‘‘మీరు వినయ్ ని కొంచం దగ్గరికి తీసుకని, ప్రేమగా మీరు మీ ఫ్యామిలీ కోసం చేస్తుందంతా వివరించి ఉంటే పరిస్థితి కొంచం బాగుండేదేమో..?’’

‘‘ఆహా... అనండి... అనండి... మీరు కూడా నన్నే అనండి... ఎంతైనా మీరు మగవారేగా. పక్షపాతం ఎక్కడకు పోతుంది? నేను చేస్తుందంతా గాలికి కొట్టుకుపోయిందా? పైగా నాదే తప్పన్నట్లు, వినయే కరక్టన్నట్లు మాట్లాడుతున్నారే...?’’

‘‘ఆహా... నేనా ఉద్దేశంతో అనలేదు. భార్యా భర్తలిద్దరూ మనసు విప్పి మాట్లాడుకుంటే ఒకరికొకరు దగ్గరయితే గొడవలు రాకుండా ఉంటాయని నా ఉద్దేశం...’’

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
naa preyasini pattiste koti