Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
meghana

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

జరిగిన కథ : చందూకి దీక్ష మార్కెట్లో కనిపించి, కవ్వించి, కంఫ్యూజన్ కి గురిచేస్తుంది ఆమెని ఫాలో అయి ఇంటికి చేరుకుంటాడు. అక్కడెంతో గొడవ చేస్తుందనుకున్న చందూ అంచనాలకు విరుద్ధంగా చక్కగా రిసీవ్ చేసుకుంటుంది...తనకూ, సహస్రకూ మధ్య ఉన్న స్నేహం, తమ కుటుంబ నేపథ్యాలూ చెప్పడం మొదలెడుతుంది....

ఆ తర్వాత....

ఆసక్తిగా వింటున్నాడు చందూ.

తమ వూహే నిజమైంది.

ఉన్నత కుటుంబానికి చెందిన అమ్మాయి గాబట్టే ముఖం తెలీకుండా చున్నీ కట్టుకొని ఘోషా పాటిస్తోంది. అయినా ఓ మాట అడిగితే డౌటు క్లియరవుతుందని దీక్షను అడిగితే కారణం అది కాదనట్టు తల అడ్డంగా వూపింది.

‘‘సహస్ర మంచి పేరున్న జర్నలిస్టు.  రచయిత్రిగా పాఠకులకు చిరపరిచితురాలు. ఆధునిక భావాలు గల యువతి.  ఘోషా పాటించే అలవాటు తనకు లేదు’’  అంది.

‘‘మరెందుకలా?’’  కుతూహలంగా అడిగాడు.‘‘నాతో వివరంగా తనూ ఇంతవరకు చెప్పలేదు.  సింపుల్ గా తను మధురై వదిలి రావటానికి రెండే కారణాలు చెప్పింది.  ఒకటి ఇష్టం లేని పెళ్ళి నుంచి తప్పించుకోడానికి. రెండోది వృత్తిపరమైన సమస్య లేవో ఉన్నాయట.  ఇంతే చెప్పింది.  వృత్తి పరమైన సమస్యలు అందరికీ ఉండేవే,  వాటికి భయపడేంత బలహీన మనస్తత్వం కాదు తనది. ఎలాంటి సమస్యనయినా ఎదిరించి పోరాడే ధైర్యం ఆమె బ్లడ్ లోనే ఉంది.’’

‘‘మరి ఘోషా పాటించాల్సిన అవసరం ఏమిటి?’’

‘‘భయం.  తండ్రి అంటే భయం.  మహా దేవనాకర్  చండశాసనుడు.  ఒక్కతే కూతురని ఎంత గారాభంగా పెంచాడో అంతకంత తన మాట జరిగి తీరాలనే పట్టుదల మనిషి. బాధ్యత గల తండ్రిగా తనిచ్చే జీవితాన్ని సంతోషంగా తీసుకోవాలిగాని వయసు కొచ్చాం గదా అని తన జీవితాన్ని తనే నిర్ణయించుకునే స్వతంత్రం ఆడపిల్లకు లేదంటాడు. తన మాట తనదే గాని ఎవరు చెప్పినా వినని మొండి మనిషి.  ఆ పైన లిక్కర్  సిండికేట్ల గురించి చెప్పాల్సింది లేదు.  చేతికింద గూండాలు రౌడీలు పని చేస్తుంటారు.

కాబట్టి ఇష్టం లేని పెళ్ళి తప్పించుకోడానికి పారిపోయివచ్చినా,  అక్కడ మహా దేవనాయకర్  చేతులు కట్టుకు కూచోడు. సహస్ర కోసం తన మనుషుల్ని పంపించి దేశమంతా గాలిస్తుంటాడు. పొరబాటున అలాంటి వాళ్ళ కంటపడితే ప్రమాదం. అందుకే చున్నీతో ముఖం దాచుకొంటోందని నా అభిప్రాయం’’ అంది దీక్ష. ఆమె అభిప్రాయాన్ని తోసిపుచ్చే అవకాశం లేదు. చందూ కూడా అంగీకరించాడు.‘‘ఒకే ఇక ఆ విషయం వదిలేద్దాం. పెళ్ళి ఇష్టం లేక వచ్చేసిందన్నావ్  బాగుంది.  మరి మా విరాట్  కూడా తనకి నచ్చలేదా?  అందుకే ఫోన్  చేయలేదా?’’  అనడిగాడు.

ఆ మాటకి పెద్దగా నిట్టూర్చింది దీక్ష.

‘‘మీ మగాళ్ళెప్పుడూ యింతేరా.  ముక్కుసూటిగా ఆలోచించి బోల్తా పడతారు.  విరాట్ తనికి నచ్చలేదని నేను చెప్పానా?’’ 

కోప్పడిరది.

‘‘నేనడిగింది ఫోన్  ఎందుకు చేయలేదని’’

‘‘చేసే ఉద్దేశం తనకి లేదు’’

‘‘అంటే నచ్చలేదనేగా అర్థం?’’

‘‘ఇప్పుడు నిన్నో మాట అడుగుతాను.  టక్కున బదులు చెప్పుచూద్దాం.  నేన్నీకు నచ్చానా?  మనం పెళ్ళి చేసుకుందామా?’’

‘‘వామ్మో మళ్ళీ నన్ను ఇరుకున పెట్టేస్తున్నావ్. ఇప్పుడేగా మన ఫ్రెండ్ షిప్  మొదలయింది.  అప్పుడే పెళ్ళేమిటి?’’

‘‘ఆన్సర్  ప్లీజ్’’

‘‘చదవని వాడికి క్వశ్చన్ పేపరిస్తే ఆన్సర్ లేం రాస్తాడు...?  నువ్వింకా నాకు అర్థం కాలేదు.  ఏం చెప్పమంటావ్...?’’

‘‘ఇంతసేపు మాట్లాడిన నువ్వే టక్కున బదులు చెప్పలేకపోయావ్.  విరాట్ తోనే మాట్లాడని సహస్ర ఫోన్  చేసి మాట్లాడేస్తుందని ఎలా అడుగుతున్నావ్? కొద్ది రోజులు ఆగి చూసి తర్వాత ఫోన్  చేయొచ్చని మౌనంగా ఉండిపోవచ్చుగా.  సారీ చందూ నీకర్థం కావాలని అలా అడిగాను గాని నిన్నిబ్బంది పెట్టాలని కాదు. మనం ఫ్రెండ్స్ గానే ఉందాం అంతేగా?’’

‘‘అంతేలే ఈ కాస్త పరిచయం లోనే నిజంగా పెళ్ళి గురించి అడుతున్నావని ఎలా అనుకుంటాను?’’

‘‘సహస్రకు విరాట్ నచ్చాడు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను’’

‘‘ఎలా?’’

‘‘విరాట్  బెడ్రూమ్ లో తన పోష్టర్లు చూసి ఎంతో సంతోషపడింది.  విరాట్  బెడ్  ఎక్కేసి కూచొని విరాట్  పెన్నుతో రాసుకున్న అక్షరాలు చదివి మురిసిపోయింది.’’

‘‘నిజంగానా...’’

‘‘అవును లవ్ చేయొచ్చుగా అనడిగితే ఏమందో తెలుసా?  నా సమస్యలు నాకున్నాయి.  లవ్  చేసి విరాట్ ని ఇందులోకి లాగలేను. రాసి పెట్టి ఉంటే తర్వాతయినా కలుస్తాంలే’’  అంది.

అంత ఓపెన్ గా దీక్ష వివరించాక...

ఇక ఏమడగాలో ఏం మాట్లాడాలో చందూకి బోధపడలేదు.  కాస్సేపు మౌనంగా ఉండిపోయాడు.  అతడ్నేచూస్తూ కూచుంది దీక్ష. చందూకి అంతా కొత్తగాను థ్రిల్లింగ్ గానూ ఉంది. సహజంగానే తను అల్లరోడు.  ఎందరో అమ్మాయిల్ని ఏడిపించాడు. ఎందరితోనో  గొడవపడ్డాడు. కాని ఇంతవరకు ఏ అమ్మాయితోనూ యిలా ఏకాంతంలో కూచుని ఇంత సేపు మాట్లాడింది లేదు.  దీక్ష చూపుల్ని ఎలా అర్థంచసుకోవాలో తెలీక ఇబ్బందిపడుతూ.

‘‘ఏయ్  మరీ అలా చూస్తావేంటి?’’ అన్నాడు.

‘‘ఏం చూడకూడదా? నీలా దొంగచూపులు చూడ్డం నాకు తెలీదు’’

‘‘నేనేం చూడ్డం లేదు.  వర్షం తగ్గు ముఖం పట్టింది. ఇక నేను వెళ్తాను’’  అంటూ లేవబోయాడు.

‘‘లేచావంటే నామీద ఒట్టే.  కూచో’’  అంది దబాయింపుగా.

‘‘వెళ్ళాలంటున్నాగా’’ నసిగాడు.

‘‘వెళ్ళి ఏం చేస్తావ్?’’

‘‘వంట చేసుకు తినాలి.  ఆడ దిక్కులేని సంసారం. నీ మూలంగా కాయగూరలు తీసుకోకుండా వచ్చేసాను’’

‘‘వాన బాగా తగ్గాక వెళ్ళొచ్చులే.  ఇంతకీ నువ్వెందుకు ఇంకా పెళ్ళి చేసుకోలేదు?  పెళ్ళాం వస్తే ఈ తిప్పలుండవుగా’’

‘‘నువ్వు నా డైరీ చదివి కూడా ఈ ప్రశ్న అడగటం అస్సలు బాగాలేదు. నా రెండో చెల్లెలి పెళ్ళికూడా జరిపించేస్తే అప్పుడు నా పెళ్ళి గురించి ఆలోచిస్తాను. అయినా ఈ రోజుల్లో ఆడపిల్లలు మరీ గడుసు వాళ్ళు.  పెళ్ళిచేసుకొని నా స్వతంత్రాన్ని కోల్పోవటం ఇష్టంలేదు.’’ఆ మాటలకి కాస్త కోపంగా చురచుర చూసి లేచి కిచెన్ వైపు పోబోయింది దీక్ష.

‘‘ నీకు కోపం వచ్చినట్టుంది.  నే వెళ్తాను’’ అంటూ లేచాడు చందూ.

‘‘మరి కోపం రాదా?’’  అంటూ ఆగి తిరిగి చూసింది దీక్ష.

‘‘పెళ్ళి చేసుకుంటే స్వతంత్రం కోల్పోయినట్టా..?  పిచ్చి ఆలోచనలు’’ నవ్వుతూ అంది.

‘‘పోనీ అలాగే అనుకో,  నే వెళ్తాను’’

‘‘ఉండమంటున్నానా?’’

‘‘వెళ్తానంటున్నాగా’’

‘ఈ పూట ఇక్కడే భోం చేస్తున్నావ్. టి.వి.  చూస్తూ టీ తాగి కూచో.  వంటయిపోతుంది’’

‘‘లేదు లేదు నే వెళ్తాను’’

‘‘ఏం లేదు? చెప్పింది వినవా..?’’

‘‘తప్పదా...?’’

ఫక్కున నవ్వింది దీక్ష.

‘‘ఇదేరా ఈ అమాయకత్వమే నాకు నచ్చింది.  ఇప్పుడే వస్తాను’’  అంటూ టి.వి.  ఆన్ చేసి కిచెన్ లో కెళ్ళింది.

జెమిని లో బొమ్మరిల్లు సినిమా వస్తోంది తనకి ఇష్టమైన సినిమా.  దీక్ష అందించిన మరో కప్పు వేడివేడి టీ తాగుతూ సినిమా చూస్తుండి పోయాడు. తన పంతం నెగ్గించుకుంది దీక్ష.  ఆమె ఇష్ట ప్రకారమే భోంచేసి బయలుదేరాడు.

అప్పటికి వర్షం శాంతించింది.

వీధులన్ని జలమయంగా ఉన్నాయి.

తన ఫోన్  నంబర్  దీక్షకిచ్చి ఆమె సెల్  నెంబర్  తీసుకొని వీధిలోకొచ్చేసాడు చందూ.

I                      I                      I

సహస్ర నుంచి తప్పకుండా ఫోన్ వస్తుందని....

మొదట్లో చాలా ఆశపడ్డాడు విరాట్.

రోజులు గడిచిపోతున్నాయి గాని ప్రయోజనం లేకపోగా,  ఎవరెవరో అమ్మాయిలు ఫోన్లు చేసి విసిగిస్తున్నారు.  ఈ పరిస్థితిలో రెండు వారాలు గడిచిపోయాయి.

క్రమంగా విరాట్లో ఆశ సన్నగిల్లి సాగింది.

సహస్ర సిటీ లోనే ఉందని, ఎందుకో తన ప్రకటన చూసినా స్పందించటం లేదని అతడి నమ్మకం.  కాని ఎన్నాళ్ళిలా? ఆమె నుంచి ఫోన్ కాల్ రాకపోయినా ఆమె పట్ల ప్రేమ పెరుగుతోందేగాని తరగటం లేదు.  మర్చిపోలేక పోతున్నాడు.

కనీసం ఆమె కన్పించాలిగా.  అప్పుడే సహస్ర మనసులో ఏముందో తెలుసుకోవటం సాధ్యపడుతుంది.  రెండు వారాలనుకున్నది మూడో వారం కూడా గడిచింది. సహస్రను బయటకు రప్పించాలి.  ఎలా...? తీవ్రంగా లోచిస్తున్నాడు.

మొదట్లో తన ఆలోచనలను చందూతో పంచుకునే వాడు. ఇప్పుడు అదీ మానేసి ముభావంగా ఉంటున్నాడు. పడ గ్గదిలో చేరినా నిద్రకు దూరమైస సహస్ర గురించే ఆలోచన.  ఆమె ఫోటోను చూసుకుంటూ ఎప్పటికో నిద్రపోతున్నాడు . ఒక్కోసారి అన్పిస్తుంది.  ఏమిటీ జీవితం ఎందుకిలా జరిగింది?  సహస్ర ఎవరో తనెవరో...  ఆమె తన కంట ఎందుకు పడాలి. తను ఆమె పట్ల ఎందుకింత ఆకర్షితుడు కావాలి.  నిజంగా తమకు రాసిపెట్టి ఉందా లేదా...  జీవితంలో ఇక కన్పించదా! ఇలా నిరాశ చెందినప్పుడు ఎంతో బాధపడినా వెంటనే తిరిగి ఆశలు పెంచుకుని కన్పిస్తుందనే నమ్మకాన్ని బలపర్చుకున్నాడు.

విరాట్  పరిస్థితి అర్థమవుతున్నప్పటికీ...

చందూ ఏమీ చేయలేని పరిస్థితి.

దీక్ష అతడి కాళ్ళు చేతులు కట్టేసింది. అంటు సహస్ర కూడా విరాట్ ను మర్చిపోలేకపోతున్న మాట నిజమే.  అయినా మౌనం వహించింది.  ఇలా విరాట్  సహస్రలు ఒకే కాలనీలో వున్నా ఒకరికొకరు కలవని పరిస్థితి.  ముఖ్యంగా విరాట్  కి సహస్ర తమ కాలనీలోనే ఉంటోందని తెలీకుండానే రోజులు గడిచిపోతున్నాయి.వీళ్ళిద్దరి పరిస్థితియిలా ఉంటే...

ఇటు చందూ దీక్షల స్నేహం చాలా దూరం వెళ్ళిపోయింది.  అసలు ఆ రోజు దీక్ష ఇంట్లో భోంచేసి వచ్చిన రాత్రే పది గంటలకు దీక్ష చందూ సెల్ కి ఫోన్ చేసింది. ఆ టైమ్ లో ఎవరిగదిలో వాళ్ళు పరిమితమై ఉన్నారు.  నిద్రపోయే టైమ్.

‘‘ఏమిటీ ఈ టైమ్ లో ఫోన్  చేసావ్..?’’ చిన్నగా అడిగాడు.  పక్క గదిలో విరాట్  పసిగడితే కొంప మునుగుతుంది.

‘‘ఏదోగా ఉందిరా.  అందుకే ఫోన్  చేసాను’’  అంది హస్ కీ వాయిస్ తో.

‘‘ఎక్కడున్నావ్?’’

‘‘నిద్రపట్టక మంచం మీద దొర్లుతున్నాను . నువ్వెక్కడున్నావ్?’’

‘‘నాదీ అదే పరిస్థితిగాని,  ఇంతకీ ఏదోగా ఉండటం ఏంది..?  ఏమైంది..?  ఒంట్లో బాగాలేదా...?’’

‘‘అదే అర్థంగావటం లేదు.  బుర్ర నిండా పాడు ఆలోచనలు,  ఒళ్ళంతా తిమ్మిరితిమ్మిరిగా మత్తుగా ఉంది.  సలసలా మరిగిపోతున్నట్టుంది.  బెడ్ ముళ్ళ కంపలా తోస్తోంది. నిద్ర రావటం లేదు.  ఏం చేయమంటావ్?’’

‘‘నాకేం తెలుసు...? నాకేమీ తెలీదు’’

‘‘నీకంతా తెలుసు చెప్పవా...?’’

‘‘అయితే విను.  దీన్నే విరహమంటారు.  ఇంకా చెప్పాలంటే కామ జ్వరమంటారు’’

‘‘అయ్య బాబోయ్. ఈ జ్వరానికి మందులుండవా?’’

‘‘ఉండవు’’

‘‘మరెలా తగ్గుతుందేమిటి?’’

‘‘పెళ్ళిచేసుకో తగ్గిపోతుంది . నువ్వెవరినయినా ప్రేమిస్తున్నావా?’’

‘‘ఎవర్నో ప్రేమిస్తే నీకెందుకు ఫోన్  చేస్తాను?’’

‘‘అంటే...  నన్ను ప్రేమిస్తున్నావా...?  వూహు మనది స్నేహం.  జస్ట్  ఫ్రండ్ షిప్.  అంతేగా!’’

‘‘అంతకన్నా ఎక్కువనిపిస్తోంది.  ఏం చేయను..?’’

‘‘ఓర్నాయనో అర్థరాత్రి బుర్ర తినకే నీకు పుణ్యముంటుంది.  నీ మనసులో  ఏముందోచెప్పెయ్.’’

‘‘ఓకే ఇపుడు కుదరదుగాని ఓ పని చెయ్యి.  రేపు ఆఫ్ డే లీవ్  పెట్టేసి లంచ్ టైంకి ఆటోలో లజ్ కార్నర్ కివచ్చేయ్.’’

‘‘నేను రాను’’

‘‘ సరి నేనే మీ ఆఫీసు కొస్తాను’’

‘‘కొంప ముంచే ఆలోచనలు చేయకు.  నేనే వస్తాలే.  ఎక్కడికి రావాలో చెప్పు’’

‘‘పాండీ బజార్  మీదుగా నేరుగా ఎగువకొస్తే లజ్  కార్నర్ కొస్తావ్. అక్కడ కుడి పక్క మెయిన్  రోడ్ నానుకొని పెద్ద కాంపౌండులో మూండంతస్తుల బిల్డింగ్ లో...’’

‘‘తెలుసు అభిరామి షాపింగ్ మాల్ ఉంది’’

‘‘బయట ఆటోలో వెయిట్  చేస్తూ నాకు మిస్డ్ కాల్  యివ్వు చాలు.  నేను ఆటో వద్ద కొచ్చేస్తాను’’

‘‘ఓకే వస్తాలే’’

అవతల దీక్ష ఏదో చెప్పబోతోంది.

ఇంతలో డోర్ నెట్టుకొని విరాట్ లోనకొస్తూ  ‘‘నిద్రపోకుండా ఫోన్లో ఎవరితోరా మాటలు..?’’ అనడిగాడు. విరాట్ను చూడగానే చందూ కంగారు దాచుకుంటూ . ‘‘సరేరా దీక్షిత్ రేపు కాల్ చేస్తాలే’’ అంటూ  లైన్ కట్ చేసాడు.

విరాట్ నొసలువిరిచి ‘‘ఎవడ్రా ఈ దీక్షిత్..?’’ అనడిగాడు.

‘‘ఈ మధ్యే పరిచయమయ్యాడు లేరా.  మన పక్క ఆఫీసులో పని చేస్తాడు.  నాగపూర్ కి రైల్లో వెళ్ళటం మంచిదా విమానంలో వెళ్ళటం మంచిదా అని బుర్ర తింటున్నాడు. నడిచి పొమ్మన్నాను.  నువ్వేంటి ఇంకా నిద్రపోలేదా?’’ అన్నాడు.

అతడి మాటల్ని విరాట్ నమ్మాడు.

‘‘ఎంటో రా సరిగా నిద్ర పట్టడం లేదు.  ఓకె...  పది దాటింది టైమ్.  నిద్రపో’’  అంటూ తలుపు దగ్గరగా మూసి తన గదిలోకెళ్ళిపోయాడు విరాట్.

‘ప్రేమలో పడ్డాక నిద్రేం పడుతుందిలేరా బాబు.  ఖర్మ నీ లవ్  ఫీవర్ని నాకు తగిలించావ్.  నీ మూలంగా దీక్షకి దొరికిపోయాను . ఇది నన్ను ఎన్ని తిప్పలు పెడుతుందో ఏమిటో’  అనుకుంటూ కళ్ళు మూసుకొని నిద్రకుపక్రమించాడు చందూ.

I                     I                     I

మరునాడు...

తలపోటుగా ఉందని వంకపెట్టి ఆఫ్ డే లీవ్  శాంక్షన్ చేయించుకున్నాడు చందూ. లంచ్  టైం కి ముందే ఆఫీసు నుంచి బయటికొచ్చి ఆటో ఎక్కాడు.

లజ్ కార్నర్ దగ్గర్లో ఆటో ఆపించాడు.  మిస్డ్ కాల్ ఇచ్చిన పదో నిముషంలో దీక్ష వచ్చి ఆటో ఎక్కింది.  చీర జాకెట్  ధరించి సింపుల్ గా వాలుజడ వేసుకుంది.  అదే జాస్మిన్ సెంటు సువాసన.  ఇవాళ తన కంటికి మరింత అందంగా కన్పిస్తొంది.

‘‘పాండీ బజార్ పోనీ’’  అన్నాడు ఆటోవాలాతో.

‘‘అగాగు’’ అంది వెంటనే దీక్ష.

‘‘అక్కడేం పని?’’ అడిగింది.

‘‘ ఏం పనంటే ఏం చేప్తామండీ.  గాజులేయించావా,  చీర కొనిచ్చావా,  నగా నట్రా పెట్టావాని మరదలు నిష్టురాలాడుతోందిగా.  అవి కొనిద్దామని’’  అంటూ నవ్వాడు.

మూతి ముడుచుకుంది దీక్ష...

వారిమధ్య ప్రణయం మొదలైందా ? సహస్ర వివరాలు విరాట్ కి తెలియకుండా చందూ ఎంతవరకు దాచగలడు ?? దీక్షకిచ్చిన మాట నిలబెట్టుకోగలడా ???  

వచ్చేవారం...

[email protected]

www.suryadevararammohanrao.com

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
agent ekambar