Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

మేఘన

జరిగిన కథ : అస్థికలున్న పెట్టెను హరికిస్తుంది తల్లి సుధారాణి. వాటిని గంగలో కలిపి రావడానికి వెళ్తాడు హరి. సంఘటనా స్థలానికి చేరుకున్న సుధారాణి బృందం అక్కడికి మీడియా అంతా రావడంతో ఆశ్చర్యపోతారు....
ఆ తర్వాత....


ఇంతలో ఎవరో తన పాదాలను తాకినట్లువడంతో ఉలికిపాటుతో చూసిందామె. పాదాభివందనం చేస్తున్న కోడలు సౌమ్య, పక్కనే హరి. ఇద్దర్నీ రెండు పక్కలా పొదపుకుందామె.

‘‘హరీ కనీసం మాట మాత్రమైనా చెప్పలేదు సౌమ్య వచ్చిందనీ...’’

‘‘నాక్కూడా సర్‌ప్రైజేనమ్మా అందుకే లేటయ్యింది’’ అన్నాడు హరి.

ఇంతలో...

పొట్టిగా, బట్టబుర్రతో, పెద్ద పొట్టతో తెల్లచొక్కా టక్‌చేసుకున్న ఒకతను అక్కడకు చేరుకున్నాడు. నిండుగా, గంభీరంగా, మంగళకరంగా కన్పిస్తున్న సుధారాణి వైపు అడుగులేసి.. ‘‘ఇక్కడేదో జరగబోతున్నట్లు నాకు వార్త వచ్చింది. నేను ఎమ్మార్వోని గవర్నమెంటు పర్మిషన్‌లేకుండా ఇక్కడేమీ చెయ్యడానికి వీలులేదు. ముందుగా కలక్టరుగారి పర్మిషన్‌తీసుకోవాలి. లేకుంటే....’’

అంటున్నంతలోనే....

ఫెళ ఫెళ మంటూ ఒక పెద్ద చెట్టుకొమ్మ విరిగి అతని భుజాన్ని రాసుకుంటూ పక్కన పడినది.

అదే సమయంలో భీకరంగా ఉరుము ఉరిమింది. బిత్తరపోయి కూలబడ్డాడు ఆ వచ్చినవాడు.

వీటన్నీంటితో సంబంధం లేనట్లుగా అప్పటికే బ్రాహ్మణోత్తములతో క్రమకార్యక్రమం మొదలుపెట్టేసాదు హిమాన్షు. హిమాన్షు ఆధ్వర్యంలో పండితుల ఘోష ఆకాశాన్నంటింది. మంత్రాలతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించడం మొదలుపెట్టింది. ఏదో విద్యుతు, కనిపించని శక్తి ఆ ప్రదేశాన్ని శాసిస్తున్నట్లుగా ఉంది.  ఒక్కొక్కటిగా చేయాల్సిన కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిష్టాగరిష్టతతో నడచిపోతున్నాయి. గ్రామస్తులందరూ చప్పుడు చేయ్యకుండా దూరంగా నిలబడే వీక్షిస్తున్నారు. ఎవరికీ ఎవరితో మాట్లాడే ధైర్యం చాలడం  లేదు. నెమ్మది నెమ్మదిగా పగలే చీకటి అలుముకోవడం మొదలుపెట్టింది.

టీవీ వాళ్ల కెమెరాలకు లైటింగ్‌సరిపోవడం లేదు. వెంట తెచ్చుకున్న పరికరాలు జరుగుతున్నది జరుగుతున్నట్లుగా రికార్డు చేయలేకపోతున్నాయి. అయోమయంతో జుట్టుపీక్కుంటున్నారు వాళ్లు. నెమ్మదిగా మేఘాలు కిందకి దిగడం ప్రారంభించాయి. ఎత్తైన కొండపై మేఘాలను ఎలా స్పృశించవచ్చు అంత దగ్గరగా వస్తున్నాయి, వెళ్లిపోతున్నాయి.

కళ్లప్పగించి చూడటమే తప్ప ఎవరూ ఏమీ మాట్లాడలేకపోతున్నారు.

హిమాన్షు పెద్ద దిక్కుగా నిలబడి హరితో దానాలు చేయిస్తున్నాడు.

సమయం గడుస్తున్నది....

కార్యక్రమం పూర్తయ్యింది...

బ్రాహ్మణులు సంతుష్టులయ్యారు.

అంతలో...

ఆ చిరు మబ్బుల చాటు నుండి అందరికీ కనబడేలా కొన్ని ఆకారాలు కొద్ది కొద్డిగా విడిపోతున్న మబ్బుల కిందుగా, అస్పష్టంగా... అప్పుడప్పుడూ స్పష్టంగా కనబడుతూ గాలిలో తేలుతున్నావో, నడుస్తున్నవో తెలియనట్లుగా ముందుగా సుధారాణిని సమీపించాయి. అస్పష్టంగా తనకే వినబడనట్లుగా ‘మేఘనా’ అన్నది సుధారాణి.

చేతుల్లో పిల్లాడితో బాబాయి, పిన్ని, మేఘన సుధారాణికి పాదాభివందనం చేసారు మొదటగా. ఆ తర్వాత నెమ్మదిగా హరిని చేరుకుని పాదాభివందనం చేసారు. వాళ్ల కళ్లల్లోకి చూసాడు హరి... ఏదో సంతృప్తి... అంతులేని కృతజ్ఞత, ఆనందం వాళ్లందరి కళ్లల్లోనూ ప్రతిఫలిస్తున్నది. బాబాయి ముఖం వైపు చూసాడు హరి... చిరాకు స్థానంలో కృతజ్ఞత, పిన్ని సరేసరి.... మేఘన కళ్లలో ఆనందం, నిన్ను మిస్‌ఔతున్నాననే దిగులు... అందరి వదనాలూ తేటగా ఉన్నాయి.

గ్రామస్తులకూ, టీవీ వాళ్లకూ అక్కడున్న అందరికీ జరిగేది కళ్లకి కన్పిస్తున్నది కానీ అది కలో, నిజమో తెలుసుకోలేని అవస్థలో ఉన్నారందరూ...

ఇంతలో... అందరూ మాయమవుతున్నట్లుగా మెల్లగా మబ్బులో కలిసిపోతున్నారు. వెళ్తూ వెళ్తూ సౌమ్యని చూస్తూ చిన్న చిరునవ్వు చిందిస్తూ ఉన్నది మేఘన.

భయంతో బిక్కచచ్చిపోయి... ‘‘ఎవరు ఎవరామె?’’ అంటూ హరి చేతిని గట్టిగా పట్టుకుని నలిపేస్తున్నది సౌమ్య.

క్రమేపీ వెల్తురు అలుముకున్నది... అందరూ ఏదో కలలో నుండి మేలుకున్నట్లుగా తమలో తాము గొణుగుకుంటూ, వాళ్లలో వాళ్లు మాట్లాడుకుంటూ, వాదించుకుంటూ నెమ్మదిగా ఎక్కడివాళ్లక్కడ సర్దుకుంటున్నారు.

బ్రాహ్మణులు సెలవు తీసుకున్నారు. తృప్తి నిండిన వదనాలతో ఏదో సాధించామన్న ఫీలింగుతో సుధారాణి, హరి, సౌమ్య, హిమాన్షు, ఐదుగురు శిష్యులు మిగిలిపోయారు.

ఎమ్మార్వో ఎప్పుడో పారిపోయాడు.

X                 X                X

‘‘సాయంత్రం తొందరగా ఇంటికి రండి.’’ అంది సౌమ్య.

చిరాగ్గా నొసలు చిట్లించి... ‘‘ఎందుకు..?’’ అన్నాడు హరి.

చిన్నబుచ్చుకుంటూ అంది సౌమ్య ‘‘ఐమాక్స్‌కి వెళ్దామని.’’

‘‘ఐమాక్స్‌లేదు... ఏమీ లేదు... నాకున్న కేసులతో వేగలేకపోతుంటే ఐమాక్స్‌ఒకటా? అమ్మ తొందరగానే వస్తుందిగా ఇంటికి, అమ ్మతో టైమ్‌పాస్‌చేసుకో. నేనొచ్చేటప్పటికి లేటవుతుంది.’’ అంటూ బయల్దేరుతున్న హరికి ఎదురుగా వచ్చింది సుధారాణి.

అదేమిటి హరీ... అనబోతున్న తల్లివైపు కళ్లు చికిలించి, కనుబొమ్మలు దగ్గరకు చేర్చి, పెదవులు బిగించి... నువ్వుండమ్మా, ఏం లేదులే... కంగారుపడకు అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్‌ఇచ్చాడు హరి...

పని ఉన్నట్లుగా వెనుదిరిగింది సుధారాణి.

X                 X                X

సాయంత్రం నాలుగు గంటల సమయం....

సౌమ్యకి సర్‌ప్రైజ్‌ఇద్దామని అప్పటికే ఇంటికి చేరుకున్నాడు హరి...

ఇంటి ఎదురుగా ఉన్న చిన్న పార్కులో ఒక ఆరేళ్ల పాపతో ముచ్చట్లాడుతున్నది సౌమ్య.

నెమ్మదిగా సౌమ్య కూర్చున్న బెంచీ వెనుకకు సౌమ్యకు కనబడకుండా చేరాడు హరి.

ఎదురుగా ముఖాముఖి కన్పించిన హరిని చూసి చిరునవ్వు నవ్వుతూ, తుళ్ళుతూ ‘‘బై ఆంటీ’’ అని చెప్పి తూనీగలాగా పరిగెత్తిందా అమ్మాయి.

ఈ నవ్వెక్కడో చూసినట్టుందే అనుకున్నాడు హరి.

ఇంతలో ఆశ్చర్యంగా చూస్తున్న సౌమ్యని గమనించి, ఆమె మెడ మీదకి హుఫ్‌అని గాలి ఊదాడు హరి.

ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది సౌమ్య... ఒక్కసారిగా ఆమెలో ఆనందం పెల్లుబికింది... ఇంతలోనే కోపం పొడుచుకొచ్చింది...

‘‘కేసులన్నారుగా... అవే చూసుకోపోయారా? ఎందుకొచ్చారు? అన్నది.

‘‘అతి ముఖ్యమైన పేషంటును చూడాలని తొందరగా వచ్చాను’’ అన్నాడు.

‘‘ఎవరో ఆ పేషంటు..?’’

‘‘నా ఎదురుగానే ఉందిలే...’’

‘‘అంతేలెండి... పెళ్లాం రోగిష్టిలాగానే కనబడుతుంది... మిగిలిన వాళ్లందరూ అప్సరసలూ, దేవతలూ...’’

‘‘సరే నీ యిష్టం... ఇలాగే కానిద్దాం అంటే కానిద్దాం. కాకపోతే మన మాటలన్నీ అయ్యేటప్పటికి ఐమాక్స్‌మూసేస్తారు.’’

‘‘మరి టికెట్లు..?’

టికెట్‌లేకుండా నేనెలా తీసుకెళ్లగలను నిన్ను...?’’

ఒక్కసారిగా ఆనందంతో నవ్వింది సౌమ్య.

డ్రెస్సింగ్‌రూమ్‌లో తయారవుతూనే, దూమ్‌బయట కుర్చీలో కూర్చున్న హరితో ముచ్చట్లాడుతున్నది సౌమ్య.

‘‘ఆ అమ్మాయి ఎంత ముద్దుగా ఉందండీ...’’

‘‘ఎవరూ...?’’

‘‘అదే... నేను పార్కులో మాట్లాడుతున్న అమ్మాయి. ఎంత హుషారు? ముద్దు ముద్ద మాటలు.’’

‘‘ఓహ్... చూసాను....’’

‘‘అమ్మాయి పేరు విచిత్రంగా ఉందండీ....’’

‘‘ఊ.... చెప్పు... ఏం పేరు..?’’

‘‘వర్ష.... అంట’’

‘‘వర్షా....?’’

‘‘ఔనండీ.. ఎంత ముదురండీ... తనే చెప్తుంది వర్ష అంటే వర్షమంట.’’

‘‘ఓహ్.... తెలివైనది.’’

‘‘మరి మీ అమ్మ పేరేమిటని అడిగాను.’’

‘‘ఊ... ఏమిటట?’’

‘‘వర్షం ఎక్కడ నుండి వస్తుందో అదే మా అమ్మపేరు అన్నది.’’

‘‘అంటే... ఆకాశమా...?’’

‘‘నేనూ అదే అన్నాను సరిగ్గా. కాదు అంటీ అన్నది. ఐతే నువ్వే చెప్పు అన్నాను.’’

‘‘ఊఁ....’’

‘‘మేఘన... అంట.’’

‘‘ఏమిటీ...?’’

‘‘ఆమె తల్లి పేరు మేఘన అంట.’’

......................................

‘‘ఏమిటండీ ఏం మాట్లాడరేమిటి...?’’

‘‘ఏమండీ నేను రెడీ’’ అంటూ డ్రెస్సింగ్‌రూమ్‌లో నుండి బయటకు వచ్చిన సౌమ్యకి ఎదురుగా రెండు చేతులతో తలపట్టుకుని కూర్చున్న హరి కన్పించాడు.

`అయిపోయింది`

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
yatra